Site icon Sanchika

జగన్నాథ పండితరాయలు-30

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[దారా పిలిచినప్పుడు మాత్రమే రాచనగరుకు వెళ్తున్నాడు జగన్నాథుడు. దారా భగవద్గీతకు చేసిన అనువాదాన్ని గురువు గారి సూచనల ప్రకారం సవరించి, మరొకసారి చూడమని జగన్నాథుడికి ఇస్తాడు. దాన్ని పూర్తిగా చదివిన జగన్నాథుడికి తన భార్యా వియోగదుఃఖానికీ, క్షణక్షణం తనకు కలుగుతున్న వేదనకీ, తన మనస్సు తన బుద్ధిపై సంధిస్తున్న ప్రశ్నలకూ భగవానుడు సమాధానాలు చెప్పేడనిపిస్తుంది. కానీ మళ్ళీ కాసేపటికే కామేశ్వరి తలపులు మనసుని కమ్మేస్తాయి. అదే ‘మాయ’ అని గ్రహిస్తాడు. దారా చాలా వేగంగా ‘యోగవాశిష్ఠం’ని అనువదిస్తూ, మధ్యమధ్యలో గురువు గారి వద్ద సందేహాలు తీర్చుకుంటూ ఉంటాడు. ఒక సారి రాజకీయ వ్యవహారాలని ప్రస్తావించి, ఔరంగజేబుకి తన ఉదారవాదం నచ్చదని, అతని వల్ల డక్కన్‍లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్తాడు. ఇదంతా ఎందుకంటే, ఒకవేళ పాదుషా తనని అలహాబాద్ పంపితే, తన రచనా వ్యాసంగం కుంటుపడుతుందని చెప్తున్నానని అంటాడు. మరో ఏడాది గడిచిపోతుంది. జగన్నాథుడు ‘రసగంగాధరం’ మళ్ళీ మొదలుపెడతాడు. ఒకరోజు కాశీ నుంచి నాగేంద్రుడు వస్తాడు. కామేశ్వరిని తలచుకుని కన్నీరు పెట్టుకుంటాడు నాగేంద్రుడు. శేషవీరేశ్వరుల దంపతుల గురించి అడిగితే, వారిద్దరూ స్వర్గస్థులయ్యారనీ, అన్ని కార్యక్రమాలు శిష్యులే నిర్వహించారని చెప్తాడు నాగేంద్రుడు. తాను రాస్తున గ్రంథాల గురించి జగన్నాథుడికి వివరిస్తాడు నాగేంద్రుడు. రస గంగాధరంలోని శ్లోకాలు విని ఆనందిస్తాడు. గురువుగారి పాట విని చాలా ఏళ్ళయిందని చెప్పి, జగన్నాథుడిని పాడమని కోరతాడు. జగన్నాథుడి గానానికి శాస్త్రి, సుభాషిణి, నాగేంద్రుడు పరవశులవుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-51

[dropcap]శ[/dropcap]రత్కాలం ప్రారంభమైంది.

జగన్నాథునికి పనుల ఒత్తిడీ ఎక్కువగానే ఉన్నది. ఎర్రకోట నిర్మాణం సగానికి పైగానే అయింది. దారా యోగవాశిష్ఠ అధ్యయనం, శాస్త్రి సంగీతాభ్యాసం, నాగేశునితో రసగంగాధర చర్చ అన్నీ ఆహ్లాదజనకంగానే సాగుతున్నాయి. ప్రసత్తాను ప్రసక్తంగా చెప్పాడు దారా “పాదుషావారు ఆగ్రా వెళ్లారు” అని.

పదిహేను రోజులు ఇట్టే గడిచి పోయాయి – నాగేశభట్టుకి. ప్రధానంగా ‘రసగంగాధరం’ వినటం, గురువుగారికి వీలు దొరికినప్పుడు తాను రచిస్తున్న ‘శబ్దేందుశేఖరం’, ‘పరిభాషేందు శేఖరం’ లేదా ‘శబ్దరత్నం’ గురించి అభిప్రాయాల్ని పంచుకోవటం, సందేహాల్ని నివృత్తి చేసుకోవటం-

రాత్రి మొదటి జాములో సంగీత కార్యక్రమం.

కాలం పరిగెత్తుతోంది.

