Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-3

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ముంగండ అగ్రహారంలో చెరువుకెదురుగా ఉన్న రాతిబండ మీద కూర్చున్న జగన్నాథుడు చుట్టూ ఉన్నవారు మాట్లాడుకుంటున్న మాటలని వింటూంటాడు. చెరువు వద్ద ఒక యువతిని ఇద్దరు కుర్రవాళ్లు ఏడిపిస్తారు. వారిని దండిస్తాడు జగన్నాథుడు. అగ్రహారంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయని అతని తమ్ముడు రామచంద్ర అంటాడు. దైవదర్శనం చేసుకుని ఇంటికి చేరుతారు అన్నదమ్ములు. సరమ్మత కూతురుని భర్త శేఖరం ఏలుకోవడం లేదని, ఓ పరాయి మహిళ సాంగత్యంలో ఉన్నాడని జగన్నాథుడికి తెలుస్తుంది. ఈసారి శేఖరం ఇంటికి వచ్చినప్పుడు తనకి తెలియజేయమంటాడు. జగన్నాథుని భార్య కామేశ్వరి గర్భవతియై కుమారుడిని ప్రసవిస్తుంది. ‘మాధవదీక్షిత సూరి’ అని పేరు పెట్టుకుంటారు. కాలం గడుస్తుంది. ఏడవ ఏట మాధవునికి ఉపనయనం చేస్తారు. తండ్రి అన్నల సమక్షంలో చదువు కొనగాగుతుండగా, రామచంద్ర దృష్టి పాఠం మీద నుంచి మళ్ళగా, తండ్రి పేరుభట్టు మందలిస్తాడు. అలిగిన తమ్ముడికి తండ్రి ఎంతటి పండితుడో నచ్చజెప్తాడు జగన్నాథుడు. చెరువు దగ్గర యువతికి ఏడిపించిన పిల్లల తల్లిదండ్రులకు కబురు చేసి, వాళ్ళ పిల్లలు చేసిన తప్పుని వివరిస్తాడు జగన్నాథుడు. పెద్ద గొడవ జరగబోతే, నివారించి అదుపు చేస్తాడు జగన్నాథుడు. అల్లరి చేసిన పిల్లవాళ్ళ తల్లిదండ్రులు క్షమించమని వేడుకుంటారు. ఆ గొడవ సర్దుమణుగుతుంది.  కాలం మారుతోంది, పరిస్థితులు మారుతున్నాయని అనుకుంటాడు జగన్నాథుడు. తన పెద్ద కొడుకు ధీశక్తి మీద గొప్ప నమ్మకం వ్యక్తం చేస్తారు పేరుభట్టు. శేఖరం వచ్చాడని సరమ్మత కబురు చేస్తుంది. వెళ్ళి శేఖరానికి బుద్ధి వచ్చేలా మంచిమాటలు చెప్తాడు జగన్నాథుడు. తండ్రి అనుమతి తీసుకుని దక్షిణ దేశం పర్యటనకు బయల్దేరుతాడు జగన్నాథుడు.  ఇక చదవండి.]

అధ్యాయం-3

[dropcap]జ[/dropcap]గన్నాథుని దక్షిణదేశ పర్యటన ప్రారంభమైంది.

విజయవాటిక. పవిత్ర కృష్ణవేణీ తరంగిణి స్నానంతో పులకించిపోయాడు. ఇంద్రకీలాద్రిపై కలయతిరిగాడు. కనకదుర్గమ్మని కొలుచుకున్నాడు. మల్లికార్జున స్వామిని దర్శించాడు. కృష్ణాతీరంలోని వివిధ సత్రాలలో జరుగుతున్న అతిథి, అభ్యాగతుల ఆదరణని అనుభవించాడు. కవిపండిత భాషా శాస్త్రవేత్తల పట్ల జనసామాన్యంలో వున్న గౌరవానికి మురిసిపోయాడు. నగరం మధ్యగా వున్న బౌద్ధగుహల్ని సందర్శించాడు. ఉండవిల్లి గుహలనూ చూశాడు.

నాలుగు రోజులు గడిచాయి. ఈ నాలుగు రోజుల్లో ఎందరో కవి, పండిత, శాస్త్రవేత్తల పరిచయం కలిగింది. సాహిత్య సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన ఆంధ్రుల దార్శనికతకు ముగ్ధుడైనాడు.

