ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -18

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఇ[/dropcap]వన్నీ నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” అడిగింది రవళి.

“అందరూ పెద్ద చదువులు చదివి ఆఫీసర్లు అయ్యారు. నేను మొదట నుంచి స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. ఎం.పి.సి గ్రూప్ తీసుకుని కూడా పై చదువులు చదవలేదు” అంది కృపామణి.

“వీళ్ళు కాస్త పెద్దయ్యాక చదువుకో కృపామణి. అయినా అమ్మ కావడమే పెద్ద ఉద్యోగంలే”

రవళి, స్నేహ మరి కాసేపు కూర్చుని వచ్చేశారు.

సంహిత అమెరికా వెళ్ళిపోయింది. ఈ దేశంలో లేదు, ఆశ్చర్యంగా ఉంది. నీరజ రాసిన ఒకటి రెండు ఉత్తరాలకి తను జవాబు రాసింది. తర్వాత తనకి పెళ్ళి అయిపోవడం… ఉద్యోగ బాధ్యతలు వీటితో తను ఉత్తరాలు రాయలేదు. అసలు అప్పటి ఎడ్రస్ కూడా ఎక్కడ వుందో…

రవళి ఆ మర్నాడు హైదరాబాద్ వెళ్ళిపోయింది.

***

రెండేళ్ళు గడిచిపోయాయి. స్నేహకు పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమెకు బాలకృష్ణ అంటే యిష్టమే. అతను కూడా ఒకటి రెండుసార్లు తన అభిప్రాయం చెప్పాడు. స్నేహ అంటే ఇష్టమని కానీ స్నేహకి భయంగా వుంది. సంహిత విషయం అలాంటిది. ఆమె బాగా ఆలోచించి రవళికి ఉత్తరం రాసింది.

రవళి స్నేహకి వెంటనే ఉత్తరం రాసింది. “స్నేహా నువ్వు తొందరపడవద్దు. నేను డెలివరీకి వచ్చినప్పుడు వివరంగా మాట్లాడతాను” అని.

***

“ఏం స్నేహ బి.ఎ. అయిందిగా బి.యిడి చేస్తావా?” రవి అడిగాడు.

“ఏమో ఇంకా ఏమి అనుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే మంచిదిట కదూ….”

“అబ్బో ఈ తెలివి ఎక్కడిదేవ్. రాయి, నేనున్నానుగా టీచర్‍ని.” అన్నాడు రవి.

రవళి డెలివరికి అని వచ్చి వారం అయింది. ఆ సాయంత్రం యిద్దరూ ఇంటిముందు ఖాళీ జాగాలో కూర్చున్నారు. “చెప్పు స్నేహ ఎవరతను? నీకెలా పరిచయం?”

“మా క్లాసే, బాలకృష్ణ”

“అదేమిటే ఆయనకు పెళ్ళయిందిగా” అంది రవళి నవ్వుతూ.

“అబ్బా, ఆయన కాదక్కా. మా క్లాస్‍మేటే. నేనంటే చాలా అభిమానం.”

“అదొకటి సరిపోదు స్నేహ, బాగా చదువుతాడు అని నువ్వు చెప్పడం కాదు, అన్నయ్యను ఒకసారి అతని గురించి కనుక్కోమందాం.”

స్నేహ ఏదో అనేలోపు రవి అక్కడికి వచ్చాడు. “మీ మాటలు నేను వినాలని వినలేదు. ఇక్కడ కాయలు కోస్తుంటే వినబడ్డాయి. బాలకృష్ణ నాకూ తెలుసు. మంచివాడే. వాళ్ళన్నయ్య మా స్కూలు ప్రక్కన గల హైస్కూలు టీచర్. కానీ మీ యిద్దరికీ ఉద్యోగాల్లేవు, అప్పుడే పెళ్ళేమిటి స్నేహ.”

