జగన్నాథ పండితరాయలు-17

3
2

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[జయపురం చేరిన జగన్నాథుడు, కామేశ్వరి లకు వసతి ఏర్పాటవుతుంది. రాజమందిరంలో జగన్నాథుడికి జయసింహ మహారాజు స్వాగతం పలుకుతాడు. జరిగిన యుద్ధంలో విజయం సాధించడం గురించి, భీమసింగ్‌ని పోగొట్టుకోవడం గురించి గుర్తు చేసుకుంటాడు. ఆ దుఃఖ సన్నివేశాన్ని నిదానంగా పలచబడేలా చేస్తాడు జగన్నాథుడు. పరిస్థితిని మరింత జటిలం చేయకుండా ఉండేందుకు వీలయినంత త్వరగా ఖుర్రం వారికి పాదుషా పట్టాభిషేకం చేయాలంటాడు జగన్నాథుడు. ఆ ఆలోచనని అందరూ అంగీకరిస్తారు. ఉదయపురం రాణా జగత్‍సింహ్‌ని కలుస్తాడు జగన్నాథుడు. ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తాడు. ఖుర్రంతో సమావేశమవుతారు. నూర్జహాన్‌ని, లాడీబేగంని ఉరితీయించమని అంటాడు ఖుర్రం. జగత్‍సింహ్‌ని అడిగితే, ఆయన జగన్నాథుడి అభిప్రాయం అడుగుతాడు. వారిని ప్రాణాలతో ఉంచి గృహ నిర్బంధంలో ఉంచమని చెప్తాడు జగన్నాథుడు. ఖుర్రం సరేనంటాడు. పట్టాభిషేకానికి జగన్నాథుడు ముహూర్తం పెడుతున్నాడని తెలిసి ఖుర్రం విముఖత వ్యక్తం చేస్తాడు. తన ముహూర్తబలం గొప్పదని, ఖుర్రం మూడు దశాబ్దాలు పాలిస్తాడని జగన్నాథుడు చెప్తాడు. ఆ మాటలు విశ్వసించి, సరే నంటాడు ఖుర్రం. జగన్నాథుని ఆగ్రా రమ్మని ఆహ్వానిస్తాడు. పండిత సభ జరుగుతుంది. ఆ సభలో జగన్నాథుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఖుర్రం షాజహాన్ పేరుతో పాదుషా అవుతాడు. మరో విద్వత్సభ జరుగుతుంది. అందులో జగన్నాథుడి ప్రతిభ గాంచిన పాదుషా జగన్నాథుడికి ‘పండిత రాజ’ బిరుదినిస్తాడు. తన రాజాస్థానంలో కీలక అధికారిగా నియమిస్తాడు. పాదుషా ఆగ్రా చేరుతాడు. పాలనా బాధ్యతలు చేపడతాడు. జగన్నాథుడూ, కామేశ్వరి కొన్నాళ్ళు ఉదయపురంలో ఉండి దర్శనీయ ప్రదేశాలు చూసి ఆగ్రాకి బయల్దేరుతాడు. పాదుషా వారి దర్శనం చేసుకుంటాడు జగన్నాథుడు. అసఫ్‍ఖాన్ జగన్నాథుడు నివాసం ఉండడం భవనం ఏర్పాటు చేస్తాడు. విజయదశమి సందర్భంగా ఆగ్రా దర్బారులో పండిత సభ జరుగుతుంది. జగన్నాథుడు తన ప్రతిభని ప్రదర్శించి సంస్కృత శ్లోకాలని చదివి, వాటి భావాలని హిందీ, ఉర్దూ, అరబ్బీ పారశీక భాషలలో వివరిస్తాడు. పాదుషా అభిమానాన్ని చూరగొంటాడు. పాదుషా ‘పండితరాయ’ బిరుదునిచ్చి తన సలహాదారుగా నియమించుకుంటాడు జగన్నాథుని. ఇదంతా చూస్తున్న కామేశ్వరికి సంతోషం కలిగినా, మనసులో ఎక్కడో చిన్న భయం కలుగుతుంది. ఆమెకు ధైర్యం చెబుతాడు జగన్నాథుడు. ఇక చదవండి.]

అధ్యాయం-29

[dropcap]కా[/dropcap]లం జవనాశ్వంలా దౌడుతీస్తోంది.

అసఫ్‌ఖాన్ కబురు చేస్తే వెళ్లాడు జగన్నాథుడు.

దారా వచ్చి ఆయన పక్కన కూచున్నాడు.

“మా దారాకి మీరు మీ వేద శాస్త్ర పురాణాల గురించి బోధించాలి. అంతకంటే ముందు సంస్కృతాధ్యయనం అవసరం కదా!” అని, “మీ అంత ప్రతిభావంతుడు కాదు గానీ, నా మనవడు రెండుసార్లు వల్లెవేస్తే పట్టేస్తాడు” అన్నాడు.

దారా కొంచెం సిగ్గుపడి, తలని అటూ ఇటూ తిప్పి నేలచూపులతో కూర్చున్నాడు. జగన్నాథుడు సన్నగా నవ్వి, “నాకు తెలుసుకదా! ఇప్పటికే షహజాదా వారు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు” అన్నాడు.

