ఇరవై రోజులు

0
2

ఇరవై రోజులు

[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]”ఈ[/dropcap] అంతర్జాతీయ సదస్సులో ‘మనిషి వర్సెస్ మనసు’ అనే అంశంపై మాట్లాడుతోంది మీ మైత్రేయ. మనిషికి కలలెందుకొస్తాయ్..?! ఎలాంటి సందర్భాల్లో వస్తాయి? మనం చూసిన లేదా విన్న సంఘటనలే మన సబ్ కాన్షన్ మైండ్ కలల రూపంలో మెదడు తిరిగి తీసుకొస్తుంది.

మనం చూడనివేవీ మన కలలోకి రావు, మన ఊహ కూడా అక్కడికి వెళ్ళలేదు. రష్యాలో నివసిస్తున్న నా మిత్రుడి ఇల్లు నేను గతంలో చూసి వుంటే తప్ప నా ఊహలోకైనా రాదు చూశారా. మనం చూసినవీ విన్నవే మన ప్రపంచంలో ఉన్నవే మనకు మరోరూపంగా కలల్లో దర్శనమిస్తాయి. ఇక కలలు నలుపు తెలుపుల్లోన రంగుల్లోనా అని చాలా మంది అడుగుతుంటారు.. ఖచ్చితంగా రంగుల్లోనే. ఈ అంశంపై ఇరవై సంవత్సరాల పరిశోధనలు చేశాను. ఎనీ డౌట్స్”…

మైత్రేయ తన గంభీరమైన స్వరంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు.

వాళ్ళడగబోయే ప్రశ్నలను ముందే ఊహించి నేర్పుగా సమాధానాలిస్తున్నాడు.

అందరూ స్పెల్ బౌండ్.

సెమినార్ కాగానే స్టేజ్ దిగొచ్చి కార్ దగ్గరకు వేగంగా నడుస్తుంటే ఫోన్ రింగయింది.

“హలో సార్! ఇవాళ నాలుగుసార్లు ఫోన్ చేస్తే ఇప్పటికి ఫోనెత్తారా.. థాంక్ గాడ్. ఒక అందమైన అమ్మాయి ప్రేమించమని స్వయంగా అడుగుతుంటే ప్రేమించెయ్యొచ్చుగా అంత బెట్టు దేనికండీ?” అది ఒక అమ్మాయి సుస్వరమైన కంఠం.

“చైత్రీ.. మళ్లీ నువ్వేనా. ప్రేమ నీకుంటే చాలా, నాకుండొద్దా?ఎన్నిసార్లు చెప్పాలి నీకు” అన్నాడు మైత్రేయ

“ఆకల్లేకపోయినా కంచం ముందు కూర్చుంటే కొద్దోగొప్పో తింటాంగా. అసలు తిండి మొహమే చూడనంటే ఎలా సార్…!”

“నేనంత తిండి మొహం ఎరగనివాడ్ని కాను. సుష్టుగా తిన్నవాడినే. నన్ను చూడకుండానే ప్రేమిస్తున్నావా

నా వయసెంతో తెలుసా నీకు?” అన్నాడు మైత్రేయ

“మన ఫోన్ సంభాషణ మొదలై ఇరవై రోజులు. ఆ మాత్రం కనిపెట్టలేనా..  మీ వయసు ఒక అరవై దగ్గర్లో ఉండొచ్చుకదా! పెద్ద పొడుగు కాదు. కాస్త బొద్దు. జుట్టు కాస్త ఒత్తుగా ఉంటుంది. ఈ వయసులో ఒత్తుగా వుంది కాబట్టే అంత తలబిరుసు. చిన్న పొట్ట. కళ్ళజోడు కిందనించి సీరియస్ చూపులు.

మీరు జోకేస్తే ఇతరులు నవ్వాలి. వాళ్ళు జోకేస్తే మీరు గంభీరముద్ర. మీమీద మీకు నమ్మకం ఎక్కువ కదా….ఇంకా…”

కార్ దగ్గర ఆగి విలాసంగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు మైత్రేయ.

“హూ అర్ధమైంది. నా గురించి నెట్‌లో సెర్చ్ చేసుంటావు. అన్నీ తెలుసుకునే ఇలా సతాయిస్తున్నావ్ కదూ!”

