ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -11

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]దిలక్ష్మికి రవళి కాలేజిలో చేరడం ఏదో గొప్పగా వుంది. కాలేజికి యూనిఫారం లేదు కాబట్టి కొత్తబట్టలు కొంటానంటూ రవళిని, స్నేహను తీసుకుని బజారుకు బయలుదేరింది. రవళి వద్దంటున్నా వినకుండా ఆరు జతల బట్టలు తీసింది. క్రితం నెలలోనే స్నేహకు మాటిచ్చింది కాబట్టి ఆమెకొక జత తీసింది.

“నాకు యింకొక జత డ్రెస్ కావాలమ్మా” అంది స్నేహ.

“నీకు వారంలో నాలుగురోజులు యూనిఫారమే కదా! ఒకేసారి ఎక్కువ జతలు తీసుకుంటే నీలాంటి ఎదిగే పిల్లలకు పొట్టిగా అయిపోతాయి” అంది ఆదిలక్ష్మి.

స్నేహకు ఏడుపొచ్చినంత పనయ్యింది. తనకీ ఆరవ తరగతిలో మంచి మార్కులే వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో ఎనభైలు దాటాయి. అందుకు తనకు ఎవరూ ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. గిఫ్ట్ అంటే గుర్తుకువచ్చింది. ఆదిలక్ష్మి రవిని, రవళిని బజారుకి తీసుకువెళ్ళి రవళికి మంచి వాచీ కూడా కొంది.

మొత్తానికి రవళి కాలేజికి వెళ్ళడం ఆమెకు ఎలా వున్నా ఆదిలక్ష్మికి మాత్రం చాలా సరదాగా వుంది. రవి డిగ్రీ సెకండ్ ఇయర్ కాబట్టి తన మకాం పూర్తిగా మేడ గది లోకి మార్చేశాడు.

***

“ఈ ఎకౌంట్స్ నీకేమైనా అర్థమౌతున్నాయా రవళి. నేనైతే ఏదైనా కోచింగ్ సెంటర్‍లో చేరాలనుకుంటున్నాను” అంది సంహిత.

“ఆ మాత్రం దానికి ట్యూషన్ ఎందుకు సంహిత? క్లాసులో శ్రద్ధగా చదివి విని ఇంటికి వెళ్ళి ప్రాక్టీసు చేస్తే సరిపోతుంది” అంది రవళి.

“అమ్మో నీ తెలివితేటలు నాకు లేవు. ఎవరైనా ట్యూషన్ చెబితే నేను చేరతాను.” అంది.

రవళికి మాత్రం యిష్టంగా లేదు. మొదటనుండి సొంతంగా చదువుకోవడమే అలవాటు. అయినా హైస్కూల్లో టీచర్లు చెప్పే చదువు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు వుండేది.

ఆ రోజు వాతావరణం మబ్బు పట్టివుంది తొందరగా కాలేజి వదిలిపెడితే బాగుండును. వానపడకుండా ఇంటికి చేరుకోవచ్చు అనుకుంటున్నారు అందరూ.

“పద రవళి, బయటికి వెళ్ళి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినివద్దాం” అంది సంహిత.

“వద్దు వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు.”

“ఇందులో బాగుండపోవడానికి ఏముంది. ఇంత చల్లటి వాతావరణంలో ఎవరైనా బజ్జీలు తింటారు కదా!”

“అబ్బా వద్దు సంహితా. ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజి. ఈ అబ్బాయిలు మనకి పేర్లు పెడతారు” అంది రవళి.

“అబ్బా, నువ్వు యింత పిరికిదానివనుకోలేదు.” కోపంగా అంది సంహిత.

రవళి నవ్వేసింది. ఈలోగా అటెండర్ వచ్చి క్లాసులు జరగవని ఈ రోజుకి ఇంటికి పోవచ్చని చెప్పాడు. సంహిత కోరుకున్నది జరిగింది. మిత్రులిద్దరూ బయటికి వచ్చారు.

“బజ్జీల బండి ఇటుంది రా వెళ్దాం” అంటూ సంహిత రవళిని చేయి పుచ్చుకు తీసుకుపోసాగింది.

ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా వారితో నడుస్తున్నారు. మబ్బు మరింత దట్టం కాసాగింది. చలిగాలి ఎక్కువైంది. ఇంతలో ఉరమని పిడుగులా వారిముందు ఫాతిమా కనిపించింది. సంహిత అప్రయత్నంగా రవళి చెయ్యి వదిలేసింది.

“అయ్యో అలా మధ్యలో వదిలేయకు సంహితా, రవళినైనా పట్టుకో” అంది ఫాతిమా.

“బాగున్నావా ఫాతిమా? పెళ్ళయిందని విన్నాను. ఏ వూళ్ళో వుంటున్నావ్?” అడిగింది రవళి.

“ఎక్కడో ఎందుకు ఇక్కడే… సంహిత దగ్గరే” అంది ఫాతిమా.

“సంహిత దగ్గర వుండటమేమిటి, ఇలా మాట్లాడుతున్నావేం…?”

రవళికి ఆమె మానసిక పరిస్థితి మీద అనుమానం వచ్చింది. ఇంతలో ఒక పెద్దామె ఉర్దూలో ఏదో తిట్టుకుంటూ వస్తోంది. ఫాతిమాను చూసి ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుపోయింది.

వెడుతూ వెడుతూ “మా అమ్మాయి తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండమ్మా. ఒక్కోరోజు అది యిలాగే మాట్లాడేస్తూ వుంటుంది” అంది తెలుగులో.

“ఎందుకిలా అయింది?” అడిగింది రవళి.

సంహిత ఆగమని సైగ చేస్తున్నా ఆమెకు అర్థం కాలేదు.

“ఈ మధ్య దీనికి పెళ్ళయిందమ్మా. దీని మొగుడు చిన్న మెకానిక్. ఆ డబ్బు సరిపోలేదు. ఏవేవో బిస్కెట్స్, చాక్లెట్సు, డ్రెస్సులు తెమ్మని గొడవ చేస్తోందని అతను ఒకటి రెండు సార్లు కొట్టాడు. దానితో దీనికి మళ్ళీ కోపం వచ్చి అతన్నేదో అనడం మొదలుపెట్టింది. ఈ మధ్య కొంచెం నయమే… అతను వచ్చి రేపో ఎల్లుండో తీసుకువెడతానంటున్నాడు. అతను వస్తే మంచి వంటలు చెయ్యాలంటూ సరుకుల కోసం బజారుకు వచ్చి మిమ్మల్ని చూసి ఇదిగో ఇలా మాట్లాడుతోంది.”

ఆమె ఇదంతా మాట్లాడుతుంటే ఆమె చెయ్యి విడిపించుకుని ఇంటివైపు వెళ్ళిపోయింది ఫాతిమా.

“చూశారా చెప్పాచెయ్యకుండా ఎలా పోయిందో” ఆవిడ కూడా వెళ్ళిపోయింది.

రవళికి, సంహితకు నోటమాట రాలేదు.

“సంహితా! ఫాతిమాకు పిచ్చెక్కిందంటావా? నిన్నూ, నన్నూ గుర్తుపట్టింది కానీ మునుపటిలా మాట్లాడలేదు ఎందుకంటావ్? మాట్లాడవేం సంహితా.”

ఏం మాట్లాడుతుంది సంహిత. అంతరాత్మ ఎప్పుడూ మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడుతుంది.

“ఏం మాట్లాడను రవళి, హాయిగా మనలాగ చదువుకోవాల్సిన పిల్ల… ఇలా కావడం బాధాకరం. అసలు ఫాతిమా ఈ వూళ్ళో వుండకుండా భర్త దగ్గరే వుంటే మంచిది, ఈ వాతావరణానికి దూరంగా.” అంది సంహిత.

రవళికి ఆమె మొహం చూస్తే ఎక్కడలేని బాధ కలిగింది.

“అదే ఆలోచించి మనసు పాడుచేసుకోకు సంహితా. పోనీ మా యిల్లు దగ్గరేగా కాసేపు కూర్చుని వెడుదువుగాని”

“లేదు. పెద్ద వానపడితే నేను ఇంటికి వెళ్ళడం కష్టం. ఈ గాలికి కరెంటు ఉందో లేదో. ఇంటికి పోతాను రేపు కలుద్దాం.”

