Site icon Sanchika

జగన్నాథుడి జైత్రయాత్ర

[శ్రీ విహారి రచించిన ‘జగన్నాథ పండితరాయలు’ అనే నవలని సమీక్షిస్తున్నారు శ్రీ సింహప్రసాద్.]

[dropcap]కో[/dropcap]నసీమ ముంగండ అగ్రహారంలో జన్మించి, కాశీ పండితులను మెప్పించి, ఢిల్లీ పాదుషాల ఆంతరంగికుడై సమయోచిత సలహాలు ఇచ్చి, మొగలాయి పాదుషాల ప్రశంసలకు పాత్రుడైన ఉన్నత శ్రేణి కవి పండితుడు జగన్నాథ పండితరాయలు.

సమయజ్ఞత, ఉచితజ్ఞత తెలిసినవాడు. మూఢాచారాలకు వ్యతిరేకి. ఔదార్యం, పాండిత్య గరిమ పుష్కలంగా గలవాడు. హిందూ ముస్లిం సఖ్యతకు విశేషంగా కృషి చేసిన సంస్కరణాభిలాషి. సామాజిక బాధ్యతకు కట్టుబడినవాడు.

అనితర సాధ్యమైన ధార, ధారణ కలిగిన ఏకసంథాగ్రాహి. అష్ట భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట . పండిత ప్రకండడు. మొగలాయి చక్రవర్తుల ఆస్థానంలో న్యాయ ధర్మశాస్త్రాధికారి. మతాతీత అభ్యుదయానికి, వ్యక్తి వికాసానికి పెద్ద పీట వేసిన సంస్కర్త. ఘనాపాటి. అపురూపమైన వాగ్ధాటి కలవాడు. స్ఫురద్రూపి. సంగీతకారుడు. వాగ్గేయకారుడు. వేద వేదాంత తర్క మీమాంసాది శాస్త్రాలు కుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభామూర్తి. అలంకార శాస్త్ర శేఖరుడు. హయగ్రీవోపాసకుడు. మంత్రదృష్ట. సకల శాస్త్ర విశారదుడు. అతని ఆత్మశక్తి అమోఘం. తన పాండిత్యం మీద, తన ధీశక్తి మీద, తన పరిపూర్ణత మీద అపారమైన విశ్వాసం గలవాడు.

జయసింహ మహారాజుచే కనకాభిషేకం చేయించుకున్న ఘనుడు.

మొగలాయి రాజ్యాధిపతి షాజహాన్ పట్టాభిషేక ముహూర్తాన్ని ఈ హిందూ పండితుడు నిర్ణయించడం ఒక ఎత్తు అయితే, ‘నేను పెట్టిన ముహూర్త బలం వల్ల మూడు దశాబ్దాలు మీరు రాజ్యపాలన చేస్తారు’ అని ధీమాగా ధాటీగా చెప్పగలిగిన జ్యోతిష శాస్త్ర పాండిత్యం జగన్నాథుడి సొంతం!

అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ‘టవరింగ్ పర్సనాలిటీ’ గురించి రాయాలనుకోవడం నిజంగా ఒక సాహసమే. అటువంటి దాన్ని అలవోకగా బహుధా ప్రశంసనీయంగా రచించారు విహారి గారు.

దీనికి ప్రధాన కారణం, వీరు కూడా అంతే వాసి మహాకవి, సాహితీవేత్త, సామాజిక బాధ్యత కలవారు, ఎన్నో విశిష్ట పురస్కారాలతో పాటు తెలుగువారి జ్ఞానపీఠం అభో-విభో వారి ‘ప్రతిభా మూర్తి’ పురస్కార గ్రహీత – గనుకనే!