“మీ గురించి నాకేం తెలీదు సార్.. ఆ రోజు మీరు అనుకోకుండా నాకు ఫోన్ చేశారు. ఆ కాల్‌లో మీ గొంతు విన్నాక, మీతో ఇరవై నిమిషాలు మాట్లాడాక, మీరు ఎంతో ప్రత్యేకం అనిపించాక మీ ప్రేమలో పడకుండా ఎవరుంటారు చెప్పండి.”

“పొరపాటున ఫోన్ చేశానని ఆ రోజే చెప్పేశాను. ఇంకా ఎందుకు ఈ ఫోన్ కాల్స్.. పరిచయం పెంచుకోవడం చేస్తున్నావ్?

అమ్మాయిల మనసు నాకు తెలుసు. తన ప్రియుడు తండ్రిలా లాలించాలని కోరుకుంటారు. ఐ నో దట్… నేను ప్రపంచంలో టాప్ ట్వంటీ సైకాలజిస్టుల్లో ఒకడిని.”

“అవునా… మీరు సైకాలజిస్ట్ అన్న సంగతి నాకింతవరకూ చెప్పలేదే.. మీరు ఎంతోమందిని చదివేసుంటారు.. బట్ కానీ అమ్మాయి మనసులో ఏముందో చదివినవాళ్ళు ఇంతవరకూ ఎవరూ లేరు.. మీరే ఫస్ట్ పర్సన్..”

“చైత్రీ! ఇన్నాళ్లూ నీతో ఎందుకు టాపిక్ కంటిన్యూ చేశానో తెలుసా, ఇరవై రోజులపాటు స్నేహం చేస్తే ఇద్దరిలో ఎవరి భావాలు బలమైనవైతే మనం వాళ్ళలా ప్రవర్తిస్తాం. వాళ్లలో ఏదో ఒక క్వాలిటీ మనకు తెలియకుండానే మనలో వచ్చి చేరుతుంది.

అప్పుడు ఎదుటివాళ్ళు మనగురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు చెప్పకుండానే తెలిసిపోతుంది. నేనందుకే నీతో ఇన్నిరోజులు మాట్లాడాను. ఇక నువ్వు నాలా ప్రవర్తిస్తావు చూడు.”

“ఆరునెలల స్నేహంలో వారు వీరవుతారని విన్నాను ఈ ఇరవైరోజుల కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది సార్”

“అంతా కొత్తగానే ఉంటుందిక. నీ ప్రవర్తన మారిపోతుంది ఎంజాయ్ ద ఛేంజ్.. బై…”

ఫోన్ కట్టయ్యింది…

***

మైత్రేయ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరేసరికి రాత్రి సరిగ్గా పన్నెండయ్యింది.

బయటకొచ్చి చూసేసరికి కార్ టైర్ పంక్చర్.

చెన్నై హైవే మీద నడక.

నడిచి చాలా రోజులవటంవల్ల ఎక్సరసైజ్ చేసినట్టుగా ఉంటుందని నడవటం ప్రారంభించాడు.

కొద్దిగా ఆయాసం వస్తోంది. ఇంకో రెండుకిలోమీటర్లు నడిస్తే ఇల్లువస్తుంది. తన రొప్పు తనకే వినబడుతోంది

కానీ మధ్యలో కీచుమని ఏదో శబ్దం. చెమటలు తుడుచుకుంటూ ఒక్కసారి ఆగాడు.

రొప్పు ఆగింది కీచుమని శబ్దం కూడా ఆగింది.

మళ్లీ నడకవేగం పెంచాడు. కీచుమంటూ ఏడుపు శబ్దం.

చెవులు చిల్లులుచేస్తూ అతిదగ్గర్లో వినిపిస్తోంది.

పక్కనే స్మశానం అనాలోచితంగా ఆ వైపు నడిచాడు.

గేటు సగం తెరుచుంది లోపల చీకటి.

కీచురాళ్లు అరుస్తున్నాయి. చెట్లమీద గబ్బిలాలు చప్పుడు చేస్తున్నాయి. వాసన.

దుర్వాసన శవం కాలిన వాసన.

ఎక్కడో నక్కల ఊళలు దానికి సమాధానంగా కుక్కల ఏడుపులు. ఇంకాస్త ముందుకు నడిచాడు.

ఎదురుగా నల్ల కుక్క.

దాన్ని దాటుకుని ముందుకెళ్లి ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసాడు. అదీ వెనక్కి తిరిగి చూసింది దానికళ్ళు రక్తం పోసినట్టు ఎర్రగా ఉన్నాయి.

