జగన్నాథ పండితరాయలు-18

3
1

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ఒకరోజు అసఫ్‌ఖాని జగన్నాథుని పిలిచి దారాకి – సంస్కృతం, వేద పురాణల గురించి బోధించమంటాడు. అక్కడున్న ఔరంగజేబు తనకి అవన్నీ పడవని అంటాడు. వారి పిచ్చి ముదిరితే తానే వారిని ఏమైనా చేస్తానేమో అని వెళ్ళిపోతాడు. అవన్నీ పట్టించుకోవద్దని అంటాడు అసఫ్‌ఖాన్. దారా ఆధ్యయనం బాగా సాగుతుంది. ఒకరోజున పాదుషా జగన్నాథుని పిలిపిస్తాడు. తాను నిర్మింపబోతున్న కట్టడాల నిర్మాణంలో సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తాడు. నూర్జహాన్, లాడ్లీ బేగంల ప్రస్తావన తెచ్చి వారు జగన్నాథుని ఆంతరంగికుడిగా భావిస్తున్నారని అంటాడు. అందుకు జగన్నాథుడు వివరణ ఇస్తాడు. తనకి అన్ని నిజాలు తెలుసునని చెప్తాడు పాదుషా. నిర్మాణాల వ్యవహారం, దారాకి విద్యాబోధన జగన్నాథునికి అప్పజెప్తాడు. కామేశ్వరికి మాధవుడు గుర్తొస్తాడు. అంతలో కాశీ నుంచి వచ్చిన శ్రీనివాసుడనే వ్యక్తి ద్వారా జగన్నాథుడి తన తల్లిదండ్రుల అనారోగ్యం గురించి తెలుస్తుంది. మాధవుడు విద్యలోనూ, వ్యవసాయంలొనూ రాణిస్తున్నాడని వింటారు. తమ గురువుగారు ఆ దంపతులని ఆంధ్రకి వెళ్ళిరమ్మన్నారని చెప్తాడు. జగన్నాథుడూ, కామేశ్వరీ ముంగండ చేరుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నెల రోజుల తర్వాత మహాలక్ష్మమ్మ కన్ను మూస్తుంది. జగన్నాథుడూ, రామచంద్రుడూ తల్లికి నిత్యకర్మ కార్యక్రమాలను జరుపుతుండగానే ఆరవనాడు పేరుభట్టు కూడా స్వర్గస్థుడవుతాడు. ఈ ఘటనలకు బాధపడతాడు జగన్నాథుడు. జగన్నాథుని చూడవచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు ఇక్కడే ఉండిపొమ్మని అడుగుతారు. కుదరదంటాడు జగన్నాథుడు. మాధవుడు ఉత్తరాదికి రానంటాడు. రాజేశ్వర శర్మ మనవరాలితో మాధవుడికి వివాహం జరిపిస్తాడు. విజయవాటికలో జగన్నాథుడికి కవి సన్మానం, గజారోహణం జరుగుతాయి. మరో రెండు నెలల తర్వాత బయల్దేరి జగన్నాథుడూ, కామేశ్వరీ ఆగ్రా చేరుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-32

[dropcap]జ[/dropcap]గన్నాథుడికి రోజులు చాలా చైతన్యవంతంగా క్రియాశీలకంగా జరుగుతున్నాయి. కామేశ్వరికి మాత్రం కుంటెద్దు లాగుతున్న బండి నడకలా సాగుతున్నై. జగన్నాథుడికి అటు దారా చదువుతో, ఇటు పాదుషా వారి సమావేశాలతో సమయం సరిపోతోంది. రాజకీయ వ్యవహారాల్లో అంతగా తలదూర్చకపోయినా, జగన్నాథుని కూడా సమావేశాలకు రావలసినదిగా పాదుషా వారి ఆజ్ఞ. అసఫ్‍ఖాన్ కూడా, “మీరుంటే జరుగుతున్న మంతనాలు వింటుంటే, కొన్ని అవసరమైన సలహాలు రావచ్చు. మీరు రావాలి” అనే పిలిపించాడు.

ఒకరోజు ఇలాంటి పిలుపు వస్తే వెళ్లాడు. శీష్‌మహల్ నిర్మాణ ప్రతిపాదనని ముందుకు తెచ్చాడు పాదుషా. అది ఎంత అందమైన ‘వేసవి విడిది’గా రూపం దాల్చాలో వివరించి, పనులు మొదలుపెట్టించమని ఆజ్ఞాపించాడు.

