Site icon Sanchika

ఇప్పుడనుకుని ఏం లాభం?

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి ఆంగ్ల కథ ‘A Mixture of Opposites’ ను అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]చి[/dropcap]న్నప్పుడు సైన్సులో కెమిస్ట్రీ పాఠాలలో ‘మూలకాలు, సమ్మేళనాలు మరియు మిశ్రమాలు’ అనే ఓ అధ్యాయం ఉండేది. రసాయన మార్పులో పాల్గొనకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ విభిన్న రకాల పదార్థాలతో ఏర్పడే పదార్థాలని మిశ్రమం అంటారని నిర్వచనం. మన జీవితాలలో కూడా, మన వ్యక్తిత్వాలని కోల్పోకుండా, మనతో ‘పొసగే’ వ్యక్తుల కోసం ఆశిస్తాం. అటువంటి వారి విలువ, వారు దూరమయ్యాకనే ఎక్కువగా తెలుస్తుంది. ఈ కథ – తమ జీవితాలలో కొంత కాలం కలిసి ప్రయాణించిన ఇద్దరు అమ్మాయిలది.

ఓ కాలేజీ హాస్టల్‍లో ఇద్దరు రూమ్‍మేట్స్ ఉన్నారు. వారి పేర్లు అనిత, సునీత (అనీ, సునీ అని అందరూ పిలుస్తారు). వారిద్దరూ ఆ గదినే కాకుండా, స్నేహపూర్వక స్వభావాన్ని కూడా పంచుకున్నారు. ఇద్దరూ కలిసే కాలేజీకి వెళ్ళేవారు. సునీ రెండేళ్ళు సీనియర్. ఆమె క్లాసుల టైమ్, అనీ క్లాసుల టైమ్‍కన్నా వేరయినప్పటికీ, కలిసే వెళ్ళేవారు. ఇద్దరిలో ఎవరికి క్లాసులు లేకపోయినా, అలవాటు తప్పకూడదని, కలిసే వెళ్ళేవారు. అనీ కలగలుపు మనిషి, అల్లరిగా ఉంటుంది; సునీ అంతర్ముఖి, ఎక్కువగా మౌనంగా ఉంటుంది. అనీ బొద్దుగా, ఆరోగ్యంగా ఉంటుంది; సునీ బక్కగా, బలహీనంగా ఉంటుంది. బహుశా, విజాతి ధృవాలు ఆకర్షించుకున్నట్టు – వీరిద్దరూ అందుకే కలిసి తిరుగుతున్నారేమో!

