Site icon Sanchika

సంభాషణం: వారాల ఆనంద్ అంతరంగ ఆవిష్కరణ

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ కవి, అనువాదకులు, సినీ విశ్లేషకులు వారాల ఆనంద్ గారితో సంచిక జరిపిన సంభాషణం ఈ నెల ప్రత్యేకం. [/box]

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ సుప్రసిద్ధ కవి, అనువాదకులు, సినీ విశ్లేషకులు. కరీంనగర్ ఫిల్మ్ క్లబ్ వ్యవస్థాపకులు. కరీంనగర్ జిల్లా వేములవాడలో 1958 ఆగస్టు 21న జన్మించారు. ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలో గ్రంథపాలకునిగా ఉద్యోగ విరమణ చేశారు.

కవిత్వం రాయడమే కాదు, కవిత్వాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాశారు. 1989-90లలో పిల్లల కోసం కథలు రాశారు, అవి ‘ఆంద్రప్రభ’ వారపత్రికలో అచ్చయ్యాయి. పలు దిన వార పక్ష పత్రికలలో కవితలు, సినీ వ్యాసాలు రచించారు. తర్వాత దేశ విదేశాల పిల్లల సినిమాలపై పని చేశారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో జ్యూరీగా పని చేశారు. తెలుగు సినిమా సెన్సార్ బోర్డ్ సభ్యునిగా వ్యవహరించారు.

మానేరు తీరం, నవ్య చిత్ర వైతాళికులు, బాలల చిత్రాలు, సినీ సుమాలు, 24 ఫ్రేమ్స్, లయ, అనే పుస్తకాలను వెలువరించారు. 2014లో ‘మానేరు గల… గల’ (సాహితీ వ్యాసాలు), ‘బంగారు తెలంగాణలో చలనచిత్రం’, ‘మనిషి లోపల’ (కవిత్వం) అనే పుస్తకాలు వెలువడ్డాయి. ప్రముఖ హిందీ కవి గుల్జార్ రాసిన ‘గ్రీన్ పోయమ్స్’ అనే పుస్తకాన్ని ‘గుల్జార్ ఆకుపచ్చ కవితలు’గా అనువదించారు.

ఆనంద్ వారాల కవితలకు ఆంగ్ల అనువాదం ‘Signature Of Love’ పేరిట 2016లో వెలువడింది. అను బొడ్ల ఈ కవితలని అనువదించారు. అదే ఏడాది ‘మెరుపు’ అనే పుస్తకం కూడా ప్రచురించారు. 2017లో ‘అక్షరాల చెలిమె’ (కవిత్వం), ‘తెలంగాణ సినిమా దశ దిశ’ అనే పుస్తకాలను ప్రచురించారు. 2018లో ‘పైడి జయరాజ్’, ‘మిద్దె రాములు’ పై మోనోగ్రాఫ్‌లు వెలువరించారు.

12 ఫిబ్రవరి 2017న ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వారి ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు.

వారాల ఆనంద్ గారితో సంచిక జరిపిన ఇంటర్వ్యూ ఇది.

***

నమస్కారం వారాల ఆనంద్ గారూ…

నమస్కారమండీ.

ముందుగా మీ బాల్యం, కుటుంబం గురించి చెప్తారా? మీ చిన్ననాటి అనుభవాలు మిమ్మల్నెలా కవిత్వంవైపు, సినిమాలవైపు నడిపించాయో చెప్పండి.

1958 ఆగస్టు 21న నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు… కరీంనగర్ జిల్లా వేములవాడలో పుట్టాను. మా నాన్నగారు వాళ్ళది కరీంనగర్. కరీంనగర్‌లో మా నాన్న వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్ టౌన్‌ని స్టార్ట్ చేసిన ఫ్యామిలీ… ఒందించు అంటారు చూడండి… అలా. మా నానమ్మ పేరు సత్తెమ్మ. ఆమె మిఠాయి సత్తెమ్మగా చాలా పేరుపొందింది. కరీంనగర్ టౌన్‌లో మొట్టమొదటిసారిగా ఓ స్వీట్ షాప్ పెట్టిన ఘనత ఆమెది. నిజాం కాలం నుంచి తనకంటూ ఒక చరిత్రను కలిగి ఉంది నానమ్మ. మొత్తం కుటుంబాన్ని తన చేతుల మీదుగా వృద్ధి చేసింది. ఆమెతో పాటే ఆ స్వీట్ షాపూ పోయింది. నానమ్మది హైదరాబాద్‌కి చెందిన ఉప్పల్ ప్రాంతం. 1913-14 కాలంలో తాతయ్యని పెళ్ళి చేసుకుని కరీంనగర్ వచ్చేసింది. బహుశా నానమ్మ వాళ్ళకి ఉప్పల్ ఏరియాలో బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టుంది. ఇక్కడికి వచ్చి దాన్ని కొనసాగించిందామె. అప్పట్లో ఈ ఏరియాలో ఉన్న ముస్లిం జాగీర్‌దార్లు, జమీందార్లతో సన్నిహితంగా ఉండి, వారితో సత్యక్కా సత్యక్కా అని పిలిపించుకున్నది. ఆమె మిఠాయి దుకాణం ఈ ప్రాంతంలో కనీసం 30-40 సంవత్సరాలు లీడ్ చేసింది. ఆమెకి సంతానం లేకపోవడంతో మరిది పిల్లల్ని దత్తు తీసుకుంది.

మా నాన్నగారు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం రిటైరయ్యారు, ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఆయనకి చిన్నప్పటి నుండి కూడా హిందీ పాటలంటే బాగా ఇష్టం. నాకు ఊహ తెలిసేసరికే…. వాళ్ళకో గ్రూప్ ఉండేది. మా ఇంటికి ఎదురుగా విజయలక్ష్మి హోటల్ అని ఉండేది, అందరూ అక్కడ చేరి రేడియో పెట్టుకుని పాటలు వినడం, వీళ్ళూ పాడడం చేసేవారు… అదంతా ఓ మాహోల్‌లా ఉండేది. నాకు కాస్త జ్ఞానం కలిగేసరికి నేనూ ఆ మాహోల్‌లో ఉన్నాను. నాన్నగారు పాటలు పాడేవారు… ఇప్పటికీ పాడతారు.. ఆయనకు తలత్ మహమూద్ అంటే ప్రాణం! రోజూ ఉదయం పూట 7.30 నుంచి 8.30 వరకూ వచ్చే ‘పురానే గీతేం’ ఆయన వినడం, వినిపించడం  చిన్నప్పటి నుంచే నాలో తారాడాయి. నాకు తెలియకుండానే అది ఇంబైబ్డ్ ఇన్‌టు మై బాడీ అండ్ థింకింగ్.

కానీ చిన్నప్పుడు నేను చాలా ఒంటరిగా ఉండేవాడిని, నాకు స్వరంలో ఉన్న ఇబ్బంది కారణంగా నేను ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడిని కాను. ఇప్పుడు హాయిగా మాట్లాడగలుగుతున్నాను 🙂 ఇది నాలో చాలా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని కలుగజేసింది. ఒంటరిగా ఉండేవాణ్ణీ, కానీ చదువులో మామూలుగానే ఉండేవాణ్ణి. అన్ని రకాలుగా బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాను. మా నాన్నగారు టీచర్ కావడంతో… ఆయన నాకేం చెప్పలేదు కానీ… ఐదో క్లాసు వరకు నన్ను స్కూలుకి పంపలేదు, ఇంట్లోనే చదివించారు. బహుశా ఇది కూడా నా ఒంటరితనాన్ని మరింత పెంచి ఉండవచ్చు. నా లోని ఆ లోపం నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. స్కూల్లో చేరాక, నలుగురైదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, మామూలుగానే ఉండేవాడిని.

అయితే ఈ నేపథ్యం నుండి రావడం వల్లా నాకూ పాటలు ఎంతో ఇష్టమయిపోయాయి, ప్రతీ బుధవారం వచ్చే బినాకా గీత్ మాలా నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఎంతలా అంటే, లోకంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు రేడియో పట్టుకుని కూర్చునేంత. అది నా జీవితంలో భాగమైపోయింది.

అట్లా హైస్కూలు, డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు చాలా బ్రైట్ స్టూడెంట్‌నని అనిపించుకున్నాను. దాంతో చాలామందిలానే మెడిసిన్ చదవాలనుకుని ఆ ఎంట్రన్స్ పరీక్షలు రాశాను. ఒకటి రెండు మార్కులు తక్కువ రావడంతో సీట్ రాలేదు… అదంతా ఒక లైఫ్..

