Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-77: జాణవులే.. వరవీణవులే..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే వదిన ఫోన్ చేసి “ఏ మనిషికైనా కోపం వచ్చిందని ఎలా తెలుస్తుందంటావ్?” అంటూ మింగుడు పడని ప్రశ్న ఒకటి అడిగింది.

“పొద్దున్నే ఈ ప్రశ్నావళేంటి వదినా..” అనంటే

“ఇప్పుడు అందరూ యిళ్ళల్లో వుంటూ దెబ్బలాడుకుంటున్నారు కదా! ఒకరి మీద ఒకరికి కోపం వస్తేనే కదా దెబ్బలాడుకుంటారూ.. అలా కోపం తెచ్చుకోకూడదూ అని నా యూ ట్యూబ్ చానల్లో నేను సలహాలు చెప్పడం మొదలెట్టేనుకదా. అక్కడ కొంతమంది ఏమడుగుతున్నారంటే “అసలు ఎదుటి మనిషికి కోపం వచ్చినట్టు ఎలా తెలుస్తుందీ.. రాకుండా జాగ్రత్త పడడం ఎలా!” అని.

నాకేమిటో ప్రశ్న అర్థం అయీ కానట్టుంది. వెంటనే “నీకన్నా బాగా తెల్సా వదినా నాకూ..” అంటూ దీర్ఘం తీసేను.

“తెలీదనుకో.. కానీ గబుక్కున ఏవీ గుర్తు రావట్లేదు నాకు.. నీకేవైనా గుర్తొస్తాయేమోననీ..” అంది వదిన ఏమాత్రం తగ్గకుండా..

ఇంక నేను విజృంభించేసేను.

“అదే వదినా.. ప్రబంధాల్లో అయితే ఆడవారికి అలగడానికి అలకాగృహం అంటూ ఒకటుండేది. సత్యభామని గుర్తు తెచ్చుకో.. తర్వాత రాజులకాలంలో కూడా రాణీలు అలుగుతుండేవారు. వాటికోసం ప్రత్యేకంగా మందిరాలు కూడా కట్టించేవారుట. అవన్నీ చదివేకదా మునిమాణిక్యంగారు ‘కాంతంతో ప్రణయకలహం’ అంటూ జనరంజకమైన కథ రాసారూ..”

“అబ్బా.. అవన్నీ ఆడవాళ్ళకి మాత్రమే కోపాలొచ్చినప్పుడు. ప్రబంధాలూ, చరిత్రలూ వదిలెయ్యి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడా మగా యిద్దరికీ కోపాలొస్తున్నాయి. ఆడైనా మగైనా కోపమొస్తే కొంతమంది గట్టిగా అరిచేస్తారు. ఇంకొంతమంది సణుక్కుంటారు. ఇంకొంతమంది మూతి బిగించుక్కూర్చుంటారు. మరికొంతమంది మొహం ధుమధుమలాడించుకుంటూ మండుతున్న కొరకంచులా వుంటారు. ఇవేనా.. ఇలాంటివి యింకేమైనా వున్నాయా.. అసలు ఇలాంటివేమీ ప్రదర్శించకుండానే లోలోపలే కోపంతో ఉడికిపోయేవాళ్ళెలా వుంటారు? అలాంటివాళ్ళతో ఎదురుగావున్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలి?”

గొంతు తిరక్కుండా వదిన చెప్పింది వింటున్న నేను తెల్లబోయేను.

“ఇంకా ఏవుంటాయొదినా.. నువ్వే బోల్డు చెప్పేసేవ్..” అన్నాను.

“ఊహు కాదు.. ఇంకా వుంటాయి. అవేమిటో, అలాంటప్పుడు ఎదుటివాళ్ళు యేం చెయ్యాలో ఆలోచించి తొందరగా చెప్పు.” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన.

ఇదెక్కడి బలవంతం.. తెలీదు మొర్రో అంటుంటే వినిపించుకోదేం అని వదిన మీద విసుక్కున్నాను కానీ తర్వాత దాని గురించి ఆలోచించకుండా వుండలేకపోయేను.

అసలు కోపం ఎందుకొస్తుందీ.. తనకి కావల్సినది దొరకకపోతేనో, తనకి నచ్చని పని జరుగుతుంటేనో వస్తుంది. అలాంటి సమయంలో ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని, పరిస్థితులని అర్థం చేసుకుని సమాధానపడితే బాగానే వుంటుంది. కానీ అలా అర్థం చేసుకునేవాళ్ళు నూటికి పదిశాతం కూడా వుండరేమో. ఎంతసేపూ తనక్కావల్సిందేదో దొరకలేదనుకునే బాధలో విచక్షణాజ్ఞానం లేకుండా ఎదుటివారి మీద కోపగించుకునేవాళ్ళే ఎక్కువమందుంటారు.

ఈ రోజుల్లో అంత లేదేమోకానీ మా చిన్నప్పటి రోజుల్లో మగ మహారాజులకి చెప్పలేనంత కోపం వుండేది. ఇంట్లో జరిగే ప్రతి తప్పుకూ తనకి లోకువైన భార్యని కారణం చేసేసి, ఆ యింటి ఇల్లాలి మీద విరుచుకు పడేవారు ఆకాలం మొగుళ్ళు కొందరు. పాపం.. ఆ మహాతల్లులు ఎలా భరించేవారో..

