Site icon Sanchika

ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 5

[dropcap]లం[/dropcap]చ్ ముగించుకుని స్కూల్లో తన క్లాసుకు వెళ్ళిన రవళికి సంహిత ఏదో చదువుకుంటూ కనిపించింది. వాళ్ళిద్దరు పొడుగ్గా వుంటారు కాబట్టి వాళ్ళదే ఆఖరు బెంచి. పైగా సంహిత బెంచికి చివర కిటికీ దగ్గర కూర్చుంటుంది. రవళి వెళ్ళి సంహిత దీక్షగా చదివేది ఏమిటని చూసి ఉలిక్కిపడింది. ఆమె చదివేది క్లాస్‍బుక్ కాదు. ‘మీనా’ నవల.

“ఇలా మన స్కూల్లో నవలలు చదవకూడదోయ్” అంది రవళి.

“ఎవరు చెప్పారు?” బుక్‍లో నుండి తలెత్తకుండా అంది సంహిత.

రవళికేం జవాబు చెప్పాలో తెలియక మాట్లాడలేదు.

“ఇలా చదివేటప్పుడు ఎవరైనా చూస్తే” అంది.

“చూసే అవకాశం వారికి ఇవ్వొద్దు” నవ్వింది సంహిత.

“కావాలంటే నువ్వు ఈ పేజీ నుండి చదువు. మీనా వాళ్ళ బావ ఇంటిలో ఎలా వున్నది తెలుస్తుంది”

రవళి కళ్ళు అప్రయత్నంగా నవలవైపు తిరిగాయి. ఆ రోజు మొత్తం రవళి ఆ నవల ప్రభావం నుండి బయటకు రాలేకపోయింది. లెక్కలు తప్పుచేసింది. హిందీ పదాలు ఒకదానికొకటి రాసింది. రవళి ఇంటిలో పుస్తకాలు చదవరని కాదు. దానికి ఒక సమయం, సందర్భం వుంటాయి. అందులోనూ రవళి పద్ధతిగా వుంటుంది. కానీ మనిషి ధ్రిల్లింగ్ అనే పదానికి ఎలా లొంగిపోతాడో ఆమెకు ఆ క్షణం తెలియదు.

వీక్లీ టెస్టులో వచ్చిన మార్కులు చూసుకుంటున్నారు పిల్లలు. రవళికి అన్ని సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఆమె ఎదురుగా అనకపోయినా టీచర్‍లకు ఒకటే ఆశ్చర్యం. ఇన్నిరోజుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. తెలుగు టీచర్ వూరుకోలేకపోయారు. ఆమె రవళిని స్టాఫ్ రూంలోకి పిలుచుకువెళ్ళారు. అదృష్టవశాత్తు టీచర్లు ఎవరూ అక్కడ లేరు.

“ఏం రవళి ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదా?”

“బాగానే వుంటోంది టీచర్”. ఇన్ని రోజుల్లో ఇలా టీచర్‍లకు సంజాయిషీ ఇవ్వవలసి రావడం ఇదే మొదటిసారి.

“ఏమ్మా మరి చదువేమిటి ఇలా నీరసంగా నడుస్తోంది”

రవళి మాట్లాడలేదు. అప్పటికే ఆమె చేతులు వణుకుతున్నాయి.

“చూడు రవళి ఈ ఏడాది క్లాస్ ఫస్ట్ వస్తావు అనుకునే స్టూడెంట్స్‌లో నువ్వొక దానివి. మరి నీ చదువు ఇలా ఉంటే ఎలా?”

రవళికి మాటలు రావడం లేదు. ఇలా సంజాయిషీ ఇవ్వడమే అవమానంగా తోచింది.

“చూడూ స్నేహాలు వద్దని ఎవరూ అనరు. కానీ దానికీ ఒక హద్దు వుండాలి. ఏదైనా మన లక్ష్యాన్ని పాడుచేసేట్టు వుండకూడదు.”

“సరే టీచర్” అంది రవళి. అలా వినయంగా మాట్లాడకపోతే టీచర్ మరింత కోపం తెచ్చుకునే అవకాశం వుంది.

“సరే నువ్విక వెళ్ళవచ్చును.”