“అందుకనే ఇప్పటి నుంచీ-అధ్యయనాన్నీ, అభ్యాసాన్నీ వేగవంతం చేయించండి” అంటూ “పాదుషా వారూ, మేమూ ఇక నుంచీ పూర్తిగా రాజకీయ వ్యవహారాలలో మునిగిపోతాము. వారి కళా హృదయం – కోట గురించీ, ఇతర నిర్మాణాల గురించీ చాలా ప్రణాళికల్ని రచిస్తున్నది” అన్నాడు.

సరిగ్గా అదే సమయంలో-ఔరంగజేబు వచ్చి అసఫ్‌ఖాన్‌కీ, జగన్నాథునికీ ఎదురుగా దారాకి పక్కగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు.

“విన్నాను. మా అన్నగారిని హిందూ శాస్త్రవేత్తగా చేసేయాలని మా తాతగారి కోరిక” అంటూ నవ్వాడు.

“దారాషుకో వారికి ఇప్పటికే కదిరి సుల్తాన్ ముల్లాషా వారు ఆధ్యాత్మిక గురువుగారు. సూఫీ సూక్తులూ చాలా వచ్చు. చాలా మంది ఋషుల గురించీ, తత్త్వవేత్తల గురించీ వారికి బాగానే తెలుసు” చేతులు తిప్పుతూ అన్నాడు.

అసఫ్‌ఖాన్ ఏదో అనబోతుంటే అడ్డుతగులుతూ, “ఏమో! నాకు ఇవ్వన్నీ పడవు. నాకల్లా- ‘ఖురాన్.. ఖురాన్.. ఖురాన్! ఔర్, అల్లా’ – అంతే” అన్నాడు.

జగన్నాథుడు సన్నగా నవ్వుకున్నాడు.

ఇంతలో ఔరంగజేబు మళ్లీ “అక్షరమ్ముక్క వచ్చిన ప్రతివాడూ ఖురాన్నొక్కదాన్నీ చదివితే చాలు..” అన్నాడు.

అసఫ్‌ఖాన్ అన్నాడు, ‘ఏభీ ఠీక్ హై.. సహీ బాత్!”

“ఏది ఏమైనా ఈ వేదాలూ, శాస్త్రాలూ గట్రా మా ఒంటికి పడవు”

“ఠీక్ హై.. ఠీక్ హై..” అన్నాడు అసఫ్‌ఖాన్.

“ఏది ఏమైనా తాతగారూ-మీరు వీరిద్దరికీ ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయండి. ఎందుకైనా మంచిది” అంటూ లేచి నిలబడి, “వీరి పిచ్చి ముదురుతుంటే చూస్తూ నేనే ఏమైనా చేస్తానేమోనని నాకే భయం” అని వికటంగా నవ్వుతూ అన్నాడు ఔరంగజేబు.

ఆ వెంటనే టకటక శబ్దంతో అడుగులు వేస్తూ అక్కణ్ణుంచీ వెళ్లిపోయాడు.

చాలాసేపు నిశ్శబ్దం తరువాత, “ ‘శ్రద్ధాయాం లభతేజ్ఞానం’ కదా! మేము చెప్పినట్లు మీ కార్యక్రమాన్ని మీరు కొనసాగించండి” అన్నాడు అసఫ్‌ఖాన్.

రాజోద్యోగిని పిలిపించాడు. “ఇక్కడికి దగ్గరల్లోని సమోఘర్‌లో గురువు గారికి గురుకులాన్ని, పాఠశాల భవనాన్నీ నిర్మించి ఇవ్వండి. వెంటనే ఈ పని జరగాలి” అని ఆదేశించాడు. “అలాగే” అంటూ అతను వెళ్లిపోయాడు.

ఇప్పుడు దారా తన సందేహాన్ని బయటపెట్టాడు, “తాతగారూ.. తమ్ముడి మాటలు..” “ఫరవాలేదు. నేనున్నాను కదా!”

“లోకోభిన్నరుచి:- షహజాదా.. ఎవరి అభిప్రాయాలూ, ఆలోచనలూ వారివి” అన్నాడు జగన్నాథుడు.

“సరే.. నేను వస్తాను. ప్రత్యేక భవనం తయారయ్యేలోగా దారావారి మందిరమే మీ పాఠశాల” అని నవ్వుతూ వెళ్లిపోయాడు అసఫ్‌ఖాన్.

ఆ తర్వాత – చాలాసేపు అక్కడే ఉన్నాడు జగన్నాథుడు. సంస్కృత పాఠం సాగింది. దాని తర్వాత ‘అక్సిర్-ఏ-ఆజమ్’ గ్రంథం పేరుతో తాను రాస్తున్న పద్యాల్ని కొన్నింటిని చదివి వినిపించాడు దారా.

“బాగా వస్తున్నాయ్. కానీయండి” అని ప్రోత్సహించాడు జగన్నాథుడు.

