జగన్నాథ పండితరాయలు-13

4
2

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ఢిల్లీ నుంచి రాజోద్యోగులు వచ్చి పాదుషా వారి ఫర్మానాని వినిపిస్తారు. రాజాజ్ఞ ప్రకారం జగన్నాథుడు, కామేశ్వరి ఢిల్లీ బయలుదేరుతారు. ఉద్యోగులు కావల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఢిల్లీలో నూర్జహాన్ ప్రాబల్యమే ఎక్కువని గ్రహిస్తాడు జగన్నాథుడు. అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలను తెలుసుకుంటాడు జగన్నాథుడు. నూర్జహాన్ అంటే ఖుర్రంకి భయమనీ, ఖుర్రం అంటే నూర్జహాన్‍కి అనుమానమని గ్రహిస్తాడు. ఢిల్లీలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తగా మెలగాలని తనను తాను హెచ్చరించుకుంటాడు జగన్నాథుడు. కొంత కాలం గడుస్తుంది. ప్రభువుల వారి, రాణిగారి మన్ననలను, ఆదరణను పొందుతాడు. జహంగీర్ జరిపిన ఓ పండిత గోష్ఠిలో అసమాన ప్రతిభ చూపి పాదుషాని, రాణిని ఆకట్టుకుంటాడు జగన్నాథుడు. జగన్నాథుని ప్రతిభపై గురి కుదురుతుంది రాణికి. రాజా భీమసింగ్ విపక్షంలో చేరడానికి సిద్ధమయ్యాడన్న వార్త పాదుషాని, రాణిని కలవరపరుస్తుంది. భీమసింగ్‍ను పిలిపించి గుజరాత్‍కి రాజప్రతినిధిగా నియమిస్తుంది. పాదుషా భీమసింగ్ శౌర్యాన్ని ప్రశంసిస్తాడు. అయితే షరియార్ – సామ్రాజ్యాధినేత కావడానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అంటాడు భీమసింగ్. అయితే నూర్జహాన్ షరియార్‌ని సమర్థిస్తుంది. పాదుషా వారికి నమస్కరించి – అసఫ్‍ఖాన్ నివాసానికి బయల్దేరుతాడు భీమసింగ్. ఒకరోజు పొద్దున్నే అఫ్జల్ అనే మిత్రుడు జగన్నాథుడి ఇంటికి వస్తాడు. రాణిగారి మందిరంలో జరిగిన భీమసింగ్ ఉదంతం చెప్పి, త్వరలో మీకు స్థానచలనం రావచ్చు అని జగన్నాథుని హెచ్చరించి బయలుదేరుతాడు. భీమసింగ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. జగన్నాథుడిని తన ఆంతరంగిక ముఖ్యుల్లో ఒకనిగా గౌరవిస్తుంది-నూర్జహాన్. షరియార్‌నీ, టోకీనీ సిక్రీ పంపేటప్పుడు కూడా నూర్జహాన్ ఆ నిర్ణయాన్ని జగన్నాథుని ముందే చెబుతుంది. షరియార్ సామర్థ్యంపై జగన్నాథుడు సందేహం వెలిబుచ్చినా, టోకీ పక్కనే ఉంటాడు కదా అని అంటుంది. రాజ్యమంతా అలజడి మొదలవుతుంది. ఓ రోజు జగన్నాథుని పిలిపిస్తుంది నూర్జహాన్ ‘విషయాలు తెలిసి కూడా మీరిట్లా అంటీముట్టనట్టు ఎందుకుంటున్నార’ని జహంగీరుతో అంటుంది. అప్పుడే అక్కడ జగన్నాథుడిని చూసిన జహీంగీర్ మీరెప్పుడు వచ్చారని అంటాడు. రాజపుత్ర సమూహమంతా కలిసి మొగలాయీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోందని అంటుంది నూర్జహాన్. కీలకమైన వీరుల గురించి తెలియడం లేదని అందోళన పడుతుంది. భీమసింగ్‍ని కలిసి తమ సందేశం వినిపించే బాధ్యతను జగన్నాథుడికి అప్పజెప్తుంది నూర్జహాన్. ఇక చదవండి.]

