Site icon Sanchika

ఇష్టమైన రాష్ట్రం కర్ణాటక

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ఇష్టమైన రాష్ట్రం కర్ణాటక’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను తొలిసారిగా చూసిన పర్యాటక రాష్ట్రం కర్ణాటక. అందులోనూ రాజధాని బెంగుళూరుని చూశాను. కారు కొనుక్కున్న కొత్తలో ఏదైనా దూర ప్రయాణం చేయాలనుకున్నాం. అప్పటికి మా తమ్ముడు మద్రాసులో ఎంజిఆర్ యూనివర్శిటీలో చదువుతున్నాడు “మద్రాసుకు వెళదాం అందరం కలసి” అని ప్రపోజల్ పెట్టాడు. మావారి ఫ్రెండు ఏమన్నారంటే వేసవిలో బెంగుళూరు బావుటుంది రండని పిలిచారు. మేము మా సిరిసిల్ల నుంచి మొదటగా బెంగుళూరు వెళ్ళి అక్కడ నుంచి మద్రాసు వెళ్ళి మరల అక్కడ నుంచి మా చీరాల వెళ్ళి తర్వాత సిరిసిల్ల తిరిగి వచ్చాము. కాబట్టి తొలిసారిగా పరాయి రాష్ట్రంలో కాలు మోపింది బెంగుళూరులోనే. ఆంధ్ర నుంచి కర్ణాటక రాష్ట్రంలో కారు ప్రవేశించేటపుడు సరిహద్దులు ఎలా ఉంటాయో అనే ఉత్సుకతతో అర్ధరాత్రి మేలుకుని మరీ చూశాను. ఏముందీ ఒక బోర్డు ఉన్నది. అంతేనా అనుకున్నాం. ఏమైనా తొలి అనుభవం ఒక గమత్తైన విషయం. ఇది జరిగి దాదాపుగా ముప్పైయేళ్ళు అవుతున్నది. ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని మేమే కారు నడుపుకుంటూ కొత్త కారులో చుట్టి వచ్చాం.

అప్పట్నుంచే బెంగుళూరులో ప్రేమలో పడ్డ మా కుటుంబం అడపాదడపా బెంగుళూరు వస్తూనే ఉన్నది. ఏ మాత్రం ఖాళీ దొరికిన బెంగుళూరు ప్రయాణం కావటమే అప్పటికి మా సిరిసిల్ల నుండి హైదరాబాదుకు సింగిల్ రోడ్డు ఉండేది. అందుకే నేను కారు నడిపేదాన్ని కాదు. హైదరాబాదు నుండి పెనుగొండ దాకా నేను కారు నడిపే దాన్ని. పెనుగొండ నుంచి బెంగుళూరు దాకా మావారు నడిపేవారు.

ఇప్పుడు మూడేళ్ళ నుంచి బెంగుళూరులో ఉంటున్నాను. మా అబ్బాయి చదువు కోసం బెంగుళూరు వచ్చాడు. కాబట్టి దొరికిన కారు డ్రైవరు కన్నడ చరిత్ర గురించి, ఇక్కడి స్వాతంత్ర్య సమరం గురించి, పూర్వపు రాజుల పరిపాలన గురించి ఎన్నో చెబుతుంటాడు. కారు ఎక్కగానే ఎదో ఒకటి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ తమిళులకు, కన్నడిగులకు మధ్య ఎక్కవగా పోసగదని చెబుతాడు. ఇక్కడి సాహిత్యం గురించి చెబుతాడు. నాకు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉంటుంది.