జగన్నాథుని నివాస భవనం.

ఉదయం.. ఆవరణలోని వేపచెట్టు గాలితో ఆడుకుంటున్నది. పైన పిట్టలూ, కాకులూ వేటి ఘోష వాటిదిగా.. ధ్వని చేస్తున్నాయి. చిలుక ఒకటి జామచెట్టుకీ, సపోటా చెట్టుకీ మధ్యన దూరాన్ని కొలుస్తున్నది.

జగన్నాథుడు, నాగేశుడూ, శాస్త్రీ చెట్టుకు కడగా ఒక తిన్నె మీద కూర్చుని ఉన్నారు.

“ఈ వారంలో నేను తిరిగి కాశీ ప్రయాణమౌతాను” అన్నాడు నాగేశుడు.

“అదేం..?”

జగన్నాథుడి ప్రశ్నకు కొంచెం తటపటాయిస్తూ అన్నాడు నాగేశుడు,

“శృంగబేరపురం తెలుసుకదా! దాని పాలకులు రామభూపాలురవారు తమ ఆస్థానంలో చేరమని కబురు చేసి చాలా రోజులయింది. ఢిల్లీ వెళ్లి వచ్చి వారి దర్శనం చేసుకుంటానని చెప్పి ఇలా వచ్చాను. ముందు మీ ఆశీర్వాదానికి”

“శుభవార్త” అని జగన్నాథుడూ, “మరి ఇంత వరకూ చెప్పలేదేం?” అని శాస్త్రీ ఒకేసారి అన్నారు.

“రాజాస్థానాలూ వగైరా ఘనతల్ని గురించి ఇప్పటి నుంచే గురువుగారి దగ్గరేం ప్రస్తావిస్తాను? ఏవో నాలుగు రాతలు రాయగానే డబ్బా కొట్టుకోవాలాయేం?”

రివ్వున ఎగురుతూ వీరికి కొద్దిదూరంలో వాలిందో చిలక. దాని ముక్కునుండీ సపోటా పండు కింద పడింది. దాన్ని కొంచెం కొంచెం కొరికి ఆస్వాదిస్తోందది. దాని నుండీ చూపు మరల్చి, “అయితే ఈ రోజు సాయంత్రం ఎర్రకోట, కొత్త నగర నిర్మాణాల్ని చూసొద్దాం. నాగేశుడికి మంచి అవకాశం” అని “శాస్ర్తీ! మన వార్తాహరుని పిలువు” అన్నాడు జగన్నాథుడు.

శాస్త్రి ఆవరణ బయటికి వెళ్లి అతనిని పిలుచుకు వచ్చాడు.

జగన్నాథుడు పత్రాన్ని తయారుచేసి అతనికిచ్చి దారాకి పంపించాడు. ఆ సాయంత్రం-ఆ నిర్మాణ స్థలాల దర్శనం అయింది. నాగేశభట్టు చాలా ఆనందించాడు.

నాలుగు రోజుల తర్వాత అతను బయలుదేరి కాశీకి తిరిగి వెళ్లిపోయాడు.

***

1644 ఏప్రిల్ – పొద్దున్నే కబురు చేశాడు దారా.

ఉదయపు కార్యక్రమాలు అయిన తర్వాత వెళ్లాడు జగన్నాథుడు.

తాను ఆగ్రా వెళ్లి వచ్చినట్లు చెప్పాడు దారా. ఆగ్రా కోటలో జహనారాకి పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు ప్రాణంపోయి తిరిగి వచ్చినట్లయింది. ఇంకా కోలుకోలేదు. పాదుషా పగలూ రాత్రీ ఆమె సేవలోనే నిమగ్నుడై తీవ్రవిషాదంలో ఉన్నాడు. వైద్యం సాగుతోంది. ఏడాదన్నా పడుతుందంటున్నారు. ఇదీ వార్త!

ఆ తర్వాత, నిదానంగా పాదుషా తనను అలహాబాద్ సుబేదారుగా నియమించినట్లు చెప్పి, తాను ఆ వారంలోనే వెళ్లాల్సి ఉందని తెలిపాడు.

ఇద్దరూ కూర్చుని రచనాపరంగా ఒక్కొక్క గ్రంథం గురించీ, దాని ప్రస్తుత పరిస్థితి గురించీ చర్చించుకున్నారు.

