[శ్రీ వారాల ఆనంద్ ఆనంద్ వెలువరించిన ‘ఇరుగు పొరుగు’ అనే అనువాద కవితల సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, అనువాదకులు శ్రీ వారాల ఆనంద్ వెలువరించిన అనువాద కవితల సంపుటి ‘ఇరుగు పొరుగు’. ఇందులో 29 భారతీయ భాషల్లోని 90 మంది ప్రసిద్ధ కవుల 152 అనువాద కవితలున్నాయి.
“కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేసి చూస్తేనే కొత్త భాష వినిపించే మన దేశంలో భాషా సాహిత్యాల మధ్య ‘ఆదాన్ ప్రదాన్’ అత్యంత ముఖ్యమైనది. అది సాధ్యం కావడానికి ఆయా భాషల నడుమ అనుబంధం వాటి మధ్య అనువాదం అత్యంత అవసరమైన ప్రక్రియ. రెండు భాషలకూ, రెండు వ్యక్తీకరణలకూ, రెండు సంస్కృతులకూ నడుమ ‘అనువాదం’ ఓ అక్షరాల వారధి. సమస్త మానవాళి జీవితాల్నీ, జీవనానుభవాల్నీ ఏకం చేసే ఓ సాంస్కృతిక వేదిక. అందుకే సాహిత్య చరిత్రలో అనువాదకుడి పాత్ర విలక్షణమయింది, విశిష్టమయిందీ కూడా” అని అన్నారు కవి తమ ముందుమాట ‘అనువాదం గొప్ప అనుసృజన’లో. “ఈ ‘ఇరుగు పొరుగు’లో వున్న కవితలన్నీ నేను చదివినవి, నాకు నచ్చినవి, నేను అందరితో పంచుకోవాలనుకున్నవి మాత్రమే.” అని తెలిపారు.
అలా తనకి నచ్చిన, తనపై బలమైన ముద్ర వేసిన కవితలను సమహృదయులకు అందించటం కోసం అనువదించారు వారాల ఆనంద్.
“ఇరుగు పొరుగు భాషల్లో కవిత్వం ఎట్లా వస్తున్నది. అక్కడి కవులు ఏమి రాస్తున్నారు, ముఖ్యంగా వర్తమాన కవుల రచనలు ఎట్లా ఉన్నాయి వాటిని పరిచయం చేయాలనుకున్నాను. రూపంలో సారంలో ఆయా భాషల్లో కవిత్వం ప్రత్యేకతలు ఏమిటి అవన్నీ తెలియాలంటే వాటిని తెలుగులోకి అనువాదం చేసి అందించాలనుకున్నాను” అన్నారు. ఈ కోణం నుంచి చూస్తే ఈ అనువాద కవితలు విశిష్టమైనవి.
~
దుఃఖం ద్వారా తమ ఉనికి తెలపాలనో, తెసుసుకోవాలనే కొందరు కోరుకుంటారు. “నువ్వు వెళ్ళిపోతే/నా దుఃఖపు ఉనికిని/ఎవరు నిరూపిస్తారు?” అని అడుగుతారు ఆఘా షాహి ఆలీ ‘ఉనికి’ అనే కశ్మీరీ కవితలో. “నా దుఃఖానికి మాటలొస్తే/నా పేరేమిటో నేనెక్కడివాణ్ణో/నాకు తెలిసేది” అంటారు ఫైజ్ అహ్మద్ ఫైజ్ ‘దుఃఖానికి మాటలొస్తే’ అనే ఉర్దూ కవితలో. వేదన మనిషి అంతరంగాన్ని వెల్లడిస్తుందనే భావన ప్రదర్శితమవుతుందీ కవితల్లో.
సూర్యుడిని ఎవరో దొంగిలించుకుపోయినప్పటి నుంచి ఆమె అలిగిందట, సూర్యుడిని వెతుకుదామనీ, దొరకకపోతే ఒక్కో కిరణాన్ని జమచేసి కొత్త సూర్యుడిని నిర్మించి ఆమెను నిద్రలేపి ఊరడిద్దామని అంటారు ఉర్దూ కవి జావేద్ అఖ్తర్. ఇంతకీ ఎవరామె? ‘ఉదయపు కన్య’. ఎంత అద్భుతమైన భావన!
మనుషులు, జంతువులు, వృక్షాలు – సకల జీవుల మనుగడకు ఒక పరిమితి ఉంటుందని, ఆ పరిమితి ముగియగానే, “మనుషులు సమస్త జీవజాలమే ఎగిరిపోతుంది, ఎగిరిపోయేది కాలం కాదు” అంటారు ఒరియా కవి సీతాకాంత్ మహాపాత్ర ‘కాలం ఎగిరిపోదు’ అనే కవితలో. నిశితమైన పరిశీలన! నశ్వరతే శాశ్వతమనే భావన!
‘పదును కావాలి’ కవిత నేటి సమాజంలోని మనుషుల ధోరణికి దర్పణం పడుతుంది. ఎదుటి వ్యక్తిలో తమకి నచ్చని మార్పు వస్తే, దూరంగా ఉండడమనే జనాల స్వభావాన్ని పట్టి చూపించింది ఆర్. ఎస్. భాస్కర్ గారి ఈ కొంకణీ కవిత.
