Site icon Sanchika

ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -14

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]కా[/dropcap]లేజిలో పాఠం వింటున్న రవళి ఆమె కోసం ఎవరో వచ్చారని చెప్పడంతో ఆఫీసు రూమ్‍లోకి వెళ్ళింది. అక్కడ సంహిత తల్లిగారు శకుంతల. ఇద్దరూ బయటికి వచ్చి చెట్టుకింద నిలబడ్డారు.

“చెప్పండి ఇలా వచ్చారేం, సంహిత రెండు రోజులు కాలేజికి రానంది”

“అలాగా, అయితే అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా?”

“అదేమిటి తను యింట్లో లేదా?” రవళి ఆశ్చర్యపోయింది.

“లేదు… అది యింట్లో రాత్రి చాలాసేపు గదిలో ఏదో సర్దుతున్నట్టు అయింది. నాకు తొందరగా నిద్రపోవడం అలవాటు. తెల్లవారి చూస్తే ఇంట్లో లేదు. దాని గదిలో బీరువా మీద వుండే ట్రావెలింగ్ బ్యాగ్ కూడా లేదు.”

రవళికి చాలా భయం వేసింది. ఎక్కడికి పోయినట్టు.

“నాకు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదాంటీ, రెండురోజులు కాలేజికి రానని మాత్రం చెప్పింది.”

“అయ్యో ఈ పిల్ల ఎక్కడికి పోయినట్టు… పోనీ ఇంకెవరికైనా చెప్పి వుంటుందంటావా?”

“మా క్లాస్‍మేట్స్‌ని అడుగుతా, వుండండి.”

క్లాసులోకి వెళ్ళబోయిన రవళి ఆగిపోయింది.

“అలా అడిగితే బాగుండదు. సంహితకు మనమే చెడ్డపేరు తెచ్చిన వాళ్లం అవుతాం.”

“మరెలా” అందావిడ నిస్సహాయంగా.

“తను ఉత్తరం ఏమైనా రాసిందేమో చూడలేకపోయారా?”

“లేదు. ఇంట్లో అంతా చూశాము. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెప్పాలి. పనిమనిషి అడగనే అడిగింది, ఏదో అబద్ధం చెప్పాను.”

“కాస్సేపు చూద్దాం. మీకో నాకో ఫోన్ చేస్తుందేమో.”

సంహిత మీద ఎప్పుడూ లేని కోపం వచ్చింది రవళికి. వెళ్ళే మనిషి చెప్పి వెళ్ళవచ్చు కదా! ఒకవేళ భార్గవ్‍ను కలవడానికి వెళ్ళిందేమో! భార్గవ్ గురించి అసలు ఈవిడకు తెలుసో లేదో… తను చెప్పవచ్చో లేదో…

“ఇంటికి వెళ్ళండి ఆంటీ. నాకు తన గురించి ఏమాత్రం తెలిసినా నేను ఫోన్ చేస్తాను. మీకు తెలిస్తే మీరు నాకు ఫోన్ చేయండి.”

“మీ ఫోన్ నెంబరు నాకు తెలియదు.”

రవళి గ్రౌండులో ఎగురుతున్న పేపరు తీసి తన ఫోన్ నెంబరు రాసిచ్చింది.

రవళి క్లాసులో కూర్చుందే గాని పాఠాలు ఒక్క ముక్క కూడా మెదడులోకి ఎక్కడం లేదు. ఈ సంహిత ఎక్కడికి పోయినట్టు? తనతో రెండురోజులు రానని చెప్పిందంటే కొంత ప్లాన్‍లోనే వుందన్నమాట. ఆమెకు కృపామణి మాటలు, ఫాతిమా పరిస్థితి, స్నేహ మాటలు గుర్తుకువస్తున్నాయి. శకుంతల గారు మాటిమాటికి కర్ఛీఫ్‍తో కళ్ళు తుడుచుకోవడం గుర్తుకొస్తోంది. సంహిత తప్పక భార్గవ్‍తో పారిపోయి వుంటుంది. లేకపోతే చెప్పకుండా పోవడం దేనికి. మిగతా క్లాస్‍మేట్స్ ఎందుకిలా వున్నావని అడిగినా చెప్పలేదు.

