ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 4

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap]రోజు మామూలుగా తెల్లవారినా రవళికెందుకో తెలియని సంతోషంగా వుంది. ఆమెకు వెంటనే సంహితను చూడాలనిపించింది. టీనేజ్ వయసు అనేది చాలా అందమైనది. అదే సమయంలో భయంకరమైనది కూడా. ఏమాత్రం ప్రపంచ జ్ఞానం లేకపోయినా అన్నీ మనకే తెలుసు అనే విశ్వాసం. ఏ పనీ చేయకపోయినా అన్ని పనులూ మనకే చేతనౌను అనే నమ్మకం ఇవన్నీ ఆ వయసులో వుండే చేష్టలు.

అదే సమయంలో భవిష్యత్తును నిర్మించుకునే బాధ్యత కూడా వారి మీద వుంటుంది. నిజానికి రవళిలో ఇన్నాళ్ళు అటువంటి దృఢనిశ్చయమే వుండేది… కానీ సంహితతో స్నేహం ఆమెను మరోలా ఆలోచించమంటోంది. సంహితకు ఆ వయసులోనే ఎంత మెచ్యూరిటీ, బ్యాలన్స్ ఆఫ్ మైండ్… ఇవన్నీ తానెప్పుడు నేర్చుకుంటుందో. నిజానికి క్లాసులో వుండే మిగతా పిల్లలందరూ ఇన్ని రోజులుగా కలిసి చదువుకున్నవారే. అయినా వారిలో వుండే కాస్త అమాయకత్వం, లేనిపోని జాణతనం సంహితలో లేవు. ఆమెలో వుండే హుందాతనం వీరిలో లేదు.

“అబ్బా ఏమిటక్కా ఇంకా నిద్రలేవలేదా? ఇది ప్రపంచంలో తొమ్మిదో వింత” అంటూ వచ్చింది స్నేహ.

“చాల్లే ఒక్కోరోజు బద్ధకంగా వుండి లేటుగా లేవాలనుపిస్తుంది, అదేం వింత కాదులే.”

రవళి ఇంట్లో పొద్దున్నే టిఫిన్ తినరు. పిల్లలు ముగ్గురూ కొద్దిగా అన్నం తిని స్కూలుకి, కాలేజికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పూర్తి లంచ్ చేస్తారు. రవి, రవళి, స్నేహ అన్నం తినడానికి కూర్చున్నారు.

“ఏమిటమ్మా రోజూ అన్నం తినాలా? చిన్నప్పటి నుంచి అంతే. బ్రేక్‍ఫాస్ట్ అంటే ఏదైనా టిఫిన్ తినాలి. అంతేకాని పల్లెటూరి వాళ్ళలాగ ఈ అన్నం ఏమిటి?” విసుగ్గా అన్నాడు రవి.

“అవునమ్మా అన్నం తిని వెడితే నిద్రవస్తుంది” అంది రవళి.

“బాగుంది. అన్నకి వంత పాడుతున్నావా… తెల్లవారి లేస్తే ఎవరూ నాకు సహాయం చేయరు. అయినా వేడిగా అన్నం వండి పెడుతున్నా, రాత్రి అన్నం కాదుగా తినడానికేమైంది.”

“అబ్బా యిన్నాళ్ళు తింటే ఇప్పుడు కూడా తినాలా? మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు” అన్నాడు రవి.

“కాలేజీలో ఇదేనా మీరు మాట్లాడుకునేవి” అంది ఆదిలక్ష్మి.

“మేము ఏది మాట్లాడుకుంటామో అది అనవసరం. నువ్వు రేపటినుండి టిఫిన్ చెయ్యి” అన్నాడు రవి తల్లికి ఆర్డర్ వేస్తున్నట్టు.

“అన్నయ్యా అమ్మతో అలాగేనా మాట్లాడేది” అంది రవళి.

“నాకు తెలుసులే” రవి కాస్త అన్నం వుండగానే లేచి చెయ్యి కడిగాడు.

“బాగుంది, నాకు ఓపిక లేదు బాబు” అంది ఆదిలక్ష్మి.

