Site icon Sanchika

ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ప[/dropcap]నిపిల్ల కప్పులతో కాఫీ తెచ్చింది. అదీ పూర్తయ్యింది. ఇంతలో ఒకామె, ఇద్దరు ఆడపిల్లలూ వచ్చారు.

“మా పిన్నీ, ఆవిడ పిల్లలు మమత, కావ్య” అంటూ పరిచయం చేసింది రవళికి. ఆవిడకు నమస్కరించింది. “ఏమ్మా బాగా చదువుతున్నావా? మా సంహితకు నువ్వంటే చాలా ఇష్టం. నీ గురించి చాలా చెబుతుంది.”

రవళి సిగ్గుగా నవ్వింది.

“ఈసారి మా సమ్ముతో పాటు నువ్వు రా మా యింటికి. మేము హైదరాబాద్‍లో వుంటాము” అందావిడ.

రవళి మొహంలో సందేహం, భయం చూసి నవ్వేసింది సంహిత.

“అబ్బా భయపడకు రవళి, ఇప్పుడు నిన్నెవరూ ఊరికి తీసుకుపోవడం లేదులే.”

“ఇంకా అలాగే వున్నారా సినిమాకి వెడదామని చెప్పి” అంటూ వచ్చాడు ఒక యువకుడు.

రవళి కాస్త కంగారు పడింది.

“ఇదిగో వస్తున్నాం. అన్నయ్యా, తను నా ఫ్రెండ్ రవళి. బాగా చదువుతుంది.”

“నమస్తే అండీ, మీకు ఎన్నిసార్లు పొలమారుతుందో తెలియదు గానీ మా సమ్ము నాలుక మీద ఎప్పుడూ మీ పేరే” అన్నాడతను ఎంతో పరిచయం వున్నవాడిలాగ.

రవళి మరింత ముడుచుకుపోయింది.

“పదండి టైం కావడం లేదూ” అంటూ వచ్చారు సంహిత వాళ్ళమ్మగారు. ఆమె వెనుకే నీరజ.

“సారీ రవళి, నిన్ను తొందరగా పంపిస్తున్నాము” అందావిడ.

“ఫర్వాలేదండి. నోట్సులు ఇచ్చి వెళదామని వచ్చాను.”

“సినిమా నుండి వచ్చి నేను రాయలేను రవళి. పోనీ నా నోట్స్‌లో నువ్వు రాయకుడదు.”

అప్పటికే సంహిత, రవళి తప్ప అందరూ కారు దగ్గరికి వెళ్ళిపోయారు.

“నీ నోట్స్‌లో నేనా? మన టీచర్స్‌కి తెలిసిందంటే చంపేస్తారు.”

“ఆ… అక్షరం అక్షరం చూస్తారా ఏమిటి? నోట్సు హాజరుగా వుందా లేదా అన్నది ముఖ్యం.” ఆమె రివ్వున లోపలికి వెళ్ళి తన నోట్సులు తీసుకువచ్చి ఇచ్చింది.

“ఇన్నెందుకు?”

“ఈవేళ ఏం నోట్స్ చెప్పారో నాకు తెలియదుగా. ఏది అవసరమో అది రాసెయ్. పద పద, మా అన్న హారన్ మోగిస్తున్నాడు”

రవళి బుక్స్ పట్టుకుంది. సంహిత ఇంటికి తాళం వేసి రవళిని చేత్తో పట్టుకుని కారు దగ్గరికి తీసుకువచ్చింది.

“కారెందుకు? నడిచి వెడతాను.”

“నీ కోసం ప్రత్యేకంగా కారు తేవడం లేదు. కొంతదూరం దింపుతాము.” అంది సంహిత.

