ఇట్లు కరోనా-11

0
2

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

11

[dropcap]ఎ[/dropcap]వరో కొంగు లాగుతున్నట్లుగా అన్పించి మెలకువ వచ్చింది.. కళ్ళు తెరిచి చూస్తే వెకిలిగా నవ్వుతూ రంగడు. వీడెంది వెళ్ళిపోలేదా.. ‘ఎందిది లెయ్యి’ అంటూ మీదకి వంగబోతున్న వాడిని తోసి పరుగెత్తబోయాను.. వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు వాడు.

‘ఏడాది నుండి  నీ మీద కన్నేశానే.. నీ మొగుడిని చూసి భయపడినా.. వాడు యాక్సిడెంట్ల చచ్చిండు కదా 4 నెల్ల కిందట.. అప్పటి నుండి ఎప్పుడెప్పుడు నిన్ను పొందుదామా అని ఎదురు చూస్తున్నా.. నాతో వుండు ఇంత అన్నం పెడ్తా.. నీ బిడ్డను చూస్కుంటా’ అన్నాడు వాడు వగరుస్తూ..

నాకెందుకో నా బిడ్డ ముఖం గుర్తొచ్చింది. ఈడు గిట్లనే చేస్తాడని మొగుడుపోయిన ఆడోళ్ళందరిని లొంగదీసుకుని మేస్ర్తీకి అప్పజెప్పి ఆ ఆడోళ్ళ ఎదిగిన ఆడపిల్లలను కూడా ఎక్కడో అమ్మేస్తాడని మామ చెప్పిన మాట గుర్తొచ్చింది.

లేని బలం తెచ్చుకుని విసురుగా తోశాను. కిందపడ్డాడు. కోపంతో నా కుచ్చిళ్ళు పట్టుకుని లాగాడు. చీరంతా చిరిగి వాడి చేతిలోకి ఊడొచ్చింది. పక్కనున్న కర్ర అందుకున్నాను. వాడు అక్కడ పడివున్న ఇనప ముక్క తీసుకుని నా బిడ్డ ముఖం మీద పెట్టాడు. నువ్వు ఒప్పుకోకపోతే దీన్ని చంపేస్తానని.. 

నా చేతిలో కర్ర పడిపోయింది. వాడు చంపినా చంపేస్తాడు. తాగి వున్నాడు దుర్మార్గుడు.. ఏదో అలికిడికి వెనక్కు తిరిగాను.. ఇక్కడి సూపర్వైజర్ కన్పించాడు.

‘పట్టుకో దాన్ని పట్టుకో’ అరిచాడు రంగడు వగరుస్తూ.. సూపర్వైజర్ కూడా నిండా తాగి వున్నాడు. బహుశా వీడే తాగబోసినట్టున్నాడు. నన్ను పట్టుకోబోయి తూలాడు. తమాయించుకుని  నా రైక లాగాడు. రంగడొచ్చి వాడిని తోస్తూ.. ‘ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా దీని కోసం. ముందు నా వంతే’ అన్నాడు.

ఆకలితో ప్రాణాలు పోతున్న సమయాన వీళ్ళకి శరీర ఆకలి తెలిసొచ్చిందా అన్న విస్మయం నాలో.. ఎంతైనా మగ వెదవలకి మరో మగాడు ఈ విషయంలో ఎంతో సాయం చేస్తాడు. నా కళ్ళముందు గతమంతా కదిలింది.