చిత్రమైన విషయం అర్థమైంది జగన్నాథుడికి, పాదుషాకి హిందూ ఆచారాల మీద, శాస్త్ర విషయాల మీద నమ్మకాలేమీ లేవు. పైగా అంతరాంతరాల్లో కొంత ద్వేషభావమే ఉన్నట్టుంది. కానీ, మనసు మూలల్లో ఎక్కడో, ‘ఎందుకైనా మంచిది.. చూద్దాం.. విందాం’ అనే చిత్తవృత్తి ఉన్నది. ఇదొక ద్వైదీభావం. డోలాయమాన మానసిక స్థితి. పైకి వ్యక్తం కాని, వ్యక్తం చేయలేని అవస్థ.

అందుకని, ఇలాంటి అవసరాల సందర్భంలో ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. అసఫ్‌ఖాన్ కోరిక అదే అన్నట్టు ఆయన పెద్దవాడూ, పిల్ల నిచ్చిన మామా కనుక, ఆయన మాటకు అడ్డు తగలటమెందుకులే అన్నట్టు నేను ప్రవర్తిస్తున్నాను – అన్నట్టు బహిర్గతమౌతూ ఉంటాడు. ‘మౌనం అర్ధాంగీకారం’ అన్నట్టూ కనిపిస్తాడు. జ్యోతిష్యం మీద మాత్రం ఆయనకు అమిత విశ్వాసం. ‘శీష్‌మహల్’ విషయంలోనూ ఇదే అప్రకటిత ప్రవర్తనని గమనించాడు జగన్నాథుడు.

అసఫ్‌ఖాన్ జగన్నాథుని ప్రత్యేకంగా పిలిపించి ‘శీష్‌మహల్’కి ఉద్దేశించిన స్థలంలో వాస్తు విషయాన్ని పరిశీలించి చెప్పమన్నాడు. తన పని తాను చేసి ఆయనకు వివరించాడు. అసఫ్‌ఖాన్ జగన్నాథుని ప్రశంసించి, ఆయా నియమాల్ని దృష్టిలో పెట్టుకుని భవన నిర్మాణం ప్రణాళికలో మార్పులు చేయించాడు. ఈ ‘తంతు’ అంతా పాదుషాకి తెలుసు.

అసఫ్‌ఖాన్ ఆయనకు చెప్పకయే చెప్పిన వాస్తవం ఇది. పాదుషా తానేమీ విననట్టూ, తనకేమీ తెలియనట్టూ ఉండిపోయాడు. జగన్నాథుని దగ్గర ఆ ప్రసక్తి రాలేదు – రాదు కూడా! జగన్నాథుడు కూడా ఈ మాత్రం తెలియని వాడేంకాదు! నిజానికి ‘ముసమ్మాన్ బుర్జ్’ నిర్మాణ ప్రణాళిక విషయంలోనూ ఇదేమాదిరి ‘తంతు’ జరిగే ఉన్నది!!

పాదుషా మనసంతా ఇప్పుడు సామ్రాజ్య విస్తరణ మీద లగ్నమై ఉంది. అనేక వ్యూహాలూ, ప్రణాళికలూ-ఆలోచనల్లో నలుగుతున్నై. ముఖ్యంగా ఆయన కంట్లో నలుసుగా, ఎదలో ముల్లుగా ఉన్నది అహ్మద్ నగర్, అటుపై ఖాందహార్. వాటిని వశం చేసుకోలేకపోయాడు గతంలో. ఇప్పుడు సాధించాలి. ఇదీ కర్తవ్య భావన!!

ఇవాళ కూడా ఇప్పుడు –

జగన్నాథుడు వెళ్లేసరికి పాదుషా తన అంతరంగిక ప్రధానులతో సామ్రాజ్య విస్తరణ గురించీ సైన్యపటిష్టత గురించి చర్చిస్తున్నాడు.

జగన్నాథుని చూసి ఆయన అభివాదాన్ని స్వీకరించి మందహాసం చేశాడు. జగన్నాథుడు కూర్చున్నాడు.

కొంత సేపటికి అందరికీ సెలవిచ్చాడు ప్రభువు.

జగన్నాథుడూ, అసఫ్‌ఖాన్‌లతో పాటు ఒక అపరిచిత వ్యక్తీ మిగిలారు. “వీరు లాహౌరీ సాబ్” అని ఆ అపరిచిత వ్యక్తిని పరిచయం చేశాడు అసఫ్‌ఖాన్. “వీరు జగన్నాథ పండితరాజ్” అని జగన్నాథుని ఆయనకి పరిచయం చేశాడు. ఇద్దరూ పరస్పర అభివాదాలు చేసుకున్నారు.