ఆమె వాళ్ళ అన్న పక్కన కూర్చుంటే, రవళి డోరు దగ్గర కూర్చుంది. మిగతావాళ్ళు వెనుక సర్దుకున్నారు. రవళిని డైరెక్షన్స్ అడుగుతూ వాళ్ళ వీధి మొదట్లోనే దింపి వెళ్ళిపోయారు. కనుచీకటి పడుతున్న వేళ బుక్స్‌తో నిలబడింది రవళి. ఎంత చిత్రంగా గడిచిపోయింది ఈ రోజు. సంహిత ఇంట్లో బంధువులు ఉన్నారంటే తను చచ్చినా వాళ్ళింటికి వెళ్ళేది కాదు. మెల్లిగా ఇంటివైపు నడవసాగింది. ఛ…. తనకసలు బుద్ధి లేదు… సంహితను చూడాలన్న ఆలోచన తప్ప ఇంకేమీ తన మనసులో లేదు. పొద్దుటనగా వేసుకున్న జడ, నలిగిపోయిన యూనిఫారం, చెమటపట్టిన దేహం… ఇలా తను వాళ్ళింటికి వెడితే ఒక్కరి కళ్ళల్లో తన పట్ల నిరసన, చిన్నచూపు లేవు.

సంహిత ఇల్లు ఎంత బాగుంటుంది. కాంపౌండ్ వాల్, గేటు దాటగానే విశాలమైన మెట్లు, వరండా దానిమీదకు పాకిన మాలతీ మాధవం తీగ. అది వెదజల్లే పరిమళాలు. సంహిత స్కూలుకి తమందరిలాగ పరికిణీ, ఓణి వేసుకునే వస్తుంది. అందరూ తిట్టుకునే యూనిఫారం సంహిత ఒంటిమీద చేరి అందాన్ని పొందింది. ఇప్పుడు సినిమాకు వెడుతున్నామని కాబోలు ప్యాంట్ షర్ట్ వేసుకుంది. పొడుగైన జుట్టును జడ అల్లకుండా పైన ఒక రబ్బరు బ్యాండ్ పెట్టుకుంది. జుట్టు అలలు అలలుగా ఎగురుతూ ఎంత బాగుందో. అందరూ సెంటు స్ప్రే చేసుకున్నట్టున్నారు. ఆ సాయంత్రాన్ని పరిమళభరితం చేశారు. స్నేహపూర్వకంగా, తను ఎంతో తెలుసున్నట్టు మాట్లాడారు. ఏమైనా పెద్ద పెద్ద వూళ్ళల్లో వుండేవాళ్ళ పద్ధతే వేరు. తనని బంధువులాగా వాళ్ళింటికి పిలిచారు. నిజానికి తన బంధువులెవరూ ఇలా మాట్లాడరు. కొత్తవాళ్ళని ఇలా కలుపుకోరు.

ఆమె తన ఇంటి గేటు దగ్గరికి వచ్చేసరికి ‘ఊహా’ ప్రపంచం లోంచి ‘ఇహ’ ప్రపంచంలోకి వచ్చినట్టు అయింది. తను ఆలస్యంగా రావడానికి సంజాయిషీ ఏం చెప్పాలా అని ఒక్కక్షణం అనిపించింది. గుమ్మంలో చెప్పులు కనబడ్డాయి. తాతగారు మామ్మ వచ్చారన్నమాట. హమ్మయ్య అనుకుంది రవళి. కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకోవడంలో రవళి ఆలస్యంగా రావడం ఎవరూ పట్టించుకోలేదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయినా తను ఒక్కతి కూర్చుని దాదాపు సంహిత దస్తూరి లాగ తన దస్తూరిని మార్చుకుంటూ అన్ని నోట్సులు పూర్తి చేసింది రవళి.

***

“చాలా థ్యాంక్స్ రవళి. ఈసారి మనిద్దరం మంచి సినిమా చూద్దాం” అంది సంహిత, రవళి రాసిన నోట్సులు తీసుకుంటూ.

“సినిమాకా? మనం టెన్త్ చదువుతున్నాం తెలుసా?” అంది రవళి.

“అవును, అదేదో హిందూ మహా సముద్రం ఈదడం అన్నట్టు మాట్లాడతావేమిటోయ్.”

“పరీక్షలంటే నీకు భయం లేదా?”

“భయం దేనికి? పరీక్షలు అంటే శ్రద్ధ వుండాలి గాని. నేను చూస్తున్నానుగా మన క్లాసులో, మీ స్కూలు వాళ్ళు చదువుకు ఇంత భయపడటం ఎందుకో నాకు అర్థం కాదు.”

రవళి నవ్వింది. “నువ్వు స్కూల్లో చేరి ఇన్ని రోజులైంది. అయినా మీ స్కూలు అంటావా”

“ఆ… లేకపోతే, లేని గాంభీర్యం నటిస్తూ మంచివాళ్ళం అనిపించుకోవాలని అంత తాపత్రయం దేనికి? మనం టెన్త్ చదువుతున్నాం… ఓకే… అందుకు మరీ తలవంచుకుని ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా వుండాలా?”

