Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-21

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[జగన్నాథుడూ, శాస్త్రీ, సుభాషిణీ ఆగ్రా చేరుతారు. జగన్నాథ దంపతుల కోరిక మేరకు శాస్త్రీ, సుభాషిణీ వాళ్ళింట్లోనే ఉంటారు. కామేశ్వరి ఎంతో సంతోషిస్తుంది. పాఠశాల భవనం, గురుకుల ప్రాంగణం సిద్ధమైనట్టు తెలుస్తుంది,కానీ, వాటి ప్రారంభాన్ని అసఫ్‌ఖాన్, పాదుషావారూ తేల్చాలని ఊరుకుంటాడు జగన్నాథుడు. ఒకరోజు దారాకి పాఠాలు చెప్తుండగా అసఫ్‌ఖాన్ వస్తాడు. పాదుషా వారూ, తాను వేరే రాచకార్యాలలో తీరిక లేకుండ ఉన్నామని చెప్తాడు. కాస్త విరామం దొరకటంతో వచ్చానని చెప్తాడు. మాటల సందర్భంలో దక్కన్‌లోనూ, ఖాండేష్ లోనూ కరువు విజృంభించిదని అంటాడు. పాదుషా వారితో జరిగిన ఆంతరంగిక సమావేశంలో కరువు నివారణకి కొన్ని చర్యలు సూచిస్తాడు జగన్నాథుడు. గురుకుల ప్రారంభోత్సవం గొప్పగా జరుగుతుంది. ఈ సందర్భంగా రాయముకుందుడు, కవీంద్రాచార్య, జగన్నాథుడు ప్రసంగిస్తారు. ముఖ్య అతిథిగా వచ్చిన జహనారా తన సందేశాన్ని వినిపిస్తుంది. 1631 నాటికి షాజహాన్ పాలన స్థిరపడుతుంది. శత్రువులని నిర్జించి ఆటంకాలను దూరం చేస్తాడు. దారా చదువు బాగా సాగుతుంది. గురుకులం ప్రతిష్ఠ పెరుగుతుంది. కనక్‍లాల్ ద్వారా కాశీ విశేషాలు తెలుస్తాయి.  ఒక సభలో ప్రసంగం సందర్భంగా కనక్‌లాల్ గుణవిశేషాలు పాదుషాకి తెలుస్తాయి. ప్రతిభ మంచిదే కాని, అతి తెలివి పనికిరాదని కనక్‍లాల్‍తో అంటాడు పాదుషా. షాజహాన్ వెళ్ళిపోయాకా, ప్రభువులు సంగీత, సాహిత్య, కళా శాస్త్రాల్ని బాగా చదివిన పండితులని జగన్నాథుడు కనక్‌లాల్‌తో అంటాడు. ఓ రోజు జగన్నాథుడికి కబురు చేసి పిలిపిస్తాడు పాదుషా. జగన్నాథుడు వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు వ్యక్తులుంటారు. వారిని గొప్ప చిత్ర శిల్పకళాకారులుగా పరిచయం చేస్తాడు అసఫ్‍ఖాన్. కొన్ని సూచనల అనంతరం వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. అప్పుడు తమకెదురైన ఓ ధర్మ సంకటం గురించి అసఫ్‍ఖాన్ వివరిస్తాడు. జగన్నాథుడు దానికి పరిష్కార మార్గం చెబుతాడు. ఆ ఉపాయం ఫలించి – సమస్య తీరిపోతుంది. నదీరాబాను బేగమ్‌తో దారా వివాహం వైభవోపేతంగా జరుగుతుంది. కొన్ని నెలలకి పాదుషా కుడిభుజం వంటి మహబత్‌ఖాన్ మరణిస్తాడు. ఇక చదవండి.]

అధ్యాయం-38

[dropcap]అ[/dropcap]సఫ్‌ఖాన్ మందిరం –

ఆయనా, పండితరాయలూ – ఇద్దరే ఉన్నారు. ఒక సేవకుడు ఫలహారాన్ని ముందుంచి వెళ్ళాడు. పనసతొనని చేతిలోకి తీసుకున్నాడు – అసఫ్‌ఖాన్. నిదానంగా దాన్ని నోట్లో వేసుకుని చెప్పసాగేడు.

“పండిట్‌జీ, మిమ్మల్ని పొగడటం కాదు గానీ, పాదుషా దర్బారులో అత్యున్నత పదవిలో అధికారి కావటం వేరు. వారికి ఆత్మీయులైన మిత్రులూ సన్నిహితులూ కావటం వేరు. కానీ, ఒక గౌరవాస్పదులైన హితవరులుగా మీరు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యారు. ఇంతకు మించిన విషయం – నిన్న మొన్నటిది – మీ మనోవాక్కాయ కర్మల్లో మీరు హిందూ మహమ్మదీయ సఖ్యతకు అంకితమై మాకు బాసటగా వున్నారు. తద్వారా సాంఘికాభ్యదయానికీ దోహదం చేస్తున్నారు.” అని ఆగి పళ్ళెంలోని ద్రాక్షపండుని నోట్లో వేసుకుని, “ఒకవిధంగా చెప్పాలంటే మీ ప్రతిభావ్యుత్పత్తులచే మీ ఆంధ్రులకే ధార్మికంగా, సాంస్కృతికంగా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని సంతరించి పెట్టారు అని “మీరు ఫలాలను తీసుకోలేదు” – గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు.

ఒక పనసతొనను తీసుకుని నోట్లో వేసుకుని అన్నాడు జగన్నాథుడు. “మీకు నా పట్ల ఉన్న అపారమైన అభిమానం వలన ఇలా మాట్లాడారు. ‘యథా రాజా తథా ప్రజా’ అన్నారు. మీ కరుణా హృదయం అన్నింటికీ కారణం”

“నిజం పండిట్‌జీ. ఇవన్నీ నా మాటలే కాదు. పాదుషావారి హృదయగతమైనవి కూడా”.

“నేను ధన్యుణ్ణి” అన్నాడు పండితరాయలు.

ద్వారపాలకుడు వచ్చి పాదుషావారు ఇద్దర్నీ రమ్మంటున్నారంటూ వర్తమానం చెప్పి వెళ్ళాడు. లేచి బయల్దేరారు.

పాదుషా అంతరంగిక మందిరం.

“కాశ్మీరం వెళ్తామని ప్రభువుల కోరిక. షాలిమర్ ఉద్యానవనం మార్పులూ – చేర్పుల పనులు జరుగుతున్నై, వాటిని చూసినట్లుంటుంది. ప్రదేశం మార్పు వలన కొంత ప్రశాంతతా చిక్కుతుంది” అసఫ్‌ఖాన్ వివరించాడు.

“మీరూ మాతో రావాలని మా వాంఛితం” పాదుషా అన్నాడు.

“ప్రభువుల ఆజ్ఞ”

“మీకు పూర్తిగా తెలుసో తెలియదో పండిట్‌జీ. కాశ్మీరు సాహిత్య రంగం మీద పర్షియన్ కవుల ప్రభావం బాగా ఉంది. ఇరాన్ నైసర్గిక భౌగోళిక ప్రకృతి ప్రశాంతత, ఆహ్లాదౌన్నత్యం – ఇలాంటి అంశాలు ఇక్కడి మన దేశం ఉనికికీ, స్థితికీ అన్వయిస్తూ మంచి కవిత్వం వచ్చిందక్కడ. పర్షియన్ అరబిక్ కవిత్వంలో ‘ఫజా- ఐల్’ అని ఒక ప్రత్యేక ప్రక్రియ ప్రదేశాల్నీ, సౌధాల్నీ, వనాల్నీ, రమణీయ స్థలాల్నీ వర్ణిస్తూ సాగింది. ఇరాన్ మూలాలు కలిగిన అబ్దుల్ రహీమ్ వంటి రాజప్రతినిధులు కూడా ఈ తరహా కవిత్వాన్ని కాశ్మీర్ భాషలో, పర్షియన్ భాషలో రాశారు. ఇక ఘజల్ సంగతి మీకు చెప్పేదేముంది” అని మళ్ళీ కొనసాగించాడు.

“అలాగే కాశ్మీర్ ప్రఖ్యాతకవులు – అబుల్ బరకత్ మునిరి లాహౌరీ, ఫని కాశ్మీరీల గురించి మీకు తెలిసేవుంది. ఈసారి వారు మనల్ని కలుస్తారు. అక్కడి సంగీత సాహిత్య రంగాల ప్రముఖులకు మీవంటి వారు మార్గదర్శనం చేయాలి”.

“చాలా సంతోషం ప్రభూ! ఇంతటి అవకాశాన్ని మీరు ఇవ్వడం”

“ముహూర్తం నిర్ణయించడం” అన్నాడు పాదుషా మందహాసంతో.

“ప్రభువులకు- జ్యోతిష్యమన్నా, జ్యోతిష్యులన్నా అభిమానం” నవ్వుతూ అన్న అసఫ్‌ఖాన్ మాటలకు, “మంచిదే..” అంటూ, “శరదృతువు శుభప్రదం. మీరు వివరించిన వాతావరణం – ఆ ఋతువులో ఆహ్లాదకరంగా ఉంటుంది” అన్నాడు జగన్నాథుడు.

“పాదుషా వంటి రసిక హృదయులకు కాశ్మీరం భూతలస్వర్గం కదా!”