దారా వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. దారిలో వంశీధర మిశ్రుడు ఎదురైనాడు. నమస్కరిస్తూ, “గురువుగారి చదువు ఎక్కడిదాకా వచ్చింది?” అంటూ ద్వర్థి భాషణ మొదలెట్టాడు. నవ్వొచ్చింది జగన్నాథునికి. “జ్ఞాన సముద్రానికి కడలు పాతలేం కదా! ఏదో మునగానాం – తేలానాం చేస్తూ వుంటాము” అన్నాడు.

“అదే నా వంటి వారి భయం.. అత్యుత్సాహంతో ఏ కెరటమో ఎగరేసుకుపోతే మునిగిపోతామేమో నని..” అర్థోక్తిలో ఆగాడు.

“కొంతమందిని ఆటుపోటులు రెండూ ఏమీ చెయ్యవు. ఏమో మీరు అనుకునే దానికి వ్యతిరేకంగానూ జరగవచ్చు.” అంటూ

‘కుంభః పరిమితమంభః పిబతి, పపౌ కుంభసంభవోంభోదిమ్

అతిరిచ్యతే సుజన్మా కశ్చిజ్జనకం నిజేన చరితేన॥

“అగస్త్యుడు కుండలో నుంచీ పుట్టేడుకదా! కనుక కుండకి అగస్త్యుడు కొడుకు. కుండలో కుండెడు నీళ్లు పడతాయి? మరి కుంభజనుడైన అగస్త్యుడు సప్తసముద్రాలూ తాగేయలేదూ?” చెప్తూనే చకచకా కాలు కదిలించి సాగిపోయాడు జగన్నాథుడు.

బుర్రలో రేగిన విస్ఫోటనం నుండీ వంశీధరుడు ఇంకా తెప్పరిల్లలేదు!

***

జరిగిన విషయమంతా కామేశ్వరికి చెప్పాడు జగన్నాథుడు. “ఎలాగైనా వంశీధరుడికి లోలోపల కొంత బాధగానే వున్నది” అన్నది కామేశ్వరి.

“బాధ కాదు.. అసూయ..” ఠక్కున అన్నాడు.

“అదే నా భయం.. మహారాణీ వారి అనుగ్రహం సంపాదించుకున్నాడంటున్నారు కదా.. తన అసూయ వలన ఏ సమయంలో ఏ విషపుమాట ఎక్కిస్తాడోనని.”

“మహారాణీ వారు ఈయన మాటలు నమ్మేటంత తెలివితక్కువవారా? కామేశ్వరీ! రాచవారిని ఎన్నడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. తమ కేమీ తెలియనట్లు ఉంటారేగానీ అన్ని వ్యవహారాల్ని గురించీ, అందరి స్వభావాల్నీ, చేష్టల్ని గురించీ తమదైన విధానంలో సమాచారాన్ని సేకరించుకుంటూనే ఉంటారు..” అన్నాడు.

“ఏమో.. మీరేం చెప్పినా-మీరు దారాకి గురువుగారని ఈర్ష్య పడేవారు ఉన్నారు. మరో ఉదాహరణ- నీలకంఠ దీక్షితులు” అన్నది.

“అదా.. నీ మనసులోని మాట? సరేలే.. దీక్షితులు మనసు నిష్కల్మషం. పైకి వ్యతిరేకిగా కనిపిస్తాడు- నాకు తెలుసుగా” అంటూ “చూస్తూ వుండు. వీళ్లు చివరికి మన శిష్యులవుతారు” అన్నాడు నవ్వుతూ.

“అయితే మంచిదే” అని తనపనిలోకి వెళ్లింది.

అప్పటికా అధ్యాయం ముగిసింది.

సరిగ్గా అదే సమయంలో అక్కడ – షాజహాన్ తన ఆంతరంగిక మదిరంలో మహబత్‌ఖాన్‌తో, అసఫ్‌ఖాన్‌తో మాట్లాడుతూ, “ఈ విషయంలో జగన్నాథ పండిట్‌జీ సలహా తీసుకుంటే మంచిదేమో” అన్నాడు సాలోచనగా. పాదుషా భావం ఇద్దరికీ అర్థమయింది. జగన్నాథుడికి పిలుపు వెళ్లింది.

***

జగన్నాథుడు వెళ్లే సరికి పాదుషా వారి మంత్రాంగం – ఇంకా సాగుతూనే వున్నది. అసఫ్‌ఖాన్, మహబత్‌ఖాన్ కాకుండా దివాన్ అల్లమీ, మీర్ బక్షీతో పాటు కొందరు మన్సబ్‌దారులూ, పాదుషా వారి షాహీవాలాల వంటి ముఖ్యులంతా ఉన్నారు.

కొద్దిసేపు అయ్యేసరికీ అర్థమైంది. వారి చర్చ బెంగాలులోని పోర్చుగీసు వారిని హుగ్లీ పోర్టు నుండి తరిమివేసే అంశం గురించి అని. ఆ ప్రాంతంలో జె సూట్స్ కార్యకలాపాల మీద తీవ్రమైన కోపంతో ఉన్నాడు- పాదుషా. వాణిజ్యం పరంగా పోర్చుగీసు వారి పనులు మొగలాయీల సప్తగ్రామ్ పోర్ట్ ద్వారా వర్తక వాణిజ్యాలకి పోటీ అయి దెబ్బతీస్తున్నాయి. బెంగాల్ రాజ ప్రతినిధి ఖాశింఖాన్ మీద కూడా కారాలూ, మిరియాలూ నూరుతున్నాడు పాదుషా.