“అంటే విప్లవనారిలా వుండాలా?” నవ్వింది రవళి.

“అక్కర్లేదు, మామూలుగా వుంటే చాలు. సమస్య మనిషి కంటే ఎప్పుడూ చిన్నదే. దానికి… ఓ… మంచితనం అనే ముసుగు వేసుకోనక్కరలేదు.”

సంహిత అన్న మాట రవళి మనసులో ముద్రించుకుపోయింది. సమస్య చిన్నది… చిన్నది. రవళి ఇంటికి వచ్చేసరికి స్నేహ పుస్తకాలు తీసి చదువుతోంది. ఆ ఇంటికి వెనుకే కాకుండా ముందు వైపు కూడా కాస్త పెద్ద జాగా వుంది. స్నేహ దేవకాంచనం చెట్టు క్రింద మంచం వేసుకుని దానిమీదే కూర్చుని రాసుకుంటోంది.

“ఏం స్నేహ? అప్పుడే చదువు మొదలుపెట్టావ్? నాన్నగారు ఇంటిలో వున్నారా?”

“అవును, అసలే కోపంగా వున్నారు.”

“ఎందుకు?”

“డబ్బు పంపించమని తాతయ్య ఉత్తరం రాసినట్టున్నారు.”

రవళికి చిరాగ్గా వుంది. ఆమె లోపలికి వెళ్ళింది. తల్లీ తండ్రి అరుచుకుంటున్నారు. నిజానికి ఆ యింట్లో డబ్బు ఇబ్బందులు లేవు. కానీ పల్లె, పట్నంకాని వూరిలో కాపురం. ముగ్గురు పిల్లల చదువులు, సంపాదించేది రవళి తండ్రి ఒక్కడే కావడంతో అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అందులోనూ రవళి తాతయ్య, నాయనమ్మ ఖర్చు మనుషులు. తమ ఖర్చులన్నీ, పెద్దకొడుకు కాబట్టి రవళి తండ్రి మీద వేస్తారు.

అందుకు ఆదిలక్ష్మి కూడా ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు ఊరుకుంది. కానీ పిల్లలు పెద్ద చదువులు చదవాలన్నా, ఘనంగా పెళ్ళిళ్ళు చేయాలన్నా కాస్త ఖర్చులు తగ్గించుకోవాలి. అది పెద్దవాళ్లకు అర్థం కావడం లేదు. రవళి ఏదో చదవాలని పుస్తకం తీసినా తల్లీ, తండ్రి మాటలు వినబడుతూనే వున్నాయి. కాస్సేపటికి తండ్రి బయటకు వెళ్ళిపోయాడు. ఆదిలక్ష్మి వచ్చి రవళి దగ్గర కూర్చుంది.

“మీ చదువులు సాగేట్టు లేవే” అంది.

బయట దోమలు కుడుతున్నాయని లోపలికి వచ్చిన స్నేహ కూడా అక్కడే కూర్చుంది.

“ఎందుకమ్మా అలా అంటున్నావ్?”

“మీ తాతగారు డబ్బు పంపించమని ఉత్తరం రాశారట. నాన్నగారు అయిదువేల దాకా పంపిస్తున్నారు.”

“ఎందుకమ్మా అంత డబ్బు వాళ్ళకి?”

“ఏవో పూజలు చేయిస్తారు, లేదూ ఏవో యాత్రలు. అన్నయ్యకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాం. కనీసం ఈ డిగ్రీ అయినా గట్టెక్కితే చాలు.”

“అమ్మా మెడిసిన్ చదవమని వాడివి నువ్వు చిన్నప్పటి నుండి చెబుతూనే వున్నావు. విన్నాడా?”

“చదివితే మాత్రం వేలకి వేలు డోనేషన్లు కట్టొద్దా” అంది ఆదిలక్ష్మి.

“నేను బాగా చదివి ఉద్యోగం చేస్తానులేమ్మా” అంది రవళి.