“పండిట్‌జీ మీ శ్రీమతినీ, శాస్త్రి దంపతులను కూడా రమ్మనండి. పాదుషావారి అనుమతి ఉంటుంది” అన్నాడు అసఫ్‍ఖాన్.

“అవును. వారికీ ఇదొక అవకాశం” అని నవ్వాడు పాదుషా.

“తగిన ఏర్పాట్లు చేయిస్తాను” అసఖాన్ అంటుండగానే పాదుషా లేచాడు. జగన్నాథుడు సెలవు తీసుకుని వచ్చేశాడు.

జగన్నాథుని మాటలు విన్న ఇంట్లో వారికి ఎంతో సంతోషం కలిగింది.

“ఏఁవిటో పిన్నీ ఈ వైభోగాలన్నీ బాబాయిగారి వలన మాకు కూడా లభిస్తున్నాయి. లేకుంటే ఇలాంటివి మేము కలలో అయినా ఊహించగలమా?” అన్నది సుభాషిణి.

సరిగ్గా ఆమె ఈ మాటలు అంటుండగానే వచ్చాడు కనక్‌లాల్.

కుశలప్రశ్నల తర్వాత అడిగాడు, “ఏమిటమ్మా వైభోగాలు అంటున్నావు?”

విషయం చెప్పాడు శాస్త్రి. “అవును లెండి. ఇలాంటి అవకాశాలకి పెట్టి పుట్టి వుండాలి. మేమూ ఉన్నాం.. ఎందుకూ?” అన్నాడు కనక్‌లాల్.

‘మాటలో – మనసూ, నైజమూ ప్రతిఫలించక మానవు కదా!’ అనుకుంది. కామేశ్వరి. ఇప్పటికి ఆయన సంగతి బాగా అర్థమైంది. ఏదీ సూటిగా మాట్లాడడు. తేలుకొండి స్వభావం.

“మాకూ అంతో ఇంతో పాండిత్యం విద్వత్తూ ఉన్నాయ్ కదా! మా గురించీ ఒక మాట అనవచ్చు కదా పండిట్‌జీ..” అని మనసులోని మాటను బయట పెట్టేసుకున్నాడు.

శాస్త్రి అదోలా పరీక్షగా కనక్‍లాల్ మొహంలోకి చూశాడు. “గురువుగారిది శ్లోకం ఒకటుంది” అంటూ దాన్ని చదివి, ‘ఇత్తడి బంగారం రంగులో ఉన్నానని, బంగారాన్నని ఊహించుకుని గర్విస్తుందిట. కానీ, గీటురాయి మీదికి వచ్చినప్పుడు దాని అసలురూపు తేటతెల్లమే కదా!’ అని భావం” అన్నాడు.

కనక్‍లాల్ మొహం ముడుచుకున్నాడు. మరుక్షణం తెప్పరిల్లి “శాస్ర్తీ! ఇదేం బాగాలేదు. నన్ను అంతగా విదిలించేయకు. పాదుషా వారు మా వాక్చాతుర్యాన్నీ మెచ్చుకున్న సందర్భాలు వున్నై” అన్నాడు.

“అవును.. కనక్‌లాల్ గారూ! ప్రభువుల చిత్తం మీకు తెలుసుకదా! వారి అనుగ్రహవీక్షణం అయాచితంగా రావలసిందే.. ‘అడగనిదే అమ్మైనా పెట్టద’నే తెలుగు సామెత వారి దగ్గర పనిచేయదు. ఇప్పుడు చూడండి. నేను వీరిని నాతో తెచ్చుకుంటాను – అని చెప్పానా? లేదే? వారే నెలవిచ్చారు..” జగన్నాథుడు వివరణ నిచ్చాడు.

“మనం అడిగితే ఆ చొరవని గీత దాటటంగా భావిస్తారు. అంతేకాదు. అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది” అన్నాడు శాస్త్రి.

అందరూ నవ్వుకున్నారు.

“అంతేలెండి. అందని మ్రానిపండు. ఎంత ఎగిరినా ఫలితమేముంది?” అంటూ లేచి వెళ్ళిపోయాడు కనక్‌లాల్.

***

గురుకులంలో శిష్యులంతా ఉన్నారు. కులపతి మిశ్రా, కనక్‌లాల్, శాస్త్రి కూడా వచ్చి కూర్చున్నారు.

ఆరోజు పాఠం భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగయోగం.

దారా శ్లోకాన్ని చదివాడు. “శ్రద్ధ సాత్వికం, రాజసం, తామసం అని మూడు విధాలుగా ఉంటుంది” చెప్పాడు. జగన్నాథుని వివరణల అనంతరం పారం ముగిసింది. మాటలు రాజ్యవ్యవహారాల వైపు సాగినాయి.

“పాదుషా, అసఫ్‌ఖాన్, సైన్యాధికారి ముజాఫర్ కలిసి సమైక్యంగా ఈసరికే కాబూల్ వెళ్ళారు. సఫాలిద్ పాలకులతో ఉజ్బెక్ ఘర్షణ రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నది. పాదుషా వారు ఆఫ్గనిస్తాన్‌ని గెలవనిదే మొగల్ సామ్రాజ్యం విస్తరణని ఆపదలచుకోలేదు. అందుకే ఈ దండయాత్ర ప్రయత్నం. సరిహద్దు వద్ద పరిస్థితులూ, సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం గావించటం, ఇతర వ్యూహవ్యవహరాలూ చూసి, తగిన సూచనలు ఇచ్చి రావటం పాదుషా పెట్టుకున్న పని” అని విషయం మారుస్తూ “మీ కాశ్మీర్ ప్రయాణం ఇంకో పక్షం రోజుల్లో కొచ్చింది. మీ ప్రయత్నానికి వలసిన ఏర్పాట్ల విషయాన్ని మేము చూస్తున్నాము. మిమ్మల్ని ముందుగానే అక్కడికి చేర్చమనీ, చూడవలసినవి చూపించమని పాదుషా వారి ఆజ్ఞ. వారు మిమ్మల్ని అక్కడ కలుసుకుంటారు” విషయ వివరణ ఇచ్చాడు దారా. “మీ సన్నాహాల్లో మీరు ఉండండి” అన్నాడు. జగన్నాథుడు తల ఊపాడు. అక్కడే ఉన్న కనక్‌లాల్ మనసు చెడింది. కురుపుని చెనకినట్లయింది. సలుపుతోంది. ఆయన ముఖకవళికలు మారేయి. జీవితానుభవాల్లో వైరుధ్యాల్నీ, వికృతుల్నే ఎక్కువగా ఒంట జీర్ణించుకున్న స్వభావం నుంచీ ఆయన బయట పడలేకపోతున్నాడు. కాశీలో భట్టోజీ నేతృత్వంలో, ఆ వాతావరణంలో ఆయన ఈర్ష్యాసూయలనే నిప్పుకణికల్ని అరచేత పట్టుకున్నాడు. ఆగ్రా వచ్చిన తర్వాత కూడా జగన్నాథుడి సూటి సలహాల తర్వాత కూడా విచక్షణా, వివేకం – ఆయనకి తలకెక్కలేదు. “సరి.. సరి.. వెళ్ళిరండి.. పండిట్‌జీ” అని “కొందరి జీవితాలు వడ్డించిన విస్తరిలాంటివి. మరికొందరిని నలిపివేసిన ఆకర్షణ పత్రాల్లాంటివి” అన్నాడు కనక్‌లాల్.

దారా విస్తుపోయాడు. ఏదో అనబోయాడు. జగన్నాథుడు చూపుతోనే వారించాడు. అతను ఆగిపోయాడు. జగన్నాథుడే అన్నాడు, “సాధారణ ఘటనల్ని కూడా తనదైన రీతిలో సూత్రబద్ధం చేయటం కనక్‌లాల్ వారి ప్రతిభా చాతుర్యాల విశేషం”.

నవ్వారు అందరూ. కనక్‍లాల్‌కి వాతావరణం ఇరుగ్గా ఉంది. ఠక్కున లేచి విసవిసా బయటకు నడిచాడు. ఆయనను చూస్తున్న వారి చూపులు రెప్పలచాటు ఆలోచనలలోకి దిగబడినై.

ఇంటికి వెళ్తుండగా అన్నాడు శాస్త్రి “షహజాదా ముందు కూడా గౌరవాన్ని పాటించకుండా మాట్లాడుతున్నాడు కనక్‍లాల్‌. ఆయనకు ఇంకా వెనుకటి గుణం పోలేదు” అని. సమాధానంగా జగన్నాథుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

అధ్యాయం-39

కాశ్మీరంలో పండితరాయ దంపతులు, శాస్త్రి దంపతులు!

వీరికి వలసిన సౌకర్యాలు సమకూర్చే నిమిత్తం – అన్ని శాఖలలోని వ్యక్తులతో ప్రత్యేక బృందాన్ని నియమించాడు దారా. డాల్ సరస్సుకు ఆవలితీరాన్ని ఆనుకుని షాలిమార్ వనాలు – ఈవలి తీరాన ఉన్న సౌధాల్లో వీరి బస. దర్శనీయ స్థలాలన్నిటినీ దర్శించారు. అక్కడినుండీ పహల్గామ్ కూడా వెళ్ళి వచ్చారు. భూతలస్వర్గం అంటే ఇదే ఇదే అని క్షణక్షణమూ; అడుగడుగునా అనిపిస్తూనే ఉన్నది. అనిర్వచనీయమై, వర్ణనాతీతమైన అనుభూతిని పొందారు.