చిత్రంగా ఆమెకు కోపం గానీ, బాధ గానీ కలగడం లేదు. ఏదో థ్రిల్లింగ్‍గా వుంది. ఆమె జరిగినదంతా సంహితకు చెప్పింది. అప్పటికే టైము 5.30 గంటలు అయింది. వాడిపోయిన మొహాలతో టెన్త్ క్లాసు వాళ్ళు రెండు సెక్షను వాళ్ళు ఇంటి ముఖం పడుతున్నారు. సంహిత, రవళిని టీచర్ మందలించడాన్ని తేలిగ్గా తీసుకుంది. ఆమె శిష్యరికంలో రవళి కూడా.

ఆమె ఇంటికి వచ్చేసరికి తల్లి, తండ్రి వూరు నుండి వచ్చేశారు. అంతేకాదు ఇద్దరూ ఎందుకో గట్టిగా అరుచుకుంటున్నారు.

“ఎందుకో, ఏమిటో వున్నట్టుండి ఊరికి తీసుకుపోయారు. తీరా అక్కడ పెళ్ళి సంబంధం. ఇప్పుడు దాని పెళ్ళికి ఏం తొందర వచ్చింది” అంది ఆదిలక్ష్మి.

ఆమె వూరునుంచి వచ్చి చీర కూడా మార్చుకోలేదు. ముదురాకు పచ్చ చీర, జాకెట్టు, కోపంతో ఎర్రబడిన మొహం, ముక్కుకున్న ఎర్రరాయి ముక్కుపుడక రవళికి కోపంలో కూడా తల్లి అందంగా కనపడింది.

“ఆడపిల్లలకు చదువు అవసరమే గానీ అదే ప్రాణం అన్నట్టు మాట్లాడవద్దని ముందే చెప్పాను” అన్నాడు తండ్రి.

“పదిహేను సంవత్సరాలకే పెళ్ళేమిటి? మీ నాన్నగారు చెప్పడం మీరు వినడం బాగుంది” అంది ఆదిలక్ష్మి.

“నీకు చెబితే అర్థం కాదా! ఇప్పుడు నిర్ణయించుకుంటే దానికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాకే పెళ్ళి చేయవచ్చు.”

“ఇప్పుడు నిర్ణయాలు దేనికి? మూడు సంవత్సరాలలో ఎవరి ఇష్టాలు, మనసులు మారిపోతాయో…”

“వాళ్ళు పెద్దవాళ్ళయి పోయారు. మనవరాలి పెళ్ళి చూడాలని వుండదా వాళ్ళకి.”

“అందుకని ఇప్పట్నుంచి పిల్లల మనసుల్లో పెళ్ళి ఆలోచనలు ప్రవేశపెడతారా? పదిహేను సంవత్సరాలకి పెళ్ళి చేసుకుని నేను బావుకున్నదేమిటి?”

“ఏం నీకేం లోటొచ్చింది ముగ్గురు పిల్లలు, నాది గవర్నమెంట్ ఉద్యోగం, సొంత యిల్లు హాయిగా వున్నాం.”

“హాయిగానే వున్నాం అని మీరు అనుకోవడం కాదు, నేను అనుకోవాలి. చిన్నవయసులో పెళ్ళి చేస్తే అప్పటినుండీ బాధ్యతలు, చదివిన ఆ పదోతరగతి ఎందుకూ పనికిరాదు. అయినా లోకంలో ఆ ఒక్క సంబంధమే వున్నట్టు ఎందుకు అంత బాధపడతారు. మీరే అంటారుగా ప్రయత్నమే కాదు, ప్రాప్తం కూడా వుండాలని.”

“అంతేలే నేను మాటవరసకు అన్నమాటల్ని నామీదే వాడతావు” అన్నాడు.

ఈ మాటలన్నీ దేని గురించి అని రవళి కళ్ళతోనే అక్కడ వున్న రవిని, స్నేహని అడిగింది.

“నీకు పెళ్ళి సంబంధం వచ్చింది అక్కా” స్నేహ చెప్పింది.

“ఛీ…” అంది రవళి.

“అదేంటక్కా అలా అనేశావ్”

“లేకపోతే ఏమిటి నాకు చదవాలని వుంటే ఈ పెళ్ళి మాటలు ఎవరు మాట్లాడమన్నారు” గట్టిగానే అంది రవళి.

“రామ్మా… రా ఇంతసేపూ మీ అమ్మతో వాదన అయ్యింది. ఇంక నువ్వు మొదలుపెట్టు” అన్నాడాయన వెటకారంగా.

తండ్రి దగ్గర పిల్లలకంత చనువు లేదు. అయినా రవళి భయపడలేదు.

