[‘సియా హాషియే’ అనువాదకురాలు, ‘ఎమోషనల్ ప్రెగ్నన్సీ’ కథాసంపుటి కథకురాలు, ఎలమి ప్రచురణ సంస్థ సహవ్యవస్థాపకులైన పూర్ణిమ తమ్మిరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ]
సంచిక టీమ్: నమస్కారం పూర్ణిమ గారు.
పూర్ణిమ: నమస్కారమండీ.
ప్రశ్న 1. ముందుగా, మంటో రాసిన సియాహాషియేతో సహా మరికొన్ని కథలు, వ్యాసాలను తెలుగులో అనువదించి అందించినందుకు ధన్యవాదాలు.
మీక్కూడా ధన్యవాదాలు. గత ఏడెనిమిదేళ్ళుగా మంటో మీద పనిజేస్తున్నాను. అంత శ్రమ పెట్టింది మీలాంటి సహృదయులైన పాఠకులు ఉన్నారు/ఉంటారు అన్న నమ్మకం తోటే. మీ స్పందన నా నమ్మకాన్ని బలపరుస్తోంది.
ప్రశ్న 2. మంటో రచనల పై మీకు ఆసక్తి ఎప్పుడు కలిగింది? ఎలా కలిగింది?
2012లో మంటో శతాబ్ది జయంతి ఉత్సవాలు జరిగాయి. అప్పుడు నా ఫ్రెండ్ సౌమ్య హిహెచ్‌డి కోసం జర్మనీలో ఉండేది. ఆ చిన్న యూనివర్సిటీ టౌనులో మంటోపై ఒక కార్యక్రమం జరిగింది. “ఎవరో పాకిస్తానీ రైటర్ అట.. వందేళ్ళట” అని అనుకున్నాం. అలా మొదటిసారి ఆ పేరు విన్నా. నెల తిరక్కముందే ఆగస్టు 15న హైదరాబాదులో “సియా హాషియే”ను సూత్రధార్ డ్రామా కంపెనీ వారు లామకాన్, బంజారా హిల్స్‌లో నాటకంగా వేశారు. వెళ్ళాను.
ఆ నాటకం నాకో అద్భుతం. స్టేజీ, సెట్టింగ్ ఏవీ పెద్ద లేవు. ఆరుబయట బండరాళ్ళ ముందు ముగ్గురు వ్యక్తులు నల్ల దుస్తులు వేసుకుని 32 గల్పికలను, రాసింది రాసినట్టు, నాటకీయంగా చెప్తూ నటించారు. మంటో ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం రాసినవి మర్చిపోయి, ఇప్పుడు-ఇక్కడ జరుగుతుందన్నట్టు వేశారా నాటకం. ఉర్దూ వినడం, కాస్తో కూస్తో మాట్లాడ్డం తప్పించి ఎప్పుడూ చదవని నాకు కొన్ని భారీ ఉర్దూ పదాలు అర్థమే కాలేదు. అయినా భావాలు నా వరకూ చేరాయి.
అంతే! ఎట్టి పరిస్థితుల్లోనూ మంటోను వెంటనే చదవాలని నిశ్చయించుకున్నాను. వెంటనే అందుబాటులో ఉన్న ఆంగ్లానువాదాలు కొన్నాను. మంటోని (నాటకం ద్వారా) విని ఉండడం వల్ల ఆంగ్లానువాదం రుచించలేదు. పైగా మంటో చెప్తున్న కొన్ని అంశాలను అనువాదకుడు ఎడిట్ చేసేశాడు. అది అసలు నచ్చలేదు. వెతగ్గా వెతగ్గా రాజ్‌కమల్ ప్రకాశన్ వారు మంటో సాహితీ సర్వస్వాన్ని దేవనాగరి లిపిలో తీసుకొచ్చారని తెలిసింది. వాళ్ళకి ఆన్‌లైన్ ఆర్డరింగ్ కూడా లేదప్పట్లో. ఫోనుల్లో మాట్లాడి VPP ద్వారా “దస్తావేజ్ మంటో” తెప్పించుకున్నాను. మొత్తం ఐదు సంపుటాలు.
అప్పటికే నేను హిందుస్తానీ సాహిత్యంలో ప్రేమ్‌చంద్, కృష్ణచందర్, నాగార్జున్, గుల్జార్ తదితర వారిని చదివుండడంతో మంటోని దేవనాగరీలో చదవడానికి తెలీని పదాల, పద బంధాల అర్థం తెలుసుకుంటే సరిపోయింది. మొదట కథలే చదివాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వ్యాసాలపైకి వెళ్ళాను. ఇదంతా 2012-13 మధ్యలోనే.
“దస్తావేజ్ మంటో” పుస్తకాలకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే! మొదట, వాళ్ళు ఏ మాత్రం ఎడిట్ చేయకుండా, ఉర్దూ పదాలకు బదులుగా హిందీ పదాలు వాడకుండా, కఠినమైన పదాలకు చక్కగా సరళమైన భాషలో అర్థాలు ఇచ్చారు. సంపాదకులు మంటో ఏమిటి రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడు, వాళ్ళే రచనలు ఎందుకు ఎన్నుకున్నారన్న విషయాల గురించి చాలా వివరంగా ముందుమాటలు రాశారు. కాగితం చాలా పల్చగా, ఒత్తులు అక్షరాలు పూర్తిగా పడని ప్రింటుతో, బైడింగ్ సరిగ్గా లేకుండా ఆ సంపుటాలు వేశారని ఎప్పుడూ నసుక్కుంటూ ఉంటా కానీ, అవే లేకపోయుంటే నేను మంటోని క్షుణ్ణంగా చదవగలిగేదాన్ని కాను!
ఆ తర్వాతి కాలంలో మంటోపై వచ్చిన విమర్శా గ్రంథాలతో పాటుగా అనేక అనువాదాలు (కన్నడంలో వచ్చినవి కూడా) చదివాను. ఇప్పుడు దేవనాగరి లిపిలో అందుబాటులో లేని రచనలనూ నస్తాలిక్ లిపిలో చదువుకుంటున్నాను.
ప్రశ్న 3. మంటో రాసిన అనేక రచనల్లో సియాహాషియే రచనలనే అనువాదానికి ఎందుకని ఎంచుకున్నారు?
“సియా హాషియే” మొదటిసారిగా ఈమాట వెబ్ పత్రికకోసం, ఆగస్టు 15 సందర్భంగా, 2019లో అనువదించాను.
