Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-28

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[కామేశ్వరి మరణం జగన్నాథుడిని క్రుంగదీస్తుంది. ఎవరెంతగా పరామర్శించి ధైర్యం చెబుతున్నా జగన్నాథుడికి ఉపశమనం కలగలేదు. దారా వచ్చి గురువుగారికి పలకరించి వెళ్తాడు. అప్పుడే తెలుస్తుంది – పాదుషా ఆదేశం మేరకు అసఫ్‍ఖాన్ లాహోర్ వెళ్ళినట్టు. జగత్ సింగ్ పటానియాతో యుద్ధం అనివార్యం కావడం వల్ల అక్కడ అసఫ్‍ఖాన అవసరం పడ్తుంది. గురువుగారిని ప్రస్తుతం పనులేవీ పెట్టుకోవద్దంటాడు దారా. ‘అసఫ్ విలాసం’ సంగతి రాయముకుందుడు దారాకి చెప్పిఉంటాడని జగన్నాథుడికి అర్థం అవుతుంది. ఒకరోజు సాయంత్రం కవీంద్రాచార్య సరస్వతి వారొచ్చి జగన్నాథుడిని పరామర్శిస్తారు. మళ్ళీ మనుషుల్లో పడమని, కాస్త ఉపశమనం కలుగుతుందని ఆయన సలహా ఇస్తారు. శాస్త్రి గురువు గారి వెంటే ఉంటూ ఓదార్పు మాటలు చెబుతూంటాడు. ఆలోచనలన్నీ మాని గ్రంథ రచన కొనసాగించమని కోరతాడు. ‘అసఫ్ విలాసం’ పూర్తి చేయమంటాడు. మర్నాటి నుంచి మొదలుపెట్టి ఆ గ్రంథాన్ని ఐదు రోజుల్లో ముగిస్తాడు జగన్నాథుడు. లాహోర్‍లో జరిగిన యుద్ధంలో అసఫ్‍ఖాన్ చనిపోతాడు. దారా ద్వారా ఈ వార్త విని చలించిపోతాడు జగన్నాథుడు. దారాని ఓదారుస్తాడు. ‘అసఫ్ విలాసం’ పూర్తి చేస్తే, సంస్మరణ సభలో అందులోని శ్లోకాలు చదవవచ్చని అంటాడు. బదులుగా ఆ గ్రంథం పూర్తయిందని చెప్తాడు జగన్నాథుడు. దారా భవనం నుంచి ఇంటికి వచ్చేస్తాడు జగన్నాథుడు. ఇక చదవండి.]

అధ్యాయం-48

[dropcap]షా[/dropcap]జహాన్ పాదుషా లాహోర్ నుండి ఢిల్లీ తిరిగి వచ్చాడు.

అసఫ్‌ఖాన్ ఖననం లాహోర్ లోనే జరిపించి వచ్చాడు.

పాదుషా ఢిల్లీ చేరినట్టూ, వారిని పలకరించడానికి రమ్మనీ, జగన్నాథుడికి కబురు చేశాడు దారా.

దారాతో కలిసే పాదుషా మందిరానికి వెళ్లాడు జగన్నాథుడు.

పాదుషా ప్రక్కన జహనారా! తల్లి పోలిక! బంగారు శలాకలా వుంది. అణకువ, సౌజన్యం ప్రస్ఫుటంగా ద్యోతకమౌతున్నై.