నవల ఆసాంతం ఒక సాధికారతతో గోదావరి మీద పడవ ప్రయాణంలా సాగింది. ఆత్మగర్వంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ ఎన్నో సామ్యాలు కనిపిస్తాయి. ఇద్దరూ మహాకవులే. అనంత ప్రజ్ఞా విశేషాలు గలవారే. అవసరమైనప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించే గుణం కలిగిన వారే. వివిధ శాస్త్రాల్లో సాహిత్య ప్రక్రియల్లో అద్వితీయులే. వైద్యమో సామాజిక వైద్యమో చేసేవారే. ఎంతో సంయమనంతో సమయశుద్ధితో వ్యవహరించే వారే. ఇద్దరూ సమాన వాగ్ధాటి గల మహావక్తలే!

బహుశా అందువల్లనే జగన్నాథుడి మహోన్నత వ్యక్తిత్వం విహారి గారిని ఆకర్షించి ఉండొచ్చు. అందుకే 50 ఏళ్లు మనసులో నలిగి నలిగి సారం ఈ నవలగా ప్రవహించింది!

‘జగన్నాథ పండిత రాయలు’ చారిత్రకత, కల్పన పెనవేసుకున్న నవల.

చారిత్రిక నేపథ్యంలో నవల రాయడం అసిధారావ్రతమే. అది కూడా ఎప్పుడో 16 – 17వ శతాబ్దంలో జరిగిన కథని, అది కూడా ఉత్తరాదిలో ఖ్యాతిగాంచిన దక్షిణాది వ్యక్తి కథని, సాహిత్యంలో తప్ప చరిత్రలో అతి తక్కువగా నమోదైన మహా పండితుడి జీవన యాత్రని, విశిష్ట విజయాలని – నాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు, పరిణామాలు బాగా ఆకళింపు చేసుకుని – ఓ అద్భుత రచనగా వెలువరించడం శ్లాఘనీయం.

నిజానికి ఇది డ్రై సబ్జెక్టు. పాండిత్య ప్రదర్శన, సాహిత్య సభలు, ధార్మిక సమావేశాలు, కవితా గోష్ఠులు, చర్చలు, మీమాంసలు, తర్కాలు, వాదోపవాదాలు, మత విద్వేషాలు, రాజకీయాంశాలు – నిండిన కథాంశాన్ని తీసుకుని పాఠకుడిని ఆకట్టుకోవడం అంత సులువు కాదు. దానిని విహారి గారు సునాయాసంగా నెరవేర్చారు. రచనని ఒక తపస్సుగా భావించే ఋషితుల్యులకే ఇది సాధ్యం!

పండితరాయల పాండిత్య ప్రతిభని అంచెలంచెలుగా బహిర్గత పరుస్తూ ముందుకు తీసుకువెళ్లిన విధం అపూర్వం. సామాన్య పాఠకుడికి సైతం అడుగడుగునా ఆసక్తి కలిగిస్తూ కడదాకా చదివించడం వారి రచనా శిల్పనైపుణ్యాలకు తార్కాణం.

ఉన్నత కవిగా, పండితుడిగా, సామాజికోద్ధారకుడిగా, జన శ్రేయః కాంక్షిగా మంత్రాంగ కర్తగా, వాస్తు జ్యోతిషవిద్వాంసుడిగా, వీటన్నిటినీ మించి మనీషిగా జగన్నాధ పండిత రాయలు విశ్వరూపాన్ని మన ముందు ‘సజీవంగా’ సాక్షాత్కరింప చేయటంలో అక్షరాలా కృతకృత్యులయ్యారు శ్రీ విహారి గారు.

చక్కటి సన్నివేశాలతో నాటి విశేషాలతో ఆకట్టుకునే సంభాషణలతో కవితా శ్లోకాలతో గంగా ప్రవాహంలా సాగింది రచన యావత్తు.

జగన్నాథుడు, కామేశ్వరిల దాంపత్య బంధాన్ని గురుశిష్యుల బంధంగా సాహితీ మిత్రుల అనుబంధ తాంబూలంగా మార్చి ఎర్రగా పండించారు విహారి గారు.

అత్యంత ప్రజ్ఞాశాలి జగన్నాథుడి బహుముఖ ప్రతిభని ఎంత ప్రతిభావంతంగా చిత్రీకరించారో చూడండి.

