అలాగే ‘సెప్టెంబర్’ అనే కవిత బాగుంటుంది. సంవత్సరంలో సెప్టెంబరు నెల ఎంతో ముఖ్యమైనది. ఆ నెలలో ఉండే వాతావరణాన్ని చాలా బాగా చెప్తారు గుల్జార్.
సెప్టెంబర్
ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో
ఆకాశానికి సుస్తీ చేస్తుంది
బహుజా అలర్జీ కావచ్చు
సెప్టెంబర్ రాగానే వర్షం వెనక్కి బడుతుంది
మురికిపట్టి మబ్బు తునకలు,
నురగలు కక్కుతున్న మద్యంలా
వుంటాయి
సాయంత్రానికి తేలుకుట్టినట్టు
వెన్ను మీద దుద్దుర్లు లేసి
ఆకాశం కోపంతో ఎర్రబడుతుంది
ఎన్నో రోజులు ఆకాశం దగ్గుతూ వుంటే
ఎరుపు నలుపుల గాలి దుమారాలు
చెలరేగుతుంటాయి
నా ఆకాశం సెప్టెంబర్ నెలలో
అనారోగ్యం పాలవుతుంది.
మనుషుల్లో ఉండే టచింగ్ భావాలను ఆయన చాలా హృద్యంగా చెప్తారు.
(తర్వాత ‘మబ్బుల్లో ఏమి దాగివుంది’, ‘మూసేస్తున్న బావి’, ‘థింపూ’ అనే కవితలు కూడా చదివి వినిపించారు.)
ఇలా ప్రకృతికీ, మనుషులకీ మధ్య ఉండే ఒక అద్భుతమైన సంబంధాన్ని చెప్పిన కవితలు, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
మీరు సొంతంగా అక్షరాల చెలిమె, మనిషి లోపల అనే కవితా సంకలనాలు తెచ్చారు కదా. వీటి నేపథ్యం వివరిస్తూ రెండు మూడు కవితలు వినిపిస్తారా?
నిజానికి నేను 1981లో వచ్చిన ‘లయ’ సంకలనం నాటి నుండే కవిత్వం రాస్తున్నాను. మధ్యలో సినిమాల వైపుకి వెళ్ళి మళ్ళీ పొయెట్రీ వైపుకు వచ్చాను.
1990లలో రవిచంద్ర అనే మిత్రుడు ‘మానేరు టైమ్స్’ అనే పత్రిక ఇక్కడ నడిపాడు. ఆ పత్రికలో ‘మానేరు తీరం’ కవిత్వం ఫీచర్‌గా వచ్చింది. చాలా వారాల పాటు ఇందులో కవితలు రాశాను. మనుషుల మధ్య అనుబంధాల గురించి ఎక్కువగా ఈ కవితలలో చెప్పాను. మనుషులలో ఆర్తి లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పాను. ఈ కవితలను 1998లో పుస్తక రూపంలోకి తెచ్చాను.
తర్వాత చాలాకాలం పాటు కవిత్వం చదువుతూ ఉండిపోయాను. రచనకు మాత్రం చాలా ఆలస్యంగా పూనుకొన్నాను.
ఐదేళ్ళ క్రితంలో లైఫ్‌లో అనుకోకుండా ఒక జోల్ట్ వచ్చింది. ఒక అనారోగ్యం సంభవించి, దాని ప్రభావం ఒక ఐదేళ్ళ పాటు తీవ్రంగా ఉండడం, ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవలసి రావడం…ఒక సాలిటరీ లైఫ్‌లోకి వెళ్ళిపోయాను. అంతర్ముఖీనత్వంలోకి వెళ్ళిపోయాను. ఈ సాలిటరీ పీరియడ్‍లో నాలో దాగిన కవి బయటకొచ్చాడు.
ఆ క్రమంలో మనిషి లోపల అనే పుస్తకం వేశాను. తర్వాత అక్షరాల చెలిమె అనే పుస్తకం తెచ్చాను.