అంతా అయి, భంభర్ చేరుకున్నారు. భంభర్ వీరిని డైరింగ్‌ఖాన్ వచ్చి కలిశాడు. అది పాదుషావారి ఆజ్ఞ. ‘గాన సముద్ర’ బిరుదాంకితుడు ఆయన. పండితరాయలూ, డైరింగ్‌ఖాన్, లాలాఖాన్‌లు ముగ్గురూ సంగీతంలో శిఖర సదృశులు, లాలాఖాన్ వేరే కార్యక్రమాల వలన రాలేదు.

భంభర్ పాలకుడు హరివంశనాథ్ భూపతి. పాదుషా వారే స్వయంగా ఈ ప్రముఖుల్ని అతిథులుగా రావించారని తెలుసు కనుక, రాచమర్యాదలన్నీ ఉన్నత స్థాయిలోనే జరిగాయి. డైరింగ్‌ఖాన్‌కి ప్రత్యేకమైన బస ఏర్పాటు చేశారు.

ఇటు వీరూ, అటు నేడో రేపో రానున్న పాదుషా, అసఫ్‍ఖాన్, ముజాఫర్.

భూపతి ఆజ్ఞలతో సూచనలతో నగరం, పరిసరాలూ శోభస్కరంగా రమణీయంగా అలంకరింపబడినై. దీనితో భంభర్ ఉత్సవకళని సంతరించుకుంది. పాదుషావారు ఏర్పాటు చేయబోయే సాహిత్య సంగీతోత్సవ సభలకి ప్రముఖ విద్వాంసులకూ ఆహ్వానాలు వెళ్ళినై. సభాహర్మ్యం ఆరు ఋతువుల వన్నె చిన్నెల్ని ఒక్కసారే అలదుకుని కాంతులీనుతున్నది. దాన్ని వీరికి చూపించారు రాజోద్యోగులు. ఈ విశేషాల మధ్య జగన్నాథుని బృందం మనసులు పులకించిపోయినై.

పాదుషా, అసఫ్‌ఖాన్ వారితో పాటు సైన్యాధికారి ముజాఫర్ భంభర్ వచ్చారు. ఆవేళ విశ్రాంతి దినం.

మర్నాడు ఉదయం సాహిత్యోత్సవం. సాయంత్రం సంగీత సమ్మేళనం. సభా భవనమంతా పేరంటపుటిల్లులా ఉన్నది. మునీర్ లాహౌరీ, ఫణికాశ్మీరీ వంటి ప్రముఖ కవులూ, ఇతర సాహిత్యకారులూ వచ్చారు.

గద్దెమీద పాదుషా, వేదిక దిగువన వారికి ఎడమవైపు భూపతి, అసఫ్‌ఖాన్‌ల ఉన్నతాసనాలు. వారికి పక్కగా పండితరాయలు. కుడివైపు ఆసనాల్లో డైరింగ్‌ఖాన్, ఆయన పక్కగా ముజాఫర్, అటూ ఇటూ వరుసల్లో ఇతర కవిపండితులు. వారిలో పాదుషా వారికి ఇష్టులైన హరినారాయణ మిశ్రా, భాగవతి స్వామి వంటి వారు ఉన్నారు.

అసఫ్‌ఖాన్ సభను ప్రారంభించమని పాదుషాని కోరాడు.

షాజహాన్ ధీరగంభీరస్వరంతో- “రాచరికం కత్తులబోను, ఎత్తుజిత్తుల పులిజూదం ఆట. దాని నుండి దైహికవిరతీ, మానసిక ప్రశాంతి లభించేది మీవంటి స్వేచ్ఛాప్రియులూ సృజన శీలుర కళా ప్రదర్శనల వల్లనే…” అని “ఈ రోజు కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుందాం – వజీర్ సాబ్” అన్నాడు అసఫ్‌ఖాన్‌ని ఉద్దేశించి. ఆయన లేచి నిలబడి సలాం చేసి ‘జీ హుజూర్’ అన్నాడు.

“ఉండండి.. నేనే ఒక గజల్ ప్రారంభిస్తాను” అని పర్షియన్ భాషలో గజల్‌ని చదివాడు. చదివాడు అనే కంటే గానం చేశాడు అంటే బాగుంటుంది. ఆ గజల్ కాశ్మీరం వర్ణనే! శ్రోతలంతా ‘వహ్వా వహ్వా’ అని కరతాళ ధ్వనులు చేశారు.

ఆ తర్వాత వరసగా పదిమంది కవులు తమ కవిత్వాన్ని గానం చేశారు. కొందరు గజల్‌ని, కొందరు మస్నవీలనీ మరికొందరు సాఖ్వినామాల్ని చదివారు.

ఇప్పుడు ఒక కవి లేచి నిలబడి సలామ్ చేస్తూ, “ప్రభువులు అనుమతిస్తే, కబీర్ వారివి రెండు దోహాలు వినిపిస్తాను” అన్నాడు.

“చదవండి..”

“పాథర్ పూజే హరి మిలై – తో మైఁ పూజా పహార్।

బాతేతో చాకీ భలీ-పిసా భాయ్ సంసార్॥”

(రాతిని పూజించడం వల్ల హరి లభిస్తే నేను మహా పర్వతాన్ని పూజిస్తాను. కాని నీవు మ్రొక్కే ఆ రాయికన్న తిరుగలి గొప్పది. ఎందుకంటే రొట్టె పిండి విసరటానికి ఆ రాయి పనికి వస్తుంది.) సభలోని హిందూ పండితులూ, కవులూ చెవులు కొరుక్కుంటూ, కొంత కలకలం రేపారు. ఇంతలోనే, ఆ కవి మరో దోహాని అందుకున్నాడు.

“కాంకర్ పాథర్ జోరీకై-మస్‌జిద్‌ల ఈ బనామ్।

తూ ఊపర్ బాఁగ్-క్యా బహరి ఖుదాయ్॥”

(రాళ్లూ సున్నంతో మసీదు నిర్మించావు – బాగుంది. కానీ, పైకెక్కి అల్లాహో అక్బర్’ అని ఆకాశం చిల్లులు పడేటట్లు పిలుస్తావు, పలకడేం? ఆయనేమైనా చెవిటి వాడా?) ఇది విని ముస్లిం కవులూ, విద్వాంసులూ నిశ్చేష్టులైనారు – ఆ కవి కూచున్నాడు.

పాదుషా అన్నాడు, “సామాజికంగా ఉన్న అవాంఛనీయత కబీర్ కవిత్వానికి ప్రాణం. అప్పటి దారుణాలకి ఆయన కవితాహృదయస్పందన అది. ఇప్పుడు మనం ఆ స్థితిగతుల్ని మార్చుకుంటున్నాం” అంటూ “ఫర్వాలేదు.. మీరేమీ భయపడకండి” అని భరోసా ఇచ్చాడు. పక్కకి తిరిగి జగన్నాథుని ఉద్దేశించి, “పండిత్ మహారాజ్.. మిమ్మల్ని కొన్ని ద్రుపద్‌లని చెప్పమని కోరుతున్నాను” అని అడిగేడు.

పండితరాయలు “జీ జహాఁపనా” అంటూ, “వాటిని రేపు సంగీత సభలో గానం చేస్తాను ప్రభూ” అని అప్పటికి కొన్ని శ్లోకాలు మాత్రం చదివాడు.

సభలో కరతాళ ధ్వనులు! అసఫ్‍ఖాన్ లేచి, “పండిట్‌జీ ప్రతిభను అక్షర సత్యంగా వర్ణించాయి” అన్నాడు. అందరూ మళ్లీ కరతాళ ధ్వనులతో ‘సహీబాత్.. సహీబాత్’ అని ప్రశంసించారు.

జగన్నాథుడు మరికొన్ని గజళ్లనీ, మస్నవీలనీ చదివాడు.

మరికొందరి కవితా పఠనంతో సభ ముగిసింది.

సాహిత్య సభ ముగిసిన మర్నాడు –

ఉదయాన్నే భూపతి కబురు చేశాడు, ‘ఆ రోజు కార్యక్రమం ఎంతో విలక్షణమైనదీ, విశేషమైనదీ అనీ; ఒక ప్రత్యేక కళా భవన దర్శనం అనీ, అది మధ్యాహ్నభోజన సమయం వరకూ అనీ; ఉదయపు ఫలాహారాలు పూర్తిచేసి సిద్ధంగా వుంటే, తమ ఉద్యోగులు వచ్చి తోడ్కొని వెళ్తారు అనీ’! అంతేగాక, ఆ కళాభవనం దగ్గరికి – పాదుషా, అసఫ్‌ఖాన్, ముజాఫర్ వారూ వస్తారనీ, వారితోపాటు చాలామంది కళాకారులూ, సంగీతకారులూ, కళాప్రియులూ కూడా ఆహ్వానింపబడినారనీ తెలియజేశాడు. సమయ నిర్ణయాన్ని పాదుషావారే చేశారని కూడా హెచ్చరికనిచ్చారు.

నిశ్చితమైన సమయానికి ముందే వీరంతా ఆ కళాభవనానికి చేరారు.