***

అమరావతి. ఉషోదయం. ఆహ్లాదకర వాతావరణం. అమరావతికీ, ధరణికోటకీ పక్కగా పారుతున్న కృష్ణానది, రేవులో స్నానానికి దిగాడు. నదిలో కొందరు పెద్దలు స్నానాలు చేస్తున్నారు. దూరంగా అమరేశ్వరుని ఆలయగోపురం గంభీరంగా దర్శనమిస్తోంది. ఆలయంలో ఘంటానాదం అలతిగా వినిపిస్తోంది. గాలి తరగలు నదీజల తరంగాలతో సయ్యాటలాడుతున్నాయి.

సంకల్పం చెప్పుకుని నదిలో మునకలేసి లేచాడు.

“బాబూ, జాగ్రత్త. ఇంకా అటు వైపుకి వెళ్లకు నాయనా. పెద్దపెద్ద సుడులున్నై. ఈ ఏడాది ఇద్దరి పిల్లల ప్రాణాల్ని బలిగొన్నాయి”

పెద్దగా వినిపించిన మాటలకు అటు చూశాడు జగన్నాథుడు. పక్కగా స్నానం చేస్తున్న వృద్ధ బ్రాహ్మణుడు – వేగంగా ఉత్సాహంగా నదిలో ముందుకు నడుస్తున్న యువకుణ్ణి హెచ్చరించాడు. యువకుడు నవ్వుకుంటూ స్నానమారంభించి, సంకల్పం చెప్పుకుంటూ మునకవేశాడు. తానూ సన్నగా నవ్వుకుంటూ స్నానాన్ని కొనసాగించాడు జగన్నాథుడు. సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తుండగా, “రక్షించండి.. రక్షించండం”టూ పెద్దగా అరుపులు వినిపించాయి.

స్నానాలు చేస్తున్న వాళ్ళంతా ఆగి ఆ వైపు చూశారు. చేతులెత్తి సహాయానికి అర్థిస్తున్నాడు ఆ యువకుడు.

స్నానాల రేవుకు వందగజాల ఆవల ధరణికోట వైపు వున్నాడా యువకుడు. ఈత ఉత్సాహంలో అటు వెళ్లినట్టున్నాడు.

వృద్ధుడు జగన్నాథుడి వైపు తిరిగి, “అతన్ని రక్షించు బాబూ” అని ఆందోళన నిండిన స్వరంతో అరిచాడు. “చెబితే వినరు. యువకరక్తం” తనలో తాను అనుకున్నట్టు పైకి విసుగ్గా అన్నాడు.

బారలు మూరలేస్తూ వేగంగా యువకుని వైపు వెళ్ళాడు జగన్నాథుడు. ప్రవాహ వేగాన్ని గమనిస్తూ అతడి దగ్గరగా వెళ్ళి ఒడుపుగా అతని జబ్బ పట్టుకుని బలంగా లాగాడు. వెసులుబాటు చూసుకుని అతన్ని గట్టిగా వాటేసుకుని ఒడ్డుకి లాక్కొచ్చాడు. ఒడ్డుకు చేరేసరికి నీళ్ళల్లో అతన్ని పట్టుకున్న మొసలి అతని కాలుని వదిలేని నీటిలోకి జారుకుంది.

ఒడ్డున కూర్చున్నారు ఇద్దరూ. మొసలిగాట్లు పడ్డ పాదాన్ని చేత్తో తడుముకున్నాడా యువకుడు. కొంచెంలో సుడిగుండంలో చిక్కుకునే వాడే. మొసలి పట్టుకోవడం, అతను అరవడం మిగతా జనానికి అతను సుడిగుండానికి దగ్గరై అరిచాడనుకోవడం, జగన్నాథుడు అతన్ని రక్షించడం – అంతా చిత్రంగా జరిగింది.

తత్తరలో వున్నాడు యువకుడు. భయభ్రాంతితో మొహం వివర్ణమై కళవళాన్ని తెలుపుతోంది. ప్రాణాపాయం తప్పించినందుకు జగన్నాథుని వైపు కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. స్థిమితపడటానికి మరికొంత సమయం పట్టింది.

స్నానానికి వచ్చిన వాళ్లంతా అతని చుట్టూ చేరారు.

“చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కొత్త ప్రదేశంలో సాహసం కూడదు.”, “పెద్దలు చెబితే వినాలి. అత్యుత్సాహం అనర్థానికి దారితీస్తుంది”, “పోనీలే, లేచినవేళ మంచిది. ‘దైవం మానుష రూపేణా’ అన్నారు. ఇతనూ కొత్తవాడే.. అయినా ఇతని పాలిటి దైవం”

తలా ఒక మాటా అంటున్నారు.

“స్ఫురద్రూపం, బాగా బలిష్ఠుడూ, ఒడుపు తెలిసిన వాడు కాబట్టి సరిపోయింది” జగన్నాథుడిని చూస్తూ కొందరన్నారు.

మాట్లాడుకుంటూనే తిరుగుముఖం పట్టారు జనం.

“అవునూ.. ఈ కుర్రవాడు మొన్న రాచవీథిలో అలజడి సృష్టించిన వాడిలాగా వున్నాడే” సందేహంగా ఆ యువకుడిని చూస్తూ అన్నాడొక పెద్దమనిషి. తలెత్తి ఆయనవైపు చూసి తలదించుకున్నాడా యువకుడు. ఆయనవైపు ‘నిజంగానా?’ అన్నట్టు చూసి, ‘ఏం జరిగింద’న్నట్లుగా ప్రశ్నార్థకంగా యువకుని వైపు చూశాడు జగన్నాథుడు. యువకుడు నిరుత్తరుడుగా నేలచూపులు సారించాడు. అతని అవస్థని గమనించి “పేరేమి” అని అడిగాడు జగన్నాథుడు.

“రంగనాథ మిశ్రా. కాశీక్షేత్రం వాడిని” తెలుగులోనే సమాధానం చెప్పాడు.

“తెలుగు వచ్చే” అని తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు ఆ పెద్దమనిషి.

“మీరు” అని ఆయన్ని ఉద్దేశించి అన్నాడు జగన్నాథుడు.

“నన్ను రాజేశ్వరశర్మ అంటారు. భమిడివారం. కొన్ని తరాల క్రితం మా వంశీకులు గోదావరీ తీరం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు”.

అప్పటికి కొంత స్వస్థుడైనాడు మిశ్రా.

జగన్నాథుడు తానెవరో చెప్పేసరికీ ఆ యువకుని కళ్లు ఆనందంతో మిలమిలలాడాయి. “నాకు ప్రాణదానం చేశారు. కృతజ్ఞుణ్ణి. అంతకంటే తృప్తి నిచ్చే విషయమేమిటంటే – తమ తండ్రిగారు శేషశ్రీకృష్ణుల వారి శిష్యులనే శుభవర్తమానం. శ్రీకృష్ణులవారి కుమారులు-శేష వీరేశ్వర పండితులు నా గురువుగారు”.

ఆశ్చర్యపోయాడు జగన్నాథుడు. ఎక్కడ నుంచీ ఎక్కడికి వచ్చింది సంబంధం. అటు రాజేశ్వరశర్మ మూలాలు తన గ్రామానికి చెందినవే. ఇటు ఈ మిశ్రా తన తండ్రి గురువుగారి కుమారుని శిష్యుడు. కొద్దిసేపు భావోద్వేగంతో మౌనం వహించాడు. రాజేశ్వరశర్మ ఈ ఇరువురినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.

తమ తమ వివరాలను ముచ్చటించుకుంటూ ముగ్గురూ సాగారు.

ఆ సాయంత్రం రాజేశ్వరశర్మ ఇంటికి మరికొందరు స్థానిక పండితులు వచ్చారు. వారిలో ధనకుధరం, కొండూరి వంశస్థులు వున్నారు. శాస్త్ర సాహిత్య విషయకమైన గోష్ఠి జరిగింది. ప్రసంగానుప్రసక్తంగా మొన్న రాజవీథిలో మిశ్రా సృష్టించాడన్న అలజడి వివరమూ తెలిసింది-జగన్నాథుడికి.

