Site icon Sanchika

ఇర్రావాడీ నదీతీరాన నడక

[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా నదీతీరాలలో తమ నడకలో భాగంగా మయాన్మార్ లోని ఇర్రావాడీ నదీతీరాన సాగించిన తమ పర్యటన అనుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్ది. [/box]

[dropcap]ఇ[/dropcap]ర్రావాడీ నది చాలా పొడవైన నది. మయన్మార్‌లోని N’mai మరియు Mali నదులు కలిసి Irrawaddy నదిగా మారి అండమాన్‌లోని సముద్రంలో కలుస్తుంది. 6వ శతాబ్దం నుండి ఇక్కడ వ్యాపారం జరిగింది. ఈ నదీతీరం గౌతమబుద్ధుడు నడయాడిన ప్రాంతం.

ఈ నదీ తీరాలలో నడవాలనే కోరిక, అక్కడి సాంప్రదాయ వేషభాషలు ఆకళింపు చేసుకోవాలనే కోరికతో ఉవ్విళ్ళూరుతూ మా మయాన్మార్ ప్రయాణపు ఏర్పాట్లు చేశాము.

మూడు జంటలు – సురేందర్ రెడ్ది, నీరజ; చంద్రారెడ్డి, కార్తీక, ఇంద్రారెడ్ది గారు, నేను – ఈ ప్రయాణం సాగించాము.

మేము మూడు జంటలం కలిసి డిసెంబర్ 2019లో హైదరాబాద్ నుండి బయల్దేరాము. హైదారాబాద్ నుండి ఉదయం ఆరు గంటలకు కలకత్తా, కలకత్తా నుండి మయన్మార్. మయన్మార్ లోని మాండలే వెళ్ళేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది. పదహారు గంటల ప్రయాణం. అయినా కూడా జోక్స్, నవ్వులతో ఆ 16 గంటల సమయం ఇట్టే గడిచిపోయింది.

మర్నాడు ఉదయం ఇర్రావాడీ నదికి బయలుదేరాము. ఇది బర్మాలోనే పొడవైన నది. 2815 కి.మీ. పొడవుంది ఈ నది. 16వ శతాబ్దంలో ఈ నదిని వ్యాపార నిమిత్తం, రాకపోకల నిమిత్తం చాలా విస్తృతంగా ఉపయోగించారు బ్రిటీషువారు. ఇప్పుడు 2007లో ఏడు హైడ్రో ఎలెక్ట్రిక్ డామ్స్ నిర్మించడానికి ఒప్పందం కుదిరింది.

ఇర్రావాడీ అనే బర్మా పేరు పాలి భాషలో భారతీయ Ravi River కి ఉన్న పేరు నుంచి వచ్చింది. పాలి భాషలో Sakka అంటే ఏనుగు మూపురం. బౌద్ధమతంలో Sakka అనే పదము చాలా ముఖ్యమైన దేవుడి పేరు. ఏనుగులను నీటికి గుర్తుగా (Symbol) వాడతారు. అలా ఈ ఇర్రావాడీ అనే పేరు వచ్చింది. ఇది టిబెట్‌లో పుట్టి బర్మాలో పారుతూ, అండమాన్ సముద్రంలో కలుస్తుంది. ఇది ప్రవహించిన అన్ని ముఖ్యమైన స్థలాలు – మాండలే, Yenangyaung, chauk, బగాన్, న్యాయూంగ్ Nyaung-U లకు వెళ్ళాము.

అందులో భాగంగా మొదటిరోజు ఈ ‘ఇర్రావాడీ’ నదిలో మా ప్రయాణం. ప్రొద్దున్న 9 గంటలకి మా ప్రయాణం మొదలైతే, సాయంత్రం 6 గంటల వరకు మేము ఈ పడవలోనే తిరిగాం.