ఆమె రవళికి పెరుగు వడ్డిస్తోంది. కోపంలో గమనించకుండా పెరుగు ఎక్కువ వేసేస్తోంది.

“ఆ… ఏమిటమ్మా యిది…” రవళి కాస్త గట్టిగానే అరిచింది.

***

“ఆ…ఆ…. ఏమిటి రవళి పెరుగంతా నాకే వేస్తున్నావ్” వెంకట్ చెయ్యి అడ్డం పెట్టాడు.

అయినా రవళి పెరుగు వేసేసింది. అతని హెచ్చరికతో ఆమె ఆగింది.

“ఏమిటి ఈ మధ్య యింత పరధ్యానంగా వుంటున్నావ్” అడిగాడు వెంకట్.

ఆమె మాట్లాడలేదు.

“నిన్నే అడిగేది”

“ఏమీ లేదు బ్యాంక్‍లో ఏవో సమస్యలు.”

“సమస్యలు అన్నిచోట్లా వుంటాయి. వాటికి టెన్షన్ తీసుకోవడం ఎందుకు?” అతను చాలా ఈజీగా సలహా చెప్పి టి.వి.లో వార్తలు చూస్తున్నాడు.

రవళికి ఈ మగవాళ్ళ మాటలు ఎప్పుడూ చిత్రంగానే వుంటాయి. సమస్య వాళ్ళది అయితే అది ప్రపంచ సమస్య లాగ కనబడుతుంది. పరాయి వాళ్లది అందులోనూ ఆడవాళ్ళది అయితే అది ఒక సమస్య కాదు అన్నట్టు వుంటుంది. నిజానికి వెంకట్ కాస్త నయమే. తనతోపాటు అదే ఇంటిలో పుట్టి పెరిగిన తన అన్న రవి తన గురించి పట్టించుకున్నాడా. నిజానికి చాలామంది సమస్య అనగానే పారిపోతారు. దానికి రవి, వెంకట్, తన తండ్రీ ఎవరూ మినహాయింపు కాదు. ఆమె వంటిల్లు సర్ది ఏదో పుస్తకం చదవసాగింది. ఇంతలో సెల్‍ఫోన్‍లో సంహిత దగ్గర నుండి మెసేజ్ స్వీట్ డ్రీమ్స్ అంటూ చక్కటి చిత్రంతో.

***

కార్తీకమాసం చలి నిద్రపొమ్మంటున్నా, పనులున్నవాళ్ళు బద్ధకంగా లేచి పనులు మొదలుపెడుతున్నారు. రవళి వీధి వరండాలో కూర్చుని కాఫీ తాగుతోంది. తండ్రి ఉదయం వేళ వినే రేడియో వార్తలు, వీధిలో కూరగాయల వాళ్ళ కేకలు, పనిమనిషి బరబరా గిన్నెలు తోముతున్న చప్పుడు ఇలా జీవన చిత్రాన్ని కలగాపులగం చేస్తున్న రంగుల సమ్మేళనం.

ఈలోగా గేటు తీసుకుని వస్తున్న సంహిత, ఆమె చేతిలో నుండి తప్పించుకుపోదామని చూస్తున్న కుక్కపిల్ల. ఆమెను చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది రవళి. అదేక్షణంలో తన వేషం చూసి తనకే సిగ్గేసింది. రాత్రి నిద్రపోయి అప్పుడే లేవడంతో నలిగిన బట్టలు, జుట్టు. కానీ ఇప్పుడూ మార్చుకునే అవకాశం లేదు. సంహిత చాలా అలవాటైన మనిషిలాగ మెట్లు ఎక్కి వరండాలోకి వచ్చేసింది.

“గుడ్ మార్నింగ్ రవళి”

“గుడ్ మార్నింగ్” అంది రవళి అంతకన్న ఏం పలకరించాలో తెలియలేదు.

“చెప్పాచెయ్యకుండా వచ్చేశానని తిట్టుకోకు” నవ్వుతూ అంది సంహిత.