భయం వేసి ముందుకు పరిగెట్టాడు.

కాళ్ళకి ఏదో గట్టిగా గుద్దుకుంది, అబ్బా అని అరిచి పాదం పట్టుకున్నాడు. పాదమంతా రక్తంతో తడిసిపోయింది.

ఆసరా కోసం అక్కడ దొరికిన స్తంభాన్ని పట్టుకున్నాడు. అప్పటివరకూ మెల్లిగా వినబడుతున్న ఏడుపు దగ్గరనుంచే వినబడుతోంది.

సమాధికి ఆనుకుని కూర్చుందో అమ్మాయి.

తలవంచుకుని ఏడుస్తోంది.

“ఎవరూ…” బిగ్గరగా అన్నాడు

ఏడుపు ఆగిపోయింది. ఆ అమ్మాయి తలపైకెత్తి చూసింది.

ఆ కళ్లలో గుడ్లు లేవు.

రెండు ఎర్రతిలకం బుడ్లు పెట్టినట్టు నెత్తుటి గడ్డలున్నాయి.

నో…నేను దారితప్పిపోయాను. నేనింటికి వెళ్లిపోవాలి అనుకున్నాడు

“దారి తప్పలేదు సరైన దారిలోకే వచ్చావ్.” అంది ఆ అమ్మాయి

“నా మనసులోమాట నీకెలా తెలుసు” అన్నాడు

“నాకన్నీ తెలుసు. నువ్వూ తెలుసు, నువ్వు వేసే వేషాలూ తెలుసు” అంది

“వేషాలా? అసలు నువ్వెవరు? నన్నెందుకు దారి మళ్లించావ్? ఈ స్మశానంలో దారెందుకు కాశావ్..?”

“నన్ను గుర్తుపట్టలేదా.. నేను మిళింద. నన్ను ముద్దు పెట్టుకున్నావ్. కౌగలించుకున్నావ్. నాలో ఆశలు రేపావ్. అంతలో మాయమయ్యావ్. అదేమంటే చెల్లినన్నావ్. అంతా నీ ఇష్టమేనా….. ఆడపిల్లంటే ఆటబొమ్మనుకున్నావా?”

“నేనేం చెయ్యలేదు. నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావ్. నేనా దృష్టితో నిన్నెప్పుడూ చూళ్ళేదు”

“ఇప్పుడు చూడు… బాగా చూడు. ఇక నువ్వు ఇంటికి వెళ్లలేవు. ఇదే మన ఇల్లు. ఇక్కడే మన కాపురం. ఇక్కడే మన శాశ్వత నిద్ర….”

“మిళిందా వదులు.. ఇది కరెక్ట్ కాదు ..వదులు…”

దగ్గు వస్తుంటే దిగ్గున లేచికూర్చున్నాడు మైత్రేయ

చెమటలతో ఒళ్ళంతా తడిసిపోయింది. నాకు ఎప్పుడూ ఇలా లేదు. ఎందుకిలాంటి కలొచ్చింది. ఎన్నడూ చూడనివన్నీ కల్లోకొచ్చాయంటే ఇవి నా కలలు కావు. ఈ కల చైత్రిదయ్యుంటుందా… అది నేను నమ్ముతున్నానా?

ఆధారాలు లేని నమ్మకం కదా అది.

ఈ కలే అలాంటివి వున్నాయనటానికి ఆధారమా…!?

***

 చైత్రికి ఫోన్ చేసాడు మైత్రేయ.

“సార్ మీకు మీరుగా నాకు ఫోన్ చెయ్యడమా సర్ప్రైజ్…”

“చైత్రీ! మిళింద ఎవరు?” అన్నాడు

“ఏవైంది సార్? అలా కంగారుగా వున్నారు”

“చెప్పు..మిళిందా అనే అమ్మాయి నీకు తెలుసా?”

“నాకు తెలీదు సార్.ఇంతకీ ఏమైంది?”

“ఆ అమ్మాయెవరో దయ్యంలా నాకల్లోకొచ్చింది. ఎప్పుడూ నాకిలాంటి కలలు రాలేదు. నీకెప్పుడైనా ఇలాంటివి వచ్చేవా?”

“మీకల్లోకా..ది గ్రేట్ టాప్ మోస్ట్ సైక్రియాటిస్ట్ మైత్రేయగారి కల్లోకా?”