ఏడాది గడిచిపోయింది. హాస్టల్ బ్లాకులు మారినా, ఇద్దరూ రూమ్‍మేట్స్ గానే ఉంటున్నారు. కలిసుండడం ఇద్దరికీ సంతోషంగానే ఉంది. ఆఖరి సంవత్సరం అనే ఒత్తిడి సునీపై పడింది, సిలబస్ పూర్తి చేయడం, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం కోసం సిద్ధమవుతోంది. ఒక వైపు – దరఖాస్తు చేసే సంస్థలకు అనుగుణంగా తన రెజ్యూమ్‍ని అప్‍డేట్ చేసుకుంటూ, మరో వైపు పోటీ పరీక్షలకు (గేట్, GRE, TOEFL, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇంకా సివిల్ సర్వీసెస్) సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో సునీ – అనీతో సన్నిహితంగా ఉండడం తగ్గిపోయింది. కాలేజీకి కలిసి వెళ్తున్నప్పటికీ, ఇదివరకులా అందమైన పువ్వుల గురించో లేదా సరిగ్గా అలంకరించబడిన పచ్చిక గురించో మాట్లాడుకోవడం లేదు. ఏదైనా మాట్లాడుకుంటే – సూర్యుడి గురించి, రోజులో ఏ సమయంలో అత్యంత వేడిగా ఉంటోంది, భూమ్మీద లేదా భారతదేశంలో అత్యంత ఉష్ణోగ్రత ఉన్న నాలుగు ప్రదేశాలేవి, వాటి ఆరోహణ, అవరోహణ క్రమాలు ఇలాంటివి మాట్లాడుకునేవారు. సునీ వర్షం గురించి మాట్లాడితే, నీటి మేఘాలు, గాలి మేఘాలు, ఎత్తు, క్లౌడ్‌ సీడింగ్‌ తదితర అంశాలు చర్చించేది. అనీకి వీటిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. ఒకటి, అనీ సునీలా ముందే అన్నీ చక్కగా ప్లాన్ చేసుకునే వ్యక్తి కాదు. ఏ రోజుని ఆ రోజు గడిపే, ఆ రోజుని ఉత్తమంగా చేసుకోవాలనుకునే వ్యక్తి (అవసరమైనప్పుడు రోజంతా ఏ పనీ చేయకుండా గడిపినా సరే). రెండు, చదువుకీ కెరీర్‍కి మధ్య ఉన్న లంకెను అనీ అంత పట్టించుకోలేదు. ఆమె బద్ధకాన్ని పోగొట్టి, కష్టపడి చదవేలా చేయాలని సునీ ప్రయత్నిస్తే, “కెరీర్ గురించి నాలుగో సంవత్సరంలో చూసుకుంటాలే” అనేది అని. పైగా, “నేను ఏ ఉద్యోగమూ చెయ్యను. పెళ్ళి చేసుకుని ఇల్లాలిగా ఉండిపోతాను” అనేది. ఆమెకి తెలుసు – “భర్త చనిపోతే లేదా విడాకులిస్తే అప్పుడేం చేస్తావ్?” లాంటి చచ్చు ప్రశ్నలు సునీ వేయదని! సునీకి ఇతరుల అభిప్రాయాలని గౌరవించడం తెలుసు. పైగా తన అభిప్రాయాలను ఇతరులపై ఎన్నడూ రుద్దేది కాదు. వాదనలో గెలవకపోయినా, తనకన్నా చిన్నదైన తన రూమ్‍మేట్‌కి నచ్చజెప్పి సరైన దారిలో పెట్టాలన్న ఉద్దేశమైతే ఉంది సునీకి. మూడు, అనీ సంపన్న కుటుంబానికి చెందినది, ఇంట్లో తనంటే బాగా గారాబం! తనలో కొంత స్వార్థం ఉంది, అందరూ తనని బుజ్జగించాలని కోరుకునేది. అయితే సునీకి బాధ్యత తెలుసు కాబట్టి, అనీకి తాను లోకల్ గార్డియన్ కాబట్టి, ఆమె పట్ల కొంత అనుకూలంగా ఉండాల్సి వచ్చేది. నాలుగు, అనీ తిక్కది. తను సునీ క్లాస్‌మేట్ అయిన సునీల్‌ గురించి క్యాంపస్‍లో విని ఇష్టపడింది. అని అతడి గురించి అడిగితే, సునీ మంచిగా చెప్పింది. దాంతో అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంది అని. అయితే ఇష్టం తనది మాత్రమే కాబట్టి, స్పష్టంగా సునీకి చెప్పలేకపోయింది. అయితే సునీల్ సమక్షంలో ఉండాలని కోరుకునేది. అందుకు ఏకైక మార్గం – ఏదో విధంగా సునీల్‍తో మాట్లాడడమే. కానీ ఇంకా అవకాశం చిక్కలేదు. “పాపం అబ్బాయిలు చదువులో ఇంత శ్రమని ఎలా తట్టుకుంటారు? మగపిల్లలకి బాగా కష్టమైన కాలం అనుకుంటా. బయట ఎంజాయ్ చేయడానికి టైమ్ ఉండదు. కరక్టేనా?” అనేది అనీ. స్త్రీవాదైన సునీకి ఇటువంటి సానుభూతి నచ్చదు. “నాక్కూడా జీవితాన్ని ఆస్వాదించాలనే ఉంటుంది. కానీ నా కాళ్ళ మీద నేను నిలబడడం అన్నిటి కన్నా ముఖ్యం” అంది.