“మీకిది చాలా పెద్ద దుఃఖం జహాపనా!” అని పరామర్శించాడు జగన్నాథుడు. చాలాసేపు అసఫ్‌ఖాన్ గుణగణాల్ని ప్రస్తావించాడు. మధ్యమధ్య జహనారా, దారా కూడా తమకందరికీ తాతగారే ఎలా సర్వస్వంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. ప్రసక్తానుప్రసక్తంగా కామేశ్వరి మరణానికి తమ సానుభూతిని వెల్లడించారు పాదుషా, జహనారా. పాదుషా తన మనసు విప్పి మాట్లాడాడు. మామగారుగా కంటే, తనను మొగలాయీ గద్దెనెక్కించటానికి చేయవలసినదంతా చేసిన శ్రేయోభిలాషిగా – షాజహాన్‌కు అసఫ్‍ఖాన్ పట్ల ఆదరణా, గౌరవాభిమానాలూ ఎక్కువైనవే. అయితే, రాజకీయ వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా విభేదాలున్నా, షాజహాన్ చాలా సందర్భాలలో మామగారిని కించిత్తు చులకన చేసినా – అసఫ్‌ఖాన్ మనసులో పెట్టుకోలేదు. ఆ కారణం వలననే లాహోర్ రాజప్రతినిధిగా రాజా జగత్ సింగ్ పటానియా వ్యవహారాన్ని తాను పరిష్కరించాల్సిన సమయంలో పాదుషా తనను ఢిల్లీకి పంపించేసినా, కిమిన్నాస్తిగా వచ్చేశాడు. మళ్లీ వెంటనే రమ్మన్నా ఆయన ఆజ్ఞానుసారం వచ్చేశాడు. యుద్ధానికి వెళ్లమంటే వెళ్లాడు. అక్కడే అసువులు బాశాడు. ఈ వాస్తవాలన్నీ గుండెలో ఒక మూల బాధిస్తూనే ఉన్నట్లున్నాయి పాదుషాకి. ఈ సంఘటనల్నీ, మామగారి ధైర్య సాహసాల్నీ చెబుతున్నప్పుడు అంతటి పాదుషా మొహంలోనూ విషాదచ్ఛాయ స్పష్టంగా పరచుకునే వుంది. అలాగే, ఆయన్ని బాధిస్తున్న అపరాధభావం కూడా మాటల్లో ధ్వనించింది. తన రాజకీయ జీవనాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ అసఫ్‌ఖాన్ ఎంతగా రక్షిస్తూ వచ్చిందీ చెప్పుకొచ్చాడు.

చాలా సమయం గడిచింది.

అప్పుడు విషయాంతరంలోకి ప్రవేశించి చెప్పాడు పాదుషా, “యుద్ధం ముగిసింది. మన పక్షంలో నష్టమూ చాలా ఎక్కువగానే వున్నది. ప్రముఖ యోధులు గతించారు. ఇంత జరిగిన తర్వాత – సర్వమూ కోల్పోయిన జగత్ సింగ్ పటానియా తానూ, తన ఇరువురు కుమారులతో శరణు కోరుతూ వార్తాహరుల్ని పంపాడు. వారికి దయాభిక్ష పెట్టి మన సామ్రాజ్యంలోనే ఏదైనా పదవీ బాధ్యతల్ని ఇప్పించమని మనవి చేసుకున్నాడు. చిత్రంగా, వారిని క్షమించి వారి విజ్ఞప్తిని మన్నించమని నూర్జహాన్ బేగం వారి నుండీ ప్రత్యేకమైన వేడికోలు అందింది” అని “ఆది నుంచీ వారు ఆమెని సుముఖుల్ని చేసుకునే ఉన్నారు” అన్నాడు.

“ధర్మాధికారిగా మీ సలహాని కోరుతున్నారు పాదుషావారు” అన్నాడు దారా.

జగన్నాథుడు ఏదో అనేలోగా జహనారా, “శత్రు శేషాన్ని గృహనిర్బంధంలో ఉంచితే, ఆ శేషం మరో శేషానికి వత్తాసు వస్తోంది” అన్నది. భావం కటువైనదే అయినా ఉచ్చారణ మామూలు గానే ఉంది.

జగన్నాథుడు మౌనం వహించాడు.

కొద్దిసేపటి తర్వాత “చెప్పండి” అన్నాడు పాదుషా.

“ఎంత చెడ్డా నూర్జహాన్ బేగం మీకు మాతృస్థానీయులు. ఈ మాట గతంలోనూ మీకు మనవి చేశాను. తానుగా వారు అఖండ రాజనీతి ప్రవీణురాలు కూడా కదా! గతంలో వారు ఏకంగా నూర్‍పూర్‌లో రాజసౌధాన్నే నిర్మిద్దామనుకున్నారు. సైన్య సంఘర్షణల విషయంలోనూ పటానియా శక్తి సామర్థ్యాల గురించిన పూర్తి అవగాహన ఉన్నది వారికి. అందుకని, బహుశా రాజా జగత్ సింగ్ పటానియాతో ఇంకా వైర ధోరణి వలదని వారి సలహా అయి వుంటుంది” ఆగి మళ్లీ అన్నాడు “నాకూ అదే మంచిదనిపిస్తోంది. పైగా రాజా జగత్ సింగ్ మనకు ఖాందహార్ విజయంలో సహకరించిన వాడే కదా! వీటన్నింటికీ మించి పాదుషావారికి శరణన్నవారిని కరుణించే ఔదార్యం సహజ సుగుణ విశేషం. యోధుడూ, రాజనీతిజ్ఞుడూ అయిన రాజాతో గౌరవప్రదమైన ఒడంబడిక మంచిదనే తోస్తోంది. అది ఉభయతారకమే అవుతుంది” తలవంచి క్రీగంట చూశాడు పాదుషా.