పుస్తకంగా మాత్రం మంటో ఇతర కథలనే ముందు తేవాలనుకుని 2020లో దాదాపు 250 పేజీల వరకూ వచ్చేలా ఇరవై రెండు కథలు చేశాను కూడా. కానీ ప్రచురణకర్తతో ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల ప్రాజెక్ట్ మానుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే మరో ప్రచురణకర్త “వంద పేజీలకు మించకుండా మంటో అనువాదాలు కావాలి. ఇప్పటికే మీరు చేసినవాటిలో నాలుగైదు పెద్ద కథలు ఇవ్వండి” అని అడిగినప్పుడు, “సియా హాషియే” గల్పికలకు నేపథ్యాన్ని వివరిస్తూ ఒక చిన్న పుస్తకంగా తీసుకురావచ్చునన్న ఆలోచన తట్టింది. 2021లో ఆ మేరకు వంద పేజీలలోపే మాన్యుస్ర్కిప్ట్ సిద్ధం చేశాను కూడా. కానీ ఆ ప్రచురణకర్త పెట్టిన కొన్ని వింత నియమనిబంధనల వల్ల వెనక్కి తీసుకున్నాను. ఇక, నేనే సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకోవాలనుకుని పేజీల నియమం లేకుండా ఆ రచనను విస్తరించాను.
చివరికి, 2022లో ఎలమి ప్రచురణలు స్థాపించాక పుస్తకంగా బయటకొచ్చింది.
ప్రశ్న 4. సియా హాషియే రచనల్లో కనిపించే మంటోకూ ఇతర రచనల్లో కనిపించే మంటోకూ తేడా ఏమైనా వుందా? మీ అభిప్రాయం ప్రకారం ఎందుకని సియాహాషియే లో రచనలు స్కెచ్‌లలా, వినెట్ట్ లా (Vignette), ఒకోసారి ఒకటి రెండు వాక్యాల్లోనే చెప్పాడు మంటో? ఇలా చెప్పటంవల్ల ఎలాంటి ప్రయోజనం, ప్రభావాలను సాధించాడు?
ఈ ప్రశ్న అడగడానికి మీ ప్రేరకాలు ఏవిటో గానీ, ఇది చాలా అవసరమైన ప్రశ్న. అడిగినందుకు థాంక్స్. నేను సియా హాషియే పుస్తకం కోసం మరొక వ్యాసం రాయడం మొదలుపెట్టాను, అచ్చంగా ఈ ప్రశ్నను tackle చేయడానికే.. కానీ అప్పటికే పుస్తకం నిడివి ఎక్కువవుతుందని మానుకున్నాను. ఇక్కడ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
కథ వస్తువు/అంశం (ఏం చెప్తున్నాం), కథా నిర్మాణం/శైలి/క్రాఫ్ట్ (ఎలా చెప్తున్నాం) అన్న రెండింటిలో కథా వస్తువుకు more elementary, organic అని, కథా నిర్మాణం మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసే పనని ఒక భావన ఉంది. అంటే, కథా వస్తువు మనం sub-conscious నుండి రావచ్చు కానీ, నిర్మాణ పరంగా తీసుకునేవన్నీ conscious నిర్ణయాలు అన్నట్టుగా చూస్తాం. అందుకే, సియా హాషియే గల్పికల్లో కూడా కాస్త అతి-ప్రయత్నం ఉందని, బలమైన కథలు ఎన్నుకోలేక వాక్చాతుర్యంపై ఆధారపడినవి ఉన్నాయని మంటో స్కాలర్ లెస్లీ ఫ్లెమ్మింగ్ అభిప్రాయపడ్డారు కూడా.
కథా నిర్మాణం కూడా మనం అనుకున్నంత conscious నిర్ణయాలు కాకపోవచ్చుననీ, కొన్ని కొన్ని సందర్భాలు నిర్మాణ విషయాల పరంగా రచయితకూ పెద్ద కంట్రోల్ ఉండకపోవచ్చునన్న కోణం నుంచి చూస్తే “సియా హాషియే” ఒక sensationalist response to a tragedy (శవాల జేబుల్లో డబ్బులేరుకున్నట్టుగా విభజన హింసని వాడుకున్నావ్ అని మంటోని తూలనాడినట్టుగా) కాకుండా, ఒక unprocessed traumatic response to a tragedy గా చూసే అవకాశం ఉంటుంది. ఇలా చూడాలంటే ఆ రచన చేసేనాటికి ఆయన మానసిక అవస్థ ఎలా ఉందో పరామర్శించాలి.
తెలుగు “సియా హాషియే” రచనలో నేను చూపించడానికి ప్రయత్నించినట్టు మంటో మతకలహాల వల్ల ఎప్పుడూ విచలితుడు అవుతూనే ఉన్నాడు, విభజన ప్రకటన ముందు జరిగిన హింసకు అతను భయపడ్డాడు, పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా దారుణాలను చూశాడు. చదివాడు. మొత్తానికి freeze అయిపోయాడు. మూడు నెలలు ఏమీ రాయలేకపోయాడు. దేశమంటే ఏంటి, సొంతూరంటే ఏమిటి, రచయితగా తన అస్థిత్వం ఏమిటి, తన రచనలు గతేంటి – ఇట్లాంటి తీవ్రమైన existential crisisలో కూరుకుపోయాడు. దాన్నుంచి బయటకొచ్చే క్రమంలో “ఖోల్ దో”, “సియా హాషియే” లాంటి రచనలు చేశాడు.
ట్రామా థియరీని సాహిత్యాన్ని అన్వయించుకోవచ్చని తెలిపే పుస్తకంలో (Trauma Theory As an Approach to Analyzing Literary Texts by Ted Morrissey and Robert McLaughlin) కొన్ని లక్షణాలు చెప్తారు. నేను “Cobalt Blue” అనే మరాఠీ నవల అనువాదానికి ఈ థియరీ అన్వయిస్తూ వ్యాసం రాశాను. “dispersed or fragmented narrative voice” లో కథ చెప్పడంలో ట్రామా బయటపడుతుంది అని అంటారు.