***

ఓ రోజు సునీల్, సునీ క్యాంటిన్‍లో కూర్చుని స్నాక్స్ తింటూ, తమ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అనీ క్యాంటిన్‍కి వచ్చింది. అనీ అక్కడికి వచ్చి, ఓ కుర్చీ లాక్కుని, వీళ్ళ దగ్గర కూర్చుంటూ – “హలో, హలో” అని రెండు సార్లు ఇద్దరినీ ఉద్దేశించి అంది. తమ ప్రాజెక్టు ఫలితంలో ఎలాంటి తేడా రాకూడదని సునీ భావించింది. “సునీల్, ఈమె నా రూమ్‍మేట్ అనిత, ఇసిఇ సెకండ్ ఇయర్” అని పరిచయం చేసింది సునీ. “హాయ్ అనితా” అంటూ కరచాలనం కోసం చేయి చాపాడు సునీల్. అని అతనికి షేక్ హ్యాండిచ్చి, “హాయ్ సునీల్, నన్ను ‘అనీ’ అని పిలిస్తే చాలు” అంది. “ఓ మేడమ్, మా ప్రాజెక్టు పని పూర్తి చేసుకోనిస్తావా?” అంది సునీ. “ఓకే బై” అంటూ అయిష్టంగా అక్కడ్నించి కదలబోయింది అని. “అయ్యో, తనేదో అర్జెంటు విషయం మాట్లాడాలనుకుందేమో” అన్నాడు సునీల్. దాంతో సునీకి నవ్వొచ్చింది. “మేమిద్దరం రూమ్‍మేట్స్‌గా సంవత్సరం పైగా ఉంటున్నాం. తన మొహం చూసి చెప్పగలను, విషయం పెద్ద అర్జంటు కాదని. తర్వాత మాట్లాడుకోవచ్చు” అని సునీల్‍తో చెప్పి, “ఓకే అనీ, మళ్ళీ కలుద్దాం” అంటూ లాప్‍టాప్‍లో తలదూర్చింది సునీ. బుసలు కొడుతూ కదిలింది అనీ. అది గమనించాడు సునీల్.

***

తన టీమ్‌మేట్స్‌తో చర్చలు ముగించి, ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకుని సునీ గదికి వచ్చేసరికి పెద్ద సౌండుతో పాటలు వినబడుతున్నాయి. అనీకి పాటలంటే ఇష్టం, సౌండ్ గట్టిగా పెట్టుకుని వింటూ పైకి పాడటం మరీ ఇష్టం; కానీ అప్పుడు రాత్రి పది గంటలవుతోంది.. అలా చేయడానికి ఖచ్చితంగా సరైన సమయం కాదు, మరీ ముఖ్యంగా గదిలో ఉంటున్నది తాను ఒక్కర్తే కానప్పుడు!

“అనీ, బాగా అలసిపోయాను. మ్యూజిక్ ఆపేస్తావా?”

“ఆపను..” ఠకీమని గట్టిగా జవాబొచ్చింది. తన చెవులని తానే నమ్మలేకపోయింది సునీ. అనీ తను (మళ్ళీ మళ్ళీ) సర్దుతున్న అలమారాపై దృష్టి సారించింది. మరోసారి చెప్పి చూడాలనుకుంది సునీ. బహుశా మొదటిసారి అనీకి సరిగా వినబడి ఉండదేమో అనుకుంది. ఈసారి జవాబు మరింత స్థిరంగా, మరింత గట్టిగా వినవచ్చింది.

“ఇంతకు ముందే చెప్పాను, ఆపను.. కుదరదు.. అర్థమైందా?”

“పొద్దున్నుంచీ ప్రాజెక్టు వర్క్ మీద పని చేసీ చేసీ బుర్ర బద్ధలైపోతోంది.”

“సాయంత్రం నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నేను నీ మాట వినను.” ఆ జవాబు పెడసరంగా ఉంది, ఏం చేసుకుంటావో చేస్కో అన్నట్టుంది.

వాదించే ఉద్దేశం లేదు సునీకి, పైగా గొడవ పెట్టుకునే మూడ్‍లో కూడా లేదు.