“అవును”

“అలాంటి పిచ్చి కలలు నాకు చాలా సార్లు వచ్చాయి. అంతగా లెక్కచేయలేదు నేను. కొంపతీసి నేను మీరయ్యారేమో?!”

“అవును. మరి నేను నువ్వయ్యానా?”

“అయ్యారు సార్. ఎవరో ఒకమ్మాయిని తొట్లకొండకు తీసికెళ్లి నమ్మించి మోసం చేసినట్టు. చంపేసినట్టు. ఇలా ఏదో పిచ్చికల వచ్చింది. అది మీ కలా.. మీరు నేనయ్యానా సార్?!”

“నా మిత్రుడి ప్రియురాలిని ఒకడు ఇలాగే తీసికెళ్లాడు. వాడి కళ్ళముందే నిస్సహాయంగా కన్నుమూసిందిట. వాడి కథ నీకోసారి చెప్పానుగా”

“అది మీ కలా? అయితే మీరు నేనయ్యాను. ఎన్నడూ చూడని కల వచ్చిందేంటని కంగారుపడ్డాను”

“చైత్రీ ఒకసారి మనం కలుద్దామా?!” అన్నాడు మైత్రేయ

“తప్పకుండా కలుద్దాం. ఈరోజుకోసమే ఎదురుచూస్తున్నాను సార్, వెల్కమ్..”

***

“చైత్రీ! కలకత్తా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చా. నువ్వు చెప్పినట్టే క్యాబ్‌లో అభయ్ శంకర్ లేన్ కాళీమాత టెంపుల్ రోడ్ లోంచి వచ్చాను. ఇక్కడో పెద్ద ట్రాన్స్ఫార్మర్, దాని పక్కన పెద్ద రోడ్డు ఉంది. ఎటు రావాలో చెప్పు”

“ఆ అదే. ఆ సందు చివరిదాకా వచ్చి కుడివైపుకు తిరిగితే ఎక్కడో గుడుంటుంది”

“ఓకే.. నువ్వాలా ఫోన్‌లో చెబుతూ వుండు. వచ్చేస్తాను.” అన్నాడు మైత్రేయ

“అక్కడో పెంకుటిల్లు కనబడుతోందా…దాని ఎదురుగా…”

“ఆ.. ఇల్లేగా వచ్చేస్తున్నా….”

“అది కాదు.. దానిపక్క సందులోకి తిరిగితే చర్చి వస్తుంది…అది దాటి రాగలిగితే… సారీ దాటి వస్తే అక్కడే మా ఇల్లు”…

“చైత్రీ.. మాట్లాడు…మౌనంగా ఉన్నావేం.. మాట్లాడు చైత్రీ…” అన్నాడు మైత్రేయ కంగారుగా.

“సార్ చైత్రి ఇల్లు ఇదేనా?”

“చైత్రి ఎవరు..? అసలు మీరెవరు? అలాంటి పేరుతో ఎవరూ లేరండీ..”

“అరె ఆ అమ్మాయి ఫోన్‌లో అడ్రెస్ చెబుతుంటేనే నేను ఇంటిదాకా వచ్చాను”

“ఆ పేరుగల వాళ్ళు అసలిక్కడెవరూ లేరండీ.. మీరు రాంగ్ అడ్రెస్‌కి వచ్చినట్టున్నారు”

“అరె ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడే కాల్ కట్టయ్యింది”

“మీరెక్కడినుంచి వచ్చారండీ”

“చెన్నై నుంచి”

“ఆ పేరుతో ఎవరూ లేరండీ. మీకేవరో తప్పుడు అడ్రెస్ ఇచ్చినట్టున్నారు”

ఇదేంటి ఇప్పటిదాకా చైత్రి మాట్లాడుతూనే ఉంది. ఇదే అడ్రెస్ చెప్పింది. మళ్లీ ఫోన్ చేస్తే తీయట్లేదు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ అటూ ఇటూ చూసాడు మైత్రేయ.

“బాబూ! మీదేవూరన్నారు?” అడిగాడు ఆ ఇంటాయన.

“చెన్నయ్ నుంచి”

“మా ఎదురింటమ్మాయి చెన్నైలో ఉండేది”

“ఆ అమ్మాయి పేరు చైత్రి ఏమో” అన్నాడు మైత్రేయ

“చైత్రి కాదు బాబూ…మిళింద అంటారు”

“మిళిందా! ఇప్పుడుందా? ఉంటే వెళ్లి కలుస్తాను” అన్నాడు ఆతృతగా.