రోడ్ల మీద కన్నడ బోర్డులు చూసినప్పుడు ఏదైనా అక్షరానికి ‘ర’ వత్తు ఆ అక్షరానికి ముందుగా రాస్తారు. బోర్డు మీద పేరు ఏమై ఉంటుందా అని చదువుతూ పోతుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. నేను కన్నడ అక్షరాలు నేర్చుకుని ప్రాక్టిస్ చేయడం మొదలు పెట్టాను. వారు మాట్లాడటాన్ని బట్టి తెలుసుకుని కూరగాయల పేర్లు, వంటింటి సరుకుల పేర్లు, తోజు వారీ మాటలు మాట్లాడేదాన్ని. మాట్లాడటం కన్నా బాగా మాట్లాడటం మొదలయింది. బజార్లకు షాపులకు వెళ్ళినపుడు మాట్లాడటం వరకు పరవాలేదు. పనివాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ పదాలన్ని ఒక పుస్తకంలో రాసుకునే దాన్ని బాగా వచ్చేసింది అనుకునే టైమ్‌లో మరల మా ఊరు వెళ్ళేదాన్ని. అప్పుడు మొత్తం మర్చిపోయేదాన్ని. మళ్ళీ బెంగుళూరు రాగానే భాష రావాలని ప్రయత్నించే దాన్ని. ఇలా మూడేళ్ళు గడిచి పోయాయి. కానీ పూర్తిగా గబగబా కన్నడం మాట్లాడటం రాలేదు. మా ఇంట్లో వంట మనిషి హిందీ ఆమె. స్వీపరేమో తమిళియన్, డ్రైవర్ కన్నడియన్. ఇంట్లో రోజు మూడు భాషలు వినిపించేవి. వాళ్ళ ముగ్గురూ ఆరేడు భాషలు సులభంగా మాట్లాడేవాళ్ళు కానీ నాకు మాత్రం తమిళం గానీ కన్నడం గానీ పూర్తిస్థాయిలో రాలేదు.

బయటకు ఎక్కడికి వెళ్ళినా దొన్నె బిరియానీ, తౌలప్పసేరి, తౌలప్పకట్టి అనే బోర్డులు హోటళ్ళకు కనిపిస్తాయి. ‘తట్టే ఇడ్లి’ అని పెద్ద సైజు స్పాంజి ఇడ్లిని పొడి నెయ్యితో కలిపి ఇస్తారు. ‘బిసిబేళా బాత్’ కన్నడియుల ఫేమస్ ఆహారం. నేను కూడా దీన్ని తయారు చేయటం నేర్చుకున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏమంటే ఇక్కడి వారు ఉదయం పూట ఇడ్లీలు దోశల కన్నా అన్నాలలో వెరైటీలు చేసుకుని తింటారు. టమోటా రైస్, పుదినా రైస్, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ అంటూ రకరకాల అన్నాలను ఇష్టపడతారు. చాలా హోటళ్ళలో ‘ఘీ రైస్’ అని అమ్ముతుంటారు. అన్నంలో నెయ్యి మాత్రం ఉంటుంది, ఇంకేమి ఉండదు. అలాగే ఫంక్షన్లలో చిత్రాన్నం అని పెడతారు. ఏదైనా అన్నంలో తయారవ్వాల్సిందే. ఇడ్లీకి కూడా మనలాగా రవ్వను వాడరు. చిట్టి బియ్యం గింజలు ఉంటాయి. వాటిని తెచ్చి ఇడ్లిలో వేసుకుంటారు. ఇంకా తినే అరటి కాయలతో బజ్జీలు వేసుకుంటారు. తియ్యగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో మనం మైసూరు బజ్జీగా పిలుచుకునే బజ్జీలను ఇక్కడ ‘మంగుళూరు బజ్జీ’గా వ్యవహరిస్తారు. మైసూరు వెళ్ళే దారిలో ‘మద్దూరు వడ’ అని దొరుకుతాయి. చూడటానికి మన పప్పు వడ లాగా ఉన్నాయి. మద్దూరులో ఎక్కువగా ఇవి చేయటం వాళ్ళ వీటికా పేరు వచ్చింది.

స్వాతంత్ర్య సమర యోధుడు సంగుల్యరాయన్ గురించి మా డ్రైవర్ చెప్పని రోజు ఉండదు. దారిలో కొన్నిచోట్ల అయన విగ్రహాలు ఉన్న చోట ఫోటోలు తీసుకోమని చెపుతాడు. బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు క్రాంతి వీర సంగుల్య రాయన్ రైల్వే స్టేషన్ అనే పేరు పెట్టారు. నేను రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి మరి ఫోటో తీసుకుని వచ్చాను. సంగుల్యరాయన్ ఒక తిరుగుబాటు నాయకుడు. కిత్తూరు చెన్నమ్మ సంస్థానంలో కమాండర్‌గా పని చేశాడు. ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినపుడు నాయకత్వం వహించాడు. ఇతడు బ్రిటిషు వారిచే బంధింప బడ్డాడు. 1830లో బ్రిటిష్ వారు ఇతనిని బంధించి ఊరి తీశారు. ఇతని కాంస్య విగ్రహం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నది.