అధ్యాయం-21

[dropcap]ఆ[/dropcap]రోజు పగలూ, రాత్రి ప్రొద్దుపోయే వరకూ – మహారాణి నుండి వర్తమానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు జగన్నాథుడు. వివరమేమీ తెలియరాలేదు.

రాత్రి రెండు జాముల సమయం –

ఇద్దరు అశ్వికులు జగన్నాథుని ఇంటిముందు ప్రత్యక్షమైనారు.

“నూర్జహాన్ బేగం సాహెబా తమరిని వెంటనే మాతో వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు.” చెప్పారు.

ఇలాంటి రాజాజ్ఞలకు పగలు రాత్రీ తేడా వుండదు. జగన్నాథుడికి ఇది అనుభవమే. నిజానికి మంత్రాంగాల్లో ఎక్కువభాగం అర్ధరాత్రీ అపరాత్రియే అనుకూల సమయం. కామేశ్వరికి తగు జాగ్రత్తలు చెప్పి బయల్దేరాడు జగన్నాథుడు.

రాజమందిరం లోకి ప్రవేశిస్తుంటేనే చాలా పెద్ద స్వరంతో మాట్లాడుతున్న మహారాణి మాటలు వినబడినై జగన్నాథునికి. “అందరూ విశ్వాస ఘాతకులు. స్వార్థపరులు. దురాలోచనాపరులు. మన ఉప్పు తిని మనకే ద్రోహం తలపెడతారు. తిన్న ఇంటివాసాలు లెక్కపెడతారు”. నూర్జహాన్ మందిరమంతా కలియతిరుగుతూ ఎవరి మీదో మండిపడుతోంది. దూషణ చేస్తోంది.

లోపలికి వెళ్లి నమస్కరించి నిలబడ్డాడు జగన్నాథుడు.

“పాదాలు పట్టుకుని ప్రాధేయపడిన వారే పాదాల కింద తివాచీని లాగేస్తారు” అంటూ ఒక అడుగుని పక్కగా వేసి, జగన్నాథుని చూస్తూ “చూశారా.. పండితులవారూ.. మీ భీమసింగ్ మాకు పెద్ద ధోకా ఇచ్చాడు”.

ఆమె కూర్చుంది.

జహంగీర్ జగన్నాథుని వైపు చూస్తూ “నమక్‌హరామ్. వెళ్లి.. మా మీద యుద్ధం చేసేవారితో చేతులు కలిపాడు. మన చారులు వార్త తెచ్చారు. “

“నా ఊహ ప్రకారం ఆ దుర్మార్గులు ఖుర్రం, మహబతాఖాన్ కూడా అక్కడే ఉండి వుంటారు. రాయముకుందుడూ చేరి ఉంటాడు. కొండ చుంచుల్లా దొంగబొరియల్లో నక్కి ఉండి వుంటారు. అందరూ కలిసి సిక్రీ మీదికి ఉరుకుతారట” అని ఆగి, “రానీ.. శలభాల్లా మాడి మసైపోతారు. గజసింగ్, టోకీలంటే మామూలు సైనికులనుకుంటున్నారేమో చవిచూస్తారు ఈ నూర్జహాన్ దెబ్బని.” నూర్జహాన్ కళ్లు నిప్పుకణికల్లా మారాయి.

“సరి.. సరి..” అని మహారాజు సన్నివేశాన్ని శాంతిస్థాయికి తేవాలని ప్రయత్నించాడు.

నూర్జహాన్ మౌనం వహించింది.

“చూడండి పండితవర్యా, రాణాలకు మీరంటే గౌరవం. రాయముకుందునికీ మీరంటే అభిమానం.. లోకజ్ఞతా, లౌక్యం రెండూ తెలిసినవారు మీరు”.

“ప్రభువుల ఆజ్ఞ” అన్నాడు జగన్నాథుడు.

