[dropcap]చం[/dropcap]దమామకు
‘రావే’ పిలుపు పరిపాటి,
పాపాయి నవ్వుల ప్రహసనానికి.
తారలతో నిశి రాజు
మేల మాడే సమయానికి
డాబామీదకు జాబిలిగా
వచ్చి వాలి పోతుంది
అమ్మ చేతి గోరు ముద్దల జానపదానికి.
దళసరి కాటుక పూతల పగ్గం తోటి,
కను పించని గుండె లోతు
ఊటబావి నీటిని
తోడు కొస్తుంది
కనుగుడ్ల గిలక తోటి,
వినోదాల చేద వేసి.
ఆమెకు సాటి రూపం తోటి.
చీరకట్టు అలవాటయింది
బొడ్డు కనిపించేటట్టు గుచ్చిన కుచ్చిళ్ళకి,
మెడనునుపుల
దిగువకు కుట్టించుకున్న రవికె
అతికినట్టుగ అమరింది
సాఫీ ఛాతీకి బిగిసిన
రబ్బరు బంతుల వక్షానికి,
కడుపును చేత బట్టుకుని
వలసవచ్చిన పేదగూటికి
జరుగుబాటు బ్రతుకు తెరువుకి,
ధైర్యమిచ్చిన మగువ తనానికి,
కపటం కాని నటనకి,
ప్రముఖుడిప్పుడు
పురస్కారాలను అందుకోడానికి.
అప్పు పడ్డాడు అర్ధనారీశ్వరానికి
రతి కళ్ళముముందు
బూడిదవుతుంటాడు
ఆమెకు మాత్రమే కనిపించే కాముడు.
ఆనాడు విష్ణుమూర్తికి తప్పలేదు
మోహిని అవతారానికి
అమృతం పంచడానికి
నారీ చైతన్యానికి,
అపురూప లావణ్యానికి.
అంజలి ఘటిస్తున్నాడు
జబర్దస్త్ శివుడిప్పుడు,
అతివ అరువిచ్చిన గౌరవానికి.