Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-14

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[నూర్జహాన్ నుంచి వర్తమానం కోసం ఎదురుచూస్తాడు జగన్నాథుడు. అర్ధరాత్రి కబురు వస్తుంది. వెళ్తాడు. మందిరంలో ఎవరి మీదనో కేకలు వేస్తూ ఉంటుంది మహారాణి. నమస్కరించి నిలబడతాడు జగన్నాథుడు. భీమసింగ్ మోసం చేశాడనీ, శత్రుపక్షంలో చేరిపోయాడని చెబుతుంది. వెంటనే బయల్దేరి సిక్రీ వెళ్ళి యుద్ధరంగంలోని పరిస్థితులను స్వయంగా తెలుసుకుని రమ్మంటుంది. రాయముకుందుని కలిసి భావి మొగలాయీ సామ్రాజ్య క్షేమానికి బాసటగా నిలవమంటుంది. జగన్నాథుడు యుద్ధరంగానికి బయల్దేరుతాడు. యుద్ధరంగానికి సమీపంలో శకటాన్ని, అశ్వికులని నిలిపి తాను ఒక్కడే ముందుకు నడుస్తాడు జగన్నాథుడు. శత్రుపక్ష శిబిరాల వైపుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అతన్ని ముందుకు రానివ్వరు. పాదుషావారి ఆజ్ఞాపత్రాన్ని చూపినా అడుగడుగునా అవరోధాలు ఎదురవుతాయి. చివరికి ఉద్ధామ్‍సింగ్ అని ఫౌజ్‌దార్ ద్వారా కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకుంటాడు. ఢిల్లీ చేరుకుంటాడు. పాదుషావారూ నూర్జహానూ సిక్రీ వైపు వెళ్ళిపోతారు. పాదుషా వారూ, నూర్జహాన్ బేగం లేకపోయినా, తాను వెళ్లి అసఫ్‌ఖాన్‌ని కలిసి విషయాల్ని వివరించటం అవసరం అని భావిస్తాడు జగన్నాథుడు. చివరికి అంతఃపురానికి వెళ్ళి తాను తెలుసుకున్నదంతా నూర్జహాన్ కూతురు లాడీబేగం‍కి వివరిస్తాడు. ఆమెకు ధైర్యం చెప్పి వస్తాడు. అసఫ్‍ఖాన్ ఇంటికి వెళ్ళగా, అతను ఇంట్లో లేడని నౌకరు చెప్తాడు. అసఫ్‍ఖాన్ ఏమయ్యాడన్న ప్రశ్నకి సమాధానం దొరకదు. ఇక చదవండి.]

అధ్యాయం-23

[dropcap]రో[/dropcap]జులు గడుస్తున్నాయి. నెల తిరిగింది. ఆరు నెలలయింది.

యుద్ధం జరుగుతున్నట్టు లోకానికి స్పష్టంగా తెలిసిపోయింది. జగన్నాథుడి మనసు కలవరంలోనే ఉన్నది.

పాదుషా అస్వస్థుడుగా ఉన్నాడు. నూర్జహాన్ ఆజ్ఞల మేరకు సైన్యాధ్యక్షులు పోరుబాటలో నడుస్తున్నారు. ఆవలి పక్షంలో భీమసింగ్, ఖుర్రం, మహబత్‌ఖాన్ మాత్రమే కాక, జయపురం, ఉదయపురం రాజపుత్ర సైన్యాలు కలిశాయి. ఇంతకింతటి పరిణామం అసఫ్‌ఖాన్ కూడా నూర్జహాన్‌కి కించిత్తు సందేహాన్ని కలిగించకుండా చల్లగా మొగల్ సైన్య బాధ్యతనుండి జారుకుని ఖుర్రం పక్షానికి వెళ్ళిపోయాడు.

యుద్ధం వార్తలతో ఆగ్రా ఢిల్లీ నగరాల దైనందిన జనజీవనం కుతకుతలాడుతోంది.

జగన్నాథుని ఒకటిరెండుసార్లు పిలిపించి సలహాలు అడిగింది లాడీబేగం. ఆయన మర్యాద మీరకుండానే వాంఛితాన్ని చెప్పాడు. “నూర్జహాన్ బేగం తన పట్టుదల వదలి రాజ్యవారసత్వానికి ఖుర్రంని అంగీకరిస్తే మంచిది” – అనేది ఆ సలహా.

‘మీ సలహా మంచి’దనే మాటే లాడీ బేగం అంది. పైగా షహజాదా షరియార్ ఇంతటి భారాన్ని మోయలేడని ఎంతచెప్పినా తన తల్లి వినలేదనే విచారాన్ని ఆయనకు చెప్పుకుంది.

ఆమె హృదయక్షోభ అర్థమైంది జగన్నాథునికి.

మరోసారి వెళ్ళినప్పుడు –

యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి తనకు ప్రభుత్వ విధులు, బాధ్యతలు, నిర్వహించవలసిన బరువు బలవంతంగా నెత్తిన పెట్టి వెళ్ళినందుకు బాధపడింది. కాకుంటే ఖాన్‌జాన్ లోడీని పిలిపించి తనకు సహకారిగా ఉంచి వెళ్ళింది. ఆయన నూర్జహాన్ ‘జూంటా’లోని సైన్యాధికారి. ఆయనే తనకూ ఢిల్లీకీ సంరక్షకుడు! ఆ సందర్భంలో తనకూ తల్లికీ జరిగిన సంభాషణ సారాన్ని చెప్పుకొచ్చింది.