అది దివ్య భవనం! లోపల మూడు దిక్కుల్లో ఉన్నతమైన మూడు వేదికలు ఉన్నాయి. వాటిపైన మూడు వైపులా గోడలకు శిల్ప, చిత్ర ఆకృతులు, నాలుగోవైపు నడవ, ద్వారాలు వున్నాయి. భవనం మధ్యగా ఆసనాలూ, పీఠాలూ అమర్చబడి వున్నాయి.

జగన్నాథుడికి జరుగుతున్న గౌరవాభిమానాలు ఒక అదృష్టమైతే, ఈ దివ్య భవన దర్శనం ఒక్కటే-ఒక అపూర్వమైన అవకాశం అనిపించింది. మనసంతా ఆర్ద్రమై, ఉద్విగ్నమైంది. భర్త ముఖకవళికల్ని వెంటనే పసిగట్టింది కామేశ్వరి.

శాస్ర్తీ, సుభాషిణీ వేరే వైపు నిలబడి సంభాషించుకుంటున్నారు.

కామేశ్వరి జగన్నాథుడి భావనలకు అనుగుణంగా అతన్ని చేయి పట్టుకుని పక్కగా కూర్చోబెట్టింది. “ఏఁవిటి, ఏదో భావ తీవ్రతలో పులకిస్తున్నారు?” అని భర్త కళ్లల్లోకి చూస్తూ నవ్వుతూ అడిగింది. జగన్నాథుడు మంద్ర స్వనంతో అన్నాడు. “ఈరోజూ, ఈ భవనం మన జీవితాల్లో అనూహ్యమైన ఘటనలకు కారణమౌతాయని-ఏ దివ్యవాణి నా అంతరంగంలో కుహుకుహులాడుతోంది”

ఆమె ఆశ్చర్యపోయింది. “విశేషమే. మీ లక్షణానికీ, స్వభావానికీ మీ ఈ భావనా-మీ ఈ ఉద్వేగం, మీ ఈ భవిష్యదాలోచన, భవిష్యత్ దర్శనం- అన్నీ నాకు చాలా కొత్తగా ఉన్నై, కానీయండి, అంతా మన మంచికే జరుగుతుంది” అంది. “అవును. అలాగే జరగాలి” దృఢంగా పలికాడు.

ఇంతలో పాదుషా వారి రాక సూచితమైంది. మందీ మార్బలం ప్రవేశించింది.

పాదుషా, ప్రముఖులూ సభాస్థలిలో ముందు వరుసలో కూర్చున్నారు. జగన్నాథ దంపతులనూ, శాస్త్రి దంపతుల్నీ కూడా తోడ్కొనివెళ్లి ఆ వరుసలో కూర్చోబెట్టారు- రాజోద్యోగులు.

కొద్దిసేపటి తర్వాత- భూపతి వచ్చి పాదుషా వారిని వేదికల మీది శిల్పచిత్ర ఆకృతుల్ని దర్శించమని కోరేడు. పాదుషా లేచి కదిలాడు. మిగిలిన వారు ఆయన వెనగ్గా నిదానంగా అడుగులు వేయసాగారు.

మొదటి వేదిక చుట్టూ ఉన్నవన్నీ కేవలం శిల్పాలు. ప్రధానంగా పారశీక శైలివి. కొన్ని భారతీయ సాంప్రదాయక లోహ, శిలా శిల్పాలు. ఎద్దులు, పొట్టేళ్లు వంటి జంతువులతో పోరాట శిల్పాలూ ఉన్నాయి. వివిధ భంగిమల్లో వీరులూ, యోధులూ, యుద్ధ ప్రక్రియ విశేషాలూ, కదనరంగంలో విన్యాసాలూ, రథతురగ పదాతి దళాల సాహస కృత్యాలూ.. అన్నీ జవజీవాల సమ్మేళనంగా కనువిందు చేశాయి. ఆ శిల్పకారుల కళా ప్రతిభ పాదుషా వారి ‘వహ్వా’లను అసంఖ్యాకంగా పొందింది.

రెండవ వేదిక మొత్తం చిత్రపటాలతో నిండి వుంది. కొన్ని మొగలాయీ శైలి సూక్ష్మచిత్ర పంక్తి, కొన్ని రాజపుత్రుల దర్బార్లు – కాంగ్రా, పహారి శైలిలో నీటిరంగులపై బంగారు రజనుతో అలంకరింపబడినవి. కొన్ని అక్బరు కాలం నాటి వస్త్ర కళాకృతులు-పట్టువస్త్రాలపై చేతిపని, అద్దకం చేసినవీ వున్నాయి. పారశీక శైలికి అక్బరు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించాడని ప్రతీతి, ఆ విశేషాల్ని వివరిస్తూ చెప్పుకు పోతున్నాడు-భూపతి రాజోద్యోగుల్లో కళారంగ నిపుణుడు.

మహాభారతానికి అనువాదంగా రూపొందిన ‘రజ్మ్‌నామా’ దృశ్యాల్ని కొన్నిటిని చూపాడు. మరో పక్కగా జహంగీర్ పాదుషా వారి జ్ఞాపక సంకలనం “తుజుక్‌కి- జహంగిరీ’ లోని కొన్ని చిత్రాల్ని గురించి చెప్పాడు. ప్రసిద్ధి వహించిన బిషన్‌దాస్, మోహన్ దాస్, అబ్దుల్ హసన్, గోవర్ధన్, దౌలత్ వంటి చిత్రకారులు చిత్రాల్నీ చూపించాడు.

“వీటన్నింటినీ చూస్తుంటే మీరు ఎంత కళాహృదయులో అర్థమవుతోంది- హరివంశనాథ్ సాబ్” అని ప్రశంసించాడు షాజహాన్ పాదుషా.

“అవును. ఇంతటి కళాలయాన్ని ప్రభువుల కోసమే నిర్మింపజేశాను జహాఁపనా” అన్నాడు భూపతి నమ్రంగా. “ఇప్పుడు మనం అటువైపున ఉన్న మూడవ వేదిక పైకి వెళ్దాం” అంటూ అడుగులు కదల్చాడు.

అందరూ ఆయన్ని అనుసరించారు.

“ఈ వేదిక మీది చిత్రాలే ఈ కళాభవనం మొత్తానికి ప్రత్యేకతని విలక్షణతనీ చేకూరుస్తున్నవి. రండి” అంటూ ఆ వేదిక మీదికి వెళ్లి ఆగాడు. అప్పటికప్పుడే కళారంగ నిపుణుడూ అక్కడికి చేరి వివరణ లివ్వడానికి సిద్ధంగా నిలబడి వున్నాడు..

పాదుషా ఇతర ముఖ్యులూ చిత్రపటాల గోడముందు నిలిచారు.

“ముందుగా మీకొక సంఘటన చెప్పాలి. ఈ చిత్రాలన్నీ అనుకోకుండా మన చేతికి వచ్చాయి. చాలా కాలానికి పూర్వం, ఝాన్సీ దగ్గర కాల్ పీ పట్టణం నుంచీ తన బృందంతో ఒక దేవాలయ నర్తకి మన ప్రాంతాలకు వచ్చిందట. ఆమె పేరు లవంగి. ఇక్కడెక్కడో స్థిరపడింది. ఆమె చేసిన నృత్యాల్లోని వివిధ నాట్య భంగిమల్నీ ఒక అనామక చిత్రకారుడు మహా అద్భుతంగా చిత్రించాడు. అనూహ్యంగా తరాలు గడిచినా ఆ చిత్రాల వన్నెచిన్నెలు పాతబడలేదు. అవి అనేకమంది చేతులు మారి చివరికి మా సైనికుల కంటబడినై. వారు తెచ్చి మాకు చూపారు. మేమూ మా ఆస్థాన నాట్యాచార్యులను సంప్రదించి వీటిని పరిరక్షించాము. ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా ఈ కళాభవనానికి ప్రత్యేక శోభను కూరుస్తూ మనల్ని అలరిస్తున్నాయి” అతను వివరించాడు.

పాదుషా అడుగు కదల్చాడు. వారికి అటు అసఫ్‍ఖాన్, ఇటు భూపతి.

మొదటి చిత్రం దగ్గరే పాదుషా ఆగిపోయాడు “ఓహ్.. మహాద్భుత సౌందర్యరాశి” అన్నాడు. “ఆమే ఆ లవంగి ప్రభూ!” వివరిస్తున్న అతని ప్రక్కగా జగన్నాథుడు వచ్చి నిలిచాడు.

పాదుషా ప్రక్కకి చూసి, “పండిట్‌జీ, చూడండి. ఈ మనోహరి క్రీగంటి చూపులోని అరుణిమ మమ్మల్ని వేరే భావ ప్రపంచంలోకి నెడుతోంది. ఏదీ ఒక కవిత..” అన్నాడు ఉద్వేగంగా.

“కాలపీ మందిరే బాల పీన స్తనీ, జాతు పీతాసవా లాలపీతి ప్రియా/నాగరాజీ మదామోద మేదస్వినీ, మాగరం మాగమః శాహెుజిల్లా హజీ!”

చివరి పాదంలో తనను సంబోధించిన పండితరాయలు సమయస్ఫూర్తికి పాదుషా పొంగిపోయాడు. “వహ్వా.. వహ్వా..” అనే ప్రశంస ముక్తకంఠంతో వెలువడింది.