“అయ్యో అదేం లేదు, మా యిల్లు ఎలా తెలిసింది? ఎప్పుడూ రాలేదుగా.”

“అబ్బా అదో పెద్ద పనా, బాగా చదివే ఒక గుడ్ గర్ల్ ఇల్లు ఎక్కడ అని అడిగితే అందరూ మీ యిల్లు చూపించారు.”

ఆ మాటలకు నవ్వేసింది రవళి.

“ఈ కుక్కపిల్ల ఎక్కడిది?”

“మా అన్న తెచ్చాడు. దానిని నీకు చూపించినట్టు వుంటుంది, అలా మార్నింగ్ వాక్ చేసినట్టు వుంటుందని యిలా వచ్చాను.”

ఇంతలో స్నేహ వచ్చింది “నువ్వా సంహితా గుడ్ మార్నింగ్, అరె ఈ కుక్కపిల్ల ఎక్కడిది? కానీ మా అక్కకు కుక్కలంటే చిరాకు.”

రవళి చెప్పకు అని చేసే సైగలు అర్థం కాలేదు స్నేహకు.

“అలాగా, ఆ విషయం నాకు తెలియదు, కుక్కపిల్లను మీకు చూపించాలని వచ్చాను.”

రవళి వంటింట్లోకి వెళ్ళి, “అమ్మా సంహిత వచ్చింది, కాఫీ ఇవ్వు” అంది.

“లేదే. కొంచెం డికాషన్ వుంటే పనిమనిషికి ఇచ్చేశాను.”

పెరట్లో కొబ్బరిచెట్టు కింద నిలబడి పనిమనిషి కాఫీ తాగుతోంది.

“పోనీ టీ వున్నా ఇవ్వమ్మా”

“లేదు రవళి ఎవరూ టీ తాగడం లేదని టీపొడి కొనడం లేదు”

రవళి నిస్సహాయంగా చూసింది. ఈలోగా సంహితను అక్కడకు తీసుకువచ్చింది స్నేహ. ఆమెను కాస్త కోపంగా చూసింది ఆదిలక్ష్మి.

“నమస్తే అండి నా పేరు సంహిత”

“నిన్ను మా అమ్మాయి ఎన్నోసార్లు తలుచుకుంటుంది” అంది ఆదిలక్ష్మి.

“ఏం రవళి నా గురించి చెప్పి అందరికీ బోర్ కొడుతున్నావా”

ఆ మాటకి అందరూ నవ్వారు.

“సరే నేను వెడతాను”

“వెళ్ళొస్తాను అనాలి” అంది ఆదిలక్ష్మి.

“మా అమ్మ కూడా ఇలాగే చెబుతుందండి” అంది సంహిత.

ఆ మాటతో ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడింది ఆదిలక్ష్మికి. సంహిత బయటి వరండాలోకి వచ్చింది.

“నీ కుక్కపిల్ల ఏదోయ్”

వెనుకగా నడుస్తోంది రవళి, ఆ వెనుక స్నేహ.

“నీకు కుక్కలంటే చిరాకు అన్నావుగా ఇక్కడే కట్టేశాను.”

తల వెనక్కి తిప్పి మాట్లాడుతున్న సంహిత, గేటు దగ్గర పడిన పేపరు తీస్తున్న రవి ఒకరికొకరు ఢీ కొట్టబోయారు. రవళి అప్రయత్నంగా సంహిత చెయ్యిపట్టుకుని ఆపింది.

“ఓ…. థ్యాంక్స్… మీ అన్న కదూ నమస్తే అన్నా” అంది సంహిత.

“నమస్తే” అన్నాడు రవి తడబడుతూ.

అతని మొహం చూసి నవ్వేసింది స్నేహ. సంహిత మరోసారి చెప్పి కుక్కపిల్లను తీసుకువెళ్ళిపోయింది. రవళికి కాస్త భయం వేసింది. బజార్లో సంహిత కనబడితే గొడవ చేసే అన్నయ్య ఇప్పుడేమంటాడో అని. కానీ రవి ఏమీ అనలేదు. సంహిత వచ్చి వెళ్ళాక ఇంటిలో ఒక నిశ్శబ్దం, ఒక సంతృప్తి ఎందుకో… స్నేహ మాత్రం నవ్వుతూనే వుంది.