“మీరు వెంటనే బయల్దేరి సిక్రీ వెళ్లండి. ఇప్పటికే అక్కడ షరియార్, మన సైనిక వీరులూ ఉన్నారు. పరిస్థితిని వారి ద్వారా స్వయంగా తెలుసుకోండి. ఈ పరిస్థితుల్లో మనం అటు నుంచీ నరుక్కురావాలి. వెళ్లి రాయముకుందుని కలవండి. మీరిద్దరూ – భావి మొగలాయీ సామ్రాజ్య క్షేమానికి బాసటగా నిలవాలి. యుద్ధాన్ని నివారిస్తే ఖుర్రంనీ, మహబత్‌ఖాన్‌ని క్షమిస్తామని మా మాటగా చెప్పండి. అయితే, వారు షరియార్‌ని భావి సామ్రాజ్యాధినేతగా అంగీకరించాలి” నూర్జహాన్ చెప్పంది.

“అధికారం కోసమే అయితే ఖుర్రంని మేం దక్కన్ అధినేతగా నియమిస్తామనీ చెప్పండి” అంటూ జహంగీర్ మాటని కొనసాగించాడు. “ఒక విధంగా ఇప్పుడు మీరు మా రాయబారి”.

తలవంచి వినమ్రంగా “హాఁజీ; జహాఁపనాఁ” అన్నాడు జగన్నాథుడు.

“మీ ప్రయాణానికి మన ఆశ్వికదళం సిద్ధంగా వుంది” అన్నది నూర్జహాన్.

“హాఁ.. బేగం సాహెబా” అని కదలబోతూ, క్షణం ఆగాడు. మౌనం పాటించి మందిరంలో దిక్కుల్ని పరకాయించసాగాడు. గాలికి సంచలిస్తున్నై దీపాలు.

జగన్నాథుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడనీ, కానీ చెప్పేందుకు సంశయిస్తున్నాడనీ గ్రహించింది నూర్జహాన్. “మా పరిస్థితి, మనసూ కూడా తెలిసిన మహాశయులు మీరు. మీరు చెప్పదలచుకున్నది నిరభ్యంతరంగా చెప్పండి” అన్నది.

“మరేం లేదు. షహజాదా షరియార్ భుజస్కంధాల మీద మీరు పెద్ద భారం మోపేరేమో ఆలోచించండి- మహారాణీ” గళాన్ని కించిత్ గంభీరంగా మార్చి అనేశాడు. “రణతంత్రంలో సేనా సమూహానికి నాయకుడి సమర్థత పట్ల నమ్మకమే సగం విజయాన్ని పాదాల ముందుకు తెస్తుంది కదా! మీకు తెలియనిదేముంది? అందునా మనం ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నది – బలమైన శత్రువునే కదా? ఆలోచించండి. యుద్ధరంగంలో అనుక్షణం మారిపోయే పరిస్థితుల్లో ఒక్కొక్కప్పుడు ఎంతవారైనా నిస్సహాయులు కావలసి వస్తుంది. అందునా మాలాంటి వారిని ఆ నిస్సహాయత మరీ ఎక్కువగా నిలవేస్తుంది.”

ఠక్కున ఏదో సమాధానం చెప్పబోయింది. కానీ అంతలోనే మహారాజు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వారించాడు. తన ఉద్రేకాన్నీ, ఉద్వేగాన్నీ దిగమింగుకుంది నూర్జహాన్. ఆమె తెప్పరిల్లి చూసేలోగా ఎదురుగా లేడు జగన్నాథుడు.

***

అర్ధరాత్రి దాటింది. బయట అశ్వికులు సిద్ధంగా వున్నారు. జగన్నాథుడి కోసం ప్రత్యేక శకటం ఒకటి సిద్ధంగానే వుంది.

కామేశ్వరికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి, బయటికి వచ్చి శకటంలోకి ప్రవేశించాడు.