కొంత తడవుకు “ఏమైనా ఖాశింఖాన్‌ని దండయాత్రకి సిద్ధంగా ఉండమని మా ఆజ్ఞని తెలియజేయండి” అని ఆ చర్చని ముగించాడు పాదుషా. అందరూ సెలవు తీసుకున్నారు.

అసఫ్‌ఖాన్‌ని ఉండమని సైగచేశాడు షాజహాన్. లేచినవాడు మళ్లీ కూర్చున్నాడాయన.

“పండిత రాజువారు మా మంత్రాంగంలో సభ్యులు. ప్రధాన న్యాయమూర్తి కూడా వారి క్రింద పనిచేయవలసినదే. న్యాయ, మత, సంగీత కళా సాహిత్య సాంస్కృతిక వ్యవహారాలన్నింటిలో మాకు వారే పెద్ద. ఈ విషయంలో ఎవ్వరికీ ఏ విధమైన అభ్యంతరాలూ ఉండకూడదు. మీరు మా ఫర్మానాగా ఈ విషయం అందరికీ చెప్పండి” అన్నాడు పాదుషా.

అసఫ్‌ఖాన్ ‘హాఁజీ.. జహాపనా” అంటూ తలవూపేడు.

జగన్నాథుడి వైపు చూశాడు షాజహాన్. “పండిట్‌జీ. మీకు తెలుసుకదా! దివానీఖాస్‌ని పునరుద్ధరిస్తున్నాం. శీష్ మహల్ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇవికాక, ముఖ్యంగా ‘ముసమ్మాన్ బుర్జ్’ని ప్రపంచస్థాయి అందమైన కట్టడంగా మార్చాలి. అక్కడి నుంచే ప్రజలకు జరూఖాదర్శన్ జరగాలి. ఇవన్నీ అపూర్వ కళాకృతులు కావటానికి మీరు తగిన సలహాలూ, సూచనలూ ఇవ్వాలి.”

“అలాగే ప్రభూ!” అన్నాడు జగన్నాథుడు.

“మీరూ మా మామగారూ ఆ విషయాలు చూసుకోండి.” మళ్లీ సమ్మతిగా తల ఊపేడు జగన్నాథుడు.

క్షణం ఆగి, “ఇంతకంటే ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. అసలు అందుకే పిలిపించాము. నూర్జహాన్, లాడీబేగం – మిమ్మల్ని తమ మనిషిగా భావిస్తున్నట్టు మాకు సమాచారం వున్నది” అంటూ జగన్నాథుని కళ్లల్లోకి నిశితంగా చూశాడు.

సమయవ్యవధి లేకుండా చెప్పేశాడు జగన్నాథుడు, “అవును ప్రభూ.. అది సహజం. జహంగీర్ వారూ, సూర్జహాన్ బేగం – యుద్ధ సమయంలో భీమసింగ్‌ని కలవటానికీ, రాజపుత్రులతో సఖ్యతని కూర్చటానికీ, వారిద్వారా మీతో సంధికీ నన్ను నియోగించారు. అప్పటికే వ్యవహారాలు చేతులు దాటిపోయాయి. ఆ తర్వాత జహంగీర్ వారూ, రాణీవారూ యుద్ధానికి వెళ్తూ, నన్ను పెద్దదిక్కుగా వుండి లాడీ బేగం వారిని జాగ్రత్తగా చూసుకొమ్మని పురమాయించారు.”

“అవును.. వివరాలు తెలుసు మాకు. పండితులుగా, విద్వాంసులుగా, జ్ఞానవృద్ధులుగా మీ ప్రమేయం ఏమిటో, మీ వ్యవహారదక్షతా, ప్రతిభ ఏమిటో మాకు అర్థమైంది. మీ ప్రయాణాల్లో ఎక్కడెక్కడ మీరు ఏ విధమైన సమస్యల్ని పరిష్కరించారో కూడా మాకు తెలుసు. జగత్సింహ్‌కీ మీరు కావలసిన వారు. మా జిగ్‌తీ దోస్త్ రాణా. ఆ విధంగా మాకూ మీరు గౌరవనీయులు” అని “నూర్జహాన్ సాహెబా వారూ ఆమె కుమార్తె ఇప్పుడు మాకు బందీలు. అంతే” అన్నాడు.

“మీ నమ్మకాన్ని ఈ ఆంధ్రపండితుడు ఎన్నటికీ వమ్ము చేయడు ప్రభూ. ధర్మపక్షపాతం తప్ప మరే లౌల్యాలూ, ప్రలోభాలూ నా దరిచేరవు ప్రభూ” అన్నాడు. జగన్నాథుడు.

“పండిట్‌జీ మాటకు మేము హామీ ఇవ్వగలం జహాఁపనా…” దృఢంగా అన్నాడు అసఫ్‌ఖాన్.

ఆయన వైపు ‘ధన్యవాదాలు’ అన్నట్టుగా చూశాడు జగన్నాథుడు.

