మీ లిస్ట్‌లో రాజ్‍కపూర్, శాంతారం పేర్లు వినబడడం లేదు…
ఉన్నాయి. శాంతారం సినిమాలు చాలా వేశాం. జల్ బిన్ మఛ్లీ నృత్య్ బిన్ బిజ్లీ వంటివి చాలా సినిమాలు వేశాం. రాజ్‌కపూర్‌వి ఒకటో రెండో వేశాం. అనారీ… ఇంకా.. అయినా 70ల తర్వాత రాజ్‍కపూర్ వేడి తగ్గింది కదా. బాబీ తరువాత ఆయన ఓరియంటేషన్ మారింది కదా. అంతకంటే ముందు సినిమాలు కొంత మీనింగ్‌ఫుల్ సినిమాలు. అనారీ, శ్రీ420, ఆవారా, గంగా జమున కానివ్వండి… ఇలాంటివి.. చాలా మంచి సినిమాలు తీశారు. మేం ఫిల్మ్ క్లబ్ కొచ్చిందే 1975-76ల. అప్పటికే ఆయన కొంచెం స్లో అయిపోయాడు. ఆ తర్వాత ఇక అమితాబ్ బచ్చన్ హవా! ఒక రకంగా చెప్పాలంటే మా తరం కంటే ముందు తరం ఆయనది… అందుకని ఎక్కువ దూరం వెళ్ళలేదు. వ్యక్తిగతంగా మాకిష్టం ఉండచ్చు, అది వేరే సంగతి. ఇలా పారలల్ సినిమాలు అన్ని అప్పుడే చూడడం జరిగింది.
మాకు ఉన్న మరో రెండు ముఖ్యమైన సోర్సులు ఏంటంటే – సోవెక్స్‌పోర్ట్ అని సోవియట్ పిల్మ్స్ వాళ్ళ అవుట్‌లెట్ మద్రాసులో ఉండేది. అక్కడికెళ్ళి సోవియట్ సినిమలు… ఐసెన్‌స్టీన్ సినిమాలతో మొదలుపెడితే ఎన్ని సినిమాలు చూశామో… ఐసెన్‌స్టీన్, పుడోవ్‌కిన్… ఇలా. ముందు వాళ్ళకి ఉత్తరం రాస్తే, వాళ్ళు బాక్స్ పంపించేవాళ్లు. ట్రాన్స్‌పొర్టేషన్ ఛార్జిలు మాత్రం మేం పెట్టుకునేవాళ్లం.
ఇంకో సోర్స్ ఏంటంటే సి.ఎఫ్.ఎస్.ఐ. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని బొంబాయి కేంద్రంగా పనిచేసే సంస్థ. వాళ్ళకి బెంగుళూరులో బ్రాంచి ఉంది. మద్రాసులో బ్రాంచి ఉండేది. వాళ్ళకి రాస్తే, వాళ్ళు పిల్లల సినిమాలు పంపేవాళ్ళు. మా సొసైటీని బలోపేతం చెయ్యాలంటే ఈ 25/- రూపాయల సభ్యత్వం తోటి సాధ్యం కాదు అని అనుకున్నాం. ఎందుకంటే ‘ఉత్తమ చిత్రం’ అని ఒక మ్యాగజైన్… హౌస్ జర్నల్ అని నడిపేవాళ్లం. ఇప్పటికీ వస్తోంది. ఇంకా సినిమా ప్రదర్శనకయ్యే వ్యయాలు… వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ నవంబరులో బాలల ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని అనుకున్నాం. పిల్లల సినిమాలు తెచ్చి ప్రదర్శించాం. వారం, పది రోజులు, నెల రోజులు… వరుసగా సినిమాలు ఆడిన రోజులున్నాయి. అదీ కూడా మార్నింగ్ షోస్. స్కూల్స్ ద్వారా ఆర్గనైజ్ చేసేవాళ్లం. రెండు రూపాయలు టికెట్ పెట్టేవాళ్లం. అట్లా డబ్బులు పోగు చేసి మిగతా యాక్టివిటిస్ కొనసాగించాం.