“నేను లోగడ చెప్పాను కదా! ఉపనిషత్తుల అనువాద కార్యక్రమం ఇప్పట్లో తెమిలేది కాదు, చేపట్టిన యోగవాశిష్ఠం కానీయండి”

“అవును. దాన్నెటూ పూర్తి చేస్తాను.” అని చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. ఆ తర్వాత ఎర్రకోట పనుల ప్రస్తావన తెచ్చాడు.

“లాహౌరీ గారు ‘మీరుగా చేసే పనేమీ లేకపోయినా, నా పక్కనుండండి చాలు – నాకు కొండంత నైతిక బలం’ అని పదే పదే.. అంటున్నారు” అని చెప్పాడు జగన్నాథుడు.

దారా అదోలా నవ్వాడు. “ఆ నిర్మాణాలకి రాళ్లెత్తే కూలీలందరూ హిందువులే స్వామీ. ఆయనకి-వాళ్లతో ఏ క్షణాన ఏ సమస్య ఉత్పన్నమౌతుందో అని ఫికర్. ఆయన సహాయకులు-మక్రమత్ ఖాన్, అబ్దుల్ కరీమ్ ఇద్దరూ కూడా ముస్లింలే!”

‘పోన్లెండి. కారణం ఏమైనా కానీయండి. పెద్దవాడు. అడుగుతున్నాడు. పాదుషావారూ తాముగానే నాకా పనిని అప్పగించారు కదా” అన్నాడు.

“సరే.. అలాగే కానీయండి. అన్నట్టు లాహౌరీగారు కూడా అప్పుడప్పుడూ తన గజళ్ళూ, మస్నవీలూ చెబుతున్నారా?” అని నవ్వుతూ అడిగాడు. “ఖాళీ సమయం అంతా అదే కాలక్షేపం” అంటూ తానూ నవ్వాడు జగన్నాథుడు.

అధ్యాయం-52

1645లో లాహోర్ లోనే నూర్జహాన్ మరణించింది. లాడీ బేగం తల్లి మరణానికి తల్లడిల్లింది. ఆ దుఃఖాన్ని పంచుకొనే వాళ్లు ఒక్కరు కూడా మిగల్లేదామెకు.

ఏప్రిల్ నెల, 1648 ప్రకృతి వసంతాన్ని కురిపిస్తోంది. చైత్రం హసిస్తోంది. ఢిల్లీ నగరం ఉత్సవ సంరంభంలో, శుభమస్తు గాలులతో ఆహ్లాదిస్తోంది.

ఎర్రకోట, షాజహాన్‌పుర నిర్మాణాలు పూర్తయినై. ఈ వారం చివరికి – ప్రారంభోత్సవానికి ముస్తాబు చేసుకుంటున్నాయి. కోట వైభవం, నగర వైభోగం, ప్రత్యేకించి జహనారా పరోక్ష కనుసన్నల్లో రూపుదిద్దుకున్న చాందినీ చౌక్ శోభ – ‘చూచువారలకు చూడముచ్చట’గా అన్నట్టు కనువిందు చేస్తున్నాయి.

ఉత్సవాన్ని వారం రోజులు జరపాలని పాదుషావారి ఆజ్ఞ సంగీత సాహిత్య, నాట్య, చిత్రకళా, వైజ్ఞానిక, ఆయుధ, శిల్పకళాఖండాల ప్రదర్శనలూ, ఇతర వేడుకలు జరగటానికి వివిధ మందిరాలూ, సౌధాలూ ఎంపిక చేసి – కార్యక్రమాలకు అనుగుణంగా సిద్ధం చేశారు.

మొగల్ సామ్రాజ్యంలోని రాజ ప్రతినిధులకూ, మన్సబ్‌దారులకూ, సామంతులకూ, సుబేదారులకూ, ఫౌజ్‌దారులకూ ఆహ్వానాలు వెళ్లాయి. పాదుషాకి ఈ వేడుక అత్యంత ఉత్సాహాన్నిస్తోంది.

