జానపద గేయం! సహజ రమణీయం!!

0
2

[dropcap]జ[/dropcap]నపదం అంటే పల్లె. అందులో ఉండే వాళ్లు జానపదులు. వాళ్లు పాడుకొనే పాటలు జానపద గేయాలు. ఇంగ్లీషులో Folk Songs అంటారు. ఉత్తరాది వాళ్లు వీటిని ‘లోక్‌గీత్’ లంటారు. భారతంతో కర్ణ, శకుని, దుర్యోధనులు మంతనాలు చేసేటప్పుడు ‘జానపదుల్ పురీజనులు సంతసమున్ బ్రమదం బెలర్పనీ/దైనశుభోదయంబ హృదయంబుల గోరుచునున్నవారు’ అని ఉంటుంది. అర్బన్/రూరల్ అన్న తేడా ఇక్కడ స్పష్టం.

ఈ సాహిత్యం మౌఖికంగానే ఉంటుంది. అంటే వ్రాయబడదు. కథలు, సామెతలు, పొడుపు కథలు, మాండలీకాలు, యాసలు, నుడికారాలు, తిట్లు అన్నీ ఇందులో చేరతాయి. వారి వృత్తులు, సాంఘికాచారాలను కూడా ఈ పాటల్లో ప్రస్తావిస్తారు. ఇవి ప్రదర్శించడానికి వీలుగా ఉంటాయి. Performing Arts అన్నమాట. ఇందులో గేయం, వచనం, రూపకం అనే మూడు ప్రక్రియలుంటాయి.

పద్యం కన్నా ముందే పదం పుట్టిందంటారు. నాగరికత ప్రారంభంలోనే నాట్యం పుట్టింది. కొన్ని మాటలు లయతో అంటూ ఆడుతూ తమ కష్టాన్ని మరచిపోయేవారు గ్రామీణ శ్రామికులు. ఈ పాడ చూడండి. ‘కొండన్న మాదన్న నారికేళో, వేటపోయే రాములు నారికేళో/బంగారి బొడ్లో బాకు, పిడికెడు వడ్లు తీసి/కొనగోర వొలిచే చిక్కుడు పువ్వులు/సిరిగె తోమి కొనగోర బియ్యమొలిచె/మా చేత పోటేసిరా, అమ్మలావాయమ్మ/నీళ్లైన ఇయ్యవమ్మ, మీ అమ్మ మరదల/నేను ఉండా మరది’. ఇది ఒక గుంపు వ్రాసింది. దీన్ని పాడుతూ ఆడేటప్పుడు చతురశ్ర గతికి నిరోధకములైన పదాలను, వారి కనుకూలంగా మార్చుకుంటారు. అప్పుడప్పుడు యతులు, ప్రాసలు కూడా ‘సహజంగా’ పడతాయి.

జానపద గేయాలకు ప్రత్యేకముగా కవులుండరు. అది సమిష్టి సృష్టి. దానికొక నియమిత స్వరూపముండదు. ఇవి జనం నోళ్లలోనే జీవిస్తాయి. ప్రసిద్ధి పొందుతాయి. దీన్నే అనుశృత ప్రచారం అంటారు. వీటిలో ఆత్మపరత్వం (Subjective Element) ఎక్కువ. ‘బొబ్బిలిపదం’ వ్రాసినవాడు పెద్దాడ మల్లేశం అని ఎందరికి తెలుసు? అయినా ఆ వీరగాథ పరమ ప్రసిద్ధం. కారణం దానిలోని సార్వజనీనత. “రామ రామ అనంతమాలము రాజ్యమేల లేము – చచ్చిన వారికి వీరస్వర్గము ఇక్కడ కలుగును” అంటాడు బొబ్బిలిపులి తాండ్ర పాపయ్య! ‘కాటమరాజు కథ’ను వ్రాసినవాడు పినయెల్లడు. దానిని పాడే ప్రతి గొల్లడు వీరావేశంతో ఆ పదం తనదే అనుకుంటాడు. అలా రసికులను సహృదయులను ఆనందంతో ఓలలాడించేవే జానపదగేయాలు.

శ్రీయుత బిరుదరాజు రామరాజు గారికి కృతజ్ఞతలతో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here