[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ర[/dropcap]వళి, సంహిత ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చివరిలోకి వచ్చారు. వారిద్దరి స్నేహం కలుసుకుంటూ విడిపోతూ, మరింత గాఢంగా పెనవేసుకుంటూ ఉంది.
నీరజ టెన్త్ పాసయ్యింది. నేనీ వూళ్ళో చదవను అని ఆమె పెద్దవాళ్లతో దెబ్బలాడి ఏడ్చి మొత్తుకుని విశాఖపట్నంలో ఉమెన్స్ కాలేజీలో, హాస్టల్లో చేరిపోయింది.
రవళి మళ్ళీ ఇంటర్మీడియట్‍లో కూడా ఫస్ట్ క్లాస్ కోసం ప్రయత్నిస్తోంది. ఆమె ట్యూషన్ మాస్టారితో మాట్లాడి ఆడపిల్లలందరికీ ఒక బ్యాచ్ తయారుచేయించింది. అందుకని ట్యూషన్ ఉదయం 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు. ఇది సంహితకు తప్ప అందరికీ నచ్చిన ఏర్పాటు.
“నువ్వేదో చేశాననుకుంటున్నావ్ రవళి, వాళ్ళు మనతో ట్యూషన్‍లో వుండటం లేదు. కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడూ రోడ్డంతా వాళ్ళే”
“ఎలాగో ఏడవనీ అది వాళ్ళ టైమ్ వేస్ట్, వాళ్ళు క్లాసులోకి వస్తే మన టైమ్ వేస్ట్” అంది రవళి.
ఇద్దరూ రోడ్డుమీద నడుస్తున్నారు.
“రవళీ! నువ్వు పురుష ద్వేషివా?”
“అయ్యబాబోయ్ ఒక్కసారిగా అలా అన్నావేమిటి సంహితా”
“అవును నిన్ను దాదాపు మూడేళ్ళుగా చూస్తున్నానుగా ఎప్పుడూ ఏ అబ్బాయి గురించి మాట్లాడవ్, ఎందుకు?”
“ఏముంది వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. అసలు వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి?”
“అంటే నీకు ఇంతమంది అబ్బాయిల్లో ఎవరిని చూసినా ఆకర్షణ కలగలేదా?”
“ఊహు. ఇలాంటి వాటికి లొంగిపోయి ఇప్పుడు చదువు పాడు చేసుకుని నలభై ఏళ్ళు వచ్చాక అయ్యో సరిగ్గా చదువుకోలేదే అని బాధపడితే ఏం లాభం?”
“ఆకర్షణలో పడినంత మాత్రాన చదువెందుకు నిర్లక్ష్యం చేస్తాం?”
“అందరికీ అంత నిగ్రహం ఏకాగ్రత వుండవు సంహితా”
“అంటే నాలాగ”
“ఛ… నిన్ను అనడం లేదు. మా యింట్లో సినిమాకి వెళ్ళొచ్చాక కూడా నేను ఎన్నోసార్లు చదువుకున్న సందర్భాలు వున్నాయి. మా అన్నయ్యా, స్నేహ అలా కాదు. ఆ సినిమా గురించి, పాటలు, ఫైటింగులు, యాక్టర్స్ వేసుకున్న బట్టలు గురించి అలా మాట్లాడుకుంటారు. అఫ్‍కోర్స్ మా అన్నయ్య దాన్ని ఏడిపిస్తాడనుకో.”
“మరి వాళ్ళిద్దరూ చదవడం లేదా?”
“ఇంకా బాగా చదవాలి. పరీక్షకు వెళ్ళామంటే ఫస్ట్ క్లాస్‍తో తిరిగిరావాలి అన్నట్టు వుండాలి”
‘ఈశ్వరా’ అనుకుంది సంహిత.