గోల్కొండ నుంచీ కుతుబ్ షా పాలక ప్రతినిధులెవరో వచ్చారు. వారిలో ఒక అధికారి అశ్వం రాజవీథిలో మొరాయించింది. కారణాన్ని పరీక్షించగా, పరీక్షించగా దాని ముందరి కాలిగిట్టలో ఒక మేకు బలంగా దిగబడిందని అర్థమైంది. రాజ్యాధికారులు గ్రామాధికారుల్ని పిలిపించి నడివీథి శుభ్రత గురించి శ్రద్ధ తీసుకోనందుకు తమ భాషలో దూషించసాగారు. చాలా పరుషంగా వున్నాయా మాటలు. స్థానికులకు అర్థం కావటం లేదు. మిశ్రాకి ఆ భాష తెలుసు. భరించలేక పోయాడు. గళమెత్తి వాళ్లని ఎదుర్కొన్నాడు. వచ్చిన రాజ ప్రతినిధులు జులుం చలాయించసాగారు. ఒకడెవడో మిశ్రాని కమ్చీతో కొట్టాడు. ఇతనూ బలిష్ఠుడే. తిరగబడి వాడిని గుర్రంమీద నుంచీ ఒక లాగు లాగి కింద పడేశాడు. జనం గుంపులు గుంపులుగా చేరారు. గ్రామాధికారులు విషయం అర్థం చేసుకున్నారు. ముందు మిశ్రాని అక్కడి నుంచి పంపించేసి, తర్వాత రాజప్రతినిధులకు సర్దిచెప్పారు. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది.

“అన్యాయాన్ని నిరసించే శక్తిని ఎల్లవేళలా అందరూ అభినందించాల్సిందే” అన్నాడు జగన్నాథుడు.

ఆ రాత్రి రాజేశ్వరశర్మ గారింట్లేనే జగన్నాథుడి బస.

దేశకాల పరిస్థితుల గురించిన సంభాషణ సాగింది. దర్శనీయ స్థలాల్నీ వివరించాడు రాజేశ్వరశర్మ.

మర్నాడు ఉదయం స్నాన సంధ్యానుష్ఠానాలు అయిన తర్వాత మళ్లీ ముందుగా అమరేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద మిశ్రా వీరిని కలిశాడు. అమరావతి లోని బౌద్ధ స్థూపాన్ని చూశారు. ఎంతో ఉత్సాహంగా వివరిస్తూ వచ్చాడు మిశ్రా. చైత్ర పౌర్ణమికి జరిగే కాలచక్ర ఉత్సవం గురించీ వివరించాడు రాజేశ్వర శర్మ. ఆపైన ధరణికోట దర్శించారు.

***

గర్తపురి.

సంధ్యాసమయానికి అగస్త్యేశ్వర దేవాలయానికి వచ్చాడు జగన్నాథుడు. ప్రధానార్చకుడు చంద్రశేఖరశాస్త్రి. పరిచయం కలిగింది. వారింట్లోనే బస. రాత్రికి – స్థానిక పండితులతో-తిక్కన భారత రచన మీద ఇష్టాగోష్ఠి జరిగింది.

అక్కడ రెండు రోజులున్నాడు. మూడోనాడు బయలుదేరి విక్రమ సింహపురి చేరాడు. తల్పగిరి శ్రీరంగ నాథస్వామిని సేవించుకున్నాడు. ఆ వెనుక వెంకటగిరి సంస్థానానికి వచ్చాడు.

సంస్థానం అప్పుడు వెలుగోటి రాయుడప్పనాయని గారి ఏలుబడిలో వుంది. పేరుభట్టు చెప్పినట్టుగానే ఆ ప్రభువు సంగీత, సాహిత్య కళాపోషకుడు.

జగన్నాథుడికి మంచి స్వాగతమే లభించింది. రాజసభలోకి ఆహ్వానించాడు. పండితులు, కవులు వున్నారు. మాన్యులూ, సామాన్యులూ వున్నారు.

ప్రజా సందోహంలో ఎవరో ఒక వ్యక్తి చేతిలో కొత్తిమీర కట్టతో నిలబడి వున్నాడు. రాజావారు గమనించారు. జగన్నాథుని చూస్తూ “మా అతిథులు కవిగారు ఆ కొత్తిమీరని వర్ణిస్తారు” అన్నారు. మందస్మితంతో చూశాడు జగన్నాథుడు. శ్లోకాన్ని అందుకున్నాడు.

