జగన్నాథ పండితరాయలు-29

1
2

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[లాహోర్‍లో యుద్ధంలో మరణించిన అసఫ్‌ఖాన్ ఖననం అక్కడే చేయించి ఢిల్లీకి తిరిగి వస్తాడు పాదుషా. పాదుషా ఢిల్లీ చేరినట్టూ, వారిని పలకరించడానికి రమ్మని జగన్నాథుడికి కబురు చేస్తాడు దారా. అతనితో కలిసి పాదుషా మందిరానికి వెళ్తాడు జగన్నాథుడు. పాదుషాని పరామర్శించి, అసఫ్‍ఖాన్ గుణగణాల్ని ప్రస్తావిస్తాడు. కామేశ్వరి మరణానికి తమ సానుభూతిని వెల్లడిస్తారు పాదుషా, జహనారా. జగత్ సింగ్ పటానియాకు క్షమాభిక్ష పెట్టమన్ నూర్జహాన్ బేగం కోరిందని, ఈ విషయంలో అభిప్రాయం చెప్పమని పాదుషా జగన్నాథుడిని అడుగుతాడు. పాదుషావారికి శరణన్నవారిని కరుణించే ఔదార్యం ఉందని చెబుతూ, యోధుడూ, రాజనీతిజ్ఞుడూ అయిన రాజా జగత్ సింగ్ పటానియాతో గౌరవప్రదమైన ఒడంబడిక చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు జగన్నాథుడు. అసఫ్‍ఖాన్ మృతి పట్ల సంతాప సభ జరుగుతుంది. సభికులు కొంతసేపు మౌనం పాటిస్తారు. కవీంద్రాచార్యులు, రాయముకుందుడూ మాట్లాడిన తర్వాత దారా తాతగారిని గురించీ, ఆయన తర్ఫీదులో ఏమేం నేర్చుకున్నాడో చెప్తాడు. జగన్నాథుడు ‘అసఫ్‌విలాసం’ ఆఖ్యాయిక నుండీ కొన్ని భాగాల్ని చదివి, భావాన్ని విశదం చేస్తాడు. పాదుషా వారి పిలుపుపై వారి మందిరానికి దారాతో కలిసి వెళ్తాడు జగన్నాథుడు. రాజా మాన్‌సింగ్ సమాధి పరిరక్షణ గురించి చెప్తాడు పాదుషా. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాడు జగన్నాథుడు. ఎంతగా సాధారణ దినచర్యల్లో పడినా, జగన్నాథుడి మనసు నుండీ కామేశ్వరి తలపులు విడిపోవు. ఆమెను తలచుకుంటూ బాధపడుతూనే ఉంటాడు. ఇక చదవండి.]

అధ్యాయం-49

[dropcap]కా[/dropcap]లరథ ప్రచారం సాగిపోతోంది.

దారా పిలిచినప్పుడు మాత్రమే రాచనగరుకు వెళ్లి వస్తున్నాడు జగన్నాథుడు. భగవద్గీతను పూర్తిగా చూసి తిరిగి ఇచ్చాడు దారాకు. గురువుగారు చేసిన సూచనల్ని, సలహాల్నీ పాటిస్తూ, రచన మొత్తాన్ని సరిచేసుకుని తిరిగి జగన్నాథుడికి చూపించాడు దారా. ఇంటికి తెచ్చుకుని దాన్ని ఆసాంతం మళ్లీ పరిశీలనాత్మకంగా చదివేడు. అలా చదువుతుంటే తన భార్యా వియోగదుఃఖానికీ, క్షణక్షణం తనకు కలుగుతున్న వేదనకీ, తన మనస్సు తన బుద్ధిపై సంధిస్తున్న ప్రశ్నలకూ భగవానుడు సమాధానాలు చెప్పే ఉన్నాడనిపిస్తోంది. కానీ, చిత్రంగా దైనందిన కార్యక్రమాల్లో మునగగానే; కొత్తకుండలో నీరునిండగానే బయట చెమ్మ ఉరికినట్లు కామేశ్వరి తలపు మనోమయమైపోతున్నది.

ఒక్కొక్కప్పుడు తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు. ‘ఇంత చదువూ చదివి, ఇంత బతుకూ బతికి ఈ స్థితి ఏమి?’ అని సమాధానమూ తెలుసు ‘అదే మాయ’ అని!