మరుక్షణంలోనే సందర్భాన్ని మారుస్తూ, “పండిట్‌జీ, ఇప్పుడు మీ ముందు రెండు బాధ్యతలున్నై. ఒకటి అద్భుతమైన కళాకృతులుగా ఆవిర్భవించవలసిన నిర్మాణాల వ్యవహారం, రెండవది దారావారికి విద్యాబోధన” అన్నాడు షాజహాన్.

అసఫ్‌ఖాన్ ద్వారా, దారాకి విద్యాబోధన విషయమూ ప్రభువుకు తెలుసునని అర్థమైంది జగన్నాథుడికి.

“జీ.. హుజూర్” అంటూ సెలవు తీసుకున్నాడు. ఇంటికి చేరాడు. తన అనుష్ఠానం, అధ్యయనం, వ్రాత-అయినై.

అప్పుడు అడిగింది కామేశ్వరి. “ఏమిటి విషయం?” అని. ఈ సంగతులన్నీ చెప్పి ఆమెని ఆలోచనల్లో పడేయదలచుకోలేదు. ఏవో బోలు మాటలుగా వర్ణించాడు. భర్త వాలకాన్ని ఆమె పసిగట్టింది. గుచ్చిగుచ్చి అడిగింది. జగన్నాథుడికి చెప్పక తప్పలేదు. చెప్పాడు.

వెంటనే అన్నది, “చూశారా.. నా భయం నిజమౌతోంది.” అని “కిట్టనివారు ఇంకా ఏమేం సంగతులు వక్రీకరించి చెబుతారో ప్రభువులకు” అన్నది అసహనంగా.

“అలాంటిదేమీ లేదు. ఒక విధంగా ఇదీ మంచిదే కదా! ప్రభువు తన మనసులోని మాటను సూటిగా చెప్పటం కూడా మన మేలుకే. ఇప్పుడు మా అనుబంధం ఇంకా దృఢతరం కావచ్చు”.

“ఏమో.. ఎలాగైనా జాగ్రత్తగానే వుండాలి.” అన్నది నిర్వేదంగా.

“సరేగానీ.. నువ్వు దారపుకొసని పట్టుకుని చిక్కుపడిన ఉండతో అవస్థపడుతూ కూర్చోకు” అని నవ్వేడు జగన్నాథుడు.

మనస్వీ మ్రియతే వాఽపి స్వోత్కర్షం నైవ ముంచతి/అపినిర్వాణ మాయాతి నానలో యాతి శీతతామ్ అని చదివాడు.

“తెలుసులెండి.. భావం” అని నవ్వుతూ, “మరణవేళనైనా అభిమానధనుడు తన ఉన్నతాదర్శాలను వదలడు. ఆరిపోబోతున్న -నిప్పును ముట్టుకున్నా చల్లగా ఉంటుందా?” చెప్పింది.

అధ్యాయం-30

బాగా ముసురు పట్టింది. నాలుగురోజుల్నుంచీ ఎడతెరిపిలేని వర్షం.

ఢిల్లీలో ఎండలెంత ఎక్కువో, చలీ అంత ఎక్కువ. వర్షాకాలంలో వానలూ ఎక్కువే. వాతావరణంలో ఈ ‘అతి’ లక్షణం ఎప్పుడైనా ఎవరికైనా పని చెరుపే!

ఇంట్లో కూర్చుని శతకసముచ్చయంలో శ్లోకాలకూ, భామినీ విలాసంలో ముక్తకాలకీ- తనకు చేతనైన వరస కూరుస్తున్నది కామేశ్వరి. కానీ, చేస్తున్న పనిమీద మనసు నిలవటం లేదు.

రాత్రి కొడుకు మాధవుడు కలలో కొచ్చాడు. ముంగండలో వదిలి వచ్చినప్పట్నుంచీ అడపాదడపా వాడిరూపం మనసు తెరపైకి వచ్చినా, ఇవాళ ఎందుకనో ఆమెకు గుబులుగా వుంది. అత్తమామల గురించిన ఆలోచనలూ వస్తున్నాయి.

జగన్నాథుడు వో ప్రక్కగా కూర్చుని వ్యాసపీఠాన్ని ముందుపెట్టుకుని ఏదో

శాస్త్ర పఠనంలో నిమగ్నమైవున్నాడు.

“పిల్లవాడిని చూసుకునే భాగ్యం లేకపోయే..” అని నిట్టూర్చింది. “విన్నారా?” అన్నది. “ఆఁ” అని ఊరుకున్నాడు. “మాధవుడూ, అత్తయ్యా మామయ్యా కళ్లల్లో మెదులుతున్నారు” అన్నది.

జగన్నాథుని నుంచీ సమాధానం రాలేదు.

ఇంతలో వాకిట్లో అలికిడయింది. ఇద్దరి దృష్టి అటువైపు మళ్లింది. నిలువెల్లా తడిసిన మనిషిని లోపలికి ప్రవేశపెట్టాడు ద్వారపాలకుడు.

పులుకున చూస్తే అతను – శ్రీనివాసుడు. కాశీవాసి ఉపద్రష్ట వెంకట రామశాస్త్రి గారి శిష్యుడు. పరిచితుడే! ముందు స్నానాదికాలూ ఫలాహారం అయినై. మాటామంతీ సాగింది.