అలాగే ఎనిమిది తొమ్మిదో తరగతుల నుండి డిటెక్టివ్ నవలలు చదవడం అలవాటయ్యింది. మా ఇంటిదగ్గరే పుస్తకాలు అద్దెకిచ్చే షాప్ ఉండేది. అక్కడ్నించి పుస్తకాలు తెచ్చుకుని చదవడం జరిగింది. డిటెక్టివ్ నవలలు చదవడం పెద్దవాళ్ళు చూస్తే కోప్పడతారని చాటుగా చదివేవాడిని. ఈ అనుభవం అందరి జీవితాల్లోనూ ఉంటుంది కదా… మా మేనమామ గారు కూడా పుస్తకాలు బాగా చదివేవారు. ఆయన దగ్గర మంచి లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో శాంతినికేతన్ నవలా, అప్పటి రచయిత్రులు రాసిన అనేక సుప్రసిద్ధ నవలలు చదివాను. ఎన్ని పుస్తకాలు చదివినో ఎందుకో సంతృప్తి ఉండేది కాదు. డిగ్రీకి వచ్చిన తరువాత శ్రీశ్రీ పరిచయమయ్యాడు, అలాగే అంపశయ్య నవీన్! ఆయన ఇక్కడ డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉండేవాడు. ఆయన పరిచయమైన తర్వాత ఆయన రాసిన అంపశయ్య, గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు… ఇలాంటి నవలలు చదవడం తోటి మానసిక ఆలోచన పెరిగింది. అప్పట్లో ఎంత సీరియస్‌గా చదివేవాడినంటే… చివరికి మిగిలేది పుస్తకంలో పేజీలకు పేజీలు నోటికొచ్చేసేవి. ఆ క్రమంలో ‘కోమలి’ని ఒక ఆర్టిస్ట్ చూస్తే ఏమనుకుంటాడు, ఒక రైతు చూస్తే ఏమనుకుంటాడు… ఇలా ఆలోచిస్తూ, చాలావరకు నవల బై-హార్ట్ అయిపోయింది. అదే క్రమంలో అంపశయ్యను కూడా అట్లాగే చదివాను. ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు, ఎందుకంటే ఆ రచనలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ రకంగా నేను నా ఒంటరితనాన్నుంచి బయటపడి, నాలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుందని విశ్వసించాను. అలాగే మహాప్రస్థానం మొత్తం బైహార్ట్ వచ్చేది. (నిప్పులు కక్కుకుంటూ…. కవిత వినిపించారు).

దాదాపుగా అదే సమయంలో అంటే 1974-75లలో మా ప్రాంతంలో రెవల్యూషనరీ మూవ్‌మెంట్ బాగా ఊపందుకుంది. కొందరు మిత్రులు అండర్‌గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఉద్యమంలో పనిచేశారు. దానిలోనే చనిపోయినవాళ్లున్నారు. ఇదంతా నా జీవితంలో churning phase.

ఈ churning phase నుంచే రాయడం మొదలుపెట్టాను. నిజానికి మొట్టమొదటిసారిగా నేను రాసింది కథ అండీ. నేను కథలు కూడా రాశాను. ఇక్కడే చిత్రిక అని ఒక మ్యాగజైను వచ్చేది. నా కథని ఆ పత్రికకి ఇచ్చాను. అది ఆ పత్రికలో పబ్లిష్ అయింది. చాలా చిన్న కథ అండీ…

అది మీకు గుర్తుందా?

ఉంది. చాలా చిన్న కథ… (అంటూ ఆ కథని వివరించారు).

ఇలా కథలు, కవితలు… చాలా రాశాను. ఆంధ్రప్రభలోనూ, ఇతర పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. అదంతా ఒక డోల్‌డ్రమ్స్ ఉండే స్టేజ్…

కానీ 1977-78 తర్వాత ఎప్పుడైతే ఉస్మానియా క్యాంపస్‍లో ప్రవేశించానో, it was extrapolate. ఇక్కడి నేపథ్యం, ఈ వాతావరణంలో వుండి కుంచించుకుపోయిన మనస్తత్వంతో ఈ ఒంటరితనం నుంచి ఉస్మానియా వెళ్ళిన తర్వాత… నా ప్రపంచం మారింది. అక్కడి మిత్రులు, అక్కడి సర్కిలు, ఆ ఓపెన్‌నెస్… బాగా నచ్చాయి. ఆ క్రమంలోనే సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, జింబో, నందిగం కృష్ణారావు, మర్రి విజయ్ రావ్, ఇలా పెద్ద సర్కిల్ ఉండేది. వీళ్లతో కలిసి తిరగడంతో ఉస్మానియా రైటర్స్ సర్కిల్స్‌లో భాగమయ్యాను. నేను ఆ సంస్థ వ్యవస్థాపకులలో ఒకడిని. దానికి పేరు పెట్టింది కూడా నేనే.

అసలు ఎవరితో మాట్లాడని మనిషి… ఇలా మారడం….

ఆశ్చర్యమే. ఉస్మానియా నుంచి సెలవలకి మా ఊరికి వస్తే మిత్రులందరూ ఆశ్చర్యపోయారు. “అరె, నువ్వు క్యాంపస్‌కి పోయినక, ఇట్లయిపోయినవ్ ఏంది?” అన్నారు. ఇంగ్లీషులో మాట్లాడడం, కవిత్వం… ఇవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. క్యాంపస్‌లో మిత్రల ప్రభావం నాపై ఎంతో ఉంది. రెవల్యూషనరీ నేపథ్యం ఉన్నవారు, సాహిత్యలోకపు మిత్రులు.. ఇలా! క్యాంపస్‍లో ఉన్నది రెండేళ్ళే కానీ ఇట్ ఛేంజ్‌డ్ మై లైఫ్! అక్కడ రాయడం మొదలైంది. వీళ్లందరినీ చూస్తూ మనం కూడా రాయచ్చు కదా అనిపించి రాయడం మొదలుపెట్టాను. రాయడం, పత్రికలకు పంపడం చేశాను. ఆ క్రమంలో అలిశెట్టి ప్రభాకర్ దగ్గరస్ కావడం, అందరం కలిసి 1980-81లో ఒక పుస్తకం వేద్దామని ‘లయ‘ అని ఒక పుస్తకం వేశాం. ప్రభాకర్, నేను, జింబో, వఝల శివకుమార్, పి.యస్. రవీంద్ర అనే ఐదుగురం కలిసి పుస్తకం వేశాం. దానిలో అన్నీ మినీ పోయమ్స్.. అప్పుడు మినీ పోయమ్స్‌కి ఒక ఊపు ఉండేది.

ఈ నేపథ్యంలో.. నిజానికి నాకు కరీంనగర్‌లో కంటే వేములవాడలో బేస్ ఎక్కువ. ఎందుకంటే బాల్యమంతా అక్కడే గడిచింది, పైగా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎప్పుడూ ఇష్టం ఉంటుంది కదా.. మన ఇంట్లో ఉన్నప్పుడు నాన్న భయాలు, ఆంక్షలు, నిర్బంధాలు ఉంటాయి… అమ్మమ్మ వాళ్ళింట్లో అలాంటివేవీ ఉండవు. అట్లా ఎప్పుడు సెలవలొచ్చినా… ఛలో వేములవాడ! ఎందుకంటే అక్కడ నా మనస్తత్వం కలిసే మిత్రులున్నారు.. జింబో గానీ, శివకుమార్ గానీ అందరూ అక్కడే ఉండేవారు. అక్కడ ఓ సాహిత్య సంస్థ పెట్టాలని ఆలోచన చేశాము. జింబో సెక్రటరీగా, కవి చొప్పకట్ల చంద్రమౌళి గారు సలహాదారుగా ‘నటరాజ కళానికేతన్’ అనే సంస్థని స్థాపించారు. ఒక ఐదారేళ్లు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాము. జ్వాలముఖి, దాశరథి రంగాచార్య, శివారెడ్డి, దేవిప్రియ, నిఖిలేశ్వర్, గజ్జెల మల్లారెడ్డి, ఏటుకూరి ప్రసాద్, అంపశయ్య నవీన్, కుందుర్తి, నగ్నముని… ఇలా ఎందరెందరితోనో సాహిత్య సభలు సమావేశాలు జరిపాం. కుందుర్తి గారు వచ్చినప్పుడు మేమంతా మినీ పోయమ్స్ మూడ్‌లో ఉన్నాము, ఆయనేమో మినీ పోయమ్స్‌కి వ్యతిరేకి… లాంగ్ పోయమ్స్ రాయాలనేవారు. చిన్న కవితలు, మినీ కవితలు అసలు ఓ ప్రక్రియే కాదు అనేవారు. ఆ సభలోనే నాకు ఆయనకి అభిప్రాయభేదాలొచ్చాయి. బట్ హీ వజ్ మోర్ డెమోక్రటిక్. ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నా పిల్లల పట్ల ఎంత డెమాక్రటిక్‌గా ఉండేవారంటే… మినీ పోయమ్స్‌ ఎగ్జిబిషన్‌ పెడితే ఆయనే ఇనాగరేట్ చేశారు. మమ్మల్ని కౌగిలించుకుని అభినందించి, “లేదు, దీనితో పాటు లాంగ్ పోయమ్స్ కూడా రాయండి” అంటూ మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఈ సాహిత్యకార్యక్రమాల ప్రభావం కూడా నాపై పనిచేసింది. ఆ తరువాతే అందరం కలిసి 1981లో మొదటిసారిగా ‘లయ’ అనే పుస్తకం వేశాం.