మనిషి లోపల నుంచి రెండు కవితలు వినిపిస్తాను…
‘ఎందుకైనా మంచిది’ అనేది కవితా శీర్షిక
“ఎందుకైనా మంచిది
కనురెప్పలు తెరిచే వుంచాలి
ప్రకృతి ఏ అందమైన దృశ్యాన్నో
నీ కంటిలో వేసి పోవచ్చు
పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక
ఇంధ్ర ధనస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు
ఎందుకైనా మంచిది
పిడికిలి తెరిచే వుంచాలి
ఎవరైనా చేతిలో చెయ్యేసి
స్నేహహస్తం కలిపేసి పోవచ్చు
నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు
ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు
ఎందుకైనా మంచిది
హృదయం తెరిచే వుంచాలి
మనసు గల ఏ మనిషో
తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు
కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు
ప్రేమ సంతకం చేసి పోవచ్చు”
ఇలా మనిషనే వాడు ఓపెన్‌గా ఉండాలి అని చెప్పానీ కవితలో.
నేను అనారోగ్యంలోంచి బయటపడడానికి నా శ్రీమతి, సహచరి ఇందిర ఎంతో సహకరించింది. ఈ పుస్తకం ఆమెకే అంకితం చేశాను. “కలిసి బతుకుని పంచుకుందామని వచ్చి నాకు జీవితాన్నే ప్రసాదించిన సహచరి
ఇందిరకు” అని అంకిత వాక్యం రాసుకున్నాను. అలాగే ఆమె కోసం ఓ కవిత కూడా రాశాను. దాన్ని వినిపిస్తాను.
కవితా శీర్షిక ‘ఆమె‘.
నడిచినంత మేరా
స్నేహ పరిమళాలు
సీతాకోక చిలుకల్లా
విహరిస్తాయి
పూలన్నీ తలవంచి
సలాములు చేస్తాయి
ఆమె మాటల్నిండా
ఆత్మీయతా జల్లులు
పున్నమి వెన్నెల్లా
కురిసి మురిపిస్తాయి
నేలపై పరుచుకున్న
పచ్చదనమంతా
మనసును నింపేస్తుంది
ఆమె నవ్వుల నిండా
ఆత్మ గలిగిన భరోసా
తూర్పున ఆకాశంలో
ప్రాతఃకాలపు
వర్ణలిఖిత దృశ్యాల్లా మెరుస్తాయి
లోకంలోని ధైర్యమంతా
నాలోకి ప్రవహిస్తుంది.
ఆమె
సాన్నిహిత్యం నిండా
ప్రేమలు విరబూస్తాయి.
ఇలా రాసాను. ఇంకా ఈ పుస్తకంలో ఎలిజీలు ఉన్నాయి.
ఆ తర్వాత వచ్చిన పుస్తకం ‘అక్షరాల చెలిమె’. ఈ పుస్తకాన్ని వరవరరావు గారి ఆవిష్కరించారు. ఒక కవిగా ఆయన సాహిత్య ప్రభావం నా మీద చాలా ఉంది.
ఇందులోని ఒక కవితను చదువుతాను
కవితా శీర్షిక ‘కాగితం‘.
తెల్ల కాగితాన్ని ముందేసుకు కూర్చుంటాను
గంటల కొద్దీ రాత్రులూ పగళ్లూ
చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే వుంటుంది
ఇంకొంచెం సేపు నోట్లో నలుగుతూనో
తల పైన నృత్యం చేస్తూనో వుంటుంది
యమ యాతన
తెల్ల కాగితం పై నాలుగు అక్షరాలు పొదగడానికి
నాలుగు మాటలు అల్లడానికి
నాలోకి నేను ప్రవేశిస్తాను
నాకు తెలీందేమైనా దొరుకుతుందేమోనని
శారీరంలో ఏముంది అవయవాల పొందిక
మనసులోకి వెళ్ళాను
ఆత్మ లోకి తొంగి చూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు
నాలోనూ వున్నాయి
నాలోంచి సమాజం మీద పడ్డా
పొరలు పొరలుగా
విడిపోయి వున్న సమాజం
‘ఏకశిల’ కాదు, మొజైక్
లోపలా బయటా
ఈ బైఫోకల్ దృష్టి
నన్ను ‘ఇస్సుర్రాయి’ లో పడేసింది
చర్నింగ్ చర్నింగ్
అతలాకుతలం అంతర్మధనం
అప్పటి దాకా నాలో
మూసివున్న దర్వాజా
ఏదో తెరుచుకున్నట్టయింది
పిడికిట్లోంచి సన్నని ఇసుకేదో రాలి పోయినట్టు
ఏదో జారి పోతున్నది
చూద్దును కదా
కాగితం పై
కవిత్వం విచ్చుకుంటోంది.