“ఏమిటే ఆ నవ్వు” కాస్త కోపంగా అడిగింది రవళి.

“అదికాదక్కా పాపం అన్నయ్య మొహం చూస్తే బాధగా వుంది.”

“ఎందుకు”

“ఇన్నిరోజులూ సంహిత పేరు చెప్పి నిన్ను తిడుతూ వుండేవాడు. అలాంటిది తను ఒక్కసారిగా వాడిని అన్నా అనేసింది. ఆ మాట వాడికెంత బాధగా వుంటుంది చెప్పు. పాపం సంహిత గురించి ఏమనుకున్నాడో ఏమో”

“ఛీ…. చాల్లే పిచ్చిమాటలు నువ్వు చిన్నపిల్లవి అలా మాట్లాడకూడదు.”

“నీకు అర్థం కాదులే. అందుకే మీ ఫ్రెండ్స్ వచ్చి, వెళ్ళిన వెంటనే బుక్ తీసి చదువుతున్నావ్.”

“అందులో తప్పేముంది… చదువుకోకపోతే ఎలా?” స్నేహ అక్క వైపు వింతగా చూసింది.

“అందుకే మనుషుల మధ్య ఫీలింగ్స్ నీకు తెలియదు అనేది”

“పోనీలే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను చదువుకోవాలి.”

“ఇంకేం చదువుతావు. ఎనిమిది గంటలవుతోంది స్కూలుకి తయారవు” అంది స్నేహ.

***

లంచ్ చేసి తన ప్లేస్‍లో కూర్చుని ఏదో చదువుకుంటోంది సంహిత. పిల్లలు కొంతమంది గ్రౌండ్‍లో ఆడుకుంటున్నారు. టెన్త్ పిల్లలు కాస్త పెద్దవాళ్ళు కాబట్టి చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫాతిమా తన లంచ్ ముగించి సంహిత దగ్గరకొచ్చింది.

“చదువుకుంటున్నావా సంహితా డిస్ట్రబ్ చేశానా” అంది.

“అదేం లేదులే చెప్పు” అంది తనలో కలిగే చిరాకు కనిపించకుండా.

“మొన్న నువ్వు, రవళి బజారుకి వచ్చారు నేను మీ వెనుకే నడుస్తున్నాను. అయినా మీరిద్దరూ నన్ను మీతో కలుపుకోలేదు” కినుకగా అంది ఫాతిమా.

సంహితకు చిరాకేసింది. అయినా బయటపడలేదు.

“రవళి తను ఒక్కత్తే నా ఫ్రెండ్ అనుకుంటుంది. అందుకే ఆ రోజు నీతో మాట్లాడలేదు.”

“రవళి అలా అనుకుంటుందా? ఈ అయిదేళ్ళల్లో ఎప్పుడూ అలా మాట్లాడలేదే.”

“ఈ అయిదేళ్ళు మీతో నేను చదివానా లేదు కదా! బజార్లో తనేదో కొందామనుకుంటే వెళ్ళాను. తన షాపింగ్‍కి నేను నిన్ను పిలవడం పద్ధతి కాదు. ఏమంటావ్? పైగా మనిద్దరం ఫ్రెండ్స్ అని అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు” సంహిత బ్యాగ్‍లో నుంచి పాతికరూపాయలు తీసి ఫాతిమాకి ఇచ్చింది.

“అహహ ఈ డబ్బెందుకు నాకు వద్దు”

“ఫర్వాలేదు తీసుకో. ఇందాక హిందీ పిరియడ్‍లో నోట్సు రాస్తుంటే నీ పెన్ను ఆగిపోవడం నేను గమనించాను. మంచి పెన్ను కొనుక్కో”

“పెన్ను అయిదు రూపాయలేగా” అంది ఫాతిమా అమాయకంగా.