నదీ తీరానికి చేరగానే అక్కడ బోట్‌లో మా ప్రయాణం. అక్కడ ఉన్న బెస్తవారిని, చేపలు పట్టేవారిని అన్నీ చూస్తూ మూడు గంటల తర్వాత ఒక తీరానికి చేరాము.

అక్కడ బోడావుపాయ (Bodawpaya) అనే రాజు ఇర్రావాడీ నదీ పడమర తీరనా తన నివాసాన్ని ఏర్పర్చుకున్నారు. మిన్‌గున్ (Mingun) అనే పగోడాని నిర్మించారు. 500 అడుగు ఎత్తులో కట్టారు. ఇది పూర్తి చేయకమునుపే 1819లో రాజు చనిపోయారు.

ఈ పగోడా ప్రపంచంలోనే ఇటుకతో కట్టిన కట్టడాలలో అతి ఎతైన కట్టడం. 500 అడుగుల ఎత్తు 450 అడుగులు (basement) వెడల్పుతో, 162 అడుగుల గుమ్మటంతో అంతా శూన్యంగా లోపల ఒక చిన్న బుద్ధుని విగ్రహంతో వున్న ఆ కట్టడాన్ని చూచి అలా నోరు తెరిచాను. ఎంత అందమైన కట్టడం! నా జీవితంలో అలాంటి పురాతన ఎత్తైన ఇటుక కట్టడాన్ని చూడడం అదే మొదటిసారి.

1838లో భూకంపంలో కొద్దిగా పాడైనా, ఇది ఎంతో అందంగా వుంది. అక్కడే అన్ని వస్తువులు గొడుగులు అమ్ముతున్నారు. మేము అక్కడే లోపలికి వెళ్ళి బుద్దునికి మ్రొక్కి క్రిందికి వచ్చాము.

అక్కడి నుండి మరో పగోడాకి వెళ్ళాము. అక్కడ కంచుతో తయారు చేసిన ఒక పెద్ద గంట చూచి ఆశ్చర్యపోయాము. బోడావుపాయ (Bodawpaya) అనేది ప్రపంచంలోనే అతి ఎతైన మ్రోగుతూ వున్న కాంస్య గంట.

ఈ గంట 12 అడుగుల ఎత్తు 16 అడుగుల 3 అంగుళాల వెడల్పుతో 90 టన్నుల బరువుతో వుంది. గంటని ఒక పెద్ద సుత్తితో కొడితే పెద్ద శబ్దం వస్తుంది. అక్కడ ఫొటో దిగుతూ వుండే ఒక అమ్మాయి వచ్చి ‘నాకు మీతో ఒక ఫొటో దిగాలని వుంది’ అని అడిగింది. అక్కడ ఫొటో దిగి ఆ గంటని చూస్తూ ఆశ్చర్యచకితులమై ముందుకి వెళ్ళాము.

ఇక్కడ తెల్లటి పాలనురుగు అలలుగా మారితే ఎలా వుంటుందో అలాంటి అలల కట్టడం చూచి ఆశ్చర్యంలో మునిగి తేలాను.

సముద్రపు అలలు ఆ పై ఎత్తు నుండి ఒక ఒరవడిలో వస్తే ఎలా వుంటుందో ఆ తెల్లటి అలల్లా తేలుతూ వున్న కట్టడం చూచి ఎగిరి గంతులేశాను.

అక్కడ 4,5 ఫొటోస్ తీసుకుని, పైకి ఎక్కాము. అది Myatheindan pagoda, Mingun. జీవితంలో ఈ కట్టడమెంత ఆశ్చర్యానికి గురి చేసిందో చెప్పలేను.

మనసు చలించి బహురూపియై అనుభూతి చెంది, అక్షర అవతారం ఎత్తి పదాలని బిందువులుగా, వాక్యాలను అలలుగా మలుచుకుని కవితని జలపాతంలా కురిపిస్తుంది. స్పందించే హృదయముంటే కవిత్వం నదిలా ప్రవహిస్తుంది ఈ పగోడా చూస్తే.