జగన్నాథ పండితుల కవిత్వాన్ని విశదపరుస్తూ సందర్భోచితంగా చక్కని శ్లోకాలు పేర్కొని వాటి అర్థాలు వివరించడం వల్ల ఆ మహాకవి కవిత్వ వైభవాన్ని పాఠకులు ఆస్వాదించి అబ్బురపడేలా తీర్చిదిద్దిన వైనం అమోఘం.

గోష్ఠుల్లో సమావేశాల్లో బోధనల్లో భగవద్గీత గురించి గొప్ప వ్యాఖ్యానాలు చేసిన జగన్నాథుడు భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో, మానసికంగా బలహీనం కాగా భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకం పెదవుల మీద కదలి ఉపశమాన్నిచ్చిందిట. ఎంత సముచిత ఊహ!

జగన్నాథుడు దక్షిణ దేశ పర్యటనలో నిరాశ ఎదురైనా ఉత్తరాదిలో ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి మరీ విజయకేతనం ఎగురవేసిన విధానాన్ని బిగి సడలకుండా చిత్రించారు.

జ్ఞానం, పాండిత్యం, విద్వత్తు ఒకరి గుత్త సొమ్ము కాదంటూ దక్షిణాది పండితుడు కాశీలో పీఠం వేసుక్కూర్చుని అక్కడి పండితులైన భట్టోజి తదితర పండితుల మీద పైచేయి సాధించడం, వారి అసూయా మాత్సర్యాలకు బాధితుడైనా గంధపు చెక్క లాంటి అతడి ప్రతిభా పరిమళం అతన్ని అత్యున్నత స్థాయికి చేర్చడం, హిందువుల విశ్వాసాలను హేళన చేస్తూ ప్రజల్లో అవాంఛనీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాశీ మౌల్వీ లకు తగిన విధంగా గుణపాఠం చెప్పడం – ప్రశంసనీయంగా దృశ్యమానం చేశారు శ్రీ విహారి.

కాశీలో హిందూ ముస్లిం కవి పండిత విద్వాంసుల సభా విశేషాలు, భట్టోజి, అతడి అనుచరులు, కనక్ లాల్ తదితరులు సంధించిన వ్యంగ్యాస్త్రాలు, ఎత్తిపొడుపులు, ఖండనలు, వాటికి దీటుగా జవాబు ఇచ్చి ఎదుర్కొన్న జగన్నాథుడు, అతడి శిష్యులు – అతివాస్తవికంగా ‘పండిత స్పర్ధ’ చిత్రించిన తీరు ప్రశంసనీయం.

రాజాశ్రయంలో అతడు వ్యవహరించిన తీరు, తన స్థితి స్థాయి మరువకుండా ఇచ్చిన సలహాలు, చేసిన సూచనలు నిజంగా అపూర్వం. ఈ ఘట్టాల్లో జగన్నాథుడి వ్యక్తిత్వం గుబాళించేలా మలిచారు విహారి గారు.

పాలకుల ఆగ్రహ అనుగ్రహాల గురించి తెలిసినా నూర్జహాన్‌తో ఆమె అల్లుడు షరియార్ అసమర్థ నాయకుడని మొహమాటం లేకుండా చెప్పడం జగన్నాథుడి సూటిదనానికి నిదర్శనం.

తమ ప్రత్యర్థుల అనుయాయులను, తాబేదారులను ఏరి పారేయమని లాడీబేగం ఆదేశించారని తెలిసి, ‘న్యాయహారాన్ని ఏర్పాటు చేసిన జహంగీర్ పాదుషా వారి పుత్రిక అయిన మీకు అంత కరుకుదనం అక్కర్లేదేమో. నిశ్చయంగా శత్రువు అని తేలిన తర్వాతే శిక్షను విధించమని ఆజ్ఞాపిస్తే చాలునేమో!’ అని సలహా ఇచ్చి ఆమె ఆలోచనలను ప్రభావితం చేయడం జగన్నాథుడి విజ్ఞత. విజయం!

