కాజాల్లాంటి బాజాలు-55: ఇంటింటి రామాయణం

4
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]రో[/dropcap]జులూ, నెలలూ గడిచిపోతున్నాయి కానీ ఈ హౌస్ అరెస్ట్ మటుకు ఎప్పటికవుతుందో తెలీటంలేదు. లాక్‌డౌన్ పెట్టిన కొత్తలో మిలమిల మెరిసేలా గిన్నెలు కడిగేసుకుంటూ, తళతళలాడేలా ఇళ్ళు తుడిచేసుకుంటూ, ధగధగలాడేలా బట్టలు ఉతికేసుకుంటూ, ఘుమఘుమలాడేలా వంటలు చేసేసుకుంటూ గడిపేసేను. ఆ తర్వాత కొంచెం వేడి తగ్గి ఆ పన్లన్నీ తప్పదురా భగవంతుడా అనుకుంటూ చేసుకునే స్టేజికి వచ్చేసేను.

ఈ లాక్‌డౌన్ పెట్టిన కొత్తలో అమెరికాలో ఉండే నా ఫ్రెండ్ నాలిక బైటపెట్టి వెక్కిరిస్తున్నట్టు బొమ్మ ఒకటి నాకు పోస్ట్ చేసింది. అంటే ఏంటని అడిగితే “ఏవుందీ.. ఇండియాలో మీరందరూ ఇన్నాళ్ళు ఎంచక్కా పనిమనుషులనీ, వంటమనుషులనీ పెట్టుకుని, మీ టైము గడవడానికి గెట్ టుగెదర్‌లు పెట్టుకుని హాయిగా ఎంజాయ్ చేసేవారు. ఆ ఫొటోలన్నీ చూస్తూ, సింక్ దగ్గర బొచ్చెలు కడుక్కుంటూ మేం పళ్ళు పిండేసుకునేవాళ్లం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంచక్క మీరు కూడా మా బ్యాచ్‌లో చేరిపోయేరు కదాని తెగ సంతోషపడిపోతున్నాం” అంది. హూ.. నిజవేకదా! వంటింట్లో సింకు ఎంత ఆత్మీయమైన ప్రాంతం అయిపోయిందో ఇప్పుడు తెలుస్తోంది. అందులోనూ అదేంటో అందులోంచి గిన్నెలు కూడా అక్షయపాత్రలోంచి వచ్చినట్టు వచ్చేస్తాయి..

నేను పడే బాధ చూసి ఇంట్లోవాళ్ళు సాయం చేస్తామంటూ వచ్చేరు. ఆ సాయం ఎలా వుంటుందంటే.. ఎందుకులెండి.. ఒక జోక్ చెపితే మీకు అర్ధమైపోతుంది..

ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నారుట. పగటివంట అత్తగారు చేస్తే రాత్రి డ్యూటీ కోడలిదిగా నడిచే సంసారం. అత్తగారిది ఎడమచేతివాటం.. వంట చేస్తున్నంతసేపూ కావల్సిన గిన్నెలూ, సామాన్లూ ఎడమ వైపుకే పెట్టుకుని చేసేది. సాయంత్రం కోడలి డ్యూటీ పడేటప్పటికి ఆవిడకి అది ఇబ్బందిగా ఉండి అన్నీ మళ్ళీ కుడివైపుకి మార్చేసేది. అంతేకాదు.. కోడలు కాస్త పొడగరి. అందుకని వంటకి కావల్సిన సామాన్లన్నీ నడుం వంచకుండా, చేయి దించకుండా పై అరలో పెట్టేసేది. మర్నాడు పొద్దున్న అత్తగారు వంటింటి ప్రవేశం చేసేటప్పటికి ఏవుందీ.. అంతా అడ్డదిడ్డంగా ఉండేది. అలా ఉంటుంది ఇంట్లోవాళ్ళు నాకు చేసే సాయం. పాపం ఎంతో ప్రేమతో సాయం చేస్తానన్నారు కదా అని సరేనంటే ఆ తర్వాత అంతకు రెండింతలు పనౌతోంది నాకు. అందుకని ఇంక నా పని నేనే చెసుకోక తప్పటంలేదు. అసలే పనిగండమున్న మనిషినాయె.. ఇంత పనీ చేస్తుంటే ఏమైపోతానోనన్న బెంగ మొదలైంది. అందుకని పని తప్పించుకుందుకు కొత్త కొత్త ఉపాయాలేమైనా వున్నాయా అని వదినని అడిగేను. వదిన బుర్ర పాదరసం కదా! భలే ఉపాయాలు చెప్పింది. కొన్ని నాకు పనికొస్తాయి, కొన్ని మరొకరికి పనికిరావచ్చు. అందుకని మీక్కూడా చెప్పేస్తున్నాను, ఎవరికి కావాలంటే వారు వాడేసుకోవచ్చు..