Sayadaw అనే బౌద్ధ సన్యాసి 1954లో 16000 పేజీలలోని బౌద్ధుల పుస్తకాలను (శ్లోకాలను) రంగూన్‌లో ఏకధాటిగా చూడకుండా చదివి గిన్నీస్ వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డుని సాధించారు. Human memory… మనిషి జ్ఞాపక శక్తి ఎంత వుందో నిరూపించారు. పీటక సాహిత్యాన్ని నిరాటంకంగా ఏకధాటిగా చెప్పగలిగారు.

ఇది మానవుని మేథస్సుకి తార్కాణం, మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. మేము 3 జంటలు వెళ్ళాము. మాలో ఇద్దరు మంచి జోక్స్ వేస్తూ నవ్విస్తూంటే చాలా ఆహ్లాదంగా సాగింది ఈ ప్రయాణం.

అక్కడి నుండి మేము మాండలే నుండి నగరానికి బయట వున్న Mahalawka Marazein Kuthodaw Pagoda కి వెళ్ళాము. 1820లో Mindon అనే రాజు చలవరాతి బండలపై (Jataka stones) మీద పగోడా చరిత్ర గురించి వ్రాసిన పలకలు 13 ఎకరాలలో ఒక్కో పలకకి ఒక పగోడా కట్టారు.

ప్రపంచంలోనే అతి పెద్దదైన పుస్తకం. అన్నీ వింతలే.

అక్కడి నుండి మేము మొత్తం టేకుతో కట్టిన వంతెన, ప్రపంచంలోనే అతి పొడవైన అతి పురాతనమైన వంతెన 1-2 కిలోమీటర్ల పొడవున్న వంతెన చూశాము. 1850లో తుంగమాన్ చెరువుకి దగ్గరగా అమరపురకి దగ్గరగా ఈ (U-Bein Bridge) ఉ-బెయిన్ వంతెనని నిర్మించారు.

ఈ వంతెనపై 1 గంట నడిచి అక్కడ నుండి ఒక monastery కి వెళ్ళాము. ఈ పగోడా మొత్తం కట్టెలతో కట్టివుంది. 2 అంతస్తులు.

ఇది ఒక ప్రమాదంలో కొంత భాగం కాలిపోయిందట. దానిని రిపేర్ చేసి వుంచారు. ఆ కట్టడం నగిషీలు, కార్వింగ్ చాలా అందంగా వుంది.

Shwe-nandaw Kyaung – ఇది రాజుగారి రాజ భవనము. 1850లో Mindon రాజుగారి సౌధము. 1878లో Mindon రాజుగారు చనిపోయ్యారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఇది కొంత భాగం కాలిపోయింది. టేకుతో తయారు చేసిన మొత్తం సౌధం అక్కడి ఆర్కిటెక్చర్‌తో అందంగా వుంది. దీనినే Golden Palace Monastry అంటారు. ఇందులో బంగారంతో తయారైన నగిషీలు కూడ వున్నాయి.

లోపల బుద్ధుని విగ్రహం వుంది. అన్ని స్తంభాలు బంగారపు పూతతో పూసిన స్తంభాలు. అప్పుడు వేసిన పూత అలాగే వుంది. ఇది నాల్గు అంతస్తుల మేడ. అబ్బురంగా వుంది.

అక్కడి నుండి Baganకి మేము 5 గంటల ప్రయాణం. Bagan‌లో 4000 పగోడాలు వున్నాయి. అందులో Ananda పగోడాలో 4 బుద్ధుని బంగారు విగ్రహాలు వున్నాయి.

ఇక్కడే మా friend శ్రీల అమెరికా నుండి Myanmar చూడడానికి వచ్చారు. మేము ఇక్కడ కలిశాము. ఆనందంతో కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని… నాతో వచ్చిన అందరికీ పరిచయం చేశాను. ఇంటర్‌లో నా friend. 40 years friendship.

