జాడ లేని నీడ

25
4

[dropcap]షే[/dropcap]ర్మా అంటేనే ప్రేమ. ప్రేమకు నిర్వచనమే షేర్మా. ఆనాటి ప్రబంధ కవుల నుండీ ఈనాటి వచన కవుల వరకూ ప్రేమకు ఎన్నెన్నో నిర్వచనాలు చెప్పారు. ప్రేమోల్లాసంలో మనోభావాలను వివిధ రకాలుగా వర్ణించారు. నేనూ ఎన్నో నవలలు చదివాను మరెన్నో సినిమాలు చూసాను. కాని ప్రేమంటే నిజమైన అర్థం నా ముప్పై ఏడేళ్ల వయసులో ఆ ముప్పై ఏడు రోజుల్లోనే తెలిసింది. మరో ముక్కోటి జన్మలకైనా సరిపడా ప్రేమను నా షేర్మా ఆ ముప్పై ఏడు రోజుల్లో నాకందించాడు.

అసలు పెళ్ళి వయసు దాటిపోయిందని నిరుత్సాహపడిన నాలో పెళ్ళి ఆలోచన రేకెత్తించిందే షేర్మా. షేర్మా అంటే ఎవరో చెప్పనేలేదు కదూ. నన్ను ముప్పై ఏడు రోజుల పాటు ప్రేమసౌధంలో ఉర్రూతలూగించిన నా షేర్ సింగ్‌ను నేను ముద్దుగా పిలుచుకునే పేరు షేర్మా. అమ్మ కోపాగ్నికి గురై అమ్మ ప్రేమకు దూరమైన నన్ను నా షేరూ అచ్చం అమ్మలా లాలించాడు కనుకనే షేర్మా అయ్యాడు.

షేర్ సింగ్‌తో నా తొలి పరిచయం fbలో. నలభై రెండేళ్ల వయసున్నా నవ యవ్వనుడిలా వుoడే అతని ప్రొఫైల్ నన్నాకర్షించింది. మా పరిచయం స్నేహంగా మారింది. స్నేహంలో అతని నిజాయితీ నన్ను ప్రేమలోకి దింపింది. నేనతనిని మా పెళ్లిరోజునే మొదటిసారిగా చూడటం. షేర్మా మంచి స్పురద్రూపి. తల పైన పగిడీతో  ఆరడుగుల అతను ఆరుంబావు పొడవు కనిపించేవాడు. కోటేరేసినట్టుండే అతని పొడవైన ముక్కు ప్రత్యేక శిల్పి శ్రద్దగా చెక్కినట్టుండేది. దానితో పోటీ పడుతూ అతని గడ్డం అంతే కోసుగా ముందుకు పొడుచుకొచ్చినట్టుండేది. ఆ రెంటి మధ్యా విరబూసినట్టుండే అతని అందమైన దరహాసం నన్ను సర్వం మరిపించి నాకెంతో హాయినిచ్చేది. ఆకలిదప్పికలు, సమయమూ మరిచిపోయి అలా ఆ నవ్వును చూస్తూండి పోయేదాన్ని. కలువల్లాంటి అతని కళ్ళు, తీర్చి దిద్దినట్టుగా కనుబొమలు భలేగా వుండేవి. పచ్చటి మొహం పైన అల్లనేరేడు పళ్ళoటి కళ్ళు, నల్లటి మీసకట్టు, వలలో నిగనిగలాడే పొందికగా దువ్వి బిగించి కట్టిన దట్టమైన గడ్డం. నిఖార్సయిన సర్దారులా వుండేవాడు. ఈ పంజాబీ వాడితో నా జీవితం ముడిపడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.

మాది సత్సంప్రదాయ బ్రాహ్మణ వంశం. మడి ఆచారాలను ఆచరించే నిష్ఠాగరిష్ట వైదీకులం. నియోగులతో కూడా వివాహానికి వ్యతిరేకించే కుటుంబం మాది. శాఖ బేధానికే అంగీకరించని మా వంశాన్ని నేను మతాతీత వివాహంతో భ్రష్టు పట్టించాను. బ్రాహ్మణ సాంప్రదాయాలు పక్కన పెడితే కనీసం తెలుగు సాంప్రదాయమైనా తెలియనివాడితో పెళ్ళికి మా పెద్దలను ఒప్పించటానికి నాకు తాతలు దిగి వచ్చారు.

షేర్మా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గురుద్వారాలో పెళ్ళి చేసుకుందామన్నాడు. ముందే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న మా వాళ్ళను శాంతింప చేయటానికి షేర్మాను మా పద్దతిలో పెళ్ళికి ఒప్పించాను. అయితే 14 ఫిబ్రవరిన వాలెంటైన్స్ డే రోజునే పెళ్ళి చేసుకుందామన్నాడు. సిక్కు మతం వాడితో పెళ్ళికి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగుల ఆర్భాటం చేసి అభాసుపాలు కావటం నాన్నకు ఇష్టం లేదు. అతి దగ్గరి బంధువర్గం నలభై మందితో 14 ఫిబ్రవరిననే గుళ్ళో మా పెళ్ళి అయ్యిందనిపించారు మావాళ్లు.