“నేను ఢిల్లీ వచ్చి నాలుగు రోజులయింది. సత్రం తిండి మఠం నిద్రగా రోజులు గడిపాను. మిమ్మల్ని గానీ, రాయముకుందుడు వారిని గానీ కలుసుకోవాలని ప్రయత్నం. ఏదీ-ఈ వర్షం తెరపిస్తేనా? ఎవరినన్నా విచారించటానికీ లేదు. స్వయానా ఏ బాటనైనా పడదామన్నా లేదు. చివరికి ఈవేళ సత్రం అధికారిని కదిలిస్తే కదిలే దారి చూపాడు. ఉదయం బయల్దేరితే ఇప్పటికి వాలాను” మధ్యలో విరతి లేకుండా చెప్పేశాడు.

“బాగుంది.. ఏమిటి విశేషాలు?” ఇద్దరూ ఒకేసారి అడిగారు.

“మా గురువుగారు ఆంధ్రప్రదేశం వెళ్లి ఏకంగా నెలవుండి వచ్చారు. మీ ఊర్లో పరిస్థితులన్నీ తెలిసినై..”

కామేశ్వరి మొహం వెలిగింది ఉత్సుకతతో. “మావాళ్లంతా ఎలా వున్నారు?” అడిగింది. ఆ వెంటనే, “మా మాధవుడెలా వున్నాడు? ఏం చేస్తున్నాడు?”.

శ్రీనివాసుడు ఆమెవైపు సౌమ్యంగా చూస్తూ, “తల్లి మనసు మరి..” అని “దివ్యంగా ఉన్నాడుట. తండ్రి చాలు వచ్చిందట. తాతగారి శిక్షణలో శాస్త్రాలన్నీ పుక్కిట పట్టాడుట. దానికితోడు బ్రాహ్మణ వ్యవసాయం, కావలసినంత పని ఒత్తిడి” అని ఆగి, జగన్నాథుని వైపు తిరిగి, “ఎటొచ్చీ..” అని అర్థోక్తిలో ఆపాడు.

“అమ్మా.. నాన్నా.. ఎలా వున్నారుట?” అడిగాడు జగన్నాథుడు.

“పేరుభట్టుగారి ఆరోగ్యం బాగా లేదట. మహాలక్ష్మమ్మగారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందిట. ఈ విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా గురువుగారు నన్ను పంపింది.”

జగన్నాథుడూ, కామేశ్వరీ-ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనసులూ కలత చెందాయి. శ్రీనివాసుడు తెచ్చిన సమాచారం బాధాకరమైనది. ఇద్దరూ ఉద్విగ్నులైనారు. కామేశ్వరికి కళ్లు చెమర్చినై, మౌనంలో మునిగారిద్దరూ. జగన్నాథుడు పళ్ల బిగువున దిక్కులు చూస్తూ కూర్చున్నాడు.

చాలా సేపటికి తేరుకుని ఏవేవో వివరాలు అడిగింది కామేశ్వరి. తనకు గురువుగారు తెలిపిన మేరకు చెప్పాడు శ్రీనివాసుడు. చివరికి, “మిమ్మల్నొకసారి మనదేశానికి ప్రయాణం కమ్మని గురువుగారి సలహా” అన్నాడు శ్రీనివాసుడు.

వీరిద్దరూ నిర్ణయించుకోవాలి. భవిష్యత్ పేటిక మూసే వున్నది!

అధ్యాయం-31

జగన్నాథుడూ, కామేశ్వరీ ముంగండ చేరేరు.

పేరుభట్టు అనారోగ్యంతో మంచంలో ఉన్నాడు. దగ్గు, ఆయాసం, రొప్పూ, రొష్టూ, బాధపడుతున్నాడు. వైద్యం జరుగుతోంది. మాధవభట్టు ఎంతో శ్రద్ధతో తాతగారిని చూసుకుంటున్నాడు. మహాలక్ష్మమ్మ తిరుగుతూనే ఉన్నది. ఇంటిపనులన్నీ ముక్కుతూ మూలుగుతూ చేసుకుంటోంది. ఆమెకు కీళ్ల నొప్పులూ, మధుమేహమూ వచ్చాయి.

కొడుకూ, కోడలూ రావటం – పెద్ద దంపతులకు పండుగలాగా వుంది. దైహికంగా మార్పులేమీ లేకపోయినా, మానసికంగా కొంత బలాన్నిచ్చింది.

జగన్నాథుడూ, భార్యా వచ్చారనే వార్త తెలిసి అగ్రహారం వారు సరే, చుట్టుప్రక్కల గ్రామాల నుంచీ కూడా పాత పరిచయస్థులూ, బంధుమిత్రులూ ముంగండకు వచ్చి వీళ్లను కలిసి వెళ్తున్నారు.

రోజులు గడుస్తున్నై.