సంహిత ఎంత డిస్ట్రబ్ అయిందంటే గాలి విసురుగా వీచి రోడ్డుమీద దుమ్ము కళ్ళల్లో పడుతున్నా, ఒకటి రెండు చినుకులు తలమీద పడుతున్నా రిక్షా ఎక్కాలన్న ఆలోచన ఆమెకు రాలేదు. ఆమె ఇంటికి వచ్చేసరికి నీరజ ఇంట్లోనే ఉంది. సంహిత ముందు వరండాలోని పేము కుర్చీలో కూర్చుండిపోయింది, పుస్తకాలు ఒళ్ళో పెట్టుకుని.

“కాలేజీ అయిపోయిందా? అలా వున్నావేం? కాలేజీలో ఏదైనా గొడవ జరిగిందా?”

ఇంతసేపూ వున్న సంహిత మాయమై మామూలు సంహిత తెరమీదకి వచ్చింది.

“అంటే అందరితో గొడవపడటమే నా పని”

“అదికాదక్కా నువ్వు అదోలా వుంటే…”

“వుంటే వున్నానులే అది నా యిష్టం” గట్టిగా మాట్లాడుతోంది సంహిత.

“అబ్బా ఏమిటే ఇంటికి వచ్చారంటే చాలు, ఏదో పొట్లాట. అమ్మ నిద్రపోతుంది మాట్లాడకూడదన్న భయం లేదు” పిల్లలిద్దర్నీ చివాట్లు వేసింది శకుంతల.

ఇంతలో ఫోన్ మోగింది. సంహిత తీసింది. అటునుంచి భార్గవ్. అంతే, సంహిత మామూలు సంహిత అయిపోయింది.

అటు రవళి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి బయటనే ఆవరణలో స్కిప్పింగ్ ఆడుతోంది స్నేహ. రవళికి ఏదో అనుమానం వచ్చి పక్కింటి డాబా వైపు చూసింది. అప్పటిదాకా అక్కడే వున్న కుర్రాడు తప్పుకున్నాడు. ఆమె ఈ పక్కకి చూసింది, పక్కింటి కిటికీలోనుండి ఒక ముఖం తప్పుకుంది.

“ఆపు స్నేహా, ఏమిటా గంతులు?” అంది కోపంగా.

“అబ్బా ఎప్పుడు ఆడుకుందామన్నా ఏదో గొడవ చేస్తావే” అంది స్నేహ.

“గొడవకాదు, నీకు చెబితే అర్థం కాదు, పద లోపలికి”

రవళి తనే స్కిప్పింగ్ రోప్ తీసుకుని స్నేహను లోపలికి తీసుకువెళ్ళింది.

“ఏం జరిగింది రవళి, ఎందుకు అరుస్తున్నావ్.” అంది ఆదిలక్ష్మి ఆరిన బట్టలు తీసి మడతవేస్తూ.

“ఏం చెప్పనమ్మా ఇది పెద్దది అయింది కాని, బుద్ధి మాత్రం రావడం లేదు. చుట్టుపక్కల ఎవరున్నారో ఏమిటో చూసుకోకుండా స్కిప్పింగ్ ఆడుతోంది.”

“బయటకెందుకు వెడతావ్ స్నేహా, లోపల ఆడుకో”

“స్కిప్పింగ్ లోపల ఎలా ఆడతారమ్మా, అర్థం లేకుండా మాట్లాడతావ్.”

ఆ మాటకి రవళికి, ఆదిలక్ష్మికి చెప్పలేనంత కోపం వచ్చింది.

“ఏం మాట్లాడుతున్నావే, అమ్మతో అలాగేనా మాట్లాడేది.”

“ఓహో… సారీ అమ్మా కోపంలో ఏదో అనేశాను. ఏమనుకోవద్దు” అంది స్నేహ.

“అసలు మిమ్మల్ని ఇంత తొందరగా స్కూలు నుండి ఎలా వదిలిపెట్టారు. లేక నువ్వే వచ్చేశావా?” అడిగింది రవళి.