  1. పొద్దున్న లేచి ఎలాగూ పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఏదో ఫీల్ అయిపోతూ అంత తెల్లారకట్టే లేవక్కర్లేదు. మెలకువ వచ్చాక కూడా మన బధ్ధకం తీరేవరకూ మంచం దిగకూడదు. దిగాక ఎలాగూ పనిలోకి దిగక తప్పదు కనక తీరుబడిగానే పనులు మొదలు పెట్టుకోవచ్చు. (ఇది విన్నాక నాకు మా పనిమనిషి అంత నెమ్మదిగా, నాజూకుగా పనెందుకు చేస్తుందో అర్ధమైంది.)
  2. ఈ కరోనా పుణ్యమా అని అందర్నీ ప్రాణాయామం చెయ్యమంటున్నారు కనక ఓ అరగంట దానికి కేటాయించేసెయ్యొచ్చు.
  3. అప్పటికి ఎనిమిదిగంటలు ఎలాగూ అయేపోతుంది. ఆ తర్వాత స్నానం, పూజా పూర్తి చేసుకునేటప్పటికి తొమ్మిది అవనే అవుతుంది. అప్పుడు గిన్నెలు తోమడం మొదలుపెట్టుకుంటుంటే ఇంక ఇంట్లోవాళ్ళకి నీరసం వచ్చేసి, బ్రెడ్ టోస్ట్ చేసేసుకుని, జామో, బటరో రాసేసుకుని తినేస్తారు. గిన్నెలు కడిగేక మనం కూడా నీరసంగా కూలబడిపోతాం కనక మనకి కూడా వాళ్ళే ఆ బ్రెడ్ టోస్ట్ ఏదో చేసి పెట్టేస్తారు. అలాగ పొద్దున్న టిఫిన్ చేసే కార్యక్రమం ఎగ్గొట్టెయ్యొచ్చు.

వంట కూడా అంతే.. ఒకరిని కూరలు తరగమనీ, ఇంకోరిని కుక్కర్ ఎక్కించమనీ పనులు పురమాయించేస్తూ మనం ఈ గదిలోంచి ఆ గదిలోకీ, ఆ గదిలోంచి ఈ గదిలోకీ హడావిడిగా ఏదో పనున్నట్టు తిరిగెయ్యడమే. అంతా అయ్యేక అత్తగారొచ్చి వేలెట్టినట్టు, ఆఖర్న మన చెయ్యి వంటలో పడిందనిపిస్తే చాలు.. వంటంతా మనవే చేసినట్టంతే.

హమ్మయ్య, పొద్దుట్నించీ ఎంత కష్టపడ్డాం కదా! మరి మధ్యాహ్నం కాసేపు పడుకోవచ్చన్న మాట..

ఇలాగ నాకు పనికొచ్చేవీ, పనికిరానివీ బోల్డు ఉపాయాలు చెప్పింది వదిన. అవన్నీ వింటూంటే అప్పుడెప్పుడో ఓ రచయిత్రి రాసిన మాటలు గుర్తొచ్చాయి. ఆవిడకీ నాలాగే వంటన్నా, పనన్నా పాపం గండ మనుకుంటాను, స్నేహితురాలితో చెప్పుకుంటోంది పాపం..

“ఈ పనులు చెయ్యకుండా వుండాలంటే వంటింటికి తాళం పెట్టేసి, ఆ తాళంచెవి పడేసుకుంటే, అది దొరికేవరకూ మనకి విశ్రాంతి” అంటూ..

అది విని ఆ స్నేహితురాలందిటా..  “మా ఆయన అలా తాళంచెవి వెదికే మనిషి కాదులే.. వెంటనే తాళం బద్దలు కొట్టేస్తాడూ.” అని. హూ.. ఇలా ఉంటోందండీ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ రామాయణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here