కామేశ్వరి వచ్చినప్పటి నుంచీ – అత్తగారికి శ్రమలేకుండా తోటికోడలుతో కలిసి ఇంటిపనులన్నీ తానే చూసుకుంటోంది. కంటి నిండా కొడుకుని చూసుకుంటూ అతనికి దగ్గరుండి కావలసినవి చేసి పెడ్తోంది. అందరి కళ్లల్లోనూ ఒక విధమైన తృప్తితో నిండిన వెలుగు కనపడుతోంది.

నెల గడిచింది.

ఆవేళ మధ్యాహ్నం భోజనాలైన తర్వాత నడిమింటి వాకిలి గడపలో కొంగుపరచుకుని నడుము వాల్చిన మహాలక్ష్మమ్మ-శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటన అందరికీ ఆశనిపాతమైంది. పేరుభట్టుకు పంచప్రాణాలూ హరిస్తున్నట్టే అయింది.

జగన్నాథుడూ, రామచంద్రుడూ తల్లికి నిత్యకర్మ కార్యక్రమాలను జరుపుతుండగానే ఆరవనాడు పేరుభట్టు కూడా కన్ను మూశాడు!

ఈ సంభవాలు జగన్నాథుని చలింపజేశాయి. కానీ, దంపతులిద్దరూ పెద్దవాళ్ల చివరి రోజుల్లో వారి సాన్నిధ్యంలో ఉండగలిగినందుకు తృప్తి చెందారు.

కర్మాంతరాలైన తర్వాత-ముంగండవారు జగన్నాథుని అక్కడే వుండిపొమ్మన్నారు.

అమరావతి నుండి భమిడి రామేశ్వరశర్మ వచ్చాడు. ఆయన జగన్నాథుని దక్షణిదేశంలోనే వుండిపొమ్మనీ, ఏ రాజాశ్రయమో పొందితే, జగన్నాథుని ప్రతిభా ప్రజ్ఞలకు తగిన గౌరవాదరణలు లభిస్తాయనీ నచ్చజెప్పచూశాడు. వారూ, వీరూ చాలా ఉచిత సలహాలు ఇచ్చారు.

ఇటు కడియం నుండీ, అటు కపిలేశ్వరపురం నుండీ జగన్నాథుని చూడవచ్చిన కవి పండితులు కూడా జగన్నాథుని మన ప్రాంతంలోనే ఉండమని కోరారు. సరమ్మత్తకీ, కూతురుకీ, అల్లుడుకీ సరేసరి జగన్నాథుని మెచ్చుకోవటమే సరిపోయింది.

స్తిమితంగా ఆలోచించాడు జగన్నాథుడు. గతంలో దక్షిణదేశంలో తనకు ఎదురైన అనుభవాలు తలపుకొచ్చాయి. ఈ జన్మకవి చాలు అనిపించింది. చివరకు తన మనస్సులో మాటని చెప్పాడు.

ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా/మనోరథాన్ పూరయితుం సమర్థః

అన్యైర్నృపాలైః పరిదీయమానం, శాకాయవాస్యాల్లవణాయ వ్యాస్యాత్

“అవును. నా అర్హత సంగతి సరే. దాన్నలా వుండనీయండి. నాకు కోరికలూ ఎక్కువే. అవన్నీ భౌతికంగా కనపడినా అసలు రహస్యం – అవన్నీ నా ప్రతిభకూ, ప్రతిష్ఠకూ దక్కవలసిన గౌరవాదరణలే. అవి నా మానసిక వాంఛితాలు. వాటిని ఢిల్లీశ్వరుడైనా తీర్చాలి. ఆ జగదీశ్వరుడైనా తీర్చాలి. వారిద్దరే అందుకు సమర్థులు. ఇతర రాజులు ఇవ్వగలిగేదీ, ఇచ్చేదీ – నాకు ఉప్పుకూ, కూరకూ మాత్రమే సరిపోతుంది” అని వివరంగానే ఆత్మోర్షని వెల్లడిచేశాడు.

అక్కడ వుండి ఆ మాటలు విన్నవారంతా ముందు ఆశ్చర్యపోయినా, జగన్నాథుని ఆత్మాభిమానాన్నీ, అర్హతాస్థాయినీ- అర్థం చేసుకుని ‘అవును’ అన్నట్టే తలలూపారు. రాజేశ్వర శర్మ అయితే పరమ హర్షంతో ‘భేష్’ అని ‘తిరుగులేనిమాట’ అని భుజం తట్టి మరీ అభినందించాడు. అక్కడితో ఆ ప్రసక్తి ముగిసింది.

ఆ రాత్రి మాధవుడూ, కామేశ్వరీ మళ్ళీ ఇదే ప్రసక్తిని కొనసాగించదలచారు. కానీ, వారిలో వారే సంప్రదించుకుని, జగన్నాథుని మనసుని అర్ధంచేసుకుని మిన్నకుండిపోయారు.