దీనికి సమాంతరంగా కరీంనగర్‌లో మరో కార్యక్రమానికి బీజం పడింది. నేను డిగ్రీ చదువుతుండగా అంటే 1974-77 కాలంలో అంపశయ్య నవీన్, కోటేశ్వరరావు, డి. నర్సింరావు, మరికొంతమంది మిత్రులు ఇక్కడ ఫిల్మ్ క్లబ్ పెట్టాలని ఆలోచన చేశారు. వీళ్లంతా లెక్చరర్స్… మాకు పాఠాలు చెప్పారు. నేను సైన్సు స్టూడెంట్‌ని, వాళ్ళు ఎకనామిక్స్ లెక్చరర్స్ కాబట్టి నాకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పకపోయినా, దె వర్ అవర్ టీచర్స్… మా కాలేజీలో ఉండేవారు. మేం వెళ్ళి కలుస్తూండేవాళ్లం. ఫిల్మ్ క్లబ్ పెట్టారు. నేను అందులో చేరి, ఎంతోమందిని సభ్యులుగా చేర్పించాను. మీటింగులు ఆర్గనైజ్ చేయడం చేసేవాడిని. అప్పుడు వెంకటేశ్వర థియేటర్‌లో మొట్టమొదటిసారిగా మా క్లబ్ తరఫున సినిమా వేయడం జరిగింది. డిగ్రీ పూర్తవుతునే ఆ క్లబ్ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనడం, పారలల్ సినిమాపై ఇష్టం పెంచుకోడం జరిగింది.

అప్పటిదాకా ఎన్ని కమర్షియల్ సినిమాలు చూసినా, అప్పట్నించి మంచి క్లాసిక్స్ సినిమాలు చూడడం అలవాటయింది. ఎందుకంటే మంచి సినిమా వస్తే, మంచి సాహిత్యం వస్తుంది, మంచి పాటలు, మంచి డైలాగులు వచ్చేవి. నిజానికి నా ఐడెంటిటీని బాగా ప్రభావితం చేసిన సినిమా హృషీకేశ్ ముఖర్జీగారి ‘ఆనంద్’ అండీ. బహుశా పేరు ఒకటే అవడం వల్ల కూడా కావచ్చు, సినిమాలోని కంటెంట్ కానీ, డైలాగులు గాని నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఒక మనిషి ఎంత అతలాకుతలమైన పరిస్థితిలో కూడా, ఎంత డిప్రెస్డ్ కండీషన్‌లో కూడా ఎంత సంతోషంగా ఉండచ్చు అని చెప్పిన ఆ సినిమా ఇప్పటికీ నన్ను హాంట్ చేస్తూ ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకు నేనిప్పటికి ఓ వందసార్లు చూసుంటా.

కమర్షియల్ సినిమా, క్లాసిక్ సినిమా అనే విభేదాన్ని చూపించారు కదా, మరి ఆనంద్ కమర్షియల్ సినిమానా? క్లాసిక్ సినిమానా?

ఇక్కడ రెండు విషయాలండీ. నేనట్టుగానే సినిమాలని క్లాసిక్ సినిమా, కమర్షియల్ సినిమా అని రెండుగా డివైడ్ చేస్తారు. నిజానికి ఏ డివిజన్ అయినా తప్పు. I do admit that.. దేన్ని గూడా ఆర్ట్ సినిమా అనీ, కమర్షియల్ సినిమా అని, ఇంకేదో ఇంకేదో అని పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు. నేను అప్పుడు అదే ఫీలయ్యాను, ఇప్పుడూ అదే ఫీలవుతాను. అలవాటులో, వింటున్న క్రమంలో నేనా మాట వాడాను కానీ, నిజానికి సినిమా ఈజ్ సినిమా, పోయమ్ ఈజ్ పోయమ్. కానీ బాడ్ సినిమా, గుడ్ సినిమా ఉంటాయండీ. మనం కేటగిరీ చేసుకుంటే బాడ్ పోయమ్, గుడ్ పోయమ్.. ఎలా ఉంటాయో, అట్లాగే బాడ్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్ ఉంటాయి. ఈ కేటగిరైజేషన్‌ని నేను ఒప్పుకుంటాను. ఒక సినిమా నాకు మంచి సినిమానా కాదా చూస్తాను, నాకు మంచిదో కాదో చూశాకా, సమాజానికి మంచిదో కాదో చూస్తాను. అది కూడా చూడాల్సి వస్తుంది. ఈ రెండు యాస్పెక్ట్స్‌లోంచి చూస్తే ‘ఆనంద్’ వజ్ ఎ గుడ్ సినిమా.

కరీంనగర్ ఫిల్మ్ సొసైటీనీ స్థాపించడంలో సహాయం చేశారు, మెంబర్ కూడా అయ్యారు. ఆ తరువాత అటు రచనలు, ఇటు సినిమాల మీద మీ ఆసక్తి ఎలా సాగాయో చెప్పండి.

యాక్చువల్‌గా రైటింగ్స్ కన్నా ముందు సినిమాపైన అభిరుచి మొదలయింది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, బిమల్ రాయ్ సినిమాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అప్పటికి అలాంటి సినిమాలు ఉంటాయని కూడా తెలియదు. అట్లా ఈ సినిమాలు చూడడం ప్రారంభించిన తర్వాత ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్‌పోజర్ కూడా ఇక్కడే మొదలైంది నాకు.

సినిమాలు ఎలా తెప్పించేవారు ఇక్కడికి మీరు?

అదో పెద్ద చరిత్ర అండీ! నిజానికి ఇక్కడ మూడు థియేటర్లు ఉండేవి అప్పట్లో. వెంకటేశ్వర థియేటర్ అందులో ఒకటి. దీని ఓనర్లు జగన్మోహనరావు, మురళీమోహనరావు అని… వాళ్లు బాగా సపోర్ట్ చేసారు. మేం సోషల్‌గా ఉండడం వల్లో, మర్యాదగా ఉండడం వల్లో తెలియదు గానీ, దాదాపు 25-26 ఏళ్ళ పాటు ప్రతీ ఆదివారం ఉదయం థియేటర్‍లో మాకు స్లాట్ ఇచ్చారు. ఖర్చుల కోసం మూడు వందల నుండి ఐదు వందల రూపాయలు తీసుకునేవారు అంతే. అది పెద్ద సపోర్ట్.

ఇక సినిమాలు… సినిమాలని సెలెక్ట్ చేసుకోడమంటే.. సికింద్రాబాద్ లోని ఆర్.పి.రోడ్‌లో ఉన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరి ఆఫీసులకు వెళ్ళడం.. ఎన్నో మంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు… ఎవరి దగ్గర మంచి సినిమాలున్నాయో తెలుసుకోడం… ప్యాసా నుంచి మొదలుపెడితే… ఎన్ని మంచి సినిమాలో! అక్కడికి వెళ్ళడం, బుక్ చేసుకోవడం రావడం జరిగేది.

డబ్బుల కేనా?

ప్రతీదీ డబ్బులకే.. నథింగ్ ఈజ్ ప్రీ. ఇక్కడ మేం ఏం చేసామంటే.. మెంబర్‌షిప్ ఫీజు సంవత్సరానికి 25 రూపాయలు ఉండేది. మూడు నాలుగు వందల మంది సభ్యులుండేవారు. అప్పట్లో వేరే యావగేషన్ ఏదీ ఉండేది కాదు. టీవీ లేదు, వేరే యాక్టివిటీ లేదు. అప్పట్లో ఒక ఫోకస్డ్ వాతావరణం ఉండేది.

నిజానికి కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ స్థాపించిన తర్వాత అదొక ప్రోగ్రెస్సివ్ కార్యక్రమం అయింది. ఒక దశలో ఓ సభ్యుడి వల్ల సంస్థ కూడా కొంత అప్రెషన్‌ని ఎదుర్కోవలసి వచ్చింది. ఉద్యమ నేపథ్యం, ఉద్యమ భావాజాలానికి మద్దతు తెలిపేవాళ్ళ మీద దృష్టి ఉండేది. ఒక రకమైన భయంకరమైన వాతావరణం. సోషల్‌గా ఉంటున్నా కూడా నిఘాలో ఉన్నట్టే ఉండేది. ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ అలెర్ట్ అయిపోయేవారు. అయితే సినిమాలకి మాత్రం ఏ ఆటంకాలు రాలేదు.. మంచి సినిమాలు వేశాం. గురుదత్, విమల్ రాయ్, గుల్జార్, పారలల్ సినిమాతో పాటు… అప్పట్లో మిడిల్ సినిమా అని కూడా ఒకటి ఉండేది. హృషీకేశ్ ముఖర్జీ, బసు భట్టాచార్య, గురుదత్ సినిమాలను మిడిల్ సినిమాలు అనేవారు. ఇవి అటు ఆర్ట్ సినిమాలూ కావూ, అలా అని ప్యూర్ ఎంటర్‌టైనింగ్ సినిమాలు కావు.

