Site icon Sanchika

ఇంటి దేవత

[dropcap]“అ[/dropcap]మ్మా! హైదరాబాదు వచ్చేయి. నాకు ఎక్కువకాలం సెలవు దొరకదు. పోనీ నీ కోడలిని నీకు సాయంగా ఉంచుదామన్న వినోద్‌ని ఇంటిదగ్గిర చూసేవాళ్ళు వుండరు.” అన్నాడు భార్గవ అరుంధతితో.

“నేను రానురా… నా పుట్టిల్లు మెట్టినిల్లు ఈ రాజమండ్రీ. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తూ వెళ్ళిపోవాలి. నా కోరిక కాదనకు.” అంది అరుంధతి.

“అబ్బా…. ఇక్కడ గోదావరి ఉంటే హైదరాబాద్‌లో మంజీరా నది వుంది. అన్నీ పవిత్ర నదులే. నీ చాదస్తం కాని మా ఇబ్బంది గ్రహించుకోవు.” అన్నాడు భార్గవ చిరాకుగా.

“నా గురించి ఏమీ భయంలేదు. నువ్వు వెళ్ళు. నాకు చూడాలని ఉంటే ఫోను చేస్తాను. వద్దుగాని.”

“ఆలా అంటావు కానీ నువ్వు ఫోను చేయవు. పక్కింటి ఆంటీ ఫోను చేసారు. నీకు బాగాలేదని.!”

“ఒకపని చేద్దాం. నాకు తెలిసిన ఒక పేద కుటుంబంలో రాజమ్మ అనే మనిషి వున్నారు. ఆవిడను మన అవుట్ హవుసులో ఫ్రీగా వుండమంటాను. ఆవిడకు నేను సాయం చేసినట్టు ఉంటుంది. నీకు నా గురించి దిగులు ఉండదు. సరేనా?”

“సరే! ఆవిడను పిలిపించు. నేను మాటాడుతాను.” అన్నాడు భార్గవ.

అరుంధతి సాయంకాలం రమ్మని రాజమ్మకి కబురు పెట్టింది. రాజమ్మ తన కూతుర్ని తీసుకుని వచ్చింది. అరుంధతి చెప్పినట్టు ఒక్కరు కాదు తల్లి కూతురు ఇద్దరు వుంటారు.

సరే మరీ మంచిది అనుకుని “రాజమ్మగారు మా అమ్మని మీకు అప్పగిస్తున్నాను. జాగ్ర్తత్తగా చూడండి” అంటూ “నీ పేరు ఏమిటమ్మా? ఏం చదువుకున్నావ్…” అడిగాడు భార్గవ ఆ అమ్మాయిని.

“నా పేరు మణిమాల. టెన్త్ చదివాను”. అంది ఆ అమ్మాయి.

“ఇంటి ఖర్చు రాయడం, కరెంట్ బిల్లు, ఫోను బిల్లు కట్టడం, అమ్మకి కావలసినవి తీసుకురావడం ఇంటిపనులు వంట చేయడం అన్ని మీరిద్దరూ చూసుకోండి. అమ్మ కోరి మిమ్మల్ని పిలిచినందుకు నమ్మకం నిలబెట్టుకోండి ”అంటూ అప్పగించాడు.

“ఎంతమాట బాబూ. కంటికి రెప్పలా చూసుకుంటాం. అరుంధతిగారి బాధ్యత మాది.” అంది రాజమ్మ.

భార్గవకు వాళ్ళని చూస్తే నమ్మకం కుదిరింది. రెండురోజులు చూసి నిశ్చింతగా భార్గవ హైదరాబాదు వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళాక భార్య గిరిజతో చెప్పాడు. అరుంధతి కోసం చేసిన ఏర్పాటు గురించి.

“ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. అలా అని అత్తయ్యగారిని ఒంటరిగా వదలలేం. చూద్దాం….” అంది గిరిజ.

భార్గవకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వినోద్ స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు తలకి గాయం తగిలి తలలో నరాలు దెబ్బతిన్నాయి. ఎందరు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన మామూలు మనిషి కాలేదు. అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. గిరిజ ఇల్లు కదలడానికి లేదు. రెండవ వాడు ప్రమోద్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు.

రోజు అరుంధతికి ఫోనుచేసి “ఎలా వున్నావ్? రాజమ్మగారు మాల సరిగా వున్నారా? నిన్ను బాగా చూస్తున్నారా” అంటూ అడిగి తెలుసుకుంటాడు.