ఇంకొక సోర్స్ ఏంటంటే పూనా ఫిల్మ్ ఆర్కైవ్స్. పూనా ఫిల్మ్ ఆర్కైవ్స్ చక్కని సోర్సే కాని ఇట్ వజ్ ఎ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్…
ఏం?
ఎందుకు బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ అంటే… వాళ్ళ కండీషన్ ఇలా ఉండేది: మీరు సినిమా అడిగితే, మేము యస్ అంటే… మీ మనిషి ఇక్కడికి రావాలి. మా మనిషి బాక్స్‌తో వస్తాడు. మీకు మాత్రం బాక్స్ ఇవ్వం. మనిషినీ, బాక్స్‌నీ తీసుకుని మీ ఊరెళ్లి స్క్రీనింగ్ చేసి మళ్ళా వాళ్ళని ఇక్కడికి పంపించాలి అనేవారు. ఇట్ వజ్ హెల్. ఎందుకంటే మాకు రైల్వే స్టేషన్ లేదు. మేం కాజీపేటకి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ్నించి పూనాకి…
ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే… ఫలానా అదివారం ఫలానా సినిమా అని ఎనౌన్స్ చేసేవాళ్ళం. ఒకసారి ఒక సినిమా ఎనౌన్స్ చేశాం. శుక్రవారం వరకు మాకు బాక్స్ చేరలేదు. శనివారం వస్తుందో రాదో తెలియదు. ఆదివారం సినిమా… అందరికీ చెప్పేసాం… ఆదివారం పొద్దున్న 7.30 – 8.00 గంటల కల్లా అందరూ వచ్చేసారు. బాక్స్ రాలేదు. ఆర్గనైజర్స్‌ని తిడతారు. వాళ్ళని ఎలా ఫేస్ చెయ్యాలి? ఒకసారైతే ఒక అట్ట మీద ‘ఈ రోజు సినిమా లేదు’ అని రాసిపెట్టి పారిపోయాం. ఇట్లా ఆర్గనైజ్ చేస్తే ఎట్లా అని అడిగేవారు. సినిమా కోసం వచ్చాం, వేయాలి కదా లేదంటే ఎలా? అనేవారు. సహజంగానే ఆర్గనైజర్లు ఆన్సరబుల్. ఇలాంటివి ఎన్నో జరిగాయి.
ఒకసారి స్మితాపాటిల్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టాము. బాంబే నుంచి ప్రింట్లు బుక్ చేశాము. రావాలి. ఫ్రైడే వరకు ఏ బాక్సూ రాలేదు. మూవీ షెడ్యూల్ చేసేసాం, ఇనాగరేషన్‌కి ఐఎఎస్ ఆఫీసర్ వస్తున్నారు, అంతా సెట్ అయ్యింది. కానీ బాక్స్ రాలేదు. ఏం చేయడం… ఆ రోజు శనివారం..
హైదరాబాద్‌లో ఓ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ‘అర్థ్’ అనే సినిమా ఉందని నాకు తెలుసు. శనివారం వెళ్ళి ‘అర్థ్’ తీసుకురావాలి. సికింద్రాబాద్‌లో వాళ్ళు శనివారం నాడు హాఫ్ డేనే పనిచేస్తారు. బస్సులో వెళ్లినా పన్నెండు గాని చేరతామో లేదో తెలియదు… అప్పుడు మా కజిన్ ఒకతను టెలిఫోన్స్‌లో పనిచేస్తున్నాడు… అతను సలహా ఇచ్చాడు. నువ్వెళ్లు… నేను వాళ్ళని ఫోన్‍లో లైన్‌లో పెడతాను, వాళ్ళని ఆపుతాను అని. అలా అరగంటకి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తూ… నేను వెళ్ళేవరకు వాళ్లు ఉండేలా చూశాడు. అలా బాక్స్ తీసుకువచ్చి సినిమా వేశాం.