కానీ రచయితల కంటే, కవుల కంటే, చీరలు నేసే కళాకారుల కన్నా కూడా చాలా చక్కటి కథలు తయారు చేయగలరు లోకులు. సంహిత కాలేజికి రాకపోవడం, వాళ్లమ్మగారు వచ్చి రవళిని కలవడం, అప్పటి నుంచి రవళి డల్‍గా వుండడం చూసి, ఏదో జరిగిందని అది పూర్తిగా సంహితకు సంబంధించినదని బహుశా ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయుండవచ్చు అనేంత దాకా ఊహలు వెళ్ళాయి.

రవళి ఇంటికి వచ్చినా సంహిత ఆలోచనలు వీడడం లేదు. అది రోజూ వున్నదే… అయితే ఇదివరకు ఆ ఆలోచనలు ప్రేమతో కూడినవైతే ఇప్పుడవి కోపంతో కల్గినవి.

ఈ మధ్య రవళి ఇంట్లో పనులు కూడా చేస్తోంది. సింపుల్‍గా ఉండే కూరలు అవి ట్రై చేస్తోంది. రాత్రి 7.30 దాటుతుండగా ఫోన్ మోగింది. అటునుంచి శకుంతల.

“రవళీ! సంహిత నీరజ దగ్గరకు వెళ్ళిందట, మనం ఆందోళన పడుతున్నామని నీరజ ఫోన్ చేసింది.”

“అలాగా సరే…. వుంటాను” సింపుల్‍గా మాట్లాడి ఫోన్ పెట్టేసింది.

“ఏమిటే రవళి, ఫోన్ ఎవరు?”

“సంహితా వాళ్ళ అమ్మగారమ్మా సంహిత నీరజను చూడడానికి వెళ్ళింది. తనకి మన ఫోన్ నెంబరు తెలియదుగా. నీరజ ఆవిడకి చేస్తే ఆవిడ నాకు చేశారు. సంహిత క్షేమంగా చేరిందట.”

మూడురోజుల తర్వాత కాలేజికి వచ్చింది సంహిత. విశాఖ నుంచి ఆకు సంపెంగలు, ఫల సంపెంగలు, మామూలు సంపెంగలు తెచ్చి క్లాసులో ఆడపిల్లలందరికీ మూడేసి చొప్పున ఇచ్చింది. వెంటనే వాళ్లందరూ సంహిత ప్రేమలో పడిపోయారు.

రవళికి వాటితో పాటు ఇంట్లోనే పూసిన ఎర్రగులాబీ కూడా కలిపి పెద్ద పిన్నుతో గుచ్చి రవళి తలలో పెట్టింది. రవళికి ఈ పనులన్నీ కోపం తెప్పిస్తున్నాయి. మరోసారైతే సంహితలోని భావుకతకు తనకు ఆమె యిచ్చే యింపార్టెన్స్‌కు గర్వంగా వుండేది.

“ఖాళీ పీరియడ్‍లో మాట్లాడుకుందాం” అంది రవళి.

“ఏమిటోయ్ యిదంతా నామీద విరహమే” అంది సంహిత ఖాళీ పిరియడ్‍లో మాట్లాడుతున్నప్పుడు.

“ఛ…. ఏం మాటలు సంహితా? ఎవరైనా వింటే ఏమనుకుంటారనే భయం లేదా?”

“భయం దేనికి? మనం క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. నేనేదో సరదాగా అన్నాను.”

“కావచ్చు… కానీ అందరూ అపార్థం చేసుకునేట్టు మన ప్రవర్తన వుండకూడదు.”

సంహిత హర్ట్ అయ్యింది. ఇన్ని రోజుల్లో రవళి ఎప్పుడూ ఇలా తన పట్ల కఠినంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.

“ఏమైంది రవళి ఎందుకలా మాట్లాడుతున్నావ్?”