కామేశ్వరి ఎక్కడా.. అని చూశాడు జగన్నాథుడు. ఆమె శాస్త్రీ సుభాషిణీల ప్రక్కగా నిలబడివుంది. శాస్త్రి రాసుకుంటున్న కవితకు సవరింపు లేవో చెబుతున్నది. జగన్నాథుడికి ఆనందం కలిగింది- ఆమె శ్రద్ధకు, ఇప్పటికే ‘తన శ్లోకాలు చాలా గాలికి పోయాయి కనుక, వీలయినంత వరకూ వాటిని పదిల పరచటానికి శ్రద్ధ వహిస్తున్నది’ అనుకున్నాడు సంతృప్తితో.

పాదుషా అడుగులు కదిలాయి. అక్కణ్ణుంచీ అన్నీ – దాక్షిణాత్య నృత్యరీతి అయిన భరత నాట్య సంబంధమైన కరణాలు, అంగహారాలూ – ఒక్కొక్క పటంలో ఎనిమిది భంగిమల చొప్పున చిత్రించి ఉన్నై.

మొదటి పటం నుండి వివరాలు చెబుతూ, ఒక్కొక్క భంగిమ పేరునీ దాని విశేషాన్నీ విశదం చేయసాగాడు జగన్నాథుడు. దానిలో లీనం, చతురం, నికుంచితం, మత్తల్లి, రేచితనికుట్టితం, సలితం, లలితం, నూపురం-ముద్రలు ఉన్నై. ఆ చిత్ర మాలికలో చివరిదైన ‘సూచి’ భంగిమ చూసి అద్వితీయం అని ముగ్ధుడైనాడు పాదుషా. పాదుషా ఇతరులూ కూడా ఉత్కంఠతో వినసాగారు.

జగన్నాథుని నృత్యశాస్త్ర ప్రావీణ్యతకూ అబ్బురపోయారు. అందరూ ముందుకు కదిలారు.

“ఇవన్నీ భరతముని నర్తన కరణాలుగా లోకానికి ప్రసాదించాడు ప్రభూ. దక్షిణ దేశంలో భరతనాట్యం నాట్యశైలి అత్యధిక ప్రాచుర్యం పొందింది. కఠోర పరిశ్రమ, అధ్యయనం, అభ్యాసం లేనిదే ఈ కళ అబ్బదు. మరో విశేషం-కూచిపూడి నాట్యం కూడా ప్రచారంలోకి వస్తోంది. దానిని పురుషులు మాత్రమే అభ్యసిస్తారు. వారే ఆ కళలో విద్వాంసులు. మనం చూస్తున్నవన్నీ భరతనాట్య భంగిమలు” అని “ఆ లవంగి ఎవరో దాక్షిణాత్య నృత్య సంప్రదాయ విదుషి కూడా అయి ఉంటుంది” జగన్నాథుడన్నాడు. ప్రతి పటం దగ్గరా ఆగి జగన్నాథుడి వివరణ అయిన తర్వాత ముందుకు వెళ్తున్నారు.

రెండువైపులా ఉన్న చిత్రపటాలను చూడటం అయింది.

అక్కడ వేదిక మధ్యగా ఆగి నిలబడి, “అయితే, ఆ లవంగి వివరాలు తెలియవన్నమాట” అన్నాడు పాదుషా.

“తెలియవు ప్రభూ. మా పూర్వులూ మేమూ ప్రయత్నించాం. లభించలేదు.” భూపతి మాటలకు కళాప్రవీణుడు కల్పించుకుని, “ఈ చిత్రాల్ని చూడండి ప్రభూ, ఇవి ఆమె అసలైన రూపలావణ్యాల్నీ, సౌందర్యశోభనూ కళ్లు చెదిరేటట్లు చూపుతాయి” అంటూ అటువైపు చూపించాడు.

పాదుషా, ఇతరులూ ఆవైపు కదిలారు. తన ప్రక్కనే చోటుని కల్పిస్తూ కనుసైగతో జగన్నాథుని ఆహ్వానించాడు పాదుషా.

ఆ ‘లవంగి’ చిత్రాల వరుసలోని మొదటి చిత్రంలో ఒక యువకుడు. అతనికి ఎదురుగా ప్రభువు, ఆ యువకుడు ఆమెవైపు తదేకదృక్కులతో, ఆరాధనా భావంతో చూస్తూ, మోకాళ్ల మీద వంగి ప్రభువుకు కైమోడ్పు ఘటించి ఆమెను తనకు ప్రసాదించమన్నట్టుగా వేడుకుంటున్నాడు.

ఆ చిత్రాన్ని చూసి, “ఓహ్.. అద్భుతం.. బహుత్ బహుత్ బడియా” అని చప్పట్లు చరిచాడు పాదుషా.

“పండిట్‌జీ! కానీయండి. పాదుషావారి మనసూ, రసిక హృదయం తెలిసిన వారు మీరు. ఈ చిత్రమాలికని మీ శ్లోక మాలికగా చేయండి. ప్రభువులకు సమర్పిద్దాం” అని “శాస్త్రీజీ.. ముందుకు రండి, ఆప్ లిఖియే” అని పిలిచాడు -అసఫ్‌ఖాన్.

“షుక్రియా సాబ్” అన్నాడు పాదుషా.

శాస్త్రి వచ్చి జగన్నాథుడికి ప్రక్కగా నిలిచాడు చెప్పండి – నేను సిద్ధం అన్నట్లుగా.

“ఇయం సుస్తనీ మస్తకన్యస్త హస్తా, కుసుంభారుణం చారుచేలం వసానా

అరం భాసమానాపి రంభా సమానా, లవంగీ కురంగీ దృగంగీ కరోతు.”

(అందమైన వక్షస్థలం, శిరస్సున చేతులు జోడించి బంతిపూవన్నె గాగరాతో రంభ సౌందర్యాన్ని తలదన్నే ఈ లేడికన్నుల లవంగి కావాలి నాకు) విస్తుపోయి చూశాడు పాదుషా!

“అవును ప్రభూ.. ఆ చిత్రంలోని యువకుని అభ్యర్థన అదే-” అన్నాడు. జగన్నాథుడు దృఢంగా. చుట్టూ ఉన్నవారంతా జగన్నాథుని వర్ణనకు ఆశ్చర్యపోయినా, ‘ఆ చిత్రంలోని చిన్నది’ అంతటి అందంతో రంగులీనుతున్నది కదా! చక్కటి తాత్పర్యాన్ని అందించారు పండిట్‌జీ – అని పైకే అనుకున్నారు.

పాదుషా అడుగు ముందుకు కదిలింది. రెండవ చిత్ర భావానికి అక్షరరూపమిచ్చాడు జగన్నాథుడు.

“యవనీ నవనీత కోమలాంగీ, శయనీయం యది నీయతే కదాచిత్

అవనీతల మేవ సాదు మన్యే, న వనీ మాఘవనీ వినోద హేతుః”

(నవనీత సమాన కోమలాంగి! ఈ యవన యువతితో ఒక్కసారి ఏకశయ్య లభిస్తే నందనవనం కన్నా భూతలమే గొప్పదని భావిస్తాను)

తన శ్లోకంలోని ‘యవన’ శబ్దానికి వివరణ ఇస్తూ “ఆమె ఆహార్యం, రూపలావణ్యం, భావప్రకటనాభంగిమ, విన్యాస కళల్ని బట్టి ఆమె యవన స్త్రీగా ఊహిస్తున్నాను ప్రభూ” అన్నాడు. “ఠీక్ హై” అన్నాడు పాదుషా.

ప్రభువు ఆలోచనలోనే అంతర్వీక్షణతోనే కదిలాడు. పండితరాయలు ఆ తర్వాతి చిత్రాన్ని చూస్తూ ఆశువుని చెప్పాడు.

“యవనీ రమణీ విపదః శమనీ, కమనీయ తమా నవనీత సమా

ఉహి ఊహి వచోమృత పూర్ణముఖీ, సమ్మఖీ జగతీహ యదంక గతా॥”

(మదన తాపాన్ని శమింపజేయగల ఈ యవన రమణిని, నవనీత కోమలాంగిని, అపూర్వ సౌందర్యరాణిని, అమృత ధారల వంటి మాటలతో పరవశింప జేస్తూన్న సన్ముఖిని అంకంమీద కూర్చోబెట్టుకోగల వాడిదే – అదృష్టం అంటే!)

పాదుషా అడుగు భారంగా పడింది. చిత్రాన్ని చూశాడు. చిత్రంలోని లవంగినీ, యువకునీ చూశాడు. ‘ఇద్దరి భంగిమలకూ అర్థాన్ని ఎంతో సంభావ్యతతో కూరుస్తున్నాడు. పండితరాయలు’ అనుకున్నాడు. శ్లోకాన్ని అందుకున్నాడు పండితరాయలు.

“ముఖం పంకజం లోచనే ఖంజరీటౌ, కుచౌ శ్రీ ఫలే విద్యు దేవాంగ యష్టిః

యది ప్రాణనాథేన హీనా సుకేశీ, తతః కిం తతః కిం? తతఃకిం? తతఃకిం?”

(ఈ పంకజ ముఖికి, కాటుకపిట్ట కన్నులదానికి, శ్రీఫలవక్షం కలదానికి, విద్యుల్లతాంగికి, సుకేశికి ప్రాణనాథుడు లేకపోతే ఎల్లా? ఎల్లా? ఎల్లా? ఎల్లా?)

