కాజాల్లాంటి బాజాలు -1: ఇవీ ఇప్పటి మన వేడుకలు

    1
    5

    [box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే కాజాల్లాంటి బాజాలు శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

    మా బంధువు లమ్మాయి నీరజకు సీమంతం చేస్తున్నారు. ఇంక బంధువులందరికీ ఎంత ఆనందమో. కుటుంబనియంత్రణ అంటూ అమలుపరచడం ఒక తరం గడిచిపోయేటప్పటికి అసలు ఏ ఇంట్లోనయినా చంటిపిల్లలు కనిపిస్తే మాలాంటివాళ్లకి వదలబుధ్ధవటం లేదు. ఓ పాతికేళ్ళక్రితం వరకూ ఈ సీమంతమనే సాంప్రదాయం చాలా సహజంగా అనిపించేది. కానీ ఇప్పటి రోజులని బట్టి చూస్తే ఇది ఒక అపురూపమైన వేడుక అయిపోయింది. ఇప్పటి తరం పిల్లలు అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడమే ఆలస్యంగా చేసుకోవడం ఒక కారణమైతే, చేసుకున్నాక కెరియర్ గురించి ఆలోచిస్తూ కనడం ఆలస్యం చేస్తున్నారు. అందుకే నీరజ సీమంతానికి చుట్టాలందరం కూడా సాయం చెయ్యడం కన్న సలహా లివ్వడానికే ఎక్కువగా ముందుకొచ్చేసాం.

     “నూనెపిల్లాడు నూరు వరహాలిచ్చినా రాడు వదినా, నీరజని చాలా శ్రధ్ధగా చూసుకోవాలి సుమా!” అంటూ ఒక మరదలు నీరజ తల్లికి సలహా యిస్తే,

    మరో ముత్తైదువ, “చూలింత ఎరుపూ, బాలింత పచ్చా అంటారు. అందుకని సీమంతానికి నీరజకి ఎర్ర పట్టుచీర కొను వదినా.” అంటూ మరొకరి సలహా.

    ఇంకో అమ్మ అయితే “సూడిదలకి తొమ్మిదిరకాల స్వీట్స్ పట్టుకెళ్ళాలి. ఏవేం చేయిస్తున్నావో చెప్పు. అవి బాగుంటాయో లేదో చెపుతాను..” అంటుంది.

    మరో మరదలు నీరజ తల్లితో “నువ్వు గాజులు పెట్టిస్తే అత్తారు పూలు ముడిపిస్తారు. మంచి ముహూర్తం చూసి చెప్పమను వాళ్లని. ఎంతైనా వాళ్ళే పెట్టించాలికదా ముహూర్తం.” అంటుంది.

    మరో ముత్తైదువ “హూ. ఏవిటో.. అంత అపురూపమైనదాన్నీ మా అత్తారు ఆనవాయితీ లేదంటూ పూలే ముడిపించలేదూ..” అంటూ అప్పుడు పడ్ద బాధని ఇప్పుడు చూపిస్తుంది.

    ఇటువంటి ఉచిత సలహాలు ఎన్నిచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఈమధ్య టివీలో చాలామంది పెద్దలు మన సాంప్రదాయాలని తెలీనివాళ్లకి చెపుతున్నట్లు ఎక్కడెక్కడివో తీసుకొచ్చి అమలుపరచమని చెప్పడంతో, అవన్నీ వింటున్న కొంతమంది అనుయాయులు ఆ సాంప్రదాయాలన్నీ మా నీరజ సీమంతంలో ఆచరణలో పెట్టేసారు.

    ఆరోజు సీమంతం పేరంటానికి నేను వెళ్ళేసరికి కాస్త ఆలస్యం అయింది. అప్పటికే నీరజకి గాజులు పెట్టించేసి, హరతివ్వడానికి ఆయత్తమవుతున్నారు. ఎంతో సంబరంగా అందరినీ తోసుకుంటూ అక్షింతలు వెయ్యడానికి వెళ్ళిన నేను నీరజని చూసి తెల్లబోయాను. అసలే ఓపలేని పిల్ల. ఎంత నాజూకుగా అలంకరించాలీ! కానీ నీరజ ఇలా కనిపిస్తోందేవిటీ! ముత్తైదువులందరూ అప్పటివరకూ పెట్టిన కుంకుమబొట్లతో నుదురు సగభాగం ఎర్రగా కనిపిస్తోంది. ఇంత బరువున్న సవరం పెట్టి, ఇంకా అంత బరువున్న పెద్ద చామంతులతో, మరింత పొడుగైన జడ కుట్టారు.

    అసలే పట్టుచీర బరువు. పోనీ సాంప్రదాయం కదా చీర పరవాలేదనుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందేవిటంటే వేపమండలతో, మామిడికొమ్మలతో పొడుగాటి తోరణంలాగా కట్టి దానిని నీరజ నడుం చుట్టూ కట్టారు. అసలే ఏడోనెల. పొట్ట కాస్త పెద్దగానే కనిపిస్తోంది. దానికి తోడు నడుం చుట్టూ ఎంతో బరువైన ఈ మామిడికొమ్మలూ, వేపమండలూనూ. నీరసం, అలసట, ఆయాసం, విసుగూ అన్నీ కలిసిపోయి, వాటిని దాచుకునే ప్రయత్నంలో నవ్వడానికి విఫలప్రయత్నం చేస్తున్న నీరజమొహం చూస్తే చాలా జాలేసింది.