మాధవుడు తల్లిదండ్రులతో ఉత్తరదేశం రానని తన అభిప్రాయాన్ని నిష్కర్షగానే చెప్పాడు. జగన్నాథ దంపతులు మాధవుడి విషయంలో తమ బాధ్యతని నెరవేర్చి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాజేశ్వర శర్మతో ప్రస్తావించారు. ఆయన ఒకటి రెండు నిముషాలు తటపటాయించి, “మీకు అభ్యంతరం లేకపోతే నా దౌహిత్రే ఉన్నది. మా అల్లుడు ఇక్కడ ఆత్రేయపురం వాడే. ఉపాధ్యాయుడు. అంతో ఇంతో భూవసతి ఉన్నది. ఒక్కతే పిల్ల” అని వివరాలు చెప్పాడు. జాతకాలు కుదిరాయి. అటు వారూ, ఇటు వారూ అంతా సంప్రదించుకుని, ‘సరే’ అనుకున్నారు. రామచంద్రుడూ ఈ ప్రతిపాదనకూ, నిర్ణయానికి తన హర్షాన్ని వ్యక్తం చేశాడు.

మాధవ దీక్షితుల వివాహం జరిగి, అచ్చట్లు ముచ్చట్లు తీరేసరికి మరో నెలపైనే పట్టింది.

జగన్నాథుడి భామినీవిలాస శ్లోకాలకి నకలు రాసుకున్నాడు-మాధవ దీక్షితులు. రాత్రులు తండ్రితో కూర్చుని ఆ శ్లోకాలలోని అలంకార విశేషాల్నీ, ధ్వని విశేషాల్నీ, సందర్భ ప్రసక్తినీ తెలుసుకున్నాడు. రాత్రి పొద్దుపోయిందని హెచ్చరించేది కామేశ్వరి. ఒక్కొక్కరోజు వాళ్ల తర్కం జరుగుతుండగానే కోడికూనేది.

ఇటు రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం నుండీ, అటు – గర్తపురి, సింహపురి, విజయవాటికల నుండీ తెలిసిన కవి, పండితులు వచ్చి జగన్నాథుని చూసి ఆయన రాసిన లహరుల్నీ, శతక సముచ్చయాన్నీ, భామినీ విలాసంలోని ముక్తకాల్నీ-వినీ, కొన్నిటిని ఎత్తిరాసుకునీ, ఆనందించి వెళ్తున్నారు.

జయపురం, ఉదయపురం, ఢిల్లీ, ఆగ్రాల్లో జగన్నాథుడు పొందిన, పొందుతున్న గౌరవ సన్మాన సత్కారాల విశేషాలు తెలుసుకుని తెలుగువారుగా గర్వభావనతో సెలవు తీసుకుంటున్నారు.

ఆయన అప్పటికి రాసిన కావ్యాలూ, శాస్త్ర గ్రంథాలూ అన్నీ ఒక యెత్తు కాగా, ‘తర్కమౌక్తికమాల’ ఒక్కటే ఒక యెత్తుగా శాస్త్రకారులు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ తెలుపుతున్నారు.

ఒకరోజు ఆయన ముఖతః ఆయన పాండిత్యం విశేషాల్ని విన్నారు పండితులు. తెలుగుదేశానికి పండిత రాయల ప్రతికౌన్నత్యం అవగాహన కొచ్చింది. రెండు నెలలు గడిచాయి. కవి పండిత విద్వాంసులు కలిసి ఆయనకు సన్మాన నిర్ణయం చేశారు.

విజయవాటికలో పండిత సభ. జగన్నాథుని బంధుమిత్రులంతా వచ్చారు. అశేష శేముషీ సంపన్నులైన సాహితీదిగ్దంతులంతా వచ్చారు.

అక్కడ మాధవ దీక్షితుని పాత్ర విశేషమైంది. అతను తండ్రి గ్రంథాల్లోని చాలా శ్లోకాల్ని చదివి, ఆహూతుల ఆనందాన్ని ఇనుమడింపజేశాడు.

రాజేశ్వర శర్మ గతంలో దక్షిణదేశంలో జగన్నాథుడు నానారాజ సందర్శనంలో ఎదుర్కొన్న ఉదాసీనతనీ, ఉపేక్షల్నీ వివరించి, ప్రస్తుతం ఆయన వైభవాన్ని వర్ణించాడు. కొందరు కవి ప్రశంస చేశారు.

జగన్నాథుడు గొంతెత్తాడు.

మద్వాణి! మాకురు విషాద మనాదరేణ,

మాత్సర్యమగ్న మనసాం సహసాఖలానాం!

కావ్యారవింద మకరంద మధువ్రతానాం,

ఆస్యేషు ధాస్యతితమాం కతినో విలాసాన్॥

(తల్లీ! భారతీదేవీ! ఈర్ష్యాసూయాగ్రస్తులైన ఖలుల అనాదరానికి విచారింపకు. నా కావ్యారవిందంలోని మకరందాన్ని సేవించటానికి వచ్చే మధువ్రతముల వంటి పండితుల ముఖాల్లో-నీ విజ్ఞాన విలాసాలు దీప్తమౌతున్నాయి!)

కవి సన్మానం, గజారోహణం జరిగాయి. ఇంతటి మహోత్సవానికి వెనుక రాజేశ్వరశర్మ కార్యకర్తృత్వమే కారణమని తెలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు జగన్నాథుడు.

మరో రెండు నెలల తర్వాత బయల్దేరి జగన్నాథుడూ, కామేశ్వరీ ఆగ్రా వెళ్లారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here