Site icon Sanchika

Is love enough, Sir?

[dropcap]ఈ[/dropcap] వారం నెట్‌ఫ్లిక్స్ లో Is love enough, Sir? చిత్రం చూసాను. కథనంలో చాలా విషయాలు స్పష్టంగా వున్నా, చాలా అవసరమైన విషయాలు మరుగున వున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే వాస్తవం తక్కువ ఊహ ఎక్కువ అనిపిస్తుంది.
అశ్విన్ న్యూయార్క్ లో ఉంటున్న ఓ రచయిత. సబీనా అన్న అమ్మాయితో వివాహం నిశ్చయం అయి వుంది. అతని తండ్రి రియల్ ఎస్టట్ చేస్తున్న ధనవంతుడు. అంతా నిశ్చయం అయ్యాక కూడా ఆ వివాహాన్ని కాదని అశ్విన్ ముంబై కి వచ్చేస్తాడు. శలవు మీద ఇంటికి వెళ్ళిన మైడ్ రత్నా ను శలవు రద్దు చేసి వచ్చేయమంటారు. రత్నా వచ్చిన తర్వాత అశ్విన్ ఫ్లాట్ లోనే వుంటూ అతనికి అన్నీ అమర్చి పెడుతుంది, వండి పెడుతుంది.
తన సోదరుడి అకాల మరణం తర్వాత, తన వివాహం రద్దయిన తర్వాత తను కొన్నాళ్ళు అమ్మా నాన్న దగ్గర వుంటే మంచిదని భావిస్తాడు అశ్విన్. తండ్రైతే తనతోనే వుండిపొమ్మంటాడు.
సబీనా తో వివాహం ఎందుకు ఆగిపోయింది? ఆమెకు మరొకరితో కొన్నాళ్ళు అఫేర్ నడిచిందట. అదీ కాకుండా అశ్విన్ కు ఆమె మీద అంత ప్రేమ లేదు, కానీ అందరూ ఆమెనే చేసుకోమనడంతో కొంత అయిష్టంగానే ఒప్పుకుంటాడు. ఆమె అసలుకి మంచి అమ్మాయే, అదేదో ఆవేశంలో అలా చేసి వుండొచ్చు అంటుంది స్నేహితురాలు. అప్పుడు అశ్విన్ అంటాడు, అంతే కాదు ఆమెకు కావాల్సిన భర్త మాటిమాటికి అంటిపెట్టుకుని వుండాలి, మెసేజిలు చెయ్యాలి అవన్నీ నావల్ల కావు అంటాడు. ఈ మాత్రం సమాచారం తో అతను ఆమె అతిక్రమణను క్షమించలేకపోతున్నాడు, లేదా ఏదో కారణం చేత అతనికి విముఖత వుంది. ఆ సబీనా మీద కాస్త సానుభూతే కలుగుతుంది. ఆమెను ఒక్కసారే చూపిస్తారు, రత్న ను గాజులు తొడుక్కోమంటుంది. నేను భర్తను కోల్పోయాను అవి నాకు నిషిద్ధాలు అంటే నచ్చచెబుతుంది, మన జీవితాన్ని మన ఇష్టంగా జీవించాలి అంటూ. ఆ ఒక్క సీన్ లోనే ఆమె కనిపిస్తుంది. దాని బట్టి ఆమె వ్యక్తిత్వం మీద సదభిప్రాయమే కలుగుతుంది.
ఇక రత్న ఒక పల్లె లో వుండేది. 19 ఏళ్ళకే పెళ్ళి, ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే భర్త చావు, కుటుంబ భారం మీద పడటం జరిగిపోతాయి. ధైర్యం కోల్పోక ముంబై కొచ్చి మైడ్ గా చేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తూ, చెల్లెలిని కూడా చదివిస్తూ వుంటుంది. ఆర్థిక స్వాతంత్రం చేత గర్వంగానూ ఫీల్ అవుతుంది. ఫేషన్ డిజైనర్ అవ్వాలన్న కోరికా వుంటుంది.