మంటో రాసేనాటికి ఉర్దూ సాహిత్యంలో చిన్న కథే కొత్త. ఈకాలంలో మనం అంటున్న micro-fiction (గల్పికలు) అప్పుడు ప్రాచుర్యంలో లేదు. “ఇట్లా చిట్టి కథలు రాసి సాహిత్య ప్రక్రియలో కొత్త ఒరవడి సృష్టిస్తా!” అని అనుకునే పరిస్థితుల్లో మంటో అప్పుడు ఉన్నాడని నేను అనుకోను. తన చుట్టూ జరుగుతున్న మాటలకందని బీభత్సాన్ని మాటల్లో పట్టుకోకపోతే outlet లేక ఉక్కరిబిక్కరయ్యే వివశతలో మంటోలోంచి స్కెచ్లు, Vignette రూపంలో బయటకొచ్చాయే కానీ అది ప్రయత్నపూర్వకంగా, ఒక stable state of mindలో రాసినవి కావని నా అభిప్రాయం. ఇవనే కాదు, పాకిస్తాన్ వెళ్ళాక మంటో రాసిన కథలు (ముఖ్యంగా విభజన కథలు) అంతకు ముందు కథలతో పోలిస్తే తక్కువ నిడివితో ఉంటాయి. “ఖోల్ దో”, “ఠండా ఘోష్త్” లాంటి కథల్లో కూడా తక్కువ పదాలతో ఎక్కువ చెప్పడం జరుగుతుంది. దీన్ని కొందరు “మంటో ఆ పాటికి కథా రచనలో ఆరితేరిపోయాడు” అని అనచ్చు కానీ, నేను మాత్రం మంటో విభజన హింసను చూస్తూ ఏమీ చేయలేకపోవడం, కటిక పేదరికం, పాకిస్తాన్‍లో ఇమడలేకపోవడం, బొంబాయికి దూరమయ్యానన్న బాధ – వీటన్నింటి మధ్య రాసిన కథలు ట్రామాలోంచి రాసినవి కాబట్టి వాటిలో శైలి భిన్నంగా ఉందని వాదిస్తాను.
ప్రశ్న 5. తెలుగులో మంటో అనువాదాలు వచ్చాయి. అనువదించేప్పుడు మిగతా వాటితో పోలిక వస్తుందన్న వెరపు కలగలేదా?
ఒకే రచయితను/రచనను అనువాదం చేసిన/చేయబోతున్న అనువాదకులు పరీక్షకు కూర్చున్నవారు అవుతారని నేననుకోను. వాళ్ళు చేసిన అనువాదాలు జవాబు పత్రాలు కావు. ఆ పత్రాలకు గ్రేడింగ్/రాంకింగ్ ఇవ్వడానికి సాహితీ విమర్శకులు ఎగ్జామినర్స్ కారు. ఒకే రచనకు వచ్చిన పలు అనువాదాలను ఆ viewpoint నుంచి చూడ్డం నాకు సరికాదని అనిపిస్తుంది. అందుకని నాకు పోలికల గురించి వెరపు లేదు. కానీ తెలుగునాట అనువాదాల గురించి వినిపించే మాటలు మాత్రం చాలా విసుగుని కలిగిస్తుంటాయి.
గత మూడేళ్ళ కాలంలో మెహక్ హైదరాబాదీ, అమ్జద్ గార్లు మంటో కథా సంపుటాలు తీసుకురాకపోయుంటే, తెలుగులో అసలు మంటో రచనలు comprehensiveగా వచ్చాయనే చెప్పుకోలేని పరిస్థితి. అయినా మంటోవి ఏవో చాలా పుస్తకాలు వచ్చేసినట్టు మాట్లాడుతుంటారు. అట్లానే దేవిగారి పుస్తకం, అరసంవారు వేసిన “తీత్వాల్ కుక్క” సంపుటం మంటో గురించి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మెటీరియల్ అందుబాటులో లేని కాలంలో వచ్చాయని గుర్తుంచుకోవాలి. “తీత్వాల్ కుక్క” అంతటి చిన్న పుస్తకంలో కూడా కథల దగ్గరే ఆగకుండా, మంటోపై ఆంగ్లంలో వచ్చిన ఒక అకడెమిక్ వ్యాసాన్ని అనువదించి ప్రచురించారన్నది గమనించాలి.
2012లో మంటో శతాబ్ది జయంతోత్సవాలు జరిగాక ఇంగ్లీషులో అనువాదాలు, విశ్లేషణలు విరివిగా వెలువడ్డాయి. దానికి తోడు rekhta.org లాంటి సంస్థలు ఉర్దూ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లోకి చేర్చాయి. వీటన్నింటితో పాటు, సాహిత్యంలో ఎలాంటి అకడెమిక్ బాక్‍గ్రౌండ్ లేని నేను, మంటోపై విభజనపై వచ్చిన పేపర్లు, పిహెచ్‌డి థీసెస్లూ చదివి ఆకళింపు చేసుకోగలిగాను. నాకున్న తెలుగేతర సాహిత్య నెట్వర్కుల వల్ల యూనివర్సిటీలలో, సాహిత్యంలో, నాటక రంగాల్లో మంటోపై పనిజేస్తున్నవారి నుంచి ఎన్నో తెలుసుకోగలిగాను. ఇవ్వన్నీ నాకు అందుబాటులో లేకపోయుంటే నేనూ అనువాదాల దగ్గర ఆగిపోయేదాన్నేమో?
నా పుస్తకంతో కలిపి ఇప్పటికి మంటోవి ఆరు పుస్తకాలు వచ్చాయి. ఈ ఆరు పుస్తకాల్లో నాణ్యత ఎలాంటిది? ఏ పుస్తకం మంటోని తెలుగువారికి ఎంత దగ్గర చేసింది? వాటిల్లో లోటు ఏమిటి? అనువాదకులు మంటో వచనాన్ని అనువదించడంలో ఎలాంటి strategies ఎన్నుకున్నారు? తెలుగు భాషని ఎట్లా వాడారు? – ఇవ్వన్నీ సాహిత్య విమర్శకుల పని. తెలుగునాట కవులకు, రచయితలకు ఉన్న నామమాత్రపు పారితోషకాలు, పురస్కారాలూ కూడా అనువాదకులకు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా వేరే భాషలను నేర్చుకుని, వ్యయప్రయాసలకు ఓర్చి ఆ సాహిత్యాన్ని చదివి, తెలుగులోకి తీసుకొస్తున్నవారికై కనీసం కొన్ని ప్రోత్సహకరమైన మాటలతో, లోటుపాట్లను మర్యాదగా హైలైట్ చేసేటప్పుడు literary discourses అవసరం మనకి. లేకపోతే, ఇంతటి నిరుత్సాహకరమైన వాతావరణంలో నాణ్యతతో కూడిన సాహిత్య సృజన చేయడం అసాధ్యమవుతుంది.
తెలుగులో మంటో అనువాదాలు వచ్చాయి. వస్తుంటాయి. నేను చేయాలనుకున్నవి నేను చేస్తాను. There can be many Mantos in Telugu, but, there can be only one Purnima’s Manto. 🙂
ప్రశ్న 6. ఏ రకంగా ఇతర అనువాదాల కంటే మీ అనువాదం మెరుగ్గా, భిన్నంగా వుండేట్టు జాగ్రత్తలు తీసుకున్నారు?
