Site icon Sanchika

ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 7

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ర[/dropcap]వళి, సంహితా, ఫాతిమా బజార్లో నడుస్తున్నారు. తనతోపాటు కొన్ని నోట్‍బుక్స్ కొని ఫాతిమాకిచ్చింది సంహిత. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది.

“నువ్వూ కొన్ని నోట్ బుక్స్ తీసుకో రవళి”

“వద్దు నా దగ్గర వున్నాయి. మా యింట్లో ఏడాదికి సరిపడా ఒకేసారి బుక్స్ కొనేస్తారు. అందులో నుండి ఎవరికి కావలసిన బుక్స్, ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు.”

“వెరీ బాడ్” నవ్వుతూ అంది సంహిత.

“అదేమిటోయ్ అలా అన్నావ్ అందరూ అది మంచి పద్ధతి అంటుంటే.”

“అలా అన్నీ ఒకేసారి కొంటే అప్పుడప్పుడు ఇలా బజారుకి ఎలా వస్తాం చెప్పు. స్టాన్ రోజ్ ఎడ్వర్టయిజ్‍మెంటులో చెప్పినట్టు వీధులన్నీ కాంతివంతం చేసే సమయం ఎలా వస్తుంది.” నవ్వుతోంది సంహిత.

“అబ్బా ఎప్పుడు నవ్వుతూ వుండడం నీకు వరమోయ్” అంది రవళి.

“అవును, చూస్తుంటానుగా ప్రపంచభారం అంతా మీద వేసుకున్నట్టు వుంటారు.”

“నీతో స్నేహం అయ్యేవరకు నేనూ అంతేనోయ్. కానీ నీ స్నేహంలో నేను చాలా నేర్చుకున్నాను. అవునూ మీ నాన్నగారికి ఈ ఏడాది ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నావుగా, నిజమేనా.”

“ఏం ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే ఇప్పటినుంచీ బెంగపెట్టుకుంటావా.”

“లేదు… లేదు నువ్వెక్కడున్నా నన్ను మర్చిపోవని, నేనిక్కడే వున్నా నిన్ను అనుక్షణం గుర్తుచేసుకుంటానని నాకు తెలుసు.”

రవళి ఇంటికి వచ్చేసింది.

***

టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. జిల్లా ఫస్ట్ రావడం రవళి చదువుతున్న స్కూలు ప్రత్యేకత. నాలుగైదు సార్లు అలా ఫస్ట్ రావడం జరిగింది. ఈ ఏడాది పంట బాగా పండింది. క్రితంసారి పంట దెబ్బతింది అని రైతులు మాట్లాడుకున్నట్టే టీచర్లు క్రిందటేడాది బ్యాచ్ బాగా చదివేవారు, ఈ ఏడాదివాళ్ళు ఏం చేస్తారో అని అనుకుంటూంటారు. కానీ రవళి వాళ్ళ బ్యాచ్ ముఖ్యంగా బి సెక్షను మీద ఎవరికీ అపనమ్మకమే లేదు. కొత్తమ్మాయి సంహిత కూడా బాగా చదువుతుంది అని పేరు తెచ్చుకుంది. స్కూలే కాబట్టి ప్రిపరేషన్ హాలిడేస్ అంటూ లేవు. పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తున్నారు టీచర్లు. తమను చదివిస్తున్న టీచరు ఎందుకో స్టాఫ్‍రూం లోకి వెళ్ళారు.

“ఇదిగో సంహితా నీ బుక్” అని కూర్చున్న చోటునుంచే బుక్ అందివ్వడానికి ప్రయత్నించింది ఫాతిమా.

అక్కడే కూర్చుని చదువుతున్న రవళి ఆ బుక్ తీసుకుని సంహితకు అందివ్వబోయింది. అది బెంచ్‍కి తగిలి బోర్లా పడిపోయింది. రవళి వంగి కిందపడ్డ బుక్ తీసింది. ఆ బుక్‍లోనుంచి జారిపడిన ఉత్తరం.