ఇలా ఈ కార్యక్రమాలు కొనసాగుతుండగా… 80లలో నేను సర్వీస్‌లోకి వచ్చాను.
ఏ ఉద్యోగం అండీ?
నేను కాలేజీలో లైబ్రేరియన్‌ని. నా ఫస్ట్ పోస్టింగ్ మంథనిలో. అయితే మంథనిలో నేను అడ్జస్ట్ కాలేకపోయాను. నాలుగు నెలల తర్వాత రిక్వెస్ట్ పెట్టుకుంటే, సిరిసిల్లకి మార్చారు. అమ్మమ్మ వాళ్లు వేములవాడ కదా, నేను సిరిసిల్లలో రూమ్ తీసుకుని ఉంటానంటే, అట్లెట్లా… ఇక్కడ్నించి పది కిలోమీటర్లే కదా, ఇక్కడే ఉండు… అని బలవంతం చేశారు మావాళ్ళు. అలా ఓ అరు నెలలు ఏడాది గడిచాకా, వేములవాడలో కూడా ఒక ఫిల్మ్ సొసైటీ పెడదాం అని ఆలోచన వచ్చింది. అప్పట్లో వేములవాడలో ఒకే ఒక థియేటర్ ఉండేది. రేకుల థియేటర్. అందులో సినిమాలు వేద్దాం, ఫిల్మ్ క్లబ్ పెడదామని మిత్రులతో ఆలోచించాను. ఆర్గనైజేషన్ తయారైంది. యాభైమంది సభ్యులు చేరారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ వారి అఫ్లియేషన్ తెచ్చాను. అలా 1981లో వేములవాడ ఫిల్మ్ సొసైటీ ప్రారంభమైంది.
వేములవాడలో ఫిల్మ్ సొసైటీ అంటే అందరూ నవ్వేవాళ్ళు. ఆ ఊర్లో ఫిల్మ్ సొసైటీ ఏంటి? అని. నేను కూడా ఎవరికీ తెలియదు. మా కొలీగ్స్‌కి కూడా నేను ఏమీ చెప్పలేదు. ఇనాగరేషన్‌కి అందరినీ పిలిచాము. మొదటి సినిమా సత్యజిత్ రే ‘షత్‌రంజ్ కే ఖిలాడీ’. అప్పట్లో వేములవాడ పాపులేషన్‌లో బ్రాహ్మణులు ఎక్కువ. వాళ్ళల్లో టీచర్లు ఎక్కువ. ఇదేదో కొత్త ఆలోచన, పారలల్ సినిమా అంటున్నారు, చూద్దాం అని వచ్చారు. మేం సినిమా వేసాం. అది వాళ్ళకు అర్థం కాలేదు. మమ్మల్ని ఏమీ అనలేరు. అయినా చూశారు, భరించారు. అప్పటికి నేను కూడా ఆ సినిమా చూడలేదు. నేను అప్పుడే మొదటిసారి చూశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, కాని వాళ్ళకు కాలేదు. మేమేమీ చేయలేము కదా.
తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వేశాం. ఈసారి మృణాళ్ సేన్ ‘మృగయా’. హిందీ సినిమా. ఈ సినిమా విషయంలో ఓ గమ్మత్తైన అనుభవం జరిగింది. బాక్సు నేరుగా వేములవాడ రావాలి. అప్పట్లో హైదరాబాద్ నుంచి వేములవాడకు ఒకే ఒక బస్సు ఉండేది. అది రాత్రి పది గంటలకు వేములవాడ వచ్చేది. పదిగంటల వరకు బస్‍స్టాప్‌లో నేను పి.ఎస్. రవీంద్ర, కిరణ్ (సెక్రటరీ) అందరం అక్కడ ఉండి బాక్స్ తీసుకుని థియేటర్‌కి పంపించాం. మావాళ్ళ ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. పొద్దున్న ఏడు గంటలకి ఆపరేటర్ ఫోన్ చేశాడు. “సార్, ఏదో సినిమా వచ్చింది, మేరీ గాయ్ అని. మీరేదో సినిమా అన్నారు. ఇది ఇంకేదో బాక్స్ వచ్చింది, ఆ బాక్స్ రాలేదు” అన్నాడు. “బాక్స్ వచ్చిందయ్యా, అదే పంపించాం” అని నేనంటాను. “బాక్స్ వచ్చింది సార్, కానీ దాని మీద మేరీ గాయ్ అని ఉంది. ఆవు అంటున్నారు. ఆవేంటి సార్, మీరు ఇంకేదో సినిమా అన్నారు, మృణాళ్ సేన్ అన్నారు… కానీ ఇది వేరేది” అన్నాడు. ఒకవేళ బాక్స్ మిస్‌ప్లేస్ అయ్యిందా అని డౌట్ వచ్చింది. ఒకవేళ బాక్సులేమయినా తారుమారయ్యాయా అనిపించి, నేను రవీంద్ర థియేటర్‍కి వెళ్ళాం. తీరా చూస్తే… బాక్స్ మీద ఇంగ్లీశులో mrigaya అని రాసుంది. ఆపరేటర్ కన్‌ప్యూజ్ అయి మేరీ గాయ్ అని చదివి మమ్మల్ని కంగారు పెట్టాడు. 🙂 ఎంతో టెన్షన్‌గా వెళ్ళాం. సినిమా ఎనౌన్స్ చేసాకా వేయకపోతే, అందరూ నిరాశపడతారు, విమర్శిస్తారు. విషయం తెలిసాకా, అమ్మయ్య అనుకున్నాం. ఇలాంటి అనుభవాలెన్నో కలిగాయి.
తర్వాత జగిత్యాలలో ఫిల్మ్ క్లబ్ స్థాపించాం. తర్వాత మిత్రులతో సిరిసిల్లలో ఫిల్మ్ క్లబ్ స్థాపించాము. ఇక మెట్‌పల్లి, పెద్దపల్లి, కోరుట్ల, గోదావరి ఖని, ఎల్లారెడ్డి పేట… అలా మొత్తం మా జిల్లాలో ఎనిమిది ఊర్లలో ఫిల్మ్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది ఫిల్మ్ సొసైటీలకి ఒక అండర్ కరెంట్ లైన్ ఉండేది, ఒక కామన్ థాట్ ఉండేది, యాక్టివిస్ట్‌లు కామనే. ఎప్పుడైనా ఒక సినిమా తేస్తే ఈ ఎనిమిది కేంద్రాలలోనూ ప్రదర్శించేవాళ్ళం. అదొక మూవ్‌మెంట్.
అప్పటికి నేనింకా సాహిత్యం పట్ల సీరియస్‌గా లేను. చదువుతున్నాను, చదవడం ఎప్పుడూ తగ్గలేదు. రాయడం మాత్రం రకరకాల కారణాల తోటి… జరగలేదు.
సినిమా వేరు, కవిత్వం వేరు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. రెండూ వ్యక్తీకరణే. మీరు చెత్త సినిమాలు చూసి ఎట్లా అయితే సినిమా పనికిరాదంటారో, చెత్త కవిత్వాన్ని మేము కూడా అట్లానే అంటున్నాం అని వాదించేవాడిని. కవిత్వం, సినిమా మధ్య డిఫరెన్షియేషన్ ఉండాల్సిన అవసరం లేదని చాలామందిని ఒప్పించాను కూడా.