“కుస్తుంభరీ సమాయంతి/తింత్రిణీ మంత్రిణా సహ

పలాయధ్వం పలాయధ్వం/రేరే శాక విడంబకాః”

పండితవర్గం భేష్ భేష్ అన్నది. ఇతరులంతా “భేష్ భేష్” అని చప్పట్లు చరిచారు. ఒక కవి నవ్వుతూ అర్థాన్ని వివరించాడు. “మంత్రి చింతపండు గారితో కలిసి కొత్తిమీర రాజావారు విజయం చేస్తున్నారు. ఓ కాయగూరలారా! పేరుకే గానీ మీరెందుకు పనికి వస్తారు. పొండి త్వరగా పొండి!!”

జనసామాన్యం ‘జయహో’ అన్నారు. రాజావారు జగన్నాథుని మెచ్చుకుని బహుమతులందించారు. ఆ తర్వాత తెలిసింది. రాజా వారికి కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి పరమప్రీతికరమైన వంటకమని!

ఆ తర్వాతి మజిలీ తిరుపతి. తిరుమల శ్రీవేంకటేశ్వరుని సేవించి, ఇతర పుణ్య తీర్థాల్లో పవిత్రస్నానమాచరించి తిరుపతి చేరుకున్నాడు. గోవిందరాజస్వామి, అలమేలు మంగాదేవి, సీతారామస్వామి ఆలయాలను దర్శించుకున్నాడు. అక్కడ రెండు రోజులు ఆగాడు.

చంద్రగిరి.

చంద్రగిరి రెండవ వెంకటరాయల పాలన ముగిసి రామదేవరాయల ఏలుబడిలో వుంది. ఆ ప్రభువు కూడా సంగీత సాహిత్య, కళాభిమానే. అయితే, సాహిత్యపరంగా అక్కడ అప్పయ్య దీక్షితుల వారి పేరు ప్రసిద్ధి వహించి వుంది. ఏ కవినీ, పండితునీ కదిలించినా వారు ఆయన ప్రతిభావ్యుత్పత్తుల్ని గురించీ, పాండిత్య ప్రాభవం గురించీ మాట్లాడుతున్నారు.

రాజసభా ప్రవేశం లభించింది-జగన్నాథుడికి.

తనను తాను పరిచయం చేసుకుంటూ, “నా గురువు – నా జనకుడు మహామహోపాధ్యాయ పేరుభట్టువారు. గురువులంతా బుద్ధిసంపన్నుల్ని, పండితుల్ని చేయగలరు. పేరుభట్టు వారు పాషాణంలోంచీ పీయూషాన్ని పిండగల అద్భుత ప్రజ్ఞా దురంధరులు” అని అనుష్టుప్ ఛందస్సులో క్లుప్తంగా చెప్పుకున్నాడు.

రామదేవరాయలు కళ్లు చికిలించాడు. సభలో వున్న నీల కంఠశాస్త్రి శిష్యుడు పరమేశ్వరాచార్యులు ‘అహఁ.. ఎలా.. ఎలా?’ అని కొంచెం వెటకారంగా అన్నాడు.

జగన్నాథుడు లోలోపల ఉడికిపోయాడు. ‘కింతేన మేరు గిరిజా..’ శ్లోకాన్ని అందుకున్నాడు. ‘భూమిమీద పర్వతాలు చాలా వున్నాయి. ఆ కొండలమీది వృక్షాలు వృక్షాలుగానే నిలుస్తాయి. కానీ, మలయపర్వతం మీద పుట్టిన చిన్నాచితకా వృక్షాలు కూడా సుగంధపు వాసనల్ని వహిస్తాయి’ అని అలా అలా ఉత్తరీయాన్ని సరిచేసుకుని భుజాన వేసుకున్నాడు. ‘భేష్’ అన్నాడు ప్రభువు. ‘బాగుంది’ అనక తప్పలేదు ఆచార్యుల వారికి. సభ్యుల్లో కొందరు పెద్దలు ‘ఈ యువకవి ఘటికుడు’ అని మురిపెంగా గుసగుసలు పోయారు.

ఆ పెద్దల్లోని ఒక పెద్ద – నారాయణకుందుడు!

