[dropcap]ప్ర[/dropcap]ముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి ఆత్మకథ ఈ పుస్తకం.
***
కర్కశమైన శాస్త్ర పాండిత్యం, మధుర గంబీర కవిత్వం కవచ కుండలాలయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి సుపుత్రుడయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి స్వీయ చరిత్ర ‘ఇంటిపేరు ఇంద్రగంటి’.
శ్రీకాంతశర్మగారి సాహితీ వ్యాసంగం కవిత్వం, లలితగీతం, చలనచిత్ర గీతం, యక్షగానం, కథ, నవల, నాటిక, వ్యాసం వంటి బహురూపాలుగా విస్తరించింది. వారి ఆత్మకథ ఇది.
“ఆత్మకథ రాయటం స్వీయ హననం” అంటూ ‘ఆత్మస్తుతి – పరనింద’, ‘ఆత్మస్తుతి – పరస్తుతి’ వంటి వాటితో ఆత్మచరిత్రకి, ఆత్మ లేకుండా పోతోందని; అలాంటి లోపం లేని రచన ఇది అన్న అభిప్రాయాన్ని ముందుమాట ‘మనవి మాటలు’లో రవికృష్ణ వ్యక్తపరిచారు.
“చాలాకాలంగా, నాకు మా ఇంద్రగంటి కుటుంబ చరిత్ర వ్రాయాలనే కోరిక ఉంది. చెప్పదగినంత చరిత్ర ఉండడమూ నిజం” అంటూ ప్రవేశికను ఆరంభించారు శ్రీకాంతశర్మ. “మా ఇంద్రగంటి కుటుంబంలో ఘనతలు ఉన్నాయి. అవమానాలున్నాయి. పౌరుషం, మానసం ఉన్నాయి. పాండిత్యం, సాహిత్యం, సంగీతం ఉన్నాయి. రాజపూజితాలున్నాయి. ఎవరు ఊహించజాలని మలుపులు ఉన్నాయి. అందుకే మా కుటుంబ చరిత్ర రాయాలని నా ముచ్చట” అని ప్రవేశికలో ఈ రచన నేపథ్యాన్ని వివరించారు శ్రీకాంతశర్మ.
శ్రీకాంతశర్మగారి ఈ జీవిత చరిత్ర 73 ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర విహంగ వీక్షణ లాంటిది. సాహితీ ప్రియులందరూ తప్పనిసరిగా కొని, చదివి, భద్రపరుచుకొవాల్సిన పుస్తకం ఇది.
***
ఇంటిపేరు ఇంద్రగంటి (ఆత్మకథ)
రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
పేజీలు: 430
వెల: ₹ 200/-
ప్రతులకు: సాహితీమిత్రులు, 28-10-16, మసీదు వీధి, అరండాల్ పేట, విజయవాడ-2.
0866-662433359, 9392971359, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.