‘లయ’ తర్వాత దాదాపు పదేళ్ల పాటు, ఇంకా ఎక్కువేనేమో, నేను కవిత్వానికి దూరంగా ఉన్నాను. అయితే ఎప్పుడు మొదలయిందో గుర్తు లేదు గాని సినిమాల మీద రాయడం మొదలుపెట్టాను. ఒకసారి నేను, అలిశెట్టి ప్రభాకర్ పల్లకి పత్రికాఫీసుకు వెళ్ళాం. అక్కడ విక్రమ్ అని ఎడిటర్ ఉండేవాడు. ఆయన అడిగాడు, “సార్ మీరు సినిమాల మీద మాకు రాయచ్చు కదా” అని. ‘డైరక్టర్స్ డైరీ’ అనే కాలం చాలాకాలం రాశాను వాళ్ళకి. ఆ తరువాత 1989లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఢిల్లీ వెళ్ళాను. ఇట్ వజ్ ఐ ఓపెనింగ్. ఏదో సినిమాలు చూస్తున్నా, రాస్తున్నాం కానీ… అంతర్జాతీయ సినిమాకొచ్చేసరికి ఎంత తేడా అనిపించింది. అప్పట్లో ఉదయం పత్రికలో పతంజలి గారు ఎడిటర్‌గా ఉన్నారు. మాటల సందర్భంలో ఢిల్లీ వెళ్తున్నానని ఆయనతో చెప్తే “ఆ సినిమాల గురించి మాకు రాయండి” అన్నారు. “అక్కడ్నించి ఎలా రాయను సార్?” అన్నాను. “రాసి ఫాక్స్ చేయండి. ఫాక్స్‌కి డబ్బులిచ్చేస్తాం” అన్నారు. అలా ఢిల్లీ నుండి ‘బైలైన్’ పేరిట అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన సినిమాల సమీక్షలు రాసాను. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ శ్యామ్ బెనెగళ్‌నీ, ఆదూరి గోపాలకృష్ణన్‍నీ కలిసాను. చాలామందితో మాట్లాడాను, ఇంటర్వ్యూలు చేశాను.
అప్పట్లో కేరళలో ఒక మూవ్‍మెంట్ వచ్చింది. ఒడెస్సా కలెక్టిక్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. జాన్ అబ్రహం అనే ఫిల్మ్ మేకర్.. ‘అగ్రహారితల్ కళుతై’, ‘అమ్మ అరియన్’ సినిమాల దర్శకుడు.. ఆయన ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. ఊరురా సినిమా చూపించడం ఈ మూవ్‌మెంట్ లక్ష్యం. 16 ఎం ఎం ఫార్మాట్‌లో సినిమాలు తీసుకెళ్ళి ఓ పది మంది మిత్రులు కలిసి ఒడెస్సా అనే పేరుతో ప్రదర్శించడం మొదలుపెట్టారు. జాన్ అబ్రహం దీనికి లీడర్. ఆయన మొదలుపెట్టి మంచి సినిమాలన్నింటినీ కేరళలో విస్తృతంగా ప్రదర్శించారు. సినిమా పూర్తయ్యాక జోలె పట్టేవారు. ప్రజలు ఎంతిచ్చినా తీసుకునేవారు. అలా పోగు చేసిన డబ్బుతో ఆయన ‘అమ్మ అరియన్’ సినిమా తీశారు. అంటే ఇవాళ మనం ఏదైతే క్రౌడ్ ఫండింగ్ అంటున్నామో, దానికి మూలాలు ఎప్పుడో పడ్డాయన్నమాట. తర్వాత ఆయన చనిపోయారు. అయితే ఆ టీం ఢిల్లీ వచ్చింది. వాళ్ళని కలిసాను. ఈ కలయిక మాకెంతో ప్రేరణనిచ్చింది. ఈ పద్దతిని మేము కరీంనగర్ జిల్లాలో ప్రారంభించాం. కోరండ, మన్నెంపల్లి అనే ఊళ్ళలో సినిమాలు వేశాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఊర్లకి వెళ్లి పిల్లలకి సినిమాలు చూపించాం. ఒక ఐదారేళ్ళ పాటు ఈ యాక్టివిటీ కొనసాగింది. మొదటిసారిగా రూరల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాం. దామోదర్‌రెడ్డి అని మిత్రుడుండేవాడు. వాళ్ళ ఊర్లో వరుసగా మూడు రోజులు మూడు సినిమాలు ప్రదర్శించాం.. అవి పథేర్ పాంచాలి, రషోమన్, బైసైకిల్ థీవ్స్… మూడు సినిమాలు పూర్తయ్యాకా, మూడో రోజు టేప్ రికార్డర్ పట్టుకెళ్ళి ఊర్లో అందరి అభిప్రాయాలు రికార్డు చేశాం. చాలామందికి పథేర్ పాంచాలి నచ్చింది. “ఏముంది సార్ దీన్ల, మా బతుకులే కనబడ్దాయ్” అని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. అది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అని అనిపించింది. అంతకంటే రియలిస్టిక్ అప్రోచ్ ఏముంటుంది? ఇలా సినిమా ప్రస్థానం కొనసాగింది. ఎన్నో పత్రికలలో సినీ వ్యాసాలు రాశాను.
