Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-16

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[కాశ్మీరులో జహంగీర్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. నూర్జహాన్ యుద్ధరంగం నుంచి రాకుండా వైద్య బృందాలని, అంగరక్షలను పంపుతుంది. జహంగీర్ కుమార్తె బహర్‌బాను కూడా వచ్చి తండ్రిని చూసుకుంటూ ఉంటుంది. జహంగీర్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయుర్వేద భిషక్కు రామాచారి చక్రవర్తిని పరీక్షించి – ఆయనని లాహోర్ తీసుకువెళితే మంచిదని సలహ ఇస్తాడు. సరేనని బయల్దేరుతారు. ఈ వార్త యుద్ధరంగంలో ఉన్న నూర్జహాన్‍కి అందుతుంది. అదే విధంగా వైరివర్గలకూ చేరుతుంది. మార్గమధ్యంలో రాజౌరీలో బస చేస్తారు జహంగీర్ బృందం. వెంటనే రావల్సిందిగా జగన్నాథుడికి కబురు చేస్తుంది లాడీబేగం. ఆమెకి తగిన సూచనలు చేసి వస్తాడు జగన్నాథుడు. కామేశ్వరీ, జగన్నాథుడు మానసిక అలజడికి గురవుతారు. ఢిల్లీ నగరం విడిచిపెట్టాలనుకుంటారు. ఇంతలో ఉదయపురం నుంచి మాన్‌సింగ్ అనే రాజోద్యోగి వచ్చి – రాణా జగత్‍సింగ్ ప్రభువులు జగన్నాథుడిని వెంటనే ముందు జయపురానికి తీసుకురమ్మన్నారనే కబురు అందిస్తాడు. సామగ్రీ అంతా సర్దుకుని సిద్ధమవుతారు. అమీన్ వద్దకు వెళ్ళి నివాసాన్నీ ఖాళీ చేస్తున్నట్టు, కాశీకి వెడుతున్నట్లు చెప్తాడు జగన్నాథుడు. కొందరు శిష్యులు వస్తారు. వారికి మంచి మాటలు చెప్పి పంపిస్తాడు. మాన్‌సింగ్‌తో కలిసి బయలుదేరుతారు. నీమ్‌రాణా‌లో ఆగుతారు. అక్కడ ఓ పురాతన భవనంలో బస చేస్తారు. కొద్ది సేపయ్యాక, బయట కోలాహలం వినిపిస్తుంది. గుంపులు గుంపులుగా జనాలు కొట్టుకుంటూ, నరుక్కుంటూ ఉంటారు. జగన్నాథుడు వెళ్ళి వాళ్ళని నిలువరించి – మంచి మాటలు చెప్పి గొడవని ఆపుతాడు. అక్కడ్ని నుంచి బయల్దేరి అజ్మీరు వైపు వెళ్తారు. దారిలో మరో చిన్న గ్రామం వద్ద జనాలు గొడవ పడుతుంటారు. వారికి కూడా మేలు మాటలు చెప్పి గొడవని ఆపుతాడు. ఆ రాత్రికి అక్కడ బస చేస్తాడు. మర్నాడు బయల్దేరి ప్రయాణం కొనసాగిస్తారు. ఇక చదవండి.]

అధ్యాయం-27

జయపురం చేరారు.

నగరంలో ఎటు చూసినా ప్రశాంత వాతావరణమే కనిపించింది.

వీరిని నగర పాలనాధికారికి పరిచయం చేసి, అతనికి ఒప్పజెప్పి తాను సెలవు తీసుకున్నాడు మాన్‌సింగ్.

ఆ అధికారి భగవంత్‌సింగ్. అతనికి అప్పటికే రాజోద్యోగుల నుండీ ఉత్తర్వులు వచ్చి ఉన్నై. వీరిని గౌరవంగా స్వాగతించి, వసతితో పాటు ఇతర ఏర్పాట్లనీ చేసి, అవసరాల్ని చూసేందుకు భూపేందర్ అనే అమల్‌గుజర్ ఉద్యోగిని పురమాయించి వెళ్లాడు.

వసతి భవనంలో తమ పనులు మొదలుపెట్టారు కామేశ్వరీ జగన్నాథులు.

మర్నాడు రాజోద్యోగులు వచ్చి జగన్నాథుని రాజమందిరానికి తోడ్కొని వెళ్లారు. జగన్నాథుడు – జయసింహ మహారాజుకు తెలియనివాడేంకాదు గదా. సాదర స్వాగతం లభించింది. పరామర్శల అనంతరం రాజకీయ వ్యవహారాల గురించి వివరించాడు-మహారాజు. ఆ సమయంలో ఉదయపూర్ రాణా జగత్‌సింగ్, వజీర్ సాదుల్లాఖాన్ అక్కడే వున్నాడు. “పండిట్‌జీ.. మీరంటే మా రాణావారికీ చాలా గౌరవం. ఉదయపూర్‌కి మీ రాక కోసం వేచి చూస్తున్నారు-మా రాణావారు” చెప్పాడు సాదుల్లాఖాన్. జగన్నాథుడు కైమోడ్పుతో తన సంతోషాన్ని తెలియజేశాడు.

అంతలో మహారాజు ప్రక్కకి ఆయన అంగరక్షకుడు వచ్చి ఏదో చెప్పాడు. తలవూచి అతన్ని పంపించి, చెప్పసాగాడు.

“షహజాదా ఖుర్రం వారికి మేమంతా సైదోడుగా నిలిచాం. పోరు భీకరంగా సాగింది. గజసింగ్ ఒక్కడే చెప్పుకోదగినవాడు. ఇటు మన వైపు మహబత్‌ఖాన్, అసఫ్‌ఖాన్ – వంటి యోధులు అప్రతిహతంగా పోరాడారు. కానీ..” అని క్షణం ఆగి దద్గదికంగా “సమరంలో గెలిచాం కానీ, మా సమరసింహం వంటి భీమసింగ్‌ని కోల్పోయాం” అంటూ దుఃఖించాడు.

“చివరికి ఈ యుద్ధంలో నూర్జహాన్ బేగం తన అల్లుడైన షహజాదా షరియార్‌నే బలిపశువుని చేసింది” అన్నాడు సాదుల్లాఖాన్.

కొద్దిసేపు మందిరంలో గాలి స్తంభించింది.

జగన్నాథుడే ఆ దుఃఖ సన్నివేశాన్ని నిదానంగా పలచబడేలా చేయాలనే ఉద్దేశంతో – “ఒక చిరుచేప బెస్తవాడి చేతికి చిక్కిందిట. అది అటూ ఇటూ గిజాయించుకోవడంలో అతని వేళ్ల సందునుంచీ జారిపడిపోయింది. అంతవరకూ అదృష్టమే కదా. కానీ ఆ పడటం నీళ్లల్లో పడకుండా మళ్లీ వలలో పడింది. ఎంత దురదృష్టం? కానీ మళ్లీ అంతలోనే అదృష్టం పండింది. చేప చిన్నది కావడంచేత వల కన్నుల్లో నుంచీ తప్పించుకుని బయటపడింది. ఏం లాభం? ఠక్కున ఒక కొంగకి దొరికిపోయింది! విధి రాసిపెట్టిన విపత్తు ఇలాగే ఉంటుంది ఒక్కొక్కప్పుడు” అన్నాడు.

“కదనం ఫలితం మన పరమైందనేది వాస్తవమే అయినా, అంతా ప్రశాంతంగా వున్నదనుకోవడానికి లేదు. ఇప్పుడే అందిన వార్త – సిక్రీ పొలిమేరల్లో చిన్నాచితకా ఫౌజ్‌దారులు ఇంకా తమ రాజభక్తి నిరూపణకి యుద్ధోత్సాహాన్ని ప్రకటిస్తున్నారుట”

మోచేతిని మోకాలిపై ఆనించి, వేళ్లని చుబుకంమీద వుంచుకుని ఆలోచన భంగిమలో కూర్చున్నాడు మహారాజు. క్షణాల తరువాత కూర్చున్న భంగిమను మార్చుకుని జగన్నాథుని వైపు చూశాడు.

“మీరు జ్ఞానవృద్ధులూ, సమయజ్ఞత కలిగినవారూ. మౌల్వీల తర్కాన్నే జయించిన వారూ, మనుషుల తత్త్వాల్నీ, పరిస్థితుల వ్యతిరేక సానుకూల గమనాన్నీ తెలుపగలవారు. మీరేమంటారు మహాశయా?” అన్నాడు.

