Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-25

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[రాజధానిని ఢిల్లీకి మారుస్తారు. జగన్నాథుని కుటుంబం ఢిల్లీలో కుదురుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రభువుల పిలుపు లేకపోవడంతో తన గ్రంథాల పని చూసుకుంటాడు జగన్నాథుడు. ఒకరోజు దారా కబురుచేస్తాడు. అక్కడికి వెళ్ళిన జగన్నాథుడికి నలుగురి పండితులని పరిచయం చేస్తాడు దారా. తన జీవితాదర్శ గ్రంథం గురించి వారితో చర్చించానని చెబుతాడు. దారా ఇంకా పరిశోధన, అధ్యయనం చేయవలసి ఉందని, అవి అయ్యాక తన అభిప్రాయం చెబుతానంటాడు జగన్నాథుడు. భగవద్గీతకి తను చేసిన అనువాదం – జగన్నాథుడికి ఇచ్చి తప్పులు సరిచేయమంటాడు దారా. గురువు గారు చెప్తున్న విషయాలను సోదరి జహానారా కూడా నేర్చుకుంటోందని, భగవద్గీత అనువాదంలో ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్తాడు. ధమేరీ పాలకుడైన రాజా జగత్‍సింగ్ పటానియా వల్ల ఇబ్బంది ఎదురువుతోందని, అసఫ్‍ఖాన్ ఆయనతో సరిగా వ్యవహరించలేకపోయాడని పాదుషా భావిస్తున్నాడని దారా మాటల వల్ల జగన్నాథుడికి తెలుస్తుంది. తాను ఉపనిషత్తులపై దృష్టి పెడతానంటాడు దారా. సంతోషంతో ఇంటికి బయల్దేరుతాడు జగన్నాథుడు. మే 1639 లో ఎర్రకోట నిర్మాణానికీ, షాజహాన్ పేరున నిర్మాణం కాబోయే నూతన నగరానికీ శంఖుస్థాపన జరుగుతుంది. ఇక చదవండి.]

అధ్యాయం-44

[dropcap]ఏ[/dropcap]డాది గడిచింది.

ఇవాళ-బయట ఎండ దబాయిస్తున్నది.

లోపల జగన్నాథుడు దారా ఇచ్చిన భగవద్గీతని నిదానంగా అధ్యయనం చేస్తున్నాడు. ఆయనకు ముందు తివాచీ మీద గ్రంథ సముదాయాన్నంతా పెట్టుకుని వాటిని చదువుతూ, చదివిన వాటిలో కొన్నిటిని మళ్ళీ చదువుతూ ఉన్నది కామేశ్వరి. మధ్య మధ్యలో ఉసురుసురంటూ, చెంగుతో మొహం, మెడా తుడుచుకుంటున్నది.

చూశాడు జగన్నాథుడు. నిర్లిప్తంగా తదేకంగా చూశాడు. ఈ మధ్య ఈమెలో అలసట కనిపిస్తున్నది అనుకున్నాడు.

మనస్సులో కవితాభివ్యక్తి జలతారు తెర రవరవలాడింది. ఆమె ముఖ లావణ్యశోభని వైశ్రవణలక్ష్మితో పోలుస్తూ శ్లోకం చదివాడు.

కామేశ్వరి విన్నది. “సరేలెండి. ఎప్పుడు పడితే అప్పుడు ఈ సముల్లాస శ్లోకాలొకటి. ముందు నేను రాసుకోవాలి. ఆ తర్వాత వాటిని వాటి స్వస్థలాలకు పంపాలి. భామినీ విలాసంలో అన్యోక్యుల్లాసం, ప్రాస్తావికోల్లాసం, శృంగారోల్లాసం, కరుణోల్లాసం, శాంతి సముల్లాసం లలో దేని స్థలం దానికి కేటాయించాలి కదా!” అని నవ్వింది. శ్లోకాన్ని రాసుకుంది. అప్పుడు మళ్ళీ అన్నది చేతిలోని గ్రంథాన్ని పక్కన పెడుతూ, “గంగా లహరి గంగాలహరే స్వామీ. ఇవ్వాళ మళ్ళీ చదివాను.” సరిగ్గా కామేశ్వరి ఆ మాట అంటున్న సమయానికి శాస్ర్తీ, అతని వెనుక సుభాషిణీ తమ గది నుండీ బయటకి వచ్చారు.