బాగానే గడిచిపోతోంది. మాల చురుకైంది. కంప్యూటర్ నాలెడ్జ్ వుంది. అన్ని పనులు ఆన్‌లైన్‍లో చేయగలదు. ఇంటిపని వంటపని రాజమ్మ చేస్తే బజారుకి వెళ్లడం లాటి బయటపనులు మాల చేస్తోంది. నమ్మకంగా పరిశుభ్రంగా ఇంటిని అరుంధతిని చూస్తున్నారు ఇద్దరూ.

హార్ట్ పేషంట్ అయిన అరుంధతికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది. అప్పుడు భార్గవ వెంటనే వస్తూ వుంటాడు. అలాగే ఈ సారి బాగా నొప్పి వస్తే మాల ఫోను చేసింది. ప్రమోద్ పరీక్షలు రాసి ఖాళీగా వుండటంతో అతడిని తీసుకుని వచ్చాడు.

అరుంధతి తేరుకుని ఇంటికి వచ్చింది.

“అమ్మ ప్రమోద్ కూడా ఇక్కడ ఉంటాడు. హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం ఆడవాళ్ళూ కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది” అన్నాడు.

“మంచిది అలాగే వుంచు. ఐనా వీడిపెల్లి చూడనిదే నేను ఎక్కడికి వెళ్ళను. ఈసారి కంగారుపడి రావద్దు” అంది అరుంధతి.

“రాకుండా ఎలా వుంటాను? ఇప్పుడు ప్రమోద్ ఉంటాడు పర్వాలేదులే” అన్నాడు భార్గవ.

హైదరాబాదు వెళ్ళగానే గిరిజ మండిపడింది. “అదేమిటండి ప్రమోద్‌ని రాజమండ్రిలో ఎందుకు వదిలారు? మణిమాల వయసులోవున్న పిల్ల. ఏదైనా అనర్థం జరిగితే? మీకు అంత తెలీదా…”

“నన్ను ఏమి చేయమంటావ్? అమ్మని రమ్మంటే రాదు. వాళ్లిద్దరూ ఆడవాళ్లు హాస్పటల్ చుట్టూ ఎలా తిరుగుతారు? ప్రమోద్ వుద్యోగం వచ్చేవరకు ఎలాగా ఖాళీగా ఉంటాడు. నేనిక సెలవు పెడితే వచ్చే ప్రమోషన్ పోతుంది”అన్నాడు భార్గవ.

చేసేది ఏమి లేక గిరిజ ఊరుకుంది. నిజమే అతడి బాధ అతనికి ఉందిమరి. ప్రమోద్‍కి వుద్యోగం రాలేదు. నాన్నమ్మకి తోడుగా బాగానే ఉపయోగ పడ్డాడు.

ఎలాగా ప్రమోద్ బాబు వున్నాడు కదాని రాజమ్మ అడిగింది “అరుంధతమ్మ ఒకసారి మావూరు వెళ్లివస్తాను. అక్కడ నాకు పేదవారికి గవర్నమెంట్ ఇచ్చిన భూమి పట్టా వుంది. అది అమ్మి మాలకి పెళ్లి చేస్తాను. నాకు కూడా పెద్ద వయసు వచ్చింది. ఓపిక ఉండగానే చక్కబెట్టుకుంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు.” అంటూ.

“సరే అలాగే వెళ్లి నీ పని చూసుకుని రా…. నా మనవడు వున్నాడు గాఁ…” అంది అరుంధతి.

రాజమ్మ మర్నాడే వూరికి వెళ్ళింది.

అప్పటికే మణిమాలా ప్రమోదలకి బాగా చనువు ఏర్పడింది. సరదాగా కొట్టుకోడం గారాలుపోవడం అలకలు బతిమాలు కోడాలూ పేచీపడితే నాన్నమ్మ రాజీ చేయడం…..ఆలా గడిచిపోతోంది.

వాళ్ళిద్దరి చిలిపి కయ్యాలూ సరదాలు గమనించిన నాన్నమ్మకి మనసులో ఆలోచన వచ్చింది.

దానికితోడు రాజమ్మ కూడా కూతురు పెళ్లి చేయాలనీ చెప్పింది. అందుకే వాళ్ళు చనువుగా ఉంటే మందలించలేదు. సరికదా ప్రోత్సహించింది. కొడుకు కోడలు ఏమంటారో అని సందేహించలేదు.

మణిమాల బుద్ధిమంతురాలు. ఇంటిపనిలో మెళకువలు తెలిసినది. చదువులు ఉద్యోగాలు చేసేవారి కోరికలు వేరుగా ఉంటాయి.