“ప్రభూ! యుద్ధానంతరం చిన్నచిన్న అసంతృప్త బృందాలు అక్కడక్కడా తలలెత్తి తమ నిరసనను తెలుపుతూ కత్తులు ఝళిపిస్తూనే వుంటాయి. వారికీ నాయకులూ వుంటారు. దెబ్బతిన్న కొందరు పిడికిలి బిగించి కొత్త నాయకులుగానూ తయారవుతారు.”

“అవును! పరమ సత్యమది. ఏ యుద్ధ పరిసమాప్తిలో నయినా ఇలాంటి ఘటనలు సహజం”. అన్నాడు ఖాన్.

“ఇక్కడ ప్రత్యేకించి బేగం సాహెబా తానుగా దెబ్బతిన్నది”

జయసింహుని మాటలకు, “అంతేకాదు. తాను ఎవరికోసం ఇంత చేసిందో ఆ అల్లుడినే కోల్పోయింది. కనుక నెగడు రగులుతున్న పరిస్థితిని చూస్తున్నాం” అన్నాడు జగన్నాథుడు.” “అదీగాక..” అని అర్ధోక్తిలో ఆపాడు.

జయసింహుడు కనుబొమ ముడిచి, జగన్నాథుని తేరిచూసి, “చెప్పండి కవి సార్వభౌమా! సంకోచమెందుకు?” అన్నాడు.

“యుద్ధం మొదలవగానే సహజంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాధారణ ప్రజలలో సైతం అలజడి ప్రారంభమై వుంటుంది. కొందరు అటు వైపూ, మరి కొందరు ఇటూ – తమ తమ అభిమాన ప్రకటనలు చేస్తూ వుంటారు. వారంతా ఏదో ఒక పక్షం వహించిన వారే అయినా, ఎదురి పక్షం వారు గెలవగానే ఆవేశంతో ఘర్షణ పడవచ్చు. కానీ, స్థానికులు కదా! ఎక్కడికీ పోలేరు. అందువలన, ఆవేశాలు చల్లారగానే, గెలిచిన వారి పక్షాన మాట్లాడటం మొదలెడతారు. ఇంకా చెప్పాలంటే వారి సైన్యంలో చేరటానికి ఇష్టపడతారు. కొత్త ప్రభువు వీరిని పూర్తిగా నమ్మరు; అలాగని వదిలేయరు. తగు మాత్రపు జాగ్రత్తలతో తమ సేవకు ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం సిక్రీ, ఆగ్రా, ఢిల్లీ, లాహోర్ వంటి నగరాల్లోనూ, ఇతర పట్టణాలలోనూ ఇదే దృశ్యం ఉండి వుంటుంది. రాజనీతిజ్ఞత గురించి మీకు తెలియనిదేం వుంది” అని ఆగాడు.

“అవును. లాహోర్ పరిస్థితి అసలు బాగా లేదట” ఖాన్.

“కానీయండి మీరు చెప్పండి” అన్నాడు మహారాజు జగన్నాథుని ఉద్దేశించి.

“కనుక.. ప్రభువులు.. షహజాద్ ఖుర్రం వారికి వెంటనే పాదుషా పట్టాభిషేకం చేసేస్తే బాగుంటుంది. దానితో అటు ప్రజల అలజడికీ, ఇటు నూర్జహాన్ బేగం సాహెబా వారి పట్టు వదలదలచుకోని ప్రయత్నాలకూ విరమణ కలిగించవచ్చని నా భావన..”

జయసింహుడు “భళా” అని ఖాన్ వైపు చూశాడు- మీరేమంటారన్నట్లుగా.

“బహుత్ ఠీక్ హై.. పండిట్‌జీ ఆలోచన బాగుంది”

“ఇందువలన ముఖ్యంగా ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ నగరాల్లో ఖుర్రం వారి అనుయాయులనూ, వారి నాయకులనూ ఒక సందిగ్ధస్థితిని తప్పించిన వారవుతారు-ప్రభువులు” అనీ విశదం చేశాడు జగన్నాథుడు.

మరోసారి “బాగుంది” అని, “వజీర్ సాబ్. మీరు హుటాహుటిన వెళ్లి జగత్‌సింగ్ రాణా వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. వెనకగా మేమూ బయలుదేరుతాము. ఖుర్రం వారితోనూ, అసఫ్‌ఖాన్ వారితోనూ ఇతర మన్సబారులతోనూ రాణావారు మాట్లాడతారు. పట్టాభిషేకం ఏర్పాట్లు, ఇతర వ్యవహారాలూ చూడటంలో మీరెటూ సర్వసమర్థులు” అన్నాడు జయసింహుడు. “షుక్రియా..”అంటూ నిష్క్రమించాడు ఖాన్.

జయసింహుడు జగన్నాథుడితో మరికొంత తడవు కాశీ, ఢిల్లీ విషయాలను ముచ్చటించిన తర్వాత ఆ సమావేశం ముగిసింది.

జగన్నాథుడు సెలవు తీసుకుంటుండగా మరొకసారి ఆయన దార్శనికతను ప్రశంసించాడు మహారాజు. వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపి బయటికి వచ్చాడు జగన్నాథుడు.

***

జనవరి 1628.

ఉదయపురం రాగానే రాణా తొలి దర్శనం. పరిచయసమావేశం. జగత్‌సింహుని చూడగానే జగన్నాథుడికి ఏదో ‘జననాంతర సౌహృదాని’ అనిపించింది. జగన్నాథుడి స్ఫురద్రూపం, ముఖవర్చస్సు, నడకలో వ్యక్తమవుతున్న పాండిత్యధీరం-జగత్సింహునీ ఆకర్షించాయి.

రాణా ప్రక్కనే ఉన్నాడు రాయముకుందుడు. “మీ శ్రేయోభిలాషి.. ఇరుగో” అన్నాడు రాణా. ఆ మాటతో అర్థమైంది జగన్నాథుడికి తన రాకకు ఆయన సలహాయే కారణమై ఉంటుందని!

వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ, అభివాదం చేశాడు జగన్నాథుడు. కుశల ప్రశ్నలూ, మర్యాదపూర్వకమైన సంభాషణలూ జరిగాయి.

“మీరు విశ్రాంతి తీసుకోండి” అని రాణా నిష్క్రమించాడు.

రాయముకుందుడూ, జగన్నాథుడు- కాశీ కబుర్లూ, ఢిల్లీ విషయాలూ నడక సాగిస్తూనే మాట్లాడుకున్నారు. ఒక కూడలి దగ్గర రాయముకుందుడు ముందుకు సాగిపోయాడు. జగన్నాథుడు తన వసతికి చేరుకున్నాడు. రాణా – జగన్నాథుడికి వసతినీ, ఇతర సౌకర్యాలనూ ఘనంగా ఏర్పాటు చేయించాడు. వాటి పర్యవేక్షణకి పరివారాన్నీ సిద్ధంగా వుంచాడు.

జగన్నాథ దంపతులు అలసట తీర్చుకోవడంలోనూ, వస్తు సామగ్రిని సర్దుకోవడంలోనూ మూడు రోజులు గడిచాయి. ఆ తర్వాత నాలుగు రోజులు నగరాన్నీ, నగర పరిసర ప్రదేశాల రమణీయ ప్రకృతి శోభనీ తిలకించటానికి సరిపోయాయి.

1558లో ఆ నగరాన్ని రెండవ ఉదయసింగ్ రాణా నిర్మింపజేశాడు. అంతా ఆరావళీ పర్వత ప్రాంతం ఉదయపురంలో ఉన్న ఏడు సరస్సులలో ముఖ్యమైన పిఛోళీ సరస్సు, స్వరూప్ సాగర్, రంగసాగర్, దూద్ తలై; ఫతేసాగర్ మొదలైన సరస్సుల్నీ సందర్శించారు. నగర ప్రజల జీవనం, సంస్కృతి, భాషల్ని గురించి ఛాయా మాత్రంగా తెలిసింది. స్థానికులు మేవారి భాషను మాట్లాడుతున్నారు.

తర్వాతి వారం మధ్యలో జయపురం నుంచీ మహారాజు జయసింహుడూ, సిక్రీ నుండీ ఖుర్రం, అసన్, మహబత్‌ఖాన్-ఇతర ముఖ్యులూ ఉదయపురం వచ్చారు.