“లేకపోతే ఏమిటి సంహితా, వూరికి వెళ్ళేదానివి చెప్పి వెళ్ళొచ్చుగా”

“ఓ… దానికేనా యింత హడావిడి. రెండు రోజులు కాలేజికి రానని చెప్పే వెళ్ళానుగా.”

“ఊరికి వెడతానని చెప్పలేదు. పోనీ నాతో చెప్పనవసరం లేదు, కనీసం అమ్మగారికైనా చెప్పొచ్చుగా.”

“అబ్బా అలా చెప్పి వెడితే థ్రిల్లేముంటుందోయ్” సంహిత మామూలుగా నవ్వుతోంది.

“అమ్మ కాలేజిలో అందరి ముందుకు వచ్చి ఏడవడం నీకు థ్రిల్లింగ్‍గా వుందా సంహితా?”

“అమ్మ కాలేజికి వచ్చిందా? నాతో చెప్పనేలేదు.”

“ఆవిడ అలా కర్ఛీఫ్‍తో కళ్లొత్తుకుంటుంటే ఎంతో బాధగా వుంది. మీ నాన్నగారు పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకున్నారట. ఊరంతా తెలుస్తుందని మానేశారట. అమ్మ కాలేజికి వచ్చిందా అని అడుగుతున్నావా? ఆవిడ ఆ సంగతి చెప్పేంతవరకూ నువ్వు ఇంట్లో వుంటే కదా!”

రవళికి కోపం ఆగడం లేదు. సంహిత మొహంలో నవ్వు మాయమైంది.

***

రవళికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఈ ఆలోచనలతో తను అసలు చదవగలదా? పుస్తకం తెరిస్తే యింతకుముందు ఆ అక్షరాలు తప్ప యింకేమీ కనిపించేవి కాదు. ఇప్పుడు ఆ అక్షరాలు తప్ప అన్నీ కనిపిస్తున్నాయి.

తల్లి, అన్న రవి తనని ‘లేడీ ఋష్యశృంగ’ అనేవారు. అలా ప్రపంచానికి దూరంగా ఉన్నట్టే వుండేది. ఈ సంహిత రాకతో తనలో ఆలోచనలు పెరిగాయి. థ్రిల్ కోసం తనూ కొన్ని పనులు చేసింది. హోంవర్క్ చేయకపోతే సంహిత దగ్గర కాపీ చేయడం, టీచర్లతో అబద్ధాలు, ఇంట్లో అబద్ధాలు చెప్పడం, ఆఖరుకు చెప్పాచెయ్యకుండా సినిమాకు పోవడం యిలా ఇవన్నీ పాపాలై తనకి చదువు రాకుండా శాపం పెట్టాయా? లేదు ఈ శాపాన్ని తను తొందరగా వదిలించుకోవాలి. మునుపటిలా చదువులో మునిగి తేలాలి.

ఈ ఆలోచనలతో ఆమె పూజగదిలోకి వెళ్ళి భగవంతుణ్ణి చేసిన తప్పులు మన్నించమని క్షమాపణ వేడుకుంది. తనకి విద్యా భిక్ష పెట్టమని సరస్వతి దేవికి మరి మరీ విన్నవించుకుంది. ఆమె మనస్సు కాసేపటికి సాంత్వన చిక్కించుకుంది. మళ్ళీ మనసు మారిపోతుందేమో అని బుక్స్ తీసి చదవసాగింది. ఆమె కాస్సేపటికి చదువులో పూర్తిగా లీనమైపోయింది.

***

“అక్కా! నీకు ఉత్తరం వచ్చింది. నీ బుక్స్‌లో పెట్టాను” అంది స్నేహ.

మళ్ళీ ఉత్తరమా…. “ఎందుకు అక్కడ పెట్టావు స్నేహా. చింపి పారేయవలసింది.”

“అలా ఎందుకు ఎవరు రాశారో, ఎందుకు రాశారో చదివి నువ్వే పడేయ్”

“అది చదివితే నా మనసెలా మారుతుందో ఏమో…”

“లేదు. అప్పుడే మన మనసు ఎంత గట్టిగా వుందో తెలుస్తుంది.”