నిజామాబాద్ అర్సపల్లిలో మేస్త్రి కింద పనిచేసేవాడు నా మామ. చిన్నప్పటి నుండి నా మొగడనే వారు అందరూ.. ఎంతో మురిపెంగా చూసేటోడు మామ. ఎక్కడ పనికెళ్ళినా చిన్నప్పటి నుండీ బొట్టుబిళ్ళలు, రిబ్బన్లు, పట్టీలు తెచ్చెటోడు. 15 ఏళ్ళకే పెళ్ళి చేసి బొంబాయి పనికి మామతో పంపిండ్రు. రోజు పని చేయటం, వండుకు తినటం మళ్ళీ పొద్దుగల్ల పని. ఏడాది కల్లా కడుపొచ్చింది. పనికి వద్దని మామ అమ్మగారింట్ల వదిలిపోయిండు. అక్కడేమన్నా ఆస్తులున్నయా రెక్కాడితో కానీ కడుపు నిండదు. పాచీ పనికి కుదిరినా.. పెద్ద ఆఫీసరే కానీ కనికరం లేని తల్లీ ఆమె.  తిండి పెట్టక సంపింది. కడుపుపోయింది. మామ మస్తు ఏడ్చిండు. మళ్ళీ 6 ఏళ్ళ దాకా కడుపు పండలే.

మామ ఎన్ని పూజలు చేసిండో.. మళ్ళీ కడుపుతో వున్నానని తెల్సి ఎంత సంబరపడ్డాడో. పిల్ల పుట్టగానే ఊర్లకి నీళ్ళొచ్చినయని అక్కడే పనులు దొరుకుతున్నాయని అయ్య ఉత్తరం రాసిండు.  అది చదివి ఇగ బొంబాయ్ల పనికి వద్దని ఊర్లకి పోదామని మెస్ర్తికి చెప్పిండు. లెక్కలు చూసి డబ్బులిస్తామని 3 నెల్ల నుండి అట్లాగే నడిపిండు మేస్ర్తీ.. సిమెంట్ తాపీ పని చేస్తూ పైనుండి కిందపడి ఆర్నెళ్ళ క్రితం సచ్చిపోయిండు మామ. ఊర్లకు తీస్కెళ్ళేందుకు కూడా డబ్బులు లేక మా అయ్య, మామ వచ్చి సావిక్కడే చేసిండ్రు. అదేందో పెద్దసార్లు వచ్చి కేసు పెట్టకుండా లచ్చ రూపాయలు ఇస్తమని నెల రోజులు ఆగమని చెప్పి పోయిండ్రు. మామ, అయ్య మళ్ళొస్తమని ఊరు పోయిండ్రు.  అంతలోనే ఈ కరోనా కష్టకాలం వచ్చింది. ఎక్కడికి ఎవరూ పోలేకపోతున్నరు.  కరోనా కాలంలో పనులు లేవని అందరినీ వెళ్ళిపోమ్మని తలుపులు మూసుకున్నాడు కాంట్రాక్టర్.  ఎంత కాళ్ళు పట్టుకున్నా విన్లేదు.  ఊరు గుర్తొచ్చి ఆదుకునే వారు గుర్తొచ్చి అందరం పల్లె దారి పట్టాం..

అయిపోయింది.. నా బ్రతుకు బుగ్గిపాలైంది. వీడి చేతుల్లో నా బతుకు నరకమే.  ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో చూసాను.  ఆదిశక్తి ఆడది అని చూడాలని కలుగన్నాను, చివరికేమైందో గ్రహించగలుగుతావా.

బుగ్గ మీద చివ్వున రక్తం చిమ్మినట్లు అరిచాను. వాడు గీరిన చోట రక్తం పొంగింది. దుఃఖం నా నరనరాన అవహించింది. అరుద్దామన్నా కూడా శక్తి లేదు.. బిడ్డ గుర్తొచ్చి అటుపక్క చూశాను. మసక చీకట్లో నీళ్ళు నిండిన నా కళ్ళకు ఏమీ కన్పడలా.. కళ్ళు చికిల్చి చూశా.. నా పసిబిడ్డ మూలుగుతున్నట్టు విన్పించింది. మబ్బు చాటు నుంచి బయటకు వచ్చిన చంద్రుని వెలుగులో కళ్ళు విప్పార్చి చూసాను. 

బిడ్డ నోట్లో ఖర్చీప్ గుచ్చి దాని పసి శరీరాన్ని చీలుస్తున్నాడు సూపర్వైజర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here