కనుక ఒక పేద పిల్లకి ఆసరా జీవితం ఇచ్చినట్టు ఉంటుంది. భార్గవ కుటుంబానికి ఉపయోగంగాను ఉంటుంది అని ఆలోచన చేసింది.

అయితే గిరిజకి కోపం వస్తుంది. వినోద్ ఎటూ వుద్యోగం చేయలేడు. పెళ్లి చేయకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే మణిమాల అందర్నీ ఆదరించాలి. ఆ పిల్ల తత్వం అలాటిది. ఇంతకంటే ఏమికావాలి ?అని ముందుచూపుతో ధైర్యం చేసింది.

రాజమ్మ నెలరోజుల్లో తన పని పూర్తి చేసుకుని వచ్చాక “రాజమ్మ… నీ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకో. మణిమాలకి ప్రమోద్‌కీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను….” అని చెప్పింది.

రాజమ్మకి ఆవిడమాటలు కలో నిజమో తెలియలేదు. ఆవిడ పెద్దమనసుకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. కన్నీళ్లతో పాదాలకు నమస్కరించి, “అమ్మగారు ఈ పేదరాలికి అంతటి భాగ్యమా…. నమ్మలేక పోతున్నాను. ఒక్కసారి అబ్బాయికి కోడలు గారికి చెప్పండి….” అంది.

“చెబితే ఈ పెళ్లి జరగదు. ప్రమోద్ మాలా చాల దగ్గిర అయ్యారు. వాళ్ళని విడదీసే పాపం చేయకూడదు.”

“కానీ మేము ఏదో కావాలని చేశామని కోడలు గారు కోపగిస్తారు. మా మీద నిందలు వేస్తారు.”

“పర్వాలేదు నేను భరిస్తాను. దేనికైనా సిద్ధపడతాను. నీకు నచ్చకపోతే చెప్పు. నీ కూతురును తీసుకుని వెళ్ళిపో”. ఇక మాకు కనిపించకు. “

రాజమ్మ కూతురును చాటుకి పిలిచి అడిగింది.

“మణీ నిజం చెప్పు నువ్వు ప్రమోద్ బాబు తప్పు చేశారా?”

మణిమాల తల ఊపింది నిజమే అన్నట్టు. ఇక మాటాడలేక తల పట్టుకుంది రాజమ్మ.

భయపడుతూనే అరుంధతికి ఆమోదం తెలిపింది.

వెంటనే రామాలయం పూజారిగారికి కబురుపెట్టి పెళ్లి ఏర్పాట్లు చేయమని పదివేలు ఇచ్చింది. తన మంగళ సూత్రాలను ఒక జత బంగారు గాజులను బ్యాంకు లాకర్ నుంచి తెచ్చి పెళ్లి చేసింది. పూజారిగారికి భార్యకి పట్టు బట్టలు పెట్టింది. వాళ్ళనే కన్యాదానం చేయమంది. ఆయనకు మగపిల్లలు వున్నారు. ఆడపిల్ల లేదు. అయన సంతోషించాడు. ఇంతటి గొప్ప వరం ఇచ్చినందుకు ఆవిడను మెచ్చుకున్నాడు.

పిల్లలిద్దరూ చిలక గోరింకల్లా తిరుగుతుంటే సంతోషంగా వున్నా…. మనసులో కొడుకు కోడలికి సంజాయిషీ చెప్పుకోవాలి తప్పదు అని అనుకుంది అరుంధతి.

అంతలో ప్రమోద్‌కి హైదరాబాదులో జాబ్ వచ్చింది. ఇప్పుడు మణిమాలను కూడా ప్రమోద్‌తో పంపాలి. కనుక పెళ్ళి విషయం చెప్పితీరాలి.

భార్గవను, గిరిజను రమ్మని కబురుచేసి ప్రమోద్‌ని పంపింది. వాళ్లు వచ్చారు.

“భార్గవా గిరిజా…… నేను ప్రమోద్‌కి మణిమాలకి రామాలయంలో పెళ్ళి చేసాను. నాకేమి శిక్ష విధిస్తావో మీ ఇష్టం! ఇకనుంచి మణిమాల మీకు కోడలు.” అంది.

