సంభాషణం: కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య అంతరంగ ఆవిష్కరణ

11
2

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం కవి, విమర్శకులు, సంపాదకులు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

ఓరుగల్లుకు వన్నెతెచ్చిన జాతీయ కవిశ్రేష్ఠుడు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య

కవి…దర్భశయనం శ్రీనివాసాచార్య హైదరాబాద్ (అమెరికా)

“ఇచ్చిన దానికంటే సాహిత్యం నుండి నేను స్వీకరించిందే ఎక్కువ!” అంటున్నారు ప్రముఖ కవి, విమర్శకులు, ఉపన్యాసకులు, సంపాదకులు (కవితావార్షికలు), అనువాదకులు, వృత్తిరీత్యా అప్పటి ఆంధ్రాబ్యాంకులో ఆఫీసరు, వరంగల్ వాసి (ప్రస్తుతం హైదరాబాద్‌) అయిన శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య. ఆయన సాహిత్య జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలను, ఆయనమాటల్లోనే చదువుదాం.

~

***నమస్కారం దర్భశయనం కవిగారు.

**నమస్కారం డా.ప్రసాద్ గారు.

ప్రశ్న-1: దర్భశయనం  గారూ,  మీ పుట్టిన వూరు వరంగల్‌ జిల్లాలోనే వుంది కదా!

జవాబు: అవును. వరంగల్‌ జిల్లా, నర్సంపేట తాలూకాలో వున్న చిన్న కొర్పోలు అనే వూళ్ళో జన్మించాను. అది కుగ్రామం. ఒకటో తరగతి అక్కడ చదువుకున్నాను. నా జీవితంలో మొదటి ఐదేళ్ళే ఆ వూళ్ళో వున్నాను.

ప్రశ్న-2: మహాకవి దాశరథి కృష్ణమాచార్య పెరిగిన ‘గార్ల’ (ఖమ్మం జిల్లా)తో మీకున్న అనుబంధం చెప్పండి.

జవాబు: ‘గార్ల’ మా అమ్మమ్మ గారి వూరు. నేను అక్కడికి ప్రతి వేసవిలోనూ వెళ్ళి రెండు నెలలుండి వచ్చేవాణ్ణి. అక్కడి హైస్కూల్‌లో నేను ఎనిమిదో తరగతి చదువుకున్నాను. అక్కడి లైబ్రరీలో విలువైన పుస్తకాలుండేవి. అక్కడ నేను చాలా పుస్తకాలు చదివాను. దాశరథి కృష్ణమాచార్య చాలాకాలం ఆ వూళ్ళో వున్నారు. అక్కడి వీధుల్లో నడిచిన ప్రతిసారీ నాకు దాశరథి గుర్తుకొస్తాడు. దాశరథి నడిచిన వీధుల్లో నేనూ నడుస్తున్నాననే అనుభూతికి లోనవుతాను.

యువకుడుగా శ్రీ దర్భశయనం

ప్రశ్న-3: తెలుగు భాష పట్ల, తెలుగు కవిత్వం పట్ల మీరు ఎప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు?

జవాబు: మా నాయిన తెలుగు ఉపాధ్యాయుడు. ఆయన నాకు సులక్షణ సారాన్ని పరిచయం చేసాడు. మా నాయిన ఏనాడూ కవిత్వం రాయలేదు కానీ, తెలుగు భాషను శ్రద్ధగా బోధించేవాడు. ఆయన వల్ల నాకు తెలుగు మీద ప్రేమ ఏర్పడిరది. పాఠశాల స్థాయిలో పద్య లక్షణాల్ని, ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నేను ఖానాపురం  హైస్కూల్‌లో చదువుకుంటున్నపుడు మాకు తెలుగు బోధించే తేలు లక్ష్మినారాయణ అనే ఉపాధ్యాయుడు కవితలూ, గేయాలు రాసేవాడు. మాకు విన్పించేవాడు. మమ్మల్ని కవితల్ని రాయమని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతోనే నేను తొలి కవితల్ని రాసాను. స్కూల్లో కవితల పోటీని పెడితే నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. స్కూల్‌ వార్షికోత్సవ కార్యక్రమంలో ఊరి జనం ముందు కవితను చదివే అవకాశం పొందాను. అంతేకాక, నేను రాసిన కవితల్ని మా టీచర్‌ మిగతా తరగతుల్లో విన్పించేవాడు. అట్లా ఖానాపురం పాఠశాలలో చదువుకున్నప్పుడే కవిత్వం పట్ల ఆకర్షితుణ్ణి అవడమే కాకుండా, కవిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను.