“ఏమోనే… ఈ రోజుల్లో ఆడవాళ్ళు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. మా తరానికి ఆ తెలివి లేకపోయింది. కనీసం అన్నయ్య బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటే మనం ఒక ఒడ్డున పడ్డట్టే” ఆదిలక్ష్మి నిట్టూర్చింది.

“అన్నయ్యకు చదువుమీద శ్రద్ధ లేదమ్మా. కాస్త వాడిని బాగా చదవమను. లేకపోతే రిజర్వేషను లేని మనకు జాబ్ రావడం కష్టం” అంది రవళి.

“ఓ…. నా చదువు గురించి చెల్లెమ్మగారి కెందుకో అంత శ్రద్ధ” ఎప్పుడు వచ్చాడో రవి, గుమ్మం పొడుగునా నిలబడి కోపంగా చూస్తున్నాడు.

“నేనేం తప్పుగా అన్నాను? ఇప్పట్నించి కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి” అంది రవళి మనసులో కాస్త బెరుకుగా ఉన్నా, భయటికి ధైర్యంగా.

“మీ చదువు సంగతి నువ్వు చూసుకో. 5.30 గంటల దాకా క్లాసులున్నాయని యింట్లో చెప్పి, నువ్వు ఆ సంహితతో తిరగడం నేను చూడలేదనుకున్నావా.”

“అదేమిటే నీకు అయిదున్నర దాకా స్కూలుందన్నావుగా” అంది ఆదిలక్ష్మి.

“రోజూ క్లాసులు వుంటాయమ్మా, ఈ రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నారు. అందుకని మమ్మల్ని తొందరగా ఇంటికి పొమ్మన్నారు. సంహిత గ్రీటింగ్ కార్డ్స్ కొనాలంటే సాయంగా వెళ్ళాను. తప్పేమిటి.”

“చాల్లే ఆ పిల్లతో తిరగడం కాకుండా, ఇంకా మాట్లాడుతోంది.”

రవళి ఏదో అనేలోపు జగన్నాధంగారు ఇంటికి రావడంతో అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు.

***

సంహిత యింటిలో ఆమె తల్లి, తండ్రీ, నీరజ భోజనాలు చేస్తున్నారు. సంహిత తనలో తనే నవ్వుకోవడం గమనించి

“ఎందుకే సమ్ము, అంత నవ్వుతున్నావ్? మాతో చెబితే మేము నవ్వుతాంగా.” అంది తల్లి శకుంతల.

“ఈ వూళ్ళో అందరూ తమాషాగా మాట్లాడతారమ్మా” అంది సంహిత.

“ఆ విషయం నీకు ఇన్నాళ్ళకు తెలిసింది. నేను వారంలోపే కనిపెట్టాను.” అన్నాడు తండ్రి ముకుందరావు.

“అంత తమాషా ఏముంది” అంది శకుంతల.

“లేకపోతే ఏమిటమ్మా ఎప్పుడో వచ్చే పరీక్షల కోసం ఇప్పటినుంచే అందరికీ టెన్షన్.”

“బాగుంది. ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోకపోతే ఎలా?” అంది శకుంతల.

“అంటే పరీక్షల టెన్షన్ నీకు లేదా? నువ్వు మొదటినుండీ జాగ్రత్తగా చదువుతున్నావా?”

“ఆ… చదువుతున్నాను డాడీ, మా రవళికే టెన్షన్.”

“ఆ భయంతో చదువుకోవాలి.”

“అబ్బా మా రవళిలాగా మాట్లాడకమ్మా. వుండవలసింది శ్రద్ధగానీ భయం కాదు. ఇదే మాట మా రవళికి చెప్పాను. అఫ్‍కోర్స్ వాళ్ళ అన్నకు, శ్రద్ధ, భయం రెండూ ఉన్నట్టూ లేవు. ఎప్పుడూ బజార్లోనే వుంటాడు.”

“అతని సంగతి మనకెందుకే” అంది శకుంతల.

“అలా అంటే ఎలాగమ్మా మా అన్న మెడిసిన్ చదువుతున్నాడు. రవళి అన్న కూడా మంచి చదువు చదవాలిగా” అంది సంహిత.

“కరెక్ట్. ఈ వయసులోనే పిల్లలు బాగా చదవాలి. తర్వాత బాధపడి ఏం లాభం?” అన్నాడు ముకుందరావు.