మోహన్‍కృష్ణన్ కలడి గారి మలయాళ కవిత ‘పాల ఐస్’ బాలకార్మికుల వ్యథని విభిన్నంగా వ్యక్తపరిచింది. చదువు పట్ల ఓ చిన్నారి ఆశనీ, పసివయసులోనే బాధ్యతలు మోస్తూ, పనులు చేయకపోతే హింసకి గురవుతామనే భయాన్ని తెలుగు పదాల్లో గొప్పగా వ్యక్తీకరించారు అనువాదకులు.
స్వదేశంలో వృద్ధులైన తల్లిదండ్రులూ, వారికి దూరంగా, విదేశాలలో సంతానం! మధ్య అంతం లేదనిపించేలా మహాసముద్రం! ఆఘా షాహి ఆలీ ‘పిలుపు’ అనే కశ్మీరీ కవిత అమ్మానాన్నల – కొడుకూకూతుళ్ల అంతరంగాలను స్పృశిస్తూ సాగుతుంది. ఓ పాదంలో ‘విదేశీ దుఃఖం’ అనే ప్రయోగం ఈ కవితకి బాగా నప్పింది.
మూడో వ్యక్తి ప్రమేయం ఇద్దరు స్నేహితులని ప్రాణమిత్రులుగా మార్చిందనీ, ఆ ఇద్దరూ కూడబలుక్కుని మూడో వ్యక్తిని తరిమేస్తే, ఆ ఇద్దరి మధ్య స్నేహం నశించి, శత్రుత్వం నెలకొందని చెబుతుంది నిదా ఫజ్లీ ఉర్దూ కవిత ‘మూడో మనిషి’.
చనిపోయిన వారిని ఖననం చేయడానికి చోటు సరిపోక, ఓ సమాధి లోనే మరో శవాన్ని పాతిపెట్టిన సందర్భంలోని దురవస్థని మహమ్మద్ ఆల్వీ ఉర్దూ కవిత ‘స్మృతి లేఖనం’ వెల్లడిస్తుంది.
యాంత్రికత లేని, మానవత్వం వైపు సాగే కొత్త మార్గం కావాలంటే ఏం చేయాలో కువర్ నారాయణ్ హిందీ కవిత ‘కొత్త మార్గం’ సూచిస్తుంది.
తొలి సంధ్య వేళ ఆకాశంలో, ఒక నిశ్శబ్ద దుఃఖపు నీడ మౌనంగా, ఒంటరిగా తేలియాడుతోందంటారు బెంగాలీ కవి మోనోతోష్ చక్రవర్తి ‘సూర్యోదయం సమీపిస్తున్నది’ అనే కవితలో. అవ్యక్త వేదనని ప్రతిబింబిస్తుందీ కవిత.
భ్రమలలో ఉన్న పాలకులని ప్రశ్నిస్తే – నిజాయితీపరులకి ఏం జరుగుతుందో బెంగాలీ కవి నరేంద్రనాథ్ చక్రవర్తి ‘దేవతా వస్త్రాలు’ కవిత చెబుతుంది.
పదాల ప్రభావం ఎలా ఉంటుందో, పదాలు ఎంత శక్తివంతమైనవో, ఎలా లోతుల్లోకి తీసుకెళ్లగలవో, ఎలా మరో లోకంలోకి తోడ్కొని పోగలవో హిందీ కవి అశోక్ వాజ్‌పేయి ‘ఒక పదం’ కవిత వెల్లడిస్తుంది.
స్వప్నాలను సాకారం చేసుకోవడానికి కృషి పట్టుదలా ఉండాలని మనం వింటాం, అంటాం. కానీ పంజాబీ కవి పాష్ మాత్రం కలలు కనడానికి కూడా సాహసమూ, సత్తువా కావాలంటారు ‘కలలుగనే సహజ ప్రవృత్తి’ కవితలో. ఆలోచింపజేసే కవిత!
వర్తమాన సమాజంలో ఎటువంటి కవితలు రాయాలో మణిపురి కవి ధంగ్జమ్ ఇబోపిషాక్ కవిత – ‘కవిత’ చెబుతుంది. చుట్టూ జరుగుతున్న సంఘటనలకు స్పందిస్తే వాటిపై కవితలల్లితే ఎంత ప్రమాదమో కవి చెప్తారు.
జీవితంలో తండ్రి ప్రభావం ఎంతలా ఉంటుందో మైథిలీ కవి కృష్ణ మోహన్ ఝా ‘నాన్న’ కవిత తెలుపుతుంది. సాహిర్ లూధియాన్వీ ఉర్దూ కవిత ‘యుద్ధం వాయిదా వేస్తేనే మంచిది’ అన్ని కాలాలకు వర్తించే కవిత.