ఇవన్నీ ఎంతో హుందాగా జగన్నాథుడి జ్ఞానం, చతురత, సమయస్ఫూర్తి ప్రస్ఫుటీకరించేలా విహారి గారు తీర్చిదిద్దారు.

‘చూడబోతే తమ ఉద్యోగ బాధ్యతలు, పండిత పదవి నుండీ సమన్వయకర్త పదవికీ మధ్యవర్తి పదవికీ చేరినట్లు తోస్తోంది’ అంటూ కామేశ్వరి చేత ఒక్క వాక్యంలో జగన్నాధుడి బాధ్యతల పరిణామ క్రమాన్ని వివరించారు. ఇది విహారి గారికే చేతనైన విద్య!

భర్త మరణంతో దుఃఖంతో వ్యాకులమైన లాడి బేగంని జగన్నాథుడి భార్య కామేశ్వరి ఓదార్చినప్పుడు ఆవిష్కరించిన ఒక వాక్యం ఒక గ్రంథమే అని చెప్పాలి. ‘భర్త మరణశోకానికి ఒక చల్లని స్పర్శ. తల్లి దగ్గర లేని ఒక ఆడపిల్ల దుఃఖాన్ని ఆప్యాయంగా అనునయించిన ఆత్మీయ పరిష్కంగం’!

రాజాశ్రయంలో ఉన్నప్పటికీ జగన్నాథుడు తన సామాజిక బాధ్యతను విస్మరించ లేదు. దక్కన్ కరువు గురించి చెప్పాలని తపన పడ్డాడు. అప్పుడు చెప్పలేకపోయినా అహ్మదాబాద్ కరువు సందర్భంలో తనకు తెలిసింది చెప్పడమే గాక వైద్య సాయం అందించాలని, గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చాడు.

యుద్ధ ప్రభావం వలన ఢిల్లీ ప్రజలు పడుతున్న అవస్థల్ని, నిత్య వస్తువులకు ఏర్పడిన కరువుని నిర్భయంగా లాడీబేగంకు చెప్పి ప్రజాక్షేమమే తన ఆకాంక్ష అని చాటడం పండితరాయలి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చేదిగా ఉంది.

నూర్జహాన్‌నీ ఆమె కూతుర్నీ ఉరితీయాలనుకుంటూ జగన్నాథుడి అభిప్రాయం అడిగినప్పుడు చెప్పిన సమాధానం ‘కవి హృదయాని’కి తగిన రీతిలో ఉంది. ‘ఆమె నీ మాతృ సమానురాలు. వారిని గృహనిర్బంధంలో బందీగానే ఉంచి భరణం ఇస్తే బాంధవ్య గౌరవము నిలుస్తుంది. వారి ఔదార్యం ప్రజల్లో గడ్డ కెక్కుతుంది.’

నూర్జహాన్, లాడీబేగంలతో జగన్నాథుడి సాన్నిహిత్యం వారి ప్రత్యర్థి షాజహాన్ అధికారంలోకి రాగానే చిక్కులు తెచ్చిపెడుతుందని కామేశ్వరిలానే మనమూ భయపడతాం. దాన్ని షాజహాన్ చేతే ప్రశ్న రూపంలో అడిగించి ‘వాతావరణం తేలిక పరిచి’ మనల్ని ఒడ్డున పడేయడం విహారి గారి కథన చాతుర్యానికి ఒక మచ్చుతునక.

ఔరంగజేబు క్రూరత్వాన్ని వర్ణించిన తీరు చూడండి. ‘దారాని ముసలి ఏనుగు మీద నగర వీధులలో ఊరేగించి ప్రజల్ని భయభ్రాంతులను చేశాడు. అతని తల నరికించి కసి కొద్దీ బల్లెంతో దాన్ని చిద్రం చేయించి, జనం ముందు ప్రదర్శించి, పాశవిక ఆనందాన్ని పొందాడు’. ఈ దృశ్య బీభత్సం జగన్నాథుడివే కాదు పాఠకుడినీ కదిలించి కలచి కన్నీరు పెట్టిస్తుంది!