పాదుషా పిలిపించి, సాహిత్య సభ నిర్వహణని జగన్నాథుడే చూసుకోవాలని చెప్పాడు. ఆ మహోత్సవానికి రావలసిన కవి, పండిత వర్యులందరూ ఇప్పటికే ఢిల్లీ వచ్చి వివిధ తావుల్లో బసచేసి వున్నారు.

ఉత్సవం చివరి రోజుకి చేరింది.

సాయంత్రమయింది. సాహిత్యసభ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించబడిన వేదిక శోభాయమానంగా అలంకరింపబడి సిద్ధంగా వుంది.

వేదికమీద ఒకవైపు వరుసలో జగన్నాథ పండితరాయలు, కవీంద్రాచార్య సరస్వతి, రాయముకుందుడూ, మధుసూదన సరస్వతి, పాదుషా వారి సన్నిహితుడు మునీ చందరన్ బ్రహ్మన్ – ఆసీనులైనారు. మరోవైపు తన చ్ఛందశ్శాస్త్ర గ్రంథాన్ని పాదుషాకి అంకితం చేసిన భాగవతీస్వామి, జ్యోతిష గ్రంథాన్ని అంకితం ఇచ్చిన వేదాంగరాయకవి, ప్రజభాషా విద్వాంసుడు బనారసీదాస్, కన్నడ దేశం నుండీ వచ్చిన విశ్వనాథ వైద్యా; కాశీపండితులు వంశీధరమిశ్రా, కులపతి మిశ్రా; మలబార్ నుండీ నారాయణభట్టు-కూర్చుని ఉన్నారు. వారి వరుసలోనే కాశ్మీరీ కవులు-మునీర్ లహౌరీ, ఫనీ కాశ్మీరీ, హిందీ కవులు సుందరదాస్, చింతామణీ, అరబ్బీ పండితుడు మూల్లా మొహ్మద్ వంటివారు ఉన్నారు.

వేదిక క్రింద లాహౌరీ వంటి నగర, భవన నిర్మాణ శిల్ప ప్రముఖులు, సంగీత కళాకారులు లాలాఖాన్, డైరింగ్ ఖాన్, కుశాలా ఖాన్ ఖల్వంత్ వంటి పెద్దలంతా ఆశీనులైనారు.

పాదుషా, దారా, జహనారా బేగమ్ – వేదిక మీదికి వస్తుంటే ప్రాంగణమంతా హర్షద్వానాలు మిన్నుముట్టాయి. వారు తమ తమ ఆసనాలలో ఆసీనులైనారు. జహనారా గురువు ఖానమ్ ఆమె ప్రక్కగా కూర్చున్నది.

దారా స్వాగత వచనాలూ, సభకు సంబంధించిన మాటలూ క్లుప్తంగా చెప్పాడు. జహనారా బేగం – కవి పండితులకూ ఆహూతులందరికీ అభివందనాలు తెలిపింది. తాను కేవలం శ్రోతనేనని వినయాంజలి ఘటించింది.

పాదుషా సభ ప్రారంభం చేస్తూ తమ సామ్రాజ్యంలో సంగీత సాహిత్య కళా సాంస్కృతిక ఔన్నత్యానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని హామీనిస్తూ, కవి పండిత కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపాడు.

పండితరాయలు లేచి, ఒక్కొక్క కవి ఒకటి, రెండు కవితలను చదివి సమయపాలన పాటించాలని మనవి చేశాడు.

కవీంద్రాచార్య సరస్వతితో ఉపక్రమించారు. ఆయన పఠనం కాగానే పాదుషా చేతుల మీదుగా సన్మానం జరిగింది.

ఇలా-ఒకరి తర్వాత ఒకరిగా కవితా పఠనం, సన్మానం జరిగాయి. పండితరాయలు తన కవిత్వం వినిపించాడు.

‘సత్పూరుషః ఖలు హితాచరణై ర మన్ద, మానందయతఖిలలోక మనుక్త ఏవ

ఆరాధితః కథయ కేన గుణైరుదారై, రిన్దుర్వికాసయతి కైరవిణీ కులాని’

(ఎవరూ తనని వేడుకొనకపోయినా, మంచివాడు లోకహితాన్ని కూరుస్తున్నాడు. చంద్రుడిని కలువల్ని వికసింపజేయమని ఎవరడిగారు? సత్పురుషులకది సహజ స్వభావం)

పాడుషా ఆసనంలో ముందుకు జరిగి ‘వహ్వా వహ్వా అని “మళ్లీ చదవండి పండిట్” అన్నాడు. పండితరాయలు మళ్లీ చదివాడు. సభలో కరతాళధ్వనులు చాలాసేపు మ్రోగాయి. తరువాత ఆయనకు సత్కారం జరిగింది.