కాలక్రమంలో యాక్టివిస్టులు దూరమవడం వల్ల, పారల్లల్ సినిమాలు ఎగువ మధ్యతరగతి చదువుకున్న మేధావులకి పరిమితం అయిపోవడం వల్ల, టివిలో రామాయణ భారతాలు సీరియల్స్‌గా రావడం వంటి పలు కారణాల వల్ల ఒక్క కరీంనగర్‌లో తప్ప మిగిలిన చోట్ల మా ఫిల్మ్ సొసైటీల కార్యకలాపాలు తగ్గిపోయాయి. కరీంనగర్‌లో మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో అతి కష్టం మీద మా సొసైటీకి అన్ని అధునాతన సౌకర్యాలున్న స్వంత ఆడిటోరియం ఏర్పర్చుకోగలిగాం.
వ్యాసాలు, మోనోగ్రాఫ్‌లు వదిలిపెడితే, డాక్యుమెంటరీ సినిమాల గురించి వదిలిపెడితే మీరు సినిమాలకి సంబంధించి దాదాపుగా ఏడు రచనలు చేశారు. వీటి నేపథ్యం గురించి, ఆయా పుస్తకాల ప్రత్యేకత గురించి చెప్తారా?
పత్రికల్లో అప్పుడప్పుడు వ్యాసాలు, సమీక్షలు రాసిన… క్రమం తప్పక ఒక ఫీచర్‌లా రాసింది మాత్రం పల్లకి వారపత్రికలోనే. డైరక్టర్స్ డైరీ అనే కాలమ్ రాశాను. నేను బాగా ఇష్టపడ్డ పారలల్ సినిమాల గురించి, వివిధ భాషలలో వాటిని తీసిన ఫిల్మ్ మేకర్స్‌ని పరిచయం చెయ్యాలని అనుకున్నాను. వాళ్ల బయోగ్రఫీ, వాళ్లు తీసిన సినిమాలు, వాళ్ళ ప్రతిభ, వారు కలిగించిన ప్రభావం చెప్పాలనుకున్నాను. అలా ఒక యాభై అరవై మంది గురించి రాశాను. వీటిని ఒక పుస్తక రూపంలో వేస్తే బాగుటుంది అని ఆలోచన వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1999లో హైదరాబాద్‍లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ వేడుకల్లో పుస్తకాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని మిత్రులు సూచించడంతో, వాటిని అప్‌డేట్ చేసి, రివైజ్ చేసి ‘నవ్య చిత్ర వైతాళికులు’ అనే పుస్తకం తీసుకొచ్చాను. ఆ పుస్తకంలో 54 మంది ఫిల్మ్ మేకర్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగా ఆ పుస్తకాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశాము. కన్నడ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
దీనికన్నా ముందు, అప్పట్లో ఆంధ్రభూమిలో ఆర్.వి. రామారావు గారుండేవారు. “మా పత్రికలో కూడా ప్రతి శుక్రవారం సినిమా పేజి ఉంది, దానికేమయినా రాయచ్చు కదా” అని అడిగారు. అప్పుడు ‘ఉమెన్ ఇన్ సినిమా’ పేరిట భారతీయ సినిమాలలో స్త్రీలు ప్రొటగనిస్ట్‌గా వచ్చిన చాలా సినిమాల గురించి రాశాను. దాన్ని ‘సినీ సుమాలు’ పేరుతో 1993లో పుస్తకంగా వేశాను. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో విశ్వనాథ్ గారు ఆవిష్కరించారు.