“మిగతా మనీతో ఏదైనా కొనుక్కో, ఫ్రెండ్స్ మధ్య ఇలాటి మొహమాటాలు వుండకూడదు.”

డబ్బు చూసి సెకను కాలం ఫాతిమా కళ్ళు మెరవడం ఆమె దృష్టిని దాటిపోలేదు.

***

ఆ రోజు సాయంత్రం రవళి ఇంటికి వచ్చేసరికి యింట్లో ఎవరూ లేరు. సినిమాకి కూడా తమని తీసుకెళ్ళకుండా వెళ్ళని తల్లీ, తండ్రి ఎక్కడకు వెళ్ళారో అర్థం కాలేదు. ఆమె వచ్చిన అలికిడి విని స్నేహ ఆమెను డాబా మీదకు పిలిచింది.

“ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావే? అమ్మా వాళ్ళు ఏరి?”

“అమ్మా నాన్నగారు తాతగారు రమ్మంటే వూరికి వెళ్ళారు. అన్నయ్య నన్ను ఇంటికి కాపలాపెట్టి బయటకు వెళ్ళాడు.”

“అన్నయ్యను నీకు సాయంగా వుండమనకపోయావా? ఒక్కదానివి భయం వేయలేదు.”

“మన ఇంట్లో మనకు భయం ఏమిటి? హాయిగా వున్నాను. అన్నట్టు అన్నయ్య హోటల్ నుండి టిఫిన్ తెచ్చిపెట్టాడు. తిను.”

“మరి నువ్వు తిన్నావా?”

“నేనూ అన్నయ్య తిన్నాములే, ప్లాస్క్‌లో కాఫీ వుంది.”

రవళి టిఫిన్ తినసాగింది. ఇప్పుడు వంట చెయ్యాలా, తనకి రాదు. రవికి కూర, చారు అన్నీ పద్ధతిగా వుండాలి. ఆమె టిఫిన్ తినడం ముగించి, కాఫీ తాగింది.

“86, 87, 88….” అని లెక్కపెడుతూ స్నేహ స్కిప్పింగ్ ఆడుతోంది.

“ఏయ్ స్నేహ డాబా మీద స్కిప్పింగ్ ఆడొద్దని నాన్నగారు చెప్పలేదూ?”

“చెప్పారు. ఆయన ఉళ్ళో లేరుగా.”

“అందుకని చెప్పిన మాట వినవా?”

“అబ్బా… అది కాదక్కా ఈ డాబా కింద భాగంలో ఎవరైనా వుంటే వాళ్ళ నెత్తిమీద కొట్టినట్టు వుంటుందని నాన్నగారు డాబా మీద గెంతవద్దు అంటారు. ఇప్పుడు ఇంటిలో వున్న మనిద్దరం ఇక్కడే వున్నాము. అయినా చాలా రోజులుగా నాకు ఇలా ఆడుకోవాలని వుంది. అందుకే నీకు టిఫిన్ కూడా ఇక్కడికే తీసుకువచ్చాను. అబ్బా సూర్యుడు కొండ దిగుతుంటే ఎంత బాగున్నాడో”

ఇద్దరూ సూర్యాస్తమయం కాగానే కిందికి వచ్చేశారు. ఆదిలక్ష్మి ఊరికి వెడుతూ రాత్రికి వంట చేసి వెళ్ళింది, పిల్లలకు ఇబ్బంది లేకుండా. రవళికి మాత్రం చదవాలని లేదు. అటు రవి, ఇటు స్నేహ చదువుకుంటున్నా ఆమెకు చదవాలని లేదు. పుస్తకం అటూ ఇటూ తిప్పుతోంది. చదవకపోతే తల్లి తిడుతుందనో, హోంవర్క్ కాలేదనో చదవాలని లేదు. సంహిత మాటల్లో చెప్పాలంటే ఈసురోమంటూ వుండే రవళి మనసు ఆ రోజు పగ్గాలు తెంపుకు విహరిస్తోంది. ఆ విహారం అలా అలా సంహిత చుట్టు తిరుగుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత వివిధ భారతిలో ‘జయమాల’ పెట్టుకువింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here