శాస్త్రి అందుకున్నాడు –

“సమృద్ధం సౌభాగ్యం సకల వసుధాయాః కిమపిత
న్మ హైశ్వర్యం, లీలా జనిత జగతః ఖండపరశోః॥
శ్రుతీనాం సర్వస్వం, సుకృతమథమూర్తం సుమనసాం
సుధా సౌందర్యం, తేసలిలమ శివం నఃశమయతు॥”

చదవటం ఆపి, “ఏమి భావస్రవంతి గురువుగారూ. అమ్మగారు చెప్పేది అక్షరసత్యం. ఎందుకూ – గంగాలహరిలో ఏ శ్లోకంకి ఆ శ్లోకం ఒక ధ్వని నిక్షిప్తమైన కావ్యం కదూ” అంటూ ‘ప్రభాతే స్నాతీనాం నృపతి రమణీశాం’ శ్లోకాన్నీ, ‘శరచ్చంద్ర శ్వేతాం శశిశకల శ్వేతాల మకుటాం..’ వంటి శ్లోకాలు గడగడా చదివాడు.

ఆగి, ఊపిరి పీల్చుకుని,

“విభూషితాఽ సంగ రిపూత్తామాంగా, సద్యః కృతాఽనేక జనార్తి భంగా।
మనోహరోత్తురంగ చలత్తరంగా, గంగా మమాంగా న్యమలీ కరోతు॥

అంటూ కదా గురువుగారు కావ్యాన్ని ముగించారు. మనమంతా ధన్యులం. వారు పుణ్యులు” అని, “నాకు తెలుసు కాశీ పండితులు ఈ కావ్యానికి జయహారతులిస్తారు. త్వరగా బయటికి పంపుదాం” అంటూ ఒక ఆనంద తాదాత్మ్య భావనతో ఉద్విగ్నుడైనాడు.

మిగిలిన ముగ్గురూ అంతర్ముఖీనంగా మౌనం వహించారు. నెమ్మదిగా లేచి వెళ్ళి మజ్జిగ లోటాలతో తిరిగి వచ్చింది సుభాషిణి. అందరికీ ఇచ్చింది. తాను తాగి, వాళ్ళు తాగిన ఖాళీ లోటాల్ని తీసి లోపల పెట్టి వచ్చి కూర్చుంది. కామేశ్వరి మళ్ళీ తన పనిలో తాను నిమగ్నమైంది. ఆమె పక్కనే చేరి గ్రంథాల్ని చూడసాగింది సుభాషిణి. ఉన్నట్టుండి, “ఈ ‘యమునా చంపువు’ సంగతేమిటి స్వామీ. ఎప్పుడో ఢిల్లీలో వున్న తొలి రోజుల్లో రాశారు. అయినట్లేనా?” అడిగింది కామేశ్వరి.

“అదేమిటి? ఇన్నాళ్ళనుంచీ నువ్వు దాన్ని సంపూర్ణమైన గ్రంథాల కెక్కించలేదా?”

“లేదు.. తమరు నెలవిస్తే గదా!”

“అయితే.. ఇప్పుడు ఇస్తున్నాం స్వీకరించు” భార్యాభర్తల సంభాషణకు సుభాషిణి మందహాసం చేసింది. ఆమె వైపు సంజాయిషీగా చూస్తూ, “ఇదీ వరస సుభా..” అన్నది కామేశ్వరి. అటూ ఇటూ చూస్తూ మిన్నకుండింది సుభాషిణి.