“నాన్నగారు నేను చదువుకోవాలి, వీలైతే మెడిసిన్ చదవాలి, అయినా నా పరీక్షల ముందు ఏమిటీ డిస్కషన్.”

“ఫర్వాలేదులే ఆ సంబంధం తప్పిపోయింది. నీ యిష్టమొచ్చినన్ని రోజులు చదువుకో” అన్నాడాయన కోపంగా.

“ఏమిటి మీవాళ్ళు చెప్పిన సంబంధం నేను ఒప్పుకోలేదని అంత కోపం వస్తోంది. పెళ్ళి అంటే మాటలా చాలా డబ్బు కావాలి. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు వుందా?” అడిగింది ఆదిలక్ష్మి.

తండ్రి ఏదో అనబోయాడు, “అబ్బా ఆపండి నాన్నా జరగని పెళ్ళి గురించి ఎంతసేపు మాట్లాడతారు” అన్నాడు రవి.

“అది కాదురా…”

“అబ్బా ఆపండి. దాని పరీక్షల ముందు ఈ మాటలు మంచివి కావు.”

రవళి అన్న వైపు కృతజ్ఞతగా చూసింది. ఇంటికి పెద్దకొడుకు, వారసుడు అనేసరికి తల్లి, తండ్రి మాట్లాడలేదు. కానీ కిటికీ మూసివేస్తే గాలి ఆగిపోయినట్టు పుస్తకం మూసివేస్తే అక్షరాలు కనబడనట్టు కాదు. అంతరంగ గవాక్షం మూసివేసినా ఆలోచనలు అనే గాలి తాకిడికి అది తెరుచుకుంటూనే వుంటుంది.

రవళి ఆ సాయంత్రం స్కూలు నుండి వచ్చి టిఫిన్ తిని బుక్స్ తీసుకు డాబా మీదకు వెళ్ళింది. అప్పటికే అక్కడ రవి, స్నేహ చదువుకుంటున్నారు. సాయంత్రం ఆరుగంటల నుండి పిల్లలు చదువుకోవాలి. అది ఆ యింట్లో పిల్లలకు చిన్నప్పటి నుంచి వున్న అలవాటు. రవళి వెనుకనే ఆదిలక్ష్మి ఏదో నవల పట్టుకువచ్చి అక్కడే చదువుకోసాగింది.

“అన్నయ్యా! ఈ లెక్క రావడం లేదు కాస్త చెప్పు” అంది స్నేహ.

అది మామూలు వడ్డీ లెక్క. రవి చెప్పాడు. కాని స్నేహ లెక్క తప్పు చేసింది. అతను కోప్పడి మళ్ళీ చెప్పాడు. అయినా లెక్క తప్పు చేసింది. రవికి కోపం, విసుగు వచ్చాయి.

“ఏమిటే ఇంత మొద్దు బుర్రవి అయిపోతున్నావు… చెప్పేది అర్థం చేసుకోవేం.”

“అర్థం అయ్యేట్టు నువ్వు చెప్పడం లేదు.”

“అంటే ఆరో తరగతి లెక్కలు కూడా చెప్పలేని వాడిననుకున్నావా.”

“నేనేమి అనలేదు. నువ్వు లెక్క సరిగ్గా చెప్పు” నవ్వుతోంది స్నేహ.

“ఏమిటే పదిసార్లు నన్ను సరిగ్గా చెప్పమంటావ్ మొద్దు బుర్ర పెట్టుకుని” రవి చెల్లెలి తలమీద గట్టిగా మొట్టికాయ వేశాడు.

“అబ్బా…” అంది స్నేహ.

ఆ ఇంటిలో పిల్లలను కొట్టే పద్ధతి లేదు. ఆదిలక్ష్మి పెద్దగా చదువుకోకపోయినా పిల్లలని కళ్ళతోనే అదుపులో పెడుతుంది. ఇంత జరుగుతున్నా రవళి పుస్తకాల్లోనుంచి తలెత్తి చూడలేదు. ఆమె చదువులో పడితే దేన్నీ పట్టించుకోదు. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా తను అంత దెబ్బతిన్నా అక్కగారి ఏకాగ్రత ఆశ్చర్యం కలిగించింది. ఆమె మరోసారి లెక్క చూసింది. అక్కడ ఆరుకు బదులు మూడు వేసి వుంది.

“ఇదిగో లెక్క ఇక్కడ తప్పింది” అంటూ లెక్క చేసింది స్నేహ.