ముందు అశ్వికులు, వెనుక శకటం బయల్దేరాయి. ఒక్క ఉదటున సాధారణ వేగం కంటే అధిక వేగంతో గుఱ్ఱాలు ముందుకు దూకుతున్నాయి. తక్కువ సమయంలోనే పొలిమేర దాటారు.

సాగుతున్న ప్రయాణంలో కనబడుతున్న ప్రకృతి చాలా ఆహ్లాదంగా అనిపించింది జగన్నాథునికి. తలయెత్తి పైకి చూశాడు. ధర్మపరిపోషకుడైన మహా విద్వాంసుని తేజోమయ ఫాలభాగంలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు.

..ప్రయాణం అనుకూలంగా ఏమీ లేదు. రాత్రంతా మూడు క్రోసులు ముందుకు, ఆరామడలు వెనక్కుగా సాగింది. దానికి ఒక కారణం – అశ్వికుల నాయకుడు దారితప్పటమే. రెండవ కారణం – గుఱ్ఱాల అలుపు.

ఆ రాత్రంతా కష్టంగా గడిచింది. మరునాడు తెల్లవారింది.

చాలాదూరంగా వుంది గమ్యం. ఊళ్లు దాటుతుంటే –

ఇప్పుడు పరిస్థితి – సందేహాలకు తావు లేకుండానే తేటతెల్లమయింది. అటు యుద్ధం మొదలయింది. ఇటు పల్లెలూ, పట్టణాలూ వణకటమూ మొదలయింది. సరిహద్దులకు దూరంగా వున్న జనం కూడా చాలామంది మూటాముల్లే సర్దుకుని ఆగ్రా ఢిల్లీల వైపుకు పోవటానికి సిద్ధమవుతున్నారు.

అశ్విక నాయకుడు ఆందోళనలో ఉన్నాడు. జగన్నాథుడిలో కలవరం లేకపోయినా, ‘కింకర్తవ్యం?’ అనే ప్రశ్న మెదడుని మల్లడి చేస్తున్నది.

“పండిట్ జీ.. వెనక్కు మళ్లుదామా? మీ నిర్ణయం చెబితే అలాగే చేస్తాం” అన్నాడు నాయకుడు.

“యుద్ధం పరిస్థితిని స్వయంగా గమనించకుండా, పాదుషా వారి ఆజ్ఞని పాటించే ప్రయత్నం చేయకుండా, వెనక్కి తిరిగి వెళ్లే నిర్ణయం చేయలేను. ముందుకే పోదాం!”

నాయకుడు మౌనం వహించి మళ్లీ గమనానికి సిద్ధమయినాడు.

ఆ పగలంతా ప్రయాణం సాగింది.

రాత్రి రెండవ జాములో- మొగలాయీ సైన్య శిబిరాలకు కొంతదూరంలో అశ్విక నాయకునీ, ఇతర అశ్వికుల్నీ తాను తిరిగి వచ్చే వరకూ అక్కడే వుండమని – తాను ఒక్కడే ముందుకు నడిచాడు. అంతా కల్లోలంగా ఉన్నది. మహమ్మదు టోకీ పర్యవేక్షణలో ఉన్న సైనికులంతా సామాన్లు సర్దుకోవటం గమనించి ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. టోకీని కలుసుకునే అవకాశం లేదని తెలిసింది. అతను సిక్రీ భవనాల్లో ఎక్కడో ఏదో చేస్తున్నాడట! వారితో వీరితో మాట్లాడాడు. విషయాలు అవగతమైనాయి. షరియార్ పేరుకు యుద్ధంలో నిమగ్నుడైనాడు. నామమాత్రపు నాయకత్వం, చేతిలో పానపాత్రతో, పక్కన సుందరాంగుల సరసాలతో మునిగిన అతను – యుద్ధతంత్రాల్ని ఆలోచన చేసే మొనగాడా! సందేహమే లేదు,

రాత్రి మూడవజాము జరుగుతోంది.