“మన స్కూల్లో ఎవరినైనా చెప్పకుండా పోనిస్తారా, నువ్విలా అడిగితే నాకూ కోపం రాదా? మధ్యాహ్నం మూడున్నర దాకా స్కూల్లోనే వున్నాము. వానపడేట్టు వుందని యిళ్ళు దూరంగా వున్నవాళ్ళు యిబ్బంది పడతారని అడగడంతో హెచ్.ఎం. అందరినీ పంపించారు.”

“మమ్మల్ని ఎప్పుడూ ఇలా పంపలేదు. మేము అడగనూలేదు” అంది రవళి.

“అసలు ఇలా అడగాలనే ఆలోచన మొదటగా వచ్చినది నీరజకే. తనే ఒక లెటర్ రాసి సెక్షన్‍కి అయిదుగురి చొప్పున సంతకాలు పెట్టి మేడమ్‍కి ఇచ్చింది. అందువల్ల అందరినీ పంపించారు.”

“పోనీలే ఇన్నాళ్ళకైనా మన స్కూలు వాళ్ళకు మనుషుల కోసం రూల్స్ గానీ, రూల్స్ కోసం మనుషులు కాదని అర్థమైతే చాలు”

“రవళి, స్నేహ చేతులు, కాళ్ళు కడుక్కోండి. వేడిగా పకోడీలు వేస్తాను, తిందురుగాని” అంది ఆదిలక్ష్మి.

పకోడీలు అనగానే రవళికి సంహితా, ఫాతిమా గుర్తుకు వచ్చారు.

***

అన్నగారిని సంప్రదించి రవళి ఎకౌంట్స్ చెప్పే ఒక మాస్టారిని పెట్టుకుంది. సంహిత, రవళి ఇద్దరూ ట్యూషన్‍లో చేరారు. సాయంత్రం నాలుగు గంటలు అయ్యాక కాలేజీ విడిచాక ట్యూషన్. నాలుగురోజులు వెళ్ళాక రవళికి ఇబ్బందిగా అనిపించసాగింది. అబ్బాయిలకు అమ్మాయిలకు కలిపి ఒకటే బ్యాచ్. కాలేజీలో కో-ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ కూడానా. రవళి అలవాటుగా తన మనసులో మాట సంహితతో చెప్పింది.

“అవున్లే కాలేజీలోనూ అవే మొహాలు, ట్యూషన్‍లోనూ అవే మొహాలు, బోర్‍గానే వుంటుంది” అంది సంహిత నవ్వుతూ.

“ఛ… ఏమిటి సంహితా ఆ పిచ్చి మాటలు. వాళ్ళు ఎకౌంట్స్ నేర్చుకోవడం మానేసి మనిద్దరినే చూస్తున్నట్టు వుంటుంది నాకు.”

“అందంగా వున్నాం కాబట్టి చూస్తున్నారోయ్, అందం లేని వాళ్ళని చూడగలరా?” అంది సంహిత.

“వాళ్ళు చూడటానికి వస్తున్నారేమో, నేను ప్రదర్శించడానికి రావడం లేదు” తీవ్రంగా అంది రవళి.

“అబ్బా, నేనేదో జోక్‍గా అంటే అంత సీరియస్ అవుతావెందుకోయ్. ఇప్పుడు నువ్వు అన్నమాట ‘నన్ను’ అని నేను అనుకోవచ్చా”

“అయ్యయ్యో వాళ్ల మీద కోపంతో ఏదో అన్నాను, నిన్ను కాదు, సంహితా అయాం వెరీ వెరీ సారీ”

“మనం బయటికొచ్చాక చాలామంది చూస్తారు, గమనిస్తారు. ఆ చూపులు మన అందానికి సర్టిఫికెట్స్ అనుకోవాలి. అంతేగాని వాళ్ళు చూస్తున్నారని ఎంతమంది నుండి పారిపోగలం. అది ఆ వయసు లక్షణం అని వూరుకోవాలి” అంది సంహిత.

రవళి మాట్లాడలేదు. వాడెవడో నువ్వు అందంగా వున్నావని సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటి ఛీ… అనుకుంది మనసులో.