ఈసారి కరెక్టుగా వచ్చింది. స్నేహ అన్నగారిని చూసి నవ్వింది. రవి తన తప్పు బయటపడిందని శ్రద్ధగా చదవసాగాడు. ఇంతలో కింద ఇంటి తలుపు చప్పుడైంది.

“నాన్నగారు వచ్చినట్టున్నారు” అంటూ ఆదిలక్ష్మి కిందకి వెళ్ళిపోయింది.

స్నేహ లెక్కలు పూర్తిచేసి ఇంగ్లీషు హోంవర్క్ చేయసాగింది. అయినా రవళి ఏకాగ్రత చెదరలేదు. స్నేహ మాత్రం ఆలోచిస్తోంది. అక్క మరీ యింతలా పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఎలా వుంటుంది? అది నిజంగా ఏకాగ్రతేనా… అయితే అది చదువుమీదేనా…

మర్నాటి ఉదయం స్కూల్లో ఒక విశేషం జరిగింది. లెక్కల మాస్టారు ఒక్కో విద్యార్థి హోంవర్కు చూస్తున్నారు. తప్పులు చేసినవాళ్ళని మందలిస్తున్నారు. నీట్‍గా వున్న దస్తూరి, చక్కగా వున్న అంకెలు. కానీ లెక్కలన్నీ తప్పుల తడకలు. అది రవళి బుక్. ఆయన రవళిని నిలబెట్టి చెడామడా తిట్టేశారు. ఆయనే కాదు క్లాసు మొత్తం ఆశ్చర్యపోయింది, రవళి అన్ని లెక్కలు తప్పు చేసిందంటే. కొన్ని లెక్కలు ఆయన చెప్పి వెళ్ళిపోయారు. రవళికి మాత్రం కళ్ళనీళ్ళు వస్తున్నాయి. అందరిముందూ ఏనాడూ జరగని అవమానం.

సంహిత సావాసంలో ఆమె ఈమధ్య కర్చీఫ్ వాడటం నేర్చుకుంది. దానితో కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. లక్కీగా అప్పుడు ఇంటర్వెల్. సంహిత ఆమెను క్లాసులోనుంచి బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ స్కూలు వెనుక చెట్ల కింద నిలబడ్డారు. ఏకాంతంలో రవళికి మరింత ఏడుపు వచ్చేసింది.

“ఏమిటి రవళి మాస్టారేదో అంటే యింతలా ఏడవాలా?”

“నీకు తెలియదు సంహితా ఈ అయిదేళ్ళలో మాస్టారిచేత, అసలు ఏ టీచర్ చేతైనా తిట్లు తినడం ఇదే మొదటిసారి.” అందామె అక్షరాలు కూడగట్టుకుంటూ.

“ఇదే ఆఖరి సారి కూడా అవుతుంది.”

రవళి ఆశ్చర్యంగా చూసింది.

“అవును మరోసారి నువ్వు ఎవరి చేతా మాటపడవు. నేను నీ ఫ్రెండ్‍గా చెబుతున్నాను. తప్పులు అందరూ చేస్తారు. దానిని సరిదిద్దుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఆమాట కొస్తే తప్పులు చేయకపోతే ఒప్పులు ఎలా తెలుస్తాయి.”

రవళి వింతగా చూసింది ఆమె వైపు. ఇలా ఆలోచించడం ఆమెకు కొత్త.

“అంతెందుకు ఈ మాస్టారు ఒక్కసారి కూడా లెక్కలు తప్పు చేయలేదా? పదిసార్లు పడితే గాని సరిగా ఎలా నడవాలో మనకే తెలియదు.”

రవళి మెల్లిగా మామూలుగా అవుతోంది.

“అందరిముందు నువ్వు పిరికిదానిలా ఏడవడం నాకు నచ్చలేదు. అసలు మనం లైఫ్‍లో దేనికి బాధపడకూడదోయ్. ఈ లెక్కలు పెద్ద సమస్యా? రేపు…. లేదు ఈ రోజే సాయంత్రంలోగా లెక్కలు చేసి మాస్టారుకి చూపించు. ఇప్పుడు తిట్టిన నోటితోనే మెచ్చుకుంటారు.”