“ఈ ఉత్తరం ఎవరిది ఫాతిమా” రవళి అడుగుతుండగానే సంహిత ఆ ఉత్తరం తీసేసుకుంది.

 ఆ తీసుకోవడంలో ఒక మొరటుతనం, ఒక నిర్లక్ష్యం ఇన్ని నెలలుగా సంహితలో ఎన్నడూ చూడని సీరియస్‍నెస్. సంహిత మొహం వైపు చూసి ఫాతిమా కూడా భయపడింది.

“సారీ సంహితా.”

“సారీ ఎందుకులే చేసింది చాలక” కోపంగా అని ఆ ఉత్తరం, బుక్ తన బ్యాగ్‍లో పెట్టేసుకుంది.

ఫాతిమా అక్కడ ఉండలేక బయటికి పోబోయింది.

“ఎక్కడికి ఫాతిమా ఇక్కడే కూర్చో” సంహిత అరవలేదు.

కానీ అనే మాటలు కోపంగా పదునుగా వున్నాయి. ఫాతిమా బిక్కచచ్చినట్టు కూర్చుంది. బెంచీకి ఇద్దరు మాత్రం కూర్చుని చదువుతున్నారు, అందుకని మిగతా పిల్లలకి వీళ్ళ మధ్య ఏం జరిగిందో అర్థం కాలేదు.

***

రవళి ఇంటికి వచ్చేసింది. ఆమెకు సంహిత సీరియస్‍నెస్ కొత్తగానూ, బాధగానూ వుంది. ఆ ఉత్తరం ఎవరిది? ఫాతిమాదా? సంహితదా? అది ఎన్వలప్. దాన్ని తను తెరవలేదు. కనీసం పేరు కూడ చూడలేదు. సంహితకు ఎందుకంత కోపం వచ్చింది? ఫాతిమా ఎందుకంత భయపడింది? జవాబులేని ప్రశ్నలు అయినా ఎవరో, ఎవరికో ఉత్తరం రాస్తే తనకెందుకు ఆలోచన. చదువు అసలు బుర్రలోకి ఎక్కలేదు. సైన్సు బొమ్మలు ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంది.

“రవళీ! నీకు ఫోన్” తండ్రి పిలవడంతో రవళి ఫోను తీసుకుంది. అటునుంచి సంహిత.

“ఏం చేస్తున్నావ్ రవళి” ఏమీ జరగనట్టే అడుగుతోంది.

“ఏం లేదు. సైన్సు బొమ్మలు ప్రాక్టీసు చేస్తున్నాను.”

“చూశావా మంచి స్టూడెంట్ అంటే నువ్వే, నేను చదవడం కాదు కదా అన్నం కూడా తినలేదు.”

రవళి అప్రయత్నంగా గోడగడియారం వైపు చూసింది. రాత్రి 8.30 గంటలు కావస్తోంది. సంహిత ఇంట్లో రాత్రి 8.00 గంటలకే భోజనం చేసేస్తారు.

“భోజనం మానడం ఎందుకు?”

“లేదు. సాయంత్రం స్కూల్లో నేను కాస్త సీరియస్ అయ్యాను. అది నీ మీద కోపం కాదు. మనుషులు అసమర్థతగా ఉంటే నాకు నచ్చదు. అఫ్‍కోర్స్ నేను ఫాతిమాకు కూడా సారీ చెప్పాను. ఇప్పుడు నీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. క్షమించు.”

“అయ్యో అంత మాటెందుకు సంహితా…”

“నాకు నువ్వు మంచి స్నేహితురాలివి రవళి, నువ్వు బాధపడితే నాకు బాగుండదు.”

“నేను బాగానే వున్నాను. సంహితా అదే ఆలోచించి మనసు పాడుచేసుకోకు.”

“ఓకే రేపు మామూలుగా స్కూల్లో కలుద్దాము. గుడ్‍నైట్.” సంహిత ఫోన్ పెట్టేసి పకపకా నవ్వుకుంది.