“సరే ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకున్నావో?” అంది

“ఏం లేదు” మరింత దుడుకుగా వచ్చింది జవాబు. ఇక భరించలేకపోయింది సునీ.

“ఏమీ లేదా? మరెందుకు సాయంత్రం నా చదువుని డిస్టర్బ్ చెయ్యాలని చూశావు? ఏమీ లేని దానికి ఇప్పుడు నా నిద్రని ఎందుకు పాడు చేస్తున్నావు? ఏం లేదట ఏం లేదు!”

‘ప్చ్’. మళ్లీ అలక్ష్యం. తనని బాధపెట్టడమే కాకుండా వేధిస్తున్నట్టు కూడా అనిపించింది సునీకి. అంతకు ముందెప్పుడూ, ఎవరికీ చేయని పని చేసింది. విసురుగా వెళ్ళి, అనీ ల్యాప్‍టాప్‌ని మూసేసింది. కొన్ని క్షణాల్లో అది స్లీప్ మోడ్‍లోకి వెళ్ళిపోయింది, హఠాత్తుగా పాటలు ఆగిపోయాయి. అనీ వెనక్కి తిరిగి చూస్తే, కోపంగా తన మంచం వైపు వెళ్తున్న సునీ కనబడింది. ఏదో అనాలని అనుకుంది, కానీ ఎందుకో మౌనంగా ఉండిపోయింది అనీ.

***

మర్నాడు ఉదయం, ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండానే కాలేజీకి వెళ్ళారు. సాయంత్రం క్లాసులయిపోయికి గదికొచ్చేసాక, అనీ సునీని హత్తుకుని క్షమాపణ చెప్పింది. అనీ తన తప్పు తాను తెలుసుకుందని సునీ సంతోషించింది. కానీ సునీకి తెలియని విషయమేంటంటే మధ్యాహ్నం లంచ్ టైమ్‍లో సునీల్‍తో మాటలు కలిసినందుకే అనీకి ఆ సంతోషం! (పైగా సునీ లంచ్ మిస్సయింది కాబట్టి.. ఆమెనేం అనక్కరలేదని అనీ భావన!).

కాలం గడుస్తోంది. క్లాసులయిపోయాకా, అనీ ఎక్కువ సేపు బయటే గడుపుతోంది, చదువుకోడానికి, ఆడుకోడానికి! తన అసలు ఉద్దేశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సునీల్‍తో సమయం గడపటం. ప్రత్యక్షంగా గడిపే గంటలు చాలా తక్కువ, ఎప్పుడో గాని రావవి. పైగా క్యాంటీన్‍లో టీ తాగుతూనో, స్నాక్స్ తింటూనో గడిచిపోతాయా గంటలు, అది కూడా మిగతా మిత్రులు అక్కడ గుంపు కట్టకపోతేనే. అనీ తన వివరాలూ, బాధలూ అన్నీ సునీల్‍తో చెప్పుకునేది. మృదుస్వభావి అయిన సునీల్, ఓపికగా వినేవాడు. సునీల్ సాకర్ ఆడుతుంటే, అనీ అక్కడ ప్రత్యక్షమై, అతన్ని ప్రోత్సహించేది. అతను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే, అతనికి డబుల్స్ పార్ట్‌నర్‍గా ఉండేది లేదా తనకి ప్రత్యర్థిగా ఆడేది. సునీల్ తన మిత్రులతో కలిసి సినిమాకి వెళితే, తానూ వస్తానని అడిగి మరీ వెళ్ళేది. ఈ రకంగా ఎప్పుడూ సునీల్ కనుసన్నలలో మెదలాలని ప్రయత్నించింది. అతని గురించి రహస్యంగా వివరాలు సేకరించింది, మంచివాడేనని ధ్రువీకరించుకుంది.

తనదైన ప్రపంచంలో లీనమైపోయిన సునీకి ఇవేవీ తెలియవు. ఎందుకో కానీ కాలేజీ పుకార్లలో సునీల్-అనీల పేర్లు వినిపించలేదు. కాలేజీ పుకార్ల గురించి సునీకి, సునీల్‍కి తెలుసు, కానీ అనీకి తెలియదు.

