[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[జగన్నాథుడు బోధన లోనూ, రాచకార్యాలలోనూ తీరిక లేకుండా ఉంటుంటే, కామేశ్వరికి మాత్రం రోజులు గడవడం లేదు. ఒకసారి పాదుషా పిలిపించి శీష్‌మహల్ నిర్మాణ ప్రతిపాదన వివరిస్తాడు. అసఫ్‌ఖాన్ ‘శీష్‌మహల్’కి ఉద్దేశించిన స్థలంలో వాస్తు విషయాన్ని పరిశీలించి చెప్పమంటాడు. జగన్నాథుడు అలాగే చేస్తాడు. మరోరోజు జగన్నాథుని పిలిపించి లాహోరీ సాబ్ అనే భవన నిర్మాణ శిల్పకారుడిని పరిచయం చేస్తాడు అసఫ్‌ఖాన్. జగన్నథుని, లాహోరీ సాబ్‌ని కలిసి పాదుషా వారు నిర్మింపతలపెట్టిన భవన సముదాయాల, రాజసౌధాల, వనాల రూపకల్పనలో పాలుపంచుకోమని చెప్తాడు. జగన్నాథుడి ఇల్లు చేరాకా, కాసేపటికి రాయముకుందుడు వారింటికి వస్తాడు. కామేశ్వరి ఆతిథ్యం ఇస్తుంది. కాసేపు సాహిత్య విషయాలు మాట్లాడుకున్నాకా.. డక్కనులో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొందని తెలిసిందని ఆయన జగన్నాథునితో చెప్తాడు. ఈ విషయాన్ని పెద్దల చెవిన వేయాల వద్దా అని ఆలోచనలో పడతారు. చివరికి ఈ వార్త అసఫ్‌ఖాన్ చెవిని వేస్తారు, ఆయన పెద్దగా స్పందించడు. ఆ విషయన్ని అక్కడితో వదిలేస్తారు వారిద్దరూ. కొన్ని రోజులు రాచమందిరానికి వెళ్ళడు జగన్నాథుడు. ఒకరోజు అసఫ్‍ఖాన్ నుంచి పిలుపు వస్తుంది. మందిరానికి వెళ్ళిన జగన్నాథుడికి అక్కడ కొందరు హిందూ, ముస్లిం పండితులు కనబడతారు. వారంతా దారాకి చదువుచెబుతామని వచ్చారట. దారా ఓ శ్లోకం చదివి, వారిని పంపించేస్తాడు. తాను ఎందుకు తరచూగా రాలేకపోతున్నాడో అసఫ్‍ఖాన్‌ని వివరిస్తాడు జగన్నాథుడు. ఎంతో కొంత సమయం తన పాఠానికి కేటాయించమని వేడుకుంటాడు దారా. అక్కడే పరదా చాటున ఉన్న జహనారా కూడా పాఠం మానవద్దని కోరుతుంది. సరేనంటాడు జగన్నాథుడు. పాఠశాల నిర్మాణం పూర్తి కావస్తుంది. దారా అధ్యయనం గొప్పగా సాగుతుంది. కారణజన్ముడని తలుస్తాడు జగన్నాథుడు. 1631 జూన్ నెలలో ముంతాజ్‌మహల్‍కి తీవ్రమైన అస్వస్థత చేసి మరణిస్తుంది. పాదుషా క్రుంగిపోతాడు. ఆమె స్మృతి చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించాలనుకుంటాడు. ఇక చదవండి.]
అధ్యాయం-35
[dropcap]ఢి[/dropcap]ల్లీ ప్రయాణం పడింది. కామేశ్వరి హడావిడి చేస్తూనే ఉన్నది.
జగన్నాథుని ఢిల్లీ ప్రయాణానికి కావలసినవి సర్దుతూనే, తన మనసు చేస్తున్న మల్లడినీ బహిర్గతం చేస్తూనే వున్నది.
“మరీ ఒంటరిగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం కష్టంగా వుంది. తెలుగులో మాట్లాడే వాళ్లు లేకపోవటం అటుంచితే, అసలు ఏ కాలక్షేపమూ లేకపోతే ఎట్టా?” అని గునుస్తోంది.
అప్పటికీ, ఒక కన్నడ యువతిని పరిచారికగా అమర్చారు-రాజోద్యోగులు. కానీ, ఆ యువతి మూగదానిలాగా అసలు వెదవే విప్పడు. “హౌదు.. ఇల్లా..” రెండు మాటలే వచ్చిన దానిలా ఉంటుంది. అంతగా అవసరమయితే – “నోడి.. బేకు.. బేడా” మాటలు మాత్రమే పలుకుతుంది.
జగన్నాథుడు ఆమెకి బాగానే ధైర్యం చెబుతూ వస్తున్నాడు, “సాహిత్యం అధ్యయనం, సంగీతం అభ్యాసం చెయ్యి. నిజానికి నీకు ఈ రెంటితో పొద్దుచాలదు. కూడా” అని సముదాయిస్తున్నాడు.
“పోనీ.. ఎటన్నా బయటికి పోదామంటే సవాలక్ష ప్రశ్నలూ, సమస్యలూనూ, అన్నింటికంటే భయంకరమైనది ఆ సిపాయిల చూపూ!”
నవ్వొచ్చింది జగన్నాథుడికి. “వాళ్లు నిన్నేమీ నమిలి మింగేయర్లేవోయ్”. “మీకు నా మాటలు పరిహాసంగానే ఉంటయ్.. ఎంత పండితులైనా స్త్రీ మనసూ, బాధా ఏం తెలుస్తయ్?”