సభ అయిపోయిన తరువాత భవనం బయట నిలిచి జగన్నాథుని కోసం వేచి వుండి, అతను రాగానే తన ఇంటికి తోడ్కొని వెళ్ళాడు నారాయణకుందుడు! అక్కడి సమావేశంలో – తంజావూరు వ్యవహారాలూ, ఉత్తర హిందూదేశం సామాజిక సాహిత్య విశేషాలూ చాలా తెలిశాయి జగన్నాథుడికి.

***

తంజావూరు. నగరమంతా-రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పవనాలతో హాయి కులుకుతోంది. ఎక్కడ విన్నా అచ్యుతనాయక పరిపాలనా విశేషాలు వినిపిస్తున్నాయి. మధురా తుండీర యుద్ధ విజయాలు ధ్వనిస్తున్నాయి. జింజి, మైసూరు, కార్వేటి నగరం, పెనుగొండ- విశేషాలు తెలుస్తున్నాయి. రఘునాథ నాయకుని శౌర్య ధైర్యాల గురించీ, సాహిత్య పోషణ గురించీ ప్రశంసలు వినవస్తున్నాయి.

చేమకూర వెంకట కవి, మధురవాణి, రామభద్రాంబ, వేంకట మఖికృష్ణాధ్వరి, రాజచూడామణి, కుమార తాతాచార్యుడు మొదలైన రఘునాథుని ఆస్థాన అష్టదిగ్గజకవుల కవిత్వ ప్రాభవం గురించి మాన్యులు తమ గోష్ఠిలో చెప్పుకుంటున్నారు.

ఇక అప్పయ్య దీక్షితుల వారి ప్రథిత పూలపల్లకిలో ఊరేగుతున్నది. వారి 104 గ్రంథాల ప్రశస్తికి శిష్యులు రాచవీథుల్లో ప్రాచుర్యాన్నిస్తున్నారు. అప్పయ్య దీక్షితుల సిద్ధాంత వేశ సంగ్రహం, చతుర్మతసారం, శివార్క మనోదీపిక, పరిమళ వంటి మహెూద్గ్రంథాల గురించి సత్రాల్లోనూ, పండిత సమావేశాల్లోనూ శతథా విశ్లేషణలు జరుగుతున్నాయి.

బృహదీశ్వరాలయం ప్రాంగణమంతా ఉత్సవ కోలాహలంతో వెలిగిపోతోంది. కవి పండిత శాస్త్రవేత్తలంతా వేదికకు ముందువరుసల్లో ఆశీనులై వున్నారు. ఆ వరుసకు వెనుకనున్న ఆసనంలో కూర్చున్నాడు జగన్నాథుడు.

అపరశంకరుడని ఖ్యాతి గాంచిన అప్పయ్య దీక్షితుల వారి తమ్ముడు ఆచార్య దీక్షితుల వారి ప్రసంగం.

సభ ప్రారంభమైంది. వేదిక మీదనుంచీ ఆచార్యుల ప్రసంగం ప్రారంభమైంది. అప్పయ్య దీక్షితుల వారి జీవన సాఫల్య రచన అనదగిన ‘పరిమళ’ గ్రంథసారాన్ని వివరిస్తున్నాడు. ఉన్నట్టుండి ఉపన్యాసం దారి మళ్లింది. ఆచార్యుల వారికి ఆవేశం పోటు తగిలింది. మీమాంసా విషయికంగా మాటల్లో ముందుకు వెళ్లాడు. పూర్వమీమాంసలోని అంశాల్ని ప్రస్తావిస్తూ-కర్మ ప్రాధాన్యాన్ని చెప్పాడు. “వేదాలున్నదే కర్మలను బోధించటానికి! ఆ బోధనే మా కర్తవ్యం” అంటూ నిత్య కర్మాచరణ ఆవశ్యకతని చెప్పుకుంటూ వీరవిహార వాచికం చేస్తున్నాడు.

లేచాడు జగన్నాథుడు. వేదిక దాకా నడిచాడు. ధీర గంభీర స్వరంతో “పెద్దలందరికీ నమస్కారం. క్షమించండి” అన్నాడు.

ఆచార్యుల వారు నివ్వెరపోయారు. సభ నిశ్చేష్ట అయింది.

‘శ్రీమద్ జ్ఞానేంద్ర భిక్షోరధి గత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః’ శ్లోకంతో తన పరిచయం చేసుకున్నాడు జగన్నాథుడు. పనిలోపనిగా తాను హయగ్రీవోపాసకుడినని చెప్పుకున్నాడు.