Dhammayazika Pagoda… ఇది చాలా పెద్ద పగోడా. ఈ Bagan‌కి ‘Land of Thousand Pagodas’ అని పేరు వుంది.

     

Shwezigon Pagoda చాలా ప్రసిద్దమైనది. 3 అంతస్తులలో గంట ఆకారంలో వున్న ఈ పగోడాలో బుద్ధుని అస్తికలు వున్నాయట. 100 అడుగుల ఎత్తు వున్నది దీని గోపురము. మేము ఈ గోపురము నుంచే Myanmar లో సూర్యస్తమయం చూశాము.

1271-72లో మంగోలీయులు దాడులు చేయగా, ఎదిరించి వారిని 1277-78లో తిరిగి పంపారు. 1283-85లో వాళ్ళు మళ్ళీ దండెత్తి వచ్చి ఈ Burma ని జయించారు. pagan (Bagan) ని రాజధాని నగరంగా వుంచారు. 1277-78లో మార్కోపోలో అక్కడికి వెళ్ళినట్లుగా అతని travelogueలో రాసుకున్నారు.

మొదటి పాశ్చాత్య ప్రయాణికుడైన Marco polo బర్మా (Mien) గురించి వ్రాసిన మొదటి ప్రయాణీకుడు. మేము వెళ్ళిన pagodaలో Marco polo అతి పెద్ద బుద్ధుడి విగ్రహం చూశానని రాసుకున్నారు. మేము ఆ స్థలానికి వెళ్ళాము. ఈ పగోడాలో ఎప్పుడూ అన్నదానం కొరకు ధనాన్ని దానం చేస్తారు ఇక్కడి వారు.

మేము కూడ అన్నదానం కొరకు కొంత డబ్బుని అందంరం విరాళంగా ఇచ్చాము. అది కూడా 4 మెట్లు ఎక్కి ఆ దానపాత్రలో వేయాలి. వేలాది రూపాయలు, బియ్యం బస్తాలు వేల వేలు వున్నాయి అక్కడ.

బౌద్ధ సన్యాసులు ఈ డబ్బుని అన్నదానం కొరకు వాడతారట.

మరో పెద్ద బుద్ధుడి విగ్రహం నేను చూశాను. ఒక విగ్రహం 14 మీటర్ల పొడవు వున్న కట్టెతో చేసిన విగ్రహం తజకిస్థాన్‌లో చూశాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను.

ఇదే MANUHA PAYA పగోడా. ఇది చూచి మరెన్నో పగోడాలు చూశాము. చాలా ప్రాచీనమైన, పడిపోయిన, అన్ని పగోడాలు 2000 వరకు పగోడాలు ఈ ప్రాంతంలో చూసాము.

Bagan నుండి Heho కి విమానంలో వెళ్ళాము. Heho నుండి మేము గుహలో వున్న బుద్ధుని దేవాలయానికి వెళ్ళాము. మన తిరుపతి కొండలాగ వుంది. అక్కడికి బస్‌లో వెళ్ళి లిఫ్ట్‌లో చాలా అంతస్తులు పైకి వెళ్ళి గుహలకి వెళ్ళాము. ఈ గుహలో 4000 బుద్ధుని విగ్రహాలు చూచి ఆశ్చర్యపోయాను.

4000 బుద్ధుని విగ్రహాలు ఒకే గుహలో వుండటం ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇది ఒక వింత.

4,5 గంటలు ఆ విగ్రహాలని చూచి క్రిందకి వచ్చాము. అక్కడి నుండి klaw అనే గ్రామానికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా పురాతనమైన పగోడాలు వున్నయి.

అక్కడి నుండి మేము Kalaw వెళ్ళాము. పైన హిల్ రిసార్ట్‌లో వున్నాము. ఇక్కడ అతి పురాతనమైన పగోడాలు చూసి అక్కడ అద్దకం రంగులు తయారు చేసే కుటీర పరిశ్రమకి వెళ్ళాము. వారు ఒక నారని తీసి దానితో బట్టని నేసే విధానము చూశాము, అద్దకం రంగులతో తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఆర్గానిక్ రంగులు. అవి అన్ని చూసి Inle Lakeకి వెళ్ళాము.