“అవును.. అందుకే అన్నారు – మగువ మనసు లోతెరగటం కష్టం-అని. అంతేకాదు కామూ – ‘స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః’ అనీ అన్నారు” ఆమెను ఉడికించే ధోరణిలో అన్నాడు.
“అవును-అన్నారు. ఎవరూ? పురుషపుంగవులేగా? చాల్లెండి సంబడం” అని మూతి విరిచింది. అనుష్ఠానానికి కావలసినవి సర్దడంలో పడింది.
ఆమె కినుకా, ఆ భంగిమా జగన్నాథుని ముగ్ధుణ్ణి చేసింది. చేతిలోని గ్రంథాన్ని పక్కన పెట్టి లేచి, తమకంగా ఆమెని సమీపించబోయాడు.
కామేశ్వరి ప్రణయోల్లాసానికి అసమయమనే సంభ్రమంతో చప్పున కదిలి అవతలికి అడుగువేసింది.
***
ఢిల్లీ.
డిసెంబరు నెల సాయం సంధ్య. చలిగాలి కువకువలాడిస్తోంది.
యమునా నదికి కుడివైపు విశాలమైన ఖాళీస్థలం. అక్కడ నిలబడి ఆ ప్రాంతాన్నంతా పరికిస్తున్నారు- అసఫ్‌ఖాన్, లాహౌరీ, జగన్నాథులు. వారి వెనుకగా పది పదిహేనుమంది రాజోద్యోగులూ, అధికారులూ ఉన్నారు.
దూరంగా రాచనగరు రాజసౌధం. మొగల్ పాదుషాలకు ఆగ్రా తర్వాత రాజధానిగా వర్ధిల్లుతున్న నగరం!
లాహౌరీ చేతిలో చాలా పటాలున్నాయి. అవన్నీ భవన నిర్మాణాలకు సంబంధించి అనేక కోణాలలో తయారు చేయబడి వున్నాయి. స్థల వైశాల్యానికి అనువైన కట్టడాలకి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.
“ఈ ప్రాంతం అనువుగా వుంటుందని – పాదుషా వారి అనుజ్ఞ” అన్నాడు అసఫ్‌ఖాన్. “అవును. పాదుషా వారు ఆశించే అపూర్వకట్టడం-’ఖిలా-ఇ-ముబారక్’ ఈ విశాల స్థలంలోనే రావాలి.” అన్నాడు లాహౌరీ.
“పాదుషా చెప్పిన మరో నిబంధనను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాబోయే కట్టడం ఆగ్రా కోటలాగానే ఎఱ్ఱరాతితోనే నిర్మితమవ్వాలి.” పాదుషా మాటల్ని గట్టిగా నొక్కి చెప్పాడు అసఫ్‌ఖాన్.
ఆ ఆవరణంతా చాలాసేపు తిరుగుతూ- భవన నిర్మాణాన్ని గురించి, పటాలలో ఉన్న నమూనాలు ఏవిధంగా అనుకూలమౌతాయనే దాని గురించి విశ్లేషించుకున్నారు.
జగన్నాథుడు మాత్రం వారితో -శ్రోత(లా)గా- నడుస్తున్నాడు.
“కోటలోపలి రాజప్రాసాదాలు చలువరాతివి వాటన్నింటినీ కలుపుతూ ఒక ‘స్వర్గంగ’ ప్రవహించాలని పాదుషా వారి స్వప్నం, ఆశయం!”
ఆ మాటలు చెప్పి, నడక ఆపి నిలబడ్డాడు అసఫ్‌ఖాన్. పక్కగా లాహౌరీ దిక్కులు చూస్తున్నాడు.
“పండిట్‌జీ! చూశారు కదా! మీ అభిప్రాయం చెప్పలేదు” అన్నాడు అసఫ్‌ఖాన్. “చూస్తున్నాను.” అంటూ లాహౌరీ వైపు తిరిగి, “ఈ ప్రదేశానికి దిక్కులు చెప్పండి లాహౌరీ సాబ్” అని అడిగాడు.
అప్పటికి చీకటి ముసురుకుంటోంది. అంతా ఖాళీ ప్రదేశమవటం వలన చలిగాలి శరీరాల్ని వణికింపజేస్తోంది.
“మీ ఎదురుగా ఉన్న దిక్కు తూరుపు” చెప్పాడు లాహౌరీ. వెంటనే ఆయన చేతిలో ఉన్న పటాన్నీ అందించాడు.
దాన్ని పరిశీలనగా చూశాడు జగన్నాథుడు. తాను నిలబడిన చోటు నుంచీ అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్లి అక్కడ నుంచీ ఉత్తరానికి మరలి కొంతదూరం సాగి ఆగాడు.
లాహౌరీ, అసఫ్‌ఖాన్ వచ్చారు. వారి ననుసరించి ఉద్యోగులూ, అధికారులూ చేరారు.
అందరినీ చూసి, అసఫ్‌ఖాన్‌ని ఉద్దేశించి అన్నాడు జగన్నాథుడు. “కోట ప్రణాళిక ప్రదేశాన్ని పరీక్షించిన భూగర్భ శాస్త్రవేత్తని కూడా పిలిపిస్తే బాగుంటుంది. వారి సలహాలూ, సూచనలూ చాలా ముఖ్యం”
“అవును.. జరూర్.” అన్నాడు లాహౌరీ.
అసఫ్‌ఖాన్ ఆలోచనలో పడ్డాడు. “సరే.. మీ సూచన బాగుంది. కానీ, ఆయన ఉండేది మధురలో, రావడానికి కొంత సమయం పడుతుంది కదా!”