మీ లిస్ట్‌లో రాజ్‍కపూర్, శాంతారం పేర్లు వినబడడం లేదు…

ఉన్నాయి. శాంతారం సినిమాలు చాలా వేశాం. జల్‌ బిన్ మఛ్లీ నృత్య్ బిన్ బిజ్లీ వంటివి చాలా సినిమాలు వేశాం. రాజ్‌కపూర్‌వి ఒకటో రెండో వేశాం. అనారీ… ఇంకా.. అయినా 70ల తర్వాత రాజ్‍కపూర్ వేడి తగ్గింది కదా. బాబీ తరువాత ఆయన ఓరియంటేషన్ మారింది కదా. అంతకంటే ముందు సినిమాలు కొంత మీనింగ్‌ఫుల్ సినిమాలు. అనారీ, శ్రీ420, ఆవారా, గంగా జమున కానివ్వండి… ఇలాంటివి.. చాలా మంచి సినిమాలు తీశారు. మేం ఫిల్మ్ క్లబ్ కొచ్చిందే 1975-76ల. అప్పటికే ఆయన కొంచెం స్లో అయిపోయాడు. ఆ తర్వాత ఇక అమితాబ్ బచ్చన్ హవా! ఒక రకంగా చెప్పాలంటే మా తరం కంటే ముందు తరం ఆయనది… అందుకని ఎక్కువ దూరం వెళ్ళలేదు. వ్యక్తిగతంగా మాకిష్టం ఉండచ్చు, అది వేరే సంగతి. ఇలా పారలల్ సినిమాలు అన్ని అప్పుడే చూడడం జరిగింది.

మాకు ఉన్న మరో రెండు ముఖ్యమైన సోర్సులు ఏంటంటే – సోవెక్స్‌పోర్ట్ అని సోవియట్ పిల్మ్స్ వాళ్ళ అవుట్‌లెట్ మద్రాసులో ఉండేది. అక్కడికెళ్ళి సోవియట్ సినిమలు… ఐసెన్‌స్టీన్ సినిమాలతో మొదలుపెడితే ఎన్ని సినిమాలు చూశామో… ఐసెన్‌స్టీన్, పుడోవ్‌కిన్… ఇలా. ముందు వాళ్ళకి ఉత్తరం రాస్తే, వాళ్ళు బాక్స్ పంపించేవాళ్లు. ట్రాన్స్‌పొర్టేషన్ ఛార్జిలు మాత్రం మేం పెట్టుకునేవాళ్లం.

ఇంకో సోర్స్ ఏంటంటే సి.ఎఫ్.ఎస్.ఐ. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని బొంబాయి కేంద్రంగా పనిచేసే సంస్థ. వాళ్ళకి బెంగుళూరులో బ్రాంచి ఉంది. మద్రాసులో బ్రాంచి ఉండేది. వాళ్ళకి రాస్తే, వాళ్ళు పిల్లల సినిమాలు పంపేవాళ్ళు. మా సొసైటీని బలోపేతం చెయ్యాలంటే ఈ 25/- రూపాయల సభ్యత్వం తోటి సాధ్యం కాదు అని అనుకున్నాం. ఎందుకంటే ‘ఉత్తమ చిత్రం’ అని  ఒక మ్యాగజైన్… హౌస్ జర్నల్ అని నడిపేవాళ్లం. ఇప్పటికీ వస్తోంది. ఇంకా సినిమా ప్రదర్శనకయ్యే వ్యయాలు… వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ నవంబరులో బాలల ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని అనుకున్నాం. పిల్లల సినిమాలు తెచ్చి ప్రదర్శించాం. వారం, పది రోజులు, నెల రోజులు… వరుసగా సినిమాలు ఆడిన రోజులున్నాయి. అదీ కూడా మార్నింగ్ షోస్. స్కూల్స్ ద్వారా ఆర్గనైజ్ చేసేవాళ్లం. రెండు రూపాయలు టికెట్ పెట్టేవాళ్లం. అట్లా డబ్బులు పోగు చేసి మిగతా యాక్టివిటిస్ కొనసాగించాం.

ఇంకొక సోర్స్ ఏంటంటే పూనా ఫిల్మ్ ఆర్కైవ్స్. పూనా ఫిల్మ్ ఆర్కైవ్స్ చక్కని సోర్సే కాని ఇట్ వజ్ ఎ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్…

ఏం? 

ఎందుకు బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ అంటే… వాళ్ళ కండీషన్ ఇలా ఉండేది: మీరు సినిమా అడిగితే, మేము యస్ అంటే… మీ మనిషి ఇక్కడికి రావాలి. మా మనిషి బాక్స్‌తో వస్తాడు. మీకు మాత్రం బాక్స్ ఇవ్వం. మనిషినీ, బాక్స్‌నీ తీసుకుని మీ ఊరెళ్లి స్క్రీనింగ్ చేసి మళ్ళా వాళ్ళని ఇక్కడికి పంపించాలి అనేవారు. ఇట్ వజ్ హెల్. ఎందుకంటే మాకు రైల్వే స్టేషన్ లేదు. మేం కాజీపేటకి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ్నించి పూనాకి…

ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే… ఫలానా అదివారం ఫలానా సినిమా అని ఎనౌన్స్ చేసేవాళ్ళం. ఒకసారి ఒక సినిమా ఎనౌన్స్ చేశాం. శుక్రవారం వరకు మాకు బాక్స్ చేరలేదు. శనివారం వస్తుందో రాదో తెలియదు. ఆదివారం సినిమా… అందరికీ చెప్పేసాం… ఆదివారం పొద్దున్న 7.30 – 8.00 గంటల కల్లా అందరూ వచ్చేసారు. బాక్స్ రాలేదు. ఆర్గనైజర్స్‌ని తిడతారు. వాళ్ళని ఎలా ఫేస్ చెయ్యాలి? ఒకసారైతే ఒక అట్ట మీద ‘ఈ రోజు సినిమా లేదు’ అని రాసిపెట్టి పారిపోయాం. ఇట్లా ఆర్గనైజ్ చేస్తే ఎట్లా అని అడిగేవారు. సినిమా కోసం వచ్చాం, వేయాలి కదా లేదంటే ఎలా? అనేవారు. సహజంగానే ఆర్గనైజర్లు ఆన్సరబుల్. ఇలాంటివి ఎన్నో జరిగాయి.

ఒకసారి స్మితాపాటిల్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టాము. బాంబే నుంచి ప్రింట్లు బుక్ చేశాము. రావాలి. ఫ్రైడే వరకు ఏ బాక్సూ రాలేదు. మూవీ షెడ్యూల్ చేసేసాం, ఇనాగరేషన్‌కి ఐఎఎస్ ఆఫీసర్ వస్తున్నారు, అంతా సెట్ అయ్యింది. కానీ బాక్స్ రాలేదు. ఏం చేయడం… ఆ రోజు శనివారం..

హైదరాబాద్‌లో ఓ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ‘అర్థ్’ అనే సినిమా ఉందని నాకు తెలుసు. శనివారం వెళ్ళి ‘అర్థ్’ తీసుకురావాలి. సికింద్రాబాద్‌లో వాళ్ళు శనివారం నాడు హాఫ్ డేనే పనిచేస్తారు. బస్సులో వెళ్లినా పన్నెండు గాని చేరతామో లేదో తెలియదు… అప్పుడు మా కజిన్ ఒకతను టెలిఫోన్స్‌లో పనిచేస్తున్నాడు… అతను సలహా ఇచ్చాడు. నువ్వెళ్లు… నేను వాళ్ళని ఫోన్‍లో లైన్‌లో పెడతాను, వాళ్ళని ఆపుతాను అని. అలా అరగంటకి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తూ… నేను వెళ్ళేవరకు వాళ్లు ఉండేలా చూశాడు. అలా బాక్స్ తీసుకువచ్చి సినిమా వేశాం.

ఇలా ఈ కార్యక్రమాలు కొనసాగుతుండగా… 80లలో నేను సర్వీస్‌లోకి వచ్చాను.

ఏ ఉద్యోగం అండీ?

నేను కాలేజీలో లైబ్రేరియన్‌ని. నా ఫస్ట్ పోస్టింగ్ మంథనిలో. అయితే మంథనిలో నేను అడ్జస్ట్ కాలేకపోయాను. నాలుగు నెలల తర్వాత రిక్వెస్ట్ పెట్టుకుంటే, సిరిసిల్లకి మార్చారు. అమ్మమ్మ వాళ్లు వేములవాడ కదా, నేను సిరిసిల్లలో రూమ్ తీసుకుని ఉంటానంటే, అట్లెట్లా… ఇక్కడ్నించి పది కిలోమీటర్లే కదా, ఇక్కడే ఉండు… అని బలవంతం చేశారు మావాళ్ళు. అలా ఓ అరు నెలలు ఏడాది గడిచాకా, వేములవాడలో కూడా ఒక ఫిల్మ్ సొసైటీ పెడదాం అని ఆలోచన వచ్చింది. అప్పట్లో వేములవాడలో ఒకే ఒక థియేటర్ ఉండేది. రేకుల థియేటర్. అందులో సినిమాలు వేద్దాం, ఫిల్మ్ క్లబ్ పెడదామని మిత్రులతో ఆలోచించాను. ఆర్గనైజేషన్ తయారైంది. యాభైమంది సభ్యులు చేరారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ వారి అఫ్లియేషన్ తెచ్చాను. అలా 1981లో వేములవాడ ఫిల్మ్ సొసైటీ ప్రారంభమైంది.