తెలుగులో వచ్చిన ఇతర మంటో అనువాదాలను దృష్టిలో పెట్టుకుని నేను “సియా హాషియే” పుస్తకాన్ని రూపొందించలేదు. అనువాద రంగంలో నేను గురుతుల్యులుగా భావించే ఆర్షియా సత్తర్, రక్షిందా జలీల్, మహమ్మద్ ఉమర్ మెమన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని, తెలుగు పాఠకులకు మంటో రచనలతో పాటు ఆయననాటి రాజకీయ-సామాజిక వాతావరణాన్ని పరిచయం చేయాలనుకున్నాను.
సంజీవని మొక్కను పట్టుకు రమ్మంటే హనుమంతుడు పర్వతం మొత్తం మోసుకొచ్చినట్టే, textతో పాటు contextను కూడా అనువాదంలోకి పట్టుకురావాలి అని కన్నడ-ఇంగ్లీష్ అనువాదకురాలు, డా. వనమాల విశ్వనాథ్ అంటారు. 2020లో ఇరవై కథలు ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో అని చెప్పా కదా, అప్పుడు కూడా మంటో జీవితాన్ని, కథలని వేర్వేరుగా చూడలేకపోయాను. అందుకే, ప్రతీ కథ చివర్న మంటో ఏ పరిస్థితుల్లో, దేనికి స్పందనగా ఆ కథ రాశాడో చెప్పుకొచ్చాను. మంటో అనే సంజీవని కోసం, 1930-50ల మధ్య ఉర్దూ సాహిత్యమనే పర్వతాన్ని నెత్తినెత్తుకున్నాను.
ఉర్దూ నుంచి నేరుగా అనువాదం చేయడాన్ని కూడా పొగడ్తలా వాడుతుంటారు. కానీ భాషకు మరీ అతి-ప్రాధాన్యత ఇవ్వడం కూడా సరి కాదేమో. హనుమంతుడి పోలికే పొడిగించుకుంటే, వీలుంటే హిమాలయాలనుంచే పట్టుకురావచ్చు. కానీ అదే మొక్క, అదే eco-system చిన్న సైజులో నీలగిరి కొండల్లో దొరికినా పట్టుకురావచ్చు. మొహమ్మద్ ఉమర్ మెమన్ లాంటి విశిష్ట అనువాదకులు చేసిన ఆంగ్లానువాదం నుంచి నేను మంటోని చేసినా బాగా వచ్చేవని నా నమ్మకం. పైగా పుస్తకంలో నేనిచ్చిన రిఫరెన్సులు చూస్తే అధికంగా ఇంగ్లీషువే ఉంటాయి. మంటో ఉర్దూలో రాశాడు, కానీ ఆయన గురించి ఎక్కువగా ఆంగ్లంలో రాశారు. నాకు ఆంగ్లంలో facility లేకపోతే రిసర్చ్ అసాధ్యమయ్యేది.
ఉర్దూ నుంచి చేయడం వల్ల మాత్రం నేను మంటో వాక్యానికి, మాటకు (ఎంత వీలవుతుందో అంత) దగ్గరగా ఉండగలిగాను. తెలుగులో మనం గుర్తించలేనన్ని ఉర్దూ పదాలు కలిసిపోయున్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకోగలిగాను. తెలుగు భాషలో ఉన్న గొప్ప elasticity వాడుకోగలిగాను. పాఠకులపై నమ్మకం ఉంచాను కాబట్టి “అచ్చంగా తెలుగు వచనం” అన్న చాదస్తానికి పోకుండా, “ఉర్దూ వాసన”ను జొప్పించాను.
మంటో రచనల ఆధారంగా వచ్చిన నాటకాలు నాకు వీలైనన్ని చూడ్డం వల్ల వేర్వేరు దర్శకులు, ఆక్టర్లు ఆయన పాత్రలను ఎలా interpret చేస్తున్నారో గమనించగలిగాను. ఎన్నెన్నో రీ-ప్రింటుల్లో వచ్చినవి కథలు కనుక, దొరికనన్ని వర్షన్లు చదివి/విని తరిచి చూసుకున్నాను.
ముఖ్యంగా, రచయితగా నాకంటూ ఉన్న శైలిని అనువాదంలోకి రానివ్వలేదు. చదివేటప్పుడు మంటో లోకదృష్టిని, శైలిని జడ్జ్ చేశాను కానీ, ఆ జడ్జ్‌మెంట్‌ని అనువాదాల్లోకి రానివ్వలేదు.
కానీ మంటోని నేను పదేళ్ళ కిందట అనువాదం చేసుంటే “సియా హాషియే” లాంటి పుస్తకం వచ్చేది కాదు. మంటోని చదవడంతో పాటు గత పదేళ్ళుగా నా సాహిత్యప్రయాణంలో, రాజకీయ అవగాహనలో విశేషంగా అభివృద్ధి చెందాను కాబట్టే మంటోని, ఆయన రచనల్ని నాదైన దృష్టితో చూడగలిగాను. నేను రాసిన ముందుమాట, తెలుగనే కాదు, మంటోపై ఇతర భాషల్లో వచ్చిన విశ్లేషణా/విమర్శా వ్యాసాల మధ్యనైనా నిలువగలదన్న నమ్మకం నాకుంది.
ప్రశ్న 7. అవును, ఈ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాశారు. అది మీ లోతయిన అధ్యయనానికి అవగాహనకు అద్దం పడుతుంది. కానీ, చివరలో మంటోను అటో ఇటో పెట్టటం కుదరదు అని తీర్మానించారు. ఈ అటో ఇటో పెట్టటం అంటే ఏమిటి?
మనం ప్రస్తుతం ఉన్న కాలంలో అన్నీ బైనరీలు/బకెట్లు అయిపోయాయి కదా! అయితే రైట్ వింగ్, కాకపోతే లెఫ్ట్. అయితే పాట్రియాటిక్, లేకపోతే ఆంటీ-నేషనల్. అయితే ఫెమినిస్ట్, లేకపోతే MCP. అయితే ఇది, కాకపోతే అది. భావజాలాలు మొదలుకుని అభిప్రాయాలు వరకూ అన్నింటా rigidity ఎక్కువవుతూ వస్తోంది. దాటలేని గీతలేవో చిక్కబడుతున్నాయి. ఆ గీతలకు అటో ఇటో, ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. ప్రతీదానికి స్పందించాల్సిన పరిస్థితి.
మంటో ఏమో మంచి పోస్టర్ బాయ్ కాండిటేట్ – రచనల్లో పటిమ ఉంది. ఆవేశం ఉంది. కట్టిపడేసే వాక్చాతుర్యం ఉంది. అతన్ని (mis)appropriate చేయడం తేలిక.