“కొన్ని రోజులు ఆలస్యమయినా ఫర్వాలేదు. పిలిపించండి” అన్నాడు లాహౌరీ. అందరూ వెనక్కి తిరిగి నిదానంగా నడక ప్రారంభించారు. పూర్తిగా చీకటి ముసిరింది.
***
జగన్నాథుడు తన బస చేరేసరికి పొద్దుపోయింది.
భవనం తొలికక్ష్యలోనే ఎదురైనాడు- శంకరశాస్త్రి, ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు. లోపలి నుండి వచ్చిన అమ్మాయిని తన భార్య సుభాషిణిగా పరిచయం చేశాడు. ఆమె ‘మహాలక్ష్మి’లా వుంది. సుభాషిణి తెలుగు వారి ఆడపడుచు. పుట్టింటి వారు ఉపద్రష్టవారే. కాశీలో స్థిరపడ్డారు.
“అయితే, వెంకటరామశాస్త్రిగారి బంధువులా?” జగన్నాథుని ప్రశ్నకు సమాధానంగా, “నిక్కంగా అవును. వారి మనవరాలే. మా దాంపత్యం వయసు మూడు వత్సరాలు” నవ్వుతూ అన్నాడు శంకరశాస్త్రి.
జగన్నాథుడు చాలా సంతోషించాడు.
“మధ్యాహ్నమే ఇక్కడికి చేరాము. ఎక్కడికక్కడ మీ పేరు చెప్పుకుంటూ వస్తుంటే, ఎవరికి వారు-వారే దారి చూపుతూ అఖండ గౌరవంతో ఇక్కడికి చేర్చేశారు మమ్మల్ని. నిజానికి ఇక్కడి నుండీ ఆగ్రాకే మా ప్రయాణం. కానీ, ఇక్కడి రాజోద్యోగులు మీరు ఇక్కడే ఉన్నారని చెప్పి, సరాసరి మీ బసకే తెచ్చి వదిలి వెళ్లారు. గురువుగారంటే సామాన్యమా మరి” సంబరంగా అన్నాడు.
“బాగుంది” అని కాశీ విశేషాలు అడుగుతూనే ముందుగా శేషవీరేశ్వరుడు, పర్వతవర్థని గురించి అడిగాడు. వారి విషయాలు మాట్లాడుతూంటే శాస్త్రితో పాటు సుభాషిణీ కూడా మాటలు కలిపింది. “మీకీ ఆలోచన ఎందుకు కలిగిందో గానీ, కామేశ్వరి మాత్రం చాలా సంతోషిస్తుంది. మనసు విప్పి తెలుగులో మాట్లాడుకునే మనిషి లేక తెగ బాధపడుతోంది” మనస్ఫూర్తిగా అన్నాడు జగన్నాథుడు. కొద్దిసేపు మాట్లాడి, వంటపనికి పూనుకున్నది సుభాషిణి.
మగవాళ్ళిద్దరూ వారి కార్యక్రమాలు కానిచ్చుకున్నారు.
“ఇదెక్కడి చలి స్వామీ, నరాల్ని కొరుకుతున్నట్టుంది. వ్రేళ్లు కొంకర్లు పోతున్నై. ఆపాదమస్తకం వణికిస్తోంది” గజగజ వణుకుతూ అన్నాడు శాస్త్రి.
నవ్వాడు జగన్నాథుడు
“చూడు, ఆ దండెం మీద ఉన్ని షేర్వాణీ వుంది. తీసి తొడుక్కో”
“ఏఁవిటీ-షేర్వాణీనా?” అని “ముసల్మానుల ఆహార్యం” విస్తుపోయినట్టు అడిగాడు.
“అవును, మనోమూలమిదం జగత్.. కదా, మనసులో ఏమీ న్యూనతాభావం పెట్టుకోకు. మనం ఏ ప్రదేశాల అవసరాల్ని ఆయా ప్రదేశాల్లో ఆచరించాల్సిందే. అన్నిటికంటే పెద్ద సూక్తిని నేనుగా చెప్పాలా నీకు” అని, “శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం కదా!” అన్నాడు.
“అర్థమైంది గురువుగారూ. నాకు వివేక చూడామణి వాక్యమూ గుర్తుకొస్తున్నది- ‘మనోహ్యవిద్యా భవ బంధ హేతుః’ అనికదా! జగన్నాథుడు సైగలతో శాస్త్రి వైపు చూస్తూ “అయినా నీకు చలేమిటోయ్. పక్కన – ‘కార్యేషుదాసీ..’ వంటి భార్యని పెట్టుకుని” అని పరిహాసమాడాడు.
లోపలి నుంచీ వస్తున్న సుభాషిణి వీరి సంభాషణ విని, సిగ్గు పడి గొంతు సవరించుకుని “బాబాయి గారూ! మీ అనుష్ఠానం అయిపోతే భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు. మీ శిష్యుడు కాశీని మీ ముందు పరుస్తారు.” అన్నది. రాత్రి చాలాసేపు కాశీ కబుర్లే సాగాయి.
భట్టోజీ వర్గం వారి అతిశయభేషజాలూ, ఆధిపత్యం-శేషవీరేంద్రుణ్ణి మరీ దూరాన పెట్టటం, వారి దగ్గరకు వచ్చే శిష్యులకీ అడ్డంపడి వారి వైపుకు తీసుకుపోవటం-మొదలయిన వన్నీ చెప్పాడు శాస్త్రి.