పెళ్ళిరోజున షేర్మాకి ఎన్ని తిప్పలో. అతని తల్లితండ్రులు అతనితో పగిడీ తీయకూడదన్నారు. బాసింగం కట్టుకోవటానికి ఒక్కసారి తలపాగా తీయటానికి తెగ బాధపడిపోయాడు.

నాకు జీలకర్ర బెల్లం పగిడీ పైన పెట్టాలో, మండపంలో పదిమంది మధ్యా పగిడీ తీసి తల మీద పెట్టాలో తెలియలేదు.

పురోహితుడు సూత్రధారణప్పుడు పసుపుతాడుకి మూడు ముళ్ళు ఇలా వేయాలంటూ చూపించి ఇచ్చి షేర్మాను లేచి నిలబడి వేయమన్నాడు. పాపం షేర్మా పురోహితుడు చెప్పినట్టే లేచి నిలబడి వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ అగ్ని సాక్షిగా మూడు ముళ్ళు వేసేసాడు. అయితే నా మెడలో కాదు… గాలిలో. అందరూ నిశ్చేష్టులైపోయారు. పగలబడి నవ్వారు.

“ఖర్మ… ఖర్మ… ఇంతకన్నా అప్రాచ్యం వుంటుందా… మాంగల్యం అర్థం తెలియనివాడితో పెళ్ళి” అంటూ నాన్న తల బాదుకున్నారు.

షేర్మా “పురోహితుడు చూపించినట్టే చేసానుగా” అనడిగాడు అమాయకంగా.

“దుల్హన్ మెడలో కట్టాలయ్యా…” అన్నారెవరో.

“వో భీ తో దుల్హన్ కే గలే మే నహీ బాందా థానా…” సంకోచంగానే అన్నాడు.

“సర్దారుల పైన జోకులు వూరికే రాలేదు మరి…” ఎవరో కిసుక్కున నవ్వుతూ అన్నారు.

నా షేర్మాను అలా అవమానానికి గురి చేసినందుకు నేను చాలా బాధ పడ్డాను.

భోజనాల వేళప్పుడు షేర్మా కంచంలో రెండు చేతులు పెట్టి తింటుంటే నాన్నగారు “ఇంతకన్నా అశుద్ధం వుంటుందా… ఎడం చేత్తో అన్నం కలపటం..” అంటూ అసహ్యంగా చూసారు షేర్మా వంక.

రోటీలు, పరోటాలు, నాన్ తినేవాడికి అన్నం వడ్డించి అదెలా తినాలో తెలియక అతను అవస్థ పడుతుంటే నాన్నగారి ఆ చూపులకు నా మనసు చివుక్కుమంది.

భోజనాల వేళ కంచంలో సాంబారు పోస్తే ‘యే దాల్ హై క్యా’ అని అడిగాడు షేర్మా నన్ను.

“లేదు సాంబారు, ముక్కలతో రుచిగా వుంటుంది, అన్నంలో కలుపుకుని తినండి..” అని చెప్పాను. షేర్మాకు నా మీద ఎంత ప్రేమoటే ఏమి చెప్పినా అది తూచా తప్పకుండా చేసేస్తాడు.

తరువాత కొంతసేపటికి అతని వైపు తిరిగి చూసి నేను కంగారు పడ్డాను. మొహమంతా ఎర్రగా అయిపోయి నుదుటి మీద చమటలు పోసి ఏదో అవస్థ పడుతున్నాడు. ఏమయ్యిందంటూ ఆదుర్దాగా అడిగాను.

సాంబారులో ములక్కాడ నమిలి మింగలేక పోతున్నానని దిగులుగా అన్నాడు. మింగటమెందుకు, దానిని నమిలి ఊసేయాలని చెప్పాను.

“నువ్వే చెప్పావుగా ముక్కలు రుచిగా వుంటాయి తినమని. లేకిన్ జబ్ ఖానే వాలా చీజ్ నహీ హై తో సాంబార్ మే క్యూ డాలా…” అంటూ పసిపాపలా ప్రశ్నించాడు.

“అది రుచి కోసం వేస్తారు, నమిలి ఊసేయాలి” అన్నాను.

“షుక్రియా ఆలియా, ముజే బతాదీ… ముజే క్యా పతా… నేను నమిలి మింగుదామని ప్రయత్నిస్తుంటే, గొంతులో దిగటం లేదు… బయటకు వస్తోంది..” అని కాస్త కుదుట పడ్డాడు.