దర్భశయనం గారి కుటుంబం

ప్రశ్న-4: కవిత్వాన్ని మీ శ్వాసగా ఎంచుకున్నారు కదా! మీ మొదటి కవిత ఎప్పుడు ఏ పత్రికలో ప్రచురితం అయింది? అప్పటి మీ అనుభూతి ఎలాంటిది?

జవాబు: అచ్చయిన నా తొలి కవిత ‘కవి’ అనే శీర్షికతో రాసింది. నా పదిహేడవ ఏట (1978 అక్టోబర్‌) ‘ఓరుగల్లు’ పత్రికలో అచ్చయింది. నేను వ్యవసాయ కళాశాలలో చేరిన నెల రోజులకు ఈ కవిత అచ్చవడంతో నా సహవిద్యార్థులంతా నన్ను కవిగా పరిగణించడం మొదలెట్టారు. గొప్ప ఉత్సాహాన్ని పొందాను. ఆ పేపర్‌ కటింగ్‌ ఇప్పటికీ దగ్గరుంది.

శ్రీ కాళోజీతో కవి దర్భశయనం

ప్రశ్న-5: కొందరు సాహిత్యకారులు కథ, కవిత, నవల, విమర్శ వంటి అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేస్తుంటారు. మీరు కవిత్వం, విమర్శ – ఈ రెంటినే ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఎందుచేత?

జవాబు: స్కూలు రోజుల్లో మా తెలుగు ఉపాధ్యాయుడు కవిత్వాన్ని రాస్తూ మమ్మల్ని ప్రోత్సహించేవాడని చెప్పాను కదా! ఆ ప్రభావం వల్ల నేనూ కవిత్వంతో మొదలయ్యాను. కథలు, నవలల్ని చాలా చదివాను గానీ ఎప్పుడూ వాటిని రాసే ప్రయత్నం చేయలేదు. సాహిత్యంలో నా అవగాహననూ, అభిరుచినీ చెప్పడానికి విమర్శవైపు కూడా వెళ్ళాను. విమర్శ కూడా నేను ఎక్కువ కవిత్వానికి సంబంధించే చేసాను. నా మటుకు నాకు కథను గానీ, నవలను గానీ రాయడం కష్టమైన పని అనిపిస్తుంది. ఆ దిశగా నేను సాధన చేయకపోవడం వల్ల కావచ్చు.

మహా శ్వేతాదేవితో కవి దర్భశయనం

ప్రశ్న-6: వేరే ప్రక్రియల వైపు అంతగా వెళ్ళకుండా ప్రధానంగా కవిత్వమ్మీదే మీరు ధ్యాసపెట్టడం వల్ల మీకు కలిగిన లాభనష్టాల గురించి చెప్పండి.

జవాబు: నా వ్యక్తిత్వంలోనే ఉద్వేగం పాలు ఎక్కువనుకుంటాను. ఉద్వేగాల్ని అప్పటికప్పుడు వ్యక్తీకరించడానికి నా కవితా ప్రక్రియ బాగా పనికొచ్చింది. ప్రధానంగా కవిత్వం మీదనే ధ్యాస పెట్టడం వల్ల ఆ ప్రక్రియలో వచ్చిన విస్తార రచనల్ని అధ్యయనం చేయగలిగాను. విస్తారంగా కవిత్వం రాయగలిగాను. దానిలో సాధన చేస్తూ నేను కోరుకునే సరళతనూ, గాఢతనూ నా కవితల్లో వుండేలా అనేక ప్రయోగాలు చేసాను. ఇతర ప్రక్రియల్లోనూ నేను రచనలు చేసి వుంటే కవిత్వంలో ఇంతగా కృషి చేసి వుండేవాడిని కాదేమో! ఐతే కొన్ని వస్తువుల్ని కవిత్వంలో కన్నా, కథగానో, నవలగానో చెబితే ఎక్కువ శక్తిమంతంగా వుంటుందని అనిపిస్తుంది. అలాంటప్పుడు కథనూ, నవలనూ రాయలేని నా అశక్తత నాకు గుర్తుకొస్తుంది. ఐతే నేను రాయకపోవడం వల్ల నష్టం లేదు. బలమైన రచయితలెందరో గొప్ప రచనలు చేస్తున్నారు. వాటిని చదివి నేనెన్నో విషయాల్ని వస్తుపరంగా తెలుసుకుంటాను, ఒక పాఠకుడిగా తృప్తి పొందుతాను.

కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ్‍ గారితో దర్భశయనం

ప్రశ్న-7: మీరు కవిత్వం రాయడం వెనుక ఎవరి ప్రభావమైనా వుందా?

జవాబు: నా పదమూడవ ఏటనే దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ని చదివాను. దాని ప్రభావం నా మీద కొంత వుందనుకుంటాను. హైస్కూలు చదువు ముగిసే నాటికి దాశరథి ‘అగ్నిధార’నూ, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ను చదివాను. అప్పటికి అవి నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ నన్ను బాగా ఉత్తేజపరిచాయి. ఒకరు కాదు, నాకు నచ్చిన కవులు ఎందరో! నా ముందుతరం వాళ్ళు, నా తరం వాళ్ళు, నా తర్వాతి తరం వాళ్ళు. ఐతే ఒక కవి రాసిన అన్ని రచనలనూ నాకు నచ్చాయని చెప్పలేను. ఎంతోమంది కవిత్వం నాకు ఇష్టమైనా, నాకు కవి వరవరరావు అంటే అమితమైన గౌరవం. కారణం- ఆయన సడలని నిబద్ధత, ప్రజానుకూల చింతన, నిర్భీకత, సరళతా.

జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత శ్రీ వాసుదేవన్ నాయర్ గారితో దర్భశయనం

ప్రశ్న-8: మీరు మంచి కవి మాత్రమే కాదు, మంచి ఉపన్యాసకులు కూడా! ఇది మీకు ఎలా సాధ్యం అయింది?

జవాబు: స్కూలు, కాలేజీ రోజుల్లో నేను వక్తృత్వ పోటీల్లో తప్పక పాల్గొనేవాణ్ణి. అది నాకు పనికొచ్చిందనుకుంటాను. దేన్ని చదివినా దానిలోని వస్తువుతోపాటు, భాషను కూడా నేను బాగా పరిశీలిస్తాను. అట్లా భాష మీద నాకు పెరిగిన ధ్యాస కూడా నా వక్తృత్వానికి దోహదం చేసి వుంటుంది. ఒక అంశమ్మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ అంశాన్ని గురించి విస్తారంగా చదువుతాను, స్పష్టత కోసం. ఆలోచనల్లో స్పష్టత వుండడం వల్ల కూడా మాట్లాడే కళ వృద్ధి అవుతుందనుకుంటాను. నిరంతర సాధన వల్లనే నాకు ఉపన్యాస కళ కొంత అబ్బిందనుకుంటాను. కవిత్వం రాయడం నాకు ఎంత ఇష్టమో, ఉపన్యసించడమూ నాకూ అంతే ఇష్టం. రాసినదాన్ని చూసి మాట్లాడ్డం నాకెప్పుడూ ఇష్టం లేదు. ఎప్పుడూ ‘ఎక్స్‌టెంపోర్’గా మాట్లాడుతాను సభల్లో.

ఒక సమావేశంలో మాట్లాడుతూ శ్రీ దర్భశయనం

ప్రశ్న-9: వృత్తిపరంగా నాటి ‘ఆంధ్రాబ్యాంకు’లో ఆఫీసరుగా పని చేసారు. ప్రవృత్తిపరంగా ఇది మీకు ఉపయోగపడిరదా? లేక ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా?