“అయినా, మన గురువులకి ఆయనతో వైరమేముంది? భట్టోజీ చేసిన గురుద్రోహం-అదే-ప్రక్రియా కౌముదిని ఖండిస్తూ చేసిన రచన ‘ప్రౌఢ మనోరమ’ అని చెప్పారు కదా! ఆ గ్రంథం వల్లనే కదా అసలు స్పర్థ” అన్నది సుభాషిణి.
జగన్నాథుడు విస్తుపోయాడు. ‘ఈమెకి శాస్త్ర విషయాల్లో ప్రవేశం ఉన్నది’ అని సంతోషమూ కలిగింది. ‘శాస్త్రి ఎటూ తన సంగీత శిష్యుడే, కాబట్టి ఈమెకీ సంగీతం వచ్చే ఉండాలి. ఇకనేం-కామేశ్వరికీ, ఈమెకీ సంగీత సాహిత్యానుబంధం బాగానే కుదురుతుంది’ అనుకున్నాడు మనసులో.
కొద్దిసేవు ఎవరి ఆలోచనల్లో వారుండి పోయారు అప్పుడు అడిగాడు-జగన్నాథుడు. “మన దగ్గర చదువు మొదలుపెట్టిన ఆ ముస్లిం కుర్రవాడు ఎలా వున్నాడు?”
“చక్కగా వున్నాడు. చక్రపాణి గురుకులంలో అతని చదువు నిరాఘాటంగా సాగుతోంది.” ఠక్కున స్వరం మార్చి “అయినా మా కందరికీ హిందూ ముస్లిం సఖ్యత ఆవశ్యకత గురించీ, మానవీయ విలువలను గురించీ మీరు బోధించినవీ, ఆచరణాత్మకంగాచేసి చూపించినవీ -ఎట్లా మరిచిపోతాం గురువుగారూ! మీ శిష్యుల ద్వారా ఆ ఆశయాల పరంపర అలా సాగిపోతూనే వుంటుంది” అని ఉద్వేగంగా అన్నాడు శాస్త్రి. ఆ ఉద్వేగం ఉద్విగ్నతగా మారి పొలమారి కళ్లు చెమర్చినాయి. సుభాషిణి నీరు అందించింది. తాగాడు. మరుక్షణం అతనికి పెద్దగా ఆవులింత వచ్చింది.
“మీరు బాగా అలసిపోయి వున్నారు. ఇంక విశ్రమించండి. రేపు మాట్లాడుకుందాం.” అంటూ తాను పడక గదికి కదిలాడు జగన్నాథుడు.
దంపతులిద్దరూ తమకు కేటాయించిన గదివైపు నడిచారు.
తెల్లవారుతూనే ఇద్దరు రాజోద్యోగులు వచ్చారు. వారితో పాటు సుమారు ఏభై ఏళ్ళ స్త్రీ వున్నది.
“ఈమె పేరు కావేరి” అని పరిచయం చేసి, “కావేరీ గుజరాతీ మాట్లాడుతుంది. అంతో ఇంతో హిందీ, సంస్కృతం కూడా తెలుసు. ఇంటి పనులన్నీ ఆమె చూసుకుంటుంది. మీకు ఏం కావాలన్నా ఆమెకు చెప్పండి, అవసరమైతే ఆమె మాతో మాట్లాడి కావలసిన వాటిని మీకు అమరుస్తుంది” అని ఆమెని అప్పజెప్పి వెళ్లారు. తోడు దొరికిందనుకున్న సుభాషిణి కంటే శాస్త్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఉదయం వీరి దైవ కార్యాలు ముగిసే సరికీ అసఫ్‌ఖాన్ నుండీ పిలుపువచ్చింది. శాస్త్రిని కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు జగన్నాథుడు. సేవకులెవ్వరూ లేకుండా, తన మందిరంలో ఒక్కడే వున్నాడాయన. ‘తన సంగీత శిష్యుడు’ని శాస్త్రిని పరిచయం చేశాడు జగన్నాథుడు. ఆగ్రా రావాలనే అతని కోరికనీ – అసఫ్‌ఖాన్‌కి చెప్పాడు. అసఫ్‌ఖాన్ ఇతర వివరాల్లోకి వెళ్లకుండా, “బాగుంది.. సంగీత విద్వాంసులకి ఎప్పుడూ పాదుషా వారి ఆహ్వానం ఉంటుంది. రండి” అని, “నేను మిమ్మల్ని పిలిపించిన కారణం వేరు” అంటూ “మనం ఇంకా కొన్ని రోజులు ఇక్కడే వుండాల్సి రావచ్చు. లాహౌరీ గారికి కొన్ని పనులున్నాయట. అది సరే. కనక్‌లాల్ తెలుసుకదా” అడిగాడు.
ఇద్దరూ తలలు ఊపేరు.
“ఆయన కాశీకి ఢిల్లీకి మధ్య ఆసులో గొట్టంలా తిరుగుతూనే ఉంటాడుట కదా! తరచూ వచ్చి తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించమని మన వారి నెవరినో వేడుకుంటున్నాడుట. మీరేమంటారు?”
“అభ్యంతరమేముంది? మీ ఆజ్ఞ” అన్నాడు జగన్నాథుడు. “మనకూ ఇప్పుడు ప్రత్యేకమైన రాచవిధులేమీ లేవు. ఈరోజు సోమవారం. బుధవారమే సభను ఏర్పాటు చేద్దాం”
“అలాగే..” అన్నాడు జగన్నాథుడు..
సెలవు తీసుకుని వచ్చేశారు.
