ఇట్లు కరోనా-7

0
1

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

7

[dropcap]మీ[/dropcap]లో నాకు స్ఫూర్తిని కలిగించిన అంశాలు ఎన్నో వున్నాయ్. గుర్‌గావ్‌కి చెందిన ఒక వ్యక్తి 10 రోజుల పాటు నా మూలంగా అన్నీ భాషల యాక్షన్ సినిమాలు చూస్తూ, భార్యతో వీడియో కాల్స్ చేస్తూ అసలు TVనే పెట్టకుండా నన్ను జయించి హోమ్ క్వారెంటైన్ నుండి బయటపడటం నాకు గమ్మత్తుగా అనిపించింది. తల్లి అంత్యక్రియలకి వెళ్లనని, దైన్యంలోనూ ధైర్యంగా విధులు నిర్వహించిన జైపూర్ మేల్ నర్స్ R.M. మీనా, ఢిల్లీలో ఆహారపు పొట్లాలు పంచుతూ తల్లి చివరి చూపుకి నోచుకోని షకీల్, చివరి వరకూ వైద్య సహాయం చేస్తూ క్వారంటైన్ లోనే మరణించిన భారత దేశ తొలి డాక్టర్ (మధ్యప్రదేశ్) డా. శత్రుఘ్న పంజ్వా (62) ధైర్యం మీ జాతికి ఆయువు పట్లు. అమెరికాలోని 103 ఏళ్ల ఏంజిలినా ఫ్రెడ్ మెన్ గురించి విన్నావా నువ్వు-ఇటలీ నుండి న్యూయార్క్‌కి వలసదారుల్ని తరలిస్తున్న ఓడలో పుట్టిన ఏంజిలినా స్పానిష్ ఇన్ఫ్లుయెంజా మూలంగా తల్లిని, తోబుట్టువుల్ని పుట్టుకతోనే కోల్పోయింది. అయినా అప్పటి ఇన్ఫ్లుయెంజా గానీ ఇప్పటి నేను గానీ ఆ బామ్మని ఏమీ చేయలేక చతికిలబడ్డాం.

ఇక రాష్ట్రానికొస్తే… సంగారెడ్డి ANMలు, దుర్గారాణిని ఫ్లాట్స్‌లో అందరూ వెలివేస్తున్నట్టు చూసినా, ఆశా కార్యకర్త సాయమ్మ భైంసా ANM సుమిత్రలు అంకిత భావంతో చేసిన సేవలు, 340 మంది వైద్యులు, 1500 మంది PG వైద్య విద్యార్థులు గాంధీ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న తీరు, 22,500 మంది పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వర్ణించడం ఎవరితరమూ కాదు.

రాత్రనకా పగలనకా 24/7 విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ టాప్ 3 వ్యూహంతో లాక్‌డౌన్‌ని పర్యవేక్షించటం నేను చూస్తూనే ఉన్నాను. చౌరస్తాలో నిలబడి మన వంకర టింకర ఆలోచనలకి క్రమతను నేర్పిస్తూ అటు సూర్యుడిని ఇటు చంద్రుడిని రెండు కళ్లుగా నింపుకొన్న కానిస్టేబుళ్లని చూసాను. లాఠీలపై పువ్వుల్ని పూయిస్తూ, టోపీలపై చిరునవ్వుల్ని అతికించుకుంటూ ఇరవైనాలుగు గంటలూ రోడ్ల మీద బతుకుల్ని ఆరేసుకున్న ఆ ధీరత్వం మీ అందరి క్షేమం కోసం ఒక యజ్ఞమే చేసింది. కళాజాత బృందాలతో అవగాహన కల్గించటం, తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం చేసిన-చేయించిన రక్త దానాలు, అన్నార్తుల్ని ఆదుకున్న తీరు, కరోనాకి సగటు మనిషికి మధ్య పెట్టని గోడలా నిలిచి చాటిన ధైర్యం నభూతో నా భవిష్యత్ అనిపించింది.

పోలీసు వాళ్ళతో ఓ మధుర జ్ఞాపకం చెప్పనా – ప్రసవవేదనతో మెలితిరిగిపోతున్న ఒక మహిళను దిల్లీ లోని ఓ కానిస్టేబుల్ వృత్తి రీత్యా తనకందిన ఫోన్ కాల్‌ని బట్టి సకాలంలో స్పందించి ఆస్పత్రికి చేర్చడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా ఆ మహిళ అప్పుడే పుట్టిన తన కొడుక్కి ఆ కానిస్టేబుల్ పేరు దయవీర్ సింగ్‌గా పెట్టి తన కృతజ్ఞత చాటుకున్న విధానం నాకు స్ఫూర్తిని కలిగించింది.

