[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]
2
[dropcap]ని[/dropcap]జం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళి మీద ఆధిపత్యం కోసం మేము ప్రయత్నం చేస్తూనే వున్నాం. ఒకప్పుడు ప్లేగు… ఇంకొకప్పుడు కలరాలతో ఊర్లే తుడిచి పెట్టేసాం… అవి కాస్త తగ్గుతుండగానే, మరొకప్పుడు క్షయ… కుష్టులతో మిమ్మల్ని భయపెడుతూనే వచ్చాం. పాపం చేయటం వల్లే ఈ వ్యాధులని కొందరూ – దేవుని శాపం అని మరికొందరూ – మన జన్మలింతే అని ఇంకొందరూ… మానవ తప్పిదాలని ఎందరో చెప్పుకుంటూనే వచ్చారు. కొన్నిసార్లు మీరు మారారు… కొన్ని సార్లు సైన్స్‌తో గెలిచారు. ఇంకొన్ని సార్లు సంయమనంతో మమ్మల్ని ఓడించారు. సంఘటితంగా పోరాటం చేసారు. ఏం చేసినా… ఎన్ని చేసినా మమ్మల్ని గెలిచేందుకు పోరాటం చేస్తూనే వున్నారు. మిమ్మల్నీ, మీరున్న ప్రపంచాన్ని నిలబెట్టుకుంటూనే వున్నారు.
నాకు నవ్వొచ్చే సంగతొకటి చెప్పనా.. మీలో ఏ ఇద్దరు కల్సినా పాశ్చాత్యుల్లాగా చేతులు కలిపేసుకొని ఊపేసుకుంటూ మాట్లాడుతుంటారుగా, ఇన్నాళ్ళకి నా పుణ్యమా అని మళ్ళీ మీ పురాతన ఆచారం ‘నమస్కారం’ లోకి వెళ్ళిపోయారు. ఆఫ్కోర్స్, ప్రపంచం మొత్తం కూడా మీ భారతీయ సదాచారాన్ని తమదిగా మార్చేసుకుందనుకో. అయినా మీరలా చేతులు కలుపుకుంటున్నప్పుడు చైతన్యప్రసాద్ కవిత గుర్తుకు రాదా, అదేనోయ్ షేక్ హేండ్ మీద కవిత, “ఎవని చేతిలో ఏముందో ఎవరికెరుక, వేయి రోగాల పుట్ట ఈ చేయి కనుక చాలు చాలిక కరచాలనాలు చాలు. దండమెట్టినవాడెరా ధన్యజీవి” అని సెటైరికల్‌గా చెప్పిన ఆ మహితోక్తి విన్నాకైనా మీరు మారకపోబట్టే కదా నేనొచ్చింది. అబ్బో, సీరియస్‌నెస్ నుంచి నవ్వులోకి వచ్చేసావులే. ధన్యోస్మి అనుకోనా ఇక!
కాస్త సీరియస్‌గా మా వైరస్‌లు-మీ మనుషుల చరిత్రను గురించి డిస్కస్ చేద్దాం. మాలో కొందరిది మరో వాదన, అదేంటంటే మీ కన్నా ముందు పుట్టిన వాళ్ళం మేమే అని ఎన్ని పరిశోధనలు చెప్తున్నా మీరు వినిపించుకోరేం అన్నది మా బాధ. నిజానికి మాలో 6828 వైరస్‌లకే మీరు పేర్లు పెట్టగలిగారు. ఆకాశంలోని చుక్కల్లాగా లక్షల్లో ఉన్న మిగతా వాటి మాటేమిటి? ఎల్లో ఫీవర్‌ని 1901లో వాల్టర్ రీడ్ కనిపెట్టారని చెప్పుకుంటారు గానీ, 19వ శతాబ్దంలో ప్రమాదకర ప్రతి వ్యాధినీ వైరస్ అంటూనే పిలుచుకునేవారని మీకు తెలియక పోవచ్చు… పోలియో, మీజిల్స్, రుబెల్లా లను ఎదుర్కోగలిగారు. డెంగీకి, జికాకి, గున్యాకి, వెస్టినైల్‌కి టీకాలు తయారు చేయగలిగారు. ఇంకా AVN, ఫ్లూ, సార్స్, HIV, కోవిడ్.. ఇలా ఎన్నెన్నో వున్నాయిగా. మిమ్మల్ని సవాల్ చేస్తూ ఆ జాబితాలోకి నేనూ ఇప్పుడు చేరానులే.