జగన్నాథుడు శత్రుపక్ష శిబిరాల వైపుకు వెళ్లాలని నడక సాగించాడు. కానీ, కుదరలేదు. గజసింగ్ ఆధ్వర్యంలోని దఖ్లిన్, ఆహాది దళాలు, పటాలాలు బహు జాగరూకతతో వున్నాయి. పాదుషావారి ఆజ్ఞాపత్రాన్ని చూపినా అడుగడుగునా అవరోధాలు.

అటు తిరిగీ, ఇటుతిరిగీ ఒక ఫౌజ్‌దార్ ముందు వాలేడు. అతని పేరు ఉద్దామ్‌సింగ్. పాదుషావారి పత్రాన్ని అతనికి చూపాడు. తన ప్రవర చెప్పుకుని, తాను వచ్చిన పనినీ వివరంగా తెలిపాడు. అతను పండిట్‍జీ మాటల్నీ, వాలకాన్నీ విశ్వసించాడు. శిబిరం బయటికి వచ్చి చెట్టుచాటుగా కూర్చున్నారు. ఉద్దామ్‌సింగ్ తెలివిగలవాడు. చిన్న ఉద్యోగి అయినా, పరిస్థితుల్ని గమనిస్తూ, ఇతర ప్రముఖులతో సఖ్యంగా ఉండి, విషయ సేకరణ చేసే సమర్థత ఉన్నవాడు. రాజపుత్రుల్లో ఉండే చదువూ, సంస్కారం, తెగువా వున్నవాడే. అర్థం చేసుకున్నాడు జగన్నాథుడు. “భీమసింగ్ గురించి తెలియాలి నాకు” సూటిగా అన్నాడు జగన్నాథుడు.

“మీరు విద్వాంసులు, తెలివిగలవారు కదా పండిట్. మీకు ఈ పాటికే అర్థమై వుండాలే”

“ఏమిటీ నువ్వనేది?” ఏకవచన సంబోధనకి చనువు తీసుకున్నాడు. ఉద్దామ్‍సింగ్ యువకుడు కావటంతో తాను కొంత పెద్దరికాన్ని ఆపాదించుకున్నాడు.

ఉద్దామ్‍సింగ్ ఒక్క క్షణం ఆలోచనలో గడిపి చెప్పాడు, “భీమసింగ్ ప్రస్తుతం ఇక్కడే వున్నాడు. అతను గజసింగ్‍తో కలిసి చాలా మంతనాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. గజసింగ్‌ని ఖుర్రం పక్షానికి లాగటానికీ ప్రయత్నాలు జరిగాయంటున్నారు. కానీ, గజసింగ్ ఇటే నిలిచి వున్నాడు”.

“ఇంకో చిత్రమైన విషయం వారితో పాటు ఉదయపురం మహారాణా జగత్సింహుడు కూడా చేతులు కలిపారట. ఈ కారణం వలన శత్రుపక్షం బలం ఇంకా పెరిగిందని భయపడుతున్నారు – మన్సబ్‌దారులు.”

అతని మాటల్ని ఆపుతూ, “అది సరే, అసలు – ఖుర్రంనీ, మహబత్‌ఖాన్‌నీ, భీమసింగ్‌నీ ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా?” అన్నాడు జగన్నాథుడు.

“భీమసింగ్‌ని చూశారుట. అతడు యుద్ధంలో వీరవిహారం చేస్తున్నాడుట. అందుకనే టోకీ భీమసింగ్‌తో తలపడటానికి దొంగాటలాడుతూ, కొత్త వ్యూహాలకి ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు” చెప్పాడు ఉద్దామ్‌సింగ్.

ఎక్కడో దూరంగా తొలికోడి కూసింది. శిబిరాల్లో దివిటీలు అరకొరగా మినుకుమినుకు మంటున్నై, పొలిమేరలు ఉషోదయం కోసం ఆవలిస్తున్నాయి.