జవాబు: 1984లో నేను ‘ఆంధ్రా బ్యాంక్‌’లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరగానే కలకత్తాలో పని చేశాను. అక్కడ బెంగాలీ సాహిత్యాన్ని గురించి తెలుసుకున్నాను. కలకత్తా నుంచి బదిలీ మీద కర్ణాటకకు వెళ్ళినపుడు కన్నడ సాహిత్యంతో నాకు కొంత పరిచయం ఏర్పడిరది. తరచు బదిలీల వల్ల వివిధ ప్రాంతాల్లో నేను పనిచేయడంతో, వివిధ జీవన సంస్కృతుల్ని గమనించే అవకాశాన్ని పొందాను. బ్యాంకు అంటే జనంతో సందడిగా వుంటుంది కనుక వాళ్ళతో సన్నిహితం కాగలిగాను. గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్నపుడు రైతులతో తరుచుగా మాట్లాడగలిగాను. ఇవన్నీ నా సాహిత్య ప్రయాణాన్ని సారవంతం చేసాయి. దాదాపు ప్రతీ ఆదివారం సభల్లో పాల్గొనడానికి ప్రయాణాలు చేసేవాణ్ణి. ఉద్యోగంలో నేను తీసుకున్న చాలా సెలవులు నా సాహిత్యానికే వినియోగించాను. అయితే ఉన్నత హోదాల్లోకి వెళితే నా సాహిత్యాధ్యయనమూ, సాహిత్య ప్రయాణాలూ తగ్గుతాయని భావించి నాకు 45 యేళ్ళు వచ్చాక, ఉద్యోగంలో రిటైర్‌మెంట్‌ దాకా ప్రమోషన్లను తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. బ్యాంకు ఉద్యోగంలో దాదాపు 20 యేళ్ళు మానవ వనరుల విభాగంలో, ఆరేళ్ళపాటు ఫ్యాకల్టీగా బ్యాంకు కళాశాలలో పనిచేసినందుకు చాలా తృప్తిగా వుంది. నాకు అరవై యేళ్ళు నిండిన సందర్భంగా నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఓ కవిత రాస్తూ, మా బ్యాంకుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ కవితలో ఆంధ్రాబ్యాంకును ‘తెలుగు లక్ష్మి’ అని తెలుగు మాటల్లో అభివర్ణించాను.

కవిసంధిలో కవి దర్భశయనం

ప్రశ్న-10: మీ రచనా వ్యాసంగాన్ని ‘ఆకాశవాణి’ ఎలా ప్రోత్సహించింది? ఆకాశవాణితో మీ అనుభవాలు చెప్పండి.

జవాబు: నేను వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్నపుడు ఆకాశవాణి హైద్రాబాద్‌ కేంద్రానికి తొలిసారి వెళ్ళి ‘యువవాణి’ కార్యక్రమంలో పాల్గొన్నాను. 1986లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా తొలిసారి నా కవితలు ప్రసారమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పర్యాయాలు ఆకాశవాణి వివిధ కేంద్రాలకు వెళ్ళి కవిత్వం చదివాను. ప్రసంగాలు చేసాను. నెల్లూరులో 1995లో ఆహూతుల సమక్షంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న జ్ఞాపకం నాకు అమూల్యమైంది. 2010లో అస్సాంలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా పాల్గొనడం నాకు మధురానుభవం. చిన్నప్పట్నుంచీ రేడియోతో వున్న నాకున్న అనుబంధం ఎప్పుడూ తెగిపోలేదు. ఈ క్రమంలో మడిపల్లి దక్షిణామూర్తి, వి.వి. రామారావు, రాంబాబు, జయపాల్‌ రెడ్డి లాంటి ఆత్మీయ మిత్రుల్ని పొందాను.

ఒక సన్మానం అందుకొంటూ కవి శ్రీ దర్భశయనం

ప్రశ్న-11: వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్ళారు కదా! ఆ సందర్భాల్లో మీరు కలుసుకున్న సాహిత్య కారుల గురించి చెప్పండి.

జవాబు: యాత్రలంటే నాకు చాలా ఇష్టం. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎన్నెన్నో యాత్రలు చేసాను. ఎందరో కవుల్నీ, రచయితల్నీ కలిసాను. ఎందరి నుంచో స్ఫూర్తిని పొందాను. ఆంగ్లంతో నాకున్న పరిచయం వల్ల ఎందరితోనో సంభాషించి వివిధ భాషా సాహిత్యాల గురించి తెలుసుకున్నాను. ప్రతీ సాహిత్య ప్రయాణం నన్ను సారవంతం చేసింది. ఈ యాత్రల్ని చేసే క్రమంలో అమితావ్‌ ఘోష్‌, సునీల్‌ గంగోపాధ్యాయ, మహాశ్వేతాదేవి, ఆశిష్‌ నంది, రామనున్ని, వాసుదేవన్‌ నాయర్‌ లాంటి ప్రసిద్ధ సాహిత్యకారుల్ని ఇంటర్వ్యూ చేసాను. ఆ ఇంటర్వ్యూలు పత్రికల్లో అచ్చయ్యాయి. సాహిత్యం దీర్ఘకాలిక ప్రయాణమని, ఈ ప్రయాణంలో నేను ఇచ్చినదానికన్నా, స్వీకరించిందే ఎక్కువని నేను తెలుసుకోవడానికి నా సాహిత్యయాత్రలు దోహదం చేసాయి.