    అక్కడున్న అందరినీ తప్పించుకుంటూ ఓ మూలనున్న పద్మం వదిన దగ్గరికి వెళ్ళి “ఈ వేపమండలేవిటి వదినా?” అనడిగేను.

    “హుష్, గట్టిగా అనకు. నీరజా వాళ్ళత్తగారి తోడికోడలి పుట్టింటారు అనుసరించే ఒక స్వామి ఇలా చెయ్యమని చెప్పేరుట. నడుంకి అలా వేపమండలూ, మామిడికొమ్మలూ కడితే కడుపులో శిశువు దగ్గరికి భూతప్రేతాలు చేరవుట..” అంది నెమ్మదిగా.

    ఆశ్చర్యపోయేను. ఇంకా భూమ్మీదకి కూడా రాని కడుపులో బిడ్డ దగ్గరికి భూతాలూ, ప్రేతాలూ రావడం యేవిటో అర్థం కాలేదు. అసలా చెప్పినాయన యెవరో, ఆయనేం చెపితే వీళ్ళు యేది చేస్తున్నారో, తరతరాలుగా కుటుంబంలో వచ్చే సాంప్రదాయం పాటించాల్సిన చోట ఈ కొత్త కొత్త విషయాలు చేర్చడం యేమిటో, సరదాగా వేడుక చేసుకోవలసిన సమయంలో అందరి మనస్సుల్లోనూ లేనిపోని భయాల్ని పెట్టడం యేమిటో ఎంత ఆలోచించినా నాకర్ధం కాలేదు.

    అందుకే పద్మం వదినతో. “వదినా, భగవంతుడు భక్తికి దాసోహమంటాడు కానీ ఇలాంటి భయాలకి లొంగడు. మనకి ప్రస్తుతం కావల్సినది ఆ భగవంతుడి ఆశీర్వచనం కానీ, వస్తాయేమోనని భయపడి తరిమికొట్టే ఈ భూతాలూ, పిశాచాలూ కాదు. అసలు మన సాంప్రదాయంలోనే ఇలాంటివి లేవు” అన్నాను.

    “ఎందుకులేవు? మొన్నటికి మొన్న ఆడవాళ్ళందరూ చేతులకి ఎరుపుగాజులు వేసుకోకపోతే సౌభాగ్యానికి  ముప్పనే మాట వినేసరికి ఆడాళ్లందరూ గాజులకొట్లకి పరిగెత్తలేదా? ఆడాళ్ళదాకా ఎందుకూ! మొగాళ్ళు మాత్రం ఈ మూలకి ఓ గది ఉండాలని ఒకరు చెపితే వెంటనే అక్కడ గది కట్టించేస్తారు. మరో ఆయన వచ్చి అక్కడ గది ఉండకూడదు మెట్లుండాలంటే దానినే మెట్లుగా మార్చేస్తారు. ఎవరు ఎందుకు ఏది చెపుతున్నారో తెలుసుకోకుండా, చేస్తే నష్టమేమీ లేదుగా అనుకుంటూ చేసేస్తున్నారు. ఎంతమంది చేసే పని గురించి ముందుగా వాళ్ళంతట వాళ్ళు ఆలోచిస్తున్నారో చెప్పు” అంది.

    నిజవే.. పాపం వదినకి అన్నయ్య అస్తమానం ఇలాంటి మాటలు చెప్పే ఇంటిని కట్టించడం, పడగొట్టడం చేస్తుంటాడు. పక్కనుండి మా మాటలు వింటున్న వదిన చెల్లెలు విమల అందుకుంది. “ఇలాంటి విషయాలని వాళ్ల స్వార్ధానికి వాడుకునేవాళ్ళు కూడా ఉంటారండీ. మా ఆడపడుచులు మొన్న వచ్చి అన్నదమ్ములు ఆడపడుచులకి పట్టుచీరలు పెట్టకపోతే వాళ్లకేదో అయిపోతుందని చెప్పి మావారిచేత అప్పు చేయించి మరీ పట్టుచీరలు పట్టుకెళ్ళేరు.”  అంది.

    అక్కడున్నవాళ్లందరిలోనూ నామాట వినే మనిషి మా వదిన చెల్లెలే అనిపించింది. అందుకే తనతో  “చూడు విమలా,  ఇలాంటి వేడుకలకి మన కుటుంబంలో పెద్దవాళ్ళు తరతరాలుగా ఏ సాంప్రదాయం పాటించేరో అదే మనమూ పాటించాలి. ఇప్పుడు ప్రతివారూ ఏదోకటి చెయ్యమని చెప్తూనే ఉంటారు. కానీ మన హిందూధర్మంలో సమాజంలో అందరూ సుఖంగా ఉండడానికి నువ్వేం చెయ్యాలో అది చెయ్యి అని చెప్పేరే కానీ ఇలా అందర్నీ భయపెట్టమని చెప్పలేదు. ఏం చేస్తాం? ఈ విషయాలు ఎప్పటికైనా, ఎవరైనా తెలుసుకుంటారో లేదో..” అంటూ నిట్టూర్చేను.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here