ఓ రాత్రి పనిలో మునిగిపోయిన సునీ, ఎందుకో టైమ్ చూసుకుంది. తెల్లవారు జాము రెండు గంటలవుతోంది.. విపరీతమైన పని ఒత్తిడి, అలసట.. ఆ ఎటూ కాని సమయంలో ఆమెకి ఆకలి కలిగేలా చేశాయి. స్నాక్స్ పెట్టుకునే అలమారా తెరిచింది. కొద్ది రోజుల క్రితం కొన్ని పాకెట్ల జంక్ ఫుడ్ తెచ్చి అక్కడ పెట్టింది. కానీ ఇప్పుడవేవీ లేవక్కడ. అలమరా ఖాళీగా ఉంది. కొన్ని ఖాళీ రాపర్స్ పడి ఉన్నాయంతే. వాటన్నటిని అనీ ఒక్కర్తే తినేసి ఉండాలి, లేదా ఫ్రెండ్స్‌తో కలిసి స్వాహా చేసుండాలి! ఇద్దరిలో ఎవరైనా తినచ్చని, సాధారణంగా ఎవరో ఒకరు తగినన్ని స్నాక్స్ కొని తెచ్చి అలమారాలో పెడుతూంటారు. రాత్రి పూట కూడా తెరిచి ఉండే ఓ స్నాక్స్ షాప్ క్యాంపస్‍లో ఉంది, కానీ వాళ్ళ గది నుంచి అర కిలోమీటరు దూరం. మామూలుగా సునీ – ఆ వేళలో – ఎన్నడూ ఒక్కర్తి బయటకి వెళ్ళదు. క్యాంపస్ పూర్తిగా సురక్షితమే అయినా, ఎందుకో జంకు! అనీ వైపు చూసింది. గాఢ నిద్రలో ఉంది. సునీది సందిగ్ధావస్థ! హామ్లెట్ తరహాలో – అనీని నిద్ర లేపాలా వద్దా అని! చివరికి ఆకలిదే పైచేయి అయింది. అనీని నిద్ర లేపింది. అనీ విసుక్కుంది, నిద్ర పాడయినందుకు చిరాకు పడింది. వేసారిపోయిన సునీ, “స్నాక్ షాప్‍కి వెళ్ళాలి, కాస్త తోడుగా వస్తావా?” అంటూ నెమ్మదిగా అడిగింది.

“నువ్వేమైనా చిన్నపిల్లవా? ఒక్కదానివి వెళ్ళి కొనుక్కోలేవా?”

“ఈ టైమ్‍లో ఒక్కదాన్నే నడిచి వెళ్ళాలంటే, కాస్త భయంగా ఉంది, నాతో రావా ప్లీజ్.”

“ఏంటీ గోల? పడుకోనీయకుండా.. నన్ను డిస్టర్బ్ చేయకు” అంటూ మాటల ఈటెలు విసిరింది అనీ.

“మాటల జాగ్రత్తగా రానీ! స్నాక్స్ అన్నీ తినేశావ్. అత్యవసరమైతే తినడానికీ ఏమీ మిగల్చలేదు. పైగా, నేనెంతో మర్యాదగా అడిగితే, నోటికొచ్చినట్టు వాగుతున్నావ్? అర్ధరాత్రి దాకా బయటే తిరుగుతున్నావ్ కదా, స్నాక్స్ తెచ్చి పెట్టాలన్న ఇంగితం ఉండక్కర్లా?”

“ఏం చేసుకుంటావో చేసుకో.. నేను రాను.”

సునీ మనసు బాగా గాయపడింది. ఆమెకి బాగా ఆకలేస్తోంది. హాస్టల్‍లోని ఇతర అమ్మాయిలని నిద్రలేపి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. బయటకి రాకపోవడానికి ప్రతి ఒక్కరికీ తమవైన కారణాలుంటాయి. అయిష్టంగానే, సునీల్‍ని సాయమడగాలని అనుకుంది. ఫోన్ చేసింది.