ఇది కాశ్మీర్ లోని దాల్ లేక్ లాగా వుంది. ఇక్కడ పంటలు పండిస్తున్నారు. ఎన్నో చెక్కతో తయారు చేసిన ఇళ్ళలో నివసిస్తున్నారు. తామర పువ్వుతో తయారు చేసిన నారతో శాలువాలు తయారు చేస్తున్నారు. సిగరెట్లు, బీడీలు తయారు చేసే పరిశ్రమలున్నాయి, వెండి బంగారు నగల నగిషీ ఆభరణాలు అన్నీ తయారు చేస్తున్నారు. మేము ఒక శాలువా 1200కు కొన్నాము. అన్ని పడవలలో అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు.

అక్కడి నుండి ఒక పగోడాకి వెళ్ళాము. అది Golden temple. ఇక్కడ ఒక కథ వుంది. అక్కడ నుండి ఒక 5 విగ్రహాలని వేరే గుడిలో పెడదామని పడవలో తీసుకొని వెళ్తున్నారట. ఆ పడవ మునిగిపోయి ఒక విగ్రహం పడిపోయింది. 2వ రోజు తెల్లవారేసరికి ఆ విగ్రహం మళ్ళీ పాత గుడిలో కూర్చుని వుందట. అలా 2,3 సార్లు ఆ విగ్రహం అక్కడే వుండేసరికి మళ్ళీ అక్కడే ప్రతిష్ఠాపన చేశారు. అది ఎన్నో వందల కిలోల స్వచ్చమైన బంగారంతో కూడుకొని వున్న విగ్రహాలు. వీరు ఈ విగ్రహాలకి బంగారు రేకుతో తాపడం చేస్తే ఎన్నో వందల కిలోల బంగారు విగ్రహాలుగా మారిపోయాయి.

Inle Lake మన కాశ్మీరుని తలపిస్తుంది కాని అక్కడ మంచు లేదు. Myanmar లో అతి సుందరమైన ప్రదేశం అంటే Inle Lake. ఈ ప్రాంతం గురించి యుద్దాలు జరిగాయి, అంత అందమైన ప్రాంతం.

Myeik islands.. మైఇక్ ద్వీపాలు ఎంత అందమైన ద్వీపాలు. ఇక్కడ ప్రకృతి ఆధారంగా జీవించే Salon tribe సలోన్ అనే జాతి గిరిజనులు ఇక్కడే జీవిస్తున్నారు. ఈ Salon జాతి ఆడవారు మెడ పొడుగుగా వుండడానికి మెడ చుట్టూ రింగులుగా ఆభరణాలు వేసుకొని వారి మెడను పొడిగించుకుంటున్నారు. వారితో ఫోటో దిగాము.

Myeik గ్రామములో ఒక పగోడాకెళ్ళాము. అక్కడ ఒక విదేశీయుడు వచ్చి photos తీసి ఆ పగోడా పేరు తెలియక ‘cats jumping pagoda’ అని రాశాడట. అది పెద్ద ఆక్షరాలతో అన్ని పత్రికలలో రాశారట. అది అలా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ ఆ Pagodaని ‘cats jumping Pagoda’ అనే పిలుస్తారు. అక్కడ చాలా పిల్లులు కూడా వుండేవట…. ఇప్పుడు అన్ని లేవు.

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే Myanmar లో దొంగలు లేరు. మూడు చోట్ల ఇది రుజువైంది. మా friend తన గదిలో నల్ల పూసల గొలుసు మరిచిపోతే… Mandalayలో మరిపోయాము… Yangon వరకు మనిషిని పంపి ఆ వస్తువు తిరిగి ఇచ్చారు.