“పండిట్ జీ.. మీకు ఢిల్లీ ప్రయాణం నిశ్చయమైంది” అంటూ పాదుషా అసఫ్‌ఖాన్ వైపు చూశాడు.

“అలాగే ప్రభూ..” అన్నాడు జగన్నాథుడు.

“లాహోర్, ఢిల్లీ, శ్రీనగర్ వంటి మహానగరాల్లో పాదుషావారు మహోన్నతమైన భవన సముదాయాల్నీ, రాజసౌధాల్నీ, వనాల్ని నిర్మించాలనే కోరికతో ఉన్నారు. లాహౌరీ సాబ్ సుప్రసిద్ధ భవన నిర్మాణ శిల్పకారులు. శాస్త్రవిషయాలలో ప్రవీణులుగా మీ సహకారం వారికి అవసరం” అన్నాడు అసఖాన్.

“ఆ ప్రణాళికను అమలుపరచటానికి ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చు. కానీ, ఇప్పటి నుండీ ప్రాథమిక ప్రయత్నాలు మొదలు పెట్టాలి..”

సమ్మతిగా తలవూపారు – జగన్నాథ, లాహౌరీ సాబ్‌లు.

ఇంతవరకూ మాట్లాడిన తర్వాత పాదుషా లేచి నిష్క్రమించాడు. అసఫ్‌ఖాన్ మరికొన్ని వివరాల్ని చర్చించిన తరువాత సమావేశం ముగిసింది.

..జగన్నాథుడు ఇల్లు చేరేసరికి సూర్యుడు రాగిరేకుని వృత్తం చేసినట్లు తయారైనాడు.

వచ్చిన కొద్దిసేపటికే రాయముకుందుడి పల్లకీ, జగన్నాథుని భవనం ముందు ప్రత్యక్షమయింది. పల్లకీ దిగి లోనికి ప్రవేశించాడాయన.

జగన్నాథుడూ, కామేశ్వరీ-సంభ్రమాశ్చర్యాలతో ఎదురేగి సాదరంగా ఆయనను లోపలకు తోడ్కొని వచ్చారు.

సాంప్రదాయక విధులు, ఆతిథ్యం అయినాయి. ఈలోగా రాయముకుందుడితో వచ్చిన రాజోద్యోగులు – తెచ్చిన వస్తు సంభారాల్నీ, కానుకల్నీ ఇంట్లో పెట్టించారు. “పెద్దవారు; మీవంటి వారు శ్రమ తీసుకుని ఇలా రావటమెందుకు స్వామీ? కబురు పెడితే నేను రానా?” వినయంగా అన్నాడు జగన్నాథుడు..

“ఆ యింటికి ఆ ఇల్లెంత దూరమో ఈ యింటికి ఈ ఇల్లు అంతేదూరం కదూ?”

“అయ్యయ్యో. అంత మాటనకండి స్వామీ! అది స్పర్థలూ, వివాదాల సందర్భంలో అంటారనుకుంటాను.” అన్నది కామేశ్వరి తత్తరలాడుతూ! “ఇలాంటి సామెతలలో మనసుని బట్టి భావం మారుతుంది” అందరూ నవ్వుకున్నారు. ఫలాహారం అమర్చింది కామేశ్వరి.

తింటూ ఏవో సాహిత్య విషయాలు మాట్లాడుకున్నారు.

ఉన్నట్టుండి, మాట మారుస్తూ, గంభీరంగా చెప్పసాగాడు-రాయముకుందుడు. “ఒక ముఖ్యమైన సమాచారం అందింది – జగన్నాథా!” అని “డక్కన్ నుండి వ్యాపారులెవరో నగరానికి చేరారుట. సరాయిలో దిగారుట. వారిని చూసి కాసేపు ఆగాడుట మా శిష్యుడు శ్రీహరిభట్టు.”

“వారి మాటల్ని బట్టి తేలిన సారాంశం-డక్కన్‍లో తీవ్రమైన కరువుట. పంటలు లేవుట. ప్రజలంతా దారుణమైన కష్టాలలో ఉన్నారుట. చాలామంది వలసలు మొదలైనాయట.”

“రాజధానిలో ఎక్కడా ఎవరినోటా ఈ ఊసు లేదే?”

“అదే ఆశ్చర్యంగా ఉంది. ప్రధానులైన రాజోద్యోగులకి తెలిసి వుండాలికదా! వారి ద్వారా అసఫ్‌ఖాన్, వజీర్, మహబత్‌ఖాన్ వంటివారి దృష్టికి ఈ స్థితి తెలిసి వుండాలి కదా!”