అయినా వైరస్ తీరు తెన్నులపై పరిశోధనలు చేసే వైరాలజీ శాస్త్ర అభివృద్ధిలో ముందంజ వేశామని గప్పాలు పలుకుతారే గానీ, మీ DNA లో దాదాపు సగ భాగం మా వైరస్‌ల నుండే వచ్చిందన్న విషయాన్ని మాత్రం తోసి పుచ్చుతుంటారు. చిత్రమేమిటంటే యాంటీబయాటిక్ మందుగా ముందు కనిపెట్టిన పెన్సిలిన్ బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను తుదముట్టిస్తూ సాగిన మాట వాస్తవమే. కానీ బాక్టీరియాలకీ వైరస్‌లకీ మధ్య పెద్ద తేడా ఉందన్న మాటని సగటు మనిషిగా మీరు గుర్తించడం లేదు? బాక్టీరియాలు తాముగా బ్రతకగల, వృద్ధి చెందగల సూక్ష్మక్రిములు. వాటిని చంపటం సులువే. కానీ మా వైరస్‌లు మానవ కణాలకి సోకి వాటిని నిర్వీర్యం చేస్తాయి. వాటికి యాంటీ వైరల్‌ని కనిపెట్టడం కష్టమే కాకుండా, ఎంతో కాలం పట్టే ప్రక్రియ కూడా. కాబట్టి నాతో మీ సహవాసం ఈ ఏడాది పాటు కొనసాగవచ్చేమో, సిద్ధపడండి మరి.
నిజం చెప్పు మిత్రమా! మా HTLP వైరస్ మీతో కలిసి వేల సంవత్సరాలుగా సహవాసం చేస్తోందనే సంగతి మీ శాస్త్రవేత్తలు మీకు చెప్పలేదా… చెప్పినా మీరు నమ్మలేదా? దాదాపుగా ఫ్లూ బారిన పడిన ప్రతి వ్యక్తి కణమూ 10వేల కొత్త వైరస్‌లను తయారు చేస్తుందన్న సంగతి మీరు ఇప్పటికైనా తెలుసుకొని తీరాలి. ఇంకా మీకు వంద లక్షల కోట్ల వైరస్‌లు సోకే అవకాశం ఉందని, అది ప్రపంచ జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువని గ్రహించాల్సిన సంధికాలం ఇప్పుడు ఏర్పడింది. మేం కనిపించమని, జీవం లేదని, పునరుత్పత్తి లేదని, జీవ ప్రక్రియలు లేనే లేవని చెప్పుకుంటారు గానీ, జీవావారణంలోనే… మీతోనే కలిసి సహవశిస్తున్నామన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తుంటారు. మీరనుకున్నట్లుగా మేము… మా అంతట మేముగా ప్రయాణించలేము. కానీ మీ చర్మం పైనే అతిథిగా ఉంటూ ఎంత వేగవంతంగా ప్రపంచాన్ని చుట్టేయగలమో ఇప్పుడు చూసారుగా! అదేంటీ, అంతలా నోరెళ్ళబెట్టావ్? ఇంత చిన్న విషయానికే అంతలా ఆశ్చర్యపడిపోకు. ముందు ముందు నే చెప్పే విషయాలకి కాస్త గుండె దిటవు చేసుకొని విను మరి.