రవళికి ఆ మాటలు గొప్పగా అనిపించాయి. ఇంతవరకూ తనతో ఎవరూ ఇలా మాట్లాడలేదు. ఇలా ధైర్యం చెబుతూ ఓదార్చలేదు. ఆమె నవ్వుతూ క్లాసులోకి తిరిగివచ్చింది.

“రవళీ ఈ రోజు మధ్యాహ్నం లంచ్‍కి ఇంటికి వెళ్ళకు. ఇక్కడే కూర్చుని ఆ లెక్కలేవో పూర్తిచెయ్యి.”

“వెళ్లకపోతే మా అమ్మ ఊరుకోదోయ్. పైగా మధ్యాహ్నం పిరియడ్ బుక్స్ తెచ్చుకోలేదు.”

“మీ చెల్లెల్ని తెమ్మను. నాతోపాటు లంచ్ చేద్దువులే.”

సంహిత ఇలా చెప్పి వూరుకోలేదు. స్నేహకు బుక్స్ తెమ్మని చెప్పింది. ఎదురుగా వున్న షాపులో బ్రెడ్, చిన్న జామ్ డబ్బా కొని పట్టుకొచ్చింది. అవీ, సంహిత తెచ్చిన అన్నంకూర ఇద్దరూ పంచుకు తిన్నారు. రవళి మనసు సంహితపై కృతజ్ఞతతో నిండిపోయింది. లంచ్‍ కాగానే మిగతా పిల్లలు క్లాసులోకి వచ్చేలోగా సంహిత తన బుక్‍లోని లెక్కలన్నీ రవళిని ఎక్కించుకోమంది తన నోట్సులో.

“వద్దు సంహితా అలా చేయకూడదు. నువ్వు చెప్పు నేను చేసుకుంటాను” అంది.

“సరిపోయింది. పది లెక్కలు నువ్వు సొంతంగా చేస్తూ కూర్చుంటే తెల్లారుతుంది. నేను డిక్టేట్ చేస్తాను నువ్వు గబగబా ఎక్కించేయ్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం స్పెషల్ క్లాసులో నువ్వు రాగాలు మొదలుపెడితే ఓదార్చడం నావల్ల కాదబ్బా.”

సంహిత అన్న విధానానికి రవళికి నవ్వు వచ్చింది. ఆ నవ్వులోనే ఆమె దిగజారడం అనే పాకుడురాయి మీద కాలు పెట్టింది. అది ఎక్కడిదాకా వెళుతుందో కాలమే చెప్పాలి. లెక్కలు పూర్తయ్యాయి. అటు హిందీ టీచరు క్లాసులోకి వచ్చారు. ఆ సాయంత్రం భయపడుతూనే వెళ్ళి తను చేసిన లెక్కలు చూపించింది మాస్టారుకి.

“మళ్ళీ చేసినా రెండు తప్పులు వచ్చాయి.” మాస్టారు అవి రెడ్ మార్కుతో కొట్టేశారు.

“అదేమిటి సంహితా ఇలా చెప్పావ్, మళ్ళీ రెండు తప్పులా?” అంది రవళి.

“అలాగ మక్కీ మక్కీ కాపీ కొడితే మాస్టారికి అనుమానం రాదా! అందుకే కొన్ని తప్పులు కూడా చూపించాలి.” సంహిత కన్నుకొట్టి చిలిపిగా నవ్వింది.

“అమ్మో ఏం తెలివి. జోహార్… జోహార్…” అంది రవళి తమాషాగా సలాం చేస్తూ.

రవళికి క్లాసులో జరిగినదంతా కలలా వుంది. లెక్కలు తప్పుచేశానని అన్న మాస్టారు ఆ సాయంత్రానికల్లా తను లెక్కలు చేసి చూపించేసరికి ఆశ్చర్యపోయారు. అయితే విద్యార్థులను మెచ్చుకోవడం అనేది ఆ పాఠశాలలో లేని సాంప్రదాయం. రవళి బయటకు చెప్పకపోయినా తను లెక్కలు అలా కాపీ కొట్టడం మాస్టారిమీద పగ తీర్చుకున్నట్టుగా వుంది.

ఇన్నిరోజులు రవళిలో లేని భావం అది. ఆ సాయంత్రం మధ్యాహ్నం భోజనానికి రానందుకు తల్లి పెట్టే చివాట్లు కూడా ఆమె చెవులను తాకలేదు. ఇదంతా తెలియని స్నేహ మాత్రం అక్క సంహితతో పాటు చదువుకుందుకే బడిలో వుండిపోయిందనుకుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version