జీవిక కోసం కష్టపడే సామాన్యుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకుంటూ, జీవిస్తాడనీ ఇంగ్లీషు కవయిత్రి కానుప్రియా ధింగ్రా కవిత ‘క్రియాశూన్యత’ చెబుతుంది.
అమ్మ వండిన వంటకాలకు ఆ రుచి దినుసుల వల్ల కాక, అమ్మ ప్రేమ వల్ల వచ్చిందని తెలిసినప్పుడు మాతృమూర్తి ఆప్యాయత ఎంత గొప్పదో గ్రహిస్తామని గోపికా జడేజా గుజరాతీ కవిత ‘రుచి’ చెబుతుంది.
పద్మాసచ్‍దేవ్ డోగ్రీ కవిత ‘బాధ’ మనిషి వేదనలకు మూలమేమిటో వెల్లడిస్తుంది. జీవితపు గమ్యం తెలియక, ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక, తమకంటూ ఏ ప్రత్యేకతా లేకుండా లేకుండా జీవించేవాళ్ళల్లో తానూ ఒకడినని చెప్పుకునే వ్యక్తి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు సింధీ కవి వాసుదేవ్ మోహి ‘వాళ్ళల్లో ఒకన్ని’ కవితలో.
ఖాసీ భాష కవి కిన్ ఫం సింగ్ నాన్ కిన్రి కవిత ‘పార్కింగ్ స్థలం’ – రాజకీయాల్లోని ఆయారామ్, గయారామ్ సంస్కృతిపై ఓ విసురు.
మనుషుల్లో పెరిగిపోతున్న అనవసర, అకారణ పోటీతత్త్వాన్ని ఎండగడుతుంది కనిమోళి తమిళ కవిత ‘పొట్టీ’. స్త్రీలు పురుషుడి పట్ల చూపే ప్రేమలోనూ, పురుషుడు స్త్రీల పట్ల వ్యక్తం చేసే ప్రేమలోను ఉండే తేడాని మరాఠీ కవయిత్రి హీరా బన్సోడే గొప్ప పోలికతో చెప్పారు ‘నది’ కవితలో.
కొన్ని మార్మికమైన కవితలున్నాయి ఈ సంపుటిలో. ‘మిత్రమా – యవ్వనాన్ని కోల్పోయాం’, ‘సముద్రం నవ్వింది’, ‘మరణం’ (బెంగాలీ కవిత), ‘వృత్తం’ వంటి కవితలు పైపైకి తేలికగా అర్థమయ్యేలా అనిపించినా, జాగ్రత్తగా చదివితే, అంతర్లీనంగా ఉన్న నిగూఢత గోచరించి చదువరులను అబ్బురపరుస్తుంది.
~
అనుబంధంలో కొంతమంది మూల కవుల ఫోటోలతో పాటు వారి సంక్షిప్త పరిచయం ఇవ్వడం ముదావహం.
~
పంటికింద రాళ్ళల్లా కాకపోయినా, అక్కడక్కడా అక్షరదోషాలున్నాయి. అయితే అవి ఈ సంపుటిలోని కవితలను ఆస్వాదించడంలో పాఠకులకు అడ్డు కాబోవు.
ఈ పుస్తకంలో దొర్లిన ఒక పొరపాటు – ఒకే అనువాద కవిత రెండు సార్లు వేర్వేరు కవుల పేరిట ముద్రితమవటం. తొలి కవిత ‘ఓ వింతయిన రోజు’ (1వ పేజీ)కు హిందీ మూలం కుంవర్ నారాయణ్ అనీ, ఆంగ్లానువాదం అపూర్వ నారాయణ అని ఇచ్చారు. అదే శీర్షికతో అవే వాక్యాలతో 99వ కవితగా – మలయాళం, ఆంగ్లమూలం కే. సచ్చిదానందన్‍గా (136వ పేజీ) పేర్కొన్నారు. అయితే పైన చెప్పుకున్నట్టు.. ఇటువంటి పొరపాట్ల వల్ల ఈ పుస్తకం విలువేమీ తగ్గదు.
ఇవన్నీ చదివాకా, అనువాద కవితలలా కాకుండా, తెలుగు కవితల్లానే అనిపిస్తాయి. ప్రాంతాలూ, భాషలు వేరయినా, మౌలికంగా మనుషుల అనుభూతులు, ఉద్వేగాలు, స్పందనలు, వేదనలు, దుఃఖాలు ఒకటేనని ఈ సంపుటి ద్వారా మరోసారి గ్రహిస్తాం. ఇతర భాషలలోని చక్కని కవితలను తెలుగువారికి అందించినందుకు శ్రీ వారాల ఆనంద్‍కి అభినందనలు.
***
రచన: వారాల ఆనంద్
ప్రచురణ: పొయట్రీ ఫోరమ్, కరీంనగర్
పేజీలు: 235
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
వారాల ఇందిర రాణి,
ఇంటి నెంబరు 8-4-641, హనుమాన్ నగర్
కరీంనగర్. తెలంగాణ – 505001
ఫోన్: 94405 01281
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/irugu-porugu-anuvaada-kavitvam
~
శ్రీ వారాల ఆనంద్ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-varala-anand/