“అవును. చక్రవర్తి సమావేశాల్లో ఎక్కడా ఎప్పుడూ ఈ సమస్య ప్రస్తావనకు రాలేదంటే..” సాలోచనగా ఆగేడు జగన్నాథుడు.

“అందుకనే మనకు తెలిసింది కదా.. పెద్దల చెవిని వేయాలా..? లేదా?.. ఏం చేస్తే ఏ పరిణామం చోటు చేసుకుంటుందో? మనసులోని మథనను నీతో పంచుకుందామని వచ్చాను.” అన్నాడు రాయముకుందుడు.

జగన్నాథుడు మౌనంగా కూర్చున్నాడు. కామేశ్వరి లేచి లోపలికి వెళ్లిపోయింది. రాయముకుందుడు కొంతసేపు సంభాషణని పొడిగించలేదు.

ఇద్దరి మనసులూ-అటూ ఇటూ ఊగిసలాటలోనే ఉన్నై. సూర్యాస్తమయం అవుతోంది.

సమయాన్నీ, సందర్భంలోని క్లిష్టతనీ అర్థం చేసుకున్న కామేశ్వరి-అనుష్ఠానం హెచ్చరికని చేసింది. ఇద్దరూ కదిలారు. “రేపు మాట్లాడుకుందాం” అంటూ బయటికి నడిచాడు రాయముకుందుడు.

అధ్యాయం-33

కాలరథ ప్రచారం సాగిపోతున్నది.

డక్కన్ కరువు గురించీ, ప్రజల ఇక్కట్ల గురించి రాయముకుందుడూ, జగన్నాథుడూ అసఫ్‌ఖాన్ చెవిని వేశారు. ఆయన ఆశ్చర్యపోలేదు సరికదా, కనీసం, ‘అఁహాఁ.. అట్లాగా’ అని అయినా అనలేదు.

ఇద్దరూ తెల్లమొహాలు వేసుకుని కిమిన్నాస్తిగా తిరిగి వచ్చారు. ఆ తరువాత ఈ విషయం గురించి పరస్పరం సంభాషించుకున్నారు. బహుశః అసఫ్‌ఖాన్ కూడా ‘వీరిద్దరూ తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని భావించాడా?’ అని తమలో తమకే సందేహం కలిగింది.

డక్కన్ కరువు పరిస్థితి జన సమూహానికి పట్టనీయకుండా రాచవారు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అర్థమైంది. మనసులు కష్టపెట్టుకున్నా, ఆ విషయాన్ని అంతటితో పక్కన పెట్టారు.

జగన్నాథుడికి భర్తృహరి సుభాషితం గుర్తుకువచ్చింది. రాజుల దగ్గర వర్తన గీతకు అటూ ఇటూ కూడా తుమ్మితే ఊడే ముక్కు బాపతే!

ఒకరోజు-కామేశ్వరి-”ఆ ‘శతక సముచ్చయం’ అలాగే ఉండిపోయింది” అని అంతటితో ఆపకుండా, “అన్నీ.. ఆరంభించటం కొంతరాయటం పక్కన పెట్టటం.. ఆ విలాసమూ అంతే” అని అన్నది.

‘ఇవాళ కామేశ్వరికి విసుగ్గా, చిరాగ్గా ఉంది. అంటే మనసులోకి మాధవుని ఆలోచన వచ్చిందన్నమాట’ అనిపించింది. తనకూ బాధగానే ఉంటుంది – ఆ విషయం గుర్తుకు వస్తే కానీ వాస్తవాన్ని గమనించి ముందుకు నడవటమే కర్తవ్యం అనుకుని మిన్నకుండిపోయాడు.

ఆ రాత్రి నుంచీ ‘శతక సముచ్చయం’ రచనని తిరిగి మొదలు పెట్టాడు.

రచన వేగంగా సాగుతోంది. ఈ మధ్య దారా వద్దకి వెళ్లలేదు.

ఆ వేళ ఎండ కరకర లాడుతోంది. మేజాబల్లపైన చెక్కపెట్టుకుని రచన సాగిస్తున్నాడు జగన్నాథుడు. ఉండుండి భుజం మీది వస్త్రంతో మొహాన పట్టిన చెమటను తుడుచుకుంటున్నాడు.

ఇంటిముందు పల్లకీ ఆగింది. దానితో వచ్చిన రాజోద్యోగి గుర్రం దిగి లోపలికి వచ్చాడు. ‘వెంటనే రమ్మ’ని అసఫ్‌ఖాన్ నుండి పిలుపు. వెళ్లాడు.