ఆ వేళ –

జగత్సింహుడు వీరందరితోనూ సమావేశమయినాడు. మహబత్, అసఫ్‌ఖాన్‌లు – యుద్ధానంతరం పరిస్థితిని విశదంగానే చెప్పారు. నూర్జహాన్ రాజౌరీ చేరి రాత్రికి రాత్రే గ్రామంలో జహంగీర్ భౌతిక కాయాన్ని ఖననం చేయించేసిందని ఒక వదంతి. పాదుషా మరణాన్ని సైన్యాధికారులకూ, ప్రజలకూ తెలియకుండా దాచాలనే ప్రయత్నంలో నిశిరాత్రి వేళ ఆయన దుస్తులతో మనిషి రూపాన్ని కల్పించి, గుర్రం మీద ఢిల్లీ ప్రయాణమయింది. ఈ సంగతిని పసిగట్టి అసఫ్‌ఖాన్ చారులూ, సైన్యంలోని ముఖ్యులూ-ఆమెని మార్గమధ్యంలోనే బంధించారు. ఆమె ఇప్పుడు రాజౌరీలోనే వారి బందీగా వుంది.

ఇది విన్నవారంతా ఆశ్చర్యపోయారు.

నూర్జహాన్ తన ఓటమిని ఎంతగా వ్యక్తిగత అవమానంగా భావించిందో, ఇంకా యుద్ధాన్ని కొనసాగించి ఎంతగా ఖుర్రంపై పగతీర్చుకోవాలనే పట్టుదలతో వుందో తెలుస్తోందని చెబుతూ మహబత్‌ఖాన్ చూపులతో అగ్ని కణాల్ని రువ్వాడు.

ఖుర్రం పళ్లు నూరుతూ, పిడికిలి బిగించాడు. ‘శీఘ్రకోపి’ అనుకున్నాడు జగన్నాథుడు-ఖుర్రం భంగిమని చూసి.

“ఆ పిశాచిని ఇంకా బందీగా ఎందుకు ఉంచటం ఖాన్ సాబ్. ఉరితీయండి. వెంటనే ఆ పని జరిగేలా చూడండి” ఉగ్రంతో అన్నాడు ఖుర్రం.

“మన ఆజ్ఞ కోసమే ఆగారు మనవారు.”

“దుష్ట సంహారానికి ‘ఆలస్యం అమృతం విషం’ సూక్తి వర్తిస్తుంది” జగత్సింహుడు, “అవునూ.. ఇంతకీ.. జయసింహు లేమంటారు?” అడిగాడు.

ఆయన రాయముకుందుని వైపు చూశాడు.

“ఆమె రాజ్యకాంక్షా, భర్తపై ఆధిపత్య ధోరణీ – ఇంతటి వినాశనానికి కారణాలైనాయి. ఇంకా ఉపేక్షించనక్కరలేదు” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు రాయముకుందుడు. మధ్యలోనే అందుకుని, “జయపురంలో మన ముందు దారి ఏమిటో సూచించినవారు పండిట్‌జీ. వారేమంటారో” అన్నాడు అసఫ్‌ఖాన్.

అందరూ జగన్నాథుని వైపు చూశారు.

“మనం ఇక్కడ సమావేశమవుతున్న సందర్భం ఢిల్లీలో బదులు షహజాదా ఖుర్రం వారికి పాదుషాగా పట్టాభిషేకం చేయటానికీ, ఆ తర్వాత – మొగలాయీ సామ్రాజ్యాధిపతిగా ఆగ్రా నుండి వారి పాలనని రాజ్యమంతా అమలు అయ్యేటట్టు చూడటానికీ కదా! నూర్జహాన్ బేగంవారు ఈ రోజుకీ మహారాణీవారే. అంతేగాక, ఖుర్రంవారికి మాతృస్థానీయురాలు. అందుకని..”

“అందుకని.. ఆమెని కూడా సత్కరిద్దామా?” జగన్నాథుని మాటలను మధ్యలో అడ్డుకుంటూ గద్దించినట్లుగా అన్నాడు – మహబత్‌ఖాన్.

“కాదు.. ఆమెను గృహనిర్బంధంలో బందీగానే ఉండనీయండి. ఏదో భరణంతో ఆమెనీ, ఆమె పుత్రిక లాడీబేగంనీ కాలం గడపనిస్తే, ఖుర్రం గారి బాంధవ్య గౌరవమూ నిలుస్తుంది; వారి ఔదార్యమూ ప్రజల్లో గడ్డ కెక్కుతుంది”

అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

అసఫ్‌ఖాన్ వైపు పరీక్షగా చూస్తే, ఆయన కళ్లల్లో సంతృప్తిని గమనించాడు ఖుర్రం. ఎంత చెడ్డా-మరి నూర్జహాన్ అసఫ్‌ఖాన్ సోదరి!

“సరే..”అంటూ “వారిద్దరినీ లాహోర్‌లో ఉంచండి” అని లేచాడు ఖుర్రం.

జగత్సింహుడూ, జయసింహుడూ ఒకేసారిగా అన్నారు. “పండిట్‍జీకి మనుషుల ఆర్తీ, మనసుల ఆవేదనా బాగా తెలుసు..” “అవునవును” అంటూ జగన్నాథుని సమీపించి భుజం తట్టాడు – రాయముకుందుడు. వినయంగా కైమోడ్పు ఘటించాడు జగన్నాథుడు.

మొగలాయీ రాజ్యాధిపతికి రాజపుత్ర రాజ్యంలో పట్టాభిషేకం! చిత్రమైన పరిస్థితి! ఇంతకంటే ఆశ్చర్యకరమైన విశేషం-ముహూర్తాన్ని నిర్ణయించింది-హిందూ పండితుడు-జగన్నాథుడు!

ముహూర్త నిర్ణయం జగన్నాథునిచే చేయిస్తున్నానని జగత్సింగ్ ఖుర్రంకి చెప్పినప్పుడు, ఖుర్రం మొహంలో అసహనం, విముఖత్వం కనిపించాయి. ఆయన ఏదో అనేలోగా జగన్నాథుడూ, రాయముకుందుడూ అక్కడికి వచ్చారు. ఇద్దరూ రాణా చెప్పింది విన్నారు. ఖుర్రం ముఖకవళికలూ, శరీర భంగిమా ఆయన వైముఖ్యాన్ని బహిర్గతం చేస్తున్న విషయాన్ని గమనించారు.

మనసులోనే నవ్వుకున్నాడు జగన్నాథుడు. తానే కలగజేసుకుని “షహజాదా సాహెబ్‌జీ.. నేను పెట్టిన ముహూర్తబలం మీకు క్రమేణా తెలుస్తుంది. మూడు దశాబ్దాలు ఏకచ్ఛత్రాధిపత్యంతో మీరు రాజ్యపాలన చేస్తారు” అనేశాడు.

ఖుర్రం “హాఁ!” అని ఆశ్చర్యపోయాడు. అందరి కళ్లల్లోనూ వెలుగు!

“పండిట్‌జీ వాక్శుద్ధి అమోఘం. సందేహించకండి” జయసింహుడు అన్నాడు.

“అవునవును” అన్నాడు రాయముకుందుడు. “జగన్నాథుడు హయగ్రీవోపాసకుడు, మంత్రద్రష్ట, సకలశాస్త్రవిశారదుడు. ప్రతిభామూర్తి ఈ జగన్నాథుడు” అని స్ఫాటిక స్వచ్ఛంగా ప్రశంసించాడు.

రాయముకుందుని మాటలు విన్న ఖుర్రం ముఖకవళికలు మారాయి. ఆశ్చర్యం, అరాధనా భావం కదిలాయి. “అయితే మాకు వీరి ఆశీస్సులు నిరంతరం అందవలసినవే” అని “మిమ్మల్ని ఆగ్రా ఆహ్వానిస్తున్నది- పండిట్‌జీ” అన్నాడు.

“అంతకంటే ముందు ఇక్కడే ఒక పండిత సభ పెడదాం” అన్నాడు అసఫ్‌ఖాన్. “సహీబాత్’.. అని మెచ్చుకున్నాడు ఖుర్రం.

పట్టాభిషేకం ఏర్పాట్ల గురించిన సంభాషణతో సమావేశం ముగిసింది. సంక్రాంతి తర్వాత ఓ వారం గడిచింది.

మేవార్ రాజ్యమంతా కోలాహలంగా ఉంది. ఉదయపురం, పరిసర పట్టణాలూ, గ్రామాలూ-ఉత్సవ సంరంభంతో చందనంలో ముంచి తేల్చినట్టు పరిమళిస్తున్నాయి. వాతావరణమంతా శోభాయమానంగా దీపిస్తోంది.

ఆ వేళ – షహజాదా ఖుర్రం – పాదుషా – అయ్యే శుభదినం.