చివరికి, “రాజ్యాన్ని ఎవరు ఏలితే మాత్రం ఏమిటి పండిట్‌జీ. మావంటి భార్యాభర్తలు ప్రశాంతంగా బతికితే మాకు చాలదూ. అందునా షరియార్ నాకంటే ఎక్కువ అమాయకుడు కదా!” అని గద్గదికంగా అన్నది. “మా జీ భయమంతా ఖుర్రం రాజు అయితే తననీ, తన వారందరినీ అంతం చేస్తాడనే” అన్నది.

తాను అనుకుంటున్న దానికంటే ఆమె ఎక్కువగానే మథనపడుతున్నదని అర్థం చేసుకున్నాడు జగన్నాథుడు.

అతను శలవు తీసుకుంటుంటే లాడీ బేగం మరోమాటా అన్నది. “ఖుర్రం షరియార్ అంటే అమిత ప్రేమ. నాకు తెలుసు”.

ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. ఈమె అందరూ అనుకునేంత అమాయకురాలేమీ కాదు. వివేకం, విచక్షణాజ్ఞానం వున్నాయి. తల్లి మర్యాదనీ, మాటనీ మన్నిస్తోంది. అంతకు మినహా గత్యంతరమూ లేదు. ఇప్పుడు తల్లిదే అధికారమూ, మాట చెల్లుబాటూ కదా!

– ఇంటికి వచ్చాడు.

వసారాలో నలుగురు శిష్యులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు ముస్లిం.

సంస్కృత పాఠాన్ని చెబుతోంది కామేశ్వరి. తాను లేనప్పుడూ, రావటం ఆలస్యమైనప్పుడూ, అప్పుడప్పుడూ ఆమే ఉపాధ్యాయురాలి పాత్రని నిర్వహిస్తుంది!

పాఠం ఆగింది. పరామర్శల తరువాత శిష్యులకి సెలవిచ్చాడు జగన్నాథుడు. వారు వెళ్ళిపోయారు.

“ఏమిటి విశేషాలు?” యథాలాపంగా అడిగింది కామేశ్వరి. మంచం మీద కూర్చుని నిట్టూర్చి, ఆనాటి విశేషాలన్నీ చెప్పాడు. “మీరు బాగా కలతపడుతున్నారు”. అంటూ వచ్చి భర్త దగ్గరగా కూర్చుంది. ‘అవును, కామూ. మనసు మూలమూలల్లో ఎక్కడో.. నాకు అపరాధభావం ముల్లుగా గుచ్చుకుంటోంది. నూర్జహాన్ బేగం వారు నాకిచ్చిన బాధ్యతని నెరవేర్చలేక పోయాననే విచారం అది.”

“కావాలని చేసింది కాదు గదా మీ తిరోగమనం, పరిస్థితులూ వాతావరణం అనుకూలంగా లేవు. అంతేకదా! మీ నిస్సహాయతకు హేతువు వున్నది కదా! బాధపడటం ఎందుకూ?”

“అది వాస్తవమే అయినా, ఏమో..! ధర్మాధర్మ విశ్లేషణతో ఒక ఊగులాట నన్ను బాధిస్తున్నది కామేశ్వరీ” అన్నాడు.

తలెత్తి అతన్ని పరీక్షగా చూసింది.

సుముఖంగా, ప్రేమగా ఉన్నప్పుడు ‘కామూ’ అంటూ సంబోధిస్తాడు. ‘కామేశ్వరీ’ అని ఇలా అన్నాడంటే, అందులో ఉద్విగ్నత వుంటుంది. ఆమె నుండీ ఊరటగానీ, ధైర్యంగానీ ఆశిస్తున్నప్పుడు అసంకల్పంగా ఇలా ‘కామేశ్వరీ’ అనే సంబోధిస్తాడు. భర్త మనసెరిగిన సహదర్మచారిణి కదా! ఆమె.. వెంటనే అర్థం చేసుకుంది.

కొంచెం పక్కకి జరిగి చేరువయింది. భుజం మీద చేయి వేసింది.

“బాగా కలిసిపోయి ఉన్న ధర్మాధర్మ, సత్యాసత్యాది విషయాలను, దేనికి దాన్ని వేరుగా చూడగల హంసవంటివారు మీరు. వాటిని వేర్పాటుచేసి లోకం ఎదుట పెట్టటంలో ఉపేక్ష ఎందుకు వహిస్తారు మీరు?” అన్నది. వెంటనే “అసలు అలాంటి పొరపాటు చేసే లక్షణమే లేదు కదా- మీ స్వభావంలో నిశ్చింతగా ఉండండి” అనీ తేలికగా నవ్వేసింది.

భార్య కంఠస్వరాన్ని బట్టి – తాను లోలోపల పడుతున్న మథననీ, మనసులో తనకు తాను సాగిస్తున్న తర్కాన్నీ తీసి పక్కన పెట్టేసిందని తెలుస్తూనే ఉన్నది.