వేములవాడలో ఫిల్మ్ సొసైటీ అంటే అందరూ నవ్వేవాళ్ళు. ఆ ఊర్లో ఫిల్మ్ సొసైటీ ఏంటి? అని. నేను కూడా ఎవరికీ తెలియదు. మా కొలీగ్స్‌కి కూడా నేను ఏమీ చెప్పలేదు. ఇనాగరేషన్‌కి అందరినీ పిలిచాము. మొదటి సినిమా సత్యజిత్ రే ‘షత్‌రంజ్‌ కే ఖిలాడీ’. అప్పట్లో వేములవాడ పాపులేషన్‌లో బ్రాహ్మణులు ఎక్కువ. వాళ్ళల్లో టీచర్లు ఎక్కువ. ఇదేదో కొత్త ఆలోచన, పారలల్ సినిమా అంటున్నారు, చూద్దాం అని వచ్చారు. మేం సినిమా వేసాం. అది వాళ్ళకు అర్థం కాలేదు. మమ్మల్ని ఏమీ అనలేరు. అయినా చూశారు, భరించారు. అప్పటికి నేను కూడా ఆ సినిమా చూడలేదు. నేను అప్పుడే మొదటిసారి చూశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, కాని వాళ్ళకు కాలేదు. మేమేమీ చేయలేము కదా.

తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వేశాం. ఈసారి మృణాళ్ సేన్ ‘మృగయా’. హిందీ సినిమా. ఈ సినిమా విషయంలో ఓ గమ్మత్తైన అనుభవం జరిగింది. బాక్సు నేరుగా వేములవాడ రావాలి. అప్పట్లో హైదరాబాద్ నుంచి వేములవాడకు ఒకే ఒక బస్సు ఉండేది. అది రాత్రి పది గంటలకు వేములవాడ వచ్చేది. పదిగంటల వరకు బస్‍స్టాప్‌లో నేను పి.ఎస్. రవీంద్ర, కిరణ్ (సెక్రటరీ) అందరం అక్కడ ఉండి బాక్స్ తీసుకుని థియేటర్‌కి పంపించాం. మావాళ్ళ ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. పొద్దున్న ఏడు గంటలకి ఆపరేటర్ ఫోన్ చేశాడు. “సార్, ఏదో సినిమా వచ్చింది, మేరీ గాయ్ అని. మీరేదో సినిమా అన్నారు. ఇది ఇంకేదో బాక్స్ వచ్చింది, ఆ బాక్స్ రాలేదు” అన్నాడు. “బాక్స్ వచ్చిందయ్యా, అదే పంపించాం” అని నేనంటాను. “బాక్స్ వచ్చింది సార్, కానీ దాని మీద మేరీ గాయ్ అని ఉంది. ఆవు అంటున్నారు. ఆవేంటి సార్, మీరు ఇంకేదో సినిమా అన్నారు, మృణాళ్ సేన్ అన్నారు… కానీ ఇది వేరేది” అన్నాడు. ఒకవేళ బాక్స్ మిస్‌ప్లేస్ అయ్యిందా అని డౌట్ వచ్చింది. ఒకవేళ బాక్సులేమయినా తారుమారయ్యాయా అనిపించి, నేను రవీంద్ర థియేటర్‍కి వెళ్ళాం. తీరా చూస్తే… బాక్స్ మీద ఇంగ్లీశులో mrigaya అని రాసుంది. ఆపరేటర్ కన్‌ప్యూజ్ అయి మేరీ గాయ్ అని చదివి మమ్మల్ని కంగారు పెట్టాడు. 🙂 ఎంతో టెన్షన్‌గా వెళ్ళాం. సినిమా ఎనౌన్స్ చేసాకా వేయకపోతే, అందరూ నిరాశపడతారు, విమర్శిస్తారు. విషయం తెలిసాకా, అమ్మయ్య అనుకున్నాం. ఇలాంటి అనుభవాలెన్నో కలిగాయి.

తర్వాత జగిత్యాలలో ఫిల్మ్ క్లబ్ స్థాపించాం. తర్వాత మిత్రులతో సిరిసిల్లలో ఫిల్మ్ క్లబ్ స్థాపించాము. ఇక మెట్‌పల్లి, పెద్దపల్లి, కోరుట్ల, గోదావరి ఖని, ఎల్లారెడ్డి పేట… అలా మొత్తం మా జిల్లాలో ఎనిమిది ఊర్లలో ఫిల్మ్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది ఫిల్మ్ సొసైటీలకి ఒక అండర్‌ కరెంట్‌ లైన్ ఉండేది, ఒక కామన్ థాట్ ఉండేది, యాక్టివిస్ట్‌లు కామనే. ఎప్పుడైనా ఒక సినిమా తేస్తే ఈ ఎనిమిది కేంద్రాలలోనూ ప్రదర్శించేవాళ్ళం. అదొక మూవ్‌మెంట్.

అప్పటికి నేనింకా సాహిత్యం పట్ల సీరియస్‌గా లేను. చదువుతున్నాను, చదవడం ఎప్పుడూ తగ్గలేదు. రాయడం మాత్రం రకరకాల కారణాల తోటి… జరగలేదు.

సినిమా వేరు, కవిత్వం వేరు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. రెండూ వ్యక్తీకరణే. మీరు చెత్త సినిమాలు చూసి ఎట్లా అయితే సినిమా పనికిరాదంటారో, చెత్త కవిత్వాన్ని మేము కూడా అట్లానే అంటున్నాం అని వాదించేవాడిని. కవిత్వం, సినిమా మధ్య డిఫరెన్షియేషన్ ఉండాల్సిన అవసరం లేదని చాలామందిని ఒప్పించాను కూడా.

‘లయ’ తర్వాత దాదాపు పదేళ్ల పాటు, ఇంకా ఎక్కువేనేమో, నేను కవిత్వానికి దూరంగా ఉన్నాను. అయితే ఎప్పుడు మొదలయిందో గుర్తు లేదు గాని సినిమాల మీద రాయడం మొదలుపెట్టాను. ఒకసారి నేను, అలిశెట్టి ప్రభాకర్ పల్లకి పత్రికాఫీసుకు వెళ్ళాం. అక్కడ విక్రమ్ అని ఎడిటర్ ఉండేవాడు. ఆయన అడిగాడు, “సార్ మీరు సినిమాల మీద మాకు రాయచ్చు కదా” అని. ‘డైరక్టర్స్ డైరీ’ అనే కాలం చాలాకాలం రాశాను వాళ్ళకి. ఆ తరువాత 1989లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఢిల్లీ వెళ్ళాను. ఇట్ వజ్ ఐ ఓపెనింగ్. ఏదో సినిమాలు చూస్తున్నా, రాస్తున్నాం కానీ… అంతర్జాతీయ సినిమాకొచ్చేసరికి ఎంత తేడా అనిపించింది. అప్పట్లో ఉదయం పత్రికలో పతంజలి గారు ఎడిటర్‌గా ఉన్నారు. మాటల సందర్భంలో ఢిల్లీ వెళ్తున్నానని ఆయనతో చెప్తే “ఆ సినిమాల గురించి మాకు రాయండి” అన్నారు. “అక్కడ్నించి ఎలా రాయను సార్?” అన్నాను. “రాసి ఫాక్స్ చేయండి. ఫాక్స్‌కి డబ్బులిచ్చేస్తాం” అన్నారు. అలా ఢిల్లీ నుండి ‘బైలైన్’ పేరిట అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన సినిమాల సమీక్షలు రాసాను. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ శ్యామ్ బెనెగళ్‌నీ, ఆదూరి గోపాలకృష్ణన్‍నీ కలిసాను. చాలామందితో మాట్లాడాను, ఇంటర్వ్యూలు చేశాను.