దీనికంతటికీ కారణం- ఖుర్రం- జగత్సింగ్ మధ్య గల స్నేహసాన్నిహిత్యం. రాజపుత్రుల సహకారంతో మొగలాయీ సామ్రాజ్యానికి సమర్థ నాయకత్వం అందుతున్నదనే ఆత్మగౌరవ భావన.

ముహూర్తం వేళ-హిందూ, ముస్లిం మతాచారాల ప్రకారం ఖుర్రం పట్టాభిషేకం జరిగింది. సభలోనూ, బయటకూడా జయజయనాదాలు, భేరీతూర్య రావాలూ మార్మోగినై.

ఖుర్రం లేచివెళ్లి జగత్సింహుని ఆత్మీయంగా కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు.

“ఈ ఉత్సవానికీ, సంభవానికీ అందరూ ఎవరి బాధ్యతని వారు నిర్వహించారు. అంతకన్నా మిన్నగా జగన్నాథుని సమయోచిత సలహా మనల్ని ముందుకు నడిపింది” అన్నాడు జగత్సింహుడు.

“మా మీద జయసింహ మహారాజుగారికీ ఆదరం, రాణావారికీ అభిమానం!” అని కైమోడ్పు ఘటించాడు జగన్నాథుడు. సభలో ఉన్న స్త్రీ గణంలో కలిసి ఈ సంతోషాన్ని పంచుకుంటున్న కామేశ్వరి తన భర్తపట్ల రాణాకి గల అభిమానానికి ముగ్ధురాలైంది.

అటు అసఫ్‌ఖాన్-మహబత్‌ఖాన్‌లూ, ఇటు జగత్సింగ్-జయసింహులూ కరచాలనాలతో పరస్పరం అభినందించుకున్నారు.

సమావేశం ముగిసింది.

***

ఖుర్రం-షాజహాన్ పాదుషా ఐనాడు.

పట్టాభిషేకం అయి రెండోవారం చివర ఉదయపురంలో విద్వత్ సభని ఏర్పాటు చేశాడు జగత్సింహుడు. కళా సాహత్యాభిమాని ఆసఫ్‌ఖాన్, రాయముకుందుడూ – ప్రత్యేక శ్రద్ధతో ఆహూతులైన వారికి గౌరవ మర్యాదలను పర్యవేక్షిస్తున్నారు. ఆ వేళే మహాసభ!! నిండు పేరోలగంగా ఉన్నది.

‘బనారసి నామమాల’ వంటి గ్రంథ రచయిత, ప్రజభాషా కోవిదుడు – బనారసి దాస్ మధుర నుండి వచ్చాడు. రాజస్థానీ పండితుడు దుర్సా అర్హా-ఉన్నాడు. గ్వాలియర్ నుండి హిందీ విద్వాంసుడు బీహారీలాల్ చౌబే ఏతెంచాడు. అరబ్బీ, పర్షియన్, ఉర్దూ భాషా సాహిత్యవేత్త ముల్లా మహమ్మద్ లాహోరి ముందుగానే వచ్చి ఉన్నాడు. మరాఠీ కవి సయ్యద్ షేక్ మహమ్మద్ ఖాద్రి ప్రత్యేక అతిథి. ఇంకా ఎందరో ప్రసిద్ధులు.. హాజరైనారు.

జగత్సింహుడు, షాజహాన్, జయసింహుడు – తమతమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. వేదికపైన కుడివైపు రాయముకుందుడూ, ఎడమవైపు అసఫ్‌ఖాన్.

సభ ప్రారంభిస్తూ-షాజహాన్ గురించి చెప్పాడు అసఫ్‌ఖాన్. పాదుషా వారి పరిపాలనలో సంగీత సాహిత్య కళా వైజ్ఞానిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఉ౦టుందని తెలిపాడు.

రాయముకుందుడు విద్వత్ గోష్ఠిని ఆరంభించాడు. తానుగా చెప్పదలచుకున్న ముఖ్యాంశాన్ని ఇలా చెప్పేడు, “మనిషి చేష్టల్ని బట్టి అతని పట్ల విశ్వాసం, గౌరవం ఏర్పడతాయి. దీన్ని గురించి పండితులు విశదీకరించి, అంతర్యాన్ని చర్చిస్తే బాగుంటుంది” పండితులు, కవులూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. సభలో కొంత సవ్వడి మొదలయింది.

ఇంతలో జగత్సింహుడు ప్రకటించాడు, “కావ్యపఠనం, లఘు ప్రసంగాలూ చివర్లో ఉండనే ఉంటాయి..” అని. తలలు ఊగేయి. సద్దుమణిగింది. జగన్నాథుడికి నవ్వొచ్చింది. గోష్ఠి మొదలయింది.

ఉత్తమమైన మానవజన్మ, దాని ప్రయోజనం, మనిషి కర్తవ్యాకర్తవ్యాలూ, చిత్తవృత్తి, ప్రవర్తన, ఆలోచనలు, ప్రవృత్తి ధర్మాధర్మ విచక్షణ, వివేకం, వివేచన-ఇలా అనేకాంశాలు నలిగినై. చిన్న చిన్న వాదాలూ, చర్చలూ కూడా జరిగినై.

జయసింహుడు జగన్నాథుని వైపు చూస్తూ, “పండిట్‌జీ ప్రసంగానికి మేము వేచి చూస్తున్నాము..” అన్నాడు చిరునవ్వుతో.

కవి పండితలోకం మౌనం వహించింది.

జగన్నాథుడు తన గంభీర స్వనంతో ప్రసంగాన్ని ప్రారంభించి, మాధుర్యంతో నిండిన పలుకులతో కొనసాగించాడు. చివరికి మనిషి చిత్తంలో, ప్రవర్తనలో, చేష్టల్లో బాహ్యం కాకుండా ఆంతర్యం చూడాలంటూ వివరించాడు. దీన్ని ‘ధర్మం-ధర్మసూక్ష్మం’ అనే తార్కికాంశంగా, వేదాంతాంశంగా చెప్పి, సృష్టి విన్యాసాన్ని ప్రస్తావిస్తూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. తన భాషణని ఉదాహరణలతో సమన్వయం చేశాడు.

“ఘోరతపస్సు చేసినవాడు రాక్షసుడైనా దేవుడు వాడికి వరాలిస్తాడు. అది ధర్మం. వాడు దుర్మార్గుడు, ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తాడు అని తెలియదా? తెలుసు. అయినా, తన ధర్మం తాను నిర్వర్తించాలి కనుక వరాలిస్తాడు. ఇదీ ధర్మసూక్ష్మం” ఆపి మళ్లీ కొనసాగించాడిలా “పరమాణువునీ, మహాసింధువులోని బిందువునీ గమనించండి. ఎంతటి మహా భారాన్నైనా నిలిపివుంచే గరిమనాభి కేంద్రస్థానం బిందువే కదా! సృష్టిస్థితి లయ కారకుడైన పరమాత్మ ఉనికినీ, స్వరూపాన్నీ నీవారశూక వత్త్వన్తీ (నివ్వెర ధాన్యపు మొనలాంటి రూపం) పీతాభాస్వదణూపమా(లోకాలన్నిటా నిలిచి వెలిగేరూపం) అనీ వర్ణిస్తుంది మా నారాయణ సూక్తమ్. ‘ధర్మసూక్ష్మ ప్రాధాన్యం అద్భుతం, అమేయం, అఖండం’ ” అంటూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుండి కూడా కొన్ని విశేషాల్ని వివరించాడు.

సభాసదుల్లో ఆలోచన కదిలింది.

“ఇంకొక్క సాధారణ విషయం చూద్దాం. ఒక తోటమాలి ఏదో ఒక మొక్క తెచ్చాడు. పెంచాడు. పెరిగింది. అది విషవృక్షమని తేలింది. తోట యజమాని దాన్ని పెరికి వేయమన్నాడు. తానుగా దాన్ని పెరికి వేయలేనన్నాడు తోటమాలి. ఎందుకనీ – పెంచిన చేతితో దానిని తుంచకూడదు. ఇది ధర్మ సూక్ష్మం. తోటమాలి గొప్ప ధర్మపరుడు.” అంటూ అవే విషయాల్ని అరబ్బీ, పారశీకం, ఉర్దూ, హిందీభాషల్లో తిరిగి మళ్లీ చెప్పాడు.

“వహ్వా” అన్నాడు పాదుషా. వేదిక – కరతాళ ధ్వనులు వినిపించింది.