పిల్లల సినిమాలకి 1999 నవంబరులో హైదరాబాద్‍లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. అప్పటికి పిల్లల సినిమాలకి సంబంధించి ఏ పుస్తకాలు లేవు. పిల్లల సినిమాలను పరిచయం చేద్దాం పిల్లల సినిమాలను అనలైజ్ చేద్దామని ఒక పుస్తకం రాశాను. అది ‘బాలల చిత్రాలు’. ఇందులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్స్ ఎలా ఉంటాయి, నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, తెలుగులో వచ్చిన పిల్లల సినిమాలు ఏంటి, యానిమేషన్ సినిమాలు ఏంటి, పిల్లలంటే బాగా ఇష్టం ఉండి పిల్లల కోసం సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్స్ ఎవరు, ఛార్లీ చాప్లిన్, సత్యజిత్ రే నుంచి మొదలుపెట్టి ఎవరెవరున్నారో వాళ్ళ వర్క్స్, అవన్నీ కలిపి ఈ పుస్తకంగా వేశాం. ఈ పుస్తకాన్ని బి నర్సింగరావు గారి చొరవతో, సాయిప్రసాద్ అనే మిత్రుడు ఆంగ్లంలోకి అనువదించారు. రెండు పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించాం.
ఆ తరువాత వివిధ ఫెస్టివల్స్‌లో చూసిన సినిమాల గురించి రాసిన వ్యాసాలతో ’24 ఫ్రేమ్స్’ అనే పుస్తకం వేశాను. ఇక, ఎప్పుడైతే తెలంగాణా మూవ్‌మెంట్ ప్రారంభమయిందో, నేను కూడా నా ఓరియంటేషన్‌ని క్రమంగా తెలంగాణా సినిమాపైకి మార్చుకున్నాను. రీజినల్ సినిమాలో సబ్ రీజినల్ సినిమా అన్నమాట. బంగారు తెలంగాణలో సినిమా ఎలా ఉండాలసలు, అప్పటికే ఉన్న షార్ట్ ఫిలిమ్స్, కొత్త వాతావరణంలో తెలంగాణ సినిమా ఎలా ఉండబోతోంది, తెలంగాణ రావడానికి ఏం జరగాలి ఇలాంటి అంశాలతో రెండు పుస్తకాలు తెచ్చాను. 1. ”బంగారు తెలంగాణలో చలనచిత్రం’ 2. ”తెలంగాణ సినిమా దశ దిశ’. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఆ నేపథ్యంలో తెలంగాణా సినిమా ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి, ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ఓరియంటేషన్‍తో రాసిన ఆర్టికల్స్ ఈ రెండో పుస్తకంలో ఉన్నాయి.
సినిమాకి సాహిత్యానికి లంకె సినిమా పాటలు అంటారు, మీరు గుల్జార్ కవిత్వాని తెలుగులోకి అనువదించారు. అనువాదంలో మీకేదైనా సమస్యలు ఎదురయ్యాయా?