ఇటు ఫాతిమా, అటు రవళి ఇద్దరినీ భయపెట్టింది. మళ్ళీ ఇద్దరినీ తనే పలకరించి ‘నీ తప్పులేదులే’ అనిపించుకుంది. ఇంకేం కావాలి. నీరజ ఆమెవైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది.

***

“అమ్మా! ఏ రోజు బాగుందో చూడమ్మా పరీక్షకు పెన్నులు కొనుక్కోవాలి.” అంది రవళి.

“అబ్బా! ఏంటక్కా పెన్నులు కొని తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని రాస్తే సరిపోదా. పెన్నులు కొనడానికి మంచిముహూర్తం కావాలా!” అంది స్నేహ.

“అది చదువుతున్నది టెన్త్ క్లాసే. ఆ పరీక్షలు రాస్తే ఒక గట్టు ఎక్కినట్టే దాని భయాలు దానివి.” అంది ఆదిలక్ష్మి.

ఆ యింట్లో స్నేహ మాటకు పెద్ద విలువ వుండదు. ఆమె అందరి కన్నా చిన్నది కావడం ఒక కారణం కావచ్చును. పైగా స్నేహ, రవళి లాగ పుస్తకాల పురుగు కాదు. చదువు, ఆటలు, సినిమాలు స్నేహితులు, పండగలు, తల్లి వెళ్ళే పేరంటాలు ఇలా అన్నీ కావాలి. ఆదిలక్ష్మి చేసే పని ఆపి కేలండరు చూసి ఆ సాయంత్రం బాగానే వుందని చెప్పింది. రవళి డబ్బు తీసుకుని బయలుదేరింది బడికి. ఆ సాయంత్రం రవళి, సంహిత పెన్నులు కొనడానికి బజారుకి వెళ్ళారు.

“ఈ మగపిల్లలు కాలేజి అయ్యాక ఈ బజార్లోనే ఎందుకు తిరుగుతారో ఎలా చూస్తున్నారో చూడు ఇబ్బందిగా వుంది” అంది రవళి.

“చూడనీ ఆ చూపులే మనం అందంగా వున్నాం అనడానికి నిదర్శనాలు” అంది సంహిత.

“మనం అందంగా వుంటే వాళ్ళకెందుకు, వికారంగా వుంటే వాళ్ళకెందుకు”

“అయ్యో అలా అనకు అదో సరదా.”

ఇద్దరూ ఒక బుక్‍షాపులో పెన్నులు కొన్నారు. వాళ్ళ వెనుకే ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు.

“వీళ్ళిద్దరూ ఒకేరకంగా ఉన్నారేమిట్రా”

“అక్కాచెల్లెళ్ళేమో… కాదు కాదు మన హైస్కూల్ స్టూడెంట్స్. ఆ మధ్య ఆదివారం మేట్నికి రాలేదు, వాళ్ళే…”

ఆ మగపిల్లల కామెంట్స్‌కి రవళికి భయం వేసింది. ఆమె అప్రయత్నంగా సంహిత చెయ్యి పట్టుకుంది.

“అవునవును నువ్వంటే గుర్తుకు వస్తోంది. వీళ్ళతో ఒకబ్బాయి కూడా వచ్చాడు కదూ… వాడెవరంటావ్.”

“ఏమో…”

ఈ మాటలన్నీ రవళికి, సంహితకి వినిపిస్తున్నాయి. రవళికి భయంగా వుంది. సంహితకి ఆశ్చర్యంగా వుంది.

“పోనీ ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడు మనని పిలవొచ్చుగా…”

“పిలుస్తారులే మనం కొంచెం స్నేహం పెంచుకోవాలిగా…”

సంహిత ఇక ఆగలేకపోయింది. ఆమె వెనుకకు తిరిగి జవాబు చెప్పబోయింది.

“పద… మనం ఇంటికి వెళ్ళిపోదాం”

రవళి ఆమెకోసం తను కాస్త తల పక్కకి తిప్పింది. కామెంట్ చేస్తున్న ముగ్గురు కుర్రాళ్ళ వెనుకగా రవి. వాళ్ళ మాటలన్నీ విన్నట్టున్నాడు.