***
బుధవారం సాయంత్రం-
కవి-పండితగోష్ఠి, వేదిక మీద అసఫ్‌ఖాన్, ఆయన పక్కన జగన్నాథుడు. వేదిక కింది మొదటి వరుసలోని సోపానాలమీద కనక్‌లాల్, వచ్చిన పెద్దలూ కూర్చున్నారు, కవి, పండితులంతా కలిసి ఒక ఇరవైమంది దాకా వున్నారు.
పరస్పర పరిచయాల అనంతరం జగన్నాథుని వైపు చూశాడు అసఫ్‌ఖాన్- మొదలుపెట్టమన్నట్లుగా. అంగీకారంగా తలవూపి, కనక్‌లాల్ వైపు తిరిగి, “మీరు ఏ విషయం మీద ప్రసంగించదలచుకున్నారో చెప్పండి..” అన్నాడు జగన్నాథుడు.
కనక్‌లాల్ మనిషి శరీర విన్యాసమూ, మాటతీరూ కూడా విలక్షణం గానే వుంటాయి.
లేచి నిలబడి, అందరికీ సలాములు చేసి, “ప్రభువులు నా కోర్కెని ఇప్పటికైనా మన్నించి నాకీ అవకాశాన్నిచ్చారు. కృతజ్ఞుణ్ని” అంటూ మొదలుపెట్టాడు.
అసఫ్‌ఖాన్ జగన్నాథుని వైపు ‘ఏమిటీయన వెటకారం’ అన్నట్టుగా చూశాడు. జగన్నాథుడు సహనం వహించాడు.
“చక్రవర్తి వారికీ, వారి శ్రేయోభిలాషులైన అసఫ్‌ఖాన్ సాహెబ్ వంటి వారికీ కూడా, ఒక్కొక్కప్పుడు అర్హుల్ని గుర్తించటానికి జాప్యం అవుతుంది. ఉదాహరణకి మా భట్టోజీ వంటి కాశీపండితుల్ని..”
వింటున్న అసఫ్‌ఖాన్ తన కుడిచేత్తో అసహనంగా గద్దె చరిచాడు. కాళ్లు తాటించాడు. ఏదో అనబోయేలోగా చప్పున లేచి జగన్నాథుడు అందుకున్నాడు.
“కనక్‌లాల్ సాబ్! మనం సమావేశమయినది శాస్త్ర సాహిత్యాంశాలను పంచుకోవటానికి. ఆ అవకాశాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని అన్యభాషణతో కలుషితం చేసుకోవటం యుక్త మనిపించుకోదు. అది ప్రభువులకూ అంగీకారయోగ్యమూ కాదు” అని “మీరు నేరుగా మీ ప్రసంగాన్ని ప్రారంభించండి” అంటూ ఠక్కున కూర్చున్నాడు.
సభలో కొంచెం సవ్వడి! పరిస్థితిని అర్థం చేసుకున్న కనక్‌లాల్ విషయంలోకి దిగాడు.
“మానవ జీవన గతి సక్రమంగా సాగటానికి భౌతిక కర్మవిధుల నిర్వహణ కంటే, ఆధ్యాత్మిక చింతన సాధనలే ఆలంబనం అనీ, ఆవశ్యకమనీ అన్నట్టు నీతులు చెబుతూ, తమ ప్రవచనాలతో, ప్రచారాలతో జనాలను మోసం చేస్తున్నారు- చాలామంది-పండితులూ, శాస్త్రకారులూ. యథార్థాన్ని గమనిస్తే భౌతిక జీవనానికి మనిషి బాహ్యశక్తి అనివార్యం. ఆ శక్తితో, లౌకిక యుక్తితో సంపాదిస్తే కానీ, ఈ భౌతిక జీవనం సుఖవంతంగా గడవదుకదా! ఈ జీవన విధానాన్ని కొందరు ఎందుకు చులకన చేసి మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈ విషయం మీద పెద్దలు కొంత కాంతిని ప్రసరిస్తే నావంటి సామాన్యులు తమ సందేహాలను తీర్చుకుంటారు” అన్నాడు.
నీలకంఠ జోషీ మహారాష్ట్ర నుండీ వచ్చాడు. ఆయన లేచి నిలబడి, ‘ఆధ్యాత్మికత దివ్య జీవనానికి మార్గమనీ, అది లేనిదే మనిషి మిథ్యాపరిధిలోనే తిరుగుతూ భవబంధాలతో శ్లేష్మంలో పడిన ఈగలాగా అవుతాడనీ’ చాలా ఉదాహరణలతో మాట్లాడాడు.
ఆ తర్వాత కర్ణాటక పండితుడు వైద్యా – అసలు జీవితంలో సుఖం అంటే ఏమిటి? అనే చర్చలోకి దిగి, అనేక ఉపపత్తులతో మనిషి ఆలోచనలో, ప్రవర్తనలో- ఉన్నత ధ్యేయం ఉండాలనీ, అదే ఆధ్యాత్మికత అనీ వివరించుకొచ్చాడు. చివరికి సత్యాన్ని పరిశీలించడమే ఆధ్యాత్మికత అనీ, అదిలోపిస్తే భౌతిక సూత్రాలన్నీ చిల్లుకుండలౌతాయనీ ముక్తాయింపు పలికాడు.
ఇంకా కొందరు లౌకిక విలువలు, నైతిక విలువలు గురించి చర్చించారు. చివరికి అసఫ్‌ఖాన్ జగన్నాథునివైపు చూశాడు.
జగన్నాథుడు అంశాల వారీగా స్పష్టంగా చెప్పుకొచ్చాడు.