గుల్జార్ అనే పేరు తలచుకోగానే సంపూరన్ సింగ్ అనే ఆయన అసలు పేరు గుర్తుకొస్తుంది నాకు. గుల్జార్ అనే పదం పలకగానే నాలో ఒక స్పందన కలుగుతుంది, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బహుముఖీన ప్రజ్ఞాశాలి. ఆయన పాటలు రాశారు, డైలాగులు రాశారు, కవిత్వం రాశారు, సినిమాలు తీశారు. గుల్జార్ పరిచయం… అంటే వ్యక్తిగతంగా ఆయనతో కాదు, ఆయన సాహిత్యంతోటి, కవిత్వంతోటి తొలి పరిచయం 1970-71లో కలిగింది. మొదటగా ‘పరిచయ్’ సినిమాలోని “मुसाफिर हु यारो न घर है न ठिकाना” అనే పాట విని చాలా ఆనందించాను, ఎవరు రాసారీ పాట అని గుల్జార్ గురించి తెలుసుకున్నాను. ఆ తరువాత సినీ లోకంలో, సినీ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి గుల్జార్‌వి అనేక సినిమాలు చూశాను, పాటలు, డైలాగులు విన్నాను. ముఖ్యంగా ‘ఆనంద్’ సినిమాలో ఆయన రాసిన డైలాగులు ఇప్పటికీ ఆస్వాదిస్తాను. కొన్ని డైలాగులు ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటాయి. “बाबू मोशाय जिंदगी बड़ी होनी चाहिए लंबी नहीं” అంటే జీవితం ఉన్నతంగా ఉండాలి కానీ, దీర్ఘంగా ఉండడం వల్ల అర్థం లేదు అనే అద్భుతమైన భావన! రాజేష్ ఖన్నా, జానీవాకర్ కాంబినేషన్‌లో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. అలాగే ఇంకో సందర్భంలో “మౌత్ ఏక్ పల్ హై బాబూ మొషాయ్… ఆనేవాలే ఛే మహీనోం మె మై జో లాఖోం పల్ మై జీనేవాలా హూం ఉన్ కా క్యా హోగా” అంటాడు రాజేష్ ఖన్నా. ఇటువంటి డైలాగులు ఈ సినిమాలో ఎన్నో! ఆ తర్వాత గుల్జార్‌వి చాలా సినిమాలు.. ఇజాజత్, ఖుష్బూ, ఆంధీ… కోశిష్, చూశాను. ఇవన్నీ చాలా ఎఫెక్టివ్‌గా ఉండే సినిమాలు.
గుల్జార్ కవిత్వం చదివే పద్ధతి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన మేరునగ పర్వతంలా కనిపిస్తారు. నేను గుల్జార్ రాసిన కవిత్వాన్ని కూడా ఫాలో అవుతుంటాను. ఆయన రాసిన ‘గ్రీన్ పోయమ్స్’ చదివి ఇంప్రెస్ అయిపోయాను. ప్రకృతి, పర్యావరణం గురించి అద్భుతమైన కవితలవి. అలతి అలతి మాటలతో సూటిగా, స్థూలంగా, స్పష్టంగా చెప్పిన ఆ కవితలు నాకు బాగా నచ్చాయి. ఆయన అనుమతి పొంది ఆ పుస్తకాన్ని “ఆకుపచ్చ కవితలు” అనే పేరుతో అనువదించాను. ఈ పుస్తకం ద్వారా గుల్జార్ కవితలను తెలుగులో పరిచయం చేసే అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషం కలిగింది.
దానిలోంచి ఏదైనా కవితని వినిపిస్తారా?
అందులో నది అనే ఒక కవిత ఉంది. చాలా బావుంటుంది.
నది
తనలో తాను గుసగుసలాడుతూ
నది ప్రవహిస్తున్నది
చిన్న చిన్న కోరికలు తన హృదయంలో
కదలాడుతున్నాయి
జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ
కదిలిన నది
వంతెన మీది నుంచి
ప్రవహించాలనుకుంటోంది
చలి కాలం తన ముఖం పై మంచు
నిలుస్తుంది
గాలేమో నది ముఖాన్ని శుభ్రం చేస్తూ
వెళ్లిపోతుంది
కేవలం ఒక్కసారి గాలితో పాటు
అడవి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది
కొన్ని సార్లు వంతెనపై నుంచి రైలు
వెళ్లిపోతుంటే
ప్రవహిస్తున్న నది క్షణకాలం
నిలిచిపోతుంది
ఓ మంచి మొగుడు కావాలని ప్రార్థిస్తూ
పూలూ రెమ్మలూ సమర్పించిన
యువతి మొఖం మరోసారి చూడాలని
నది
అందమయిన యువతి ముఖబింబాన్ని
తన లోతుల్లో దాచుకుంది భద్రంగా.