Site icon Sanchika

జా(సూ)తకం

[dropcap]మం[/dropcap]గతాయారు హడావుడిగా బయలుదేరి బస్టాండుకు చేరింది. ఉదయాన్నే ఆమె రెండవ మరిది గోపాలం కాలం చేశాడని తెలియగానే అల్లుడి చేత టికెట్టు బుక్ చేయించుకుని మచిలీపట్నానికి ప్రయాణం కట్టింది. గట్టిగా యాభై కూడా నిండలేదు గోపాలానికి, మాయదారి గుండెపోటు అతడిని ఎగరేసుకు పోయింది. భర్త తమ్ముడు గనుక  సూతకం తప్పదు. సూతకంతో కూతురి ఇంట్లో ఉండడం ఎందుకులెమ్మని ఒక పదిహేను రోజులు మీ తిప్పలు మీరు పడండని సంచి సర్దుకుని మరీ బయలుదేరింది మంగతాయారు.

మంగతాయారుకు పది సంవత్సరాల క్రితం భర్త భజగోవిందం బాల్చీ తన్నేశాడు. అప్పటినుంచి ఒక్కగానొక్క కూతురు రజని దగ్గరే ఉంటున్నది ఆమె. మగతోడు లేకుండా ఒంటరిగా ఉండడం ఎందుకని, బంధుజనమంతా సతపోరి ఆమెను కూతురి దగ్గరకు చేర్చారు. ఒక్కతే కూతురు ఉన్నచోట చేసుకుంటే అప్పనంగా ఆస్తంతా అనుభవించవచ్చన్న అల్లుడు రంగనాథానికి, పెళ్ళయిన ఏడాదికే, ఆస్తితో పాటు అత్త బాధ్యత కూడ అతుక్కుంది. కక్కలేక మింగలేక తల ఆడించి అత్తగారిని ఇంటికి తెచ్చుకున్నాడు రంగనాథం. అరవై సంవత్సరాల వయసులో ఆనందంగా జీవించలేకపోయాననే బాధ తొలుస్తున్నా తన జాతకమింతేనని సర్దుకుని కూతురు పంచ చేరింది మంగతాయారు. అప్పటినుంచి ఆమె జీతం, భత్యం లేని వంటమనిషిగా మారిపోయింది. కమ్మటి భోజనం రుచి మరిగి రంగనాథం కూడ సర్దుకుపోయాడు.

రెండు సంవత్సరాలు గడిచే సరికి మంగతాయారు వంటమనిషితో పాటు, కూతురి పిల్లలకు ఆయాగా కూడ ద్విపాత్రాభినయం చేయవలసి వచ్చింది. దాంతో ఇల్లు కదిలి బయటకు వెళ్ళే అవకాశమే లేకుండా పోయింది ఆమెకు. ఇదిగో ఇప్పుడు అటుయిటుగా అయిదేళ్ళ తరువాత మరిది మరణంతో ఒక పదిహేను రోజులు బయటగాలి పీల్చుకునే అవకాశం దక్కింది. మరిది పోయాడనే బాధ ఒకవైపు ఉన్నా, జైలు నుంచి బయటపడ్డాననే ఆనందం మరోవైపు ఆమెకు ఎనలేని ఆనందాన్ని ఇస్తున్నది.

***

“అక్కయ్యా, హైదరాబాదు నుంచి శ్రమ అనుకోకుండా ఇంతదూరం వచ్చావు. మొదటి మాసికమైన దాకా అయినా ఉండు. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది” మంగతాయారును పట్టుకుని అడిగింది గోపాలం భార్య భారతి.

“అన్నాళ్ళు కాదులేవే. సూతకం అదీ వెళ్ళిపోయి దేవుడికి పెట్టుకున్న దాకా ఉంటాను. అప్పటికే పదిహేను రోజులు ఉన్నట్టుంటుంది. అవతల పిల్లలతో రజని ఇబ్బంది పడుతుంది కదా. నువ్వే గుండె దిటవు చేసుకోవాలి” అని సర్దిచెప్పింది భారతికి.

“అప్పుడే రెండు రోజులు అయిపోయాయి. అంటే ఇంకో పదమూడు రోజులు ఉంటావా. సరేలే అక్కయ్యా. నా గదిలోనే ఉండు వెళ్ళేదాక” అంటున్న భారతిని భుజం తట్టి ‘సరే’ అన్నది మంగతాయారు.

ఇంతలో “పెద్దమ్మా అక్కయ్య ఫోను చేసింది” అంటూ ఫోను తెచ్చిచ్చింది భారతి కూతురు.

“హలో రజని. ఏమిటే ఇప్పుడు ఫోను చేశావు” అడిగింది మంగతాయారు.

“అక్కడ బాబాయి దహనసంస్కారాలు అయిపోయాయి కదా. ఇక్కడ ఆయనను ఆఫీసు పనిమీద వేరే ఊరికి పంపుతున్నారు. నేను పిల్లలను పెట్టుకుని ఒక్కతినే ఉండలేను. నువ్వు వెంటనే వచ్చెయ్. కావాలంటే తరువాత వెళుదువు గాని” అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పెట్టేసింది రజని.

వళ్ళు మండింది మంగతాయారుకు. ‘నాలుగురోజులు ప్రశాంతంగా ఉండనివ్వరు వెధవ సంతానం. సూతకం పేరు చెప్పి ఈ పదిరోజులు వాళ్ళనే వండిపెట్టమంటాను. అప్పుడు కుదురుతుంది వాళ్ళరోగం. ఎందుకు రమ్మన్నామా అని ఏడుస్తారు’ అనుకుంటూ ఎలాగోలా తోటికోడలికి సర్దిచెప్పి తిరుగు టపా కట్టింది మంగతాయారు.

***

“అత్తయ్య గారూ.. ఇబ్బంది పెట్టామేమో మిమ్మల్ని. పిల్లలు మీరు లేకపోయేసరికి బిక్కమొహం వేశారు” అని పిల్లల వైపు తిరిగి “అమ్మమ్మ వచ్చేసిందిరా. ఇక మీకు కావలసిన రవ్వదోశె వేయించుకుని తినండి” అన్నాడు రంగనాథం.

“అదేంటి అల్లుడు గారు. నాకు సూతకం. ఈ పది రోజులు రజనీనే వంట చేయాలి” మెల్లగా బాణం వదిలింది మంగతాయారు.

“అక్కర్లేదమ్మా. ఈ పదిరోజులు మాకు కూడ సూతకమే. నువ్వటు వెళ్ళగానే మాకు ఫోను వచ్చింది. మావారి పెదనాన్న గారు పోయారట. మాకు కూడ సూతకమని చెప్పారు. అందుకనే ధైర్యంగా నిన్ను రమ్మన్నాము. నీకు, మాకు అందరికీ ఒకే రోజు సూతకం పోతుంది” అంటూ నా చేతిలో సంచి అందుకుంది రజని.

ఏడుపొచ్చినంత పనయింది మంగతాయారుకు. సూతకం కూడ తన జాతకాన్ని మార్చలేకపోయింది. ఇక మరణం వరకు నాకు ఈ రణం తప్పదనుకుంటూ వంటగది వైపుకు దారితీసింది, పాపం మంగతాయారు.

Exit mobile version