ఒకే కప్పు కింద వుంటున్న ఈ ఇద్దరి మధ్యా ఒక రకమైన మానసిక సన్నిహిత్యం పెరుగుతుంది. అతని అన్ని అవసరాలూ చూసుకోవడమే కాదు, చిన్న చిన్న మాటల ద్వారా అతని దిగులు బరువును కూడా తగ్గిస్తుంది. అతను కూడా ఆమెను ఆమె ఆశయాలనూ అర్థం చేసుకుని సహాయం చేస్తుంటాడు. ఈ దగ్గరితనం ఇతరులకు కనపడకుండా ఎలా వుంటుంది? మిత్రుడు అననే అంటాడు, ఇది దేనికీ దారి తీయని సంబంధం, నువ్వు ఆమెతో వున్నావంటే ఆమెకు ఎక్కువ చేటు. నువ్వైనా ఆమెను నీ కూడా పార్టీలకీ వాటికీ తీసుకెళ్ళలేవు, నవ్వుల పాలవుతావు. నేను అవేం పట్టించుకోనంటాడు. ఒకసారి ఆమె ముందు ప్రేమ ప్రతిపాదన చేస్తాడు. కానీ వివాహం ప్రసక్తి రాదు. ఆమెకు స్పష్టత వుంది, నేను ఉంపుడుగత్తెగా వుండలేనంటుంది. అతను న్యూ యార్క్ కు తిరిగి వెళ్ళి పోతాడు. ఆమెకు ఓ డ్రెస్ డిజైనర్ దగ్గర పని దొరుకుతుంది. ఆ ఆనందాన్ని పంచుకుందామని అతనింటికెళ్తే తాళం వేసి వుంటుంది. అతనికి ఫోన్ చేసి మొదటి సారిగా సర్ అనకుండా అశ్విన్ అని పిలుస్తుంది. అది ఆఖరి సన్నివేశం.
ఒక ధనవంతుడికి అతని కింద పని చేసే అమ్మాయితో ప్రేమ కలిగే వీలు లేదా? తప్పకుండా వుంటుంది. కానీ ఆ ప్రేమ మనగలగాలంటే ముందు ఇద్దరిలో సమానత్వం వుండాలి. ఆ తేడాను చెరిపెయ్యాల్సింది అతడే. ధైర్యంగా ప్రేమించినపుడు, దాన్ని అంతే ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలగాలి. సబీనా విషయంలోనూ, ఇప్పుడు రత్న విషయం లోనూ అతనిది బలహీన వ్యక్తిత్వం.
ఇక సినిమా కథ సాగతీతగా వుంది. అప్పటికీ చాలా వివరాలు లేవు. మరి గంటన్నర పాటు ఏం చూపించాడు? ఇటు నుంచి అటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం, టిఫిన్ పెట్టడం, భోజనం పెట్టడం ఇలాంటి వాటితో బూరను గాలి నింపి పెంచినట్టుగా చేసాడు. ఏ మాత్రం ఆసక్తిగా లేదు. ఏదో వుంటుంది వుంటుంది అనుకుంటూ చివరి దాకా చూస్తే టైటిల్స్ మాత్రమే కనిపిస్తాయి.


రత్న గా తిలోత్తమా షోం బాగా చేసింది. చిన్న పాత్ర లో గీతాంజలి కులకర్ణి కూడా. అశ్విన్ గా చేసిన వివేక్ గోంబర్ కూడా ఆ పాత్రంత డల్ గా వున్నాడు. దాన్ని నటన లో లోపం అనాలా, పాత్రకు తగ్గ నటన అనాలా తెలీదు. దర్శకత్వం రొహెనా గేరా ది, అది కూడా ఏవరేజ్ గా వుంది. ఇతర సాంకేతికతలు కూడా డిటో.
Watch at your own risk. Netflix లో వుంది.

Exit mobile version