“అమ్మా ఏం మాటాడుతున్నావ్? తెలివి వుండే చెబుతున్నావా…. వాడికి ఊరూపేరులేని పిల్లతో పెళ్లి చేసావా? నీ వయసుకి చేయాల్సిన పనేనా? వాడి తల్లి తండ్రులు బతికే ఉన్నామని ఇంగితం ఉందా అసలు…. వినోద్‌కి ఎటూ ఏమి లేదు. కనీసం ప్రమోద్ పెళ్లి చేసే అదృష్టం లేకుండా నీ చేతులతో తుడిచేస్తావా? మేము ఏం పాపం చేసాం? నువ్వసలు నాకు అమ్మవేనా….” కట్టలు తెగిన కోపంతో అరిచాడు భార్గవ.

అంత కోపం ఎప్పుడు చూడని గిరిజ కూడా భయపడింది.

అరుంధతి అతి సహనంతో….”నాన్నా! నీకు కోపం వస్తుందని తెలుసు. వయసులో వున్నా మాల ప్రమోద్ ఒకరినొకరు ఇష్టపడటమూ సహజమే. నేను ఒక్కటే ఆలోచించాను. మాలను వదిలించుకోడం కష్టంకాదు. కానీ ఆ పిల్ల ఈ ఇంటికి అంకితమైపోయి శ్రద్దగా చూసింది. రాత్రీ పగలు తేడా లేకుండా తెలివిలేకుండా పడివున్న నాకు సేవలు చేసింది. ఏనాడు ఒక్కరూపాయి గాని నా ఒంటిమీద నగలుకాని ముట్టుకోలేదు. పాడు ఆలోచనే ఉంటే నా పీక నొక్కి నగలు డబ్బు తీసుకుని పారిపోవచ్చు. అంతదాకా ఎందుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు మాయం చేయచ్చు. ఏదీ చేయలేదు. ప్రమోద్ హృదయం మాత్రం దోచుకుంది. అందుకే ‘పెళ్లి’ అనే శిక్ష వేసాను. రేపు నీ ఇంటి కోడలుగా మీ ముగ్గురినీ చూసుకోగలదు. ఆ నమ్మకంతోనూ మీ మీద ప్రేమతోను ఈ పని చేసాను. నీ ఇష్టం బాబూ ఏ శిక్ష ఐనా విధించు.” అంటూ చెప్పింది అరుంధతి.

“మీకు గుర్తువుందా మా నాన్న కట్నం ఇవ్వలేదని పూస ఎత్తు బంగారం ఐనా లేకుండా బోసి మెడతో కన్యాధార పోసాడని సాధించారు. ఇప్పుడు ఈ వీధి వెంట ఇల్లిల్లు తిరిగే పనిపిల్లని ఒక్కగానొక్క మనవడితో ఏమి చూసి పెళ్లి చేసారు అత్తయ్యా! ఇది న్యాయంగా ఉందా? మా ఆశలు బూడిదపాలు చేసారు. ఈ గతిలేని మనిషిని మేము భరించాలా!” అంది గిరిజ.

“గిరిజా కూతురు కోడలు రెండూ నువ్వే. నిజమే నీకు పెళ్లి చేసిన కొత్తలో తెలిసీ తెలియక మా అత్తగారి మాట పట్టుకుని నిన్ను సాధించాను. ఆ సిగ్గుతోనే భార్గవ మీ దగ్గిరకి రమ్మని పిలిచినా రాలేకపోయాను. ఏదో వంకపెట్టాను. అదృష్టం కొద్దీ రాజమ్మ కూతురు దొరికారు. నాకు అండగా వున్నారు. నాకు తెలివి తెలిసీ నీచేత చేయించుకో కూడదనే నా కోరిక. అది నెరవేరింది. ఇంకా నామీద కోపంగా ఉంటే మీ ఇష్టం.”

కాస్సేపటికి భార్గవ గిరిజలకు కోపం చల్లారింది. జరుగుతున్న గొడవకి బెదురుతో మూల ఎక్కడో దాగుకున్న రాజమ్మ మణిమాలను పిలిచారు.

“రాజమ్మగారూ మా అమ్మని బాగానే బుట్టలో వేసుకున్నారు. ఏకంగా ఈ ఇంటినే ఆక్రమించుకున్నారు. కన్న కొడుకుని నాకంటే అమ్మకి ఎక్కువ అయ్యారు. అమ్మ తెలివైంది. మిమ్ములను బంధుత్వంతో లోబర్చుకుంది. ఆవిడకు మేము అవసరం లేదు.” అన్నాడు.