“పాదుషావారు సూర్జహాన్ బేగంని గృహనిర్బంధంలో వుంచారు. అంతేకానీ, వధించలేదు.” అసఫ్‌ఖాన్ ప్రకటించాడు. “ఆ సలహా ఈ జగన్నాథుల వారిదే” అన్నాడు జగత్సింహుడు. ఇప్పుడు సభలోని వారంతా ‘జయహో.. జగన్నాథ పండిట్‌జీ..” అంటూ చప్పట్లు కొట్టారు.

షాజహాన్ లేచి నిలబడ్డాడు. వేదికపైని వారూ నిలబడ్డారు.

సభ సద్దుమణిగింది.

జగన్నాథుని వేదిక పైకి ఆహ్వానిస్తూ చేయి చూపాడు షాజహాన్. జగన్నాథుడు లేచి కదులుతుండగానే, “చూశారు కదా ఈ జగన్నాథుని ప్రతిభ. అపూర్వం, అద్భుతం. వీరికి ‘పండితరాజ’ బిరుదునీ, పట్టాన్నీ సమర్పిస్తున్నాను.” అన్నాడు షాజహాన్.

జగన్నాథుడు వేదిక నెక్కాడు. వేదికపైనున్న వారంతా ఆయనకు నమస్కరించారు. “ఇదే సందర్భంలో మరో సంతోషకరమైన విషయాన్నీ ప్రకటిస్తున్నాను. జగన్నాథ పండితుని ‘పండితరాజ’ బిరుదు కేవలం గౌరవచిహ్నం కాదు. అది ఒక మహోన్నత పదవి. వారు మా రాజధానికి విచ్చేసి, ఆ పదవీ బాధ్యతలను నిర్వహిస్తారు. సంగీత, సాహిత్య, భాషాకళాభివృద్ధి సంస్థకు వారిని ప్రధానాధికారిగా నియమిస్తున్నాం” అని ఉచ్ఛైస్వరంతో వెల్లడించాడు షాజహాన్.

సభ అంతా సంతోషకరంగితమయింది. జయసింహుడూ, రాయముకుందుడూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

జగన్నాథుడు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఇప్పటి నుండీ జగన్నాథుడు జగన్నాథ పండితరాజు! కామేశ్వరి కన్నుల నిండా ఆనందబాష్పాలు!!

***

షాజహాన్ పాడుషా పరివారం ఆగ్రా చేరారు.

నిజానికి ఆగ్రా మొగలాయీ రాజధాని. కానీ, మొగలాయీ ప్రభువులంతా ఢిల్లీశ్వరులు గానే ప్రసిద్ధులు. రాజ్యపాలన అంతా కొన్నాళ్లు అక్కడా, కొన్నాళ్లు ఇక్కడా జరుగుతుంది. అటు ఢిల్లీ పీఠంపైనా, ఇటు ఆగ్రాపీఠం పైనా కూర్చుంటూ వ్యవహారాల్ని నిర్వహిస్తారు చక్రవర్తులు. అందువల్లనే లాహోర్, ఆగ్రా, ఢిల్లీ, శ్రీనగర్ – ఏ నగరానికా నగరం -ఉనికీ, మనుగడా, రక్షణా, పరిపాలనా ప్రక్రియా విషయాల్లో కీలకమే.

అసఫ్‌ఖాన్ పరిస్థితుల్ని చక్కబరచి రావటానికి ఢిల్లీ వెళ్లాడు. మహబత్‌ఖాన్ కాశ్మీర్ వెళ్లాడు. ప్రస్తుతం లాహోర్‌లో ఉన్న దావర్ బక్ష్‌నే అక్కడి విషయాలను జాగ్రత్తగా చూసుకొమ్మని ఆజ్ఞాపించాడు అసఫ్‌ఖాన్.

ఇప్పుడు అసఫ్‌ఖాన్, మహబత్‌ఖాన్ – వీరిద్దరూ షాజహానికి రెండుకళ్లు!!

వారిద్దరికీ-అటు జగత్సింహుడూ, ఇటు జయసింహుడూ కావలసిన వారే!

వీరిద్దరికీ జగన్నాథుడూ, రాయముకుందుడూ ఐనవారు!

జయసింహుడూ, రాయముకుందుడూ జయపురం వెళ్లిపోయారు. జగన్నాథుని తనతో కొన్నాళ్లు ఉండివెళ్లమని ఉదయపురంలో ఆపాడు జగత్‌సింహుడు!

ఉదయపురం వాసం-జగన్నాథ కామేశ్వరులకు పరమ హృదయాహ్లాదాన్ని కూరుస్తున్నది.

తిరిగిన ప్రదేశం తిరగకుండా, అనేక ప్రదేశాల్ని దర్శిస్తున్నారు. కొన్ని ఆధ్యాత్మిక యాత్రలు, కొన్ని విహారయాత్రలు, కొన్ని చారిత్రక స్థల పర్యటనలూ!!

ఉదయపుర మహానగర నిర్మాణ విశేషాలూ, రాజపుత్రుల శౌర్యధైర్య ప్రతాప వృత్తాంతాలూ, చారిత్రకంగా, భౌగోళికంగా ఆయా ప్రాంతాల ప్రాముఖ్యమూ అన్నీ అవగాహన కొచ్చాయి.

ఒకరోజు ఎన్నడో ఉదయసింగ్ నిర్మించిన ఏడు ద్వారాల గోడని చూశారు. మరో సందర్భంలో రాజపురా-డరీబా ప్రాంతాన్ని చూశారు. అక్కడ ఖనిజోత్పత్తి జరుగుతుంది. యువతులు నెత్తిమీద ఏడు బిందెలు పెట్టుకుని పలు విన్యాసాలతో చేసే ‘ఘామర్’ నృత్యాన్నీ, పాములోళ్ల కల్‌బేలియా తిలకించారు. ఏడు బిందెలు పెట్టుకుని పలు విన్యాసాలతో చేసే నృత్యాన్ని చూసి ఆనందించారు.

ఋతుధర్మం వెలారుస్తూ కదులుతోంది కాలం. చైత్రమాసం వచ్చింది!

ఉగాది పండుగ వెళ్లింది. ఆ మర్నాటి నుంచే ఉదయపూర్లో గణ్‌గౌర్ ఉత్సవం మొదలయింది. ముందురోజు శ్రీరామనవమి అవడంతో జగన్నాథ దంపతులు ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.

ఉత్సవం తొమ్మిదవరోజుకు చేరింది. గణ-శివుడికి మరో పేరు. గౌర్ – గౌరి. శివపార్వతుల వివాహవేడుక. అది పద్ధెనిమిది రోజుల ఉత్సవం. రోజూ పూజలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ పెద్ద ఎత్తున సామూహికంగా జరుగుతాయి. వివాహం కాని యువతులకు వివాహం జరుగుతుందని నమ్మకం. వివాహితులకు మంగళగౌరి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

ఈ ఉత్సవానికి గ్రామీణ ప్రజలు – పల్లకీలల్లో, రథాల్లో, శకటాలలో తండోపతండాలుగా వస్తారు. ‘ఘడిలియా’ వంటి జానపద నృత్యాలు, రంగురంగుల కళాకృతుల ప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి. చిల్లులు గల మట్టికుండల్లో ప్రమిదలను వెలిగించి, వాటిని తలపై పెట్టుకుని పాటలు పాడుతూ వస్తారు.

ఇవ్వాళ – మధ్యాహ్నం.

జగన్నాథుని రచనల్ని సర్దుతున్నది కామేశ్వరి. అప్పుడప్పుడూ ఈ పని చేయటం-ఆమెకదొక ముచ్చట. భర్త కావ్యరచనల పరామర్శ ఆమెకు ఇష్టమైన పని. కవిత్వారాధన ఆమెకు హృదయాహ్లాదాన్నిచ్చే కార్యక్రమం.

‘భామినీవిలాసం’ లో ప్రాస్తావిక విలాసం, శృంగారవిలాసం – అయినాయి. పంచలహరుల ప్రణాళికలో లక్ష్మీలహరి, సుధాలహరి, గంగాలహరి అయినాయి. గంగాలహరిని తిరగేయసాగింది.