***

దారా చాలావేగంగా ‘యోగవాశిష్ఠం’ని అనువదించే కార్యక్రమంలో ఉన్నాడు. కవీంద్రాచార్య సరస్వతి వారు ఇచ్చిన హిందీ అనువాదం ఆధారంగా తన రచనలో నిమగ్నమై ఉన్నాడు. మధ్యమధ్య అడపాదడపా గురువుగారిని పిలిపిస్తున్నాడు. ఇద్దరూ కలిసి యోగవాశిష్టంలోని తత్త్వబోధననీ, శంకరుని తత్త్వబోధనీ తులనాత్మకంగా చర్చిస్తున్నారు అలాగే సందర్భానుసారంగా మానసబోధనీ పరిచయం చేస్తున్నాడు జగన్నాథుడు.

ఒకరోజు –

ఈ అధ్యయన కార్యక్రమం ముగిసిన తర్వాత, దారా రాజకీయ వ్యవహారాల్ని ప్రస్తావించాడు. అందులో ఎక్కువసేపు ఔరంగజేబు గురించే చెప్పుకొచ్చాడు. ‘అతనికి తన ఉదారవాదం నచ్చదనీ, లోలోపల కోపమనీ’ చెప్తూ ఆయన ముస్లిం వాదం వలన డక్కన్‌లో ఇబ్బందికర పరిస్థితులున్నాయని తెలిపాడు.

అయితే సైనిక వ్యూహ ప్రావీణ్యం వలన డక్కన్ పాలకులు అణగివున్నారనీ చెప్పాడు. ఔరంగజేబుని అలహాబాద్‌కి బదిలీ చేయాలనే ఆలోచన కలిగినా, పాదుషా మళ్లీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారనీ, అందువలన అలహాబాద్ బాధ్యతలు తనకు అప్పజెప్పవచ్చుననీ చెప్పుకొచ్చాడు.

చివరికి “ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాదుషా వారు అలహాబాద్ పొమ్మని ఆజ్ఞాపిస్తే నా రచనా వ్యాసంగం కాస్తా ‘ఇంతే సంగతులు’ అయి-మధ్యలోనే ఆవేయవలసి వస్తుందేమోనని భయంగా వుంది” అన్నాడు.

“ఉపనిషత్తుల రచనకి ఎలాగైనా ఎక్కువ సమయం కావలసినదే. ఈలోగా యోగవాశిష్టం అయిపోతే చాలా వరకూ మీ ఆశయం సఫలం అయినట్టే కదా!” అన్నాడు జగన్నాథుడు.

“అంతే అనుకోవాలి. అక్కడికదే ఒక సంతృప్తి.”

ఆ తర్వాత జగన్నాథుడు సెలవు తీసుకుంటుంటే దారా, “మా హరిరాయ్ వారు సిక్కుల ఏడవ నానక్ గురువుగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని వర్తమానం వచ్చింది నాకూ, సోదరి జహనారా బేగంకూ..”.

“అలాగా! శుభం!” అంటూ వచ్చేశాడు జగన్నాథుడు.

అధ్యాయం-50

మరో సంవత్సరం గడిచింది.

ఆవేళ- సాయంత్రం-

తన భవనం ముందు భాగంలో ఆలోచనా మగ్నుడై పచార్లు చేస్తున్నాడు. జగన్నాథుడు. ఈరోజు ఉదయమే ‘రసగంగాధరం’ రచనని బయటికి తీశాడు. దానికి ఇప్పటి వరకూ సరియైన సమయాన్నివ్వలేదు. కామేశ్వరి ఉండగా అప్పుడప్పుడూ – అరకొరగా భావపంక్తుల్ని చెప్పి వదిలేశాడు.

రసగంగాధరంని – పునః ప్రారంభం చేశాడు.

మొదలుపెట్టటమే సాహితీలోకానికి ఒక సవాలు విసిరి మొదలుపెట్టాడు.

‘కాళికాదేవి కనికరిస్తే పలికిన బీజాక్షరాల బాపతు కాదు నా అక్షరధార. కావ్య రీతుల్లో తేలికయిన గాడిని అవలంబించను! మంత్ర తంత్రాలేమీ లేవు! ఎవ్వరూ ఎంగిలి చేయని శబ్దాలతో అపూర్వమైన ప్రబంధాన్ని రచిస్తాను, అదొక అసామాన్య ప్రయోగంగా రచిస్తాను! సృష్టిలో నన్ను మించిన కవివరుడు లేనేలేడు అనుకోవాలి’ – అని జబ్బచరిచాడు.

అంతేకాదు, ‘సాక్షాత్తు సరస్వతీదేవి వీణ వాయించటం మరచి నా కవిత్వ ధారలో తన్మయురాలై వింటూ వుంటే, దానిని విని తలలూపనివారు – ఇద్దరే. ఒకరు పశుపతి! రెండవవారు పశువూను!’ అని దీమసంగా ప్రకటించాడు.