స్నేహ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఇది భార్గవ్ రాసింది కాదు. కొంపదీసి సంహిత కొత్త బాయ్ ఫ్రెండా… రవళి డాబా మీదకు వెళ్ళింది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కొంగలు పడమరవైపు ఎగురుతున్నాయి. అవి ఉదయం తూర్పుకి సాయంత్రం పడమరకి వెలుగు ఎటువుంటే అటు ఎగురుతాయి. ఆ సంగతి కనిపెట్టింది కూడా స్నేహే.

ఆమె ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. అసలా ఉత్తరం రాసిన మనిషే ఆమెకు పెద్దగా పరిచయం లేనిది. ఉత్తరం తెలుగులో ఉంది. గబగబా చదివిన ఆమె మరోసారి ఉత్తరం చదివింది.

‘రవళీ!

నేనిలా ఉత్తరం రాస్తానని నువ్వెప్పుడూ అనుకొని వుండవు. నిజానికి వయసులో పెద్దదానివిగా, చదువులో సీనియర్‍గా నిన్ను అక్కా అని పిలవాలి. కానీ మా అక్కను అదే సంహితను ఆ పిలుపుతో పిలిచాక ఇంకెవ్వరినీ అలా పిలవాలనిపించదు. తన చెల్లెలిగా నేనిలా రాయకూడదు కానీ తన ప్రాణస్నేహితురాలిగా తనను సన్నిహితంగా చూసిన మనిషిగా నేను రాసే ఈ విషయాలు నీకు అర్థం అవుతాయి. అందుకే రాస్తున్నాను.

ఉత్తరం చదివేముందు ఒక్క విషయం. సంహిత నా ఫ్రెండు, తన గురించి ఎవరేం చెప్పినా వినను అంటే ఈ ఉత్తరం చదవొద్దు. నీ ఫ్రెండు బాగుపడాలంటే మాత్రం ఈ ఉత్తరం చదువు.

నిజానికి ఏ మనిషి పుట్టగానే చెడ్డవాళ్ళు కాదు. వాడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ కుటుంబం, స్నేహితులు, టీచర్లు ఒక్క ముక్కలో చెప్పాలంటే సమాజమే వాళ్ళనలా తయారుచేస్తుంది.

మా అక్క విషయంలో జరిగింది అదే. మా అమ్మా నాన్నలకు పెళ్ళయిన అయిదారేళ్ళకు గాని మా అక్క పుట్టలేదు. అయితేనేం చాలా అందంగా పుట్టింది. మా నాన్నగారికి అప్పుడే ప్రమోషన్ వచ్చింది. ఇంకేం, మా అక్క ఆయనకు అదృష్ట దేవత. తను ఆడింది ఆట పాడింది పాట. ఆమె పుట్టిన ఏడాదికే నేను పుట్టాను. మొదటి ప్రసవం కలిగించిన నీరసం, పాపను పెంచడంలో సరిగా విశ్రాంతి లేకపోవడంతో అమ్మ చాలా బలహీనంగా వుండేది. అప్పుడే నేను పుట్టాను. సంహితలా అందం లేదు. మంచి జుట్టు లేదు. అప్పటిదాకా అక్కని దేవతలా వుందని ఆకాశానికి ఎత్తేసిన బంధువులు, కుటుంబ సభ్యులు నేను దెయ్యంలా వున్నానని సర్టిఫికెట్ ఇచ్చేశారు.

నాకు మనుషుల మాటలు అర్థమై చాలా బాధపడుతుండేదాన్ని. తర్వాత… తర్వాత… ఆ మాటలు పట్టించుకోకుండా నా చదువు నా ఆటలు నా ఫ్రెండ్స్! చిత్రమేమంటే నేను స్నేహం చేద్దామన్నా వాళ్ళు కూడా మీ అక్కంత అందంగా నువ్వు లేవేం అనేవారు. అంతే నేను వాళ్ళకి దూరంగా జరిగిపోయేదాన్ని. నిజం చెప్పాలంటే మా అక్క నా అందచందాల గురించి ఎన్నడూ కామెంట్స్ చేసేది కాదు. కానీ తను అందంగా వుంటానని తనకు తెలుసు. దానితో అందరినీ తనమాట వినేట్టు చేసుకునేది.