ఉద్దామ్‌సింగ్‌కి ధన్యవాదాలు తెలిపి చకచకా వెనక్కు వచ్చేశాడు జగన్నాథుడు. అశ్వికుల్ని చేరుకున్నాడు. నాయకుణ్ణి పిలిచి, తిరుగుప్రయాణాన్ని నిశ్చయం చేశాడు. అతను తన తలపాగాని ధరించి, పటాకత్తి పట్టుకుని, అశ్వికులకు వలసిన ఆజ్ఞలిచ్చాడు. అందరూ గుఱ్ఱాల వెన్నుదట్టి ఠక్కున వాటినెక్కి బయలుదేరారు. వెనుకగా శకటమూ కదిలింది.

సరిగ్గా అదే సమయంలో- అక్కడ ఢిల్లీలో పాదుషావారూ, రాణీ నూర్జహాన్ స్వయంగా తామే యుద్ధరంగానికి వెళ్లటానికి ప్రయాణ సన్నాహాలు చేయిస్తున్నారు. కారణం? –

జగన్నాథుడు ఆ రాత్రి నూర్జహాన్ మనస్సులో నాటిన షహజాద్ షరియార్ అసమర్థ నాయకత్వ సూచనా బీజమే!!

..అటు తూరుపు తెల్లవారుతోంది.

అధ్యాయం-22

ఢిల్లీ చేరుకున్నాడు జగన్నాథుడు.

ప్రాణం కుదుటబడినట్లయింది కామేశ్వరికి. రాజకీయ స్థితిగతులు వివరంగా తెలియకున్నా యుద్ధం మొదలయిందని విన్నదామె. అప్పటి నుంచీ ఆందోళనతో అనిశ్చిత పరిస్థితిలో ఉన్నదామె. తన భర్తకు రాణి పురమాయించిన బాధ్యత చిన్నదేమీ కాదు. ఎంతో క్లిష్టమైనది, కష్టసాధ్యమయినది. రాచవారికి వినయవంతుడైన జగన్నాథుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చటానికి చిత్తశుద్ధితోనే ప్రయత్నిస్తాడని ఆమెకు తెలుసు. ఆ ప్రయత్నంలో ఏ అవాంఛనీయ ఘటనన్నా జరిగితే! ఇప్పటివరకూ ఇదీ ఆమె ఆందోళన, విచారం..

ఇప్పుడు భర్త రాకతో ఆమె మనసు కుదుటపడింది. జరిగినదంతా ఆమెకు తెలిపాడు జగన్నాథుడు. “ధర్మపాలన అనే బాధ్యతలో ‘స్వధర్మేనిధనం శ్రేయః’ అనే ఆచరణాత్మక సూక్తీ కలిసే వుంది కదా. మీకు తెలియనిదేం వుంది. అందుకనే తిరిగి వచ్చారు” అంటూ సంతృప్తి చెందిందామె.

***

ఢిల్లీలో పాదుషావారూ నూర్జహానూ లేరు. సిక్రీ వైపు వెళ్లిపోయారు. సాధారణంగా – ప్రశాంతంగా ఉండే జనజీవనం యుద్ధవాతావరణంలో చిక్కుకుని ఉన్నది. రాచనగరంతా కుమ్మపొగ ఆవరించిన పల్లె పరిస్థితిలా ఉంది. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ పుకార్లు బాగానే పరిభ్రమిస్తున్నాయి.

కోటకు వెళ్లవలసిన అవసరం గురించి తనలో తాను ఆలోచించుకున్నాడు. జగన్నాథుడు. పాదుషా వారూ, నూర్జహాన్ బేగం లేకపోయినా, తాను వెళ్లి అసఫ్‌ఖాన్‌ని కలిసి విషయాల్ని వివరించటం అవసరం అనే భావించాడు.

వెళ్లాడు – అసఫ్‌ఖాన్ లేడు. అయితే, ఆయన పాదుషా దంపతులతో, పరివారంతో వెళ్లలేదని తెలిసింది!

***

రోజులు వెనక్కు జారుకుంటున్నాయి. ఆవేళ – రాచనగరులో ప్రముఖుల నివాసాలకు దూరంగా వెళ్తున్నాడు జగన్నాథుడు.

