ఇట్లు కరోనా-22

0
2

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

22

[dropcap]ఊ[/dropcap]రి సర్పంచ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉండగానే ఏదో పెళ్ళి సందడి విన్పించింది. ‘రండి ఇంతదూరం వచ్చారుగా.. మా పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళండి’ అంటూ అటుగా దారి తీసింది ఉప సర్పంచ్.

అటు వెళ్ళి చూడగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో విప్పాయి. కొబ్బరాకుల మండపం.. మామిడి తోరణాలు.. సన్నటి సన్నాయి సవ్వడి.. నిరాడంబరంగా వుంది కానీ ఏదో పవిత్రత వుట్టిపడ్తుంది. అక్కడంతా పూలచెట్లే.. విరబూసి వున్నాయి.. జాజి, మల్లెలు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. తాజాగా అలికినట్టు వుంది. మండపం పక్కంతా ఎర్రమట్టి మీద ముగ్గులు వేసి భలే అందంగా వుంది.

‘ఇది మా కళ్యాణ మండపం.. ఎవరి పెళ్ళైనా ఇక్కడే ఇలాగే జరిపిస్తాం’ చెప్పింది ఆ సర్పంచ్.

ఇంత సింపుల్‌గానా.. అడిగాడొక విలేఖరి.

వధూవరుల్ని దగ్గరకు పిల్చారు సర్పంచ్. నవ్వుతూ ఎదురొచ్చారు వారు. పరిచయం చేసింది ఓ వృద్ధురాలు.. ఈ అబ్బాయి బొంబే నానావతిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి మన గాంధీలో డాక్టరుగా 4 ఏళ్ళుగా పనిచేస్తుందని..

‘అంత పెద్ద పదవుల్లో వుండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారేం’ అడిగారెవరో..

నవ్వుతూ చెప్పింది ఆ వధువు.. ‘నలుగురు మంచి మనుష్యుల దీవెనలుండాలి కానీ ఆర్భాటం ఎందుకండీ. టవున్లలో జరిగే పెళ్ళిళ్ళలో దుబారా ఎక్కువే. మా బంధువులందరి మధ్యన మేం పెరిగిన.. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన ఈ పల్లెలోని ప్రకృతి మధ్య జరిగిన ఈ పెళ్ళి చాలు మాకు ఆనందాన్ని ఇవ్వటానికి.. 100 రూపాయలు పెట్టి 4 రకాలు తిని అంతా వ్యర్థం చేయటం కంటే నిరాడంబరతలోని ఆనందమే వేరు. ఇదిగో ఈ ఊరి కోసం మేము విరాళంగా 25 లక్షలిస్తున్నాం. ఊరి బడిని బాగు చెయ్యమని.. రేపు జరిగే మరో పెళ్ళి వారు 15 లక్షలిస్తున్నారు చెరువు పూడిక కోసం.. చిన్నప్పుడు ఊరంతా మమ్మల్ని పెంచింది. ఎవరింట్లో తిన్నామో ఎక్కడ ఎవరు నిద్రపుచ్చారో.. ఏ బాబాయి చదువు చెప్పాడో అందరం ఇంతవాళ్ళం అయ్యాం. ఇప్పుడు ఊరు ఋణం తీర్చుకోవాలి కదా.. లేకపోతే అదేదో సిన్మాలో చెప్పినట్టు లావైపోతాం’ అంది ఆ అమ్మాయి నవ్వుతూ..

మాట్లాడటానికి ఏమీ మిగలనట్టుగా వారిని ఆశీర్వదించి వెనక్కి తిరిగారు.

పెద్ద పెద్ద క్రీడా మైదానాలు కన్పించాయి. సాయంత్రం కబడ్డీ ఆడటానికని చెప్పారు. ఊరు ఊరంతా భలే శరీర సౌష్టవంతో  ఆరోగ్యంగా కన్పిస్తున్నారు. ఆడవాళ్ళ కోసం స్టిచ్చింగ్ సెంటర్ వుంది. ఊరికి సరిపడా బట్టలన్ని వాళ్ళు కుడ్తారట.