సహవాసీ! 300 కోట్ల సంవత్సరాలనాడే భూగోళం పుట్టిందని, 150 కోట్ల సంవత్సరాలు నాడు జీవ పదార్థం పుట్టిందని, 50 కోట్ల సంవత్సరాలనుండీ చెట్లు, జంతువులు, పక్షులు పుట్టుకొచ్చాయనీ మీకు తెలుసు కదా. 5 లక్షల సంవత్సరాల నాడు వానర రూప మానవుడు ఉద్భవించాడనీ, 50 వేల సంత్సరాల నాడు ఆధునిక మానవ వికాసం ప్రారంభమైందనీ, క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు మనిషి వ్యవసాయంతో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని చరిత్రకారులు చెపుతుంటారుగా. కోటి జనాభా నుండి దాదాపు 800 కోట్ల జనాభాకి ఎగిసినా భూ విస్తీర్ణం మాత్రం 5 కోట్ల 40 లక్షల చదరపు మైళ్ళు గానే ఉంది తప్ప పెరగలేదుగా. దాన్నెందుకు ఆలోచించటం లేదు మీరు? భూస్థలం నిండా మీరే నిండిపోతుంటే మిగతా జీవజాలం ఎలా బ్రతకాలో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ప్రకృతి సమతుల్యం పాటించటం కోసం శతాబ్దానికోసారి మమ్మల్నిలా రంగంలోకి దింపుతుంటుంది.
భగవద్గీత చెప్పేది అదే కదా, “యథా యథాహి ధర్మస్య, గ్లానిర్భవతి భారతః, అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్, పరిత్రాణ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”. ఇది మీ మనుషులకే కాదు సమస్త జీవజాలానికీ వర్తించే ధర్మోక్తి. ఇప్పుడు జరిగిందీ అదే. మనదనుకున్న జీవావరణంలో మీరొక్కరే బ్రతకటం కోసం మమ్మల్నందర్నీ చిదిమేస్తున్న మీ అభిజాత్యానికి తగిన మూల్యాన్ని రాబట్టుకోవడానికే మా జననం. మా జాతిని, మా మానాన మమ్మల్ని బతకనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతూ మా కన్నీళ్ళకి కారణమౌతున్న మీకు ఆ ఉప్పునీటి రుచిని చూపిద్దామన్నదే మా అభీష్టం. చిన్న చీమ కూడా తన పుట్టలో వేలు పెడితే కుడుతుందని ఎన్నో తరాలుగా మీ పిల్లలకి కథలు చెప్పే మీరు మా విషయానికొస్తే ఆ సత్యాన్ని ఎందుకు మర్చిపోయారో మాకు అర్థం కావటంలేదు.
కథలంటే గుర్తొచ్చింది, మీ పిల్లలకి మీరు చంద్రుడిని చూపిస్తూ, కథలు చెప్తూ తినిపించినట్లే మా పెద్ద వాళ్ళు కూడా మిమ్మల్ని చూపిస్తూ మా పూర్వీకుల విజయగాథలు కథలు కథలుగా చెప్పేవారు. క్రీ.శ. 541 నుండి 750 వరకూ ప్రబలిన ప్లేగు ఈజిప్ట్ నుండి మధ్యధరాసముద్రం మీదుగా సాగి, ఐరోపాతో పాటు ఆసియా, ఉత్తర అమెరికా, అరేబియా దేశాల్లో విస్తరించి దాదాపు 5 కోట్ల మందిని బలి తీసుకుందన్న సంగతి మీకందరికీ తెలుసు. జస్టేనియన్ చక్రవర్తికి సోకినప్పటికీ ఆయన కోలుకోవడంతో ఆ ప్లేగుని జస్టేనియన్ ప్లేగు అని పిలిచారని, తిరిగి 1347లో బ్లాక్ డెత్ గా పిలవబడిన ప్లేగు – ఐరోపా మొత్తం వ్యాపించిందని, అప్పుడు కూడా 4 కోట్ల మందికి పైగా చనిపోయారని, ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని గుర్తించి ఓడల నుండి వచ్చిన వారిని 40 రోజుల పాటు క్వారంటైన్ చేసిన తర్వాతనే రాజ్యంలోకి అనుమతించేవారని చరిత్రలో మీరు చదువుకున్నారు. మా కథలన్నీ అవే, మేం పెరిగింది వాటిని వింటూనే. ఇదంతా మనమంతా విన్నవీ కన్నవీ. కానీ చరిత్రలో ఏముందో మనిద్దరం పరిశీలించాల్సిందే కదా.
(సశేషం)