‘ఆచరణాత్మకమైన తత్త్వాన్ని బోధిస్తున్నది కామేశ్వరి’ – జగన్నాథుడి మనసు తేలికపడింది. “ఆహాఁ.. మంచి మనస్తాత్విక విశ్లేషకురాలైనారు ఉపాధ్యాయినివారు. వేదాంతమూ బోధిస్తున్నారు” అని తానూ నవ్వేడు. “మనస్తత్వాన్ని విశ్లేషించే స్థితిలో వేదాంతమూ ఉంటుంది స్వామీ” అంటూ లేచింది. “అవును.. ఇలాంటి కొన్ని సందర్భాలలో పరిస్థితుల్ని యథాతథంగా స్వీకరించక తప్పదు. మన ప్రమేయమూ బాధ్యతా నిమిత్తమాత్రమే” వంటగదిలోకి వెళ్తున్న కామేశ్వరి విలాసంగా వెనక్కు తిరిగి “ధన్యోస్మి” అని కళ్ళు చికిలించింది. ‘కామేశ్వరి స్నేహమయి. వాత్సల్యమూర్తి. విజ్ఞురాలు’ అనుకున్నది జగన్నాథుని మనసు!

***

యుద్ధవార్తలు ఢిల్లీ నగరాన్ని కంపింపచేస్తున్నాయి.

ఏది నిజమో, ఏది అబద్ధమో – నీలివార్తో, గాలి వార్తో అర్థం కావటం లేదు. ఒకరోజు పాదుషా వారు గెలిచారనే వార్త వస్తుంది. మరునాడు – శత్రువులదే పైచెయ్యిగా ఉందిట, గజసింగ్ రాజపుత్రులతో చేరిపోయాడుట – అనే పిడుగు పడుతుంది. ఈ ప్రచారంలో ప్రభువుల తాబేదార్లూ ఉంటారు; వ్యతిరేకులూ ఉంటారు. నగరంలో నిత్యావసర వస్తువుల ధరలకి రెక్కలు వచ్చేశాయి. ప్రజలు – నగరం కంటే పట్నాలూ, పట్నాలకంటే శివార్లూ భద్రతనిస్తాయనే భావనతో కదలికలు మొదలు పెట్టారు.

లాడీబేగంని కలవాలని ఒకటిరెండుసార్లు ప్రయత్నించాడు జగన్నాథుడు. ఆమె అనుజ్ఞనీయలేదు. కారణం తెలియదు. ఆమెకు సన్నిహితురాలైన ఫాతిమా – “బేగం సాహెబా ఆందోళనలోనే ఉంటున్నది. అప్పుడప్పుడూ ఏడుస్తున్నది. మేము ఏమడిగినా ‘మీకెందుకన్నట్లు’గా గ్రుడ్లురిమి చూస్తున్నది” అని రహస్యాన్ని చెవినవేసింది.

తీవ్రంగా ఆలోచించాడు – జగన్నాథుడు. భార్యనీ సంప్రదించాడు. “కీడెంచి మేలెంచమన్నట్టు ఖుర్రంది పైచెయ్యి అయితే, మనకూ ముప్పు రావచ్చు. ఆ ముప్పు తప్పకుండా బేగం సాహెబా, పాదుషాల వల్లనే రావచ్చు అనిపిస్తోంది” అన్నది కామేశ్వరి. ఆమెనే తేరి చూశాడు జగన్నాథుడు. ఆమె కొనసాగించింది. “అవును. దుష్ప్రచారానికి పూనుకొనేవారే ఎక్కువ. పైగా, మనమంటే మాత్సర్యంతో లోలోపల ఉడుకుతున్నవారి సంఖ్యకేమీ తక్కువ లేదు. ఆలోచించండి..”

సాధారణ ప్రజల్లో ఎక్కువశాతం అవిద్యలోనూ, అజ్ఞానంలోనూ ఉండి సతమతమయ్యేవారే. వివేకం తక్కువ. గాలివాటం మనుషులు. పైగా కరువు పరిస్థితి. కడుపులు మాత్రమే కాదు. గుండెలూ మండుతూ ఉంటయ్. కష్టాల్లో ఉన్న ప్రజలు.. ప్రభుతకు ఎదురు తిరిగితే? పైగా ఇప్పుడు రాజులేని నగరం.. లాడీబేగం నామమాత్రపు అధికారిణి. అరాచకానికీ అవకాశం లేకపోలేదు. తన తలపుల్లో తాను మునకలు వేస్తున్నాడు జగన్నాథుడు. ‘కిం కర్తవ్యమ్?’ ప్రశ్న కలవరపెడుతోంది.

అరమోడ్పు కన్నులతో ఆలోచనలో పడ్డాడు జగన్నాథుడు. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెనం మీద నుండీ పొయ్యిలో పడినట్లు కాకూడదనే జాప్యం చేస్తున్నాడు. అప్పటికి మాత్రం “చూద్దాం… కానీ..” అనేసి ఊరుకున్నాడు.

అధ్యాయం-24

యమునా తీరంలో ఉషోదయాన్ని ఆహ్లాదిస్తూ కూచుని ఉన్నాడు జగన్నాథుడు.