“పబ్లిక్ సర్వీస్ కమీషన్‍లో సెలక్ట్ అయ్యాకే”

స్నేహ లోపలికి పారిపోయింది. దాదాపు సగందాకా స్నేహ, సంహితల జీవితాలు ఒకేలా సాగాయి. అలా ప్రశాంతంగా అందరి జీవితాలు స్థిరపడ్డాయి. ఆ ప్రశాంతతలో ఒక కలకలం ఈ సంహిత రాక.

“సంహితకు ఇల్లు చూడాలా వద్దా…. అసలు తను ఇక్కడెందుకు వుండాలనుకుంటోంది? అవన్నీ తనకెందుకు?” రవళి మనసు అటూ ఇటూ ఊగుతోంది. అప్పటి విషయాలకు ప్రత్యక్షసాక్షి తనకు సలహా చెప్పగలదీ ఒక్కతె. ఆమె స్నేహకు ఫోన్ చేసి జరిగినది చెప్పింది. స్నేహకు కాస్సేపు నోటమాట రాలేదు. “ఎప్పటి సంహిత అక్కా, మన పిల్లలే మీరు విడిపోయినప్పటి వయసుకు వస్తున్నారు” అంది.

“అవును… ఇప్పుడు నన్నేం చేయమంటావు?” అడిగింది రవళి.

“నీ పరిధిలో విషయమైతే చేతనైన సహాయం తప్పక చెయ్యి” అంది స్నేహ.

“కానీ తను నాకు చెప్పకుండా, చెప్పిన మాట వినకుండా…” రవళి అంతకంటే మాట్లాడలేకపోయింది.

“అప్పటి తన పరిస్థితులవి. అక్కా ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతం కానట్టే పగలు ద్వేషాలు, కోపాలు కూడా శాశ్వతం కావు. శాశ్వతంగా ఉండకూడదు. మనిషిని అందరూ అన్నీ వదిలేసినా మంచిస్నేహితుడు తన స్నేహితుణ్ణి వదలకూడదు. ఈ దేశంలో నువ్వు తప్ప తనకెవరు సహాయం చేసే వాళ్ళు లేరని తను చెప్పినప్పుడు కూడా నువ్వు వదిలేస్తే ఎలా? నాకు తోచినది నేను చెప్పాను. నీకు వీలైనది నువ్వు చెయ్యి వుంటాను.” ఫోన్ సంభాషణ ముగిసినది.

***

“ఇల్లు చాలా బాగుంది రవళి. నేను అనుకున్న ఖరీదులో వచ్చింది” సంతోషంగా అంది సంహిత.

“ఇల్లు నీకు నచ్చినందుకు థ్యాంక్స్. ఇంతకీ ఈ యిల్లు కొన్నది ఎవరికోసం?” భార్గవ్ పేరు పలకడం కూడా రవళికి ఇష్టం లేదు.

సంహితకు అర్థం అయ్యింది. “అమ్మా నాన్నగారు వృద్ధాశ్రమంలో వున్నారు రవళి. వాళ్ళని తీసుకొచ్చి ఈ యింట్లో నా దగ్గరే వుంచుకుంటాను. మా పెళ్ళి అయ్యాక అమ్మా నాన్నగారు నాతో ఫోన్‍లో అయినా మాట్లాడడానికి యిష్టపడలేదు. ఇండియాలో నేనూ భార్గవ్ చాలా ఉద్యోగాలు చేశాము. అతనికి ఏ ఉద్యోగంలోనూ కుదురులేదు. అప్పుడే లతా వాళ్ళు అమెరికాలో వుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక లత కుటుంబానికి నేనొక పనిమనిషిలాగ, భార్గవ్ కారు డ్రైవర్‍గా అయిపోయాము. ఏడాది తర్వాత మేమే బయటికి వచ్చేశాము. వేరే ఉద్యోగాలు, ఇల్లు చూసుకున్నాము. భార్గవ్‍కి ఇంకా విలాసవంతమైన జీవితం కావాలనిపించేది. అతను చేసిన పనికన్నా ఆదాయం ఎక్కువ కావాలని కోరుకునేవాడు. పెద్ద క్వాలిఫికేషన్ లేని మా యిద్దరికి పెద్ద ఉద్యోగాలు, ఆదాయాలు ఎలా వస్తాయి? చిన్నప్పుడు హ్యాండ్‍బ్యాగ్‍లో ఎప్పుడూ అయిదువందలు తక్కువ కాకుండా పెట్టుకు తిరిగే నాకు డబ్బు ఇబ్బందులు బాగా తెలిసివచ్చాయి”

రవళి మాట్లాడలేకపోతోంది.