కవి దర్భశయనంతో రచయిత డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రశ్న-12: మీ రచనల గురించి చెప్పండి.

జవాబు: తొలి కవితను 1974లో రాసాను. తొలి కవితా సంపుటి ‘జీవన వీచిక’ 1987లో వచ్చింది. ఆ తర్వాత ప్రవాహం, ముఖాముఖం, వేళ్ళు మాట్లాడే వేళ, నాగటి చాళ్ళు, నేల గంధం, పొలం గొంతుక, పత్రహరితం, ధాన్యం గింజలు అనే కవితాసంపుటుల్ని ప్రచురించాను. నాకు నలభై యేళ్ళు నిండిన సందర్భంగా ‘ఆట’ అనే దీర్ఘ కవితను రాసాను. పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాటసారి పదాలు’ రాసాను. నేను రాసిన సాహిత్య వ్యాసాలు ‘ఇష్ట వాక్యం’ సంపుటిగా వచ్చాయి. ఆంగ్లంలో కవిత్వం రాసాను. నా ఆంగ్ల కవితా సంపుటి ‘సెంట్స్ ఆఫ్ ది సోయిల్’గా వెలువడింది.

ప్రశ్న-13: మీరు అందుకున్న అవార్డులు, సత్కారాల గురించి చెప్పండి.

జవాబు: నా తొలి కవితా సంపుటి ‘జీవన వీచిక’కు 1987లో గరికిపాటి సాహిత్య పురస్కారం లభించింది. సినారె కవితా పురస్కారం, ఉమ్మడిశెట్టి అవార్డు, ఫీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కార ప్రజాకవి కాళోజీ పురస్కారం, సహృదయ సాహిత్య పురస్కారంతో పాటు దాదాపు 20 పురస్కారాల్ని పొందాను. బయ్యారంలో 1992లో జరిగిన కవిసమ్మేళనంలో నేను పల్లెటూరి గురించి రాసిన కవితను విని ఆ వూరి రైతులు కొందరు నాతో ఆత్మీయంగా మాట్లాడి ‘మా గురించి రాసారు’ అని అభినందించారు. అది నేను పొందిన అత్యున్నత పురస్కారమని అనుకుంటాను.

ప్రశ్న-14: నేడు అనేక మాధ్యమాల ద్వారా తెరపైకి వస్తున్న లేత లేత కవులకు, కవయిత్రులకు మీరిచ్చే సలహా…

జవాబు: ఒక వాక్యం రాయడానికి కొన్ని వందల వాక్యాల్ని చదవాల్సి వుంటుందని అనుభవం ద్వారా తెలుసుకున్నాను.  పుస్తకాల్నే కాదు. ప్రజల సంస్కృతినీ, సంప్రదాయాల్నీ, కష్టసుఖాల్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరమని నేను భావిస్తాను. గుర్తింపు మీద కంటే సృజన మీద ధ్యాస పెట్టమని కొత్తతరం కవులకు నేను చెప్పదలుచుకున్నాను. రచన అనేది ఒక బాధ్యత అని భావిస్తేనే, సాహిత్య ప్రయాణంలో బాధ్యతాయుతంగా వుండే వీలుంది. తాము చేసే ప్రతీ రచనను తరచి తరచి చూసుకుని పూర్తిగా తృప్తి చెందాకనే సమాజానికి అందించాలని కొత్తతరం కవులకు నేను చెప్పదలచుకున్నాను. ఇతర కవుల నుంచి స్ఫూర్తిని పొందడం మంచిదే కానీ, వారికి విధేయులుగా వ్యవహరించడం మంచిది కాదు. మన విధేయత సాహిత్యానికేనని గుర్తు పెట్టుకోవాలి. విలువల్ని సంతరించుకున్న వ్యక్తిత్వం ఏ కవికైనా అవసరమని నేను బలంగా నమ్ముతున్నాను. అట్లాంటి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలని ఇప్పుడు రాస్తున్న కవులకు నా సూచన.

***మీ అమూల్యమయిన సమయం వెచ్చించి చక్కని సాహిత్య విశేషాలు అందించిన మీకు సంచిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలండీ.

** మీకు, సంచిక పత్రికకు శుభాకాంక్షలు, కృతఙ్ఞతలు డాక్టరు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here