శాస్త్రికి భగవద్గీతలోని శ్లోకాన్నీ, దారా అనువాద భావాన్నీ వివరిస్తున్నాడు జగన్నాథుడు. అతను శ్రద్ధగా వింటున్నాడు.

ఒకటి రెండు శ్లోకాల తర్వాత, శాస్త్రి అడిగాడు, “గురువుగారూ, అరబ్బీ పారశీక భాషా పాండిత్యం మీ వశం కావటం నావంటి వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అజ్మీర్‌లో అతి తక్కువ సమయంలో సాధించుకొచ్చారు కదూ!”

నవ్వాడు జగన్నాథుడు. కామేశ్వరి కూడా శ్రుతి కలిపి, “సరేలే.. ఆ దెబ్బకే కదా – కాశీ పండితులూ, మౌల్వీలూ చిత్తయి పోయారు!” అన్నది. మిగిలిన అవ్యక్త మాధుర్యాన్ని కళ్ళల్లో ప్రతిఫలింపజేస్తూ భర్తని చూసింది.

ఆయనే “ ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అన్నాడు కదోయ్ భగవానుడు. అంతే” అని చూపుని చేతిలోని గ్రంథం పైకి మరల్చాడు.

అధ్యాయం-45

1641 సంవత్సరం జనవరి మొదటివారం.

పాదుషావారి పిలుపు మేరకు రాజమందిరానికి వెళ్ళాడు జగన్నాథుడు. అక్కడ దారా, అసఫ్‌ఖాన్ ఉన్నారు.

పాదుషా అన్నాడు, “పండిట్‌జీ. మేము లాహోర్ ప్రయాణం పెట్టుకున్నాము. షాలిమార్ ఉద్యానవనాల్ని ప్రారంభించాము కదా! పూర్తి కానున్నవట. వాటినీ చూడాలి. అలాగే, ప్రతి ఏటా జరిపే మా తులామాన్ ఈసారి అక్కడే.”

“చిత్తం”

“ఇక్కడి వ్యవహారాలన్నీ మన ప్రధాన వజీర్ గారే చూసుకుంటారు. అయితే, ఎర్రకోట నిర్మాణం పనుల్లో లాహౌరీగారికి మీరు సహకారిగా నిలబడాలి. రాజోద్యోగులూ, అధికారులూ ఎటూ ఉండనే ఉంటారు. కానీ, మీ సాన్నిహిత్యం లాహౌరీ వారికి అదనపు బలాన్నిస్తుంది.”

“అలాగే జహాఁపనా” అని తల ఊపేడు జగన్నాథుడు.

“మీ సంగీత సాహిత్య కార్యక్రమాల్ని మీరు సాగించండి. రాయముకుందుల వారు వస్తున్నట్టు తెలిసింది. వారు మాకూ మీకూ కూడా గౌరవాస్పదులు” అని, అసఫ్‌ఖా‍న్‍ని ఉద్దేశించి, ‘మీరు చెప్పాలనుకున్నది చెప్పండి’ అన్నట్టు సైగ చేశాడు.

అసఫ్‌ఖాన్ చెప్పాడు. “వృందావన్‌లో గోవిందదేవ్ దేవాలయం గురించి విన్నారు కదా! అక్బర్ పాదుషా వారి వాంఛితం మేరకు అద్భుత కళాఖండంగా వెలిసింది. దాని పాలనా బాధ్యతలు మన వద్దనే ఉన్నాయి. నిర్వహణకు అవసరమైన అన్ని నిధులూ, సదుపాయాలూ ప్రభువుల నుండే అందుతున్నాయి. ఇప్పుడు అంబర్ రాజపుత్ర పాలకులు జయసింహ మహారాజు ఆ దేవాలయ బాధ్యతల్ని తమకు అప్పగించమని కోరుతున్నారు. మీ సలహా..?” అని ఆర్థోక్తిలో ఆపాడు.