నిన్నటినుండీ మననం అంతా ‘అమృతలహరి’ మీదనే సాగుతోంది. యమునా నదీ రూపం అది. యమునని చూస్తుంటే అమృతం త్రాగినట్లుంటుంది. నిన్నటి శ్లోకాలు ప్రవాహినీ సదృశంగా దుమికాయి. ఇప్పుడు కొన్ని మేధలో ఉబికి వస్తున్నాయి. రాజాశ్రయాలూ, ధనార్జనలూ, సుఖభోగవాంఛలూ లేకుండా యమునా తీరంలో శ్రీహరి సేవనంలో గడిపితే ఆ జీవనం ఎంత హాయిగా ఉంటుంది అనే భావన స్ఫురించింది.

ఓ పక్కనుంచీ వచ్చాడు – హరీశ బ్రాహ్మణ్! పరిచయం పునశ్చరణ జరిగింది.

కొన్నాళ్ళ క్రితం ఏదో పండితగోష్టిలో పరిచయమైనాడాయన. జహంగీర్ వారి సాహిత్య సమావేశాల్లో ఉండేవాడేనట. కానీ, ఆ మధ్య తన ప్రాంతానికి వెళ్ళి వచ్చాడుట.

“ఏమిటి స్వామీ విశేషాలు?” అడిగాడు జగన్నాథుడు.

“మీకు తెలియనివి ఏమున్నయ్ పండిట్‌జీ, పాదుషావారి ఆరోగ్యం బాగా లేదుట. అటు యుద్ధమా – రావణకాష్టం అంటారే అలా సాగుతోంది” అని “లాహోర్, ఢిల్లీ, ఆగ్రా, సిక్రీ – నగరాలన్నీ యుద్ధ వార్తలతో నీరూ గాలీ లేనట్లు కొట్టుకులాడుతున్నై”

“మరి.. పాదుషావారు యుద్ధంలో లేరా?”

“ఎవరు ఎక్కడున్నారో ఎవరికెరుక?” అని “అంతేకాదు.. అసలు ఎవరు ఉన్నారో, ఎవరు లేరో కూడా ఎవరికీ ఎరుక లేకుండా పోతోంది కదా!” అన్నాడు.

“ఎవరి గురించి మీరంటున్నది?”

“షహజాదా షరియార్ గురించే అనుకోండి. లేదా అసఫ్‌ఖాన్ గురించే అనుకోండి..” అని “అయినా, ఇలాంటి ప్రశ్నలూ- సందేహాలూ – చర్చనీయం కావు ఈనాటి పరిస్థితిలో” అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

జగన్నాథుడి ఆలోచనలన్నీ లాడీబేగం చుట్టూ తిరుగసాగాయి. నెలలు గడుస్తున్నాయి. ఆమె మానసికంగా, భౌతికంగా అవస్థపడుతోంది. పాలనా వ్యవహారాలన్నీ ఎంతగా ఖాన్‌జాన్ లోడీ చూసుకుంటున్నా, ఆమె వ్యథ ఆమెకు ఉండనే ఉన్నది. అది ఆమె భర్త గురించి!

ఒకసారి ఆమెని కలిసివద్దామని రాచనగరువైపు నడక సాగించాడు.

జగన్నాథుడికి అనుమతి వచ్చింది. లోపలికి వెళ్ళేసరికీ – లాడీబేగం నిర్వేదంతో మందిరంలో ఒకమూలగా ఉన్న తల్పం మీద పడుకుని ఉన్నది. జగన్నాథుని చూసి లేచి కూర్చున్నది. అయినా, నిర్లిప్తంగా జగన్నాథుని మాటకోసమే వేచి చూడసాగింది. క్షణాల తర్వాత, “ఏమైనా వార్తలు అందాయా తల్లీ” అని ఆదరణ పూర్వకంగా అడిగాడు.

“మీరు వినలేదా పండిట్‌జీ? పాదుషా వారికి తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నది. స్థలం మారితే కొంత ఉపశమనంగా ఉంటుందనే ఆలోచనతో మా అమ్మ వారిని కాశ్మీర్ పంపింది. కానీ, అక్కడా వారికి ఏమీ కుశలం చిక్కలేదట..” మాటలు తడుముకుంటున్నట్టు “ఏమో ఆమె ఆంతర్యం.. తన యుద్ధ వ్యూహాలకీ, ఆజ్ఞలకీ ఆయన బహుశ అంగీకరించటం లేదనీ కావచ్చు.. “ అన్నది.

విషయంలో కొత్తదనం లేకపోయినా, ఇలా విశ్లేషించి చెప్పినందుకు కించిత్తు ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. ఆమె మాటలకు ఏమనాలో తెలియక ఆగాడు.

ఆమే మళ్ళీ, “షహజాదా మీద చెర్నాకోల ఝళిపిస్తూ, తానే సేనానులకు, ‘హుకుం’లు జారీ చేస్తున్నదిట. అయినా మన సేనా నాయకులు ఇదివరకటి శౌర్య సాహసాల్ని చూపలేకపోతున్నారుట. అందరూ అసఫ్‌ఖాన్‌కి భయపడుతున్నారల్లే వుంది!” అన్నది. మనసులోని భావాల్ని కొంతవరకూ జగన్నాథుని ముందు బయటపెట్టింది. కొద్దిసేపు యుద్ధానికి సంబంధించిన మాటలే జరిగాయి.