రమణమ్మ అనే ఆదివాసీ అంగన్‌వాడీ – స్కూటీ మీద ఇప్పటికీ రోజూ పౌష్టికాహారాన్ని అందజేస్తూ – పులికే భయపడం.. కరోనాకి భయపడతానా అని ఛాలెంజ్ విసరటం విస్మయం కలిగించింది.

పంజాబ్-పాటియాలాలో వీధుల్లో ఉన్న హర్జిత్ సింగ్ చేతిని నరికిన దుండగులు పారిపోతే తిరిగి సర్జరీ ద్వారా చేతిని అతికించుకొని వెంటనే వీధుల్లో చేరిన అతని ధైర్యాన్ని చూసి ప్రభుత్వమే కదిలిపోయి ఎస్సైగా ప్రమోషన్ అందించి మిగతావారికి స్ఫూర్తిగా నిలబడిన తీరు నన్ను ఆకట్టుకుంది.

మహబూబాబాద్ కలెక్టర్ V.P. గౌతమ్ రక్తలేమితో బాధపడ్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని చూసి స్వయంగా రక్తం ఇవ్వటం, రక్త శిబిరాన్ని తక్షణం ఏర్పాటు చేయడం, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా తానే వీధుల్లో సంచరిస్తూ ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసిన తీరు ఆదర్శంగా అనిపించింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు విన్నారుకదా నర్సుల మణిదీపం ఆమె. బ్రిటిష్ సైనికులు భారత్‌లో వాతావరణం పడక రకరకాల రోగాలతో చనిపోతుండడంతో బ్రిటిష్ రాణి నైటింగేల్‌ని భారత్‌కి పంపించింది. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసిన తాను 1862 లోనే ఇండియన్ శానిటరీ కమీషన్ నివేదికను రూపొందించి పరిశుభ్రత ఆవశ్యకతను తెలియచేసారు. పరిశుభ్రమైన వాతావరణమే రోగవ్యాప్తికి నియంత్రణ. అది రోగికి సాంత్వన అని చెప్పిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి వేడుకల్ని జరుపుకుంటూ ఈ సంవత్సరాన్ని నర్సుల సంవత్సరంగా పేర్కొంటున్నాం. కారుణ్యమే కవచంగా, సేవా గుణమే ఆభరణంగా, రోగుల పాలిట తోబుట్టువులై, సాటిలేని ఎవరెస్టులై, మదర్ థెరిస్సాలకు వారసులై సేవ చేస్తున్న నర్సమ్మల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ 2020 సంవత్సరాన్ని నర్సుల సంవత్సరమని ఐక్యరాజ్యసమితి ఏ ఉద్దేశంతో ప్రకటించిందో గానీ, వారు చేస్తున్న సేవ అజరామరం. కుటుంబాలకు దూరంగా వ్యాధిగ్రస్తులకు దగ్గరగా ఉంటూ ఇల దిగిన దేవదూతలుగా అనిపిస్తున్నారు. అంతెందుకు నీకొక సజీవ ఉదాహరణ సుగంధి కదా.. సుగంధి అనే స్త్రీమూర్తి కర్ణాటకలోని హలగా గ్రామంలోని నర్సు. పాజిటివ్ కరోనా పేషెంట్స్‌తో పనిచేస్తూ 3 యేళ్ళ తన పాప ఐశ్వర్య ఎత్తుకోమని ఏడుస్తున్నా.. తాను పెట్టందే అన్నం తినని ఆ పాప 15 రోజులుగా మారాం చేస్తున్నా భర్త ఆ పాపకి అమ్మను చూపిస్తాను రమ్మని హాస్పిటల్ బయట నిలబడి దూరంగా సుగంధిని చూపించాక ఆ పాప అమ్మా అంటూ చేతులు ఏడుస్తున్నా ఇంటికి వెళ్లకుండా సేవలోనే వుండిపోయి చాటిన తెగువ చూసి నేను చితికిపోయాను. త్యాగానికి సరికొత్త అర్థాన్ని, అంకిత భావానికి నిలువెత్తు రూపాన్ని నేను ఆమెలో చూడగలిగాను. ఇలాంటివి కూడా నేను ఎన్నో విన్నాను. ఆ అనుభవాల్ని, అనుభూతుల్ని నీకూ అందివ్వాలి కదా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here