***
ఆ రోజు పొద్దున్నే కూర్చుని ఎకౌంట్స్ చేస్తున్న రవళికి ఏకాగ్రత కుదరడం లేదు. ఏదో చప్పుడు. అదేమిటో చూడాలని ఆమె బయటికి వచ్చింది. ఏమీ కనబడలేదు. ఉష్….ష్…. అన్నట్టు చప్పుడు. ఆమె నెమ్మదిగా మేడ మెట్లు పైకి వెళ్ళింది. స్నేహా కూనిరాగాలు తీస్తూ బట్టలు ఆరేస్తోంది. ఆ చప్పుడు చేస్తున్న పక్కింటి కుర్రాడు రవళిని చూసి కిందికి దిగిపోయాడు. స్నేహ కాళ్ళ ముందు ఏదో కాగితం వుండ. రవళి చప్పున తీసి చూసింది. పైన సంబోధన లేదు. కింద సంతకం లేదు. ఆ ఉత్తరం లాంటి చీటిలో ఏదో ఉంది. అది తెలుగులా వుంది. కానీ అర్థం కావడం లేదు.
“ఏమిటక్కా ఆ కాగితం” అడిగింది స్నేహ.
“అదే నేను అడుగుతున్నాను, ఏమిటీ కాగితం, ఎవరా అబ్బాయి?”
“ఎవరూ? ఎక్కడ?” స్నేహ అటూ ఇటూ చూసింది.
“అబ్బ ఏం నటిస్తున్నావే” రవళి లాగి స్నేహ చెంప ఛెళ్ళుమనిపించింది.
తల అదిరింది. కళ్ళు బైర్లు కమ్మినట్టూ అయింది. స్నేహ కింద పడిపోయింది. రవళికి చెప్పలేనంత భయం వేసింది.
“స్నేహా… స్నేహా…” అంటూ ఆమె తలని ఒడిలోకి తీసుకుంది.
పక్కగదిలోనే బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళడానికి తయారవుతున్న రవి చెల్లెలి కేకలు విని డాబా మీదకు వచ్చాడు.
స్నేహ అలా పడిపోవడంతో అతనికీ భయం వేసింది. గ్లాసుతో నీళ్ళు తెచ్చి స్నేహ మొహం మీద కొట్టాడు.
“ఏమిటి స్నేహా అలా పడిపోయావ్… ఏమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా”
రవళి ఏడవసాగింది.
“ఏడవకు అక్కా. నేను బాగానే వున్నాను.”
“సారీ స్నేహా, నన్ను క్షమించు. అనవసరంగా కొట్టాను.”
“నువ్వు స్నేహను కొట్టావా? ఎందుకు?” అడిగాడు రవి.
“ఇదిగో ఈ చీటీ చూసి అక్క నన్ను కొట్టింది.”
“ఇందులో ఏముందో ఏమీ అర్థం కావడం లేదు.”
అన్నగారి ప్రశ్నలు తట్టుకోలేక జరిగింది చెప్పింది రవళి. స్నేహ, రవి నవ్వారు.
“ఈ చీటీ చూసి నువ్వు స్నేహను కొట్టావా? ఇది రాసిన కుర్రాడు పక్కింటివాడు అవునా… వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. తెలుసా… అందుకే ఏవో పిచ్చిపనులు చేస్తుంటాడు.”
“ఇలాంటి వాళ్ళు మన పక్కింట్లో ఎప్పుడు దిగారు?” అడిగింది రవళి.
“ఎప్పుడో ఏడాది దాటింది. నీకు చదువు, సంహిత తప్ప ఏం పట్టింది కనుకా…” అంది స్నేహ.
రవళి మనసు అపరాధ భావంతో ముడుచుకుపోయింది.
***
ఇంటర్మీడీయట్ సెకండ్ క్లాసులో పాసయ్యింది రవళి, సంహిత కూడా. ఆదిలక్ష్మికి కూతురుకి ఫస్ట్ క్లాస్ రాకపోవడంతో చాలా నిరాశ కలిగింది. రవళికి కూడా చాలా అవమానంగా అనిపించింది. ఏమిటిది తనకు తాను చాలా బాగా చదువుతాను అనుకుంది ఇన్నిరోజులు. కాలేజికి, ట్యూషన్‍కి క్రమం తప్పకుండా వెళ్ళినా ఏ ఆకర్షణలకు లోబడపోయినా తనకు ఫస్ట్ క్లాస్ రాలేదు… ఆ ఆకర్షణలకి లోబడిన… సంహితకూ అవే క్లాసులు మార్కులు వస్తున్నాయి.