ఆ తర్వాత చాలాసేపు మందిరంలో నిశ్శబ్దం అలముకుంది.

జగన్నాథుడు సెలవు తీసుకుంటూ లేచాడు. బయటికి నడుస్తుంటే, వేగంగా అడుగులు వేసుకుంటూ ఏదో ఆందోళనతో ఖాన్‌జాన్ లోడీ మందిరం లోపలికి ప్రవేశించటాన్ని చూశాడు. ఆగి విషయం తెలుసుకుందామా అనే విచికిత్స కలిగింది. కానీ, ఒకసారి సెలవు తీసుకున్న తర్వాత, ఆమె పిలవకుండా వెనుదిరిగి నిలవటం రాచమర్యాదలకు విరుద్ధం అనే భావనతో ముందుకే సాగిపోయాడు. ఖాన్‌జాన్ లోడీ తెచ్చిన వార్త బేగంకి ఆశనిపాతమేనని జగన్నాథునికి తెలియదు!

***

యుద్ధ రంగాన్నీ, షరియార్ మరణాన్నీ, వరుస చిత్రాలు రచించినట్లు దృశ్యమానం చేశాడు ఖాన్‌జాన్ లోడీ.

ఆ దృశ్యాల్ని కళ్లముందు నిలుపుకునీ, అతను చెప్పిన మాటల్ని వినీ-స్పృహ తప్పి పడిపోయింది లాడీబేగం.

ఆమెను తెప్పరిల్లచేయటానికి పరిచారికలను పురమాయిస్తూ తత్తరలాడసాగేడు.

మందిరం గవాక్షాల్లో నుంచీ ఈ వార్తని గాలి నగరంలోకి మోసుకుపోయింది.

అదను చేసుకోవటంలోనూ, అవకాశం చూసుకోవటంలోనూ కాలానికి కొత్త పాఠాలేమీ అక్కర్లేదు!!

షరియార్ మరణవార్త తెలిసిన వెంటనే హుటాహుటిన రాజమందిరానికి వచ్చాడు జగన్నాథుడు. తనతోపాటు కామేశ్వరినీ తీసుకుని వచ్చాడు. జరిగిన దుర్ఘటన పర్యవసానాన్ని ప్రత్యక్షంగా తానుగా అనుభవిస్తున్నదీ, విలపిస్తున్నదీ – లాడీబేగం – ఒక స్త్రీ! ఆమెకీ సమయంలో మరో స్త్రీ అనునయానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే కామేశ్వరిని కూడా తీసుకువచ్చాడు.

మనుషుల మధ్య అంతఃకరణల్ని తట్టి లేపేవి ఇలాంటి సందర్భాలే. ఉద్విగ్నతల్నీ, సున్నితమైన మానసిక ఉద్వేగాల్ని సంచలింపజేసేవి ఇలాంటి సన్నివేశాలే. మతాలూ, కులాలూ, పదవులూ, సాంఘికస్థాయీ భేదాలూ ఈ క్షణంలో మానవసంబంధాల మధ్య అవరోధంగా నిలవవు. ఇప్పుడు ఆమెకు కావలసింది హృదయసాన్నిహిత్యం మాత్రమేకాదు; భౌతికమైన ఓదార్పుగా ఒక ఆత్మీయ పరిష్వంగం – ఈ మనస్తాత్వికశాస్త్ర ప్రవీణుడే జగన్నాథుడు. అందుకూ కామేశ్వరిని తోడ్కొని వచ్చింది!!

మందిర ద్వారం దాటి లోపలికి వస్తున్న కామేశ్వరిని చూసీ చూడగానే ఒక్కసారిగా లేచి నిలబడింది-లాడీబేగం.

ఆ వ్యవధిలోనే కామేశ్వరి కూడా వేగంగా అడుగులేసి బేగంని సమీపించింది. బేగం పెదవులూ, ముకుపుటాలూ అదిరినై. ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలతో ఎద కొలిమితిత్తిలా అయింది. కళ్లు వర్షించాయి.

కామేశ్వరి అప్రయత్నంగా ఆమెను దగ్గరికి పొదువుకొని భుజంపై తట్టి, నిదానంగా అడుగులు వెనక్కివేయించి – ఆసనం మీద కూర్చోబెట్టింది. ఆమె వీపు నిమురుతూ తానూ పక్కగా కూచుంది. చెమర్చిన తన కళ్లను కొంగుతో తుడుచుకుంది.

కామేశ్వరి జగన్నాథుని భార్య అని నిశ్చితంగా తెలియదు లాడీబేగంకి కానీ, పరిస్థితులూ, పరిసరాలూ, ప్రత్యక్ష ప్రమేయంగా తన ఎదుట నిలబడిన వ్యక్తులూ.. వీటన్నిటి సమాహారం మేధకు అంది, అసంకల్పంగా లాడీబేగం గుండెలోకి ప్రవహింపజేసిన సందేశం- ‘కామేశ్వరి తనకు కావలసిన మనిషి’! అంతే! ఆమెని పట్టుకుని సంభాల్ కీజియే షహజాదీ బేగం’ అని ఆమె కళ్లు తుడిచింది కామేశ్వరి. మరింత దగ్గరగా జరిగి ఆమెను ఒడిలోకి తీసుకుంది.