ఔరంగజేబు తన గురువుని ప్రశంసిస్తూ, అతని ఎదుటే దారాకి గురువైన జగన్నాథుడిని ఎత్తిపొడుస్తూ అవహేళన చేస్తూ అవమానించడం – జగన్నాథుడే కాదు మనమూ ‘దుఃఖపు కన్నీళ్లను రెప్పల మాటున బిగబడతాం’. కాలం ఏదైనా నియంతలకు కావలసింది నీతుల విద్య కాదు, కుట్ర కుతంత్రాలతోనైనా అధికారం అందుకొనే ‘తెలివి’! నిరంతరాయంగా అధికారం చలాయించగలిగే ‘జ్ఞానం’!

కథానుగుణంగా శాస్త్ర విజ్ఞాన విషయాలు సైతం చక్కగా వివరించడం విహారి గారికే చెల్లింది.

శరీరం పంచభూత నిర్మితమంటారు కదా! ‘పృథ్వీతత్వం వారు మందమతులు. అంతగా ఏమీ అర్థం కాదు. జలతత్వం వారైతే చంచల స్వభావులు. అగ్నితత్వం వారు తీవ్ర మనస్కులు. వాయుతత్వం వారికి జవసత్వాలు ఎక్కువ. ప్రతి పనిలో వేగం ఎక్కువ. ఆకాశ తత్వం మనుషులది శాంత స్వభావం. ఆధ్యాత్మికంగా, జీవన తాత్వికత ధోరణిలో సమస్థితిలో ప్రవర్తిస్తూ ఉంటారు’

ఆణిముత్యాల్లా మెరిసిన కొన్ని వాక్యాలు, కవితాత్మకత నిండిన వచనాలూ అవశ్యం పేర్కొనాలి: ‘అడవినిండా చెట్లే. మంచి గంధపు చెట్లకే గొడ్డలి దెబ్బలు’

‘రోజు రోజుకి నవీనవంగానే ఉంది జీవన వల్లరి’

‘ముడి వజ్రాన్ని కిరీటంలో పొదవుతారా? సానబట్టిన వజ్రానికే కదూ విలువ!’

‘చెడు అలవాటు విషయంలో మనసు అయస్కాంతమైపోతుంది. చివరికి అది ఒక ఊబిలాగా ముంచేస్తుంది’

‘మనసులో తీవ్రమైన మథన తర్వాత వివేకం పురుడు పోసుకుంది’

‘సముపార్జించిన సంగీత సాహిత్యాల ప్రావీణ్యాన్ని కావిడి పెట్టెలో పెట్టి మూత వేస్తే ఎలా? సాధించిన విద్యలు ప్రజల పరం కావాలి!’

‘రణతంత్రంలో సేన సమూహానికి నాయకుడి సమర్థత పట్ల నమ్మకమే సగం విజయాన్ని పాదాల ముందుకు తెస్తుంది’

జగన్నాథుడు భావ తీవ్రతకు లోనై, ‘ఈరోజు, ఈ భవనం మన జీవితాల్లో అనూహ్యమైన ఘటనలకు కారణమవుతాయని ఏ దివ్యవాణో నా అంతరంగంలో కుహు కుహు లాడుతోంది’ అని భార్యకు చెప్పినప్పుడు మన గుండెలు గుబగుబలాడతాయి.