‘ఇంతకీ కరోనా మీ ఊరిలోకి అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోవడానికి కారణం చెప్పలేదు’ అన్నారు నవ్వుతూ ఆరోగ్యమంత్రి.

‘భలేవాడివయ్యా! ఇంత చూశాక ఇంకా ఆ ప్రశ్నేమిటి? వీరంతా ప్రాచీన సిద్ధాంతాల్ని ఔషోసన పట్టారు. మన పూర్వీకులు ఏం చేశారో అదే చేస్తున్నారు. ఆధునిక, సాంకేతిక సుఖ జీవనం కోసం మనం ఏవైతే వాడుతున్నామో ప్రిజ్, ఏసీ, గ్రైండర్, మిక్సీ, కార్లు వాటినన్నిటిని త్యజించి వీళ్ళు రోకల్లు, రాగి బిందెలో నీళ్ళు, తిరగలి, గానుగ నూనె వాడకం చేస్తున్నారు. శరీరానికి కావాల్సినంత వ్యాయమం, మందులు వాడని కూరగాయలు, ధాన్యం.. బావుల్లోని నీరు.. తగినంత శుభ్రమైన గాలి.. ఎండ.. పరిశుభ్రమైన పచ్చని వనాల మధ్య ఇక వారికి అనారోగ్యం ఎలా కల్గుతుంది!’ అన్నారు ముఖ్యమంత్రి ఎంతో ఆనందంగా..

కల్పించుకున్న వ్యవసాయ మంత్రి “ప్రభుత్వం అంటే మనమే.. విదేశీయులు కాదు కదా.. గ్రామాలు ఇలా స్వయం సమృద్ధిగా ఉంటే ఆ దేశానికి ఇక ఢోకా లేదు. ప్రకృతికి విరుద్ధంగా పోయి మేమంతా దెబ్బతిన్నాం.. ప్రకృతిని సంరక్షిస్తూ వుండి మీరంతా రక్షింపబడ్డారు. మూర్ఖత్వంగా మూఢాచారాల్ని నమ్మకుండా తాత ముత్తాల మాటల్ని సదాచారాలుగా నమ్ముతూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నారు. దేశానికి ఓ వెలుగుబాటని చూపారు” అన్నారు గౌరవంగా ఆ వృద్ధురాలికి నమస్కరించి..

‘ఆరోగ్యమంత్రి గారూ ఈ ఊరు పాటిస్తున్న విలువల్ని అన్ని గ్రామాలకు అమలుపర్చండి. ప్రతిగ్రామం ఈ గ్రామంలాగా ఆరోగ్యవంతంగా, అభివృద్ధివంతంగా ఉండేలా చర్యలు తీసుకొండి’ అంటూ ఆజ్ఞాపించారు ముఖ్యమంత్రి.

‘మరి ముందొచ్చిన రిపోర్టర్లకి ఈ విషయాలేవీ చెప్పకుండా ఎక్కడ ఈ గొప్ప విషయాలు పొక్కకుండా ఇంత గుంభనంగా ఎందుకుంచారు? మంచే కదా, పది ఊర్లు మీలా నేర్చుకుంటాయి కదా’ అనుమానంగా అడిగారు సీఎం గారి సెక్యూరిటీ అధికారి.