“మహాదాన, ధ్యాన, మహాయజ్ఞాది పుణ్యకర కార్యనిర్వహణం చేత కూడా పొందశక్యం కాని మోక్షపదాన్ని జనసామ్యానికి సులభప్రాప్యంగా చేస్తున్నావు. పవిత్ర భాగీరథీ మాతా! ప్రపంచంలోని ఏ వస్తువుతో నీవు పోల్చదగి ఉన్నావో నాకు తెలియటం లేదమ్మా! దయతో తెలుపవమ్మా!’ ఇదీ భావం. ఆ శ్లోకాన్ని చదువుకున్నది. నవ్వుకున్నది. అదృశ్య గంగామాతను కనులముందు దృశ్యమానం చేసుకుంటూ పైకే చదువుకుని చేతులెత్తి గాలిలో దేవికి నమస్కరించింది.

శతక సముచ్చయంలో కొన్ని శ్లోకాల్ని వ్రాసుకుంటున్న జగన్నాథుని దృష్టి భార్యవైపు మరలింది. నవ్వుతూ, “ఏమిటి దేవిగారు అలౌకికానందంలో తేలుతున్నారు?” అన్నాడు. “ఏముంది. గంగాలహరిలో శ్లోకాలు కంటబడితే మననః ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. చదువుకుని ఆనందిస్తున్నాను. పండితరాజుగారు నా వంటి సామాన్యుల్ని ప్రస్తావించారు కదా!” అన్నది కళ్లు చికిలిస్తూ.

“అవునవును. కావ్యానందాన్ని అనుభవించే సంస్కారంలో స్థాయీ భేదాలుంటాయి. కదా! ఏ స్థాయి వారికి ఆ స్థాయిలో శ్లోకం రసస్ఫోరకం కావాలి. అందుకనే గదా-రసగంగాధర రచన చేస్తున్నది. రమణీయార్థ ప్రతిపాదకశ్శబ్దః కావ్యమ్అనే నూతన లక్షణ నిర్మాణంతో ప్రారంభించిన రసగంగాధరంఉద్దేశ్యమదేకదా!

“అవును. భామినీవిలాసంలో చెప్పనే చెప్పారు కదా..!”

‘మాధుర్య పరమసీమా, సారస్వత జలధి మథన సంభూతా!

పిబతా మనల్ప సుఖదావ, సుధాయాం మమ సుధా కవితా॥’

“అమృతంలో అమృతం.. అంటే అమృత సారమన్నమాట. అందరి మనస్సులను రంజింపజేసే ‘మాధుర్య’ గుణానికి ఈ కవిత తుదిహద్దు. మీ కవితా సుధ ఊర్ధ్వ లోకంలో జనించడంచేత అధికారిఽధికమైంది. కనుక భౌతికమైన సుధకంటె మీ కవితా సుధ ఎన్నో రెట్లధికమైనది. ఈ కవితామృతాన్ని గ్రోలేవారు బ్రహ్మానందాన్ని పొందగలరు”, అని “ఏదో ఇంతవరకూ అర్థం చేసుకోగలిగాను లెండి” అంటూ క్రీగంట విలాసంగా భర్తను చూసింది. జగన్నాథుడు లేచివచ్చి పరిహాసంగా ఆమె నెత్తిన చిన్న మొట్టికాయవేసి, చుబుకం మీద చిటికెవేశాడు. “కవిగారి భార్య ననిపిస్తున్నావు”

“అంటే?”

“అన్నీ తెలిసి ఏమీ తెలియని దానిలా వినయప్రదర్శనం”.

“అయ్యయ్యో.. నిజంగా నా మాటలు కంచుమోతల బాపతండీ స్వామీ” అన్నది నొచ్చుకున్న ధోరణిలో. “అదీ విషయం.. చూశావా.. కవిత్వమే పలికావు. అదే ‘ధ్వని’ అంటే.. రసగంగాధరంలో అత్యంత ప్రధానాధ్యాయం దాని గురించే కదా!” అంటూ వెళ్లి తన పీఠం మీద కూర్చుని, మళ్లీ తన వ్రాతలో తాను నిమగ్నుడయినాడు.

కామేశ్వరి గ్రంథాల్ని చూస్తూనే వున్నది. ‘మనోరమా ఖండనమ్’ తగిలింది. మొదలుమాత్రమే. సర్దిపక్కన పెట్టింది.

సరిగ్గా – అప్పుడు భవనం ముంగిట రాజోద్యోగి ఎవరో అశ్వం దిగాడు. ఆతని వెనుకగా మరొకరు. ఏదో బరువైన పెట్టెని దించారు. వాకిలి దాకా వచ్చి, సలాములు చేస్తూ, అనుజ్ఞని కోరారు. జగన్నాథుడు లేచి వచ్చి వారిని లోపలికి ఆహ్వానించాడు.

“మహారాజు పంపారు” అంటూ పెట్టెను తెచ్చి లోపల పెట్టారు.

కామేశ్వరి ఏదో అడగబోతుంటే, “సరి. మీరు వెళ్లిరండి. మహారాజులకు మా ధన్యవాదాలు తెలుపండి.” వారిని పంపించేశాడు జగన్నాథుడు.

పెట్టెలో చీనిచీనాంబరాలూ, ఆభరణాలూ ఉన్నాయి. వాటిపైన ఒక లేఖ. ‘రాబోయే గణ్‌గౌర్ నిమజ్జనం నాడు జరగబోయే ఉత్సవానికి ఆహ్వానం. మహారాజా వారి ప్రత్యేక నావలో వారితో, వారి పరివారంతో నిమజ్జనోత్సవంలో పాల్గొనవలసినది’గా ఉంది. చదివిన కామేశ్వరికి మనసంతా సంతోషంతో పులకించి పోయింది. జగన్నాథునికేమో తన పట్ల మహారాజు ఆదరణకీ, ప్రత్యేక గౌరవానికి కృతజ్ఞతతో హృదయం ఆర్ద్రమైంది. కనులు చెమర్చాయి. గమనించింది కామేశ్వరి. భర్తని సమీపించి భుజం మీద చెయ్యి వేసింది.

‘అవును కామూ, ఏమిచ్చి రాణావారి ఋణాన్ని తీర్చుకోగలం? కొలువులో, సమావేశాల్లో, మంత్రాంగంలో నాకెంతో పెద్దరికమిచ్చి, ముఖ్య సలహాదారుని చేశారు”.

లిప్తకాలం కామేశ్వరి ఏదో ఆలోచనలో గడిపింది. వెంటనే అడిగింది. “నేను చెప్పనా మరి?” “చెప్పు..” “రాణా వారి గురించి కావ్యం రాసి వారికి అంకితం ఇవ్వండి.”

జగన్నాథుని కళ్లు మిలమిల లాడాయి. “కరణేషు మంత్రీ. ఓహ్! చాలా చక్కని సూచన” “కాదు.. కోరిక!” “బాగుంది. సరే. కావ్య నామాన్నీ తమరే ఇవ్వండి” అన్నాడు.

“మనకు వారందిస్తున్న వన్నీ ఆభరణాలేకదా! మీరు ఒక – జగదాభరణాన్ని ఇవ్వండి” “అద్భుతం.. అన్వర్థనామధేయం. తథాస్తు!” అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతిని నొక్కాడు. బాల్యమూ, యౌవనమూ కలిసి తిరిగి వచ్చిన స్పృహ కలిగింది కామేశ్వరికి.

ఈ సరాగం చూస్తున్న ప్రకృతి పరవశిస్తున్నది. ఎలకోయిల కుహూ.. కుహూ.. రాగం సాగుతూనే ఉన్నది!

***

గణ్‌గౌర్ ఉత్సవం కన్నుల పండువగా సాగింది.

చివరి రోజున నిమజ్జనానికి ముందు పిచోళి సరస్సు-ఘణ్‌గౌర్ ఘాటికి అలతి దూరంలో విశాలమైన స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఎత్తయిన వేదికని నిర్మించారు. ఆ వేదిక పై నుండీ – జగన్నాథుడి ప్రవచనం. జనమే జనం! అంతా ఉత్సాహం! అందరి కోలాహలం! అనేక సమూహాల ఆనంద విన్యాసాలు! రాణావారూ, రాణివాస స్త్రీలూ, పరివారమూ పాల్గొనటంతో సభకు ప్రత్యేక ప్రాముఖ్యం వచ్చింది.

జగన్నాథుడు తన గళం విప్పాడు. అంతటి కోలాహలమూ సద్దుమణిగింది. కుమార సంభవం నుండీ శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని పండిత పామరుల హర్షధ్వానాల మధ్య ధీర గంభీర స్వనంతో ప్రసంగించాడు. సతీదేవి గాథ; ఆమె ఉమగా పునరవతారం దాల్చటం, శివునికై తపస్సు చేయటం, మధ్యలో-మన్మథహరణం, రతీవిలాపం, చివరికి-శివపార్వతుల కళ్యాణం జగన్మోహనంగా జరగటం చెప్పాడు. ప్రసంగంలో అప్పుడప్పుడూ సందర్భోచితంగా ధర్మసూక్ష్మాల ప్రాశస్త్యాన్ని ఉగ్గడించాడు.