“అంతరంగ శౌచం, బాహ్యంలో నిష్కామ సేవ – అంతకుమించిన ఆధ్యాత్మికత ఏముంది? అసలు ఆధ్యాత్మిక భావన, చింతన, వర్తన-ఎందుకు అవసరం? అది లేకపోతే, వస్తువ్యామోహం, సుఖాపేక్ష, బంధనాలూ పెరుగుతాయి. ఆ బంధనాల నుండి అధిక వాంఛ, దాని నుండి క్రోధం, క్రోధం నుండీ మోహం, దానివల్ల బుద్ధి నాశం.. బుద్ధినాశంతో మనిషి నశిస్తాడు. ఇదే భగవద్గీత బోధన”.
సభలో నుండీ “ఎంతో స్పష్టంగా వుంది భావన”, “విషయ వివరణ కూడా…” ఇలా చాలా అభిప్రాయాలు వెలువడుతున్నై. జగన్నాథుడు కర్మానుసరణ, కర్మ పరిరక్షణ, కర్మాచరణ నిరసన గురించిన మీమాంసలోకి వెళ్లామా అని క్షణం ఆలోచించి, సమస్యను జటిలం చేయకూడదు అని భావించి వద్దనుకున్నాడు.
అసఫ్‌ఖాన్ మనఃస్థితినీ గమనించి అన్నాడు, “ఎన్ని నదుల్లో స్నానం చేయించినా గాడిద గుఱ్ఱం కానట్టే, నీతులు ఎన్నివిన్నా-కొంతమంది మూర్ఖులూ, అవివేకులూ, బుద్ధిహీనులూ దుష్టవర్తనని మానలేరు. ఆ పరిణామం రావాలనుకునే మనసున్న వారికి ఆధ్యాత్మికత సాధన సోపానం”
సభలో అందరూ ‘సహీ బాత్’, ‘అచ్ఛాహై’ అన్నారు.
చివరిగా “పాపభీతి, దైవవిశ్వాసం- రెండూ మనిషిని వక్రమార్గం నుంచీ విముఖుని చేస్తాయి” అని కూర్చున్నాడు జగన్నాథుడు.
కనక్‌లాల్ కూడా లేచి అసఫ్‌ఖాన్‌కీ, జగన్నాథునికీ ధన్యవాదాలు తెలిపాడు. అసఫ్‌ఖాన్ సభనుద్దేశించి ఇలా అన్నాడు. “పని చేయండి, నూతన ఆవిష్కరణలు రావాలి. విజ్ఞానశాస్త్రం వృద్ధి చెందాలి. ప్రజాభ్యుదయమే అందరి ధ్యేయం కావాలి. ఇదే అంతిమలక్ష్యం. పండితులూ, శాస్త్రకారులూ కుహనా తర్కాలూ, ఈర్ష్యాసూయలూ పరిహరించుకోవాలి. పండితరాయల వారి నేతృత్వం మన న్యాయధర్మపాలనకీ, శాస్త్ర, సంగీత, సాహిత్య కళా వైజ్ఞానిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇది మామాట.
ఇదే పాదుషా వారి మాటకూడా.” అని
“బహవఃఫణినః సంతి, భేకభక్షణ తత్పరాః
ఏకేవహిశేషోఽయం భూభార వహన క్షమః”
(కప్పలని మింగగల పాములు కోకొల్లలు. ఆదిశేషుడొక్కడికే భూభారాన్ని వహించగల సామర్థ్యం ఉన్నది.) చదివాడు. “ఇది పండిత రాయల వారిదే, వారికే అన్వయిస్తుంది” అన్నాడు. అందరూ కరతాళధ్వనులు చేశారు.
“కనక్‌లాల్ వారు కావాలనుకుంటే నిష్కల్మషమైన మనసుతో ఆగ్రా రావచ్చు” అని ప్రకటించాడు అసఫ్‌ఖాన్,
“ఠీక్ హై.. జరూర్ సాబ్” అంటూ వంగిసలామ్ చేశాడు కనక్‌లాల్.
సమావేశం ముగిసింది. అందరూ నిష్క్రమించారు.
అసఫ్‌ఖాన్ ఆయన పరివారం కూడా వెళ్లిన తర్వాత – జగన్నాథుడు, శాస్త్రీ, కనక్‌లాల్-మిగిలారు. “నన్ను మీరు క్షమించాలి పండిట్‍జీ” అంటూ చేతులు జోడించాడు కనక్‌లాల్. “మీరు పెద్దవారు అంతమాట వద్దు” వినయంగా అన్నాడు జగన్నాథుడు.
“కాశీలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నిజానికి నేను ఢిల్లీ వచ్చిన ఉద్దేశాన్ని మీరు ఖచ్చితంగా పట్టేశారు. నాకు పాదుషావారి అనుగ్రహం కావాలి. దాన్ని మీరు దయచేయించారు. కృతజ్ఞణ్ణి. సాధ్యమైనంత త్వరలో ఆగ్రా వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. అక్కడ మీరే నాకు కొండంత అండ”
“అలాగే.. కానీ.. ఒక్కమాట చెబుతాను. ఏమీ అనుకోకండి. సభా ప్రారంభంలో ఉపోద్ఘాతంలో మీ కంఠస్వరం బాగా లేదు. వెటకారమో, ఎత్తిపోడుపో, నిందో ధ్వనిస్తున్న వాక్యాలు ప్రయోగించారు. అది అనుచితమే కాదు – అహంకార ప్రదర్శన కూడా అవుతుంది. కాశీలో భట్టోజీ అనుయాయిగా అలాంటి వ్యంగ్యం చెల్లుతుంది. పాదుషా వారి దగ్గరా, వారి బంధు మిత్ర వర్గం వద్దా అది మనకు సంకటాన్నే తెచ్చి పెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అసఫ్‌ఖాన్ వారు ఎంతో కరుణాహృదయంతో మిమ్మల్ని అంగీకరించారు”.