“నన్ను నమ్ము నాయనా…. నీ శ్రేయస్సుకోరి ఈ పెళ్ళి చేసాను. కొంత స్వార్థము వుంది. అది రాజమ్మ శాశ్వతంగా నాతోనే వుండాలని. నన్ను క్షమించు బాబూ…. ఇప్పుడు వైభవంగా నీ స్నేహితులను పిలిచి పెళ్లి జరిపించుకో. ఇదుగో నా నగలు బ్యాంకు నుంచి తెచ్చి వుంచాను. నువ్వు తీసుకోమ్మా గిరిజా…. నేను చేయ వలసిన పని బాధ్యత నెరవేరింది. ఇక హాయిగా నిదురపోతాను.” అంది అరుంధతి.

మణిమాల ఇద్దరికీ నమస్కారం చేసి “మామయ్యగారు మీరు అంగీకరిస్తేనే మీ ఇంటికి వస్తాను. లేదు అంటే నాన్నమ్మగారితో ఉండిపోతాను. మాకు నిలువనీడ పరిపూర్ణమైన జీవితం ఇచ్చిన అరుంధతమ్మగారు దేవత. ఆవిడను ఏమీ అనకండి. ఏమైనా ఉంటే అది మా తప్పే మన్నించండి. మాకు ఏమీ వద్దు. మీ ఆశీస్సులు చాలు”. అంటూ వొదిగి నిలబడింది.

ఎంత సరిపెట్టుకుందామన్నా గిరిజ మాలను కోడలుగా అనుకోవడం లేదు. భార్గవ కొంత మెత్తబడ్డాడు. గిరిజ కూడా తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. మరునాడు గిరిజా భార్గవ హైదరాబాదు వెళ్ళిపోయారు.

రాజమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది.

“చూశారా అమ్మా, ఏం జరిగిందో….ఇప్పుడు నా బిడ్డ గతి ఏమిటో చెప్పండి” అంటూ….

“కొద్ది రోజులు ఓపికపట్టు రాజమ్మ. వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు. నా మనవాడి మనసు నాకు తెలుసు. వాడు మాలకు అన్యాయం చేయడు.” అంటూ ఓదార్చింది.

రోజులు గడుస్తున్నాయి. ప్రమోద్ ఫోనుచేసి నాన్నమ్మతో మణిమాలతో మాటాడుతున్నాడు. నెలరోజులు గడిచాయి.

అరుంధతి ఆరోగ్యం దిగజారిపోతోంది….. భార్గవకు ఫోను చేస్తే వచ్చాడు. ప్రమోద్‌ని వినోద్‌ని కలవరిస్తుంటే గిరిజ తీసుకు వచ్చింది.

ఆ మరునాడే అరుంధతి కళ్ళు మూసింది.

ఆ సమయంలో మణిమాల రాజమ్మ ఇద్దరే బాధ్యత తీసుకుని అన్ని యథావిధిగా ఇంటి మనుషుల్లా ఏ లోటూ రానీయకుండా కర్మ కండలు జరిగేలా చూసారు. ముఖ్యంగా వినోద్‌కి అతి శ్రద్ధగా టైముకి భోజనం మందులు ఇస్తూ జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంది. వచ్చిన బంధువులు ఆ తల్లి కూతుర్లను మెచ్చుకున్నారు.

ఇల్లు ఇక అమ్మకం పెట్టారు. రాజమ్మ “మా వూరు వెళ్ళిపోతాం…. మాకు అరుంధతమ్మ ఆధారం పోయినది. ఇక్కడ ఎందుకు బాబూ” అంది.

“సరే మంచిది ….” అంటూ గిరిజ అత్తగారి పట్టు చీరలు ఆవిడ సామాను ఇచ్చింది. భార్గవ అయిదు లక్షల రూపాయలు ఆవిడపేర బ్యాంకులో వేసాడు. అరుంధతి కోరిక ప్రకారం. ఇల్లు అమ్మకం జరిగి మంచి ధరే వచ్చింది.

“నీ సామాను కూడా సర్దుకో తల్లి మనం కూడా వెళ్ళిపోవాలి….అంది రాజమ్మ .

“నువ్వు వెళ్ళమ్మా… నేను రాను… నేను మా అత్తగారితో వెడతాను….” అంది మాల దృఢంగా .

‘ఈ మాలను తీసుకెడితే నాకు కొంత శ్రమ తగ్గుతుంది. వినోద్‌కి వయసు ఉందికాని చంటి పిల్లవాడితో సమానం. నేను చేసిన పరాయి మనిషి మాల చేసిన వాడికి తేడా తెలియదు’ అనుకుంది గిరిజ.