అప్పట్లో కేరళలో ఒక మూవ్‍మెంట్ వచ్చింది. ఒడెస్సా కలెక్టిక్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. జాన్ అబ్రహం అనే ఫిల్మ్ మేకర్.. ‘అగ్రహారితల్ కళుతై’, ‘అమ్మ అరియన్’ సినిమాల దర్శకుడు.. ఆయన ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు. ఊరురా సినిమా చూపించడం ఈ మూవ్‌మెంట్ లక్ష్యం. 16 ఎం ఎం ఫార్మాట్‌లో సినిమాలు తీసుకెళ్ళి ఓ పది మంది మిత్రులు కలిసి ఒడెస్సా అనే పేరుతో ప్రదర్శించడం మొదలుపెట్టారు. జాన్ అబ్రహం దీనికి లీడర్. ఆయన మొదలుపెట్టి మంచి సినిమాలన్నింటినీ కేరళలో విస్తృతంగా ప్రదర్శించారు. సినిమా పూర్తయ్యాక జోలె పట్టేవారు. ప్రజలు ఎంతిచ్చినా తీసుకునేవారు. అలా పోగు చేసిన డబ్బుతో ఆయన ‘అమ్మ అరియన్’ సినిమా తీశారు. అంటే ఇవాళ మనం ఏదైతే క్రౌడ్ ఫండింగ్ అంటున్నామో, దానికి మూలాలు ఎప్పుడో పడ్డాయన్నమాట. తర్వాత ఆయన చనిపోయారు. అయితే ఆ టీం ఢిల్లీ వచ్చింది. వాళ్ళని కలిసాను. ఈ కలయిక మాకెంతో ప్రేరణనిచ్చింది. ఈ పద్దతిని మేము కరీంనగర్ జిల్లాలో ప్రారంభించాం. కోరండ, మన్నెంపల్లి అనే ఊళ్ళలో సినిమాలు వేశాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఊర్లకి వెళ్లి పిల్లలకి సినిమాలు చూపించాం. ఒక ఐదారేళ్ళ పాటు ఈ యాక్టివిటీ కొనసాగింది. మొదటిసారిగా రూరల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాం. దామోదర్‌రెడ్డి అని మిత్రుడుండేవాడు. వాళ్ళ ఊర్లో వరుసగా మూడు రోజులు మూడు సినిమాలు ప్రదర్శించాం.. అవి పథేర్ పాంచాలి, రషోమన్, బైసైకిల్ థీవ్స్… మూడు సినిమాలు పూర్తయ్యాకా, మూడో రోజు టేప్ రికార్డర్ పట్టుకెళ్ళి ఊర్లో అందరి అభిప్రాయాలు రికార్డు చేశాం. చాలామందికి పథేర్ పాంచాలి నచ్చింది. “ఏముంది సార్ దీన్ల, మా బతుకులే కనబడ్దాయ్” అని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. అది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అని అనిపించింది. అంతకంటే రియలిస్టిక్ అప్రోచ్ ఏముంటుంది? ఇలా సినిమా ప్రస్థానం కొనసాగింది. ఎన్నో పత్రికలలో సినీ వ్యాసాలు రాశాను.

కాలక్రమంలో యాక్టివిస్టులు దూరమవడం వల్ల, పారల్లల్ సినిమాలు ఎగువ మధ్యతరగతి చదువుకున్న మేధావులకి పరిమితం అయిపోవడం వల్ల, టివిలో రామాయణ భారతాలు సీరియల్స్‌గా రావడం వంటి పలు కారణాల వల్ల ఒక్క కరీంనగర్‌లో తప్ప మిగిలిన చోట్ల మా ఫిల్మ్ సొసైటీల కార్యకలాపాలు తగ్గిపోయాయి. కరీంనగర్‌లో మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో అతి కష్టం మీద మా సొసైటీకి అన్ని అధునాతన సౌకర్యాలున్న స్వంత ఆడిటోరియం ఏర్పర్చుకోగలిగాం.

వ్యాసాలు, మోనోగ్రాఫ్‌లు వదిలిపెడితే, డాక్యుమెంటరీ సినిమాల గురించి వదిలిపెడితే మీరు సినిమాలకి సంబంధించి దాదాపుగా ఏడు రచనలు చేశారు. వీటి నేపథ్యం గురించి, ఆయా పుస్తకాల ప్రత్యేకత గురించి చెప్తారా?

పత్రికల్లో అప్పుడప్పుడు వ్యాసాలు, సమీక్షలు రాసిన… క్రమం తప్పక ఒక ఫీచర్‌లా రాసింది మాత్రం పల్లకి వారపత్రికలోనే. డైరక్టర్స్ డైరీ అనే కాలమ్ రాశాను. నేను బాగా ఇష్టపడ్డ పారలల్ సినిమాల గురించి, వివిధ భాషలలో వాటిని తీసిన ఫిల్మ్ మేకర్స్‌ని పరిచయం చెయ్యాలని అనుకున్నాను. వాళ్ల బయోగ్రఫీ, వాళ్లు తీసిన సినిమాలు, వాళ్ళ ప్రతిభ, వారు కలిగించిన ప్రభావం చెప్పాలనుకున్నాను. అలా ఒక యాభై అరవై మంది గురించి రాశాను. వీటిని ఒక పుస్తక రూపంలో వేస్తే బాగుటుంది అని ఆలోచన వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1999లో హైదరాబాద్‍లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ వేడుకల్లో పుస్తకాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని మిత్రులు సూచించడంతో, వాటిని అప్‌డేట్ చేసి, రివైజ్ చేసి ‘నవ్య చిత్ర వైతాళికులు’ అనే పుస్తకం తీసుకొచ్చాను. ఆ పుస్తకంలో 54 మంది ఫిల్మ్ మేకర్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగా ఆ పుస్తకాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశాము. కన్నడ ఫిల్మ్ ‍మేకర్ గిరీష్ కాసరవల్లి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

దీనికన్నా ముందు, అప్పట్లో ఆంధ్రభూమిలో ఆర్.వి. రామారావు గారుండేవారు. “మా పత్రికలో కూడా ప్రతి శుక్రవారం సినిమా పేజి ఉంది, దానికేమయినా రాయచ్చు కదా” అని అడిగారు. అప్పుడు ‘ఉమెన్ ఇన్ సినిమా’ పేరిట భారతీయ సినిమాలలో స్త్రీలు ప్రొటగనిస్ట్‌గా వచ్చిన చాలా సినిమాల గురించి రాశాను. దాన్ని ‘సినీ సుమాలు’ పేరుతో 1993లో పుస్తకంగా వేశాను. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో విశ్వనాథ్ గారు ఆవిష్కరించారు.

పిల్లల సినిమాలకి 1999 నవంబరులో హైదరాబాద్‍లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. అప్పటికి పిల్లల సినిమాలకి సంబంధించి ఏ పుస్తకాలు లేవు. పిల్లల సినిమాలను పరిచయం చేద్దాం పిల్లల సినిమాలను అనలైజ్ చేద్దామని ఒక పుస్తకం రాశాను. అది ‘బాలల చిత్రాలు’. ఇందులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్స్ ఎలా ఉంటాయి, నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, తెలుగులో వచ్చిన పిల్లల సినిమాలు ఏంటి, యానిమేషన్ సినిమాలు ఏంటి, పిల్లలంటే బాగా ఇష్టం ఉండి పిల్లల కోసం సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్స్ ఎవరు, ఛార్లీ చాప్లిన్, సత్యజిత్ రే నుంచి మొదలుపెట్టి ఎవరెవరున్నారో వాళ్ళ వర్క్స్, అవన్నీ కలిపి ఈ పుస్తకంగా వేశాం. ఈ పుస్తకాన్ని బి నర్సింగరావు గారి చొరవతో, సాయిప్రసాద్ అనే మిత్రుడు ఆంగ్లంలోకి అనువదించారు. రెండు పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించాం.

ఆ తరువాత వివిధ ఫెస్టివల్స్‌లో చూసిన సినిమాల గురించి రాసిన వ్యాసాలతో ’24 ఫ్రేమ్స్’ అనే పుస్తకం వేశాను. ఇక, ఎప్పుడైతే తెలంగాణా మూవ్‌మెంట్ ప్రారంభమయిందో, నేను కూడా నా ఓరియంటేషన్‌ని క్రమంగా తెలంగాణా సినిమాపైకి మార్చుకున్నాను. రీజినల్ సినిమాలో సబ్ రీజినల్ సినిమా అన్నమాట. బంగారు తెలంగాణలో సినిమా ఎలా ఉండాలసలు, అప్పటికే ఉన్న షార్ట్ ఫిలిమ్స్, కొత్త వాతావరణంలో తెలంగాణ సినిమా ఎలా ఉండబోతోంది, తెలంగాణ రావడానికి ఏం జరగాలి ఇలాంటి అంశాలతో రెండు పుస్తకాలు తెచ్చాను. 1. ”బంగారు తెలంగాణలో చలనచిత్రం’ 2. ”తెలంగాణ సినిమా దశ దిశ’. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఆ నేపథ్యంలో తెలంగాణా సినిమా ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం జరగాలి, ప్రభుత్వం ఏం చేయాలి? ఆ ఓరియంటేషన్‍తో రాసిన ఆర్టికల్స్ ఈ రెండో పుస్తకంలో ఉన్నాయి.

    

సినిమాకి సాహిత్యానికి లంకె సినిమా పాటలు అంటారు, మీరు గుల్జార్‌ కవిత్వాని తెలుగులోకి అనువదించారు. అనువాదంలో మీకేదైనా సమస్యలు ఎదురయ్యాయా?