ఇంకా ఈ రసగంగాధరంఅలంకార శాస్త్రంలో లక్షణ సిద్ధాంత ప్రతిపాదనలు మాత్రమే నావైనవి కాదు. ఆ లక్షణాలకు లక్ష్యాల్ని కూడా నేను స్వకపోల కల్పితంగా సర్వాత్మనా సరిపోయే నూతన ఉదాహరణల్ని చెబుతానుఅని బాసచేసి మరీ మొదలెట్టాడు.

అంటే లక్షణ విమర్శ, లక్ష్య సామాగ్రి రెండూ ఆయనవే!

– ఇదంతా విన్న శాస్త్రి గురువుగారి ఆత్మవిశ్వాస దాటిని చూసి పులకించిపోయాడు. ఆనంద తన్మయత్వంతో కళ్లు చెమర్చినై.

ఇప్పుడు –

నిదానంగా గురువుగారిని సమీపించి, ఇంకా నిదానంగా “నా సంగీత పాఠం వ్యవధి కొంచెం ఎక్కువవుతోంది” అన్నాడు. “సంగీత సాధనకు అభ్యాసమే ప్రధానం” స్వరం దృఢంగా ఉన్నది. శాస్త్రికి గురువుగారి భావం అర్థమైంది. సాధన చెయ్యమని హెచ్చరిక!

“అయినా నా కార్యక్రమాలపట్ల, ఆరోగ్యం పట్ల నీకూ సుభాషిణికీ శ్రద్ధ మరీ ఎక్కువైంది” ఇప్పుడు శాస్త్రికి గురువుగారి భావంలోని తాత్పర్యమూ అర్థమైంది మీ సమయాన్ని మీకోసం వెచ్చించుకోమని!

“అలాగే” శాస్త్రి అన్నాడు. జగన్నాథుడు నవ్వాడు.

“‘అలాగే’ దేనికి?”

“అభ్యాసమూ, శ్రద్ధా, సమయపాలన ముఖ్యం”

“అవును” అని, చూపు మరల్చి “అరే.. నాగేశుడు వస్తున్నాడు!” ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అన్నాడు. నాగేశుడు – చేతిలో సరంజామాతో లోపలికి వచ్చాడు!

-ఆ రాత్రి పొద్దుపోయే వరకూ నలుగురూ కూర్చుని కాశీ విశేషాలే మాట్లాడుకున్నారు. కామేశ్వరిని తలచుకుని కన్నీరు పెట్టుకున్నాడు నాగేశుడు.

శేషవీరేశ్వరుల దంపతుల ఆరోగ్యాధికాల్ని విచారించాడు జగన్నాథుడు. మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయాడు నాగేశుడు. తలవంచుకుని నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. జగన్నాథుడికీ, శాస్త్రికీ- అర్థం అయినట్లే అనిపించింది.

ఇంతలో-నాగేశుడు తలెత్తి, “వారుభయులూ స్వర్గస్థులైనారు. అమ్మ వెళ్లిపోయిన రెండు నెలలకే వారూ వెళ్లిపోయారు. గురుకులం కదా! శిష్యులమంతా కార్యక్రమాల్ని కానిచ్చేశాము” అంటూ నిట్టూర్చాడు.

“ఎన్నాళ్లయింది?” శాస్త్రి అడిగాడు.

“సంవత్సరమవుతోంది”

నాగేశుని మాటలు విన్న జగన్నాథునికి వారితో గడిపిన రోజులూ, వారి వ్యక్తిత్వమూ, ఆదరణా – అయిన వారికన్నా మిన్నయైన వారి ప్రేమా – ముఖ్యంగా – కామేశ్వరి పట్ల వారు చూపిన ప్రేమానురాగాలు తలపుకొచ్చినై.

తరువాత కొద్దిసేపటికి తెప్పరిల్లి – చక్రపాణి గురుకులంలో పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు. సంభాషణలో ఇతర పరిచయస్థుల పరామర్శనీ స్పృశించారు.

“భట్టోజీ వారు ఎలావున్నారు?” శాస్త్రి అడిగాడు.

“మూడు సన్మానాలూ, ఆరు సంభావనలుగా వుంది. వారి శిష్యుల పనేమో ఆరు మునకలూ, అరవై మొహరీలుగా ఉన్నది”

“శిష్యుల సంగతి నాకు అర్థం కాలేదు” అన్నది సుభాషిణి.