అప్పుడు దారా పూర్తిచేసిన భగవద్గీత – పారశీకం అనువాదం గురించి చెప్పి, ఏదైనా ఒక శ్లోకాన్ని చదవమని కోరాడు పండితరాయలు. దారా లేచి చదివాడు.

“యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః।

సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే॥

(శ్రేష్ఠుడైన పురుషుడి ప్రవర్తననే ఇతరులూ అనుసరిస్తారు. అతడు నెలకొల్పిన ప్రమాణాలనే లోకులందరూ పాటిస్తారు) దాని భావం చెప్పి, పారశీకం అనువాదం చదివాడు. సభా సదులంతా హర్షధ్వానాలు చేశారు.

జహనారా కల్పించుకుని, “మా సోదరుడు పాదుషా వారికి అన్వయించే శ్లోకాన్నే చదివాడు. ఈ భావాన్నే ‘యధారాజా.. తథా ప్రజా’ అనీ అంటారు” అన్నది నవ్వుతూ. ‘వహ్వా.. వహ్వా’లతో కోలాహలభరితమైంది ప్రాంగణం.

పాదుషా చిరునవ్వుతో, ఆనందంతో తలపంకించాడు. దారాకి కూడా సత్కారం జరిగింది. వందన సమర్పణలతో సభ ముగిసింది.

– రాత్రి పండితరాయల్ని ప్రశంసిస్తూ చాలాసేపు మాట్లాడాడు శాస్త్రి. అతను తన ఉత్సాహాన్నంతా వెలువరించిన తర్వాత, నవ్వుతూ అన్నాడు-జగన్నాథుడు, “నీ మాటలు వింటుంటే మిరియపు జున్ను ఆరగిస్తున్నట్టుందోయ్-నా మనసుకి” అని,

సుభాషిణి చిరునవ్వుతో “రేపు తెప్పిద్దాం బాబాయి గారూ” అన్నది.

***

నూతన రాజ ప్రాసాదం ఎర్రకోట.

రాజకుటుంబాలూ, మాన్యులూ, అధికారులూ, సైనికాధిపతులూ, సామాన్యులూ – అందరూ – తమ తమ సౌధాల్లో, నివాసాల్లో కుదురుకున్నారు. పరిపాలన సజావుగా సాగిపోతోంది. ప్రజాజీవనంలో చెప్పుకోదగిన ఒడిదుడుకులు లేవు.

జగన్నాథుని నివాసం కూడా రాచనగరుకు అలతిదూరంలో ఏర్పాటైంది. శాస్త్రీ, సుభాషిణీ ఆలనలో, తన కార్యక్రమాల్లో తాను నిమగ్నుడైనాడు జగన్నాథుడు. ‘రసగంగాధరం’ రచన సాగుతోంది. మరో పక్కన తీరుబడి ఉన్నప్పుడల్లా భామినీ విలాసంలో శ్లోకాలు ఆయన మదిలో తరగలెత్తి రచింపబడుతున్నై. దారా అలహాబాద్ వెళ్లిపోయాడు.

1652వ సంవత్సరం.

ముల్టాన్ సింధ్ రాజప్రతినిధిగా ఔరంగజేబు ఖాందహార్‌పై దండయాత్ర చేసి, ఓటమిని చవిచూశాడు. షాజహాన్ కోపంతో కూడిన నిర్వేదం చెందాడు.

ఔరంగజేబుని పదవీభ్రష్టుని చేసి దక్కన్ పంపి, దారాని ముల్టాన్ పంపాడు. పాదుషా. 1653లో ఖాందహార్ వెళ్లబోయే ముందు జగన్నాథుడికి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ, అప్పటి వరకూ అయిన ఉపనిషత్తుల అనువాదాల్ని పంపాడు దారా.