అంతే! లాడీబేగం అప్రయత్నంగా గొల్లుమన్నది. భర్త మరణశోకానికి ఒక చల్లని స్పర్శ. తల్లి దగ్గర లేని ఒక ఆడపిల్ల దుఃఖాన్ని ఆప్యాయంగా అనునయించిన ఆత్మీయ పరిష్వంగం!!

చాలా సమయం గడిచింది. దుఃఖం నుండీ తేరుకుని ప్రస్తుతంలోకి వచ్చింది బేగం. యుద్ధరంగ వార్తల్నీ, ఢిల్లీ ఆగ్రా నగరాల్లోని స్థితిగతుల్నీ పూసగుచ్చినట్లు చెప్పింది.

మనసుల కలబోత తర్వాత సెలవు తీసుకుని వచ్చేశారు -జగన్నాథ దంపతులు.

అక్కడ –

షహజాదా షరియార్ యుద్ధరంగంలో నిలిచి కత్తి దూయకుండానే, శత్రువుల చేతిలో హతుడైనాడు. తన శిబిరంలో సుందరాంగుల మధ్య మదిరాపానంలో మునిగివున్న అతన్ని భీమసింగ్, అసఫ్‌ఖాన్ కలిసి వధించేశారు.

అయితే, ఈ దారుణాన్ని గజసింగ్ చూడనే చూశాడు, ఆయనకి పరిస్థితి అర్థమైంది. షరియార్ హత్యతో రానున్నది పెద్ద ఉపద్రవమే! క్షణాల్లో అతని మస్తిష్కం చురుకుగా పనిచేసింది. కళ్లు విస్ఫులింగాలయినాయి. క్రోధం పడగెత్తింది. స్వామిభక్తి తెగింపు నిచ్చింది.

షరియార్‌ని సంహరించి శిబిరం బయటకు వస్తున్న ఇరువురినీ చూశాడు. గజసింగ్‌ని చూసిందే తడవుగా అసఫ్‌ఖాన్ మెరుపువేగంతో మాయమైనాడు. ఇక, లిప్తకాలం కూడా వృథా చేయలేదు గజసింగ్. ఒక్క దూకుతో సరాసరి భీమసింగ్ ముందు వాలాడు.

విజయం చేతికందినట్లేనన్న ఉత్సాహంతో ప్రమత్తుడై వస్తున్న భీమసింగ్ ఈ ఎక్కటిపోరుకు దాదాపు ప్రతిచేష్టలు దక్కిన వాడైనాడు.

గజసింగ్ అప్రతిహతంగా విజృంభించాడు. సవ్యసాచిలా రెండు చేతుల్లోని కరవాలాలతో భీమసింగ్‌ని చలన దిగ్బంధం చేసేశాడు.

వేటు పడనే పడింది. భీమసింగ్ నేలకొరిగాడు.

“గజసింగ్! నీ చేతిలో వీరమరణం నాకు ఆనందదాయకమే. అయితే, ఒక్కమాట గుర్తుంచుకో. నీ సాహసం, శౌర్యం, స్వామిభక్తీ నిరర్థకం కాబోతున్నాయి. నేను వారించినా, ప్రార్థించినా నీవు ఖుర్రం పక్షానికి రాలేదు. నీవు, నీ రాణీబేగం ఎంత గింజుకున్నా రేపు విజయం ఖుర్రందే” ఇదే భీమసింగ్ చివరి సందేశం. అతను తుదిశ్వాస వదిలాడు. గజసింగ్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.

***

ఢిల్లీ నగరం ఉన్నతమైపోయింది. ప్రజలకు సుఖశాంతులు కరువై, ఆందోళనలు అధికమైనాయి.

అనూహ్యమైన సంచలనం – రాజోద్యోగుల్లో చీలికలు, సైన్యసమూహంలో ఘర్షణలు – చెదురుమదురుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు – ఖుర్రంకి విశ్వాసపాత్రులూ, నూర్జహాన్ అనుయాయులూ!

ఖాన్‌జాన్ లోడీ, లాడీబేగం – ఇద్దరూ పరిస్థితిని గమనిస్తున్నారు కానీ- తగిన దృఢమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు.

బేగం ఆలోచనల్లో మునకలు వేస్తున్నది. ‘పర్విజ్’ని తన తల్లే హత్య చేయించిందట. సింహాసనానికి షరియార్‌కి అడ్డుకాకూడదని. ఖుస్రూ ఎన్నడో పోయాడు. ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చాడు జహంగీర్ ఇంకొక కొడుకు జహందర్ మిర్జా. అతనేమైనాడో ఎవరికీ తెలియదు. ఎవరికీ పట్టలేదు కూడా. నిజానికి పదేళ్లనుంచీ అతని ఆచూకీ లేదు. అతని గురించిన వార్తలు గానీ, వివరంగానీ లేవు.

జహందర్ మిర్జా ఉంటే ఖుస్రూని ఎదుర్కొంటాడా? లేక అతనితో కలుస్తాడా? ఏమో..? ‘ఇదంతా వ్యర్థపు ఆలోచన’ అనిపించింది. అయినా, దృశ్యం అదృశ్యంగా ఏమీ లేదు. మిగిలింది ఖుర్రం పాదుషా కావటమేగా? అయితే.. తండ్రి ఆరోగ్యం, తల్లి పరిస్థితి ఏమిటి? ఇద్దరూ చెరో కారణంగా ఇప్పటికిప్పుడు కత్తుల బోనులో చిక్కుకున్నవారే!