ఐఫోన్‌ని ఈ ‘cats jumping pagoda’ లో మరచిపోయారు. మేము పడవ ఎక్కుతుంటే ఒక పర్లాంగ్ దూరం పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఐఫోన్‌ని తిరిగి ఇచ్చారు.

మేము మరిచిన చిన్న చిన్న వస్తువులన్నీ ఒక కవర్లో వేసి ప్రతి place లో మాకు తిరిగి ఇచ్చారు. వారి నిజాయితీకి నా జోహార్లు.

అక్కడి నుండి Yangon వచ్చాము. ఇక్కడ బుద్ధుని విగ్రహం ప్రసిద్ధి. Puyathonzu అనే గ్రామముని ధర్మసేటి అనే అతను ఎన్నో పగోడాలను కట్టించారు.

Shwegugye అనే బుద్ధుని విగ్రహం… బాగో (Bago)లో కట్టిన విగ్రహం విశిష్టమైనది. బుద్ధుడు తన సన్యాసం పుచ్చుకున్నాక 7 వారాలు ఇక్కడ గడిపారు. 7 పెద్ద విగ్రహాలలో ఈ ప్రాంతమంతా పగోడాలు కట్టించారు.

పడుకున్న భంగిమలో ఉన్న వున్న బుద్ధుని విగ్రహం చాలా పెద్దది. ఇది BAHANలో వుంది. దీని పొడవు 66 మీటర్లు (217 అడుగులు). ఇది బర్మాలోనే పెద్ద విగ్రహం. జపాన్‌లో 110 మీటర్లు, మయన్మార్‌లో 116 మీటర్లు, థాయ్‌లాండ్‌లో 121 మీటర్లు ఉన్న బుద్ధ విగ్రహాలు చూశాను. కాంబోడియాలోని అంగోర్‌వాట్ లోను, కజకిస్థాన్‌లోనూ ఎంతో పెద్ద బుద్ధుని విగ్రహాలు చూశాను. చైనాలో కూడ నిలబడి వున్న, పడుకొని వున్న బుద్ధు విగ్రహాలు చూశాను. 380 అడుగుల నిలువెత్తు బుద్ధ విగ్రహాన్ని చైనాలో చూశాను.

అలాగే అతి ఎతైన పొడవైన విగ్రహాలు బ్రెజిల్‌లోని క్రైస్ట్‌ విగ్రహం; మంగోలియాలో చంగీజ్ ఖాన్ విగ్రహం; అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం… అన్ని విగ్రహాల ప్రత్యేకత దేనికి దానిదే.

జార్జియాలో Kartlis Deda ఎత్తు 65.6 మీటర్లు. Georgia లోని Batumi లో Ali and Nino statue చూశాను. ఇది బ్రాంజ్‌తో చేసిన ఇద్దరు ప్రేమికుల విగ్రహాలు. ఈ బొమ్మలు ప్రతి 15 నిముషాలకి కలుసుకొని విడిపోతాయి.

ఇలా బగాన్‌లో 40 లక్షల పగోడాలు వున్నాయని ప్రతీతి. మేము చూచిన పగోడాలు మాత్రమే 2000 పగోడాలు చూచి వుంటాము.

ఇక్కడ ఎక్కడా ఇంగ్లీషు బోర్డ్స్ కనిపించవు. ఇన్ని బుద్ధుని విగ్రహాలు చూసి ఆయన నడిచిన మార్గంలో మేము నడిచి ఎంతో పుణ్యం కట్టుకున్నాము. ఎంతో మానసిక ఆనందాన్ని పొందాను. 4000 బుద్ధుని విగ్రహాలు ఒక్క గుహలో ప్రపంచంలో ఎక్కడా కూడ లేవు. Myanmarని వదలలేక మా friends jokes miss అవుతూ మేము ఇండియాకి తిరిగి వచ్చాము.

Exit mobile version