“హాయ్ సునీల్, నిద్ర లేపానా? సారీ, ఈ సమయంలో ఫోన్ చేస్తున్నందుకు.”

“నేను పడుకోలేదు. రేపు సబ్‍మిట్ చేయాల్సిన ప్రాజెక్టు మీద పని చేస్తున్నాను. ఇంకో గంట పడుతుంది. చెప్పు, ఏంటి విషయం, ఈ టైమ్‍లో ఫోన్ చేశావు?”

“సారీ సునీల్, నీ వర్క్ డిస్టర్బ్ చేస్తున్నాను. పర్వాలేదు. నువ్వు వర్క్ చేసుకో. రేపు కలుద్దాం.. గుడ్ నైట్.”

“ఆగు సునీ. నీకేదో అత్యవసరమై ఉంటుంది. లేకపోతే ఈ వేళలో ఫోన్ చెయ్యవు. విషయమేంటో చెప్పు.”

“ఏం లేదు సునీల్, బాగా ఆకలేస్తుంది. రూమ్‍లో తినడానికేం లేవు. తగినన్ని స్టాక్ ఉంచుకోకపోవడం నా తప్పే. స్నాక్స్ షాప్ నుంచి తినడానికేవైనా తెచ్చిస్తావా ప్లీజ్?”

“తప్పకుండా, ఓ పావుగంటలో మెయిన్ గేట్ దగ్గరకి రా.”

సునీ తన పర్స్ తెరిచి, వంద రూపాయల నోటు తీసుకుని, మెట్లు దిగింది. దిగేడప్పుడు ఏ మాత్రం శబ్దం కాకుండా, ఎవరికీ నిద్రాభంగం అవకుండా జాగ్రత్త పడింది. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఆ సమయంలో అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. స్నాక్స్ పాకెట్ వస్తుదనీ, తీసుకోడానికి వచ్చానని అతనితో చెప్పింది. “వచ్చేది నా క్లాస్‍మేటే. కావాలంటే మా మాటలు వినొచ్చు” అంది. సునీ బాగా చదువుతుందనీ, పద్ధతిగా ఉంటుందనీ అందరికీ తెలుసు. “పర్వాలేదమ్మా, మీరు మాట్లాడుకోండి” అన్నాడతను, తనున్న చోటు నుంచి కదలకుండానే.

కాసేపటికి సునీల్ వచ్చాడు.

“నీకెంతో పని ఉన్నా, నాకోసం ఇంత శ్రమ తీసుకున్నావ్. నీ సహయానికి వెల కట్టలేను. కనీసం వీటికయ్యే డబ్బులు తీసుకో” అంటూ వంద నోటు ముందుకు జాచింది. “చిల్లర ఇప్పుడివ్వనక్కరలేదు. క్లాసులో కలిసినప్పుడు ఇవ్వు” అంది.

“ఇవన్నీ మీ రూమ్‌లోవే. అనీ తెచ్చింది. ఆకలిగా ఉందంటే, మీ గదిలోవన్నీ పట్టుకొచ్చేసినట్టుంది. అంతలో తనకి ఇంటి నుంచి ఫోన్ రావడంతో, ఇవన్నీ నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఇక తప్పక, మా రూమ్‍కి తీసుకెళ్ళా. నీకు క్లాసులో ఇద్దామనుకున్నా. కానీ ఇప్పుడే ఇలా తెచ్చేశా”

సునీ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆమె స్పందించే లోపే, “బాగా అలిసిపోయావు, గుడ్ నైట్. నాక్కూడా పని ఉంది” అన్నాడు సునీల్.

“థాంక్యూ సునీల్, గుడ్‍నైట్” అని చెప్పి, తన గదికి వచ్చేసింది సునీ.

***

పొద్దున్నే సునీ ఈ ప్రస్తావన తెచ్చింది. అనీ పట్టించుకోలేదు.