గోసాయి ఒకడు చిటికెలు వేస్తూ హిందీలో పాట పాడుతున్నాడు. అర్థమౌతోంది.

జగన్నాథుడికి.

‘పదవికేముందిరో నరుడా! అధికార మేముందిరో నరుడా!

ఎంతవారలైనా కాంతదాసులే నరుడా!

ఆమె చెప్పిన పని యెప్పుడూ వినక తప్పదు గురుడా!

రాజధానులు మారుతాయీ, రాజులూ మారుతారు నరుడా!

ప్రభువుగారీ ఉడుపు! రాణీగారి తొడుగు! రేపు ఏమవునో గురుడా!’

మాటల్ని పాటలా సాగదీసి, పునరుక్తితో గొంతెత్తి పాడుతున్నాడు. పాట కనుగుణంగా కాళ్లు చేతుల కదలికలతో స్వరంలోకి ఉద్వేగాన్ని తెస్తున్నాడు.

అతని చుట్టూ పదిమంది చేరారు. తమలో తాము, “ఈ బైరాగి తత్త్వాలలోనూ నిజముంది దోస్త్. పాదుషావారూ, బేగం సాహెబా స్వయంగా యుద్ధానికి వెళ్లారట. రేపేం కానున్నదో ఎవడి కెరుక?” “అవును. మొగలాయీ రాజ్యంలో ఏ క్షణాన్నయినా రాజే బంటు, బంటే రాజు కావచ్చు. తిరుగుబాటులు కొత్తేమీకాదు కదా మనకు..” అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఏవేవో చారిత్రక వాస్తవాలు జగన్నాథుని మనసులో మెదిలాయి. జహంగీర్ తిరుగుబాటు, ఖుస్రూ తిరుగుబాటు, ఖుర్రం, మహబత్‌ఖాన్ తిరుగుబాటు.. అవును. మొగలాయీ ప్రభుతకూ, రాజ్యానికీ తిరుగుబాట్లు కొత్తవి కావు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధమూ అలాంటిదే కదా!

మెదడులో ఆలోచనల గమనం – కాళ్లని రాణీ గారి భవనానికి చేర్చాయి. తెప్పరిల్లి ముందుకు చూశాడు. దేవిడీ ద్వారపాలకుడు సలామ్ కొట్టాడు. జగన్నాథుని వంటి తెలిసినవారికీ, గౌరవనీయులకీ లోపలికి వెళ్లటానికి ఆంక్షలు లేవు. కక్ష్యలు దాటి లోపలికి నడిచాడు. జలతారు తెరవెనుక లాడీ బేగం! “కూర్చోండి పండిట్ జీ..” జగన్నాథుడు కూర్చోలేదు. ఆమె కొనసాగించింది “పాదుషావారూ, మాజీ – రాత్రికి రాత్రి బయలుదేరి సిక్రీవైపు వెళ్లారు. వారిని పెద్ద పరివారమే అనుసరించింది.. యుద్ధం సంగతి వినే వుంటారు”.

“హా! జీ..”

“షహజాద్ షరియార్ గురించే మాజీ ఆందోళన.. ఏమి కానున్నదో”

మౌనమే ప్రత్యుత్తరంగా నిలిచాడు జగన్నాథుడు.

“మా – మిమ్మల్ని పంపిన రాచకార్యం గురించి చెప్పింది. ఏమయ్యింది?”

“మేము వెళ్ళేసరికే పోరు మొదలయింది. ఎవ్వరినీ కలిసే అవకాశం కలుగలేదు. తిరిగి వచ్చాము బేగం సాహెబా.”

“అవును. మీరైనా ఏం చేయగలరు?” అని “చివరికి నా బతుకు గాలిలో దీపమైంది” నిరాశగా అన్నది. ఆమె కళ్ళు చెమర్చటాన్ని ఊహించగలిగాడు జగన్నాథుడు.

“అంతా దైవేచ్ఛ తల్లీ” అన్నాడు.

“అవును. పాదుషా వారి ఆరోగ్యం బాగా లేకున్నా, వారు పుత్రక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.”