అసఫ్‌ఖాన్, దారా! వారిద్దరికి ఈవలగా నలుగురైదుగురు పెద్దమనుషులు. పండితుల వాలకం కనిపిస్తోంది. వారిలో ముస్లింలూ, హిందువులూ ఉన్నారు. అభివాదాలు అయినై.

“వీరంతా షహజాదా దారావారికి చదువు చెబుతామని వచ్చారు.”

అసఫ్‌ఖాన్ మాటలకు ‘తాను రావటం లేదని ఈ ఏర్పాటుకు వీరు పూనుకున్నారా? లేక ఈ గురువులు వారంతట వారుగానే వచ్చారా?’ జగన్నాథుడు ఈ ఊహలో ఉండగానే, “రెండు గంటల నుంచీ వారితో దారావారి సంభాషణ సాగింది.”

“ఇప్పుడే వీరందరికీ సామూహికంగా వర్తించేటట్లు ఒక శ్లోకం చెప్పాను..” అని ఆ శ్లోకాన్ని చదివాడు దారా.

శ్లోకభావాన్ని జగన్నాథుని మనసు చదువుకుంది. ‘సింహం తన గుహలో ఉన్నది. తన దెబ్బకి ఏనుగుల కుంభస్థలంలో నుంచి రాలిపడిన ముత్యాల రాసుల పనిలో ఉంది కనుక ఇప్పట్లో మీకు వచ్చే ప్రమాదం ఏదీ లేదు’ అని ఇతర జంతు జాలానికి ఒక హెచ్చరిక అది.

జగన్నాథుడు కించిత్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఆ మధ్య ‘భామినీ విలాసం’ని అడిగి తీసుకుని కొన్ని శ్లోకాలు చదివి బాగున్నాయని చెప్పాడు దారా. వాటిలోనిదే ఈ శ్లోకం! దారా ధారణాశక్తి గొప్పదని తెలుసు. కానీ, ఇంతటి సమయస్ఫూర్తితో దాన్ని వినియోగించటం ఇదే ప్రథమం. అందుకూ ఆశ్చర్యం!!!

“మా గురువుగారు చెప్పిందే ఈ శ్లోకం. తాత్పర్యం అర్థమైంది కదా! ఇక వెళ్లి రండి” అని ఎదురుగా ఉన్న అధికారిని ఉద్దేశించి, “వీరందరికీ వలసిన ధనం, కానుకలూ ఇచ్చి పంపండి. వారి పాండిత్యానికి తగిన పారితోషికం అందవలసినదే కదా!” అన్నాడు దారా.

వారంతా అందరికీ వందనాలు చేసి బయటికి నడిచారు.

ఆ తర్వాత అసఫ్‌ఖాన్, పండితరాయలు దారాకి బోధన చేయటానికి, రాకపోవటంలోని ఆంతర్యాన్ని అడిగాడు. చెప్పాడు జగన్నాథుడు. అది విని దారా అర్థింపుగా అన్నాడు, “నాకు తెలుసు. మీ దీక్ష అయినా సరే.. ఎంతో కొంత సమయాన్ని మా పాఠానికి కేటాయించండి.”

“అలాగే షహజాదా..”.

“నన్ను మీరు షహజాదా అనొద్దు. దారా అనే పిలవండి గురువుగారూ! మీ నోట వెలువడే ఆ సంబోధనలోని ఆప్యాయత, వాత్సల్యం, నాకు ఎంతో ఇష్టం.” అసఫ్‌ఖాన్ మొహంలో మెరుపు కదిలింది, “సహీబాత్.. సహీ బాత్..” అన్నాడు.

“రేపటి నుండీ మీకు వీలైన సమయంలో రండి. సర్వదా పల్లకీ సిద్ధంగా ఉంటుంది” అనీ అన్నాడు. “అలాగే..” అని సెలవు తీసుకోబోతుంటే పక్క గది వాకిట కాలి అందెల సవ్వడి వినిపించింది. జలతారు తెరమాటున పరదా రెపరెపలాడింది. మాటలు వెలువడినై.

“మీరు మా భయ్యాని మీ అంతవారి శిష్యుడని లోకం మెచ్చుకొనేట్టు చెయ్యాలి పండిట్‌జీ.. మొగలాయీల వంశంలో ఇతనికొక ప్రత్యేక స్థానాన్ని కలిగించాలి మీరు, దయచేసి పాఠం మానకండి. మీరు రాని రోజు వ్యర్థమై పోయిందన్నట్టు గునుస్తూ ఉంటాడు దారా, నాకూ అలాగే అనిపిస్తుంది”.