ఆ తర్వాత – “పూర్వమీమాంసా పండితుల హంగుదారుల వలన వేదమతానుసారులకు కర్మలే జీవనభాగమై-బ్రతుకే ‘కర్మ’ అనిపించే స్థితి దాపురించింది! నిత్య కర్మానుసరణం సరే. కామ్యకర్మల్ని ప్రధానం చేయటం వాంఛనీయం కాదుకదా!” అని మొదలెట్టి జ్ఞాన ప్రతిపాదనం చేసి, “బ్రహ్మవిదో బ్రహ్మైవభవతి” అని “జన్మాదస్యయతః” అని “తత్వమసి” అనే మహావాక్య ప్రకటనం చేశాడు. జ్ఞానబోధ ఆవశ్యకతని స్పష్టం చేస్తూ మరికొంత సేపు ప్రసంగించాడు.

ఇప్పుడు సభలో కలకలం రేగింది. పెద్దలు, పిన్నలూ జగన్నాథుని ధాటికి తమలో తాము ‘జయహో’ అనుకుంటున్నారు.

ఆచార్యుల వారికి పరిస్థితి అర్థమైంది. జగన్నాథుడునిలోని ఉత్తర మీమాంసాధిషణని అవగాహన చేసుకున్నాడు. ఇక్కడ ఆపకపోతే ఆయన తమకందరికీ చాపకిందనీరు తెచ్చే ప్రమాదం వుందని తెలివితెచ్చుకున్నాడు. గంభీరంగా, మేఘనాదం చేశాడు. “ఈ యువకునకు వాదమూ, వాచాలత్వమూ పుష్కలంగానే వున్నాయి. పటాటోపాలతో ప్రయోజనం లేదు. తెలుగువాడి నంటున్నాడు. గౌరవమే. కానీ, జాతితో మాత్రమే వస్తుందా గొప్పదనం. మీమాంసాచర్చ ప్రజాసభల్లో చేయలేము. కనుక క్షమిస్తున్నాం. కాకులు ఇండ్లనూ, చెట్లను పట్టుకుని తిరుగుతూ వుంటాయి. ఎంత తిరిగినా తృప్తివుండదు” అని “ఈ యువకుని అనుచిత వర్తనం వలన, అసందర్భ ప్రమేయం వలన మేమీ సభను ముగిస్తున్నాం. అదే మా ప్రజల కోరిక కూడా” అంటూ వేదిక నుండి దిగి వెళ్లిపోయాడు.

ఆయన శిష్యగణం ఆయన్ని అనుసరించింది. వేదిక పై వున్న వారిలో కొందరు, ప్రజలలో కొంతమంది ఆచార్యులకు జయజయ నినాదాలు చేశారు.

జగన్నాథుడికి మనసు కలచినట్లయింది. ఎవరో అన్నట్లు ‘దిగులు మేఘాల నుంచీ లోపలి వర్షం తొంగి చూసింది’. క్షణంలో యువకరక్తం పొంగింది. గంభీర ధ్వానం చేశాడిలా, ‘గుంజా రంజిత కబరీ/శబరీ తతి భిర్గరీయసి నగరీ/ఇహనహి ముక్తా వణిజః/కోఽపినముక్తా గుణజ్ఞోఽపి’.

‘సిగలకు గురిగింజ దండలు చుట్టుకుని తిరిగే కోయవాండ్రగూడెం యిది. మంచి ముత్యాలవర్తకులు మసలరు లెండి. ముత్యాల నాణ్యతని తెలుసుకో గలిగిన గుణజ్ఞులెలా వుంటారు’ ఇదీ వ్యంగ్యం!

ప్రాంగణంలో ఉన్నవారు మొహమొహాలు చూసుకున్నారు. కొందరు వల్లెయన్నట్లు అభినందన పూర్వకంగా తలలూపారు. కొందరు చేతులెత్తి నమస్కారం చేశారు. కొందరు ఆశ్చర్యంగా అతనినే చూస్తూ నిలబడిపోయారు. వీరందరి మధ్య నుంచీ వేదిక దిగి నెమ్మదిగా బయటకు నడిచాడు జగన్నాథుడు.

-వారం గడిచింది.