కోపం వస్తే తల గోడకేసి కొట్టేసుకోవడం, చొక్కాలు చింపేసుకోవడంలాంటివి చేస్తారని కొన్ని సినిమాల్లో చూపించేరు..

ఇలా కోపం బైటకి కనిపించేసినప్పుడు ఎదుటి మనిషి ఇంక వాదులాటేమీ పెట్టుకోకుండా నెమ్మదిగా అక్కణ్ణించి తప్పుకుంటే అలసిపోయేదాకా ఆ మనిషి కొట్టుకుని ఆ తర్వాత శాంతిస్తాడు….లేదూ తనని అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు ఆ యిల్లాలిని మరింత హింస పెడతాడు.

వామ్మో.. ఏదో కోపమనుకున్నాను కానీ… ఆలోచిస్తుంటే దీనిలో చాలా విషయమే వున్నట్టుంది. అసలు వదిన పొద్దున్నే నాకీ తలనెప్పి ఎందుకు పెట్టినట్టూ…నాకు వదినమీద ఖోపం వచ్చేసింది.

వెంటనే అన్నయ్య నంబర్‌కి ఫోన్ చేసి, వదిన నాకు పెట్టిన పరీక్ష గురించి చెప్పేను.

అన్నయ్య పకపకా నవ్వేసేడు.

“ఆ పాఠాలన్నీ నీక్కాదులే చెల్లాయి.. నాకూ..” అన్నాడు నవ్వుతూ.

నేనాశ్చర్యపోయేను. అదేంటన్నయ్యా అనడిగినదానికి యిలా సమాధానం చెప్పేడు.

“ఈమధ్య మీ వదినకి యిల్లూ, మొగుడూకన్న ఆ యూట్యూబ్ ఛానలే యెక్కువైపోయింది. ఇంటినీ, నన్నూ పట్టించుకోకపోవడం మాటటుంచి తనే సరిగ్గా తిండీ నిద్రాకూడా లేకుండా అందులో మునిగిపోయింది. అలాక్కాదూ, అన్నింటికీ టైము సరిగ్గా ఏర్పాటు చేసుకో అని యెంతో చెప్పి చూసేను. ఊహు.. వినలేదు. నెమ్మదిగా చెప్పి చూసేను. వినలేదు. గట్టిగా చెప్పేను వినలేదు. ఇంక నాకేం చెయ్యాలో తెలీక మీ వదిన వాడిన బ్రహ్మాస్త్రమే వాడేను..”

“ఏంటన్నయ్యా.. అదీ..” ఆత్రంగా అడిగేను.

“అదే చెల్లాయి.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు మీ వదిన నామీద ప్రయోగించిన మౌనవ్రతమే తనమీద ప్రయోగిస్తున్నాను… తనేమడిగినా మౌనమే సమాధానంగా యిస్తున్నాను నిన్నట్నించీ. ఇప్పటికి ఆమెకి అర్థమయి యేం చెయ్యాలో తెలీక పొద్దున్నే నీకు ఫోన్ చేసింది.”

అప్పటికి నాకు తెల్సింది వదిన యెందుకు ఫోన్ చేసిందో..

“మరి వదిన అలా మౌనవ్రతం చేస్తున్నప్పుడు నువ్వేం చేసేవాడివి?”

“నీమొహంలా వుంది ప్రశ్న. మౌనవ్రతం చేస్తున్నవారిని యేమీ అనలేం. వాళ్ళు వాదించరు, దెబ్బలాడరు…వాళ్ల పని వాళ్ళు నిశ్శబ్దంగా చేసేసుకుంటారు. మీ వదిన అలా చేసినప్పుడు నేను తనకి ఇష్టమైనది యేదైనా కొని తెచ్చేవాణ్ణి. అంతే.. మామూలైపోయేది.”

హా.. పరిష్కారం దొరికేసింది.. ఈ సంగతి వెంటనే వదినకి చెప్పేస్తే అన్నయ్య కిష్టమైనవి చేసి పెట్టేస్తుంది. ఈ సంగతి చెప్పినందుకు వదిన నన్నెంత మెచ్చుకుంటుందో అనుకుంటూ “సరే అన్నయ్యా.. వుంటా మరి..” అని ఫోన్ పెట్టెయ్యబోయేను.

అట్నించి అన్నయ్య “ఆగాగు.. మీ వదిన నా కిష్టమని చక్రపొంగలి చేసింది. వేడివేడిగా భలే రుచిగా వుంది. పనయ్యేక యిలా వచ్చెయ్యి.. తిందూగాని..” అని ఫోన్ పెట్టేసేడు.

హమ్మ వదినా.. నీకింకొళ్ళు సలహాకూడా చెప్పాలా అని హాశ్చర్యపడిపోతూ వదిన గురించి “జాణవులే.. వరవీణవులే..” అంటూ పాడేసుకున్నాను.

Exit mobile version