మహారాణీ అనుకున్నాడు జగన్నాథుడు.

“హమారా బడా బెహన్ జహనారా” చెప్పాడు దారా. “ఆమె పెద్ద పండితురాలు. పైగా మన పాఠాల్ని తానూ వింటూ వుంటుంది”

“జరూర్-ఐసా హెూగా బేగమ్ సాహెబా” సమాధాన మిచ్చాడు.

“బహుత్ బహుత్ షుక్రియా..” అంటూ పక్కకి వెళ్లిందామె.

“చూశారా పండిట్‌జీ.. దారా గురించి ఆమె చెప్పిందే మా అందరి కోరిక కూడా..” అన్నాడు అసఫ్‌ఖాన్.

ఆ తర్వాత-ముగ్గురూ కలిసి నిర్మాణంలో ఉన్న పాఠశాల ప్రాంగణాన్ని చూసి వచ్చారు.

జగన్నాథుడు ఇల్లు చేరేసరికి చీకటి బాగానే ముసిరింది.

“ఇవ్వాల్టి అనుష్ఠానం కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తంతో మొదలు..” అనుకుంటూ లోపలికి నడిచాడు. “రండి.. దానికి తగిన ఏర్పాట్లు చేసే ఉంచాను” అంటూ ఎదురొచ్చింది కామేశ్వరి.

***

దారా పట్ల – జహనారాకీ, అసఫ్‌ఖాన్‌కీ  ఉన్న శ్రద్ధ, ఆసక్తి, ప్రేమానురాగాలూ-తెలియనివాడేం కాదు జగన్నాథుడు. ఇప్పుడు తీరిక చేసుకుని క్రమం తప్పకుండా ఒకపూట దారా పాఠానికి వెళ్లివస్తున్నాడు. ‘శతక సముచ్చయం’ రచన ఒక పూటా, రెండవ పూట ఈ బోధనా కార్యక్రమంగా తన సమయాన్ని కేటాయించుకున్నాడు.

అటు పాఠశాల నిర్మాణమూ పూర్తి కావస్తున్నది.

దారాకి ప్రస్తుతం ఉపనిషత్తుల్ని బోధిస్తున్నాడు – జగన్నాథుడు. శ్లోకాలు విని దారా వేసే ప్రశ్నలూ, ఉపనిషద్వాక్యాలకు దారా గ్రహించదలచుకున్న ఆంతర్యం, కొన్ని కొన్ని సంస్కృత పదాలకు పారశీకంలోని నుడులూ. వాటి సవరింపులూ – ఇలా చదువు చాలా వేగంగానూ, కూలంకషమైన చర్చలతోనూ, ఉత్సాహంగా సాగుతోంది.

ఒకరోజు –

జగన్నాథుడు వచ్చి కూర్చుని పాఠాన్ని ఉపక్రమించబోతుంటేనే అడిగాడు దారా – ‘పంచీకరణ ప్రక్రియ స్పష్టంగా అర్థం కాలేదు గురువుగారూ’ అని.. నవ్వాడు జగన్నాథుడు. ‘తెలివిగలవాడు దారా. ఎక్కడ ఏది పట్టుకోవాలో తెలుసు’ అనిపించింది.

ఆ ప్రక్రియని వాక్యవివరణలతో ఎంత చెప్పినా కొంత అస్పష్టత ఉంటుంది. అందుకని, భౌతికమైన ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని చూపుతూ విశదం చేయాలని భావించి-పెద్ద మైనపు ముద్దని తెప్పించాడు. దాని ఆధారంతో ఆ ప్రక్రియని స్ఫాటిక స్వచ్ఛంగా విశదం చేశాడు.

దారా ఆ మైనపు ముద్దల్ని చూస్తూ “బాగుంది.. ఇప్పుడు తెలిసింది” అని ఆ తర్వాత, ‘పృధివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్, అన్నాత్ పురుషః, సవా ఏవ పురుషోన్నర సమయః’ శ్లోకాన్ని చదివి, భావాన్నీ చెప్పాడు. “భూమి వలన వనస్పతులు, వాటి నుండీ అన్నము, అన్నముతో పురుషుడూ ఉద్భవించాయి. ఈ పురుషుడూ ఇతర ప్రాణకోటి-అన్నరసంతో కూడిన వారు అని అంటుంది తైత్తిరీయోపనిషత్తు. అంతేకదూ?” అనీ అన్నాడు.

“అవును.. బాగుంది.” అన్నాడు జగన్నాథుడు.