సభ ముగిసింది.

జగన్నాథుడి పాండిత్యానికి జయజయధ్వానాలూ! రాణా జగత్సింహుడు చేపట్టి సాగిస్తున్న చర్యలకీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయపురంలో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యం వెల్లివిరిసింది. ఆ తర్వాత రాచవారి నౌకాప్రయాణం విగ్రహాల నిమజ్జనం జరిగాయి.

మధ్యరాత్రి అవుతుండగా అందరూ ఇళ్లకు మళ్లారు.

– ఆ మర్నాడు విశ్రాంతి రోజు!

– పండుగ సంరంభం వెన్నెల గుర్తులు నగరమంతటా నిలిచి ఉన్నై. నగరం మాత్రం ఆనందానుభూతి స్మృతిలో ఉన్నది. వారం గడిచింది.

ఆ మర్నాడే – రాజభవనంలో ‘జగదాభరణం’ కావ్యం అంకితసభ. కవి పండిత సమావేశం. ఇవీ ఉత్సవ సదృశంగానే జరిగాయి.

‘శ్రీ రాణా కవికర్ణనందన జగత్సింహ ప్రభోద్వర్ణనం శ్రీమత్పండిత రాజ-పండిత జగన్నాథోవ్యదాసీదిదమ్’ అని సవినయంగా, సభక్తికంగా రాణాకు కావ్యాన్ని అంకితం చేశాడు-జగన్నాథుడు. సభ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. జగత్సింహుని ప్రాభవ వర్ణనమే ఉన్నా, ప్రధానంగా ఈ కావ్యాన్ని ఒక అలంకార ఉదాహరణ కావ్యంగా నిర్మించి ఇచ్చాడు జగన్నాథుడు. మహాకవి, పండితరాజు కేవలం ‘భట్టరాజు’ మాత్రుడు కాదు గదా! కావ్య ప్రయోజనాన్నీ, ప్రయోగాన్నీ మేధోనిక్షిప్తం చేసుకుని, ఆపై రచనకెక్కించి ఉన్నవాడు. రసన కెక్కించుకున్న వాడు కూడా!

జగదాభరణం ఏబదిమూడు శ్లోకాల కావ్యం. దానిలో కొన్ని శ్లోకాల్ని కావ్యము చ్చైః పఠ్యతే, అంటూ పైకి చదివాడు-జగన్నాథుడు.

***

జయపురం, అజ్మీరు మీదుగా ఆగ్రాకి ప్రయాణమైనారు జగన్నాథ దంపతులు. రాణా జగత్సింహుని వద్ద సెలవు తీసుకుంటూ వుండగా, గౌరవ పూర్వకంగా రాజ ప్రసాదం తలవాకిలి దాకా వచ్చి నిలిచారు జగత్‌సింహ దంపతులు.

జగత్‌సింహుని చూసి కృతజ్ఞతతో జగన్నాథుని కనులు చెమర్చాయి.

మహారాజు సైతం ఉద్విగ్నుడై కుడిచేతిని ఎత్తిచూపుతూ వీడ్కోలు పలికాడు.

జయపురంలో – జయసింహుడు – జగన్నాథుని ఆదరప్రణామాలతో కానుకలతో సత్కరించి వీడ్కోలు పలికాడు. రాయముకుందుడూ అక్కడే ఉన్నాడు. ఆయన, “నువ్వు పాదుషా కొలువులో కుదరుకునేలోగా నేనూ అక్కడికి వస్తాను. పాదుషావారు వీలైనంత తొందరగా నన్ను ఆగ్రా చేరమన్నారు” అన్నాడు.

జగన్నాథుడికి సంతోషం కలిగింది. ఆ పెద్దాయన తన శ్రేయోభిలాషి. ఆయన వుంటే తనకు అండ, ధైర్యం, అదే అన్నాడు, “మీ సాన్నిహిత్యం నా భాగ్యం” అని.

***

అజ్మీర్‌లో జగన్నాథుడు-గతంలో తనకు ఇతర భాషల్ని నేర్పిన గురువులను దర్శించుకుని, వారికి తన అభ్యుదయ పరంపరని గురించి తెలిపాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆగ్రా వైపు సాగిపోయారు.

అధ్యాయం-28

ఆగ్రా చేరారు. పాదుషా వారి దర్శనం అయింది. వీరి నివాసాన్ని విశేషమైన ఏర్పాట్లు చేయించే వుంచాడు అసఫ్‌ఖాన్. జగత్సింహుడు వీరి రాకను అసఫ్‌ఖాన్‌కు ముందుగానే తెలిపాడు.

నెలలు గడుస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. నూర్జహాన్ లాడీబేగంలు లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉన్నారు. వారికి సాలుకి రెండులక్షల భరణాన్ని మంజూరు చేశాడు షాజహాన్!

నగరంలో ప్రశాంత జీవనం మొదలయింది.

రాయముకుందుడు ఆగ్రా వచ్చాడు. కులపతి మిశ్ర జగన్నాథుని శిష్యగణంలో చేరి ప్రముఖుడైనాడు.

షాజహాన్ విద్వత్ సభ-ప్రపంచ దేశాల్లోని విద్వాంసులందరినీ ఆశ్చర్యపరచే స్థాయికి చేరింది. పాదుషా వారికి పండిత కల్పవృక్షమనే పేరు మార్మోగుతోంది.

దసరా ఉత్సవాల సమయం, పండుగ వాతావరణంతో ఆగ్రా పరవశిస్తోంది. నవరాత్రుల్లో వరుస పండిత సభలు-

ఆవేళ – విజయదశమి.

మహాసభ శోభాయమానంగా ఉన్నది.

రాయముకుందుడే సభాధ్యక్షుడు. కవీంద్రాచార్య సరస్వతి – ప్రత్యేకాహ్వానితుడు. ఆయన కాశీలోనూ, ప్రయాగలోనూ హిందువుల నుండి వసూలు చేస్తున్న యాత్రికులు పన్ను శాస్త్ర విరుద్ధచర్యగా నిరూపించి, పాదుషా వారిచే దానిని రద్దు చేయించి, వారికి గౌరవాస్పదుడైన మహామహుడు, బహుగ్రంథకర్త. ఇంకా ‘సర్వవిద్యానిధాన’ బిరుదాంకితుడు, సంస్కృత పండితుడు హరినారాయణమిశ్రా, మధుసూదన సరస్వతీ ఆ సభలో వున్నారు. వంగదేశంవాడు ‘మహామహోపాధ్యాయ’ శ్రీ విశ్వనాథన్యాయ పంచాననుడు, గదాధర భట్టాచార్యుల వంటి ప్రముఖులూ వున్నారు. జ్యోతిష శాస్త్రవేత్త మునీశ్వర పండితుడు-వేదాంగ రాయకవి, నీలకంఠ దీక్షితులూ, సుందరదాస్ సభని అలంకరించారు. నూర్జహాన్ ఔదార్యపాత్రుడు – వంశీధర మిత్రుడు వచ్చాడు. సంగీత నిధులనదగిన డైరింగ్ ఖాన్, లాల్‍ఖాన్‌లూ ఉన్నారు.

ఇతర పార్శీ, అరబ్బీ కవిపండితులూ, సంగీతకారులూ, కళాకారులూ ఉన్నారు.

ఇక, అబ్దుల్ హమీద్ లాహరీ, ఔరంగజేబు, దారా షుకో ప్రత్యేక ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. అసఫ్‌ఖాన్ పాదుషాకు కొంచెం ఎడంగా ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు.

ఇందరి మధ్యలో కవి దిగ్గజం, పండిత ప్రకాండుడు, అష్టభాషా విశారదుడు, సంగీత కళావతంసుడు జగన్నాథ పండితరాయలు- తేజోమూర్తి!!

సభా ప్రారంభంలో అసఫ్‌ఖాన్ ఒక్కొక్కరినీ పరిచయం చేసి, చివరికి జగన్నాథుని గురించి చెప్పాడు. సంగీత, సాహిత్య, వేదశాస్త్ర పురాణాది సమస్త వాఙ్మయాన్నీ పుక్కిటపట్టిన వాడని అభివర్ణించాడు.