‘తీసుకున్నది పాదుషా వారా? మీ అమ్మా?’ అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆమె అన్నది, “అబ్దుల్లా ఖాన్, రాజా బసు, మీర్జా అజీబ్ వంటి యోధులూ వెళ్ళారు. పర్యవసానం ఎలా వుంటుందో?”

“మీరు ధైర్యంగా వుండండి సాహెబా. అంతా సవ్యంగా జరుగుతుంది” అని సెలవు తీసుకుని బయటికి వచ్చేశాడు.

జగన్నాథుడి ముఖకవళికలు మారాయి. గంభీరంగా ముందుకు సాగి అసఫ్‌ఖాన్ భవనం వైపు నడిచాడు. బయటనే ఎదురైనాడు పారాభటుడు. “హుజూర్ సాబ్ ఘర్ మే నహీ హై..”తో మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళారని అడగదలచుకోలేదు.

గబగబా వెనక్కి తిరిగాడు. దారిలో చిన్న చౌరస్తా దగ్గర జనసమూహం. ఆగాడక్కడ. దగ్గరగా వెళ్ళి జనంలో నిలిచాడు జగన్నాథుడు.

ఎత్తయిన రాతిని సింహాసనంలా భావించుకుని దర్పంగా దానిమీద కూర్చుని ఉపన్యాసాన్ని దంచుతున్నాడు – ఒక వయసు మళ్ళిన ముస్లిమ్ వృద్ధుడు. “స్త్రీ బుద్ధిః ప్రళయాంతకమ్ – అన్నారు” ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. సంస్కృతంలో సూక్తుల్ని ఉటంకిస్తున్నాడాయన. ఆ వెంటనే ఉర్దూలో తన మాటల్ని కొనసాగించాడు. “మనిషి ఎప్పుడు ఏ బలహీనతకి లోనవుతాడో తెలీదు. ఆ బలహీనత పర్యవసానం ఒక్కొక్కప్పుడు తననే కాక, తన వారందరినీ ఇక్కట్లలో పడేస్తుంది. “

“ఏంటో సొద…” అనుకుంటూ ఒకాయన జగన్నాథుడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడినుంచీ వెళ్ళిపోయాడు. వృద్ధుడు మాటలు సాగించాడు. “మీ అందరికీ అంతా తెలిసిన సత్యాల్నే చెబుతున్నాను. కాకుంటే, మీరు తెలిసినా తెలియనట్లు నటిస్తూ ఉంటారు” అని వెకిలిగా నవ్వి, గడ్డం సవరించుకుని, రక్కునలేచి ఒక్క ఉదటున రాతి తిన్నె మీద నుంచీ దూకి పరిగెత్తుకుపోయాడు.

జనం నివ్వెరపోయి చూశారు. నెమ్మదిగా ఎవరిదారిన వారు అతని గురించి చెప్పుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. జగన్నాథుని పక్కగా వెళ్తున్న మనిషి, “పాదుషా వారి గురించేలే ఆ పిచ్చివాడు చెప్పేది” అని స్వరం తగ్గించి, నెమ్మదిగా “అసలే ఆయనకి అనారోగ్యం. ఈమేమో ఏకంగా యుద్ధానికే లాక్కుపోయింది” అంటూ జగన్నాథుని తప్పుకుని వెళ్ళిపోయాడు.

అనుభవాల్లో జీవించటం మనిషి నైజం. ఆ అనుభవాల్లో రాణీవారి అధికారం పైచేయి కావటాన్ని విన్నవారికీ, కన్నవారికీ – ఇప్పుడు ఆమె పాదుషా వారిని యుద్ధానికి తీసుకువెళ్ళిందనేది స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నాలుకల మీద ఊరేగిస్తున్నారు జనం.

తలపుల్ని మోస్తూ ఇంటికి తిరిగివచ్చాడు జగన్నాథుడు. ‘అసఫ్‌ఖాన్ ఏమైనట్టు?’ ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here