(మరో కవిత ‘నువ్వు’ కూడా వినిపించారు).
ఆనంద్ గారూ, మీరు కవితలు రాశారు, ఫిల్మ్ సొసైటీలను అద్భుతంగా నడిపించారు. దానికి పర్యాయపదంగా మారింది మీ పేరు. ఈ క్రమంలోనే మీరు కొన్ని కథా సంకలనాలు కూడా తెచ్చారు కదా “కరీంనగర్ కథకులు” అని, దాని నేపథ్యం చెబుతారా?
గత నలభై ఏళ్ళుగా కవిత్వం, సినిమా పట్ల ఎంత ప్రేమతో ఉన్నానో, కథల పట్ల, నవలల పట్ల కూడా అంతే ప్రేమతో ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ‘శ్వేతరాత్రులు’ గురించి. 1992-93లో వచ్చింది.
‘శ్వేతరాత్రులు’ అనగానే దాస్తొయెవ్‌స్కీ పుస్తకం గుర్తొస్తుంది…
ఈ కథా సంకలనం పేరు కూడా అదే. దీనిలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, పి. చంద్ మొదలైన వారు రాసిన సెలెక్టెడ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ పుస్తకానికి కాళీపట్నం రామారావు గారు సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకాన్ని రావిశాస్త్రి గారికి అంకితమిచ్చారు. కథల ఎంపిక, డిటిపి, కవర్ డిజైన్‌లలో నా పాత్ర ఉంది. చంద్రగారితో ఆ పుస్తకానికి కవర్ పేజీ వేయించాను. ముందుమాట వరవరరావు గారిని నేనే అడిగి రాయించాను. అట్లా ఒక ముఖ్యమైన కథా సంకలనంలో నా పాత్రా ఉంది. ఆ తర్వాత వచ్చిన అనేక కథా సంకలనాల తయారీలోను పాలుపంచుకున్నాను.
ఈ జిల్లాలో సాహితీ గౌతమి అనే సంస్థ ఉంది. ఇందులో సభ్యులుగా ఉన్న కొందరు మిత్రులు ప్రతీ సంవత్సరం ఒక కథా సంకలనం తేవాలని అనుకుని ప్రయోగాలు చేశారు. దానిలో కూడా నేను వాళ్ళతో పాటు నడిచాను. ముఖ్యంగా కథా సంకలనాల విషయానికొస్తే బి.వి.ఎన్. స్వామి గారు కీలకమైన పాత్ర పోషించారు. నిజానికి ఆయనని ప్రధాన సంపాదకులు అనాలి. శ్రమంతా తనే పడ్డారు.
‘శ్వేతరాత్రులు’ సంకలనం వచ్చిన నాటికి ఆ రచయితలంతా చాలా ప్రసిద్ధులు. కానీ స్వామి గారి నేతృత్వంలో సాహితీ గౌతమి కొత్త తరం… 2000 తర్వాత వచ్చిన రచయితలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనీ, వారికి ఒక వేదిక కల్పించాలని వారి కథలను పుస్తకాలుగా తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ‘కుదురు’, ‘పంచపాల’ లాంటి పుస్తకాలు వెలువడ్డాయి. ఈ ఊపుతో వాళ్ళు ఇంకా చక్కని కథలు రాయగలిగితే, వాళ్ళు ఇంకా మంచి కథకులు అయ్యే అవకాశం ఉంది. ఇందులో నేను కూడా నా వంతు బాధ్యత నిర్వహించాను.
కథ, కవిత, నవల… ప్రక్రియ ఏదైనా… సృజనయే… అన్నీ సాహిత్యమే. ఆత్మ నుంచి, అనుభవం నుంచి వచ్చే వ్యక్తీకరణ ఏదైతే ఉందో అది ప్రతిభావంతంగా వ్యక్తీకరించబడినప్పుడు అది ఖచ్చితంగా చక్కని సాహిత్యంగా మిగులుతుందని నా అభిప్రాయం. అలాగే సినిమా కూడా. హృదయానికి తాకేలా ఉన్న సినిమా ఏదైనా పదికాలాల పాటు నిలుస్తుందని నేను భావిస్తాను.
వారాల ఆనంద్ గారూ, మా కోసం సమయం వెచ్చించి మీ వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం. నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.
(వారాల ఆనంద్, 8-4-641, హనుమాన్ నగర్, కరీంనగర్ – 505 001)