భార్గవ కూడా “మంచో చెడో అమ్మ దేవుడి గుడిలో పెళ్లి చేసింది. పూజారి కూడా ‘ఆ పిల్లను కాపాడే బాధ్యత నీదే భార్గవా….. మీ అమ్మగారి దూరదృష్టి గొప్పది. ఆవిడ పరువు నిలబెట్టు. ఒక ఆడపిల్ల ఉసురు నీకు జయంకాదు’ అన్నారు” చెప్పాడు.

“గిరిజా… ప్రమోద్‌కి ఏ చదువుకున్న పిల్లనో చేస్తే మనకు ఎలాంటి సహాయమూ చేయదు. సరికదా ప్రమోద్‍ని వేరు కాపురం పెట్టి మనకు దూరం చేస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయి తల్లి తండ్రులు కూడా అల్లుడి తల్లి తండ్రులకు గౌరవం ఇవ్వడం లేదు. పెళ్లి అయ్యాక లెక్క చేయడంలేదు. మనం ఎందరినో చూసాం. మాల నీకు సాయంగా గౌరవప్రదంగా ఉంటుంది. వాళ్ళను దూరంగా ఉంచడం మంచిది కాదు. వాళ్ళు భార్యాభర్తలు. ఆలోచించు….” అన్నాడు.

అప్పటికే మణిమాలను హైదరాబాదు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న గిరిజా “సరే మీ ఇష్టం” అనేసింది.

రాజమ్మగారు వాళ్ళ నిర్ణయం తెలిసి సంతోషంగా బయలుదేరింది.

“రాజమ్మగారు మీరు మీ అమ్మయిని చూడాలను కున్నప్పుడు ఏమీ మొహమాట పడకండి. వస్తు వుండండి” అన్నాడు భార్గవ.

“సంతోషం బాబు. అలాగే వస్తాను. మీ అమ్మగారి మాట మన్నించారు. అదేచాలు. గిరిజమ్మ నీకు ఏ సహాయం కావాలన్న కబురు పెట్టు వస్తాను. ఇక నా బిడ్డకు అన్నీ మీరే..” అంటూ అప్పగించి కన్నీళ్లతో వెళ్ళిపోయింది.

భార్గవ హైదరాబాదులో విల్లా కొన్నాడు. ప్రమోద్‌ని మాలను వేరుగా అపార్టుమెంట్‌లో ఉండమన్నాడు.

కానీ మాల ఒప్పుకోలేదు. “అందరమూ ఒకచోట ఉందాం మామయ్యగారు, ఇంటి కోడలిగా మీ కష్ట సుఖాలు పంచుకుంటాను. అత్తయ్యకి సహాయంగా వుంటాను…..” అంది.

గిరిజ మణిమాలతో ముభావంగా ఉంటుంది. ఐనా ప్రతి పని అందుకుంటూ క్రమంగా ఆవిడ మనసు గెల్చుకుంది.

అప్పుడప్పుడు ఇంజినీరైన ప్రమోద్‌కి ‘ఈ చదువులేని పిల్ల భార్య ఏమిటి? ఖర్మ. ఆడపిల్ల అందుబాటులో ఉండేసరికి ప్రేమ దోమ అంటూ తయారయ్యాడు. వాడు అమాయకుడు. నాలుగు కబుర్లు చెప్పి బుట్టలో వేసుకుంది.’ అని ఒకసారి అనుకునేది గిరిజ.

భార్గవ గిరిజకి చెప్పేడు.

“చదువు సంపాదన వున్న కోడలు ఇలా మనతో ఉండదు. ఇంటిపనిలో నీకు సహాయమూ చేయదు. నువ్వు అనవసరంగా ఆలోచించకు. చూడు వినోద్‌ను చూసుకోవడం నీకు చాల కష్టంగా ఉండేది. ఇప్పుడు మాల లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోయేది.” అంటూ మాలకు సపోర్టుగా నిలబడ్డాడు.

సంవత్సరం గడిచింది. మాలా పుట్టింటికి వెడతాననీ గాని అమ్మని రమ్మని పిలుస్తాను… అని గానీ అనలేదు.

భార్గవ్ అన్నాడు ఒకసారి గిరిజతో….

“రాజమ్మను సంక్రాంతి పండగలకు రమ్మని ఫోను చేయి. పాపం ఆవిడకు ఎవరున్నారు?” అని.

“ఇంతవరకూ నాకు ఆలోచన రానేలేదు. కానీ వంటలు చేసుకు జీవించే ఆవిడను వియ్యపురాలిగా ఎలా పిలవాలి…” అని సందేహించింది .

