[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]
23
[dropcap]నా[/dropcap] నుండి సులువుగా మీరంతా తప్పించుకునే రహస్యమేంటో తెల్సుకోవాలని ఆశ పడుతున్నావా.. పిచ్చి మానవా.. నేనే కాదు నా లాంటి ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ మూర్ఖత్వం, మొండితనం, ముందుచూపు లేనితనాలే మిమ్మల్ని బలి తీసుకుంటున్నాయని ఇప్పటికైనా మీరు గమనించాలి.
నిజమే, నేను అభిమానధనురాల్ని, దుర్యోధనుడిలాగా. మీరు రమ్మని చేయి పట్టి పిలిస్తే తప్ప మీ ఇంటిలోకి, మీ ఒంట్లోకి రాలేని దాన్ని. నేనిప్పుడు ప్రతిక్షణం మీరు చేస్తున్న హోమ్ క్వారంటైన్ తపో దీక్ష మూలంగా నిర్వీర్యం అవుతున్నాను, బక్క చిక్కి పోతున్నాను. ఏ ఇల్లూ నాకు ఆవాసంగా మారటం లేదు. ఏ మనిషీ నాకు వాహకంగా మిగలటం లేదు. ఇక నాకెక్కడ ఆనందం – నాకెక్కడ ఆయుష్షు – నేను వెళ్లిపోతున్నాను.
స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన మాటని ఇక్కడ గుర్తు చేస్తున్నాను. “నువ్వు పర్యటించకపోతే, విస్తృతంగా అధ్యయనం చెయ్యకపోతే ప్రకృతి శబ్దాలనూ, జీవిత ధ్వనులను వినలేకపోతే, నిన్ను నీవు అభిమానించుకోలేకపోతే, ప్రకృతిని ప్రేమించలేకపోతే నువ్వు మెల్లగా మరణిస్తున్నావన్నది అర్థం చేసుకోవాలి.” ప్రకృతిలోకి తరలిపొమ్మని వివేకానందులవారు చెప్పింది అందుకే. స్నేహం చెయ్యదలచుకుంటే ప్రకృతి కన్నా గొప్పది, అనుభవించదలచుకుంటే జీవితం కంటే గొప్పది మరొకటి లేదంటారు అనుభవజ్ఞులు. ఆది నుండీ మీ భారతీయులు ప్రతి పండుగలోనూ ప్రకృతి ధర్మాన్నీ, ఔషధ విలువల్నీ గుర్తెరుగుతూ భవిష్యత్తు తరాలకు అందిస్తూనే వచ్చారు. పాశ్చాత్య మోజులో మీ ఆచార వ్యవహారాల విలువల్ని విస్మరిస్తూ వచ్చారు. అందుకే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
నిజానికి మీ మానవీయ విలువలు గొప్పవే. మీ అనుబంధాలు.. మీ ప్రేమలు చూసాక నాకూ ప్రేమించబడాలనిపిస్తోంది. ‘చంపెయ్యి..శ్మశానాల్ని ఏలేయ్’ అనటం తప్ప, బ్రతుకు బ్రతికించు అని చెప్పే మంచి మాటలు ఎప్పుడూ వినపడని లోకం నుండి వచ్చిన దాన్ని నేను. భౌతిక దూరం – సామాజిక ఐక్యత మీరు పాటిస్తున్న మంత్రంతో, మీ సంస్కారంతో కూడిన నమస్కారంతో నన్ను ఓడిస్తున్నారు, నన్ను తరిమి కొడుతున్నారు. నేను పిరికిదాన్ని, అందుకే దొంగ దెబ్బ తీశాను. మీరు యోధులు, ఎదురుగా నిలబడి నిబద్ధంగా, లాక్‌డౌన్ పాటిస్తూ, స్వీయ నియంత్రణతో కష్టాన్ని అధిగమించేస్తున్నారు. అభిజాత్యం లేకుండా ‘సఫాయన్నా సలామన్నా’ అని అనగలిగిన పాలకులు మీకున్నారు. ప్రాణదాతలు, వృత్తిని దైవంగా భావించే వైద్యులు మీకు అండగా వున్నారు. త్యాగజీవులు, శాంతిని నిరంతరం కాంక్షిస్తూ, మీ ప్రాణాలకు వారి ప్రాణాల్ని అడ్డు వేయగల్గిన పోలీసులు మీకు రక్షణ కలిపిస్తున్నారు. పారా మెడికల్ సిబ్బంది, బ్యాంకర్లు, మీడియా వారు, విద్యుత్, వాటర్ సిబ్బంది మీకు ఎల్లప్పుడూ అండగా కంచెలు కట్టాక ఇక నాకెక్కడ స్థలం వుంటుంది చెప్పండి?