“ఈ సమస్యలు చాలవన్నట్టు నేను తల్లిని కాబోతున్నాను. భార్గవ్ ఈ వార్తకు సంతోషించాల్సింది పోయి ఖర్చు ఎక్కువవుతుందని మొదలుపెట్టాడు. ఒక డ్రెస్ నాకు యిష్టమైనది కొనకపోతే ఆ రోజంతా మా అమ్మను సతాయించే నేను, భార్గవ్ సాధింపులన్నీ భరించాల్సి వచ్చింది. తల్లి అంటేనే సహనం అని అర్థం అయింది. ఒకప్పుడు అతని మాటలన్నీ నామీద ప్రేమతోనే అనుకునే నేను ప్రతి అక్షరంలో అతన్ని ద్వేషించేట్టు చేసుకున్నాను. అనుక్షణం అతన్ని అసహ్యించుకుంటూ ఉండే కన్నా కనీసం నా దేశంలోనైనా నేనుండాలి అని వచ్చేశాను.”

“మీరు విడాకులు తీసుకున్నారా?” అడిగింది రవళి.

“లేదు. ప్రస్తుతానికి విడిపోయాం. నేను చేసిన తప్పులకు మా అమ్మానాన్నగారిని నా దగ్గర అట్టేపెట్టుకుని సేవ చేసి పాపం కాస్త తగ్గించుకుంటాను.”

“రవళీ నేనంటే అసహ్యంగా వుంది కదూ”

“ఛ… అదేం మాట సంహితా. నువ్వొక నిర్ణయం తీసుకున్నావ్, అది మంచి ఫలితం యివ్వలేదు. ఒక మనిషిని నమ్మావు. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేదు. కానీ యిప్పుడు అతడు వచ్చి కుర్రవాడ్ని యివ్వమంటే”

“ఏమో అప్పుడు ఆలోచించాలి. బాధ్యతలు పంచుకునే మనిషి కాడు తను.”

“ఒకవేళ అతను వచ్చి కలిసివుందామంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో సంహితా. మనుషులను దూరం చేసుకోవటం తేలిక, దగ్గర చేసుకోవడం కష్టం.”

రవళి కళ్ళవెంట నీళ్ళు.

“ఎందుకు రవళి బాధపడుతున్నావ్.”

“మీ యింటిని, నీ హోదా, దర్జా అన్నీ చూసినదానిని నేను. ఇలా సామాన్యంగా చూడలేకపోతున్నాను. ఇంతకీ కామేశ్వరి నీకెక్కడ కలిసింది.”

“నేను బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళింట్లో పుట్టినరోజు పార్టీకి కామేశ్వరి వచ్చింది. తన దగ్గర మనవాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఉన్నాయి.  అప్పుడే నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. “

సంహిత జీవనోపాధి కోసం బేబీసిట్టింగ్ చేయటం. రవళికి మాట్లాడాలనిపించలేదు. సంహిత ఎలా పరిచయం అయింది. ఇప్పుడెలా వుంది.

“యిల్లు చూద్దాం” ఆమెను ఆ మూడ్‍లోంచి బయటికి తీసుకురావడానికన్నట్టు సంహిత చెయ్యిపట్టి లేవదీసింది. ఇద్దరూ పూజగదిలోకి వెళ్ళారు. అక్కడ దేవుని పటాలు లేవు. ఒక మంచి శిలపై ఇలా రాసి వుంది.

“The Greatest Gift of life

is Friendship. And I have received it” – Hubert H. Humphrey

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here