లవంగి రంగ ప్రవేశం చేస్తుందని భావిస్తాం. ‘ప్రేమ, సాన్నిహిత్యం, మనసుల కలయిక, సహచర్యం, బాంధవ్యం – అవన్నీ భార్యాభర్తల మధ్య సాంఘికంగా ఆమోదం పొందిన ధర్మాలు’ అని మిత్రుడికి బోధించిన జగన్నాథుడు ఎలా ప్రతిస్పందిస్తాడో ఆమెని ఎలా స్వీకరిస్తాడో నని ఉత్కంఠ భరితం అవుతాం. కానీ విహారి గారు ఎంతో తెలివిగా లవంగిని అపురూప చిత్రసుందరిగా చిత్రించి వారి ‘ఊహాత్మక’ సంబంధానికి తెరదించారు! గంగా పవిత్రతకు మచ్చ రానీయలేదు. వాస్తవమో కల్పనో నిర్ధారణ కాని ‘లవంగి’ని తెరపైకి తీసుకురాకుండా ఎంతో విజ్ఞత ప్రదర్శించారు విహారి గారు.

పండితరాయలి అర్హత స్థాయిని అతని శ్లోకం దన్నుతో ఇలా వ్యాఖ్యానిస్తారు రచయిత – ‘నాకు కోరికలూ ఎక్కువే. అవన్నీ భౌతికంగా కనపడిన అసలు రహస్యం – అవన్నీ నా ప్రతిభకూ, ప్రతిష్ఠకూ దక్కవలసిన గౌరవాదరణలే. అవి నా మానసిక వాంఛితాలు. వాటిని ఢిల్లీశ్వరుడైనా తీర్చాలి. ఆ జగదీశ్వరుడైనా తీర్చాలి’. ఇది ఆత్మోత్కర్ష కాదు. మహా పండితుడికి తన పాండిత్యం వల్ల అబ్బిన గర్వాభిమానం! అంతే తప్ప తెంపరితనమో మరోటో కాదు.

ఇంత వైవిద్య భరితమైన పాత్రని ప్రధానపాత్రగా చేసి, అపూర్వ రచనగా తీర్చి దిద్ది ఆహా అనిపించుకోవడం ముమ్మాటికి విహారి గారు సాధించిన సాహిత్య విజయమే.

నవలను ఎంతో ఒడుపుగా సమగ్రంగా నడిపిన విహారి గారు, కామేశ్వరి జబ్బుతో మంచాన పడినప్పుడు కొడుకు మాధవుడిని – ఆమె గాని, ఆమె చనిపోయాక జగన్నాథుడు గాని – గుర్తు చేసుకోకపోవడం, కారణాలు ఏమైనా, చిన్న లోటుగా అనిపిస్తుంది.

6500 పద్యాలతో రామాయణంలోని ప్రతిఘట్టాన్నీ రమణీయంగా భక్తిభావం పొంగేలా చెక్కిన మహాకావ్యం ‘శ్రీ పద చిత్ర రామాయణానికి’ ఉన్నతోన్నత పురస్కారాలు లభిస్తాయని నాబోటి వారెందరో ఆశించారు. కనీసం ఇప్పుడైనా అవి పండితరాయలి అపూర్వ ప్రజ్ఞాపాటవాలు అనితర సాధ్యమైన రీతిలో చిత్రించి అతన్ని తెలుగు సాహిత్యంలో అజరామర మూర్తిని చేసిన ఈ ‘జగన్నాథ పండిత రాయలు’ నవలా రాజానికి లభిస్తాయని ఆశిద్దాం.

ప్రతి నిత్యం గంగానది తీరంలో మారుమోగుతున్న గంగా హారతి, గంగా లహరి శ్లోకాలు ఆంధ్ర కవి పండితుడు జగన్నాధ పండిత రాయలు విరచితం కావడం ప్రతి తెలుగు వాడూ గర్వించాల్సిన సంగతి. ఉద్విగ్న పడాల్సిన సందర్భం!

ఒక్క ముక్కలో – ఈ నవల గోదావరి గంగ యమునల త్రివేణి సంగమ హారతి! జయహో విహారి గారు!

***

జగన్నాథ పండితరాయలు (నవల)
రచన: విహారి
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 320
వెల: ₹ 200/-
ప్రతులకు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Jagannatha-Panditarayulu-Vihaari-Narasimha-Sastry/dp/B0D4MFVTD4

 

~

శ్రీ విహారి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-vihaari/

Exit mobile version