“అవును. అర్థమయింది. మీ నిష్కర్ష భాషణకి ధన్యవాదాలు.” అన్నాడు నమ్రంగా. “సరి.. సరి..” అని అడుగు కదల్చాడు. జగన్నాథుడు, శాస్త్రి ఆయన్ని అనుసరించాడు.
***
వీరిద్దరూ ఇంటికి వచ్చేసరికి-
అక్కడ పెద్ద దృశ్యమే ఎదురయింది.
కావేరీనీ వెతుక్కుంటూ ఏకంగా పదిమంది స్త్రీ పురుషులు అహమ్మదాబాద్ నుంచీ వచ్చారు. వసారాలో కూర్చుని వున్నారు. మొహాలు వసివాడివున్నై. మనుషుల వాలకంచూస్తే నాలుగు రోజుల నుంచీ తిండి లేనట్టుంది. ప్రాణాలు కళ్లల్లో ఉన్నై. దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో ఉన్నారు.
సుభాషిణి బయటికి వచ్చి విషయం చెప్పబోతుంటే, వీరికి ఆవలగా ఉన్న అధికారి ఒకాయన ముందుకొచ్చి చెప్పాడు. “వీళ్లంతా నాలుగు రోజుల క్రితమే నగరానికి చేరారుట పండిట్‌జీ . షరాయిల్లో అక్కడా ఇక్కడా తలదాచుకుంటూ పూటలు గడిపారు. ఈ కావేరి వాళ్ల గ్రామం మనిషిట. ఆమె వివరాలు చెప్పి వెతుక్కుంటూ నాకంట పడ్డారు. కావేరి అంటే ఈమే అయివుంటుందని ఇక్కడికి చేర్చాను. కావేరి వివరాలు కొన్ని నాకు తెలుసుకదా! నేనే కదా ఆమెని మీ ఇంటికి తెచ్చింది”.
ఆలోచనలో పడ్డాడు జగన్నాథుడు. శాస్త్రి సుభాషిణి పక్కకి వెళ్లి ఏదో అడిగాడు. ఆమె చెప్పింది– “మీరటు వెళ్లగానే వచ్చారు వీళ్లు. ఆ అధికారితో మాట్లాడింది కావేరి. ఆయన అంగీకారంతో ఇంత తిండి తయారు చేసి పెట్టాము. ఆయనే సేవకుల్ని పంపి తర్కారీ అవి తెప్పించాడు!”
“అవును గానీ.. కావేరీ.. వీరంతా ఏం పని మీద ఇక్కడికి వచ్చారుట?” అడిగాడు జగన్నాథుడు.
కావేరీ ఏమీ మాట్లాడలేదు. ఆ అధికారి నెమ్మదిగా దూరం వెళ్లాడు. కొద్దిక్షణాల తర్వాత రహస్యం చెబుతున్నట్టు చెప్పింది కావేరి, “పండిట్‌జీ, గుజరాత్‍లో పరిస్థితి ఘోరంగా ఉందిట! ఎటుచూసినా కరువుతాండవిస్తోందిట. నిత్యావసరాలు లేవు. పశుగ్రాసం లేదు. కూలీనాలీ చేసుకుని బతికే జనం పరిస్థితి మరీ ఘోరంగా వుందిట. వీరంతా అలాంటి వారే. దిక్కుతోచక, ఢిల్లీ బాట పట్టారుట. చాలారోజులు నడిచి, ప్రాణాలు కడబట్టి ఇక్కడికి చేరారు.
ఆ అధికారి వీళ్లకి కరువూ గిరువూ అని వాగితే ప్రమాదమని హుకుం జారీచేశాడుట. రాజోద్యోగులు, అధికారులకీ ఈ కరువు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలీదు. తెలిసిన వాళ్లు పైవారికి చెబితే, ముందు చెప్పిన వారినే చంపుతారనే భయం, మరి వారికి తెలుసో తెలియదో..”
ఈ వార్తా వివరణంతా శాస్త్రికీ, జగన్నాథుడికీ ఆశనిపాతమే, గుండెలో కలుక్కుమని, మనసు కలత చెందింది ఇద్దరికీ. నిలువు గ్రుడ్లేసుకుని కావేరీ వైపు చూస్తున్నది సుభాషిణి.
జగన్నాథుడు తెప్పరిల్లాడు. ఆవేళ రాయముకుందుడూ వచ్చి డక్కన్‌లో కరువు పరిస్థితులు తెలిపి, తానూ ఇదే సందేహాన్ని వెలిబుచ్చాడు. ఇప్పుడు గుజరాత్ లోనూ కరువు, ‘ప్రభువులకు తెలుసో తెలియదో, తెలిసికూడా తెలియనట్లు ప్రవర్తిస్తున్నారో?’ ఇదే మాటను ఆరోజు రాయముకుందుడూ, తానూ ఇద్దరూ అనుకున్నారు.
“తమరు వీళ్లని ఇక్కడే వుండటానికి అనుమతించాలి పండిట్‌జీ” అన్నది కావేరి వేడికోలుగా. “మీరు చెబితే అధికారులు తగిన సదుపాయాలు చేస్తారు. మనకు కావలసిన వస్తుసంభారాన్నీ తెప్పిస్తారు.”
జగన్నాథుడు శాస్త్రివైపూ సుభాషిణి వైపు చూశాడు. “లంకంత భవనం. మనకేం ఇబ్బంది? కాకుంటే, వారి వంటావార్పూ సంగతి వారే చూసుకోవాలి” అన్నది సుభాషిణి.