***

“ఏం రవళి పెన్నులు కొన్నావా? ఇప్పుడే దీపారాధన చేశాను. పెన్నులు దేవుడి దగ్గర పెట్టి నీ ఇష్టదైవం పేరు మొదట రాసుకో” అంది ఆదిలక్ష్మి.

రవళి మాట్లాడలేదు. ఆమె గుండె కొట్టుకునే చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. సినిమా విషయంలో తన మనసు గొంతు నొక్కేసింది. చెల్లెలి నోరు మూయించింది. ఇప్పుడు కాకుల్లాంటి లోకులు అన్నీ వాగుతున్నారు. వాళ్ళ నోరు మూయించలేదు. అన్న వచ్చి యిప్పుడు గొడవపెడతాడు. వాడికేం జవాబు చెప్పగలదు? తల్లి మరోసారి హెచ్చరించడంతో ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకుని పెన్నులు దేవుడి దగ్గర పెట్టింది. ఇప్పుడు ఆమె ప్రార్థించింది పూర్తి ఆరోగ్యంతో వుండి పరీక్షలు బాగా వ్రాసి ఫస్ట్ క్లాసులో పాసవ్వాలని కాదు. రవి ఇంటికి వచ్చి ఏ గొడవ చెయ్యకూడదని. కాని దేవుడు ఆమె మొర ఆలకించలేదు. కనీసం గొడవ విషయంలో…

“రవళీ… రవళీ…” రవి ఇంటికి వస్తూనే అరుస్తూ వచ్చాడు.

వేసుకున్న ఫుల్ హ్యాండ్ షర్ట్ నలిగిపోయింది. అసలు రెండు, మూడు గుండీలే వూడిపోయాయి.

“ఏమిట్రా ఆ కేకలు, అది పూజ చేసుకుంటోంది.”

“ఆ… చేసినట్టే వుంది పూజ. రవళి నిజం చెప్పు ఆ వేళ నువ్వు సినిమాకు వెళ్ళావా? లేదా?”

కాళ్ళు కడిగితే గాని పూజగదిలోకి వెళ్ళడం ఆ యింట్లో నిషిద్ధం. అలాంటిది అతను పూజగదిలోకి వెళ్ళిపోయాడు.

“చెప్పు నువ్వూ, ఆ సంహిత సినిమాకు వెళ్ళారా? లేదా?”

“అన్నయ్యా… అదీ”

“నిజం చెప్పు వెళ్ళారా? లేదా? మీతో పాటు వచ్చిన అబ్బాయి ఎవరు?”

ఈ గొడవంతా చూస్తున్న స్నేహ ఉలిక్కిపడింది. వీళ్ళిద్దరూ ఒక అబ్బాయితో సినిమాకు వెళ్ళారా?

“జవాబు చెప్పమంటే నీక్కాదు…” అతను చెల్లెలి మీదకు వెళ్ళబోయాడు.

“ఒరేయ్ ఏమిట్రా అది, వయసొచ్చిన పిల్లను కొడతావా? రవళి వాడు అడిగినదానికి జవాబు చెప్పు.”

“వెళ్ళాము, కానీ వాడెవడో మాకు తెలియదు.”

“మరి వాళ్ళందరు ఎందుకలా కామెంట్స్ చేస్తున్నారు.”

“ఏమో నాకు తెలియదు.” రవళికి కాస్త ధైర్యం వచ్చింది. “నువ్వు వాళ్ళతో గొడవపడ్డావా?” ఆమె అన్నగారి చొక్కా చూస్తోంది.

“ఆ… ఊరుకుంటానా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంటే”

బజార్లో జరిగినది ఆదిలక్ష్మికి తెలియదు. పిల్లలిద్దరూ తెలుగులోనే మాట్లాడుతున్నా ఆమెకు ఒక్కముక్క అర్థం కాలేదు. “ఇంతకీ ఏం జరిగిందిరా ఏం గొడవ యింటిమీదకు తెచ్చావు? ఏం రవళి ఏమిటిదంతా?”