గుల్జార్ అనే పేరు తలచుకోగానే సంపూరన్ సింగ్ అనే ఆయన అసలు పేరు గుర్తుకొస్తుంది నాకు. గుల్జార్ అనే పదం పలకగానే నాలో ఒక స్పందన కలుగుతుంది, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బహుముఖీన ప్రజ్ఞాశాలి. ఆయన పాటలు రాశారు, డైలాగులు రాశారు, కవిత్వం రాశారు, సినిమాలు తీశారు. గుల్జార్‌ పరిచయం… అంటే వ్యక్తిగతంగా ఆయనతో కాదు, ఆయన సాహిత్యంతోటి, కవిత్వంతోటి తొలి పరిచయం 1970-71లో కలిగింది. మొదటగా ‘పరిచయ్’ సినిమాలోని “मुसाफिर हु यारो न घर है न ठिकाना” అనే పాట విని చాలా ఆనందించాను, ఎవరు రాసారీ పాట అని గుల్జార్‌ గురించి తెలుసుకున్నాను. ఆ తరువాత సినీ లోకంలో, సినీ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి గుల్జార్‌వి అనేక సినిమాలు చూశాను, పాటలు, డైలాగులు విన్నాను. ముఖ్యంగా ‘ఆనంద్’ సినిమాలో ఆయన రాసిన డైలాగులు ఇప్పటికీ ఆస్వాదిస్తాను. కొన్ని డైలాగులు ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటాయి. “बाबू मोशाय जिंदगी बड़ी होनी चाहिए लंबी नहीं” అంటే జీవితం ఉన్నతంగా ఉండాలి కానీ, దీర్ఘంగా ఉండడం వల్ల అర్థం లేదు అనే అద్భుతమైన భావన! రాజేష్ ఖన్నా, జానీవాకర్ కాంబినేషన్‌లో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. అలాగే ఇంకో సందర్భంలో “మౌత్ ఏక్ పల్ హై బాబూ మొషాయ్… ఆనేవాలే ఛే మహీనోం మె మై జో లాఖోం పల్ మై జీనేవాలా హూం ఉన్ కా క్యా హోగా” అంటాడు రాజేష్ ఖన్నా. ఇటువంటి డైలాగులు ఈ సినిమాలో ఎన్నో! ఆ తర్వాత గుల్జార్‌వి చాలా సినిమాలు.. ఇజాజత్, ఖుష్బూ, ఆంధీ… కోశిష్, చూశాను. ఇవన్నీ చాలా ఎఫెక్టివ్‌గా ఉండే సినిమాలు.

గుల్జార్ కవిత్వం చదివే పద్ధతి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన మేరునగ పర్వతంలా కనిపిస్తారు. నేను గుల్జార్ రాసిన కవిత్వాన్ని కూడా ఫాలో అవుతుంటాను. ఆయన రాసిన ‘గ్రీన్ పోయమ్స్’ చదివి ఇంప్రెస్ అయిపోయాను. ప్రకృతి, పర్యావరణం గురించి అద్భుతమైన కవితలవి. అలతి అలతి మాటలతో సూటిగా, స్థూలంగా, స్పష్టంగా చెప్పిన ఆ కవితలు నాకు బాగా నచ్చాయి. ఆయన అనుమతి పొంది ఆ పుస్తకాన్ని “ఆకుపచ్చ కవితలు” అనే పేరుతో అనువదించాను. ఈ పుస్తకం ద్వారా గుల్జార్ కవితలను తెలుగులో పరిచయం చేసే అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషం కలిగింది.

దానిలోంచి ఏదైనా కవితని వినిపిస్తారా?

అందులో నది అనే ఒక కవిత ఉంది. చాలా బావుంటుంది.

నది

తనలో తాను గుసగుసలాడుతూ

నది ప్రవహిస్తున్నది

చిన్న చిన్న కోరికలు తన హృదయంలో

కదలాడుతున్నాయి

జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ

కదిలిన నది

వంతెన మీది నుంచి

ప్రవహించాలనుకుంటోంది

చలి కాలం తన ముఖం పై మంచు

నిలుస్తుంది

గాలేమో నది ముఖాన్ని శుభ్రం చేస్తూ

వెళ్లిపోతుంది

కేవలం ఒక్కసారి గాలితో పాటు

అడవి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది

కొన్ని సార్లు వంతెనపై నుంచి రైలు

వెళ్లిపోతుంటే

ప్రవహిస్తున్న నది క్షణకాలం

నిలిచిపోతుంది

ఓ మంచి మొగుడు కావాలని ప్రార్థిస్తూ

పూలూ రెమ్మలూ సమర్పించిన

యువతి మొఖం మరోసారి చూడాలని

నది

అందమయిన యువతి ముఖబింబాన్ని

తన లోతుల్లో దాచుకుంది భద్రంగా.

అలాగే ‘సెప్టెంబర్’ అనే కవిత బాగుంటుంది. సంవత్సరంలో సెప్టెంబరు నెల ఎంతో ముఖ్యమైనది. ఆ నెలలో ఉండే వాతావరణాన్ని చాలా బాగా చెప్తారు గుల్జార్.

సెప్టెంబర్

ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో

ఆకాశానికి సుస్తీ చేస్తుంది

బహుజా అలర్జీ కావచ్చు

సెప్టెంబర్ రాగానే వర్షం వెనక్కి బడుతుంది

మురికిపట్టి మబ్బు తునకలు,

నురగలు కక్కుతున్న మద్యంలా

వుంటాయి

సాయంత్రానికి తేలుకుట్టినట్టు

వెన్ను మీద దుద్దుర్లు లేసి

ఆకాశం కోపంతో ఎర్రబడుతుంది

ఎన్నో రోజులు ఆకాశం దగ్గుతూ వుంటే

ఎరుపు నలుపుల గాలి దుమారాలు

చెలరేగుతుంటాయి

నా ఆకాశం సెప్టెంబర్ నెలలో

అనారోగ్యం పాలవుతుంది.

మనుషుల్లో ఉండే టచింగ్ భావాలను ఆయన చాలా హృద్యంగా చెప్తారు.

(తర్వాత ‘మబ్బుల్లో ఏమి దాగివుంది’, ‘మూసేస్తున్న బావి’, ‘థింపూ’ అనే కవితలు కూడా చదివి వినిపించారు.)

ఇలా ప్రకృతికీ, మనుషులకీ మధ్య ఉండే ఒక అద్భుతమైన సంబంధాన్ని చెప్పిన కవితలు, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

మీరు సొంతంగా అక్షరాల చెలిమె, మనిషి లోపల అనే కవితా సంకలనాలు తెచ్చారు కదా. వీటి నేపథ్యం వివరిస్తూ రెండు మూడు కవితలు వినిపిస్తారా?

నిజానికి నేను 1981లో వచ్చిన ‘లయ’ సంకలనం నాటి నుండే కవిత్వం రాస్తున్నాను. మధ్యలో సినిమాల వైపుకి వెళ్ళి మళ్ళీ పొయెట్రీ వైపుకు వచ్చాను.

1990లలో రవిచంద్ర అనే మిత్రుడు ‘మానేరు టైమ్స్’ అనే పత్రిక ఇక్కడ నడిపాడు. ఆ పత్రికలో ‘మానేరు తీరం’ కవిత్వం ఫీచర్‌గా వచ్చింది. చాలా వారాల పాటు ఇందులో కవితలు రాశాను. మనుషుల మధ్య అనుబంధాల గురించి ఎక్కువగా ఈ కవితలలో చెప్పాను. మనుషులలో ఆర్తి లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పాను. ఈ కవితలను 1998లో పుస్తక రూపంలోకి తెచ్చాను.

తర్వాత చాలాకాలం పాటు కవిత్వం చదువుతూ ఉండిపోయాను. రచనకు మాత్రం చాలా ఆలస్యంగా పూనుకొన్నాను.

ఐదేళ్ళ క్రితంలో లైఫ్‌లో అనుకోకుండా ఒక జోల్ట్ వచ్చింది. ఒక అనారోగ్యం సంభవించి, దాని ప్రభావం ఒక ఐదేళ్ళ పాటు తీవ్రంగా ఉండడం, ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవలసి రావడం…ఒక సాలిటరీ లైఫ్‌లోకి వెళ్ళిపోయాను. అంతర్ముఖీనత్వంలోకి వెళ్ళిపోయాను. ఈ సాలిటరీ పీరియడ్‍లో నాలో దాగిన కవి బయటకొచ్చాడు.

ఆ క్రమంలో మనిషి లోపల అనే పుస్తకం వేశాను. తర్వాత అక్షరాల చెలిమె అనే పుస్తకం తెచ్చాను.