పూర్వం బెంగుళూరు ఎయిర్ పోర్టు బెంగుళూరు నగరం మధ్యలోనే ఉండేది. మేము అరగంట ముందుగా వెళ్ళినా సరిపోయేది. ఇప్పుడు ఉరికి 50 కి.మీ. దూరాన ఉన్న దేవనమ్ము వద్ద కట్టారు. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఎయిర్ పోర్టులో కేంపేగౌడ విగ్రహం చాలా పెద్దదిగా పెట్టారు. ఎయిర్ పోర్టు పేరు కుడా ‘కేంపేగౌడ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు’ అని ఉంటుంది.

ఈయన కృష్ణదేవరాయల సామంత రాజట. బెంగుళూరు నగరాన్ని నిర్మించిన రాజు కేంపేగౌడ. 15వ శతాబ్దపు వాడు. 1533 నుండి 1569వ సంవత్సరం వరకు కెంపేగౌడ శ్రీ కృష్ణదేవరాయల సామంత రాజుగా ఉన్నాడు.

నందీశ్వరుని ఆలయాల్లోకెల్లా పెద్దదైన ‘దొడ్డ బసవన్న గుడిని’ కేంపేగౌడ నిర్మించాడు. 15 అడుగుల ఎత్తులో ఒకే గ్రానైట్ రాయితో చెక్కిన నందీశ్వరుడు చూపరులను ఆకర్షిస్తాడు. బెంగుళూర్ నగరాన్ని నిర్మించడమే కాదు. హేబ్బల్ సరస్సునూ, ఉట్సారు చెరువునూ నిర్మించాడు. ఉట్సారు చెరువులో బోటు షికారు చేయడానికి అనువుగా దీవుల్లో ఆగడానికి వీలుగా ఏర్పాటు చేసారు. ఈ చెరువుకు నీరు మూడు కాల్వల ద్వారా చేరుతుంది. హేబ్బాల్ సరస్సును అవుటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసారు. బెంగుళూర్ నగరానికి నాలుగు దిక్కులా నాలుగు పిల్లర్లు వేసి ఉంటాయి. ఈ నాలుగు పిల్లర్ల మధ్యలో ఉండేదే బెంగుళూర్ నగరం.

బెంగుళూరు నగరం విద్య వైద్యానికి పేరు గాంచినది. మేము కూడా మెడికల్ విద్యకోసమే బెంగుళూరు వచ్చాము కదా. మా బాబు ప్రఖ్యాతమైన సెయిoట్ జాన్స్ మెడికల్ కాలేజిలో సూపర్ స్పెషాలిటీ చదవటానికి వచ్చాడు. మా ఇంటి చుట్టు పక్కల ప్రముఖమైన కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఆసియా ఖండం లోనే పేరెన్నిక గన్న ‘నిమ్‌హన్స్ హస్పిటల్’ మా ఇంటికి ఎడమవైపు రోడ్డులో ఉన్నది. ఆ పక్కనే కిద్వాయి మెమోరియల్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఉన్నది. మా బాబు చదివే సెయిoట్ జాన్స్ మెడికల్ కాలేజీ కూడా భారతదేశంలో మూడవ ర్యాంకు కలిగి ఉన్నది. బెంగళూరు మెడికల్ కాలేజీ, M.S. రామయ్య మెడికల్ కాలేజీ వంటి ఎన్ళో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మా ఇంటి ఎదురుగానే జయదేవ జయదేవ హార్ట్ ఇన్ స్టిట్యూట్ ఉన్నది.

బెంగుళూరులోని ఉన్న మూడేళ్ళలో మంచి అనుభవాలున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, పార్కులతో అలరారుతూ ఉంటాయి. చల్లని గాలి, మంచి వాతవరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను తొలిసారిగా గేటెడ్ కమ్యూనీటీలు ఉండటం మొదలు పెట్టింది ఇక్కడే. నేను ఎక్కవగా తిరిగిన రాష్ట్రం, నచ్చిన రాష్ట్రం, ఎక్కువ రోజులు ఉన్న రాష్ట్రం కర్ణాటకలోనే.

Exit mobile version