లాడీబేగం మనసంతా కలచినట్లవుతున్నది. కలవరంగా వున్నది. ఆలోచనల నుంచీ ప్రస్తుతానికొచ్చేసరికీ, ఢిల్లీని సంరక్షించుకోవలసిన బాధ్యత తనదనే కర్తవ్యం గుర్తుకొచ్చింది.

ఉన్నట్టుండి పిచ్చిపట్టినదానిలా ఊగిపోతూ పొలికేక పెట్టింది- “ఎవరక్కడ?” రాజమందిరం ప్రతిధ్వనించింది. కరకు బరాబరులు.. బెరుకు ఉరుకులు.. మెరుపు పరుగులు..!

“ఢిల్లీ నగరం మొత్తంలో ఉన్న మీర్ బక్షీనీ, బక్షీల్నీ, సుబేదార్లనీ, కొత్వాల్‌నీ పిలవమని ఖాన్‌జాన్‍కి చెప్పండి. పొండి” ఆమె అరుపు మందిరంలోనే అయినా, బయటవున్న ఖాన్‌జాన్ లోడీ గుండెని గుభిల్ల జేసింది.

పిలిపించిన వారందరూ వచ్చి లాడీబేగం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆమెకు కుడివైపున అలతిదూరంలో ఖాన్‌జాన్ లోడీ –

వాతావరణంలో గాలి లేనట్టుగా అనిపిస్తోంది. జవనాశ్వం తల విదిలించినట్లు తల పంకించింది బేగం. ఆమె మొహంలో చిరాకూ, విసుగూ కూడా విషణ్ణతతో కలిసి విచ్చాయలో విరుస్తున్నాయి. భీషణంగా ఉంది మనిషి వాలకం. “పండిట్‍జీ ఎక్కడ?” ఉన్నట్టుండి ఖాన్‌ని అడిగింది.

నేలచూపులు చూశాడు. తత్తరని మాత్రం కళ్ళల్లో నుండి తప్పించలేకపోయాడు. ఖాన్ తలెత్తి దూరంగా ఉన్న పరిచారకుడికి కనుసైగ చేశాడు. అతను సలామ్ చేసి బయటకు పరిగెత్తాడు.

బేగంకి ఏదో పానీయాన్ని అందించింది ఇష్టసఖి. తీసుకుని తాగింది. నెమ్మదించింది. “మీరంతా జహంగీర్ పాదుషావారి ఉప్పు తింటున్న వారే. మెప్పుకూడా పొందినవారే. పరిస్థితులు ఎలా మారాయో మీ అందరికీ తెలుసు” నిదానంగా చెప్పింది.

మీర్ బక్షీ ఒకసారి అందరినీ కలయజూసి, లాడీబేగం వైపు చూపు నిలిపి, “తెలుసు బేగం సాహెబా.. మీకు కలిగిన దుఃఖాన్ని మేము కూడా అనుభవిస్తూనే వున్నాం. ఈ విపత్తులో మీ ఆజ్ఞ ఏదైనా శిరసావహించి పాటిస్తాం. చెప్పండి” అన్నాడు. కొందరు ‘అవును’ అన్నారు. మరికొందరి తలలు ‘మీ ఆజ్ఞ తలదాలుస్తాం’ అన్నట్లుగా ఊగాయి.

“మీమీ పరిధిలో శాంతిభద్రతలు కాపాడటం ముఖ్యమైన బాధ్యత. ఖుర్రం అనుయాయుల్నీ, వారి తాబేదార్లనీ, సామాన్య ప్రజల్లో అతని అభిమానుల్నీ ఏరిపారేయండి” నిశ్చయంగా నిష్కర్షగా చెప్పింది.

సరిగ్గా ఆమె ఈ మాటలు ముగిస్తుండగా, వాకిలి దగ్గర నిలిచి అభివాదం చేశాడు జగన్నాథుడు.

‘వెళ్లవచ్చున’ని అందరికీ కనుసైగ చేసిందామె. ఖాన్‌కి మాత్రం ఆయన ఉండవచ్చు నన్నట్టుగా చేత్తో సంజ్ఞ నిచ్చింది. ఖాన్ ఆగిపోయాడు. అందరూ వెళ్లిన తర్వాత జగన్నాథుని స్వాగతించి, ఆసనాన్ని చూపింది. జగన్నాథుడు కూర్చున్న తరువాత, “పరిస్థితులన్నీ మీకు తెలుసు. శాంతిభద్రతల గురించీ, మన శత్రువుల నిర్మూలనం గురించీ కరకుగానే వారిని హెచ్చరించి పంపాను” అన్నది.