“చూడు.. నీకు చదువు, ఉద్యోగం అవసరం లేకపోవచ్చు. మంచి మార్కుల కోసం నువ్వు సీనియర్స్‌కో, ఫ్రెండ్స్‌కో ఏమైనా చెయ్యచ్చు. కానీ నేను నా కాళ్ళ మీద నిలబడాలి, అందుకు బాగా కష్టపడాలి. నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వేమో వాటర్ బాటిల్లో నీళ్ళు మొత్తం తాగేశావు. బిల్డింగ్ బయటకి వెళ్ళి మళ్ళీ నింపుకొచ్చుకున్నందుకు నాకేం బాధ లేదు. కానీ ఇది (స్నాక్స్ పాకెట్స్ మాయం చేయడం) మాత్రం దారుణం. దయచేసి నా రొటీన్‍ని డిస్టర్బ్ చెయ్యద్దు” అంది సునీ.

“నీకెలా తెలిసింది?”

“నువ్వు నాతో రానప్పుడు, నాకెలా తెలిస్తే నీకెందుకు? నీకన్నా పెద్దదాన్ని కాబట్టి, ఇన్ని రోజులూ నీ జీవితం బాగుండడానికి నిన్నేదో మంచిదారిలో పెట్టాలని ప్రయత్నించేదాన్ని. కానీ, నిన్ను నువ్వు మాట్లాడిన పద్ధతి చూశాకా, నీ మానన నిన్ను వదిలేయడమే మంచిదనిపించింది. నీ ఈ ధోరణి మంచిది కాదు, జనాలని బాధపెడుతుంది” అంది సునీ.

అనీకి కొంచెం కొంచెంగా అర్థమవసాగింది. కాసేపయ్యాకా, “కాలేజీకి వెళ్దాం, రా” అంది.

“నేను మా ఇంటికి ఫోన్ చెయ్యాలి, నువ్వు బయల్దేరు. నేను తరువాత వస్తాను” చెప్పింది సునీ.

“పర్వాలేదు. నేను ఆగుతాను. నాకు ఫస్ట్ అవర్ లేదు.”

“వెళ్ళమన్నానా?”

***

ఇలాగే అసౌకర్యంగా మరికొన్ని రోజులు గడిచాయి. ఆంగ్ల భాషలో Q ఉన్న చోటల్లా U ఉంటుంది. అలా ఉండే వారి మధ్య దూరం పెరుగుతోంది.

ఎప్పుడూ బద్ధకంగా ఉండే అనీ, ఓ రోజు సునీ ఇంకా నిద్రలేవకపోవడం గమనించింది.

“రాణీ గారూ, సుప్రభాతం పాడాలా?” అంది.

జవాబు రాలేదు. ఎందుకో అనుమానం వచ్చి, సునీ నుదుటి మీద చెయ్యి వేసింది. కాలిపోతోంది. సునీకి బాగా జ్వరం వచ్చిందని గ్రహించి, డాక్టరు‍కి ఫోన్ చేసింది, ఆ రోజు క్లాసులు ఎగ్గొట్టింది. సునీని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. సునీ ఆరోగ్యం కుదుటపడేవరకూ తన వెంటే ఉంది. పరిస్థితి మామూలయింది.

ఫైనల్ ఇయర్ పరీక్షలు మొదలయ్యాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంకా కొన్ని రోజుల తర్వాత మొదలవుతాయి. ఓ రోజు సాయంత్రం అనీ ఏడుస్తూ గదికి తిరిగొచ్చింది. మర్నాడు తనకి ఓ కఠినమైన పరీక్ష అయినా, ఏదో జరిగిందని గ్రహించి, చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి, అనీని చూస్తూ, ఓ అక్కలా, “ఏమైంది?” అడిగింది సునీ.

“నేను మోసపోయాను.”

ఆశ్చర్యపోయింది సునీ. “నిన్నెవరు మోసం చేశారు?” అడిగింది.

“నన్ను ప్రేమించిన వాడు.”

“నువ్వు ప్రేమలో పడ్డావా? చూశావా, నాకు తెలియనే లేదు. ఎవరా హృదయం లేని వ్యక్తి?”

“మీ క్లాస్‍మేట్, సునీల్.”

“సునీలా? అలా జరగడానికి వీల్లేదే?”

“ఏం, ఎందుకు?”