ఏమీ మాట్లాడనిది నీరజ ఒక్కతే. సంహిత గలగల పారే నదిలా తుళ్ళుతూ నవ్వుతూ చలాకీగా వుంటే, నీరజ స్తబ్ధుగా, స్థాణువులా వుంటుంది. అక్క చేసే పనులు, మాటలు ఆమెకు నచ్చవు. తండ్రి సంహితనే సపోర్టు చేస్తాడు. అందుకే తన మాటకి విలువలేదని ఆమె మాటలే తగ్గించుకుంది.

“మీరు సంహిత ఏం చెప్తే దానికి తలాడించకండి, ప్రతీ విషయంలోనూ, ప్రతీవాళ్ళని దీన్నెవరు కామెంట్ చెయ్యమన్నారు? మీరు కాస్త ముభావంగా వుండి దాన్ని కంట్రోల్ చేయమంటే వినరు.” అంది శకుంతల, ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక ముకుందరావుతో. ఆయన ఎప్పట్లాగే నవ్వి నిద్రపోయాడు.

***

ఆ రోజెందుకో రవళికి కాస్త ఒంట్లో బాగున్నట్టు అనిపించలేదు. అయినా స్కూలుకి వచ్చేసింది. సంహిత ఒకటి రెండుసార్లు పలకరించబోయినా ముభావంగా జవాబులు చెప్పింది. ఒకసారెందుకో క్లాసులోనుంచి బాత్‍రూంకి వైపు వెళ్ళి అక్కడే చెట్టుకింద నిలబడిపోయింది. సంహిత కిటికీలోనుండి చూసేసరికి రవళి అక్కడ ఎందుకు నిలబడిపోయిందో అర్థంకాలేదు. సంహిత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రవళి దగ్గరికి వచ్చింది.

“ఇదిగో తీసుకో” అంది హ్యాండ్ బ్యాగ్ ఇస్తూ.

“ఎందుకు ఇది నాకిస్తున్నావ్. ఇందిరా టీచర్ వస్తారేమో క్లాసులోకి”

“టీచర్ అడిగితే నే చెప్తాలే… ఈ బ్యాగ్‍లో నీకు అవసరమైనవి వున్నాయి”

రవళి మాట్లాడలేదు. బ్యాగ్ తీసుకుని బాత్‍రూంలోకి వెళ్ళి తనున్న పరిస్థితికి జాగ్రత్తలు తీసుకువచ్చింది.

“సంహితా! నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట. ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఎదురవలేదు. నేనిలా వున్నానని ఎలా గ్రహించావ్.”

“నేనూ, ఆడపిల్లనే రవళి. మీకు ఈ వూళ్ళో స్కూళ్ళు కాలేజీల దగ్గర ఇటువంటప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బందే. అందుకే హ్యాండ్ బ్యాగ్‍లో ఇటువంటివి రెండు వుంచుకున్నామనుకో చాలా సహాయంగా వుంటుంది. నేను హ్యాండ్ బ్యాగ్ వాడతానని మన క్లాసులో అందరూ కామెంట్ చేయడం నాకు తెలుసు. కానీ బ్యాగ్‍లో ఒక వంద రూపాయలు. ఇలాటి అవసరమైనవి పెట్టుకున్నామనుకో మనకు చాలా ఉపయోగం.”

ఆ మాటలు ఎవరైనా విన్నారేమోనని అటూ ఇటూ చూసింది రవళి. సంహిత గట్టిగ నవ్వేసింది.

“ప్రతిదానికి ఎందుకోయ్ అంత భయపడతావ్. ఇది సో నేచురల్.”

“అబ్బా నీకున్నంత ధైర్యం నాకు లేదులే.”

ఇద్దరూ క్లాస్‍లోకి వచ్చారు. రవళి లంచ్‍కి ఇంటికి వస్తుంటే సంహిత మాట్లాడే పద్ధతి, ఆమె సమస్యను హేండిల్ చేసే విధానం మరి మరీ నచ్చాయి. ఆమెపై అభిమానం, నమ్మకం మరింత పెరిగాయి. ఏమైనా ఆమె నాలుగు ఊళ్ళు చూసిన మనిషి. ఆమెతో స్నేహం కలగడం తన అదృష్టం.

(ఇంకా ఉంది)

Exit mobile version