***

ఆ రోజు రవళి కాలేజికి వెళ్ళలేదు. ఆదిలక్ష్మికి పొద్దుటనుంచి కాస్త జ్వరం వచ్చినట్టుగా వుంది. రొటీన్ నుంచి భిన్నంగా వుంటుంది, తల్లికి సాయంగానూ వుంటుందని రవళి కాలేజి మానేసింది. మధ్యాహ్యం నిద్ర అలవాటు లేదు. ఏదో వారపత్రిక తిరగేస్తుంటే పోస్ట్ అన్న కేక. వెంటనే వరండాలో పడిన ఇన్‍లాండ్ కవరు. ఆ దస్తూరి ఎవరిదో కొత్తగా ఉంది. ఇంగ్లీషు రాయడం అలవాటైన మనిషి రాసినట్టుగా వుంది ఆ దస్తూరి. అది తన పేరే, ఎడ్రస్ తనదే. ఆమె చప్పున కవరు చింపింది.

లోపల సంబోధనా, విషయమూ అంతా సంహితకు. రవళి గుండె వేగం ఆమెకే తెలిసేట్టు కొట్టుకుంది. అసలు తన ఎడ్రస్ తనకు తెలియకుండా ఇవ్వడం ఏమిటి? ఆమె మరోసారి ఉత్తరం పూర్తయిన చోట చూసింది. భార్గవ్ అని వుంది. ఎవరీ భార్గవ్? ఎక్కడో విన్నది ఈ పేరు. ఎప్పుడో సినిమా హాల్లో గుసగుసగా సంహిత ఈ పేరు పిలవడం విన్నది. రవళికి భయంగా ఉంది. సమయానికి తను యింట్లో వున్నది కాబట్టి సరిపోయింది.

ఆ ఉత్తరం తన ఇంట్లో వుంటే ప్రమాదకరం. ఇది ఎంత తొందరగా సంహితకు అందజేస్తే అంత మేలు. కానీ యింట్లోనుంచి బయటకు వెళ్ళడం ఎలాగ? ఆమె అలా ఆలోచిస్తుండగానే స్నేహ స్కూలు నుండి ఇంటికి వచ్చింది.

“స్నేహ అమ్మను ఒక అరగంట చూస్తావా? నేను సంహిత ఇంటికి వెళ్ళి ఈవేళ కాలేజిలో ఏం నోట్సులు చెప్పారో తెచ్చుకుంటాను.”

“ఏమిటక్కా అమ్మకు బాగోలేకపోతే… సంహిత యింటికి వెళ్ళడం ఎందుకు.”

“చెప్తున్నాను కదే నోట్సులు కోసమని. రా… నీకు కాఫీ ఇస్తాను. అమ్మకు ఇచ్చేసాను. నాన్నగారికి, అన్నయ్యకు కాఫీ ప్లాస్కులో పోసిపెట్టాను. వాళ్ళు వచ్చాక తాగమని చెప్పు.”

“నువ్వేమి అనుకోకు అక్కా, కాఫీ బాగోలేదు.”

“నాకూ నచ్చలేదు. ఈ పూటకు ఎడ్జస్ట్ అయిపో.”

రవళి స్నేహకు మాట్లాడే అవకాశం యివ్వకుండా వున్నది వున్నట్టు బయలుదేరింది. సంహిత ఈమెను చూసి ఆశ్చర్యపోయింది.

“అమ్మకు జ్వరమని కాలేజికి రావడం లేదని ఫోన్ చేశావుగా, ఎలా వుందిప్పుడు. నేనే వచ్చి చూద్దామనుకుంటున్నాను” అంది సంహిత.

ఇదిగో ఇలాంటి ఆప్యాయతకే తను ఎప్పటికప్పుడు లొంగిపోతుంది. శకుంతల, నీరజ కూడా ఆదిలక్ష్మి గురించి అడిగారు.

“సంహితా! ఈవేళ నోట్సులు ఏం చెప్పారో తీసుకుందామని వచ్చాను.”

“ఇది స్కూల్ అనుకున్నావా? పెద్దగా ఏం జరగలేదు. కొంచెం ఇంగ్లీషు గ్రామరు చెప్పారు.”

రవళికి ఉత్తరం ఎలా అందించాలో తెలియలేదు.