ఇదంతా ఒక ఎత్తుకాగా, పండిత రాయలవారు జ్యోతిష్యంలోనూ దిట్ట, ‘మంత్రశాస్త్రవేత్త’ అనీ చెప్పాడు.

పాదుషా తల పంకించి, కరతాళధ్వనితో తన సంతోషాన్ని ప్రకటించాడు. చేయి చూపుతూ, జగన్నాథుని కవితాగానం చేయమన్నాడు.

జగన్నాథుడు లేచి నిలబడి తన సహజ గంభీరస్వనంతో-ఆశుకవితా విధానంలో చక్రవర్తిని ఉద్దేశించి ఇలా చెప్పాడు.

శ్రీరస్తు శ్రితరక్షణ క్షణ గుణ శ్రీరస్తు నిత్యోత్సవ

శ్రీరస్తు ప్రథమాన కీర్తి విభవ శ్రీరస్తు గీరస్తుతే!

శ్రీ రస్త్విత్యతి వేల పండిత వచః శ్రీరస్తు భూరస్త్వహో

శ్రీ దిల్లీశ్వర! షాజహాను విపులస్థే మాభిరామాఽ కృతే॥

పాదుషా అమితానంద పరవశుడైనాడు. అంతకంతగా అసఫ్‌ఖాన్, రాయముకుందుడూ సంతోషించారు. పదహారేళ్ల దారా అయితే లేచి, సంబరంతో పసిపిల్లవాడిలా చప్పట్లు చరిచాడు.

కొద్దిసేపటికి కోలాహలం తగ్గింది.

జగన్నాథుని కొన్ని మస్నవీ కవితలను చదవమన్నాడు షాజహాన్. ‘మస్నవీ’ అనేది పారశీక భాషలో లఘుకవితా ప్రక్రియ. సంస్కృతంలో ‘ముక్తకం’ వంటిది. పండితరాజు పారశీకంలో ‘మస్నవీ’లను అలవోకగా చెప్పేశాడు. ప్రతికవితకీ సభలో ‘వహ్వా’లు మిన్ను ముట్టాయి.

చివరికి -”లేళ్లు, పందులు, కుందేళ్లు, నెమళ్లువంటి అల్ప జంతువులు ఏ చిన్న పొదలోనో దూరి హాయిగా నిద్రపోగలుగుతాయి. వాటి అవసరాలు చాలా స్వల్పం. కానీ, ఎండవేడికి ఉడుకెత్తిపోయిన మహా గజేంద్రానికి సువిశాలమైన చల్లని నీడనిచ్చి, సేదదేర్చగల సామర్థ్యం ఆకాశం అందనంత విస్తృతంగా పెరిగిన మహావృక్షానికి తప్ప చిన్న చిన్న తుప్పలకీ, పొదలకీ ఎక్కడ ఉంటుందీ? ఆ మహావృక్షపు జన్మధన్యం!!

అనే భావం వచ్చేలా సంస్కృత శ్లోకం చదివాడు. దానిని నిరవధికంగా, పరమసరళంగా, రాగభావయుక్తంగా హిందీ, ఉర్దూ, అరబ్బీ పారశీక భాషల్లోనూ అనర్గళంగా చెప్పాడు. వెంటనే సభలోని అందరూ లేచి నిలబడి షాజహాన్ పాదుషా వారికి అభినందనలూ, పండిత రాజుకి ప్రశంసలూ అందించారు.

ఈ కోలాహలం తగ్గిన మరుక్షణం తన ఆనందాన్ని ఇలా ప్రకటించాడు. ప్రభువు- “కవిగా జగన్నాథ పండితులు ఇప్పటికే ‘పండితరాజు’ బిరుదాంకితులు, నేటి నుండీ వారు ‘పండితరాయ’ పదవీ విరాజితులౌతున్నారు. ప్రభుత్వంలో-మత విషయక వ్యవహార నిర్వహణలో, ‘ధర్మ’ నిర్ణయంలో, సాధారణ అసాధారణ న్యాయనిర్ణయంలో, సంగీత, సాహిత్య సాంస్కృతిక కళా సంబంధమైన వ్యవహారాల్లో వారు మాకు సలహాదారు. చక్రవర్తిదే తుదిమాట అయినా, మా శ్రేయోభిలాషిగా పండితరాయల వారు చెప్పే హితోక్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది”.

మరుక్షణం-సభాభవనం మళ్లీ జయధ్వానాలతో ప్రతిధ్వనించింది.

షాజహాన్ లేచి నిలిచి, జగన్నాథుని వేదికపైకి ఆహ్వానించి, తన పక్కన ఉన్న అర్ధసింహాసనం పైన కూర్చుండజేశాడు. సభ్యులకు గతంలో ఎన్నడెరుగని కనువిందైన అద్భుతమైన దృశ్యం అది!

ఇంత సవ్వడిలోనూ లిప్తకాల వ్యవధిలో దారా తన ఆసనం నుండి లేచి చకచకా వచ్చి జగన్నాథునికి పాదాభివందనం చేశాడు!

పాదుషా వారితోపాటు, పెద్దలూ సభ్యులూ కూడా దారా చర్యకు సంభ్రమాశ్చర్యానందాలతో గుండెలు పండించుకున్నారు.

కామేశ్వరి చూపు పండితరాయమూర్తిలోని నూత్నశోభలో పర్యాప్తం చెందింది. కానీ, ఇంత సంరంభంలోనూ ఎందుకో ఆమె కుడికన్ను అదిరింది!!

కామేశ్వరికి మనసులో కించ మొదలయింది. ఇంటికి వచ్చి మామూలు కార్యక్రమాల్లో పడినా మనసు ఎందుకనో ఆందోళన పడుతోంది. ఆమె ఆలోచనల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే ఒక అవ్యక్తభీతి పట్టుకుంది. దీనికి కారణం – బహుశ సభలో ఔరంగజేబు ముఖ కవళికలు, భంగిమలూ కావచ్చు.

ఆ రాత్రి – మనసు విప్పి భర్తకు చెప్పింది. జగన్నాథుడు నవ్వేశాడు.

“మనస్తాత్విక శాస్త్రం ప్రకారం కళ్లు చూసేవాటినీ, అనుభవాల్నీ, ఆలోచనల్నీ వడగట్టే వస్త్ర కాగితం వంటి మేధ వుంది – మనిషిలో ఏ చెత్తని వేసినా, దాన్ని ‘మనిషి’గా కావలసిన విధంగా తయారు చేస్తుంది మేధ. అందుకనే అంటారు-మనశ్రేయస్సు, మన శారీరక మానసిక ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని. అలాగే-మనకు మనం కల్పించుకున్న కొన్ని విలయాల్నీ దాటి వస్తే గానీ – దాన్ని సాధించుకోలేము. నీ ఆలోచనలిప్పుడు భవిష్యత్తు గురించిన భయం అనే వలయంలో తిరుగుతున్నై. దాన్ని దాటి ఇవతలకి రావాలి. అందుకు ఒక చిన్న చిట్కా వైద్యం చెప్పనా?” అని పరిహాసంగా ఆమె కళ్లల్లోకి చూశాడు.

“చెప్పండి..”

“నెమ్మదిగా భౌతికమైన పార్శ్వం నుండి అభౌతికమైన పార్శ్వానికి జరగాలి. అర్థమైందా?”

“ఏఁవిటో.. అయ్యీ కానట్టుంది. అంతా తెలిసీ ఏమీ తెలియని అవస్థ అనిపిస్తోంది లెండి” అన్నది.

“ఏం లేదు కామూ.. జరిగినవీ, జరగబోయేవీ అన్నీ మన మేలునకే అనుకోగలగటం!” నవ్వుతూ ఆమె భుజాన్ని తట్టాడు.

“మొత్తానికి-నీ ముక్కేదంటే చెయ్యి మెడమీదుగా తిప్పి చూపినట్టు చెప్పారు లెండి.. పండితుల లక్షణం మరి..” పరిహాసంగా అంటూ,” సరే.. నిద్రవేళ దాటుతోంది.. పడుకోండి” అన్నది. గోడవైపుకు తిరిగి కళ్లు మూసుకుని అనుకున్నది, ‘ఆధ్యాత్మికం అంటే ఇదే’ అని! జగన్నాథుడేమో- ‘గోప్యమైన ఏకాంత మానసంతో మనిషికి ఎప్పుడూ అవస్థే’ అనుకుని కళ్లు మూసుకున్నాడు. ఎప్పటికో-ఇద్దరికీ కునుకు పట్టింది!!

(సశేషం)

Exit mobile version