ఉదాహరణకు, మంటో స్త్రీ పక్షపాతి అని, స్త్రీల పట్ల ఎనలేని సహానుభూతితో కథలు రాశాడని ఒక బలమైన అభిప్రాయం. అందులోనూ వేశ్యల గురించి రాసినందుకు, అట్లా రాసినవాటికి వచ్చిన విమర్శలకు బెదురు లేకుండా ఎదిరించినందుకు ఫెమినిస్ట్ రైటర్ అని అనేవాళ్ళున్నారు. కానీ మంటో కథల్లో objectification of women ఎక్కువన్న వాదం మెల్లిమెల్లిగా ఇప్పటి స్త్రీవాదులు లేవనెత్తుతున్నారు.
ఇప్పుడు “బూ” (వాసన) కథనే తీసుకోండి. అందులో స్త్రీ శరీర భాగాలను ప్రస్తావించడాని అప్పట్లో కేసు వేశారు, దాన్ని ఎదుర్కున్నందుకు మంటోని హీరోగా పరిగణిస్తుంటారు. కానీ ఇప్పుడు ఫెమినిస్ట్, caste రీడింగ్స్‌లో ఆ కథలో స్త్రీ పాత్రలకు ఏ మాత్రం ఏజెన్సీ లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. “Manto’s Boo and Savarna’s Guilt” అనే ఈ వ్యాసంలో ఇలాంటి వాదనలు వినిపించారు. (ఈ వ్యాసంతో నేను పూర్తిగా ఏకీభవించలేను కానీ ఇలాంటి కొత్త కోణాలనుంచి సాహిత్యం చదవడం ముఖ్యం. దాని గురించి మరెప్పుడైనా..)
అందుకే “మంటో ఫలానా” అంటూ లేబుల్ అతికించి, ఒక బాక్స్‌లో పెట్టేయకుండా ఆయన రచనలని, జీవితాన్ని, దృక్పథాన్ని టూల్స్‌గా వాడుకుని మనకి మనం అతికించుకుంటున్న లేబుల్స్ నుంచి, ఇరుక్కుంటున్న బాక్సుల నుంచి బయటపడగలమేమోనని నా ఆశ.
ప్రశ్న 8. ఉర్దూ సాహిత్యంలో మంటో స్థానం ఏమిటి?
సుస్థిరమైన స్థానమే! 🙂
అప్పటి వరకూ ఉర్దూ సాహిత్యానికి పెద్దగా అలవాటు లేని చిన్న కథను ఒక స్థాయికి తీసుకెళ్ళాడు. నగర జీవితాలను పరిచయం చేశాడు. (ప్రేమ్‍చంద్ ఎక్కువగా గ్రామీణ కథలు రాశాడు.) ఆధునిక ఉర్దూ సాహిత్య తీరు తెన్నులను నిర్దేశించిన అభ్యుదయవాదాన్ని కొన్నాళ్ళు పోస్టర్ బాయ్‍గా ఉన్నాడు, తర్వాత దాని సంకుచిత నిర్వచనాలను తీవ్రంగా ధిక్కరించాడు. దేశవిభజనపై వచ్చిన కథల ప్రస్తావన వస్తే మంటో పేరు తప్పకుండా వినిపిస్తుంది. “మానసిక అనారోగ్యం – సృజనకారులు” అన్న టాపికకు మంటో మంచి కేస్ స్టడీ. ఉర్దూ సాహిత్యంలో చట్టపరమైన ఆంక్షలు, సాహితీ విమర్శలు/వెలివేతలను ఎదుర్కోవడం అన్న అంశంలో మంటో పేరు ఉంటుంది.
మంటోని “ఉర్దూ కథకుల్లో అతి గొప్పవాడు” అని కూడా అంటుంటారు. నాకీ G.O.A.T (Greatest Of All Time) వాదాలు ఎక్కవు కానీ, మంటో రచనలు ప్రపంచానికి అవసరం పడుతూనే ఉంటాయని నా అభిప్రాయం.
ప్రశ్న 9. ఎందుకని మంటో పై సాహిత్య ప్రపంచంలో ఇంత ఆసక్తి?
తన రంగంలో విశేష ప్రతిభ కనబర్చడంతో పాటు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉంటే, ఆ మనిషిని లోకం అబ్బురంగా చూస్తుంది. నెత్తిన పెట్టుకుంటుంది. మురిసిపోతుంది. నాకు వెంటనే తడుతున్న ఉదాహరణ: మహమ్మద్ అలీ. ఆయన బాక్సింగ్ రింగ్‍లో ఆడ్డం వల్లే కాదు, నల్లజాతీయులపై వివక్ష గురించి బలంగా మాట్లాడ్డం వల్ల కూడా జన ప్రాచుర్యం పొందారు.
మంటోకి కూడా ఈ రెండు లక్షణాలున్నాయి. కథా రచనపరంగా చూసుకుంటే మంటో కథలు ఆలోచింపజేసేవి, స్పందింపజేసేవి. వ్యక్తిగతంగా మంటో ఎన్నో పోరాటాలు చేశాడు. ఏ వర్గం, ప్రాంతం వారి కోసమో కాదు. తన కోసం, తన రచనల కోసం. కోర్టుల చుట్టూ తిరిగినందుకు మంటోని అందరూ గొప్పంటుంటారు. కానీ, అంతకు మించిన అనధికారిక యుద్ధాలు తోటి సాహిత్యకారులతో చేశాడు.
తోటి సాహిత్యకారులు ఎంత గగ్గోలు పెట్టినా, తనను దూరం పెట్టినా, నానా మాటలన్నా “నా కథల్లో బలం ఉంది, నా ఆలోచనల్లో పదునుంది” అని వివరిస్తూ బల్ల గుద్ది వాదించాడు. ఇంకెవ్వరు నిలబడినా నిలబడకపోయినా తన రచనల కోసం, తన పాత్రల కోసం తాను నిలబడ్డాడు. పోరాడాడు. అంతటి కటిక పేదరికంలో కూడా, రాస్తే తప్ప డబ్బులు రాని పరిస్థితుల్లో కూడా, పిల్లాపాపలు పస్తులు ఉంటున్నారని నిజం లోపల్నుంచి తినేస్తున్నా సాహిత్యపరంగా రాజీ పడలేదు. నమ్మిందే రాశాడు. తన రచనల్లో బలమేంటో తానే చెప్పుకున్నాడు.
అంతటి హీరో మెటీరియల్ పట్ల ప్రపంచానికి ఆసక్తి ఉండడంలో వింత లేదుగా!
ప్రశ్న 10. మంటో రచనలనుంచి ఈ నాటి సమాజం ఏమి గ్రహించాలి?
సామాన్యుల రోజూవారీ జీవితంలో కులం/మతం/లింగం/లైంగికత/వర్గం వగైరాల పేరిట జరిగే ప్రతినిత్యపు వేర్పాటువాదం వల్ల చాలా అనర్థాలు అన్న నిజాన్ని మంటో రచనలు పదేపదే మన ముందుకు తెస్తాయి.