దయచేసి ఇప్పటికైనా జీవావరణం చెప్తున్న సందేశాన్ని ఆలకించండి. సమతుల్యత పాటించండి. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించిన ప్రభుత్వాలు ఇకనైనా ఆరోగ్య లక్ష్యాల పునర్నిర్మాణాల మీద దృష్టి సారించాలి. దాచివేతలు, దాటవేతలు మానండి. మీ అలసత్వాల ఖరీదు లక్షల కొద్దీ ప్రాణాలని గుర్తించుకోండి. కోతులు వనాలకి పోవాలి, వానలు మళ్ళీ రావాలి అని చెప్పటంతో పాటు, జీవులకు ఉన్న ఆవాసాల్ని కెలక్కండి. మీతో పాటు ఈ భూమ్మీద జీవించే హక్కు ప్రతి జీవికీ వుంది. వాటిని బలి తీసుకుంటూ మీరు బలై పోకండి. ప్రకృతి సంతులనం దెబ్బతింటే ప్రకృతే సరి చేయాల్సి వుంటుంది. ప్రకృతి మనందరికీ అమ్మే. అమ్మ ఎంతగా ప్రేమిస్తుందో తన మిగతా బిడ్డల ప్రాణం పోతున్నప్పుడు అందుకు కారకుల్ని అంతగానూ శిక్షిస్తుంది.
ప్రపంచ కవి ఖలీజ్ జీబ్రాన్ కవితతో ఈ ఉత్తరాన్ని ముగిస్తాను.. “నా గృహం నన్ను ఇలా అడిగింది, నన్ను వదిలి వెళ్లకు, సజీవమైన నీ గతమంతా ఇక్కడే నివసిస్తోంది. రహదారి కూడా నాతో అంది.. రేపటి అందమైన భవిష్యత్తును ఇచ్చే నన్ను అనుసరిస్తూ రా అని. అప్పుడు నేను గృహాన్ని, రహదారిని ఉద్దేశించి ఇలా అన్నాను. నాకు గతం లేదు. భవిష్యత్తు అంతకన్నా లేదు. నేనిక్కడ ఆగిపోతే నా నిశ్చలతలో ఓ గమనం ఉంది, నేను పయనిస్తే దాని గమనంలో ఓ నిశ్చలత ఉంది. కేవలం ప్రేమ, మృత్యువు మాత్రమే వీటినన్నిటినీ మార్చగలుగుతాయి” అని. నిజం కదా మన నవ్వుల్ని పంచుకునే వ్యక్తుల్ని మర్చిపోవచ్చు గానీ, మన కన్నీళ్లని పంచుకునే వ్యక్తుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకొనే కదా ఉండాలి. మానవుల పట్ల కరుణ చూపగల్గిన మీరు మిగతా జీవాల పట్ల కూడా కారుణ్యంతో మెలగండి. ప్రకృతి కన్నెర్రకు కారణం కాకండి. వైద్యం, సాంకేతిక ఫలాల్ని అనుభవించే మీరు అదే అభివృద్ధి అనుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తూ, జనాభాని అపరిమితంగా పెంచేసుకుంటూ మీ సుఖమయ జీవనం కోసం మరో ఘోర ప్రమాదానికి కారణం కాకండి.
బాధపడకండి. మరణించిన వారిని తలచుకొని దుఃఖించకండి. లెక్క కట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు. నిత్య రణస్థలిలో ఎన్ని లక్షల చేతుల్లో నేను పరాజితనయ్యానో మీరు సరిగ్గా చూపించగలిగారు. ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే ఆయుధాలుగా దేహదేశంలో జరిగిన అంతర్యుద్ధాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఐసోలేషన్ వ్యూహంతో, నమస్తే మంత్రంతో నిజాంగానే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపుతున్నారు. నా అనంతర లోకాన్ని మీరు ధైర్యపు ఇటుకలతో, భరోసా పిల్లర్లతో, ఆశల గోడలతో కొత్తగా నిర్మించుకోండి.
ప్రియ మిత్రుడా! నేనిక వెళ్తున్నాను. నాకిక సెలవిప్పిచ్చు. ఇక ముందు ఈ ప్రపంచం కరోనాకి ముందు, కరోనా తర్వాతగా కొత్త గీతను లిఖించుకొంటుంది. కొత్త కాలరేఖను ప్రసవిస్తోంది.
ఈ ప్రకృతి, ఈ భూమి మన అందరి ఆవాసం. ఆమోద యోగ్యమైన జీవన విధానం తోనే మనుగడ సాగిద్దాం. మీతో పాటు మేమూ కలిసే వున్నాం. మాకు ఇబ్బంది కలగనంత కాలం మీ జోలికి మేమూ రాము. మా జోలికి మీరూ రాకండి. ఇకనైనా కళ్ళు తెరవండి. మనిషిగా మహిలో కరుణతో బ్రతకండి, కలకాలం నిలవండి.
అవును కదా.. ఈ ప్రపంచం ఎంత అందమైనది… పచ్చని వనాలు… ఎగిసి దూకే జలపాతాలు… పక్షుల కువకువలు… ఆశల హరివిల్లులు… విశాల ఆకాశం… ఊరించే ఆహారాలు… విభిన్న ఆహార్యాలు… అబ్బో ఎంత బావుందో… ఎంతో బావున్న ఈ ప్రపంచాన్ని ఇలానే ఆనందంగా, ఆరోగ్యంగా బాగానే ఉంచుదాం. సరేనా…
విత్ లవ్,
కరోనా!
(సమాప్తం)