జగన్నాథ పండితరాయలు-24

0
1

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[అది 1638 సంవత్సరం. రాజకీయంగా పాదుషా వారి పరిస్థితులు ఒక స్తిమిత స్థితికి చేరుతాయి. మహాబత్‌ఖాన్ మరణంతో డక్కన్ వ్యవహారాలని అసఫ్‍ఖానే చూస్తుంటాడు. షాజహాన్ తన కొడుకైన ఔరంగజేబును రాజ్యపాలనలో భాగస్వామిని చేసి అసఫ్‍ఖాన్ శిక్షణలో పెడతాడు. డక్కన్ ముఖ్య వ్యవహారాలు తెలుసుకుంటుంటాడు ఔరంగజేబు. ఆఫ్ఘనిస్థాన్ సమస్య ముందుకు రాగా, పండితరాయల సలహాతో ఆ సమస్య పరిష్కారమవుతుంది. ఆగ్రా కోటలో షాజహాన్ జీవితాశయాలైన కళాకృతులు – దివాన్ – ఏ ఖాన్ – దివాన్ -ఏ-ఆమ్, శేషమహల్ నిర్మాణాలు పూర్తి కావస్తుంటాయి. ధర్మాధికారిగా పండితరాయలు పాదుషా వారికి – సామ్రాజ్యంలో మద్యం అమ్మకాలని, జంతు వధశాలల్ని నిషేధించమని సూచిస్తాడు. ఆ సూచనలు అమలవుతాయి. బీదాబిక్కీ సంతోషిస్తారు. దారా, పండితరాయలు ఇప్పుడు ఎక్కువ సమయం శాస్త్రాల అధ్యయనంలో గడుపుతుంటారు. దారా ఒక ఉద్యమంగా ఉపనిషత్తుల అనువాదం చేస్తుంటాడు. గురుకులంలో బోధన చక్కగా సాగుతూంటుంది. కాశీనుండి కులపతిమిశ్రా కూడా వచ్చి చేరుతాడు. ఆస్థానంలో, గురుకులంలో పండితరాయలకి లభిస్తున్న కీర్తి ప్రతిష్ఠలూ, ఆదరణ కొందరికి ఈర్ష్యాసూయలు కలిగిస్తాయి. గురుకులంలోనే నివాసం ఉండే కనక్‌లాల్, వంశీధరమిశ్రా జగన్నాథుని దీపావళి పర్వదినాన విందుకు ఆహ్వానిస్తారు. విందు అనంతరం జగన్నాథుడికి తల తిరిగినట్లవుంది. ఇంటికి వచ్చీరాగానే వాంతులూ, బేదులూ అయి, అపస్మారకంలోకి వెళ్లిపోతాడు. శాస్త్రికీ తల తిరుగుతుంది. రాజోద్యోగులు అత్యవసరంగా వైద్యుని రప్పిస్తారు. చికిత్స చేసిన వైద్యుడు ఆహారం విషమయమైందని వెల్లడిస్తాడు. దారా విచారణ జరిపి, ఇది కావాలని చేసిన దుశ్చర్య అని గ్రహిస్తాడు. అందుకు కనక్‌లాల్, వంశీధరుడూ కారణం అని తెలుసుకుంటాడు. వారంలోనే వారిద్దరికు ఉద్వాసన పలుకుతాడు దారా. వాళ్ళిద్దరిని గురువుగారు శిక్షించవద్దన్నారని కూడా చెప్తాడు. వారు ఆగ్రా వదిలి వెళ్ళిపోతారు. ఒక రోజున పాదుషా ముఖ్యమైన వారందరినీ సమావేశపరిచి రాజధానిని ఢిల్లీకి మార్చనున్నామని ప్రకటిస్తాడు. అందరినీ ప్రయాణానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోమంటాడు. గురువు గారికి కష్టం కలుగుతున్నందుకు క్షమించమంటాడు దారా. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు. ఇక చదవండి.]

అధ్యాయం-42

[dropcap]రా[/dropcap]జధానిని ఢిల్లీకి మార్చటం జరిగిపోయింది.

జగన్నాథుని కుటుంబం ఢిల్లీలో కుదురుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. దారా నుండి గానీ, పాదుషా నుండి గానీ ఏమీ పిలుపు రాలేదు జగన్నాథుడికి.