ఇంట్లో కూడా మా నాన్న అది ఏమంటే అది చేసేవారు. అయితే ఒకే కండీషన్ పెట్టేవారు బాగా చదువుకోవాలని. సహజంగా తెలివైనది. అందంగా ఉంటుంది కాబట్టి టీచర్లు కూడా తనంటే అభిమానం చూపేవారు. స్కూలుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అబ్బాయిల కామెంట్స్ ఈమెకు జయధ్వానాలుగా వినబడేవి. ఆమె అప్పుడే మగపిల్లలతో స్నేహాలు చేసేది. ఒకరి గురించి ఒకరికి తెలియకూడదు కాబట్టి అబధ్దాలు చెప్పేది. తనకి ఆడపిల్లలు కూడా చాలామంది ఫ్రెండ్స్ వుండేవారు. వాళ్లకి డబ్బు, చాక్లెట్స్, నోట్ బుక్స్ ఇలా చిన్నచిన్నవే గిఫ్ట్‌లుగా ఇచ్చేది. కానీ ఎవరి దగ్గర నుండీ ఏమి పుచ్చుకునేది కాదు.

అప్పుడే పరిచయం అయ్యాడు ఈ భార్గవ్. వాడు మా కజిన్ కాదు పాడు కాదు. మా అక్క క్లాసులో వుండే లత అనే ఆమెకు అన్న అవుతాడు వరసకి. సంహిత కాస్త చనువుగా మాట్లాడేసరికి వాడు మరింత చనువు తీసుకోవడం అస్తమానూ అక్కతో మాట్లాడటం. ఎవరైనా పరిచయస్థులు కనిపిస్తే మేమిద్దరం కజిన్స్ అని చెప్పడం. అక్కకి యిదంతా థ్రిల్లింగ్‍గా వుంది. వాడిని నువ్వు చూసి వుంటావు, రఫ్‍గా వుంటాడు. నాకు వాడిని చూస్తే సినిమాలో విలన్‍లు గుర్తుకొస్తారు. వాడితో అక్క చేసేది స్నేహమే కానీ వాడలా అనుకోలేదు.

మేమీ వూరు వచ్చాక ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెట్టారు. ఇంటికి వస్తే ఉత్తరాలు – అమ్మా నాన్న అడుగుతారు కాబట్టి ఫాతిమాను మంచి చేసుకొంది. ఫాతిమా ఇంట్లో ఎవరికీ చదువు రాదు. ఈ భార్గవ్ గాడికి వచ్చిన వన్నెల్లో ఒకటి ఇంగ్లీషు మాట్లాడడం, రాయడం. అందుకు ఫాతిమాకు ఎన్నో గిఫ్ట్‌లు. అబద్ధాలు చెప్పడం. అవి నీలాంటి వాళ్ళు నిజమని నమ్మితే నవ్వుకోవడం మా సంహితకు అలవాటు. నాకెందుకో ఈ గుణాలేవి నచ్చేవి కావు. లంచం యిచ్చి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. లంచం ఇచ్చి ఏ కాంట్రాక్ట్ లాంటివో పొందవచ్చు. కానీ లంచం యిచ్చి స్నేహం చెయ్యడం ఒక్క సంహిత దగ్గరే చూస్తాము.

నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా… ఆ రోజు మేము ఈ ఊరొచ్చిన కొత్తలో మేము సినిమాకు వెడుతుంటే, నువ్వు వచ్చావు గుర్తుందా? అతన్ని మా సొంత అన్నగా పరిచయం చేసింది అవునా. కాదు అతను మా పెదనాన్న గారి అబ్బాయి. అలానే చెప్పవచ్చు కదా అని నీలాంటి వాళ్ళు అనుకోవచ్చు. అన్నయ్య అందగాడు, మెడిసిన్ చదువుతున్నాడు అని ఎవరైనా ఆడపిల్లలు అతనిపై ఆశపడితే వాళ్ళని చూసి నవ్వుకోవడానికి. ఆ రోజు బజార్లో ఏదో గొడవ జరిగింది. అది ఫాతిమా తనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా నీకు చెప్పడం నేను విన్నాను. ఆ విషయం ఫాతిమా చెప్పలేదు. మా పాలవాడు ఎవరో కాలేజి కుర్రాళ్ళు ఎవరో అమ్మాయిల్ని ఏదో అన్నారు ఆ తర్వాత ఒకమ్మాయి అన్న వాళ్ళని మందలించాడు అని చెప్పాడు. నీకు ఫోన్ చేసి విషాదం అంతా గొంతులో నింపుకుని క్షమించు అంది. తర్వాత ఫోన్ పెట్టేసి పకపకా ఒకటే నవ్వు. నిన్ను ఎంత బాగా ఫూల్‍ని చేశానో అని.

ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా వైజాగ్‍లో ఉన్న నా దగ్గరకు వచ్చేసింది. చిత్రమేమిటంటే ఆ భార్గవ్ కూడా వచ్చాడు. నేను ఇద్దరినీ చెడా మడా తిట్టాను. మరోసారి మా అక్క విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయని చెప్పాను. లేకపోతే మా అక్కకేమైనా బుద్ధుందా? నేను ఒంటరిగా హస్టల్లో వుంటున్నాను. నాకు కాస్త మంచి పేరే ఉంది. ఇలా ఒకమ్మాయి అబ్బాయి నన్ను కలవడానికి వచ్చారంటే నా గురించి అందరూ ఏమనుకుంటారు అనే ఆలోచన లేదు. తను వద్దంటున్నా నేను మా అమ్మకు ఫోన్ చేసి సంహిత క్షేమంగా వుందని చెప్పాను.

రవళీ! ఇలా అక్క గురించి రాశానని నువ్వు తనని చెడుగా అనుకోవద్దు. తను అందగత్తెనని, తెలివైనదాన్నని ఆమెకు గల ఆత్మవిశ్వాసం; ఆమెకు పరిచయమైన ప్రతి ఒక్కరూ తన అందాన్ని మాత్రమే పొగడడం ఇవన్నీ ఆమెను తప్పు దారి పట్టించాయి. పొగుడుతున్నాను అనుకోకపోతే ఒకమాట, నిజానికి తన ఛార్మ్‌కి పడనిది నువ్వొక్కదానివే.

నీ స్నేహంతోనే తనొక మామూలు మనిషి కావాలి. నువ్వు తనతో బజారుకు వెళ్ళిన ప్రతిసారీ బాధగా వుండేది. నువ్వూ అలా అయిపోతావా అని. కానీ నీలో అందరినీ ఆకర్షించి, పాదాక్రాంతం చేసుకోవాలనే ఆరాటం లేదు. స్నేహితులు అంటేనే మన హితం కోరేవారు. అరుగు చివర నిలబడితే పడిపోతాననే ఆలోచన లేనిది నా అక్క సంహిత. ఆమెను ఈ ప్రమాదం నుండి నువ్వే రక్షించాలి. చాలా పెద్ద ఉత్తరం రాశాను. ఇంక వుంటాను. నువ్వు నా అక్కవి కాకపోవచ్చు. నేను మాత్రం ఎప్పటికీ నీ చెల్లెలినే.

నీరజ.’

రవళి ఆ ఉత్తరం రెండుసార్లు చదివింది. అక్షరం… అక్షరంలో నీరజకు సంహిత మీద వున్న ప్రేమ, ఆమె క్షేమం గురించి ఆరాటం కనిపిస్తున్నాయి. నిజమే, ఐస్‍ఫ్రూట్ బండి వెనుక పరుగెత్తే పసిపాప సంహిత. ఆమెకు ఆ ఐస్‍ప్రూట్ ఆరోగ్యానికి మంచిది కాదని, చాలా తొందరగా కరిగిపోతుందని తెలియని చిన్నపిల్ల. తనని కాస్త దారిలో పెట్టాలి.

(ఇంకా ఉంది)

Exit mobile version