ఆలియా అంటే ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఎర్రగా కందిపోయిన అతని మొహం వంక జాలిగా చూసాను. ఆ క్షణం ఆ ఆరడుగుల పసివాడి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలనిపించింది.

మొత్తం అందరికీ అతను చిత్రంగా అనిపిస్తే నాకతడు అపురూపంగా అనిపించాడు.

అతనిని అతని అలవాట్లనూ భరించలేనంటూ నాన్నగారు పెళ్ళి పందిట్లోనే నా అప్పగింతలు చేసేసి నాకు తిలోదకాలిచ్చేసి తలస్నానం చేసేసారు.

మొగుడైన పాటియాలా ప్రియుడితో మా హైదరాబాదులోనే కొత్త కాపురం పెట్టాను. సరిగ్గా ముప్పై ఏడు రోజుల కాపురం. దానిని కాపురం అనటం కన్నా హనీమూన్ అనటమే  భావ్యం. ఇంక ఈ జన్మకు కన్యగానే కడదేరి పోతాననుకున్న నా వెలిసిపోయిన జీవితాన్ని షేర్మా  ముప్పై ఏడు రోజులపాటు  ఫ్లోరొసేంట్ రంగుల్లో ముంచి తేల్చాడు. జీవితానికి రంగు, రుచి, వాసనలుంటాయని అప్పుడే తెలుసుకున్నాను. మా ఏడడుగుల బంధానికి ఇంద్ర ధనుస్సు రంగుల్లో మధురాతిమధుర అగరసొగసుల గుబాళింపుతో షేర్మా కొత్త కోణం చూపించాడు.

ఒకసారి షేర్మాను అతనికి తెలియని బియ్యం తెమ్మని కొట్టుకి పంపాను. షాపువాడిని “బిల్కుల్ నయా తాజా చావల్ చాహియే..” అని అడిగి మరీ కొత్త బియ్యం కొని తెచ్చాడు. బియ్యం ఎప్పుడూ పాతవి అడిగి కొనాలని చెబితే విస్కీలా బియ్యం పాత పడే కొద్దీ రుచిగా వుంటాయా అని అమాయకంగా అడిగాడు. అంతంత మాత్రంగా వంటలు చేసే నేను కొత్త బియ్యంతో జావ ముద్ద చేసి పెట్టినా షేర్మా ఇష్టంగా తినేవాడు.

ఎలా వుందని అడిగితే “మేరీ గుడ్డి పటోలా జో భీ బనాయేగి ఎక్ నంబర్…” అనేవాడు.

గుడ్డి పటోలా అంటే అర్థం ఏమిటో తెలియక కారం ఘాటుకి అతని కళ్ళమ్మట ముక్కమ్మట కారుతున్న నీటిని చూసి కంగారు పడేదాన్ని.

షేర్మాకి అస్సలు కారం పడేది కాదు. మామూలుగా నేనూ కారం తక్కువే తింటాను అయితే అతనికి మరీ చప్పగా అలవాటు. నేను వండినవి ఒగర్చుకుంటూ కష్టబడి తినేవాడే తప్ప కనీసం కాస్త కారం తగ్గించమని చెప్పేవాడు కాడు. అలా చెప్పటం కూడా నొప్పించటం అనుకునేంత సున్నిత మనస్కుడు.

షేర్మా నన్నెప్పుడూ సల్వార్ సూట్ వేసుకోమని నిర్దేశించలేదు.

ఏది వేసుకున్నా “మేరీ గుడియా రాణి… మేరీ సోనే కీ కుడీ…” అంటూ ముద్దుల వర్షం కురిపించేవాడు. నన్ను మరీ పసిపిల్లను చేసి ముద్దు చేసేవాడు.

ఎంతో విజ్ఞత కలిగి పెద్దరికంతో ప్రవర్తించే ముప్పై ఏడేళ్ల నేను అతని సమక్షంలో మూడేళ్ల పసిపాపలా మారి అల్లరి చేసేదాన్ని. తమ్ముడినీ చెల్లెళ్లనూ వర్షంలో తడవకుండా నిర్భంధించే నేను అతని ముందు వానలో పురి విప్పిన మయూరిలా నాట్యం చేసేదాన్ని. గారం చేసే వారుంటే అల్లరి ఎంత అందమో అప్పుడే తెలిసింది.  అతడు నన్ను  వారించి తడిచిన నా తల తుడుస్తూ నన్ను తన కౌగిలిలో వెచ్చబెడుతూ లాలిస్తే గువ్వలా అతనిలోకి ఒదిగిపొయేదాన్ని.