“ఏముంది ఆడపిల్లలు బజారుకి వెళ్ళడం నలుగురు పోకిరి వెధవలు వాళ్లనేదో అనడం నీ కొడుకు గొడవపడి రావడం” జగన్నాధం గారు ఎప్పుడు వచ్చారో మూడు ముక్కల్లో జరిగినది చెప్పారు.

“నువ్వు బజార్లో వాళ్ళని కొట్టావా?” ఆదిలక్ష్మి భయపడింది.

“నేనెవరినీ కొట్టలేదు. ఇది చెప్పకుండా ఆ సంహితతో సినిమాకు పోవచ్చు నేను వాళ్ళను అడగడం తప్పా?”

జగన్నాధం గారు దగ్గరగా వచ్చి అన్నారు “ఒరేయ్! నీకేమైనా బుద్ధి వుందా. దారిన పోయే కుక్కలు ఏవో మొరుగుతాయి. అందుకని మన ఆడపిల్లని నలుగురిలో బయటకు తెస్తావా… రవళి నువ్వు బజారుకి ఎందుకు వెళ్ళావు.”

జరిగినది చెప్పింది రవళి.

“ఏం ఆడపిల్లల్లాగే నువ్వు నోరుమూసుకుని వచ్చేయొచ్చుగా రేపు ఫలానా జగన్నాధం గారి అమ్మాయిని ఎవరో అల్లరిపెట్టారట, వాళ్ళ అబ్బాయి ఆ మగపిల్లలను కొట్టాడట అని చెప్పుకుంటారు. అది మనకు మర్యాదా?”

“నేను వాడిని కొట్టలేదు, అని చెబితే నమ్మరేం.”

“మేము నమ్ముతామురా, కాని ఏదైనా విషయాన్ని జరిగింది జరిగినట్లు చెబితే లోకంలో ఇన్ని గొడవలే వుండవు. దానికి మసి పూసి మారేడుకాయ చేస్తారు. సరేలే రేపు ఎవరు ఏమన్నా మళ్ళీ నువ్వు ఆవేశపడి వాళ్ళతో గొడవకు దిగకు”

రవికి ఆవేశం తగ్గడం లేదు. “బాగుంది చెప్పకుండా సినిమాకు వెళ్ళినదాన్ని వదిలేసి నన్నంటారేం” అన్నాడు.

కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

“రవళి బాగా చదివేపిల్లవు, పెద్దదావిని అయ్యావు నీకు బుద్ధి వుందనుకున్నాను. ఆఖరికి నువ్వు చేసే పనులివా” అంది ఆదిలక్ష్మి.

“ఏం చేశానమ్మా నేనేదో దొంగతనం చేసినట్టు మాట్లాడుతున్నారు. సంహితా, నేను అనుకోకుండా సినిమాకు వెళ్ళవలసి వచ్చింది. దానికి మీరంతా గొడవ చేస్తారనుకోలేదు.”

“సరేలే ఏదో జరిగింది. బజార్లో జరిగింది ఇక్కడ ఇరుగు పొరుగుకు తెలిసేట్టు మనం అరుచుకుంటున్నాం. భోజనం ఏర్పాట్లు ఏమైనా వున్నాయా? ఈ మాటలతోనే కడుపు నింపుకోవాలా?” అన్నాడు జగన్నాథం.