శాస్త్రితో సంగీత సాధన చేయించటం, కామేశ్వరితో తన గ్రంథాల్ని ఒక తీరుకు తెచ్చే సలహాలివ్వడంతో సమయం సరిపోతోంది జగన్నాథునికి. కామేశ్వరీ, సుభాషిణీ తీరుబడి ఉన్నప్పుడు సంగీత పాఠానికి వచ్చి కూర్చుంటున్నారు. శాస్త్రి-జగన్నాథుడు భంభర్‍లో ఆశువుగా, ప్రయోగాత్మకంగా పాడిన పన్నెండు రాగాల్నీ అడిగి నేర్చుకునే ప్రయత్నం చేశాడు. జగన్నాథుడు ఆ స్వర ప్రస్థానాల్ని చెప్పాడు. కామేశ్వరి ప్రత్యేకంగా మరీ మరీ గుర్తు చేస్తుంటే ‘శతక సముచ్చయం’ని తీసి త్వరత్వరగా రాయసాగేడు. మధ్య మధ్యలో భామినీ విలాసంలోని శృంగార విలాసం శ్లోకాల్ని ఆమెకు చెప్పి రాయిస్తున్నాడు.

రెండు నెలలయింది.

ఆవేళ – దారా పిలుపు వచ్చింది. వెళ్లాడు.

జగన్నాథుడు వెళ్లేసరికే దారా నలుగురు కవి పండితుల సమావేశం జరుపుతున్నాడు. పరస్పర పరిచయాలైనాయి. వ్రజభాషా కవులు హరిమత్, బిహారిలాల్; సంస్కృత కవులు-చింతామణి, త్రిపాఠి సోదరులు భూషణ్ మతీరామ్.

“మీతో నేను ప్రస్తావించిన నా జీవితాదర్శ గ్రంథం గురించి వీరితో కూడా చెబుదామనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని పిలిపించాను” అన్నాడు దారా.

“అలాగే కానీయండి”

తన మనఃప్రణాళికగా ఉన్న ‘మజ్హ్ ఉల్ – బహరైస్’ సిద్ధాంత గ్రంథం గురించి వివరించాడు. ఆ శీర్షిక అర్థం, ‘రెండు సముద్రాల సంగమం’ అని. సూఫీతత్త్వమూ, వేద సూక్తుల సమన్వయ సిద్ధాంతం అతని ప్రతిపాదన.

చాలాసేపు ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఆ నలుగురూ వెళ్లిపోయారు. ఇస్లాం మత సూత్రాలకు భిన్నంగా ఇలాంటి ప్రతిపాదన, గ్రంథ రచన-ముస్లిం మతవాదులనుంచీ తిరస్కరణని ఎదుర్కోవలసి వస్తుందనేది వారి సంభాషణలో తేలింది.

కొద్దిసేపటి తర్వాత –

“గురువు గారూ, మీరేమీ మాట్లాడలేదు” అన్నాడు దారా.

“మీ ప్రతిపాదన మీద మీరు ఇంకా కొంత పరిశోధన, అధ్యయనం చేయాల్సి ఉంది కదా. విషయాంశాలు ఒక నిర్దిష్ట రూపానికి వచ్చిన తర్వాత చర్చిద్దామనిపించి ఊరుకున్నాను”, అని జగన్నాథుడు తన మనసులోని మాటని చెప్పాడు.

“బాగుంది. మీ సూచన ప్రకారం నేనూ మరికొంత ఆలోచన చేస్తాను” అని, “సరి. మరో ముఖ్యమైన సంగతి.. నేను భగవద్గీతకి నా అనువాదాన్ని పూర్తి చేశాను. ఉండండి, దాన్ని మీకిస్తాను. మిమ్మల్ని పిలవటానికి అదీ ఒక కారణం” అంటూ లేచి వెళ్లి తన గ్రంథ భాండాగారం నుండి ఆ గ్రంథాన్ని తెచ్చి ఇచ్చాడు.

“ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే విషయం చెబుతాను” అని “మా సోదరి జహనారా-నా నుండి మీరు నాకు చెప్పిన చదువంతా నేర్చుకుంది. తానూ కవిత్వం రాస్తోంది. ఆమె పెద్ద విద్యావంతురాలూ, విదుషీ అయింది. అందుకని నా భగవద్గీత అనువాదంలో ‘ఆమె హస్తమూ’ ఉంది” అన్నాడు.

“ఓహ్.. నిజంగా ఆశ్చర్యపరచే వార్త ఇది. చాలా సంతోషం”

“జహనారా బేగం, నేనూ కూడా మియాన్‌మీర్ వారి బోధలతో బాగా ప్రభావితులమైన శిష్యులం. ఆమెకు మానవీయమైన భావనల పట్ల, సంస్కృతీ, సంస్కారాలపట్ల ఎంతో గౌరవం, ఆరాధనాభావం ఉన్నాయి. నిజం చెప్పాలంటే, మా సోదరి ఉత్తమ మానవతామూర్తి, కరుణామయి. మరీ ప్రత్యేకంగా పాదుషా వారికి ఆదరణీయ, సర్వస్వమూ…” అని మళ్లీ “నిదానంగా దీన్ని చూసి తప్పులుంటే సరిచేయండి” అన్నాడు.