ప్రేమించబడటం ఎంత అద్భుతంగా వుంటుందో, అదీ షేర్మాతో ప్రేమించబడటం ఎంత అదృష్టమో అతని సహచర్యం చెప్పింది.  ప్రేమ  లోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ ఆ ముప్పై ఏడు రోజులు మూడు క్షణాల్లా గడిపేశాను.

షేర్మా పటియాలాలో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఎక్కువగా వర్క్ ఫ్రం హోమ్ చేసేవాడు. నా కోసం హైదరాబాదుకు పోస్టింగ్ కోసం ఆర్జీ పెట్టుకున్నాడు. మా పెళ్ళయిన నెలకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు వచ్చేసాయి. అయితే కంపెనీవారు సౌత్ ఇండియాకి ట్రాన్స్‌ఫర్ అంటూ హైదరాబాదుకు బదులు చెన్నైకి చేసారు.

చెన్నైకి కాపురం మార్చటం గురించి తరువాత ఆలోచించవచ్చని ముందుగా ఒక్కసారి చెన్నై  ఆఫీసులో రిపోర్ట్ చేసి వచ్చేసి వర్క్ ఫ్రం హోం హైదరాబాదు నుండి చేస్తానని షేర్మా 22 మార్చిన నా పెళ్ళయిన ముప్పై ఏడు రోజులకు బయిలుదేరి చెన్నై వెళ్ళాడు.

చెన్నై చేరగానే షేర్మా ఫోన్ చేసాడు.

“ఇధర్ కోయీ న అంగ్రేజీ బోల్తా న హిందీ బోల్తా… మై బడా పరేషాన్ హూ ఆలియా…” అన్నాడు బాధపడుతూ.

“పోనీలే, అక్కడ మీరేమీ కాపురం చేయబోవటం లేదు… ఒక్క రోజేగా..” అని సముదాయించాను.

23న రిపోర్టింగ్ అయ్యాక 24న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ అవ్వమన్నారని ఆగాడు. 24న మీటింగ్ అయ్యేసరికి రాత్రి అయిపోయిందని 25న ఉదయం బయిలుదేరి వచ్చేస్తానని చెప్పాడు.

అంతే. తరువాత ఇక నేషన్ వైడ్ లాక్‌డౌన్‌తో రాలేకపోయాడు.

భాష తెలియని వాళ్ళ మధ్య నా షేర్మా ఎన్ని అవస్థలు పడ్డాడో తెలియదు. నేను విని బాధ పడతానని ఏమీ చెప్పేవాడు కాడు. పదిహేను రోజుల పాటు క్షణం వదలకుండా రాత్రింబవళ్ళు మాటాడాడు. పదిహేను రోజులయ్యాక అతని ఫోను నాట్ రీచెబుల్ అయ్యింది.  ఇప్పటికీ అన్ రీచబులే…

నాన్నగారు “fb స్నేహాల పెళ్ళిళ్ళు ఇలాగే ఏడుస్తాయి… మోజు తీరిపోయి చక్కా చెక్కేసాడు మోసగాడు” అంటూ నా షేర్మాను నానా శాపనార్ధాలు పెడుతున్నారు.

“ఏనాడయితే గాలిలో మూడు ముళ్ళు వేసాడో అప్పుడే అనుకున్నా అది అశుభమని ఆ పెళ్ళి పెటాకులేనని…” అంటూ అంత కోపంలోనూ అమ్మ దుఃఖపడుతోంది.

అసలతను ఏ పరిస్థితుల్లో చెన్నైలో ఇరుక్కుపోయాడో, ఏమయిపోయాడో సహృదయంతో ఆలోచించేవారే లేరు. తమిళం మాటాడలేని షేర్మాను కరోనా నెపంతో ఏ ఆసుపత్రి పాలు చేసేసారో… అతని ఫోను ఎవరు తీసేసుకున్నారో… అసలేమయ్యిందో.

నా మనసు గట్టిగా చెబుతుంది అతను నన్ను మోసం చేయలేదు… ఎప్పటికీ చేయలేడు… మరి నా షేర్మా ఏమయ్యాడు..?

లాక్‌డౌన్ తీసేశారు. విమానాలు, రైళ్లు, బస్సులు తిరుగుతున్నాయిప్పుడు.

నా షేర్మా ఆచూకీ తెలియటంలేదు. షేర్మా నా నుండి దూరంగా వుండలేడని నాకు తెలుసు.

అతనికి ఏదైనా కీడు జరిగి వుంటుందేమోనన్న ఊహే నా గుండెను బద్దలు చేసేస్తోంది.

అతనితో గడిపిన ముప్పై ఏడు రోజుల ప్రేమానుబంధపు స్మృతులు నెమరేసుకుంటూ నా షేర్మా కోసం ఈ మనసూ కళ్ళూ ఎదురు చూస్తూనే వుంటాయి నేను బ్రతికున్నంత కాలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here