పాదుషా మనసు అట్టిట్టయింది. వేదిక మధ్యలో ఉన్న ఉన్నతాసనం మీద కూర్చుండిపోయాడు. వెంటనే మాటలు రాలేదు. ఉద్విగ్నతకు లోనైనాడు.

లవంగీ, ప్రేమికుల చిత్రాలు – ప్రభువు మనసునీ, తనువునీ హరించినాయి. అంతకు మించి పండితరాయల వారి వర్ణన ప్రభువులు రాసిక్యభారాన్ని ఇనుమడింపజేసింది.

“అయితే, వాస్తవం వాస్తవమే కదా, ఆ అద్వితీయ సౌందర్యరాశీ, ఆ అపూర్వ ప్రేమారాధనామూర్తీ-ఇద్దరూ ఈ చిత్రాల్లో జీవించారు; జీవిస్తున్నారు. ఇది నిజంగా మహదద్భుతం ప్రభూ” అన్నాడు అస‌ఫ్‌ఖాన్.

“అవును.. అదే.. అదే.. అంతే.. అంతే..” అని సంభ్రమించాడు పాదుషా. ఆయన తన తన్మయత్వం నుండీ తేరుకోలేదు.

ఆయనకు అలతి దూరంలో చిన్న ముక్కాల పీఠంపై కూర్చున్న జగన్నాథుడి స్థితి-భావ భావనోద్వేగాల్లోనూ, ఉత్తేజిత స్పందనల్లోనూ – ప్రభువు స్థితికి ఏ మాత్రమూ భిన్నంగా లేదు. తన శ్లోకాల్లో ఆశువుగా జాలువారిన శృంగార రసైక్య శబ్దజాలానికి తనకు తానే ఆశ్చర్యపోతూ, ఒక మధురహేలలో ఉండిపోయాడు.

భవనాంతర్భాగమంతా అనేక అభిప్రాయాల ప్రకటనలతో, సంభాషణలతో కలకలంగా ఉన్నది.

కామేశ్వరికీ, శాస్త్రి దంపతులకు కూడా ఈ పరిస్థితి కలవరాన్ని కలిగించింది. భర్త చేసిన ఉత్సేక పూరితమైన వర్ణన పాదుషా వారికి నచ్చినట్లే అనిపిస్తున్నా, ఏమో-పునర్విచారంలో ఏఏ భావాలు ముసురుతాయో అని కామేశ్వరి భయం, సందేహం. నిదానంగా సుభాషిణితో మనసు కలబోసుకుంది. శాస్త్రీ విన్నాడు.

“ఏం భయంలేదు. ‘కవయః నిరంకుశః’ అనే సూక్తి తెలియని వాడేం కాదు పాదుషా. ఆయనే గొప్ప ప్రేమికుడు. ముంతాజ్ మహల్ బేగం సాహెబా అంటే వారికి ప్రాణ సమానం. వారి రసికత కూడా ఇప్పటికే జగద్విదితం. ఫర్వాలేదు. గురువుగారు వర్ణించినదంతా – ఒక దృశ్య చిత్రణకి మహోన్నతమైన అక్షరీకరణమే కదా!” అని ధైర్యం చెప్పాడు.

సమయ స్ఫురణతో తెప్పరిల్లాడు – పాదుషా. భూపతికీ, అస‌ఫ్‌ఖాన్‌కి ఏదో చెప్పాడు. జగన్నాథుడూ తెప్పరిల్లాడు.

భూపతి లేచి ప్రేక్షకుల కలకలాన్ని సద్దుమణిగేట్టు చేసి ప్రకటించాడు, “ఈ సాయంత్రం సంగీత సభ ఇక్కడే జరుగుతుంది. ప్రముఖులంతా విచ్చేస్తారు. పాదుషావారి అధ్యక్షతన సంగీత సమ్మేళనం ఉంటుంది. అందరూ సకాలంలో రావలసి ఉంటుంది”

పాదుషా లేచాడు. అసఫ్‌ఖాన్, పండితరాయలూ లేచి నిలబడ్డారు. పాదుషా పండితరాయల వైపు సాదరంగా చూసి నవ్వుతూ, భుజంతట్టి “షుక్రియా పండిట్‌జీ..” అంటూ కరచాలనం చేశారు. “ధన్యుణ్ణి.. ప్రభూ..” అన్నాడు జగన్నాథుడు.

చుట్టుప్రక్కల వారు చప్పట్లతో అభినందించారు. కామేశ్వరి మనసు కుదుటబడింది.

పాదుషా, ఆయన బృందం కదిలారు.

వారిని అనుసరిస్తూ మిగిలిన అందరూ బయటికి నడిచారు.

కళాభవనం నుంచీ ఇంటికి వచ్చారు.

కామేశ్వరి మొహం చాలా తేటగా ఉంది. శాస్త్రికి ఆనందంగా వుంది. అతని సంతోషానికీ, సంబరానికీ ప్రత్యేక కారణం – గురువుగారిని పాదుషా ఎంతో చనువుగా మెచ్చుకోవటం. సుభాషిణి మౌన శ్రోత; మౌన ప్రేక్షకురాలు!

భోజనాలైనాయి. విశ్రాంతికి ఎక్కువ సమయంలేదు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

“శ్లోకాలన్నీ అద్భుతంగా వచ్చినై గురువుగారూ..” శాస్త్రి.

“ఆ.. వచ్చినై.. వచ్చినై..!” అని కొంచెం పరిహాసంగా అని “ఆ ప్రేమికుడి కెవరికో తమకం పొంగిపోయినట్లు చిత్రాల్లో కనిపించింది. సరే, ఆ లవంగి సౌందర్యమూ అమితాశ్చర్య జనకంగా, అపూర్వంగా ఉంది. అదీ సరే కానీ, మీ గురువుగారి కేమిటీ మరీ అంత ఉధృతంగా శృంగార రసోత్సేకం, వర్ణనా? అంత తాదాత్మ్యం ఎందుకో? నాకైతే కొంచెం సిగ్గనిపించింది శాస్త్రీ” కామేశ్వరి మాటలు విని, “అవును..” అన్నది సుభాషిణి తానూ తన మనోభావాన్ని దాచుకోలేక. చిరునవ్వుతో వింటూ మిన్నకున్నాడు జగన్నాథుడు.

శాస్త్రి అన్నాడు, రసోత్సేకం అని మీరే అంటున్నారు కదా! ఒకసారి గురువుగారు రసస్ఫురణ గురించి చెప్పారు. దృష్టిప్రతిభను సూచిస్తుంది. సహృదయుడి ప్రతిభ-సన్నివేశంతో మమేకమయ్యే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. హృదయ శుద్ధి ఉన్నప్పుడే ఆ సామర్థ్యం సాధ్యపడుతుంది. భావంతో తాదాత్మ్యం చెందినప్పుడు అసంకల్పంగా సహృదయునిలో రసావిష్కరణ జరుగుతుంది”

“అవన్నీ విన్నాను. ఏకంగా ‘రసగంగాధర’ కర్త కదా మీ గురువు గారు. తెలుసు” అన్నది కామేశ్వరి కొంచెం నిష్ఠూరంగా.

“అసలు విషయం ఏమిటంటే- కళాహృదయం బాహ్య ప్రాపంచిక చైతన్యానికి అతీతంగా రసానందానుభూతి నిస్తుంది. కనుక, ఆ అనుభూతి వ్యక్తీకరణం, రసభావ వర్ణనలూ అన్నీ అలౌకికం, కనుక.. అని ఆగేడు శాస్త్రి. “కనుక, మమ్మల్నీ ఆ వర్ణనల్ని ఆస్వాదించమంటావు; ఆనందించ మంటావు..” అన్నది కామేశ్వరి చర్చను పొడిగిస్తూ; శాస్త్రిని రెట్టిస్తూ.

క్షణం ఆలోచించి గురువుగారి వైపు చూశాడు శాస్త్రి. ‘ఉండు’ అన్నట్టు సైగ వచ్చింది. ఆగాడు శాస్త్రి. జగన్నాథుడు తానే మొదలుపెట్టాడు. “నిజాన్ని చెబుతాను. ఎవ్వరూ ఏమీ అనుకోకూడదు” అని మందహాసం చేశాడు. “చెప్పండి..”

“మీరు ఇప్పటికే ఆ శ్లోకాలిస్తున్న రసానందాన్ని అనుభూతిస్తున్నారు. కాకుంటే, ఆ అనుభూతి ప్రస్తుతం వాచ్యం కాకుండా దానికి పై మెట్టున ఉండే ‘అనిర్వచనీయత’ మీదికి ఎక్కి వుంది.”

ఒక్కసారిగా కముకు దెబ్బతిన్న దానిలా చూసింది కామేశ్వరి. సుభాషిణి తెలిసీ తెలియని తనంతో దిక్కులు చూస్తోంది. కామేశ్వరి భర్తవైపు కినుకతో చూసింది. ఆ చూపుల్లో పూచిన మందార అరుణిమ ఆయనకి ఆహ్లాదమే కలిగిస్తున్నది. తాను మాత్రం చివాలున లేచి లోనికి వెళ్లిపోయింది. సుభాషిణీ ఆమెను అనుసరించింది.