“పూర్వాపరాలన్నీ చెప్పారు. గురువుగారి సలహా బాగుందనిపిస్తోంది”.

దారా మాటలకు జహనారా స్తిమితపడిన స్వరంతో, “కుటుంబ పరంగా మాకు కలిగే భావోద్వేగాలు వేరు, రాజకీయ నిర్ణయాలు వేరు. మంచీ చెడూ పెద్దలకు తెలిసినట్టు మాకు తెలీదు” అన్నది.

కొంత నిశ్శబ్దం తర్వాత పాదుషా “సరే. అలాగే కానిద్దాం” అని లేచాడు. దారా జగన్నాథుడి మొహాలు తేటబడినై.

సమావేశం ముగిసింది.

***

పాదుషా కొలువుతీరారు. కానీ, అది ఇంతకు పూర్వంలా కళకళలాడుతూ ఉత్సాహభరితంగా లేదు. ముకుళించుకుపోయిన తామర కొలనులా ఉన్నది. పక్కలనున్న ప్రత్యేక కక్ష్యలో జహనారా, రోషనారా ఇతర రాణివాస స్త్రీలూ కూర్చుని ఉన్నారు.

రాజసింహాసనం వేదిక కింద కుడిఎడమల కవీంద్రాచార్య సరస్వతి, రాయముకుందుడూ, జగన్నాథుడూ, దారా, లాహౌరీ, సాదుల్లా ఖాన్, అసఫ్‌ఖాన్ కుమారుడు సయిస్త ఖాన్ వంటి వారంతా ఆసీనులై ఉన్నారు.

పాదుషా “ఈ సమావేశం ప్రత్యేకమైనది. యుద్ధరంగంలో అసువులు బాసిన ప్రధాన వజీర్ అసఫ్‌ఖాన్ గారి సంస్మరణ ముఖ్యాంశం. ఈ సందర్భంలో పండితరాయల వారు – వారు రచించిన ‘అసఫ్‌ విలాస’ గ్రంథం నుండీ కొన్ని శ్లోకాల్ని చదువుతారు” అని ఉపక్రమించాడు.

అసఫ్‌ఖాన్ వారి మరణానికి సంతాప సూచకంగా మౌనం పాటిద్దామని ప్రకటించాడు పాదుషా. లేచి నిలిచాడు. వెంటనే కొలువు కొలువంతా విషణ్ణమౌనం దాల్చింది. రాణివాస స్త్రీలూ నిలిచి గౌరవసూచకంగా మౌనం పాటించారు.

కవీంద్రాచార్యులు, రాయముకుందుడూ మాట్లాడిన తర్వాత దారా తాతగారిని గురించీ, ఆయన తర్ఫీదులో – తానెలా సైనిక శిక్షణనీ, సంగీత, సాహిత్య, సాంస్కృతిక శిక్షణనీ కూడా పొందాడో వివరించాడు. చెమర్చిన కళ్లతో నివాళి నర్పించాడు. జగన్నాథుడు ‘అసఫ్‌ విలాసం’ ఆఖ్యాయిక నుండీ కొన్ని భాగాల్ని చదివి, భావాన్ని విశదం చేశాడు.

జగన్నాథుని కావ్య పఠనం తర్వాత సమావేశం ముగిసింది.

ముందే నిర్ణయింపబడిన కార్యక్రమం ప్రకారం, దారా, జగన్నాథుడూ పాదుషావారి ఆంతరంగిక మందిరానికి వెళ్లారు.

వీరు వెళ్లేసరికే పాదుషా వారి ఆజ్ఞల్ని వేటినో నమ్రంగా స్వీకరిస్తున్నాడు సాదుల్లా ఖాన్.

పాదుషా తల పంకింపు సూచితంగా దారా, జగన్నాథుడు కూర్చున్నారు. పాదుషా చెప్పాడు, “ప్రధాన వజీరుగారి మరణానంతరం వారుగా మిగిల్చి వెళ్లిన బాధ్యతలు ఏమి వున్నాయా అని విచారణ చేస్తున్నాము.” అని “పండిట్‍జీ, రాజా మాన్‌సింగ్ వారి గురించి తెలుసుకదా” అని అడిగాడు. “చిత్తం.. అక్బర్ పాదుషా వారి నవరత్నాలకు పరిచయాలెందుకు జహాఁపనా. అందునా రాజా మాన్‌సింగ్ వారు” అన్నాడు జగన్నాథుడు.