మనిషి లోపల నుంచి రెండు కవితలు వినిపిస్తాను…

‘ఎందుకైనా మంచిది’ అనేది కవితా శీర్షిక

“ఎందుకైనా మంచిది

కనురెప్పలు తెరిచే వుంచాలి

ప్రకృతి ఏ అందమైన దృశ్యాన్నో

నీ కంటిలో వేసి పోవచ్చు

పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక

ఇంధ్ర ధనస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకైనా మంచిది

పిడికిలి తెరిచే వుంచాలి

ఎవరైనా చేతిలో చెయ్యేసి

స్నేహహస్తం కలిపేసి పోవచ్చు

నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు

ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకైనా మంచిది

హృదయం తెరిచే వుంచాలి

మనసు గల ఏ మనిషో

తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు

కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు

ప్రేమ సంతకం చేసి పోవచ్చు”

ఇలా మనిషనే వాడు ఓపెన్‌గా ఉండాలి అని చెప్పానీ కవితలో.

నేను అనారోగ్యంలోంచి బయటపడడానికి నా శ్రీమతి, సహచరి ఇందిర ఎంతో సహకరించింది. ఈ పుస్తకం ఆమెకే అంకితం చేశాను. “కలిసి బతుకుని పంచుకుందామని వచ్చి నాకు జీవితాన్నే ప్రసాదించిన సహచరి

ఇందిరకు” అని అంకిత వాక్యం రాసుకున్నాను. అలాగే ఆమె కోసం ఓ కవిత కూడా రాశాను. దాన్ని వినిపిస్తాను.

కవితా శీర్షిక ‘ఆమె‘.

నడిచినంత మేరా

స్నేహ పరిమళాలు

సీతాకోక చిలుకల్లా

విహరిస్తాయి

పూలన్నీ తలవంచి

సలాములు చేస్తాయి

ఆమె మాటల్నిండా

ఆత్మీయతా జల్లులు

పున్నమి వెన్నెల్లా

కురిసి మురిపిస్తాయి

నేలపై పరుచుకున్న

పచ్చదనమంతా

మనసును నింపేస్తుంది

ఆమె నవ్వుల నిండా

ఆత్మ గలిగిన భరోసా

తూర్పున ఆకాశంలో

ప్రాతఃకాలపు

వర్ణలిఖిత దృశ్యాల్లా మెరుస్తాయి

లోకంలోని ధైర్యమంతా

నాలోకి ప్రవహిస్తుంది.

ఆమె

సాన్నిహిత్యం నిండా

ప్రేమలు విరబూస్తాయి.

ఇలా రాసాను. ఇంకా ఈ పుస్తకంలో ఎలిజీలు ఉన్నాయి.

ఆ తర్వాత వచ్చిన పుస్తకం ‘అక్షరాల చెలిమె’. ఈ పుస్తకాన్ని వరవరరావు గారి ఆవిష్కరించారు. ఒక కవిగా ఆయన సాహిత్య ప్రభావం నా మీద చాలా ఉంది.

ఇందులోని ఒక కవితను చదువుతాను

కవితా శీర్షిక ‘కాగితం‘.

తెల్ల కాగితాన్ని ముందేసుకు కూర్చుంటాను

గంటల కొద్దీ రాత్రులూ పగళ్లూ

చేతిలో కలం కాసేపు నిశ్చలంగానే వుంటుంది

ఇంకొంచెం సేపు నోట్లో నలుగుతూనో

తల పైన నృత్యం చేస్తూనో వుంటుంది

యమ యాతన

తెల్ల కాగితం పై నాలుగు అక్షరాలు పొదగడానికి

నాలుగు మాటలు అల్లడానికి

నాలోకి నేను ప్రవేశిస్తాను

నాకు తెలీందేమైనా దొరుకుతుందేమోనని

శారీరంలో ఏముంది అవయవాల పొందిక

మనసులోకి వెళ్ళాను

ఆత్మ లోకి తొంగి చూశాను

నిజంగానే నాకు తెలీని విషయాలు

నాలోనూ వున్నాయి

నాలోంచి సమాజం మీద పడ్డా

పొరలు పొరలుగా

విడిపోయి వున్న సమాజం

‘ఏకశిల’ కాదు, మొజైక్

లోపలా బయటా

ఈ బైఫోకల్ దృష్టి

నన్ను ‘ఇస్సుర్రాయి’ లో పడేసింది

చర్నింగ్ చర్నింగ్

అతలాకుతలం అంతర్మధనం

అప్పటి దాకా నాలో

మూసివున్న దర్వాజా

ఏదో తెరుచుకున్నట్టయింది

పిడికిట్లోంచి సన్నని  ఇసుకేదో రాలి పోయినట్టు

ఏదో జారి పోతున్నది

చూద్దును కదా

కాగితం పై

కవిత్వం విచ్చుకుంటోంది.

(మరో కవిత ‘నువ్వు’ కూడా వినిపించారు).

ఆనంద్ గారూ, మీరు కవితలు రాశారు, ఫిల్మ్ సొసైటీలను అద్భుతంగా నడిపించారు. దానికి పర్యాయపదంగా మారింది మీ పేరు. ఈ క్రమంలోనే మీరు కొన్ని కథా సంకలనాలు కూడా తెచ్చారు కదా “కరీంనగర్ కథకులు” అని, దాని నేపథ్యం చెబుతారా?

గత నలభై ఏళ్ళుగా కవిత్వం, సినిమా పట్ల ఎంత ప్రేమతో ఉన్నానో, కథల పట్ల, నవలల పట్ల కూడా అంతే ప్రేమతో ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ‘శ్వేతరాత్రులు’ గురించి. 1992-93లో వచ్చింది.

శ్వేతరాత్రులు’ అనగానే దాస్తొయెవ్‌స్కీ పుస్తకం గుర్తొస్తుంది…

ఈ కథా సంకలనం పేరు కూడా అదే. దీనిలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, పి. చంద్ మొదలైన వారు రాసిన సెలెక్టెడ్ స్టోరీస్‌ ఉన్నాయి. ఈ పుస్తకానికి కాళీపట్నం రామారావు గారు సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకాన్ని రావిశాస్త్రి గారికి అంకితమిచ్చారు. కథల ఎంపిక, డిటిపి, కవర్ డిజైన్‌లలో నా పాత్ర ఉంది. చంద్రగారితో ఆ పుస్తకానికి కవర్ పేజీ వేయించాను. ముందుమాట వరవరరావు గారిని నేనే అడిగి రాయించాను. అట్లా ఒక ముఖ్యమైన కథా సంకలనంలో నా పాత్రా ఉంది. ఆ తర్వాత వచ్చిన అనేక కథా సంకలనాల తయారీలోను పాలుపంచుకున్నాను.

ఈ జిల్లాలో సాహితీ గౌతమి అనే సంస్థ ఉంది. ఇందులో సభ్యులుగా ఉన్న కొందరు మిత్రులు ప్రతీ సంవత్సరం ఒక కథా సంకలనం తేవాలని అనుకుని ప్రయోగాలు చేశారు. దానిలో కూడా నేను వాళ్ళతో పాటు నడిచాను. ముఖ్యంగా కథా సంకలనాల విషయానికొస్తే బి.వి.ఎన్. స్వామి గారు కీలకమైన పాత్ర పోషించారు. నిజానికి ఆయనని ప్రధాన సంపాదకులు అనాలి. శ్రమంతా తనే పడ్డారు.

‘శ్వేతరాత్రులు’ సంకలనం వచ్చిన నాటికి ఆ రచయితలంతా చాలా ప్రసిద్ధులు. కానీ స్వామి గారి నేతృత్వంలో సాహితీ గౌతమి కొత్త తరం… 2000 తర్వాత వచ్చిన రచయితలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనీ, వారికి ఒక వేదిక కల్పించాలని వారి కథలను పుస్తకాలుగా తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ‘కుదురు’, ‘పంచపాల’ లాంటి పుస్తకాలు వెలువడ్డాయి. ఈ ఊపుతో వాళ్ళు ఇంకా చక్కని కథలు రాయగలిగితే, వాళ్ళు ఇంకా మంచి కథకులు అయ్యే అవకాశం ఉంది. ఇందులో నేను కూడా నా వంతు బాధ్యత నిర్వహించాను.

కథ, కవిత, నవల… ప్రక్రియ ఏదైనా… సృజనయే… అన్నీ సాహిత్యమే. ఆత్మ నుంచి, అనుభవం నుంచి వచ్చే వ్యక్తీకరణ ఏదైతే ఉందో అది ప్రతిభావంతంగా వ్యక్తీకరించబడినప్పుడు అది ఖచ్చితంగా చక్కని సాహిత్యంగా మిగులుతుందని నా అభిప్రాయం. అలాగే సినిమా కూడా. హృదయానికి తాకేలా ఉన్న సినిమా ఏదైనా పదికాలాల పాటు నిలుస్తుందని నేను భావిస్తాను.

వారాల ఆనంద్ గారూ, మా కోసం సమయం వెచ్చించి మీ వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

నమస్కారం. నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.

(వారాల ఆనంద్, 8-4-641, హనుమాన్ నగర్, కరీంనగర్ – 505 001)

Exit mobile version