ఈ ప్రతినిత్యపు వేర్పాటు (everydayness of partition) ఈనాటి మన జనజీవితంలో భాగం, అవునా కాదా? కట్టూబొట్టూ, తిండిలాంటి విషయాలు – మంటో రచనల్లో ఉన్నట్టుగా – మనకాలంలో జీవన్మరణ సమస్యలుగా మారుతున్నాయా, లేదా? మంటోని నానామాటలూ అన్నారు, కోర్టులకు ఈడ్చారు, అయినా బతకనిచ్చారు. ప్రస్తుతకాలంలో ఒక రచయిత రాజకీయ పరిణామాల గురించి ఇంత సూటిగా, ఘాటుగా రాస్తే ఆ మనిషి బతికి బట్టగలరా, లేరా?
వీటికి “అవును” సమాధానమైతే మంటో రచనలకి నేటికీ ప్రాముఖ్యత ఉన్నట్టు. లేదంటే లేనట్టు. సింపుల్. వీటికి ఎవరికి వారు సమాధానాలు ఇచ్చుకోవాలి, నేర్చుకోవాలి. సామూహిక జవాబులు/ అభిప్రాయాలు/వాదోపవాదాలు పనికిరావు.
ప్రశ్న 11. మీరు మంటో రచనల అనువాదం కోసం ఉర్దూ నేర్చుకున్నారు. ఆ అనుభవం గురించి చెప్పండి.
నేను మంటో రచనలకోసం ఉర్దూ నేర్చుకున్నానన్న మాట ఎలా పుట్టి, ఎట్లా పాకుతుందో తెలీడం లేదు.
భాష వేరు. లిపి వేరు.
నా జీవితంలో మొదటి ముప్ఫై ఏళ్ళు హైదరాబాదులో పాత నగరం (గోల్కొండ పరిసర ప్రాంతాలైన లంగర్ హౌజ్, హుమాయున్ నగర్)లో గడిచింది. ఇంట్లో తెలుగెంత అలవాటో, బయటకు పోతే ఉర్దూ/దక్కనీ అంతే అలవాటు. స్కూలులో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి రాయడం/చదవడం వచ్చింది. ఉర్దూ లిపి నేర్చుకునే అవకాశం రాలేదంతే. నేను 80s kidయే అయినా, మా ఇంట్లో చాన్నాళ్ళు కేబుల్ టివీ లేదు. వివిధ భారతి/దూరదర్శన్లో వచ్చే ఉర్దూ కార్యక్రమాలతో పెరిగాను. ‘50s నుంచి ‘70s వరకూ వచ్చిన బాలీవుడ్ పాటలన్నింటిలో హిందుస్తానీ భాషే కదా.. నాకు ఇరవై రెండేళ్ళు వచ్చి పుస్తకాలు కొనుక్కోగల స్తోమత వచ్చే వరకూ నాకు తెలిసిన కవిత్వం బాలీవుడ్ పాత పాటలే!
నాకు తెలుగెంతో ఉర్దూ అంతే! భాషగా తెలుగెట్లా అయితే నేను ప్రత్యేక శ్రమ, శ్రద్ధ పెట్టకుండానే నాలోకి ఇంకిపోయిందో, ఉర్దూ కూడా అట్లా నాతో ఎప్పుడూ ఉంది. భాష వచ్చినంత మాత్రం సాహిత్యం అబ్బదు కదా – దానికి కావాల్సిన శ్రమ దానికి పెట్టాలి. సాహిత్యంగా తెలుగు చదవడానికి, రాయడానికి మొదట్లో శ్రమించినట్టే ఉర్దూలో కూడా అంతే! అందుకే, పైన ఒక జవాబిస్తూ అన్నాను కదా, దేవనాగరిలో ఉన్న ఉర్దూ చదవడం నాకు కాస్త శ్రమ పెట్టగానే అలవడిందని. అసలు భాష తెలియని పరిస్థితి అయితే కఠిన పదాల అర్థాలు తెలియగానే సులవైపోదు కదా?!
ఉర్దూ లిపి నేర్చుకోవాలని పదమూడేళ్ళ వయసు నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మొదలెట్టి ఆపేయాల్సి వచ్చింది ఒకట్రెండు సార్లు. ఎట్టకేలకు కోవిడ్ కాలంలో కొన్ని సంస్థలు/విశ్వవిద్యాలయాలు ఆన్‍లైన్ కోర్సులు పెట్టాక నస్తాలిక్ నేర్చుకోగలిగాను. ముఖ్యంగా, పంజాబ్ యూనివర్సిటీ భాషా విభాగ్ వాళ్ళు నిర్వహించిన “ఉర్దూ అమోజ్” అనే ఆర్నెళ్ళ కోర్సులో డా. హెచ్.కె లాల్ గారి నుంచి నేర్చుకునే మహద్భాగ్యం కలిగింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతీ రోజు గంట సేపు.
భాషలు సముద్రాల్లాంటివనుకుంటే మనం ఎంత గజ ఈతగాళ్ళం అనుకున్నా కొన్ని లోతుల వరకే ఈదగలం. మనకి తెలీని ఎన్నో రహస్యాలు భాషనే సముద్ర గర్భంలో ఉంటాయి. మనకు అవసరమైనంత మేరకు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ పోవడమే కానీ “నాకు భాషపై పూర్తి పట్టు ఉంది” అని ఎప్పుడూ అనుకోను. మనం మామూలుగా రాసుకుంటూ పోతున్నప్పుడు చాలా భాష వచ్చుననే (అహం)భావం కలుగుతుంది కానీ, అనువాదాలు చేసేటప్పుడు మాత్రం ఆ బుడగ పేలుతూనే ఉంటుంది. Translation must be one of the most humbling experiences.
నేను మంటో కోసమే ఉర్దూ నేర్చుకోలేదు. ఉర్దూ నేర్చుకునే క్రమంలో నా ఫేస్‌బుక్ వాల్‌పై చాలా వివరాలు ఇవ్వడంతో, ఆ వెంటనే మంటో పుస్తకం రావడంతో అట్లా అనుకున్నారేమో. అయితే, ఉర్దూ లిపి నేర్చుకోవడం వల్ల మంటోవి పెద్దగా జన ప్రాచుర్యం లేని రచనలు తీసుకురాగలుగుతున్నాను.
ప్రశ్న 12. భవిష్యత్తులో మంటోవే ఇతర రచనలేవైనా అనువదించే ఆలోచనవుందా? లేక ఇతర ఉర్దూ రచయితల రచనలను అనువదిస్తారా?
