బహుముఖ ప్రజ్ఞాశాలి జలజం
[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో బహముఖ ప్రజ్ఞాశాలిగా జలజం సత్యనారాయణ పేరుగడించాడని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
నవంబర్ 9 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోగల కాళోజీ హాల్ లో జరిగిన ‘ఇప్పపూలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజం సత్యనారాయణ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా మార్గదర్శనం చేశారన్నారు. దక్షత కలిగిన నాయకుడన్నారు. జలజం రచనలు ఆసాంతం చక్కగా చదివిస్తాయన్నారు.
ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ జలజం అందరికీ ఆత్మీయుడన్నారు. బహుభాషావేత్తగా రాణించిన జలజం అనువాదకుడిగా గొప్ప పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడన్నారు.
సభాధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జలజం మానవత్వం మూర్తీభవించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. అనంతరం మంత్రి ‘ఇప్పపూలు’ పుస్తకాన్ని అంకితం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.రవీందర్, పి.పి. బెక్కెం జనార్దన్, జలజం సుషుమ్నరాయ్, జలజం వైశేషిరాయ్, జలజం విదుషీరాయ్, కె.లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కోట్ల వేంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.