ఈ వారంలో చాలా అనుభవాల్ని రుచి చూశాడు జగన్నాథుడు. నగరంలో ఎక్కడ విన్నా అపరశంకరులన్న అప్పయ్య దీక్షితుల వారి గురించిన ప్రశంసలూ, ప్రజ్ఞాప్రాభవాల కీర్తన!

మహారాజు రఘునాథ నాయకుని దర్శనం కోసం రోజూ ప్రయత్నిస్తూ గడిపాడు.

మరోవారం గడిచింది.

మహారాజు రాచకార్యాలలో మునిగి సమయం వెసులుబాటు లేకుండా వున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి గోవింద దీక్షితుల దర్శనం కూడా దొరకలేదు. మహారాజు మేనమామ మూర్తినాయకుడు పెద్దతలకాయ. వారు వచ్చారంటే కలవాలని ప్రయత్నించాడు. స్వయానా ఒక సేనాపతి వేంకటకవి. వారి దర్శనమూ లభించలేదు. వీరంతా తరగంబాడి వద్ద కూటమి నివాసాన్ని అంగీకరించే వ్యవహారంలోనూ, పోర్చుగీస్ యుద్ధ సన్నాహాల్లోనూ ఊపిరి సలపకుండా వున్నారని విన్నాడు.

అంతటా నిరుత్సాహమే ఎదురైంది జగన్నాథుడికి. అప్పయ్య దీక్షితుల వారి శిష్యులు వందలకొలదీ వారి కీర్తిని భజన చేస్తున్నారు. తలలకి కొమ్ములు మొలిచినట్లు ప్రవర్తిస్తున్నారు. వారి మొహాల్లో శాస్త్రవాద భయమే తొంగిచూస్తున్నది. పాండిత్య నిధి జగన్నాథుడిని ఈసడిస్తున్నారు. భరింపశక్యముకాని పరిస్థితి అది.

సత్రం వసారాలో చాలామంది చేరారు. దాదాపుగా అందరూ పండితులే. మాటలు కలుపుకుని, అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. వారిలో కొందరు అత్యుత్సాహ స్వభావులు. కొందరు ముభావులు. వసారా అరుగుకి ఒక మూలగా కూర్చుని పరికిస్తున్నాడు జగన్నాథుడు.

అప్పయ్య దీక్షితుల వారి అద్రిప్రోన్నతమైన శాస్త్ర సాహిత్య ప్రజ్ఞ గురించి ఒక ఆచార్యుడు ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు.

“మా దీక్షితులవారి ఒక్క శ్లోకం చాలు” అంటూ శ్లోకం చెప్పి – “ఈ విశ్వంలో ఏ మొనగాడికీ దాని అంతరార్థాన్ని చెప్పే జ్ఞానమూ, శక్తి లేవు. అంతే” – నిర్ధారిస్తున్నట్లుగా పలికాడు. ఆయన్ని క్రీగంట చూశాడు జగన్నాథుడు. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ గ్రంథాన్ని సంపాదించాలనుకుంటూ తలపంకించాడు. తనలో తాను అనుకుంటున్నట్టుగా ఒక శ్లోకం చదివాడు. దాని భావమిది –

‘ఓ మహావృక్షమా! నీ కాండం శాఖోపశాఖలూ చాలా దృఢమైనవి. ఉండేదా కొండ కొమ్మున. అదీ నీ ధైర్యం. అందువలన నీకు భయమన్నదే లేదు. కానీ, భీకరమై అప్రతిహతంగా దేనినైనా కబళించివేసే దావానలం ఎక్కడ ప్రజ్వరిల్లుతుందో అనే శంక కలుగుతోంది నాకు” అని అన్యాపదేశంగా హెచ్చరించాడు.

అతని భావాన్ని పండితులలో కొందరు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేనివారు దిక్కులు చూశారు. అర్థం చేసుకోదలచనివారు మొహాలు చిట్లించుకున్నారు. శ్లోకం చదివిన ఆయన, “ఇక్కడ కూడా ఉన్నారా తమరు?” అంటూ హేళనగా మాట్లాడాడు. కొన్ని గొంతులు నవ్వులతో నొసలు చిట్లించాయి. మరునాడే తిరుగు ప్రయాణమైనాడు జగన్నాథుడు.

(సశేషం)

Exit mobile version