కొద్దిసేపు మౌనం తర్వాత -”చివరికి పంచభూత నిర్మితమైన దేహం, అవే పంచభూతాల్లో కలిసి పోతున్నది. ఈ మాత్రం దానికి మత వైషమ్యాలూ, కక్షలూ కార్పణ్యాలూ, మానసిక దౌర్బల్యాలూనూ! మనిషి చిత్తమూ, వర్తనా చిత్రమైనవి” అంతర్ముఖీన భావనతో అన్నాడు దారా.

“అదేమరి. మాయా, మాయామేయ జగము! అదే నాటకము, అదే రంగస్థలమూ!”

“నాకు శంకరుల ఆత్మషట్కం కూడా గుర్తొస్తోంది. ‘నేను ఇది కాను, అది కాదు-అంటూ-చిదానందరూపమ్ శివోహమ్ శివోహమ్’ అంటూ ఐదు శ్లోకాల్లోనూ నాలుగవ పాదంగా చెప్పి, ఆపైన ఆరవ శ్లోకమ్లో తానెవరో’ అనే ఆ ‘శివోహమ్’ తత్త్వాన్ని ఎంతగొప్పగా దృఢ పరిచారు?” అని ఒక విధమైన తాదాత్మ్యంతో చదివాడు.

“అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం

నచాఽసంగతం నైన ముక్తిర్నబంధః చిదానంద రూపం శివోహమ్ శివోహమ్॥”

‘ఈ దేహాన్ని నడిపే చైతన్యం నేను’, అని ప్రతిశ్లోకంలోనూ నిర్ధారణ చేశారు. అదే ఆత్మ, అదే శివమ్. ఆ శివమ్ బ్రహ్మం, అందుకని అహం బ్రహ్మాస్మి. దాన్ని పట్టుకోవాలి. ఆ విధంగా ఈ శ్లోకాల్లో ప్రధానాంగాలు- దేహ ప్రసక్తి, ఆత్మవిచారణ” అన్నాడు జగన్నాథుడు.

“అవును.. నాకొక భావన గురూజీ..” జగన్నాథుని వైపు చూస్తూ అన్నాడు.

“చెప్పు.”

“ఈ ఆత్మ షట్కాన్ని తిరగేసి చూస్తే – ధ్వని పూర్వకంగా బృహదారణ్య కోపనిషత్తులోని ‘నేతి’.. ‘నేతి’ వేద వాక్యార్థమూ, దాని సమాధానాలూ ప్రతిఫలిస్తున్నాయి కదూ!”

జగన్నాథునికి చాలా సంతోషం కలిగింది. శిష్యుని మననం, పునర్విచారణ, పునరుక్తి, సమన్వయశక్తి-ఇవే అధ్యయనానికీ, అభ్యాసానికీ సాధనాలు. దారా వద్ద ఇవి పుష్కలంగా ఉన్నై అనుకున్నాడు. ప్రస్తుతానికి వచ్చి “అంతేకాదు. భజగోవింద శ్లోకంలో శంకరులు చెప్పిన ‘మాయామయమిదమఖిలం హిత్వా! బ్రహ్మపదం త్వం ప్రవిశమఖిలం హిత్వా’ అనే విచికిత్సను కూడా ఇక్కడ అన్వయానికి తెచ్చుకోవచ్చు. అంతా మాయ, మాయామేయ జగత్తు. ఇదే నువ్వు ఇంతకుముందు అన్నది” అన్నాడు.

“మాయాధీశుడు మాధవుడు; మాయాధీనుడు మానవుడు అని తెలుసుకోవాలి, అనుకోవాలి, గుర్తులో ఉంచుకోవాలి” అంటూ నవ్వాడు దారా. జగన్నాథుడు శ్రుతి కలిపాడు.

ఆ రోజు – ‘తైత్తిరీయోపనిషత్తు’ పూర్తిచేశారు.

“రేపు నా లక్ష్య సాధనకు తొలి అడుగు వేస్తాను..”

‘అంటే’ అన్నట్టు చూశాడు. జగన్నాథుడు.

“ఇప్పటి వరకూ పదిహేను ఉపనిషత్తుల్ని పూర్తిచేశాం. కనుక, ఇక నా అనువాద కార్యక్రమాన్ని మొదలుపెడతాను..” అని లేచి నమస్కరించాడు.

జగన్నాథుడు “అయితే ఎక్కడ నుండీ ఆరంభిస్తారు?” అడిగాడు.