శాస్త్రి గురువుగారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తే, “కొన్ని చర్చలు కుండ బద్దలు కొడితేనే ముగుస్తాయి” అన్నాడాయన, “లవంగి గాథా అంతే!”. “మీరు గొప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞులు కూడా గురువుగారూ” అని నవ్వాడు శాస్త్రి. “అవును..” అని “ఇక మనమూ సిద్ధం కావాలి” అంటూ లేచాడు.

***

సభ అంతా ఆనంద కోలాహలంగా వుంది.

పాదుషా, ఆయన పరివారం భవనంలోకి ప్రవేశిస్తుంటే లోపలా బయటా హర్షధ్వానాలు!

అప్పటి కెప్పుడో వచ్చే ఉన్నారు – జగన్నాథుడూ, బృందం.

డైరింగ్‌ఖాన్, సుందరదాస్ వంటి ప్రసిద్ధ విద్వాంసులూ సభలో ఉన్నారు. తబలా, సితార్ వంటి వివిధ వాద్య కళాకారులూ సిద్ధంగా ఉన్నారు.

పాదుషా సభను ప్రారంభిస్తూ, మతప్రమేయం లేకుండా సంగీత సాహిత్య కళాకారులకు తమ ఏలుబడిలో గల ప్రాథమ్యం, ప్రాధాన్యం గురించి చెప్పి, వారి సుఖ సంతోషాలనే తానెప్పుడూ వాంఛిస్తానని ప్రకటించాడు. అందరూ సంతోషంతో చప్పట్లు చరిచారు.

అసఫ్‌ఖాన్ సంగీత కార్యక్రమాన్ని ప్రకటించాడు. ఒక్కొక్కరే వేదిక మీదికి వచ్చి గానం చేసి వెళ్లి కింద తమ ఆసనాల్లో కూర్చుంటున్నారు.

డైరింగ్‌ఖాన్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు భూపతి.

ఆయన వేదికపైకి వెళ్లి తన గానాన్ని మొదలెట్టాడు. ప్రారంభమే కేదార్ ప్రారంభించి శాంతి స్థాపన చేశాడు. పాదుషా ఇతర పెద్దలూ మహదానందంగా ‘వహ్వా’లతో చప్పట్లు కొట్టారు.

మియార్‌కీ, మల్హార్ రాగం కీ, బహార్ రాగంకీ గల సామ్యాన్ని వివరిస్తూ ఆ రాగాల్ని గానం చేశాడు.

పాదుషా లేచి నిలిచి ఆయన్ని కౌగిలించుకున్నాడు.

సభ కోలాహల సరస్సే అయిపోయింది.

ఆ తర్వాత అసఫ్‌ఖాన్ లేచి నిలిచి జగన్నాథుని ఆహ్వానించాడు.

పండిత రాయలు ముందుగా తాను రాసి ఉంచిన ద్రుపద్‌లను పన్నెండు విభిన్న రాగాల్లో శ్రవణసుభగంగా గానం చేశాడు. ప్రతి ద్రుపద్‌కి సభ్యులు, కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. ఆ వెంటనే సహానాలో ఆహూతుల్ని కరుణరస ప్రవాహంలో తేలించాడు. సభ్యులంతా ఆర్ద్రచిత్తులైపోయారు.

చివరికి తన ధీర గంభీరస్వనంతో ఇలా గానం చేశాడు.

“అప్యకుర్వన్ సటాటోపమ గర్జన్నపి కేసరీ

భూభృతాం కురుతే శోభాం గర్జన్నపిన కుంజరః”

భూపతి వెంటనే దాని భావాన్ని చెప్పాడు.

“ఏ పటాటోపం లేకపోయినా, గర్జనలు లేకపోయినా, సింహం సింహమే. కొండలకు అందం. ఏనుగు ఎంతగా గర్జించినా ఆ శోభ లేదు”.

“ఓహ్.. ఏమి పోలిక. ఏమి కవిత! పాదుషా వారి గురించి ఎంతో సార్థకమైన శ్లోకం” అని మెచ్చుకున్నాడు అసన్.

పాదుషా చిరునవ్వే ఆయన సమాధానంగా ప్రతిఫలించింది.

భూపతిని ఉద్దేశించి తలపంకిస్తూ కను సైగచేశాడు పాదుషా.

“జరూర్ జహాఁపనా” అంటూ ఆయన తన ముఖ్యరాజోద్యోగికి ఆజ్ఞనిచ్చాడు. క్షణాల్లో వేదిక మీదికి అందంగా అలంకరింపబడిన తులాభారం తేబడింది. త్రాసులో ఒక వైపు వివిధ వస్తు సముదాయం ఉన్నది.

పాదుషా ప్రకటించాడు, “అనితర సాధ్యమైన రీతిలో డైరింగ్‌ఖాన్, పండితరాయలు ఇద్దరూ తమతమ సంగీత ప్రజ్ఞా ప్రాభవాల్ని ప్రదర్శించి మనల్ని అందరినీ గాన సముద్రంలో ఓలలాడించారు. మా ఆనందానికి చిహ్నంగా ఈ ‘తులాభారం’ చేస్తున్నాము”.

“రండి.. పండితరాయా” అని స్వాగతించి అక్కున జేర్చుకుని త్రాసులో కూర్చోబెట్టాడు. నమ్రంగా చేతులు మోడ్చి కూర్చున్నాడు జగన్నాథుడు. అసఫ్‌ఖాన్, ఇతరులూ పండితరాయల్ని పుష్పమాలాంకృతుల్ని చేశారు. ఆయనపై పుష్పవృష్టి కురిసింది.

వస్తు సంభారం సర్దుబాటుతో తులాభారం అయింది.

జగన్నాథుడు వచ్చి తన పీఠం మీద కూర్చున్నాడు.

పాదుషా ఇప్పుడు డైరింగ్‌ఖాన్‌ని ఆహ్వానించాడు. తన సంతోషాన్ని ప్రకటిస్తూ ఆయనకూ తులాభారం జరిపించాడు.

అసఫ్‍ఖాన్ ప్రకటించాడు. “ఈ ఇరువురు విద్వాంసుల్నీ తూచిన వస్తు సంభారమంతా పేదలకి పంచబడుతుంది. ఇది ప్రభువులు వాంఛితం. సామాన్య ప్రజలపట్ల వారికున్న సౌజన్యభావన; కారుణ్య దృక్పథం” అని ఆగేడు.

పాదుషా తానుగా చెప్పాడు; “వాటికి ప్రతిగా వీరిరువురికీ సంతోషంగా ఒక్కొక్కరికి నాలుగువేల ఐదు వందల వెండినాణేల్ని బహూకరిస్తున్నాము” అని ఆగేడు.

వేదిక ఎడమవైపు నుండి వెండి పళ్లెల్లో నాణేలూ, ఇతర ఆభరణాలూ, చీనిచీనాంబరాలూ వచ్చాయి. పాదుషా చేతుల మీదుగా వాటిని ప్రదానం చేయించాడు భూపతి.

సభాభవనం మరోమారు హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది.

తర్వాత రెండురోజులూ – తులాభారం ఉత్సవ విశేషాలతోనే గడిచాయి.

ఆహ్లాదకరమైన వాతావరణంలో, దర్శనీయ స్థలాల్ని తిరిగివచ్చారు.

మూడోనాడు ఆగ్రాకు తిరుగుప్రయాణం నిశ్చయమైనట్టు రాజోద్యోగుల ద్వారా వర్తమానం పంపాడు భూపతి.

కానీ ఆ రోజు,

అనూహ్యమైన సంఘటన-అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. ప్రయాణం సంగతి పక్కకి పోయి, ఏ దుర్ఘటనలు సంభవిస్తాయో అనే భయం మొదలైంది.

తెలతెలవారుతుండగానే రాజోద్యోగులు వచ్చి, ప్రయాణం ఆగిపోయిందనీ జగన్నాథునీ, కుటుంబసభ్యుల్నీ బయటకు రావద్దనీ హెచ్చరించి వెళ్లారు. కారణాల్ని తునకలూ, చినుకులుగా పడేసి పోయారు.

ఎంతో కాలం నుండి రాజౌరీ ప్రాంతాల నెగడులా రగులుతున్న మత విద్వేషం ఒక్క సారిగా కీలలెగసిందట. గడచిన రాత్రి రాజౌరీ నుండీ గుంపులు గుంపులుగా జనం భంభర్‌కి చేరారు. రచ్చకెక్కి రభస, రగడ చేస్తూ ఇక్కడికి చేరారు. ఆ క్రమంలో కత్తులు కలవటం, కాళ్లు, చేతులూ తెగటం కూడా జరిగి పోయాయిట.

పాదుషా, అసఫ్‌ఖాన్, సైన్యాధికారి కూడా ఇక్కడ మకాం చేసి ఉండటం వలన వారి సమక్షంలోనే తమ వాదనలు వినిపించుకొని పరిష్కారాన్ని కోరదలచుకున్నారుట.

ఈ విద్వేషాలకు అసలు కారణం మాత్రం తెలియరాలేదు జగన్నాథుడికి. నలుగురూ కూచుని ఈ విషయం గురించే మాట్లాడుకోసాగారు. “డైరింగ్‌ఖాన్ జీ ఎలా ఉన్నారో?” శాస్త్రి సందేహం. “అవును. వారి క్షేమం తెలిస్తే బాగుణ్ణు” యథాలాపంగా అన్నాడు జగన్నాథుడు.