మంటోవి “సియా హాషియే” పుస్తకంలోనివి కాకుండా మరో పాతిక కథల అనువాదం “స్టోరీటెల్” (StoryTel) అనే ఆప్‌లో, ఆడియో బుక్స్‌గా అందుబాటులో ఉన్నాయి. వీటితో కలుపుకుని దాదాపు ఆరొందల పేజీల అనువాదాలు ఫస్ట్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉన్నాయి. వాటిని కనీసం మూడు-నాలుగు వాల్యూమ్స్‌గా తీసుకురావాలని ఆలోచన. కానీ పోయిన ఏడాది ఎలమి ప్రచురణలు మొదలెట్టడంతో పని భారం ఎక్కువవడం, తెలుగు నుంచి ఇంగ్లీషుకు అనువాదాలు చేస్తుండడం వల్ల, ఈ ప్రాజెక్ట్ కొంచెం నెమ్మదించింది. వచ్చే ఏడాదికైనా తీసుకురావాలి ఈ పుస్తకాలు.
మంటోని text రూపంలోనే కాక, మరికొన్ని విధాల పరిచయం చేయాలని నా తపన. అందుకే “@mantointelugu” అనే డిజిటల్ ప్రాజెక్ట్ మొదలెట్టాను – ఇందులో మంటో చేసిన రచనలే కాకుండా, మంటో రచనలను వివిధ కళారూపాల్లో చూపిస్తున్న తీరుతెన్నులను చర్చకు పెట్టాలని కోరిక. నేను చేసిన రెండు కథల ఆధారంగా “పరాయి” అనే తెలుగు నాటకాన్ని బీ స్టూడియో, హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్నారు.
ఉర్దూ లిపి నేర్చుకోవడం వెనుక ఉన్న ముఖ్య కారణం మాత్రం, దేవనాగరి లిపిలో లేని ఉర్దూ రచనలను తెలుగులోకి తీసుకురావాలని. రాజ్‍కమల్ వారు మంటో, చుగ్తాయ్ రచనలు దేవనాగరిలో ఎందుకు తీసుకొచ్చారు? వాటికి మార్కెట్ ఉంది కాబట్టి. కానీ అట్లాంటి మార్కెట్ లేని ఫికర్ తౌన్స్వీ లాంటి రచయితలను తీసుకొస్తారా? వాళ్ళు తీసుకొచ్చేవరకూ ఎదురుచూడ్డం కాకుండా లిపి వస్తే మనమే చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన.
నేను ఇప్పటికే సుగ్రా హుమాయున్ మిర్జా, ఫికర్ తౌన్స్వీ, నౌషీదా ఖతూన్ (ఇంకా ప్రచురించలేదు) వంటి రచయితలను ఉర్దూ నుంచి అనువాదం చేశాను/చేస్తున్నాను. అన్నీ కలిసొస్తే చాలా పని చేయాలనే ఉత్సాహం ఉంది.
ప్రశ్న 13. తెలుగు సాహిత్యంలో అందరికన్నా భిన్నమైన మార్గం ఎంచుకుని విభిన్నమైన రచనలను విశిష్టంగా సృజిస్తున్నారు. ఇలా అనువాదాలవైపు మళ్ళటం సృజనాత్మక రచనలు చేయటానికి ప్రతిబంధకం అవుతుందా?
ముందుగా మీకు, సంచిక పత్రికకు ధన్యవాదాలు. నా కథా రచన గురించి అట్టే ఎక్కువ ప్రస్తావన రాదు. కానీ మీరు “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ” కథల పుస్తకాన్ని సంచిక పత్రికలో సమీక్షించారు. అనువాదకురాలిగా ముద్ర పడిపోతే ఎన్ని మంచి కథలు రాసినా గుర్తింపు రాదని కొందరు హెచ్చరించారు (మంచి ఉద్దేశంతోనే). కథల పుస్తకం వచ్చాకే అనువాద రచనలు వేయమన్నారు. “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ”కి మీతో పాటు మరికొందరు రాసిన స్పందనల ద్వారా నేను పొరపాటు చేయలేదనే అనిపిస్తుంది.
ఇకపోతే, అనువాదాల వల్ల సృజనాత్మక రచనలకు ప్రతిబంధకమా అన్నది కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం.
మానవ మెదడును, దాన్ని పనితనాన్ని అర్థం చేసుకునే విధానంలో మనం మామూలుగా బైనరీలలో (అది vs ఇది) ఆలోచిస్తాం. “పిల్లలకు తెలుగు నేర్పిస్తే తర్వాత ఇంగ్లీషు రాదు”, “సాహిత్యం/కళలూ అభ్యసిస్తూ కూర్చుంటే సైన్స్/ఇంజనీరింగ్లో రాణించలేరు” లాంటివి ఉదాహరణలు. ఇంకోటి “ఒక పని మొదలుపెట్టి అది మొత్తంగా పూర్తి చేసే ఇంకోదాని పైకి వెళ్ళాలి.” ఇవ్వన్నీ అపోహలు, నన్నడిగితే. మన మెదళ్ళు అద్భుతాలు! అవి ఎన్నింటిని, ఎంతెలా నేర్చుకుని, పరిశీలించి, ఇంకించుకోగలవో మనం ఊహించుకోలేం. తెలుగు సాహితీ మిత్రులు కొందరు “నువ్వు ఐటీ ఉద్యోగం మానేస్తే ఇంకా ఎక్కువ సాహిత్య కృషి చేయగలవు” అని అంటుంటారు. నాతో పనిజేసే కొలీగ్స్ “నువ్వు సాహిత్యం మానుకుంటే ఐ.టీలో ఇంకెంతో దూరం వెళ్ళగలవు” అని సలహా ఇస్తుంటారు.
కానీ, నేను ఇలా బైనరీలలో చూడను. మన ప్రతీ భోజనంలోనూ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియన్ట్స్, ఫైబర్ ఇలా అన్నీ ఉండాలని కదా డాక్టర్లు చెప్తారు. మన మెదళ్ళకు కూడా అలాంటి పోషకాహారమే పెడుతుండాలి. కంప్యూటర్ సైన్స్ సమాజాన్ని ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్‍గా చూడ్డం నాకు నేర్పిస్తే సాహిత్యం, అలా చూసిన మోడల్స్‌ని వ్యక్తీకరించడం నేర్పించింది.
అలానే, అనువాదాలు చేయడం కూడా నేను చేసిన/చేయబోయే సృజనాత్మక సాహిత్యాన్ని (నాకు తెలీని/కనిపెట్టలేని విధాలుగా) తీర్చి దిద్దుతూ ఉండచ్చు. అనువాదాలకు ఎక్కువ headspace ఇవ్వడం వల్ల నేను కథలు రాయలేనేమోనన్న భయం లేదు నాకు.