అందరూ అన్నాలు తింటున్నంతసేపూ గొణుగుతూనే వుంది ఆదిలక్ష్మి. మా అమ్మ పేరంటానికి పంపించినా సాయంత్రం ఆరుగంటలలోపే యింట్లో వుండాలనేది. సరే చదువుకునే పిల్లలు కాస్త సరదాగా వుంటే తప్పేమిటి అనుకుంటే యిలా తయారవుతున్నారు… రవళికి మాత్రం కొంచెంసేపు భయం అనిపించినా తనను తాను రక్షించుకోవడం, సపోర్టు చేసుకోవడంతో కాస్త ధైర్యం అనిపించింది. ఆశ్చర్యం ఏమంటే యింత జరిగినా ఆమెకు సంహిత మీద కోపం రాలేదు. కజిన్ విషయంలో తను చెప్పింది అబద్ధమేమో అనే సందేహం రాలేదు. స్నేహకు మాత్రం సంహిత మీద కోపంగా వుంది. ఆ యింట్లో బాల్య చాపల్యం కొద్ది అల్లరిచేసి విమర్శలు, తిట్లు ఎదుర్కొనేది స్నేహ. ఆమెకు అక్కగారి అందం, తెలివి, చదువు అన్నీ యిష్టమే. ఇంట్లో కూడా అందరిచేత మంచిపిల్ల అనిపించుకున్న అక్కను వీధిలో విమర్శలు, ఇంట్లో విమర్శలు ఎదుర్కొనేట్టు చేసింది. ఛ… ఎంత అందం వుండి ఏం లాభం…

***

మర్నాటి ఉదయం రవళి స్కూలుకు వెళ్ళగానే సంహిత ఆమెను కళ్ళతోనే పిలిచి ఎప్పుడూ మాట్లాడుకునే తురాయి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది.

“రాత్రి మనల్ని కామెంట్ చేసిన కుర్రాళ్ళకి మీ అన్నయ్యకి గొడవ జరిగిందట కదా! అన్న వాళ్లని కొట్టాడట.”

“లేదు… లేదు కొట్టలేదు. బాగా అరుచుకున్నారట మనం వచ్చేశాక.”

“నిజమేనా…”

“నిజమే… అయినా ఇదంతా నీకెవరు చెప్పారు?”

“ఫాతిమా వాళ్ళ యిల్లు అక్కడేగా.”

తండ్రి మాటలు ఎంత నిజం… వూరికే అరుచుకున్నారు అంటే అందులో మజా వుండదు… మరికొన్ని కల్పించాలి.

“ఈ ఫాతిమా అందరికీ ఇలాగే చెబుతుందా?” అనుమానంగా అడిగింది.

“లేదు… లేదు నేను చాలా స్ట్రాంగ్‍గా చెప్పాను ఎవరికీ చెప్పవద్దని.”

“మీరిద్దరూ ఇక్కడ వున్నారా టీచర్ రమ్మంటున్నారు. గ్రూప్ ఫోటోకు టైమవుతుంది.” అంటూ వచ్చింది మాధవి.

ఛ… తనకా విషయమే గుర్తులేదు. అందరూ అంతో యింతో తయారై వచ్చారు. తలస్నానాలు చేసి రంగు రంగు బట్టలు వేసుకుని… తనే జిడ్డోడుతూ వుంది. రవళికి దిగులేసింది.

“గ్రూప్ ఫొటో సంగతి గుర్తుచేయవలసింది సంహితా.”

“అబ్బా ఈ గొడవతో చాలా భయపడిపోయాను. పొద్దున్న నీరజ గుర్తుచేసింది” అంది సంహిత.

“పోనీలే మొదటిసారి నువ్వూ, నేనూ ఫోటో తీయించుకుంటున్నాం. నవ్వుతూ వుండు.”

మధ్యాహ్నం అయితే అందరి మొహాలు వాడిపోయినట్టు వుంటాయని పొద్దున్నే ఫోటో తీయించడానికి నిర్ణయించారు హెచ్.ఎమ్. రెండు రోజులుగా పిల్లలందరూ తయారై రావడం మీద మాట్లాడుకుంటూనే వున్నారు. సమయానికి మానసిక వేదనకు గురై అది ముఖంలో ప్రతిఫలిస్తుండగా జీవితంలో మొదటి మజిలీ విద్యాభ్యాసం ఫోటోలో దిగులుగా వచ్చింది రవళి వదనం.

(ఇంకా ఉంది)

Exit mobile version