‘ఓ సారి మా ఊరి అబ్బాయి దేశంలో మొదటి ర్యాంకు వచ్చాడు. మా రైతులెందరో అభ్యుదయ అవార్డులు పొందారు. మా పిల్లలు రాష్ట్రస్థాయిలో ఎన్నో మెడల్స్ పొందారు. ప్రతిసారి మీడియా రావటం.. హంగామా చేయటం.. రోజంతా రికార్డింగులు, ప్లాస్టిక్ వస్తువులు పడెయ్యటం మా రోజువారీ కార్యక్రమాలు దెబ్బతినటం అంతా బాగా డిస్టర్బ్ అయ్యాం. అప్పటి నుండి మేం ఒక ఒప్పందాకికొచ్చాం.. కీర్తి కండూతితో పిల్లలకి ఇబ్బంది కల్గించకూడదని.. వార్తల్లోకి ఎక్కాలన్న దుగ్ధ వుండకూడదని, అంతే తప్ప ఏదో దాచాలని కాదు. మీరు సమృద్ధిగా సంపాదిస్తున్నారుగా.. మాకు ఫండ్ ఇవ్వండని మరికొందరు జులుం చూపించారు. మేము ఇక్కడి ఊరి వారందరికి జవాబుదారీగా వున్నామే కానీ మా అంతట మేముగా ఇవ్వగలిగేంత పవర్ మాకు లేదు. పైగా దేశంలో మొదటి ర్యాంక్ అబ్బాయి ఆ తర్వాత ఏదో ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వచ్చాయని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. హైప్ క్రియేట్ చేసి టీఆర్పీ రేట్లు పెంచుకునే మీడియా అంటే మాకు భయం సార్.. మమ్మల్ని మా పనులు చేసుకోనివ్వండి.. సామాన్యంగా బ్రతకటంలోనే ఎంతో ఆనందం వుంది. అది చాలు మాకు’ అన్నాడు ఆ యువకుడు.

అర్థమైనట్లుగా తలాడించారు నవ్వుకుంటూ ముఖ్యమంత్రి. సంతృప్తిగా వెనక్కి తిరిగి మళ్ళీ ఓసారి కన్నుల నిండా ఆ ఊరిని నింపుకుని తన దగ్గరకొచ్చిన కారుని వద్దని కాలినడకన హెలిప్యాడ్ వైపు కదిలారు.

అవును.. ఈ ఊరిని చూశాక వారి జీవనయానం విన్నాక వారిని గౌరవించటం.. వారి ఆలోచనల్లోని అంతరార్థాన్ని గుర్తించటం.. వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించటానికి తన అడుగే తొలి ప్రయత్నం కావాలనుకుంటూ తూర్పు దిశగా నడిచారు.

అలా ‘రైతునగర్’ రేపటి గ్రామాల సుసంపన్నవంతానికి తొలి బీజం వేసి కూడా ఏమీ పట్టనట్టు తన పనిలో తాను పడింది..

ఆధునిక పట్టణ ప్రజలు వదిలేసి, విసిరేసి, పారేసి వెళ్ళిన ప్లాస్టిక్ సీసాల్ని, గ్లాసుల్ని, కూల్‌డ్రింక్ బాటిళ్ళని ఏరి చెత్తకుప్పలలో వేస్తూ యథావిధిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ కాలంతో పాటు కదిలింది..

మళ్ళీ రేపు క్రొంగొత్త కాంతిని దేశానికి ఇవ్వటానికి!

బాగా చెప్పానా, కొద్దిగా ఎగ్జాగరేషన్ ఉన్నప్పటికీ ప్రతి పల్లె ఈ పల్లెలాగా ఉండాలన్నది నా వాంఛ.  అప్పుడు గాంధీ గారు కలలు కన్నా గ్రామస్వరాజ్యం నిజమౌతుంది.  నాలాంటి వైరస్‌లు రాలేనంత శత్రు దుర్భేద్యంగా మీరూ ఉంటారు. ఇది నా కలే కానీ, మీ మానవాళి ఈ కలని వాస్తవ రూపంలోకి తీసుకొస్తుందని నేను కలగన్నాను.  సరే, చివరికి కొన్ని మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను.  ఇంతకీ నేను ఏం చెప్తానో నువ్వు గెస్ చెయ్యగలుగుతావా.. అదేలే ఎండొస్తే గొడుగు, వానొస్తే రెయిన్ కోట్ తీసుకుని వాడుతున్నట్టుగానే కరోనా వచ్చింది కాబట్టి మాస్క్ వేసుకోవాలి అన్నంత సులువుగా మీరు స్థైర్యం తెచ్చుకునేందుకు ఒక రహస్యాన్ని చెప్తాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here