“నిన్ను ప్రేమిస్తున్నాని అతను నీకు చెప్పాడా?”

“నేరుగా చెప్పలేదు, ఇన్‍డైరెక్టుగా చెప్పాడు.”

“ఎలా?”

“నాతో ఉండడం అతనికి ఇష్టం.”

“నాతో ఉండడం కూడా ఇష్టమే. అలా అని మేమిద్దరం ప్రేమించుకున్నట్టా?”

“కాదనుకుంటా.”

“నువ్వేం అనుకోనక్కరలేదు. ఖచ్చితంగా అది ప్రేమ ‘కాదు’.”

“అయితే మరో అమ్మాయిని ఎవరినైనా ఇష్టపడుతున్నాడంటావా?”

“అది అతని ఇష్టం. అతను నీ సాహచర్యం కోరుకున్నాడా?”

“లేదు.”

“ప్రస్తుతం అతనితో ఏదైనా గొడవ పడ్డావా?”

“లేదు.”

“తనంతట తాను నీకెన్ని సార్లు ఫోన్ చేశాడు?”

“చాలా తక్కువ సార్లు, అవి కూడా ఏవో కాలేజీకి సంబంధించిన విషయాలకే.”

“అతను మర్యాదస్తుడు. నీకో సంగతి చెప్తాను. అతను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నాక్కూడా చెప్పాడు. నీ సంగతి నువ్వు ముందే నాకు చెప్పి ఉంటే నిన్ను వారించేదాన్ని, వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేసేదాన్ని. సరే, ఇక నన్ను చదువుకోనీ..”

“ఈ గడ్డు పరిస్థితిలో నువ్వు నాకు అండగా ఉండవా?”

“నువ్వే సమస్య సృష్టించుకున్నావు. నిప్పు నువ్వే అంటించుకుని, నన్ను మంటలార్పమంటే ఎలా? నాకూ రేపటికి ఓ సమస్య ఉంది. నీ అంతట నువ్వే అతన్నిష్టపడ్డావు, నీ తప్పొప్పులకి నీదే బాధ్యత, మంచి అమ్మాయిలా ఉండు, బాగా చదువుకో..”

“ఇది దారుణం, అన్యాయం..” అంది అనీ.

“నీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా లేనివన్నీ, నీ ప్రమాణాల ప్రకారం నీకు అన్యాయంగా కనబడతాయి. నీ కన్నీళ్ళకీ, నీ సిద్ధాంతాలకీ నేను లొంగను” చెప్పింది సునీ.

***

కొన్నేళ్ళు గడిచిపోయాయి. తాను ప్రయత్నిచిన అన్నింటిలోనూ సునీ రాణించింది. ఏదెన్నుకోవాలనుకునే అంశంలో కొంత తికమకకి గురైనప్పటికీ, ఆమె పాశ్చాత్య దేశాలలోని అవకాశాల వైపు మొగ్గు చూపకుండా, సివిల్ సర్వీసెస్ ఎంచుకుంది. అనీ కూడా బాగా చదివింది. ఇంజనీరింగ్ తర్వాత, ఓ ప్రఖ్యాత సంస్థ నుంచి మేనేజ్‍మెంట్ డిగ్రీ పొందింది. ప్రైవేటు రంగంలో ఉన్నత స్థాయిలో ఉంది. అయితే ఇప్పటికీ ఆమెలో మారని అంశమేమిటంటే.. వన్ సైడ్ లవ్. దీనివలనే తరచూ నిరాశకి లోనవుతుంది. సునీ భుజం ఆసారా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటుంది. తన చిన్నపిల్ల మనస్తత్వానికీ, సరిదిద్దలేని తప్పులకీ, ఇప్పటికీ, సునీ నుంచి.. తనకు వీలున్నప్పుడల్లా.. చివాట్లు పడుతూనే ఉంటాయి. ‘అప్పట్లో సునీ చెప్పినట్టు నడుచుకుని ఉండుంటే.. అయినా ఇప్పుడనుకుని ఏం లాభం?’ అనుకుని మనసులో వాపోతుంది అనీ.

ఆంగ్లమూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version