అయితే, మెదడు ఎలాస్టిక్కే కానీ సమయం అలా సాగదీస్తే సాగదు కదా. ఉద్యోగం, ఎలమి లాంటి సంస్థ నడపడం, జీవితం పెట్టే పేచీలతో వేగడం కాక, మిగిలిన సమయంలో ఎన్ని అనువాదాలు చేయగలనో, ఎన్ని కథలు చెప్పగలనో చూడాలి.
ప్రశ్న 14. సృజనాత్మక రచనలు, అనువాదాలు ఈ రెండు ప్రక్రియల్లో మీకు నచ్చిన ప్రక్రియ ఏది? ఏ ప్రక్రియ కఠినం?
అనువాదాల ద్వారా వేరొకరి వ్యక్తీకరణలు మన భాషలోకి తీసుకొచ్చే బాధ్యత కాబట్టి, పైగా ఒకటే సారి రెండు భాషలతో కుస్తీ కాబట్టి ఎక్కువ శ్రమ కావాల్సి వస్తుంది. దానికి తోడు దేశ విభజన, తెలంగాణ సాయుధ పోరాటం లాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఎన్నుకున్నప్పుడు ఆ బరువు ఎన్నో రెట్లు పెరుగుతుంది. పైగా, అనువాదాలు చేసేటప్పుడు ఇంకెక్కడా కుదరనంత నిశితంగా చదువుతాం. (Translation is an intimate act of reading.) హింస, వివక్ష గురించి ఉన్న రచనలు చేసేటప్పుడు అవి మనపై మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండేలా కూడా చూసుకుంటుండాలి.
అట్లా అని సృజనాత్మక సాహిత్యం పెద్దగా వేరు కాదు. ప్రముఖ కన్నడ రచయిత, వివేక్ శానభాగ్ గారితో ఒకసారి తెలుగు కథల్లో ఇంగ్లీషు పదాలు/డైలాగులను రాయవచ్చా, లేదా అన్న మీమాంశ పంచుకుంటే, “All writing is an act of translation” అని చెప్పారు. ఆ మాట నాకు బాగా పనికొచ్చింది. సృజనాత్మక సాహిత్యంలో కూడా మనం చూపించాలనుకున్న ఊహనో, వాస్తవాన్నో (abstract) మళ్ళీ మాటల్లోకి(concrete) తర్జుమా చేస్తుంటాం కదా!
అనువాదాలకు, సృజనాత్మక సాహిత్యానికి మధ్య ఎన్నుకోమంటే నేను సృజనాత్మక సాహిత్యాన్నే ఎన్నుకుంటాను. వ్యక్తిగతంగా, నేను పెద్దగా మాట్లాడే మనిషిని కాను. బోలెడన్ని కబుర్లు, కథలు చెప్పేసి అందర్నీ ఆకట్టుకోవడం నాకు చేత కాదు. కానీ నా తలలో ఎప్పుడూ బోలెడన్ని ఆలోచనలు, వింత వింత ఊహలూ ఉంటాయి. నేను ప్రపంచాన్ని చాలా భిన్నమైన రీతిలో చూస్తుంటాను. చుక్కలను నాదైన శైలిలో కలపగలను. అది చాలా స్పెషల్ టాలెంట్ అని ఒప్పుకోడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. ఆ టాలెంట్‌ను బయటపెట్టడానికి కథా రచనకు మించిన safe space నాకు లేదు. అందుకని, అనువాదాలు చేస్తూనో/తగ్గించుకునో, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాను.
ప్రశ్న 15. సియాహాషియే పుస్తకంలో ఏ రచన అనువాదానికి చాలా కష్టపడ్డారు? ఎందుకని?
మహమ్మద్ అస్కరీ రాసిన వ్యాసాలకు చాలా కష్టపడ్డాను. ఆయన శైలి కొంచెం verboseగా, తిప్పి తిప్పి అదే మాట చెప్పినట్టు ఉంటుంది. పైగా ఆయన అప్పటి యూరోపీయన్ విమర్శను ఇక్కడి విమర్శతో పోలిస్తూ రాశాడు. తెలుగు పాఠకులలో అధికులకు ఆ రెండింటి గురించి అవగాహన ఉండదు. అందుకని కాస్త ఎడిట్ చేయాల్సి వచ్చింది.
“జేబ్-ఎ-కఫన్” వ్యాసం కూడా. నాకు మంటో రాసిన కథలు అనువాదం చేయడం తేలిక అనిపిస్తుంది. వాటిల్లో ఆయన/ఆ కథకుడి గొంతు పట్టుకోవడం తేలిక, ఎందుకంటే ఎక్కువగా ఆయన ప్రేక్షక పాత్రలో ఉంటాడు. కానీ వ్యాసాల్లో మాత్రం ఎన్నో భావావేశాలు. అదొక వెర్రి ఆక్రోశంలా అనిపిస్తుంది, కానీ చాలా ఆలోచన నిండి ఉంటుంది. భాష కూడా భారీగా, ఉధృతంగా ప్రవహిస్తున్న ఝరిలా ఉంటుంది. తెలుగులో దాన్ని పట్టుకురావడానికి కాస్త తంటాలు పడుతుంటాను.
ప్రశ్న 16. ఈ పుస్తకంలోని రచనల్లో మీకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చిన రచన ఏది? ఎందుకు?
నచ్చడం/నచ్చకపోవడం కాదు కానీ, నన్ను బాగా ఆలోచింపజేసి, “సియా హాషియే” పుస్తకాన్ని నేను మలిచిన విధంగా మలచడానికి ప్రేరకమైన కథ మాత్రం “వినమ్రత” (కస్రె-నఫ్సీ). ఇందులో రైలు బండిని ఆపి, హత్యలు చేసినవారే, ఆ ప్రయాణికులకు మాత్రం అతిథి మర్యాదలు చేస్తారు. ఒళ్ళు తెలియనంత ఉద్రేకమే ఉంటే చంపేసి వెళ్ళిపోవాలి. మర్యాదలు పట్టించుకునేంత ప్రశాంతత/వెసులుబాటే ఉంటే హత్యల ఊహే రాకూడదు. క్షణకాలంలో మనిషిలోని పాశవికత, నాగరికత మారిపోగలవని చూపించే కథ అది.
సంచిక టీమ్: మీ విలువైన సమయం వెచ్చించి, సంచికకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు పూర్ణిమ గారు.
పూర్ణిమ: ధన్యవాదాలు.
సియా హాషియే: విభజన నాటి నెత్తుటి గాయాలు
ఉర్దూ మూలం: మంటో; అనువాదం: పూర్ణిమ
పేజీలు: 188; వెల: రూ. 190/-
ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, telugubooks.in, ఎలమి ప్రచురణలు (వాట్సాప్ నెం: 8247474541)