ఔరంగజేబు తీవ్రమైన వివక్షాభావంతో, కోపంతో బుసకొట్టసాగాడు.. దానికితోడు ఔరంగాబాద్‌లో రెండు జాగీర్ల ఆదాయాన్ని ఉపసంహరించాడు పాదుషా. దక్కన్‌లో ప్రజలు పేదరికంతో అల్లాడుతున్నారు. పరిపాలన ఖర్చులకు కూడా లేని కటకటని ఔరంగజేబు అనుభవించాల్సి వచ్చింది. పాదుషాకి తెలిపితే, ఆయన ఉదాసీనంతో, ‘వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే మార్గాల్ని వెతుక్కో’ అన్నాడు. పుండు మీద కారం చల్లినట్లయింది.

తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగసాగింది. బీజాపూర్, బీదర్ మీద సైనిక చర్యల విషయంలోనూ అభిప్రాయభేదాలు రచ్చకెక్కాయి. పాదుషా కుమారులైన దారా, మురద్ బక్షీ, షాషుజా, ఔరంగజేబు – అందరూ రాజ్యాధికారం కోసం ఎవరి వ్యూహాలూ, పన్నాగాలూ వారు చేసుకోసాగారు.

1657 సెప్టెంబరు వచ్చింది.

పాదుషా తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఢిల్లీ రాజధాని నగరంలో మొగల్ సింహాసనాధికారానికి వారసత్వ పోరు మొదలయింది.

దారాని ఎదుర్కోవాలని షాషుజా వారణాసి దాకా వచ్చాడు. దారా పాదుషాని కొంత సైన్యాన్ని పంపమని వేడుకున్నాడు. పాదుషా అనారోగ్యం నుండి కోలుకుని ఆగ్రాకి తన మకాంని మార్చుకున్నాడు. దారా పట్ల ప్రేమాభిమానాలతో సైన్యాన్ని పంపాడు. షాషుజా పరాజయం పాలయ్యాడు.

1658 వచ్చింది. షాషుజానీ, మురద్ బక్షీని కలుపుకుని ఔరంగజేబు దారా మీద దండెత్తాడు. మే నెలలో సమూఘర్ యుద్ధంలో దారా పరాజితుడైనాడు. దారాకి మిత్రుడైన 26 ఏళ్ల యువ సాహసవీరుడు రావ్ రాజా సత్తర్‌సల్, అతని తమ్ముడు భరత్‍సింగ్ కూడా ఆ యుద్ధంలో మరణించారు.

జూన్ లో ఔరంగజేబు షాజహాన్ని ఆగ్రా కోటలో బంధించాడు.

దారా-సింధ్‌కి పారిపోయి తాను గతంలో నాలుగుసార్లు రక్షించిన మాలిక్ జివాన్ రక్షణని కోరాడు. కానీ, అతను మిత్రద్రోహం చేసి, దారాని జూన్ 1659లో ఔరంగజేబు సైన్యానికి అందించాడు. వారు అతన్ని ఢిల్లీ తీసుకొచ్చారు.

13-6-1659న ఢిల్లీలోని షాలిమార్ బాగ్ వద్ద పట్టాభిషిక్తుడైనాడు ఔరంగజేబు.

1659 ఆగస్టు.

దారా మీది కక్షతో, పాదుషా పై ప్రతీకారేచ్ఛతో ఔరంగజేబు దారాని ముసలి ఏనుగు మీద నగరవీధులలో ఊరేగించి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశాడు. ఆ దృశ్యం చూసిన దారా మిత్రులూ, అభిమానులూ జగన్నాథుని ముందు రోదనతో ఘూర్ణిల్లారు.

ఆ తర్వాత, దారా తల నరికించి కసికొద్దీ బల్లెంతో దాన్ని ఛిద్రం చేయించి, ప్రజల ముందు ప్రదర్శించి, పాశవిక ఆనందాన్ని పొందాడు ఔరంగజేబు.

ఈ దారుణాలన్నీ చూసి కుమిలిపోతున్న జగన్నాథుని మనసు వికలమైపోయింది.

ఉత్తముడైన దారా మరణం జగన్నాథుని జవసత్వాల్ని నీరు కార్చింది. నిస్సహాయతతో విలపించసాగేడు. విలపించి, విలపించి, పిచ్చివాడిలా దుఃఖించాడు.

(సశేషం)

Exit mobile version