జగద్గురువే అన్నయ్య

0
3

[dropcap]కృ[/dropcap]ష్ణాపురంలో ఒక పేద మహిళ, ఆమె 6 సంవత్సరాల కొడుకుతో జీవిస్తుంది. భర్త లేడు. జీవనం కోసం ఆమె ఆవులను సాకుతూ, వాటి పాలను గ్రామంలోను, పక్క గ్రామంలోను అమ్ముతూ జీవిస్తుంది.

ఆమె పేరు యశోదమ్మ, కొడుకు పేరు కన్నయ్య. యశోదమ్మ గొప్ప కృష్ణ భక్తురాలు. ప్రతి రోజు పొద్దున్నే, కృష్ణుడుని పూజించిన తరువాతే, మిగతా పనులు చేస్తుంది. కన్నయ్య ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటాడు. పూజు పూలు తీసుకొని రావటం, పూజగది శుభ్రం చేయటం లాంటివి చేస్తుంటాడు.

కన్నయ్యకి విచారంగా ఉంటుంది. నేను అమ్మ తప్ప మాకు ఎవరూ లేరా అని బాధ పడుతూ ఉండేవాడు. తల్లిని అడిగితే, ఆమె చెప్పింది “నీకు ఒక అన్నయ్య ఉన్నాడు” అని. కృష్ణుడి విగ్రహం చూపించి.. “అతనే నీ అన్నయ్య” అని చెప్పింది. అప్పటి నుండి కన్నయ్య, కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని “అన్నయ్యా.. అన్నయ్యా..” అని పిలుస్తూ ఉండేవాడు.

ఒకరోజు యశోదమ్మకి జ్వరం వచ్చింది. మరి పాలు ఎలా ఇస్తుంది అందరికీ.. అప్పుడు కన్నయ్య అన్నాడు.. “అమ్మా, ఈరోజు నేను వెళ్ళి అందరికీ పాలు పోసి వస్తాను” అని. కానీ యశోదమ్మ “వద్దు నువ్వు చిన్న పిల్లవాడివి.. పక్క గ్రామం వెళ్ళాలి అంటే అడవి దాటాలి” అని అంది. కానీ కన్నయ్య ఒప్పుకోలేదు. “తొందరగా వెళ్ళి వస్తానమ్మా..” అన్నాడు. అప్పుడు యశోదమ్మ “నీకు భయం వేస్తే అన్నయ్యని తలుచుకో..” అని చెప్పింది.

కన్నయ్య సరేనని చెప్పి పాలు ముందు వాళ్ళ గ్రామంలో పోసి, తరువాత అడవి దాటుకుంటూ పక్క గ్రామంకి వెళ్ళాడు.

ఆ గ్రామంలో అందరికి పాలు పోసాడు. ఎంతైనా చిన్న పిల్లవాడు కదా.. అక్కడ ఆ గ్రామంలో ఏవో ఆటల పోటీలు జరుగుతుంటే, చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో చీకటి పడింది. కన్నయ్య గాబరా పడి, ‘అయ్యో చీకటి పడింది. తొందరగా ఇంటికి వెళ్ళాలి. అమ్మ బెంగ పడుతుంది..’ అనుకుంటూ పరుగు పరుగున ఊరు దాటాడు.

అడవి వచ్చింది. అది దాటితే గానీ ఇంటికి చేరుకోలేడు. మెల్లగా ధైర్యం తెచ్చుకొని అడవి లోనికి వెళ్లాడు. కానీ చిన్న పిల్లాడు కదా, భయం వేసింది. ఇంతలో అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది.. అన్నయ్యని తలచుకోమని.. వెంటనే కన్నయ్య కళ్ళు మూసుకొని గట్టిగా “అన్నయ్యా.. అన్నయ్యా..” అంటూ ఎలుగెత్తి పిలిచాడు.

ఇంతలో కన్నయ్య భుజంపై ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించి తుళ్ళిపడి చూసాడు.. పక్కనే యుక్త వయసులో ఉన్న ఒక కుర్రవాడు కనిపించాడు.. అతను నల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు.. తల మీద నెమలి పింఛం ఉంది.. ఆ నల్లవాడు కన్నయ్యను చూసి, “పిలిచావు కదా వచ్చాను” అన్నాడు.. “పద, నిన్ను ఇంటి దగ్గర వదులుతాను” అని అంటూ కన్నయ్య చెయ్య పట్టుకొని తీసుకొని వెళ్ళాడు.

అడవి దాటి ఇల్లు రాగానే, కన్నయ్య పరుగున ఇంటిలోకి వెళ్లాడు. తల్లి ఒక్కసారిగా, “ఏమయింది కన్నా.. ఆలస్యం అయ్యింది.. చీకటిలో అడవి ఎలా దాటావు” అని అడిగింది. అప్పుడు కన్నయ్య.. “అన్నయ్య తీసుకొచ్చాడుగా..” అని చెప్పాడు. యశోదమ్మకి అర్థం కాలేదు.. “ఎవరురా అన్నయ్య?” అంటూ అడిగింది.

అప్పుడు కన్నయ్య చెప్పాడు “నువ్వే చెప్పావు కదమ్మా.. భయం వేస్తే అన్నయ్యని తలచుకోమని.. తలచుకున్నాను, వచ్చాడు..” అని కన్నయ్య చెప్పగానే, యశోదమ్మ బయటకి వచ్చి చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు.. “కన్నా నిజం చెప్పు.. ఇక్కడ ఎవరూ లేరు” అంది.

అప్పుడు కన్నయ్య చెప్పాడు.. “అన్నయ్య వచ్చాడమ్మా, నల్లగా ఉన్నాడు, నెమలి పింఛం పెట్టుకున్నాడు” అని. యశోదమ్మకి అర్థం అయింది.. వచ్చినవాడు కృష్ణుడు అని.. ఆమె ఆనంద భాష్పాలు కారుస్తూ అంటుంది.. “జగద్గురువు శ్రీకృష్ణుడి దర్శనం అయ్యింది.. నిన్ను కృష్ణుడు పట్టుకున్నాడు కూడా.. మహా యోగులకే ఋషులకే పట్టుబడనివాడు.. నిన్ను పట్టుకున్నాడు..” అని కొడుకుని హత్తుకుంది.

కల్మషం లేని మనసున్నవారికి కృష్ణుడు కనిపిస్తాడు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here