ఆదిలక్ష్మి రవళితో సరిగ్గా మాట్లాడడంలేదు.
“ఏమిటమ్మా యిది నేనేం తప్పు చేశానని నాతో మాట్లాడడం లేదు” అడిగింది రవళి.
“నా ముగ్గురు పిల్లల్లో నువ్వు తెలివైనదానివని బాగా చదివించి డాక్టరును చేయాలనుకున్నాను. నువ్వు చదవను అన్నావు. మీ నాన్నగారు చదివించను అన్నారు. పోనీ ఆ చదువైనా సరిగ్గా చదివావా, అత్తెసరు మార్కులతో పాసయ్యావు. ఇంటికి పెద్దపిల్లవు అయినా నీకే పని చెప్పను. ఎందుకంటే నీకు చదువుమీద ఆసక్తి తగ్గకూడదని. నేనేమైనా అంటే నువ్వు బాధపడతావు. నాకు జ్వరం వున్నా, నువ్వు కాలేజికి వెళ్ళకపోయినా ఏదో వంకతో సంహితను చూడడానికి వెళ్ళిపోతావు”
“అమ్మా….” అంది రవళి.
“ఏమిటీ ఆ పిల్ల పట్ల అంత ఆకర్షణ ఏమిటి?”
“ఛీ… సంహిత పై నాకు ఆకర్షణ ఏమిటి?”
“ఇక్కడ నేను అనేది ఆడవాళ్ళా, మగవాళ్ళా అని కాదు రవళీ, వాళ్లకి నువ్విచ్చే ప్రాధాన్యత. మూడేళ్ళుగా చూస్తున్నానుగా ఆ అమ్మాయి మాట నీకు వేదవాక్కు.”
పనిమనిషి పిలవడంతో ఆదిలక్ష్మి వెళ్ళింది అక్కడి నుండి. తల్లి తనను ఇంత విశ్లేషిస్తుందని తెలియని రవళి అలా కూర్చుండిపోయింది.
మళ్ళీ వేసవికాలం పూర్తికావడం మళ్ళీ పిల్లల కొత్తక్లాసుల్లో చేరడం అంతా మామూలుగానే వుంది. రవళి, సంహితా డిగ్రీ ఫస్ట్ ఇయర్‍లో చేరారు. స్నేహ ఇప్పుడు తొమ్మిదో తరగతి లోకి వచ్చింది. రవి బి.ఇడిలో చేరాడు. రవళికి మునుపటిలా చదువుమీద ఆసక్తి కలగడం లేదు. ఆదిలక్ష్మి మాటలు ఆమెకు అనుక్షణం గుర్తుకువచ్చి బాధిస్తున్నాయి. నిజమే, తనకి చిన్నప్పటినుంచి మెడిసిన్ చదవాలని ఉండేది, సంహిత ఆర్ట్స్ తీసుకుందని తనూ తీసుకుంది. తండ్రి తనను చదివించలేను అనడం మరో కారణం. తనకు తెలియకుండానే తను సంహిత మాటల గారడిలో పడిపోయిందా? ఆమెకు సంహిత నవ్వు గుర్తుకువచ్చింది. లేదు… లేదు… సంహిత తనకు మంచి స్నేహితురాలు, ఆమె స్నేహంలో తను కొన్ని నేర్చుకుంది.
***
స్నేహ బడికి వెళ్ళడానికి తయారవుతోంది. కళ్ళకు కాటుక పెట్టుకునేసరికి ఆమె సోగకళ్ళు మరింత అందంగా వున్నాయి. ఆమె తన డ్రెస్ మరోసారి చూసుకుంది. ఎర్రని చిన్న చిన్న పువ్వులున్న తెల్ల పరికిణీ, ఎర్రని ఓణి, తెల్ల జాకెట్. టైలరుకు చెప్పి తెల్ల జాకెట్‍కి మెడ చుట్టూ ఎర్రని పైపింగ్ వేయించింది. నుదుట ఎర్రని బొట్టు.