“గిరిజా ఇంకా నీకు ఎక్కువ తక్కువ అనే చులకన భావం పోలేదు. అది తప్పు. ఆవిడ మా అమ్మకి చేసిన సేవ గుర్తు తెచ్చుకో. ప్రమోద్ కారణంగా మణిమాల ఈ ఇంటికి వచ్చిందనీ మరిచిపోకు.ఇంకా నీ మనసు మారలేదా? మనమూ ఒకప్పుడు సామాన్యులం. ఇప్పుడు డబ్బుకు లోటు లేదు కానీ మన దురదృష్టం వినోద్ రూపంలో వెన్నంటే వుంది. మనిద్దరం ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం. అప్పుడు వినోద్‌ను చూడవలసింది మనిమాలే, గురు పెట్టుకో. ఆ పిల్ల మనసు కష్ట పెట్టకు. నీ పెద్దరికం నిలబెట్టుకో” అంటూ భవిష్యత్ గురించి హెచ్చరించాడు.

‘అవును నాదే తప్పు. జరగాల్సిన అనర్థం ఎప్పుడో జరిగిపోయింది. కారకులు ఎవరు… అని నిందించడం ఉపయోగం లేదు. భార్గవ్ ఆవిడను రమ్మని పిలుస్తే నేను నోరుమూసుకుని ఊరుకోవలసి వచ్చేది. ఆలా కాకుండా నన్ను భార్యగా గౌరవించాడు…’ అనుకుంది.

“మాలా మీ అమ్మగారు ఎలా వున్నారు? ఆవిడకు ఆ వూరిలో సదుపాయంగా వుందా?” అని మొదటిసారి అడిగింది.

“అమ్మ బంధువులు అక్కడే వున్నారు. మామయ్య గారు చేసిన సహాయంతో బాగానే గడిచి పోతోందని చెబుతోంది. మరి మరీ మీ ఇద్దరినీ అడుగుతూనే వుంది.”

“సరే! ఒక్కసారీ మనింటికి నిన్ను చూడటానికి రాలేదు. వచ్చే పండగలకి రమ్మను. నేను కూడా ఫోను చేసి చెబుతాను.”అంది.

“వద్దు అత్తయ్య గారు… ఎక్కడ ఉండవలసినవారు అక్కడే ఉండాలి. అమ్మ వేరే ఊళ్ళకి వెళ్లడం, చాల రోజులు నేను దూరంగా ఉండటం అలవాటే చిన్ననాటి నుంచీ. నాన్నమ్మగారు మా ఇద్దరినీ పిలిపించి దగ్గిర ఉంచుకుని ఉపకారం చేశారు అది చాలు.”

“నీ వయసు కన్నా పెద్ద మాటలు చెబుతున్నావు కానీ నువ్వు ప్రమోద్ అయినా వెళ్లి మీ అమ్మగారిని చూసి రండి” అంది హుందాగా!

ఆ మాటలు విన్న భార్గవ ‘ఈ పిల్ల ఎక్కడో చిన్న గ్రామంలో బీద ఇంటో పుట్టింది. పెద్దగా చదువులేదు. అయినా ఇంత సంస్కారం ఎలా నేర్చుకుంది’ అని ఆశ్చర్య పోయాడు.

ఆలోచిస్తే తోచింది….. అదంతా అమ్మ దగ్గిర ట్రైనింగ్. ఆ రోజు అమ్మను తప్పు పట్టాను. కానీ అమ్మ తన జీవిత కాలం ఎంతో తృప్తిగా జీవిస్తూనే కొడుకు కోడలు మనుమలు గురించి ఆలోచించింది. అసలు గొప్పతనం అమ్మది. విలువలు సంస్కారం ఎక్కడవుందో కనిపెట్టింది అమ్మ. అవును మా భవిత అంతా మణిమాల చేతుల్లో వుంది. అమ్మను గౌరవించినట్టే ఇంటి కోడలిని అందులో ఇలాంటి మణిమాల అనే అమ్మాయిని ఆదరపూర్వకంగా గౌరవించాలి …. అనుకున్నాడు.

గిరిజ ఒకరోజు మాలను అడిగింది.

“మాలా! ఇంటికి అన్నీ అమర్చావ్. కానీ మేమిద్దరమూ తాతా నాన్నమ్మలు కాలేదు. మీ ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారా ఏమిటీ?”

“అత్తయ్యా….. నామీద కోపం తెచ్చుకోవద్దు….. నిజం చెప్పమంటారా?”