“సరే నేను బయలుదేరుతాను”

రవళి బయటికి రావడంతో సంహిత ఆమెతో ఇంటిగేటు దాకా వచ్చింది.

“సంహితా! నీకు ఉత్తరం వచ్చింది. అది యివ్వడానికే వచ్చాను.”

“అలాగా. ఇవ్వు… ఈ పుస్తకంలో పెట్టి తెచ్చావా? ఆ బుక్ యిచ్చెయ్ రేపు కాలేజిలో ఇస్తాను” రవళి బుక్ ఇచ్చేసింది.

“నా ఎడ్రస్ ఎందుకిచ్చావ్ సంహితా, నేనీరోజు అనుకోకుండా ఇంట్లో వున్నాను కాబట్టి సరిపోయింది. ఇది యింకెవరి చేతుల్లో నైనా పడితే పెద్ద గొడవ అయ్యేది. ఇంతకీ భార్గవ్ ఎవరు?”

“నువ్వు ఈ ఉత్తరం చదివావా” అడిగింది సంహిత.

ఆమె కొద్దిగా బుక్ తెరిచి చూసింది, ఉత్తరం చింపినట్టుగా వుంది.

“ఇతరుల ఉత్తరాలు చదివే స్థాయికి నేనింకా దిగజారలేదు” అంది రవళి.

“అయ్యో ఏమిటి రవళీ, నేనేమైనా అడిగితే ఈ మధ్య ఇంత తీవ్రంగా తీసుకుంటున్నావు.”

“కవరు మీద నీ ఎడ్రస్ వుంది అంటే చింపేదాన్ని కాదు. నా పేరు నా యింటి అడ్రస్ వున్నాయి. నా ఉత్తరం అనుకుని కట్ చేశాను. తీరా మొదటే డియర్ సంహితా అని వుంది. వెంటనే క్రింద సంతకం భార్గవ్ అని వుంది. చెప్పు ఎవరతను? ఆ రోజు సినిమాహాల్లో కలిసింది ఇతనేనా.”

“అవును. ఆ రోజు స్టోరీ అంతా నీకు చెప్పానుగా. ఆస్తుల గురించి గొడవలు….”

“నిజమే! చెప్పావు కానీ ఎన్నాళ్ళిలా? అయినా పెద్దవాళ్ళ ఆస్తుల గొడవలు మనకెందుకు? ఆ సినిమాకి వెళ్ళినందుకు మా యింట్లో చాలా పెద్ద గొడవ జరిగింది.”

సంహిత మాట్లాడలేదు, నీరజ దూరంగా నిలబడి వీరినే చూస్తోంది.

“సరే! నేనింక బయలుదేరుతాను సంహితా. రేపు కాలేజీలో నా బుక్ ఇచ్చేయ్.”

రవళి ఇంటికి వచ్చేసింది. స్నేహ అరటికాయ వేపుడు చేస్తోంది. ఒక పక్క కుక్కరు విజిల్స్ వేస్తోంది.

“అదేమిటే ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, నేను వచ్చి చేసేదాన్నిగా”

“ఏడుగంటలు అవుతోంది కదా అని మొదలుపెట్టాను. సాయంత్రం ఎవరూ టిఫిన్ తినలేదుగా, ఆకలివేస్తుంటూంది అందరికీ. అవునూ నోట్సులు తెచ్చుకున్నావా?”

“లేదు, ఈవేళ లెస్సన్స్ ఏమి జరుగలేదట.”

‘మరి అలాంటప్పుడు తీసుకు వెళ్ళిన బుక్ అయినా తెచ్చుకోవాలిగా’ మనసులో అనుకుంది స్నేహ.

“అయ్యో నువ్వు వంట చేశావా స్నేహా… ఆ మాట ముందు తెలిస్తే నేను హోటల్లో తిని వచ్చేవాడిని” రవి జోక్ చేశాడు.

“అన్నీ అమ్మనడిగే చేశానులే, తినకుండా పేర్లు పెడతావేం?” అంది.

ఆదిలక్ష్మితో సహా అందరూ ఒకేసారి భోజనం చేశారు. “కూర బాగా వేగింది, చారు వేడిగా వుంది” అంటూ తిన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here