అబ్బా తలస్నానం చేస్తే ఈ డ్రెస్ మరింత అదిరిపోయేది. స్కూలుకు వెళ్ళేటప్పుడు అమ్మ తలస్నానం చేయవద్దంటుంది. ఆ… నిన్న ఎర్రగులాబీ మొక్కకు మొగ్గను చూసింది. ఇప్పుడు విచ్చుకుని వుంటుంది అది తలలో పెట్టుకుంటే….
‘అద్దంలో నా నీడ ముద్దు ముద్దుగా తోచింది. ఆ నీడ నన్ను చూసి అదోలా నవ్వేసింది.’ ఆమె అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పాడసాగింది.
“స్నేహా, పొద్దున్నే ఏమిటే ఈ పాటలు… నాన్నగారు పూజ చేసుకుంటున్నారు” ఆదిలక్ష్మి గద్దించింది.
స్నేహ నోరు మూతపడింది. ఆమెకేదో అనుమానం వచ్చి ఇంటి బయటికి వెళ్ళింది. గులాబీ చెట్టుకి పువ్వు లేదు.
“అమ్మా గులాబీ పువ్వు ఏది?” వంటింట్లోకి వెళ్ళి తల్లిని అడిగింది.
“దేవుడికి పెట్టమని నాన్నగారికి ఇచ్చాను. ఏం ఎందుకు నీకా పువ్వు”
“ఎందుకేమిటి, జడలో పెట్టుకోవడానికి.”
“స్కూలుకి పువ్వులు పెట్టుకువెడతావా? మన టీచర్లు తిడతారు తెలుసా?” అక్కడికి వచ్చిన రవళి అంది.
“మరీ ఎక్కువగా పూలదండలు వెళ్ళాడుతున్నట్టుగా పెట్టుకుంటే కోప్పడతారు. ఒక్క పువ్వుకేమీ అనరు. నా డ్రెస్‍కు మేచింగ్‍గా పెట్టుకుందామనుకున్నాను” ఆమె గొంతులో దుఃఖం.
“అసలు బడికి ఎరుపురంగు బట్టలు వేసుకోవద్దని చెప్పానా. పైగా పువ్వులొకటా? దిష్టి తగులుతుంది. లైట్ కలర్ ఏదైనా వేసుకో” అంది ఆదిలక్ష్మి.
“అవును అమ్మ చెప్పినట్టు చెయ్యి” అంది రవళి.
“అబ్బా నేనిపుడు ఈ డ్రెస్ మార్చలేను. ఏమిటమ్మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వున్నారు, నువ్వు వున్నావు. పువ్వు పెట్టుకుంటే అనే ఆలోచన రాదా…”
“ఛ… ఏమిటే ఆ మాటలు? దేవుడికి పెట్టాను. ఇంక మాటలు ఆపండి” అన్నారు జగన్నాథం గారు.
“ఏమిటి రవళి ఇది నీలా కాదు. అలా తయారై బడికి వెడుతుంది” అంది ఆదిలక్ష్మి.
“పోనిద్దు, దాని సరదాలు తెలుసు కదా మనకు. ఎబ్బెట్టుగా ఏం తయారుకాలేదులే”
“అదేమిటే అలా అంటావ్”
“అవునమ్మా మా కాలేజిలో కొంతమంది తయారవుతారు. నుదుటమీద జుట్టు కత్తిరించుకుని లైట్‍గా లిప్‍స్టిక్ వేసుకుని….”
రవళి మాటల్లోంచి ఆలోచనల్లోకి జారిపోయింది. సంహిత… స్నేహ ఇద్దరికీ అలంకరణపై ఆసక్తి, శ్రద్ధ. కానీ ఆ తయారుకావడంలో ఒక గ్రేస్. ఆ అలంకరణ మొహం తిప్పుకునేటట్టు వుండదు. సంహిత చక్కగా తయారవుతుంది. కానీ ఎవరినీ తనంతట తాను ఆకర్షించాలనుకోదు. ఎవరైనా ఆమె పట్ల ఆకర్షితులైతే అది ఆమె తప్పుకాదు.
(ఇంకా ఉంది)