“అవును..” అన్నాడు శాస్త్రి.
విషయం అర్థమైంది కావేరికి. ఆమె ఠక్కున అన్నది, “ఆ సంగతి నేను చూసుకుంటాను పండిట్‌జీ. మీకు ఏ విధమైన అసౌకర్యమూ రానివ్వం. వారంతా చాలా మంచివాళ్లు. “
జగన్నాథుడు ఆ అధికారిని పిలిచాడు. విషయాలన్నీ వివరించాడు. ఆయన తలూపుతూ, “ఠీక్ హై సాబ్” అని వెళ్లిపోయాడు. జగన్నాథుడు లోపలికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ వుండిపోయాడు. జనం బాధలు కళ్లముందు కదలసాగాయి. సామాజిక బాధ్యత వెన్ను చరుస్తున్నట్టయింది. తల విదిల్చి లేచి తన కార్యక్రమం మొదలెట్టాడు.
ఆ రాత్రి – నిద్రకు ఉపక్రమించేవేళ శాస్త్రి అడిగాడు. “విషయం స్పష్టమౌతోంది. ఏం చేద్దామనుకుంటున్నారు గురూజీ” అని. “రేపు అసఫ్‌ఖాన్ వారితో మాట్లాడతాను. ఏమైతే అదవుతుంది.”
“అదే బాగుంటుంది” అని, “శతక సముచ్చయంలో మీరు చెప్పిన శ్లోకం గుర్తు కొస్తోంది.” అంటూ దాన్ని చదివాడు.
“రూఢస్య సింధు తటమను, తన్యతృణ స్యాపి జన్మ కల్యాణం।
యత్సలిలమజ్జదాకుల జనన్య హస్తాఽవలంబనం భవతి॥”
(నదిలో కాలుజారి మునిగి పోబోయే దీనుడికి గడ్డిమొక్క చేతికందింది. ప్రాణాన్ని కాపాడింది)
“అవును. అక్కడి ప్రజలకు ఇది ఆపత్సమయం. మనం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోకూడదు..” అన్నాడు జగన్నాథుడు. ఆయనకి ఆ రాత్రంతా అనేక ఆలోచనల్లోనే గడిచింది.
-మరునాడు, అహమ్మదాబాద్ ప్రాంతాల గురించే చెప్పుకొచ్చారు ఆగంతకులు. వారంతా సర్‌ఖేజ్ నుంచీ వచ్చారు. వారిలో వయోవృద్ధుడు పాత సంగతుల్నీ ప్రస్తుత దుస్థితినీ చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా విని జగన్నాథుని మనసు కలత చెంది – అస్తిమితమైంది.
ఆ తర్వాతిరోజు –
అసఫ్‌ఖాన్‌ని కలవాలని జగన్నాథుడు – ఆయన భవనానికి వెళ్లాడు. ఎవరో అధికారి ఎదురువచ్చి చెప్పాడు, ఉదయాన్నే బయలుదేరి ఏదో అత్యవసర వ్యవహారం మీద బయటకు వెళ్లాడుట- అసఫ్‌ఖాన్. “మీకు కబురు చేయమన్నారు. లాహౌరీ వారు కూడా ఇప్పట్లో ఢిల్లీ రాలేరుట. మిమ్మల్ని ఆగ్రా వచ్చేయమన్నారు. మీ ప్రయాణపు ఏర్పాట్ల బాధ్యత నాకే అప్పజెప్పారు”.
లోపలికి వెళ్లి కూచున్నాడు. తిరిగి ఆగ్రా వెళ్లడం సమస్యకాదు. ఇక్కడి కావేరీ గురించీ సమస్య కాదు. అహ్మదాబాద్ నుండీ వచ్చిన వలస వారిని ఏం చేయాలి? వారిగోడుని ఎవరు వింటారు? వారికి పునరావాసం ఎలా జరుగుతుంది? అసలైన కరువు కడలి సమస్యలో ఇది పైపైని నీటితెట్ట మాత్రమే, లోతు సంగతేమిటి?
– ఇలా చాలా ప్రశ్నలు ముసిరినై మౌన గంభీరంగా చాలాసేపు గడిపాడు. యథాలాపంగా ‘ఏదైనా అసలు మన సమస్యని తెలుపుకోవాలంటే ఎవరిని కలవాలో’ అనుకున్నాడు. ఆ మాటలు పైకే వెలువడటంతో, ఆ అధికారి ‘ఏమిట’ని విచారించాడు. మనసులోని మథననంతా చెప్పాడు జగన్నాథుడు. “మీ భవనం దగ్గర సైనికుని ఎవరినన్నా అడగండి. దగ్గరలో ‘అమీన్ కా దఫ్తర్’ హై! అక్కడే చెప్పండి. వాళ్లు తప్పకుండా సహాయం చేస్తారు,” అన్నాడు. ఊపిరి పీల్చుకుని కదిలాడు జగన్నాథుడు.
అమీన్ ప్రమేయంతో, కొత్వాల్ ఆజ్ఞలతో, కావేరి చొరవతో కాందిశీకులు వ్యవహారాన్ని వారే పరిష్కరించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక స్థాయిల్లో బహిర్గతమైన మానవ సహజమైన బలహీనతలకి విచారించాడు జగన్నాథుడు. ఒకరి అవసరం మరొకరి అవకాశమే కదా!
మర్నాడు మధ్యాహ్నానికి ఢిల్లీ వదలి ఆగ్రావైపు కదిలాయి వీరి శకటాలు.
(సశేషం)