“ఏం లేదు. వారంతా గంగ ఒడ్డున నిలిచి, స్నానం చేసే వారికి సంకల్పం. చెప్పి, డబ్బు దండుకుంటూ వుంటారు. ఎవరైనా మాకు సంకల్పం వచ్చు మీరు చెప్పనవసరంలేదంటే – అయినా సరే.. ఇది ఇక్కడి కట్టడి. డబ్బు ఇవ్వకుండా గంగని తాకనీయం–అని నిక్కచ్చిగా నిలవేస్తారు.”

“తెలిసింది..” అంటూ నవ్వింది సుభాషిణి. మిగిలిన వారూ నవ్వారు. “కూటికోసం కోటి విద్యలు..” అని ఊరుకున్నాడు జగన్నాథుడు.

సుభాషిణీ శాస్త్రీ- తమ గదిలోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత – నాగేశభట్టు – కైయటుని ‘మహాభాష్య ప్రదీపానికి’ తాను వ్రాస్తున్న ‘ఉద్యోత వ్యాఖ్య’ గ్రంథానికి వస్తున్న అభినందనల గురించి చెప్పాడు.

“నాకు తెలుసు అది బహుళ వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, నీ పరిభాషేందు శేఖరానికి శాస్త్రకారులంతా జైకొట్టవలసిందే” అనీ ఉత్సాహపరిచాడు.

“అంతా మీ ఆశీర్వాదం చలవ” నమ్రంగా అన్నాడు.

“‘శబ్దేందు శేఖరం’ కూడా రాస్తున్నాను” చెప్పాడు.

“అది పరమ లఘుమంజరి. వ్యాకరణ శాస్త్రం కదా శబ్దం, శబ్దానికి ఉన్న శక్తీ మనకు తెలిసినదే కదా.. అలాగే కానీ” అన్నాడు.

“అవును. ‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యమ్’ అన్న మీ సిద్ధాంతం అలంకార శాస్త్రానికే తుదిమెట్టు కదా!” అన్నాడు నాగేశభట్టు. జగన్నాథుడు చాలా సంతోషించాడు.

***

మర్నాడు ఉదయం అనుష్ఠానాదికాలు అయిన తర్వాత, ‘రసగంగాధరం’ ప్రారంభాన్నీ, ప్రణాళికనీ నాగేశునికి పరిచయం చేశాడు జగన్నాథుడు.

గురువుగారు చెప్పిన రెండవ శ్లోకాన్ని మళ్లీ చదువుకుని అన్నాడు నాగేశుడు. “నిజమే గురువుగారూ.. ఈ నూతన రమణీయ మణి- అన్ని అలంకార శాస్త్రగ్రంథాల గర్వాన్నీ హరిస్తుంది. అలాగే, లక్ష్యాల్ని కూడా మీరే కూర్చటం అద్భుతమైన సృజన విశేషం. మీరన్నట్టు అమోఘమైన ‘పరిమళం’ కల కస్తూరిని స్వయంగా పుట్టించగల కస్తూరికా మృగానికి, పుష్పాల నుండి పరిమళం గ్రహించటం అనవసరమే కదా” అని చివరికి తన సంతోషానికి ఒక్క మాటనే అవధిగా చేశాడు. “గురువుగారి ఆత్మ ప్రత్యయం ప్రతిభా సామర్ధ్యాలు అప్రతిహతమైనవి” అని.

భోజనసమయం వరకూ శాస్త్ర భాషణయే జరిగింది.

మధ్యాహ్నం తీరిక వేళలో నాగేశభట్టు అడిగాడు, “గురువుగారూ, మీ పాట విని చాలా ఏళ్లయింది. భంభర్‌లో మీరు పన్నెండు రాగాల ప్రయోగం చేశారనీ విన్నాము”.

శాస్ర్తీ, సుభాషిణీ కూడా ఉత్కంఠతో తలలు ఊపారు.

జగన్నాథుడు తాను ఆనాడు పాడిన అరుదైన బాలహంస, రసమంజరి, పరాస్ రాగాల్ని ఆలపించాడు. గౌళలో, మధ్యమావతిలో ఖండధ్రువ సంకీర్ణ మధ్యమ తాళాలపై చేసిన ప్రయోగాన్ని వివరించాడు – అసలు విశేషం ఏమటంటే మన భువనగాంధారిలో హిందూస్థానీ గతుల్ని మిశ్రీకరించటం! భువన గాంధారినీ, బేహాగ్‌నీ ఆలపించి చూపాడు.

పరమానంద భరితులైనారు శ్రోతలు ముగ్గురూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here