“మాన్‌సింగ్ వారి సమాధి యుద్ధవీరుల పట్టణంగా పేరుగాంచిన జీలంలోని రోహ్‌టాస్ కోటలో చాలా చిన్నదిగా వుంది. దాని పరిరక్షణ సరిగా లేదని తెలుస్తోంది”

“మాన్‌సింగ్ వంటి మహావీరుని సమాధి అశ్రద్ధకు గురికావటం – రాజపుత్రుల తీవ్ర అసంతృప్తికి కారణమౌతోందట. ఈ విషయాన్ని ప్రత్యేకించి జయసింహ మహారాజా వారు అసఫ్‌ఖాన్ వారి దృష్టికి తెచ్చారు” అన్నాడు దారా.

“నిజానికి ప్రధాన వజీర్ వారు దాని పునరుద్ధరణ గురించిన ఆలోచనలో ఉన్నారు” సాదుల్లా ఖాన్ అన్నాడు.

“ఆ స్థలం చిన్నది అంటున్నారు కనుక, ఆ పనికి ముందు అక్కడి స్థలాన్ని విశాల పరచటం అవసరం. దానికి కనీసం మూడు వందల బిగాలన్నా కావాలేమో” జగన్నాథుని మాటలకు “అవును” అన్నాడు దారా.

‘సరి.. మూడు వందల బిగాల స్థలాన్ని కేటాయిస్తూ అనుమతి పత్రాల్ని తయారు చేయించండి-వజీర్ గారూ, మీరే స్వయంగా దాని పునరుద్ధరణ వ్యవహారాన్ని పూర్తి చేయించండి” అన్నాడు పాదుషా. “చిత్తం” సాదుల్లాఖాన్ అన్నాడు. పాదుషా సమావేశాన్ని చాలించారు.

జగన్నాథుడు నెలవు తీసుకుని వచ్చేస్తుంటే, ఆయనతోపాటు తానూ ద్వారం దాకా వచ్చాడు. దారా.

***

ఇంట్లో శాస్త్రి దంపతుల సాన్నిహిత్యంలోనూ, బయట ఎర్రకోట నిర్మాణ శిల్పాచార్యుడు లాహౌరీ సంభాషణల్లోనూ ఎంతగా సాధారణ దినచర్యల్లో పడినా, జగన్నాథుడి మనసు నుండీ కామేశ్వరి తలపులు విడిపోవటం లేదు.

‘నిర్దూషణా, గుణవతీ, రసభావ పూర్ణా: సాఽలంకృతిః శ్రవణమంగళ వర్ణరాజిః

సా, మామకీనక విశేష, మనోఽభిరామా; రామా, కదాపి హృదయాన్మమనపయాతి’

అంటూ ప్రాణేశ్వరిని కవితాభామినిగా, రూపక – ఉపమాలంకారాలను చేస్తూ వియోగభారాన్ని కొంతలో కొంత దించుకుంటున్నాడు. ఎప్పుడో అపర రాత్రివేళ లేచి తనలో తను దుఃఖిస్తూ ఉన్నాడు.

తన గృహలక్ష్మి కామేశ్వరి ఆరాధన కవిత్వారాధనలో, రచనలో, ప్రకటనలో విలాపంలో – అంతర్లీనమై ‘కరుణాలహరి’గా ధ్వనిమంతమై పోతోంది.

గురువుగారి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాడు శాస్త్రి. ‘శ్రీరాముడంతటి మహాత్ముడికే తప్పలేదు-మానవ సహజమైన వియోగదుఃఖం’ అనిపించింది.

మర్నాడు ఉదయం శాస్త్రి పలకరిస్తూ, “గురువుగారూ! రాత్రి సరిగా నిద్రపట్టిందా?” అని అడిగాడు.

“ఆఁ ఆఁ.. కానీ, ‘ఆసుప్తేః ఆమృతే కాలం నయేత వేదాంత చింతయా’ అన్నారు కదా. అందుకని నిద్రపట్టినా పట్టకపోయినా వేదాంత చింతనతో గడపాల్సిందే ఇక” అని నిర్వేదంగా అన్నాడు.

శాస్త్రి తన సంభాషణని పొడిగించలేదు.

(సశేషం)

Exit mobile version