ఆమె మొహంపై తన రాజనీతిజ్ఞతకి కించిత్ గర్వరేఖని గమనించాడు జగన్నాథుడు. మనసులో ఆందోళన కలిగింది జగన్నాథుడికి. అయినా, దాన్ని ప్రస్ఫుటం కానీయకుండా “కానీయండి.. న్యాయహారాన్ని ఏర్పాటు చేసిన జహంగీర్ పాదుషావారి పుత్రిక మీరు బేగం సాహెబా. అందుకని, అంత కరకుదనం అక్కర్లేదేమో.. నిశ్చయంగా శత్రువు అని తేలిన తర్వాతే శిక్షని విధించమని ఆజ్ఞాపిస్తే చాలునేమో” చాలా నెమ్మదిగా శాంతంగానే అన్నాడు.

ఆమె అసహనంగా ఖాన్ వైపు చూసింది. “చూశారా.. ఇందుకే పండిట్‌జీని పిలవలేదేమని అడిగాన్నేను” అని “మీరు వెళ్లి తగిన విధంగా వ్యవహారాన్ని సర్దుబాటు చేయండి” అన్నది. ఆయన వెళ్లటానికి ఉద్యుక్తుడౌతుంటే, “ఉండండి.. మన సమాలోచన పూర్తిగా అయిన తర్వాతే వెళ్ళొచ్చు”అంటూ ఆపింది.

జగన్నాథుడి వైపు చూపు సారించింది.

“ఏమీ అనుకోవద్దు.. మరోమాట చెప్పాలనుకుంటున్నాను”.

“చెప్పండి..”

“నగరాల్లో, ప్రత్యేకించి ఢిల్లీలో యుద్ధ ప్రభావం వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులకు కూడా చాలా కటకటలాడుతున్నారు. సామాన్యులను కరువు ఎంతగా కాటు వేస్తున్నదో.. ఆ వాస్తవాలను అధికారులు మీదాకా రానీయరు. సామాన్య ప్రజానీకం నివురుకప్పిన నిప్పుకణాలు. ప్రభుతకు అణగిమణగి వుంటారు. సాధారణంగా సహనం వారి సహజాతం. కానీ, ఆ నివురుని ఇలాంటి భరించలేని పరిస్థితులు రగిల్చి, జ్వలింపజేస్తే- వారి ఓర్పు నశిస్తుంది.. తిరగబడతారు. అధికారులకు వారి కడుపుమంటని ఆపే శక్తి చాలదు. అంతర్యుద్ధాలు చెలరేగేది ఇందువల్లనే. కొంచెం ముందాలోచన చేయగలిగితే ప్రశాంతస్థితిని కాపాడవచ్చు. కనుక, ఇప్పటి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు వెంటనే చేయించకపోతే వచ్చిన విపత్తు పెద్దవిలయంగా మారే అవకాశముంది” సౌమనస్యంగా చెప్పాడు.

“పండిట్‌జీ వారు అంటున్నది యథార్థమే అయివుంటుంది కదా” అంటూ ఖాన్ వైపు చురుగ్గా చూస్తూ, “ఏం.. ఖాన్ మహాశయా ముఖ్య భక్షీ ఇతరులూ ఈ విషయాలను అంతగా పట్టించుకున్నట్టు లేదు. వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టండి. మా మాటగా చెప్పి అందరినీ హెచ్చరించండి. మీరిక వెళ్లవచ్చు” అన్నది.

ఖాన్ నిష్క్రమించాడు.

“సమయాన్నీ, సందర్భాన్నీ, రానున్న దాన్నీ – కానున్న దాన్నీ ఇలా సరీగా తేటతెల్లంచేసి సలహా చెప్పే పెద్దలు చాలా అవసరం పండిట్‌జీ” అంటూ ప్రశంసకి దిగింది. జగన్నాథుడికి ఇది ఇష్టంలేదు. ఆమెని వారిస్తూ, “అది మా కర్తవ్యాలలో, బాధ్యతలలో ముఖ్యమైనది బేగం సాహెబా” అన్నాడు.

ఆమెకి సంతోషం కలిగింది. “శ్రమ అనుకోక మీరు నాకొక కార్యక్రమ ప్రణాళికని తయారుచేసి ఇవ్వండి. అది అన్ని శాఖలకి సంబంధించి వుండవచ్చు. దాన్ని నేను వివిధ సంబంధిత రాజోద్యోగులకు ఇచ్చి అమలు జరిగేలా చూస్తాను. ప్రాధమ్యాల్ని గుర్తించటంలో, వాటి గురించి హెచ్చరించటంలో నేను మీకు చెప్పేంతదాన్ని కాదుకదా!”

అంతఃపుర పరిచారిక పండ్లరసాల పాత్రలను తెచ్చి అందించింది. బేగం అభ్యర్థన మేరకు తీసుకున్నాడు జగన్నాథుడు..

ఆ తర్వాత చాలా సేపు-ఆర్థిక, రాజకీయ విషయాలమీద సంభాషణ సాగింది. జగన్నాథుడు సెలవు తీసుకుని వచ్చేస్తుంటే, ఆందోళన సూచిస్తున్న అడుగుల సవ్వడితో భవనం మెట్ల మీద ఎదురైనాడు ఖాన్. ఈయన్ని చూసి ‘మీరు వెళ్తున్నారా..’ అనుకుంటూ చకచకా అడుగులు వేస్తూ లోనికి వెళ్లి పోయాడు. జగన్నాథుడు బయటికి నడిచాడు.

(సశేషం)

Exit mobile version