[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
ఇతిహాస లహరి
“దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచుమన్నా..
వట్టి మాటలు కట్టిపెట్టోయ్ – గట్టి మేల్ తలపెట్టవోయ్”
[dropcap]అ[/dropcap]న్న గురజాడ మాట ఈనాటికీ మనందరికీ అడుగుజాడ. భారతదేశ ఇతిహాసంలో స్వాభిమానం కోసం, స్వదేశ సంస్కృతి పరిరక్షణ కోసం, జీవిత సర్వస్వాన్ని అంకితం చేసి, మాతృదేశ ఋణం తీర్చుకున్న మహానీయులెందరో ఉన్నారు. వారు ఇతిహాస నిర్మాతలు, ఆదర్శ జీవులు, ప్రాతః స్మరణీయులు. పురుషోత్తముడు, పృథ్వీరాజ్, రాణా ప్రతాపసింహుడు, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, లోకమాన్య బాల గంగాధర తిలక్ వంటి దేశభక్తులు భారత ప్రజలను ఉత్తేజపరచిన మహనీయులు.
ఈ నేపథ్యంలో కావ్య గౌరవాన్ని సంపాదించుకోగలిగిన కొన్ని ప్రసిద్ధ తెలుగు ఇతిహాసాలను దిన్గ్మాత్రంగా యువతరానికి పరిచయం చేయాలన్న ఆకాంక్షతో యువభారతి తన తొమ్మిదవ లహరిగా – ‘ఇతిహాస లహరి’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
దుర్భాక రాజశేఖర శతావధాని గారు రాజస్థాన వీరగాథల నుండి రాణా ప్రతాపుని చారిత్రక గాథను స్వాతంత్ర్యోద్యమ చైతన్య ప్రబోధదాయకంగా చిత్రించిన ‘రాణా ప్రతాపసింహ చరిత్రము’ గురించి డా. ముదిగొండ శివప్రసాద్ గారు;
శివాజీ చరిత్రలో సంగ్రామ గాథ ఎంత ఉన్నదో, ధర్మ బోధ అంత ఉన్నది. జాతికి వీరమాతలు కావాలి. ధర్మ వీరులు కావాలి. ధర్మం త్యాగశీలంతో తేజరిల్లాలి, భక్తిగా సాగి శక్తిగా రూపొందాలి. శివాజీ చరితం ద్వారా తెలుగువారికి దేశభక్తిని, ధర్మశక్తిని ప్రబోధించిన శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రి గారి ‘శివ భారతము’ గురించి డా. ప్రసాదరాయ కులపతి గారు;
తెలుగురాజుల ప్రతాప చరిత్ర ఆంధ్రపురాణం. వస్తు కావ్యాలలో విలక్షణమైన మార్గం దానిది. ఆంధ్రులకు ఆత్మకథ లాంటి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ‘ఆంధ్ర పురాణము’ గురించి డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారు;
ఆంధ్రుల ఆత్మ స్థానీయుడైన పోతనకు అక్షర నీరాజనం అందించే అనర్ఘ రచన చేసిన శ్రీ వానమామలై వరదాచార్యులు గారి ‘పోతన చరితము’ గురించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు;
చారిత్రక తత్వకావ్య ప్రక్రియను తెలుగులో ప్రయోగించి చూపిన ప్రయోక్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘ఝాన్సీ రాణి’ గురించి డా. తుమ్మపూడి కోటేశ్వరరావు గారు,
చేసిన ఉపన్యాసాల సారాంశమే – ఈ ‘ఇతిహాస లహరి’.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.