“ఇప్పుడు లేదు బాబూ! చైన్నై హైవే మీద జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇప్పటికి సరిగ్గా ఇరవైరోజులయ్యింది”

ఆ మాటకి మైత్రేయ తుళ్ళిపడ్డాడు.

ఆత్మలు ఉండవని ప్రపంచ వేదిక మీద ఢంకా బజాయించి చెప్పాడు.

మానసిక సమస్యలే అన్నిటికీ మూలం అన్నాడు.

పెళ్లి కాని మానసిక నిపుణుడికే మానసిక సమస్య తలెత్తిందా?

చైత్రి నిజంగా లేదా?!

తను మేధావిని అనుకుని, అసాధారణ వ్యక్తిగా ఊహించుకున్న తనని ఒకమ్మాయి వెర్రివాడ్ని చేసిందా…

ఎంజాయ్ ద ఛేంజ్ అన్న తనకే ఇలాంటి ట్విస్టా!

మైత్రేయ మనసులో ప్రశ్న మెదలగానే ఫోన్ రింగయింది.

“హలో… సార్! వస్తానన్నారా. ఇప్పుడు ఎక్కడిదాకా వచ్చారు. మీకోసమే ఎదురుచూస్తున్నాను. త్వరగా రండి సార్..!

“చైత్రీ నువ్వేనా! నువ్వు చెప్పిన అడ్రెస్‌కి వచ్చాను. నువ్వు లేవని చెప్పారు.” అన్నాడు మైత్రేయ

“చైత్రి ఎవరు సార్..నేను మిళింద. రోజూ మీతో మాట్లాడేది , మిమ్మల్ని రమ్మన్నదీ నేనేగా… మీరు చెన్నై హైవే దాకా వచ్చాక అక్కడొక పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడినుంచి కుడివైపుకు తిరిగితే చర్చి ఉంటుంది. దానిపక్కనే మా ఇల్లు. మీరు కాల్ కట్ చేయకండి. అడ్రెస్ చెబుతుంటాను. నేరుగా చర్చి దగ్గరకు వచ్చేయండి. అది దాటి రాగలిగితే… సారీ దాటితే ఆ పక్కనే మా ఇల్లు”

ఇప్పుడు కలకత్తా నుంచి చెన్నై వెళ్ళాలా…?

మైత్రేయ ఫోన్ కట్ చేసాడు. స్విచ్చాఫ్ కూడా చేసాడు. చెమటల్ని తుడుచుకున్నాడు.

ఇది కలా భ్రమా?

పైకి కనిపించే మనిషిలోని ముసుగును తొలగిస్తే లోపల కనబడే ముఖం అందుకు పూర్తి విరుద్ధం అని సైకాలజీ తెలిసిన మనిషిగా ఎవర్నీ నమ్మని తను విచిత్ర స్థితికి చేరుకున్నాడా?

తన ఇరవై రోజుల థీరీ ప్రకారం తనతో మాట్లాడిన అమ్మాయిలందరూ తనని ప్రేమించాలి.

తను మాత్రం కొన్నాళ్ళు మాట్లాడి వాళ్ళని కాదని ఫోన్ కట్ చేయాలి.

వాళ్ళ మనసుల్లో తను చెరగని ముద్రవెయ్యాలి. వాళ్ళు తనకోసం తపించిపోవాలి అనుకునే స్వభావాన్ని

పసిగట్టిన అమ్మాయెవరో కావాలనే ఇదంతా చేస్తోందా?

లేదా నాతో ఇరవైరోజులు మాట్లాడిన అమ్మాయిలా నేనే మారిపోయానా?!

తన మనసు అంతరాల్లో వున్న విషయం ఎవరికి తెలుస్తుంది?

‘డేల్ కార్నెగీ’ చెప్పినట్టు మన ఆలోచనా తరంగాలను వేరొకరు చదివే అవకాశం ఉందా?

ఈ ప్రపంచంలో నాకు తెలియని సూత్రం ఉందా?

సైన్స్‌కి అందని మరో అద్భుతం కూడా ఉందా?

తను తీరని ఒంటరితనంలో కూరుకుపోయి ఆత్మన్యూనతను అహంభావంలో దాచుకున్న ఫలితమా…

ఇది గర్వభంగ పర్వమా…

మైత్రేయని సందేహం ఇంకా వెంటాడుతూనే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here