“చెప్పు. దీనికి కూడా పెద్ద ప్లాను వుందా ఏమిటి?”

“వినోద్ బావ నాకు బిడ్డలాటివాడు. నాకు సంతానం కలిగితే అతడిని చూసుకోడం వీలుపడదు. అందుకే నేను ప్రమోద్ వద్దనుకున్నాం”

గిరిజకి మతిపోయింది. ఇదెక్కడి మంచితనం! మాతృత్వం వద్దు అనుకునేటంత త్యాగం వుంటుందా….అని నివ్వెరపోయింది.

“లేదు. అలాంటి ఆలోచన వద్దు. వినోద్‌ని చూసుకోడానికి నేను మామగారూ వున్నాంకదా! ఒకవేళ మేము చూడలేకపోతే ఎవరో పనివాడిని పెడదాము. అంతేకాని నీ ఆలోచన సరికాదు.” అని మందలించింది .

ఈ కబురు విన్న భార్గవకు కళ్ళు చర్చాయి. ఇదేమిటీ మణిమాల వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతోంది…. ఆ పిల్లముందు మేము చీమల్లా వున్నాం. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళను చూడగలమా? మాల ఇంటి కోడలు కాదు మూర్తీభవించిన దేవత! అనుకున్నాడు.

ప్రమోద్‌ను పిల్చి అడిగాడు – “అసలు మన ఇంట్లో నిర్ణయాలు చేయాల్సింది ఎవరు?”

“అదేమిటి డాడీ మీరే!” ఆశ్చర్యంగా అన్నాడు.

“కాదు. మణిమాల నా కోడలు…..” సీరియస్‌గా చెప్పేడు… భార్గవ.

“సారీ! మాల ఏమి తప్పు చేసిన శిక్ష వేయండి. ఆ అధికారం మీదే…. డాడీ.”

“అలాగే మీ ఇద్దరికీ వేస్తాను. మాకు మనుమడో మనుమరాలో కావాలి. ఇద్దరు ఐతే మరీ మంచిది. ఇదే శిక్ష మీకు.”

“సారీ డాడ్… ఒక్కమాట చెబుతాను వినండి…. నాకు జాబ్ పోయినది… మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు. ఈ పరిస్థిలో మాలా నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు సంపాదించేది మీరు ఒక్కరే! తింటూ కూర్చునేది నలుగురు అయ్యాము. ఇకమీదట ఏ జాబు రాకపోవచ్చు. అందుకే వినోద్ అన్నయ్యను మా బిడ్డలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.” అన్నాడు

ఊహించని ఈ మాటకి కృంగిపోయాడు భార్గవ్.

ప్రమోద్ ఉద్యోగంలో చేరేడు కదాని ఈ విల్లా కొన్నాడు ధైర్యం చేసి ….. ఇంకా నయం అపార్ట్మెంట్ సేల్ చేయలేదు. తన బాధను పైకి తెలియనీయక నవ్వుతూ…

“దానికేముందీ సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్స్ ఇంతే. వస్తాయి పోతాయి. జస్ట్ బ్రేక్….అంటూ లైట్‌గా తీసుకున్నట్టు చెప్పేడు.

“గిరిజా! ఇక్కడ ఖర్చు ఎక్కువగా వుంది. నీకు ఈ మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా వుంది అంటావుగా…. ఫ్లాట్‌కి వెళ్లిపోదామా?” అన్నాడు.

గిరిజలో మార్పు వచ్చింది. భార్గవ ఈ మాట ఎందుకు అన్నాడూ…..అని ఆలోచన చేసింది. ఏదో ఇబ్బంది వచ్చింది….. అని గ్రహించి “సరే మీ ఇష్టం. అలాగే వెళ్ళిపోదాం…” అంది.

గిరిజ అడ్డు చెప్పనందుకు సంతోషించాడు.

“మామయ్య గారూ! ఒక్కమాట… విల్లాను రెంటికి ఇద్దాం. అది లోనుకి సరిపోతుంది. మనకు ఇల్లు ఉంటుంది. అమ్మకండి” అని సలహా ఇచ్చింది మాల.

“అవును. నీ సలహా దివ్యంగా వుంది… అలాగే చేద్దాం…” అంది గిరిజ కూడా.

“అవును మన కోడలి ఆలోచన ఎప్పుడూ ఆచరణీయమే…” అన్నాడు భార్గవ భవిష్యత్ మీద నమ్మకంతో.

Exit mobile version