లేచి వాకిలి దాకా వెళ్లి ద్వార పాలకునితో మాట్లాడి వచ్చాడు శాస్త్రి. “ఊళ్లో ఎక్కడి వాళ్లనక్కడ ఉండమని ఆజ్ఞలు జారీ అయినాయట. ఖాన్ గారినీ వారి బసకే పరిమితం చేశారట” చెప్పాడు.

“సరి.. ఇదొక విధమైన గృహ నిర్బంధం.. కానీయండి.” అన్నది కామేశ్వరి.

“నువ్వే కానీయాలి. సర్దుకున్న సామగ్రిని విప్పాలి. వంటావార్పూ సంగతీ చూడాలి కదా” నవ్వుతూ అన్నాడు జగన్నాథుడు.

“అదెటూ తప్పదు గదా. సుభాషిణీ కదులమ్మా?” అని లేచింది కామేశ్వరి. సూర్యుడు నడినెత్తికెక్కాడు.

భోజనాలయి నడుం వాల్చారు.

భూపతిగారి నుండి వర్తమానం ‘జగన్నాథుల వారిని ఒక్కరినీ పాదుషా వారు రమ్మన్నా’రని- లేచి బయలుదేరి, ఆ వచ్చిన అధికారితోనే వెళ్లాడు జగన్నాథుడు.

జగన్నాథుడు వెళ్లేసరికి-బయట ప్రాంగణంలో జనం కోలాహలం. వివరం తెలియకుండా గొంతులెత్తి ఒకరిమీద ఒకరు కారాలూ, మిరియాలూ నూరుకుంటున్నారు. కసి, క్రోథం, పగ-అన్ని వికృతులూ వివిధ భంగిమల్లో విన్యాసం చేస్తున్నాయి.

మందిరం లోపల అసఫ్‌ఖాన్, సైన్యాధిపతి, భూపతి చర్చల్లో ఉన్నారు. అభివాదం చేసి కూర్చున్నాడు జగన్నాథుడు.

అసఫ్‌ఖాన్ మొదలెట్టాడు, “పండిట్‌జీ పాదుషావారు ఏదైతే జరగరాదని ఇంతకాలం నుంచీ అనుకుంటూ, అనుకున్నదాన్ని అమలుచేస్తున్నారో, చివరికి అది ఇక్కడ ఈ ప్రాంతంలో పడగవిప్పింది”.

“విషయం చెప్పండి” అని అసహనంతో అన్నాడు పాదుషా.

“ఈ ప్రాంతాల్లో హిందువులు అధిక సంఖ్యలోనే ముస్లిం యువతుల్ని తీసుకుపోయి మతమార్పిడి చేసి వివాహాలు చేస్తున్నారట. ముస్లిం మత పెద్దలకి సహజంగానే ఇది అరికాళ్లకింద మంటేకదా. విద్వేషం మొదలయింది.”

“అసలు అంతకంటే ముందు వారు హిందూ యువతులే, ముస్లింలు వారిని తీసుకుపోయి ముందుగా తామే మతం మార్చారని హిందువుల వాదన. అలా చాలా మంది యువతులు ముస్లిములుగా ఉన్నారని వీరు పిడికిళ్లు బిగిస్తున్నారు జహాపనా!” అని కలుగజేసుకుని రక్కున సమాధానం చెప్పాడు భూపతి. పాదుషా భూపతి వైపు క్రీగంట చూశాడు.

జగన్నాథుడికి పాదుషా వారి మనసు తెలిసింది. భూపతి సమాధానం ఆయనకి నచ్చలేదు.

మందిరంలో గంభీర నిశ్శబ్దం ఆవరించింది.

చాలా సమయం గడిచింది.

నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పాదుషాయే అన్నాడు, “మనలోనే మనం రెండు పక్షాలు కానవసరంలేదు. కర్తవ్యాన్ని గురించి ఆలోచించాలి”. క్షణం ఆగి, “పండిట్‌జీ మీరు న్యాయ శాఖాధ్యక్షులు. ధర్మాధికారి. మీరు కూడా ఈ క్లిష్టస్థితిలో ఇక్కడే ఉండటం మాకు అనువుగా లభించిన అవకాశం.”

“అవును.. పండిట్‌జీ, ఈ సమస్యని ఇక్కడే త్రుంచివేయకపోతే, మాను అయ్యే పరిస్థితి” అని “చెప్పండి. ఇరుపక్షాలకీ అంగీకార యోగ్యమైన నిర్ణయం చేయాలి మనం” అన్నాడు అసఫ్‌ఖాన్.

జగన్నాథుడు కూడా ఆలోచనలో పడ్డాడు. కప్పా- పామూ సామెతగా వుంది. పరిస్థితేమో మందు దట్టించిన ఫిరంగిలా ఉంది. ఏ కొంచెం ప్రమత్తత వహించినా- అటూ ఇటూ చాలా తలలు తెగుతాయి. అంతేకాదు. ఈ ఆందోళన ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉంది. అప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది.

తాను సంభావ్యమనుకుంటున్న పరిష్కారాన్ని చెప్పటమే శ్రేయస్కరం అనుకుని, “ఒక పరిష్కారం కనిపిస్తోంది ప్రభూ.. దానిలో మొదటి భాగం -యథాతథ స్థితిని కొనసాగించటం – ఎక్కడి యువతులు అక్కడ వుంటారు. రెండవది – ఇరుమతాల పెద్దలకూ, యువతులకు కూడా అంగీకారమైతే, అలాంటి వ్యక్తుల విషయంలో అసలు మతానికి వారి పునరాగమనాన్ని అంగీకరించటం – ఇక మూడవది – ఈనాటి నుండీ బలవంతపు మతాంతర వివాహాల్ని పూర్తిగా నిషేధించటం” మనసు విప్పి చెప్పేశాడు. “ప్రభువులు ఆమోదిస్తే ఫర్మానా జారీ చేయించవచ్చు” అని కూడా అన్నాడు. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

పాదుషా తన ఆసనంలో ముందుకు జరిగి నిటారుగా కూర్చుని, “భేష్”, అని “బయట వున్న వారిలో ఇరుపక్షాలకు చెందిన నలుగురేసి నాయకులను లోపలికి రప్పించండి” అని ఆజ్ఞాపించాడు.

భూపతి స్వయంగా వెళ్లివారితో మాట్లాడాడు. ఇరుపక్షాలు తమ పక్షంలోని వారితో సంప్రదింపులు జరుపుకున్నారు. చివరికి ఇటు నలుగురు, అటు నలుగురు ముందు కొచ్చారు. పాదుషాకి సలాములు చేస్తూ లోపలికి వచ్చారు. వారి అనుమతితో ఆసనాల్లో కూర్చున్నారు.

పాదుషా అసఫ్‌ఖాన్ కేసి సైగ చేశాడు చెప్పమన్నట్టు. జగన్నాథుడు సూచించిన పరిష్కార మార్గాన్ని తుచతప్పకుండా ఒప్పజెప్పాడాయన.

వచ్చిన వారిలో కలవరము, కలకలమూ కూడా కలిగాయి. కానీ, వాటిని పైకి ఉబుకనీయకుండా జాగ్రత్త వహించి, పాదుషా అనుమతితో బయటికి వెళ్లారు. తమ వారితో సంప్రదింపులకి అని తెలుస్తూనే వుంది.

వారివారి నిర్ణయాలెలా ఉంటాయోననే ఉత్సుకత మందిరంలోని వారిలోనూ కలిగింది. కానీ, ఎవరికి వారు మౌనం వహించారు.

నాయకులు లోపలికి వచ్చారు. పాదుషా వైపు, ఇతరులకేసి అవ్యక్త భావాల చూపులు నిగిచ్చారు.

క్షణాల తర్వాత ఇరుపక్షాల వారూ ఒకేసారి “మాకు అంగీకారమే ప్రభూ” అన్నారు.

పాదుషా కించిత్ ఆశ్చర్యంతో ముందు జగన్నాథుని వైపు చూశాడు. ఆ చూపులో మెప్పుదల. ఆ తర్వాత ఆ నాయకులవైపు చూశాడు. ఆ చూపులో కనికరం. “ఠీక్‌ హై” అనే మాట మాత్రం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాతి కార్యభారం అసఫ్‌ఖాన్‌ది. ఆయన చెప్పాడు, “సరి.. మీరు వెళ్లండి. పాదుషా వారి ఫర్మానా తయారవుతుంది. మీరు అన్ని గ్రామాల్లోని మీ మీ సంబధీకులకు ఈ వర్తమానాన్ని తెలియజేయండి. అధికారికంగా చేయవలసినది భూపతి వారు చేస్తారు. వెళ్ళి రండి..”

వారంతా ధన్యవాదాలు చెబుతూ వెళ్ళిపోయారు.

పాదుషా లేచి నిలబడి, “పండిట్‌జీ.. మీరు మా గౌరవ పరిరక్షకులు కూడా” అని తన అభ్యంతర మందిరానికి కదిలారు. వెళ్తూ వెళ్తూ రేపు మనం ఆగ్రాకి బయల్దేరుదాం” అనేసి, భూపతి వైపు నిర్ణయ సంజ్ఞ చేశారు.

సన్నివేశంలో ప్రశాంతత కుదురుకుంది!

(సశేషం)

Exit mobile version