“యాజ్ఞవల్క్య మహర్షికీ, ఆయన భార్య మైత్రేయికి జరిగిన సంవాదం చాలా గహనమైనదీ, తేలికైనదీ కూడా అనిపించింది నాకు. ‘మనకు ప్రియమైనది ఒక వస్తువును స్వంతం చేసుకున్నప్పుడు కలిగే భావనాస్థితే కానీ, నిజానికి ఆ వస్తువుని పొందటం కాదు’ అని ఆయన చెప్పిన సుదీర్ఘ వివరణ నా మనసుకు హత్తుకున్నది. అందుకని ముందుగా దానితో ఆరంభిస్తాను..”

“బృహదారణ్యకోపనిషత్తు! బాగుంది. కానీయండి” అన్నాడు జగన్నాథుడు. మరుక్షణం జగన్నాథుని హృదయం నుండీ మరో అమృతవాక్కు-వెలువడింది. “మీ నిర్ణయం శాశ్వత ఫలాన్నిస్తుంది దారావారూ. చరిత్ర దానికి భవిష్యత్తుని చేకూరుస్తుంది. అటు పారశీక సాహిత్య చరిత్రకారులూ, ఇటు సంస్కృత వాఙ్మయ చరిత్రకారులూ -మీ పేరున తప్పకుండా ఒక అధ్యాయం రాస్తారు.”

“ఆ అధ్యాయం శీర్షిక మీ పేరున ఉంటుంది. ఉపశీర్షికగా మాత్రమే నా పేరు వస్తుంది. ఇది నా ఆకాంక్ష- గురూజీ” అన్నాడు దారా కైమోడ్పుతో.

దీవిస్తున్న కుడిచేతితో అభయమిచ్చాడు జగన్నాథుడు. ఆ తర్వాత-కొద్ది సేపు దారాని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అనేక భావాల మాలిక సాగింది.

“మొగలాయీ వంశంలో ఈ కుఱ్ఱవాడు తప్పపుట్టాడు. హిందూజీవన విధానం పట్ల, ఆర్షసంస్కృతీ సంప్రదాయాల పట్ల అభినివేశం ఎంత గాఢంగా ఉన్నదో అంతకంత దృఢంగా హిందూ ముస్లిం సఖ్యత పట్ల సమన్వయ దృక్పథమూ ఉన్నది. ఈ వయస్సులోనే తరచుగా ఈ రెండు విధానాల అనుసంధానానికి స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ఆచరణీయ మార్గాలను ప్రతిపాదిస్తున్నాడు. కారణజన్ముడా? ఏమో!!”

“గురువుగారూ!” పిలిచాడు దారా. తన భావలహరి నుండీ తెప్పరిల్లాడు.

జగన్నాథుడు. “ఏమో ఆలోచిస్తున్నారు..?”

“ఏం లేదు. మీకు ఇష్టమైన సూఫీ తత్వంలోని సూక్తి ఒకటి మదిలో మెదిలింది.” “చెప్పండి.. చెప్పండి..” అతి ఉత్సాహంతో ముందుకు జరిగాడు.

“నీకు ఏదో కావాలనే వాంఛ ఉంటే దాన్ని బయటికి వెలువరించు. దాని తోడుదీపాన్ని అది వెతుక్కుంటుంది.”

“ఓహ్.. బహుత్ అచ్ఛీబాత్” అని చప్పట్లు కొట్టాడు దారా!

అధ్యాయం-34

1631 -జూన్ నెల.

ముంతాజ్‌మహల్‍కి తీవ్రమైన అస్వస్థత. అదీ కాన్పు సమయంలో, ఏ వైద్యమూ పని చేయలేదు.

విధినిర్ణయం – ఆమె గతించింది.

పాదుషా మనిషిమనిషిగా లేడు. మనసు మనసులో లేకపోవటం కాదు తన పంచప్రాణాలూ పోయినట్లే దుఃఖంలో దిగబడిపోయాడు. ప్రేమమయి; ప్రియకళత్రం ఇక లేదనే వాస్తవం ఆయన్ని విచారసముద్రంలోకి తోసింది. కంటికి రెప్పలా ఆయన్ని కాపాడి సేవ చేసింది జహనారా!

షాజహాన్ తేరుకున్నాడు. తన ప్రియభార్య జ్ఞాపకచిహ్నంగా యమునాతీరంలో అపురూపమైన లోకోత్తరమైన ‘తాజ్‍మహల్’ నిర్మాణానికి పూనుకున్నాడు.

కొన్ని నెలల్లోనే దాని నిర్మాణం ప్రారంభమైంది. ముంతాజ్‌మహల్ సంపదలో సగ భాగాన్ని జహనారాకి ఇచ్చి, మిగిలిన సగాన్ని ఆమె ఇతర సంతానానికి పంచాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here