నవ్వాడు జగన్నాథుడు. “తప్పులు ఉంటే వాటిని పక్కగా రాసి మీ ముందు పెడతాను. కలిసి కూర్చుని చర్చిద్దాము.”

“అవును.. అలాగే..” అని “ఇదే నేను మీ మీద ఢిల్లీలో ఎక్కువ భారం పెడతానన్నది,” అన్నాడు దారా.

“ఫర్వాలేదు. నాకు సంతోషాన్నిచ్చే పనే కదా” – జగన్నాథుడు.

“పాదుషా వారి సంగతులు?” అడిగాడు జగన్నాథుడు.

“రాజకీయ వ్యవహారాలు ఒక ప్రశాంత స్థితికి వచ్చాయి కదా అనుకుంటే వివిధ ప్రాంతాల్లో రాజప్రతినిధులు వారి సమస్యల్ని పాదుషా వారి సమస్యలుగా బదిలీ చేస్తున్నారు. ఉదాహరణకి అసఫ్‍ఖాన్ వారూ వారి ప్రాంతాల పర్యవేక్షణ పనిలో ఊపిరాడకుండా ఉన్నారనేది సత్యమే అయినా, తాతగారు తీసుకున్న నిర్ణయం ఏదో ధమేరీ పాలకుడైన రాజా జగత్‍సింగ్ పటానియాకి మింగుడు పడలేదట. ఆయన ఇప్పుడు తిరుగుబాటుకి ప్రయత్నాలు మొదలెట్టాడని చారుల వార్త. పాదుషా వారికి మా తాతగారి మీదే కినుకగా ఉందిప్పుడు.”

“అవును. రాజకీయం ఎప్పుడూ మానసికంగా ఒత్తిడినే కలిగిస్తుంది” అని దారాకి ఉపశమనం కలిగించే మాటనే అన్నాడు. కానీ, జగన్నాథుని మనస్సులో అసఫ్‌ఖాన్ పాదుషాల మధ్య పొరపొచ్చాలు రాబోతున్నాయా అనే సందేహం మొలకెత్తింది.

మందిరంలో నిశ్శబ్దం.

క్షణాల తర్వాత అన్నాడు దారా, “నా ఉపనిషత్తుల పని అక్కడే ఆగింది. యోగవాసిష్ఠం తీద్దామనుకుంటున్నాను”.

“ఆలోచించండి. ఉపనిషత్తులు అనువాదానికి చాలా శ్రమా, కాలమూ కూడా కావాలి. ఆ కార్యక్రమంలో చాలా మంది పండితులూ కృషిచేస్తున్నారు. ఒకేసారి అనేక రచనా ప్రణాళికలతో నేను అవస్థపడుతున్నాను. అలాగే మీరూ చాలా లక్ష్యాల్ని మీ ముందుంచుకుంటున్నారు.”

జగన్నాథుని మాటలకు నవ్వుతూ, “అడుగుజాడ గురువుగారిది కదా మరి. కానీయండి. తేలకపోతామా?” అన్నాడు.

మందిరానికీ అవతలి కక్ష్యకు మధ్యన అలికిడైతే అటు చూశాడు జగన్నాథుడు.. దారా కూడా గమనించాడు. “జహనారా వారే. ఈ సమావేశం మొదటి నుండీ ఇక్కడే వున్నారు” అన్నాడు దారా.

“చాలా సంతోషం.. అభివాదాలు” అంటూ లేచాడు జగన్నాథుడు. గుమ్మం వరకూ వచ్చి వీడ్కోలు పలికాడు దారా.

అధ్యాయం-43

మే 1639.

ఆవేళ-ఎర్రకోట నిర్మాణానికీ, షాజహాన్ పేరున నిర్మాణం కాబోయే నూతన నగరానికీ శంఖుస్థాపన.

ప్రముఖులంతా వచ్చారు. పెద్దగా ఆడంబరాలేమీ లేకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతా అయిన తర్వాత అందరినీ ఉద్దేశించి పాదుషా “శంఖుస్థాపన స్థల నిర్ణయాన్ని ఇరుగో లాహౌరీగారూ పండిట్ గారే కలిసి చేశారు. ఈ కోటకీ, నగరానికీ శతాబ్దాలు శతాబ్దాలు ధోకా లేదంటున్నారు” అని నవ్వాడు.

“అవును.. ఖచ్చితంగా.. వారి నిర్ణయం ఎప్పుడూ శాశ్వత క్షేమాన్నే చేకూరుస్తుంది” అన్నాడు దారా.

సంతోషంతో ఔనన్నారు ప్రముఖులు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here