ఇంతలో పాదుషా తానే అన్నాడు, “దారా వారు జయసింహుల కోరికని మన్నించమని మామీద ఒత్తిడి తెస్తున్నారు” అంటూ ఆయన వైపు చూసి మందహాసం చేశాడు. దారా ఏమీ మాట్లాడలేదు.

“ప్రభువులు చిత్తగిస్తే నా ఉద్దేశంలోనూ అది మంచి ప్రతిపాదనే అనిపిస్తోంది. వృందావన్ లోని అన్ని దేవాలయాల నిర్వహణనీ వారికే ఇవ్వవచ్చు. దానివలన ఇటు ప్రభువుల సౌజన్యానికి హిందువుల అదనపు గౌరవం అందుతుంది. అటు, జయసింహ మహారాజు వాంఛితమూ నెరవేరుతుంది. వారు కూడా పాదుషా వారి సన్నిహిత మిత్రులే కదా!”

అసఫ్‌ఖాన్ అన్నాడు, “దానితో పాటు వాటి నిర్వహణకీ వార్షికంగా ఆర్థిక సహకారమూ అడుగుతున్నారు.”

“దానికీ మనం అంగీకరించాలి జహాఁపనా.. కారణం ఆ ఆలయాల దైనందిన కార్యక్రమాల్లో భక్తుల మనస్సుల్లో పాదుషా వారి ఔదార్యం శాశ్వతమై నిలుస్తుంది” అన్నాడు దారా.

“మంచి ఆలోచన” అని దృఢంగా అన్నాడు జగన్నాథుడు.

అసఫ్‍ఖాన్ పాదుషా వైపు సాభిప్రాయంగా చూశాడు. పాదుషా “ఠీక్ హై..” అంటూ లేచాడు.

ఆయన నిష్క్రమించిన తరువాత, దారా జగన్నాథుని సమీపించి, “మీరూ అవుననటంతో పని సులువుగా పూర్తయింది. అంతేకాదు. మా తాతగారి హిందూ పక్షపాతం వలన నిర్ణయం సూత్రప్రాయంగా ముందే జరిగింది లెండి” అన్నాడు. అసఫ్‌ఖాన్ గంభీరంగా చూస్తూ కదిలి వెళ్ళాడు.

దారా భగవద్గీత ప్రసక్తి తెచ్చాడు. ఆయన మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. కొంతసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు జగన్నాథుడు.

పాదుషా లాహోర్ వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం పాదుషాకి రాజా జగత్‍సింగ్ పటానియాతో మామగారు సరిగ్గా వ్యవహరించలేదనే కినుక ఉన్నది. పటానియా దమేరీ రాజు కనుక, అక్కడి పరిస్థితిని తానే అంచనా వేసి, మొగ్గలోనే తుంచలేకపోయిన ఆ పాలకుని తిరుగుబాటు ఆలోచనని తానే తుంచివేయాలనే తొందర ఉన్నది. అందుకనే లాహోర్ రాజప్రతినిధి అసఫ్‍ఖానే అయినా, ఆయన్ని ఢిల్లీ వ్యవహారాలు చూడమని తాను అక్కడికి వెళ్ళాడు.

1641 మార్చి.

లాహోర్‍లో ‘నౌరోబ్’ ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘షబ్ – ఏ – బరత్’ మరింత భక్తి శ్రద్ధలతో జరిగింది. వీటిలో పాదుషా స్వయంగా పాల్గొన్నాడు.

జూలైలో తులామాన్ జరిపించుకుని మామూలు ఆచారం ప్రకారం తూచిన ఆ సంబరాన్నంతా పేదలకూ, సామాన్యులకు పంచి, తాను సంతోషించి, ప్రజల్ని సంతోషింపజేశాడు.

ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు ఢిల్లీ చేరుతున్నాయి. ఇదంతా దారా తనకు చెప్పకయే చెప్పిన విషయాల్ని బట్టి జగన్నాథుడికి అర్థమైంది.

(సశేషం)

Exit mobile version